సారస్వత వ్యాసములు
వ్యాసకర్త: Halley
********
ఈ పరిచయము “కవి సామ్రాట్” నోరి నరసింహ శాస్త్రిగారి “సారస్వత వ్యాసములు” అనెడి పుస్తకము గురించి. ఈ పుస్తకము చదవక మునుపు నాకు నోరి గారి గురించి తెలిసింది చాలా తక్కువ. ఈ పుస్తకం చదివాక వారంటే ఒక గౌరవ భావము కలిగింది. 946 పేజీల పుస్తకము ఇది. “సాక్షి” వ్యాసాల తర్వాత నేను తెలుగులో కేవలము వ్యాసాలు మాత్రమే ఉన్న పుస్తకము చదవటము ఇదే ఆనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ప్రచురణ. తగిన చదువులేక (నాకు) చదవలేక వదిలేసిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి ఈ పుస్తకములో. ఇంగ్లీషు మీడియం తెలుగు చదువుకి అసలు ఈ మాత్రము చదివి అర్థము (?) చేసుకున్నదే చాలా ఎక్కువలే అని సర్ది చెప్పుకున్నాను.
“ఆంధ్ర సంస్కృతి” అన్న వ్యాసంలో అసలు ఆంధ్రులకు ప్రత్యేకముగా ఒక సంస్కృతి ఉందా అంటూ ఒక కొత్త ప్రశ్న రేకెత్తించారు నాలో. ఇక్కడ ఆంధ్ర అంటే స్వతంత్ర భారత దేశములో 2014 మొదటి సగము వరకు చలామణీలో ఉన్న ఆం.ప్ర రాష్ట్రము అని గుర్తుంచుకొనవలెను. మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపొయినా హంపి, అజంతా శిల్పకళ ఆంధ్రుల ప్రత్యేక శిల్ప ప్రశస్తికి తార్కాణములు కాబోవనీ, అలాగే అమరావతి, నాగార్జున కొండ చైత్యాలనీ వాటిలో ఆంధ్రత్వం ఉందని పొంగిపోవటానికి ఎమీ లేదనీ, సాంచీ చైత్యాలకీ వీటికీ ఆట్టే భేదాలు లేవనీ అన్నారు. ఇక చిత్రకళలో కూడా ప్రత్యేకాంధ్రత్వము అన్నది ఏమీ లేదనీ అన్నారు. సంగీతములో కూడా మన ప్రత్యేక సంగీతము ఉన్నదీ లేనిదీ చెప్పలేము అనేసారు (త్యాగరాజుకి అభిమానమైనది “కర్ణాటక సంగీతము” కదా అని అన్నారు). అన్నమయ్య, క్షేత్రయ్య పదాలలో విలక్షణమైన ఆంధ్ర సంగీతమున్నదా లేదా అన్నది సంగీతశాస్త్ర విమర్శకులు ఇంకా తేల్చవలసి ఉన్నది అని అన్నారు. మన పుర నిర్మాణము, గ్రామ నిర్మాణము, గృహ నిర్మాణము, నౌకా నిర్మాణము వీటిలో కూడా మనకంటూ ప్రత్యేకము లేదన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక మతము కూడా లేదు. మనకి ప్రత్యేకముగా ఉన్నదల్లా భాష ఒక్కటే అని అన్నారు.
ఇక “నేటి సాహిత్య విమర్శ” అన్న వ్యాసము నాకు తెగ నచ్చింది. ప్రతి రాజకీయ పార్టీ తన ఆశయాలకు అనుకూలమైన కల్లోలాన్ని సృష్టించగల రచయితలను కూడదీసుకొని ఆకాశానికి యెత్తి వారిని మహాకవులుగా గొప్ప రచయితలుగా ప్రచారము చెస్తోంది అని అన్నారు. ఈ కాలంలో ఎందరో మంచి కవులూ రచయితలూ తమకు తెలియకుండానే దాస్య శృంఖలాలకు బద్ధులై ఆ సంకెళ్ళు బంగారువని పొంగిపోతున్నారు అని అన్నారు. ఒకడికి ఇంకొకడి మీద ద్వేషము కలిగితే అవతలవాణ్ణి హింసించినప్పుడే తృప్తి కలుగుతుందనీ, ఇతరుల వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు దాన్ని దొంగతనంగానో దొరతనంగానో పొందినప్పుడే తృప్తి కలుగుతుందనీ, పురుషునికి స్త్రీ యందు, స్త్రీకి పురుషుని యందు తీవ్ర కామము కలిగినప్పుడు యుక్తాయుక్త విచక్షణ లేకుండా అది తీర్చుకున్నప్పుడే తృప్తి కలుగుతుంది అనీ, నేటి పెరిగిన పాఠక లోకానికి నేడు పెరిగిన రచయితలు అందిస్తున్నది యెక్కువ భాగము వారి పశువృత్తికి సంబంధించిన ఈ తృప్తే కానీ కావ్యానందము (ఈ పేరుతో విశ్వనాథ వారి పుస్తకము ఒకటి ఉన్నది!) కాదు అని అన్నారు. ఈ పరిస్థితిని బాగు చేయాలంటే సాహిత్య విమర్శకుడు అన్న వాడు యేమి చేయాలో తెలిపారు ఈ వ్యాసములో.
