చిట్లీ చిట్లని గాజులు
వ్యాసకర్త: Halley
*********
“చిట్లీ చిట్లని గాజులు” అన్న నవల చదవటం ద్వారా ఈ కింది విషయములు మీకు తెలియవచ్చును. ఈ కింది విషయములు మీకు ఇది వరకే తెలిసి ఉండవచ్చును, తెలియకుండా కూడా ఉండవచ్చును. తెలిసీ తెలియనట్లుగా కూడా ఉండి ఉండవచ్చును. నవలా సాహిత్యం ద్వారా ఇట్టి విషయములు సామాన్య పాఠకులతో ఒక గొప్ప రచయిత ఎలా పంచుకుంటాడో తెలుసుకోవలెనని అనుకున్నచో ఈ వ్యాసము చదువుకొనుడు. ఈ వ్యాసం రాసెడి వ్యక్తికి విశ్వనాథ నవలలో కథతోడి సంబంధము లేదు. అతనికి కావలసినది మెదడుకు మేత పెట్టెడి ఇట్టి విషయములే. ఈ నవల కథను గురించి తెలుసుకోగోరెనుచో అంతర్జాలములో శోధించుము. అయినను దొరకనిచో ఇక్కడ కామెంటు వదులుము. వీలు చూసుకొని కథ గురించి కొన్ని ముక్కలు వ్రాసెదము. అయినను ఎంతో కొంత చెప్పవలెను గనుక చెప్పెదము. చార్వాక మతము గురించిన నవల ఇది. “నేపాళ రాజ వంశ చరిత” అన్న నవలలో ఇది రెండవది. “నేపాళ రాజ వంశ చరిత” నవలలు అనగా ఏమిటి అని అందురా? “ఇమ్మొర్టల్స్ ఆఫ్ మెలూహ”, “హారీ పోట్టర్”, “క్రానికల్స్ ఆఫ్ నార్నియ”, “లార్డ్ ఆఫ్ ద రింగ్స్”, “గేం ఆఫ్ థ్రొన్స్”, “ట్వైలైట్” అని ఎన్నో నవలల సిరీసులు మనకు తెలుసును. అట్టిదే ఇది కూడా. తెలుగులో ఒక పెద్దాయన ఇది మాత్రమే కాదు ఇంకనూ “పురాణ వైర గ్రంథమాల” అనీ “కాశ్మీర రాజ వంశ చరిత” అని రెండు సీరీసులు, వాటిలో దాదాపు ఇరవైకి పైగా నవలలు రాసెను అనీ, 1950లు 1960లు లోనే ఈ గొప్ప ప్రయోగం చేసెను అనీ మనకి చెప్పే దిక్కు లేదు నేడు. “స్టార్ వార్స్” సిరీస్ తెలుసునా అంటే వోహో తెలుసును అని అనటం మాత్రం వచ్చును మనకు. యెందుకంటే మనము తెలుగు వారము కాబట్టి!
ఇక మెదడుకు మేత విషయానికి వస్తే –
ప్రశ్న: ఆస్తికుడికీ నాస్తికుడికీ భేధం ఏంటి?
జవాబు: దేవుడిని నమ్మనివాడు కాడు నాస్తికుడంటే, ఆస్తిక నాస్తిక మత భేదములు దేవుడున్నాడు లేడు అని అనటం వల్ల కాదు, వేదమును నమ్ముట చేత నమ్మకపోవటం చేత.
ప్రశ్న: Diversity గురించి కొన్ని వాక్యములు వ్రాయుము?
జవాబు: భేదలక్షణము సృష్టిలోని మూల ద్రవ్యము. లోకమెంత వివిధమైనది. ఈ లోకములో వైవిధ్యము లేకుండా చేసినచో ఐక్యము సమకూడునని కొందరి భావము. లోకమునందు భిన్నత్వమే లేనిచో లోకమే లేదు.
ప్రశ్న: షడ్దర్శనములలో చార్వకము ఎందుకు చేర్చ బడింది?
జవాబు: ఈ చార్వక మతమింత పశుప్రాయమైనది కదా! దానికి షడ్దర్శనములలో స్థానమెందుకని ప్రశ్నపుట్టినచో, నొక రహస్యమున్నది. పరమోత్తమమైన మతం అద్వైతమైనచో దాని వేదాంతము భావ జగత్తునకు శిరోభూషనమైనచో, ఆ మతమేమి చెప్పుచున్నది ? ఆ మతమేమి, మరియొక మతము మత్రమేమి చెప్పును? దేవుడున్నాడని చెప్పును. ఆ భగవంతుని పొందుటకు మార్గ ముపదేశించును. అంతకంటే నే మతం నేమియు చేయదు. నీ యాకలి నార్పదు, నీ యాయుస్సును పొడిగింపదు, నీ దుఃఖములను తొలగింపదు. నీ యనుభవము నందు వికారమును తీసుకొని రాదు. వేయి మతములు, వేయి రాజ్యాంగములు, వేయి సాంఘిక వ్యవస్థలు, వేయి మంది లోకోద్ధారకులు జనన జరామరణమూలకమునుగాని సుఖదుఃఖములను గాని సృష్టిలో నుండి తొలగింపలేవు.
