పునశ్చరణం
వ్యాసకర్త: తమ్మినేని యదుకులభూషణ్
******
వైదేహి రెండవ కవితా సంకలనం ‘ పునశ్చరణం ‘ లో నన్ను ఆకట్టుకున్న వాక్యాలు:
“తులసి మొక్క చుట్టూ తెరల్లా కమ్ముకునే చీకటి అంచుల్ని
రెపరెప లాడిస్తూ అరటి దొన్నెల్లో నీవు వెలిగించిన కార్తీక దీపాలు
కొండెక్క కుండా నా కంటితడి ముఫ్పై మూడేళ్ళుగా కాపాడుతూనే ఉంది “
(నాయనమ్మ)
కాబట్టే కవయిత్రి ఇవాళ ‘పునశ్చరణం‘ చేయగలుగుతుంది.
“రాయడం పూర్తి చేసిన కవితను
మళ్ళీ మళ్ళీ చదువుతుంటాను
అప్పుడే పుట్టిన పసికందును
ఒక్క క్షణం కూడా వదలలేక
తడిమి తడిమి ముద్దాడే తొలి చూలాలిలా“
మంత్రధూళిలో మాటలు కవిత్వంగా మారే క్షణాలు కవయిత్రికి తెలుసు:
“మనం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం
ఎప్పుడో ఒక్క క్షణంలో మాత్రం చందన పుష్పాల్లా
మాటలు మన మధ్య కొత్తగా గుబాళిస్తాయి“
బరువైన భావాలను అలతి అలతి పదాలతో, కొలది మాటలతో పలికించడం ఒక పద్ధతి. తద్భిన్నంగా బరువైన పదాలతో వివరంగా, విశదంగా చెప్పడం మరొక పద్ధతి. వైదేహి రెండవ మార్గాన్ని అనుసరించినట్టు అగుపించినా, మొదటి పద్ధతిలో రాసిన కవితలు తక్కువ కాదు.
ఇంట్లో ప్రతిమూలనీ వెలిగించే ఎండ కవిత్వంలో ఎలా ప్రసరిస్తుందో గమనించి ఎన్నో విషయాలు చెప్పవచ్చు. కవయిత్రికి ఎండ ‘చేయి వదలని చిరకాలపు సహచరి’. వెలుతురుతో అంతరంగాన్ని ముడిపెట్టుకున్న కవయిత్రి లో మారే ఎండతో కలిగే భావాలు:
“బంగారం నీడల సాయంకాలం రాగానే సిగలా ముడిచి పెట్టిన
ఆలోచనల జలపాతాలను స్వేచ్ఛగా వదిలేస్తాను“
ఆకాశంతో మమేకమై, గడిచిన సాయంకాలాల మెరుపు కళ్ళలో వెలిగిపోతేగాని అంతరంగంలో అసలైన కవిత్వం ఉద్భవించదు.
“ఏటి మీదకు జారిన ఎర్ర గన్నేరు పువ్వుల్లాంటి
అందమైన ఆ రోజుల్ని మళ్ళీ ఒడిసి పట్టుకోవాలని
కాలపు ఒడ్డు మీంచి జ్ఞాపకాల వలలని వృధాగా విసురుతాం“
కాబట్టి “నాలాగే కాంతులతో హృదయాన్ని పారేసుకున్న నీలాకాశం“ అని కవయిత్రి భావించడం సహజమే!!
Poetry
Leave a Reply