“విమర్శ ప్రమాణము” అన్న వ్యాసము కూడా బాగుంది. ఇందులో నోరి వారి వ్యంగ్యం నాకు నచ్చింది. ఇప్పుడున్న కవుల సంఖ్య చూస్తే సృష్ట్యాది నుంచి ఉన్న కవుల సంఖ్య సరిపోతుందా అని అనిపిస్తుంది అనీ, ఇక ఇప్పుడు విమర్శకుడు కాని వాడే లేడు అనీ అన్నారు (అందుకనే మేము పరిచయాలు మాత్రమే చేసెదము అభిప్రాయాలు మాత్రమే చెప్పెదము. విమర్శలు చేయము. హిహిహి!) కవిత్వానికీ విమర్శకూ కొలబద్దలు యేమిటి అని ఈ వ్యాసము అంతా చర్చిస్తూ పోయారు. చివరగా సహృదయత్వము అసలైన కొలబద్ద అనీ దానికి కావలసిన సామగ్రి అంటూ ఏవేవో శాస్త్రాలు లక్షణ గ్రంథాలూ కావ్యాలూ ఇతిహాసాలూ అనుకుంటూ పెద్ద లిస్టు చదివించారు. మనకెందుకు ఇవన్నీ! డామిట్! నాకు ఒకడు చెప్పేది యేమిటి? నేను ఏమంటే అదే వేదం! నా వాక్కే నాకు ప్రమాణము!
“తెలుగు కవిత్వములో ఫాషనులు” అని ఇంకొక వ్యాసము. ఈ వ్యాసములో ఆయన రాసిన సగము రచనలూ పేర్లూ నాకు కొత్త. కాబట్టి పెద్దగా అర్థము అవలేదు. అయితే ఆయన అన్న మాట ఒకటి నచ్చింది. తనకి వేదాలంటే, శాస్త్రాలంటే ప్రమాణబుద్ధి ఎక్కువనీ తాను సనాతనత్వమును ఫాషను చేయాలని ప్రయత్నిస్తున్నానని అన్నారు.
ఆంధ్ర మహాభారతము గురించీ, ప్రొలయ వేమారెడ్డిని గురించీ, ధూర్జటి కవిని గురించీ వచన కవిత్వము గురించీ ఇలా చెప్పుకుంటూ పోతే యెన్నో వ్యాసాలు ఉన్నాయి. అముక్త మాల్యద గురించీ, సుబ్రమణ్య కవిని గురించీ, శిలకళను గురించీ వగైరాలు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కొన్ని వ్యాసాలు కేజీ పిల్లాడికి క్యాలుకులస్ పరీక్ష లాగా అసలు నా పరిధిని దాటిపోయినవి కూడా ఉన్నాయి వీటిలో. కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు గారి గురించి రాసిన వ్యాసాన్ని మాత్రము ఎంతో ఆసక్తితో చదివాను.
“అరవయ్యేళ్ళ ఆంధ్ర సాహిత్యంలో నిలిచేది” అన్న వ్యాసము తప్పక చదవాల్సిందే. నిలుస్తుందా నిలవదా అన్న విషయాలు పక్కన పెడితే, తెలుగుకి దూరమైన నా తరం వారికి తెలుసుకోవలసిన రచనలు బోలెడు కనపడతాయి ఈ వ్యాసములో.
ఇక షష్టిపూర్త్యుత్సవములు అన్న వ్యాసము నాకు గుర్తు ఉండి పోతుంది. “మా చిన్న తనములో షష్టిపూర్తికి ఉత్సవములు చేయునాచారము కని గానీ, విని గానీ యెరుగము. అప్పటి కింకను ఉత్సవాదులు నిర్ణయించునది తద్విదులగు పండితులే కానీ ఉత్సాహోద్రేక పూరితమగు జన సామాన్యము కాదు” అని అంటారు ఈ వ్యాసములో .
విశ్వనాథ సత్యనారాయణ గారి మీద రాసిన వ్యాసము నాకు నచ్చింది (ఈ వెబ్ సైటులో నేను రాసిన ఇతర వ్యాసములు చదివిన వారు “నచ్చుతుంది నచ్చుతుంది .. యెందుకు నచ్చదూ” అని అనవచ్చును గాక). అయితే ఇదే పుస్తకములో నోరి వారు “వేయి పడగల” గురించీ “పురాణ వైర గ్రంథమాల” గురించీ చేసిన కటువైన వ్యాఖ్యలు చదివాక కొంచెం అనుమానంగానే చదివాను ఈ వ్యాసాన్ని. ఈ వ్యాసము ఆఖరున “శ్రీ సాంబశివుని సేవించే గణములలో నుండి ఏదో శివాఙ్ఞ నిర్వర్తించటానికి మన ఆంధ్రభూమిలో అవతరించిన సహస్రబాహువులు సహస్రశీర్షములు కలిగిన ప్రమథమూర్తి యేమో శ్రీ విశ్వనాథ” అని అన్నారు.
ఇక “సాహిత్యము” అన్న వ్యాసము మరొకటి. సాహిత్య లక్ష్యము , సాహిత్య ప్రయోజనము, సాహిత్య స్వరూపము అంటూ చాలా ‘చదువు’ చెప్పారు నాకు ఈ వ్యాసము ద్వారా నోరి నరసింహ శాస్త్రి గారు.
స్వతంత్ర భారతంలో చరిత్ర రచన అన్నది కూడా ఒక గొప్ప వ్యాసము. నేను తెలుగులో ఈ విషయము పైన చదివినవాటిలో ఎన్నదగిన వ్యాసాలలో ఇది ఒకటి. ఇంగ్లీషు వారి దగ్గర నుంచి మనము దిగుమతి చేసుకున్న చరిత్ర రచనా పద్ధతి గురించి ప్రస్తావించి మొదలు పెట్టారు ఈ వ్యాసాన్ని. నేటికీ మన పరిశోధనా పద్ధతులు చాలా వరకు భావదాస్యపు సంకెళ్ళ నుంచి బయట పడలేదు అని నేను అనుభవం మీద తెలుసుకున్న విషయము. ఆ అభిప్రాయానికి మరికొంత ఊతము వచ్చింది ఈ వ్యాసము చదివాక. “మన దేశ విషయములు తెలియవలెనన్నా, ఇప్పుడు మన కాధారమైనవి ఇంగ్లీషు పుస్తకాలే కదా!” అని అంటారు ఈ వ్యాసములో. పాశ్చాత్య చరిత్రకారులు భారత చరిత్రని విభజించిన తీరు వలన ఈ దేశవాసులము యెల్లప్పుడూ దాస్యము చేయవలసిన వారిమే అన్న భావము మనలో స్థిర పడిపోవటము గురించి ప్రస్తావించారు. ఈ వ్యాసములో ఒక వాక్యము నాకు చాలా నచ్చింది. మనకు చరిత్ర రాయటానికి కావలసిన సామగ్రి లేదు, దృష్టి అసలుకే లేదు అని చాలా మంది అనుకోవటం కద్దు. వారంతా తీరికగా ఆలోచించవలసిన విషయము ఇది. “193 కోట్ల 87 లక్షల 550 సంవత్సరముల చరిత్ర వ్రాయవలెనని మనము దృష్టిలో పెట్టుకొనినచో చరిత్రను యే విధముగా ఊహించుట ఉచితమో మనకు స్పష్టమవుతుంది” అని అంటూ “వేదవ్యాసుడు, వాల్మీకి మనకు ఆదర్శ ఋషులు, ధర్మ ప్రవర్తకులు, చరిత్రకారులు, కవులు! చరిత్రకారులు స్వయముగా ఋషులయినప్పుడు కవులే అవుతారు. చరిత్రకారులు కవులు కావలె! కవులు చరిత్రకారులు కావలె! ఉభయులు ఆర్య ధర్మము గ్రహించిన ఋషులు కావలె! అప్పుడే మరియొక ఉత్తమమైన జయకావ్యము ఉద్భవిస్తుంది. అప్పుడే జాతీయాభ్యుదయము కలుగుతుంది. దానితో లోకకల్యాణము కూడా ప్రారంభించగలదు” అన్న వాక్యాలతో ఈ వ్యాసము ముగించారు. ఆహా! ఏమి ముగింపు!
ఇవి కాక ఎన్నో మరెన్నో వ్యాసాలు ఉన్నాయి. అన్నిటి గురించీ చెప్పుకుంటూ పోతే విమర్శకులు తిట్టి పోస్తారు. కనుక ఆ పని చేయబోవట్లేదు. ఈ పుస్తకం ఆఖరున ఉన్న వ్యాసము పేరు “కరవులన్నిటికీ కారణము నీతి కరవే”. టైటిలు చదుకుంటే చాలు వ్యాసము చదవనక్కర్లేదిక!
తప్పక చదవవలసిన పుస్తకము. తెలుగు సాహిత్యము యొక్క పరిధి, ప్రశస్తి , విస్తృతి గురించిన అవగాహన మెరుగుపడుతుంది.
Literary Essays
nagamurali
ఈమాట లోని ఈ వ్యాసం http://eemaata.com/em/issues/201309/2211.html/2 లో చెప్పిన సంగతి:
కారు- అన్న పదానికి మూలార్థం దట్టమైన నలుపు. తమిళ-మళయాళం వంటి దక్షిణ ద్రావిడ భాషాల్లో దట్టమైన నల్లటి మేఘాన్ని కూడా ‘కారు’ అనే పిలుస్తారు. నల్లమట్టితో నిండిన భూములు కలిగిన ప్రాంతం కరునాడు- అదే కర్నాటకం అయ్యింది. దీన్ని కర్ణాటక- అని సంస్కృతీకరించి కర్ణ అంటే చెవులు, అటతి- సంచరించు అంటూ “చెవులు ఎక్కడైతే సంచరిస్తాయో ఆ ప్రదేశం కర్ణాటక” అని చెప్పే సంస్కృత వ్యుత్పత్తులు శాస్త్రరీత్యా అంతగా పొసగవని తేలికగానే చెప్పవచ్చు.
ఫణీన్ద్ర పురాణపణ్డ
నిత్య గారు రాష్ట్రాన్ని గురించి కాక సంగీతం గురించి మాత్రమే చెబుతున్నట్టున్నారు…
Halley
వారి వ్యాఖ్యల్లో కొంత వ్యంగ్యం ఉన్నది ఈ వ్యాసము వరకు . వారు లేవనెత్తిన ప్రశ్నలో లోతు మీకు అర్థము అయినట్టు లేదు . ” విలక్షణమైన ఆంద్ర సంగీతం” అంటే ఆంధ్రుల సంగీతము లో మాత్రమే ఉండి ఇతరములలో లేనిది అన్నట్టు . నేను సంగీత శాస్త్రజ్ఞున్ని కాను కానీ తెలుగు భాష లాగా తెలుగు క్లాసికల్ మ్యూజిక్ లేదు నాకు తెలిసి . నోరి వారి వాదన అదే . సారసత్వము విషయములో వారికి బాగానే పట్టు ఉన్నది అన్న భావన కలిగింది ఈ వ్యాసాలు చదివాక నా మట్టుకు నాకు .
bhanukemburi
నిత్య గారు నెను కూడా కర్నాటక సంగీతం అంటే కర్నాటక రాష్ట్రానికి చెందినదే, అయ్యొ మనకి యె సంగీతం లెదే కూచిపూడి నాట్యం లా అని అనుకున్నాను…………చాలా విలువైన విషయం చెప్పారు చాలా చాలా థ్యాంక్స్
Nitya
Karna (the ear) + Ata (to haunt) or ‘that which haunts the ear’.
Nitya
మీ వ్యాసాన్ని నేను తప్పు పట్టడం లేదు…కాని ఈ రచయిత (కవి సామ్రాట్” నోరి నరసింహ శాస్త్రిగారి) అడ్డ దిడ్డంగా ఏది పడితే అది వ్రాసినట్లు అనిపిస్తుంది. కర్నాటిక్ మ్యూజిక్ అంటే కర్ణాటక కి చెందినది అని తెల్చేయటం విడ్డూరం!! కర్నాటిక్ అంటే అర్ధం కర్ణాటక అని కాదు స్వామి. అన్నమయ్య కీర్తనలలో విలక్షణమైన ఆంద్ర సంగీతం ఉన్నదా….దేవుడా!!!