ఈ స్థితిలో చార్వకులు దేవుడు మతము నన్న రెంటి ప్రసక్తి లేకుండా, వాచ్యముగా కాకుండా వ్యంగ్యముగా, సృష్టి యొక్క సృష్టి లక్షణమును ప్రతిపాదించుచున్నారు. అపరిహార్యమైన ప్రకృతి లక్షణమును సర్వదా యంగీకరించుచున్నారు. మానవుని నిస్సహయత్వమునకు ప్రతీకగా బతుకుచున్నారు. అందుచేత వారిదియు షడ్దర్శనములలో నొకటియే!
ప్రశ్న: భగవంతుడు ఉన్నాడు అనే వారికీ లేడు అనే వారికీ తేడా ఏమిటి? అసలు మానవ జీవితంలో భగవంతుడి పాత్ర ఏమిటి?
జవాబు: మేము (వైదిక మతస్తులం) భగవంతుడన్న సమాధానము కోరి “ఇది ఇట్లెందుకు జరిగినది” అన్న ప్రశ్న వేయుచున్నాము. మీకు (చార్వకులకు) భగవంతుడన్న సమాధానం పనికి రాదు కనుక మీరా ప్రశ్న వేయరు. ఆ ప్రశ్నను పరిహరింతురు. అంతియే భేదము. ఎందుకన్న ప్రశ్న యచ్చటనే యున్నది. మీరు వేయరు. మేము వేయుదుము. వేయనిచో మీరే ఉన్నారు. వేసినచో భగవంతుడు కూడా ఉన్నాడు. ఈ ప్రశ్న వేసి భగవంతుడు ఉన్నాడు అని అనుకొని మేము తృప్తి పడుదుము. మీరు ప్రశ్న వేయరు. మీకు తృప్తి లేదు. మాకిది మానసికమైన తృప్తి. మీకు తృప్తి అన్నది శరీరము నుంచి రావలెను …….
……
శరీరమునకు అన్నము కావలెను. రుచిగల పదార్థము తినునపుడు సుఖపడుదువు. అందుకని ప్రొద్దుట మొదలు పెట్టి రాత్రివరకు తినుచూ కూర్చుండవు కదా! శరీరము తోడి సుఖములన్నియు నింతియే. సుఖమన్నది అనుభవించు కాలము స్వల్పము. తక్కిన కాలమెక్కువ. తక్కిన యప్పుడేమి చేయుచున్నావు. మనస్సుతో వ్యవహరించుచున్నావు కదా. ఆ మనస్సేమి చేయుచున్నది? ఒక్క భోజన విషయమును విచారింతము.
ప్రొద్దున్న తిన్న తర్వాత మరల రాత్రి వరకు తిననక్కర్లేదు. ఈ నడిమి కాలమంతయూ నెట్లున్నది? మనస్సు పని చేయుచున్నదా లేదా? అది యిట్లు పని చేయునన్న నియమము ఉన్నదా? వినోదములను గూర్చి ఆలోచింతువు. శత్రువులను గూర్చి ఆలోచింతువు. నీ యాస్తిని గురించి ఆలోచింతువు. క్రొత్త సుఖమును దేనినో గూర్చి ఆలోచింతువు. అవి పొసగవు. అవి పొసగును. పొసగినచో నీ మతము. పొసగనిచో నీ మతమేమి చేయును? దుఖపడును. ఆరాటపడును. వెంపర్లాడును. నా మతమేమి చేయును? ఏమి చేయునో అట్లుంచి ఏమి చెప్పును? భగవంతుడున్నాడు. వాని దయ ఇట్లున్నదని సమాధానము చెప్పును. దుఃఖము తగ్గిపోవును. ఆరాటము లేదు. నీ మతము నా మతములో భేదమిదియే ఉన్నది. దుఃఖమును నీవు పరిహరించలేవు. అన్నియు ననుకూలించినపుడు సుఖపడుదువు. మేము నంతియే. కానీ అనుకూలించనపుడు మీకు దుఖమెక్కువ మాకు దుఖం తక్కువ. ఒక్కొక్కప్పుడు మాకు దుఃఖమే లేదు!
ప్రశ్న: వైదిక మతస్థుల ప్రకారం రాజు అన్నవాడు చేయవలసిన పనులు ఏమిటి?
జవాబు: ఒక మాహనగరమున్నది. దానికొక్క రాజు. ఏ నగరమునకా నగరమున కొక రాజు. అప్పుడు ప్రజాపాలనము కొంత బాగుగా ఉండవచ్చును. లేనిచో నధికారులందరు న్యాయస్థులై ఉండవలెను. అధికారులు న్యాయస్థులై యుండుటకు వారికి చెప్పబడు విద్య-న్యాయము, ధర్మము, సత్యము, నహింస ప్రధానముగా బోధింపబడెడు విషయములు కావలెను. ఈ రాజు, తన ప్రజలకు చెప్పించెడి చదువు, ధర్మ సత్యహింసా న్యాయదులు బోధించెడిది చేయుటతో పాటు, దేశమునందున్న మతము కూడా నా ధర్మములు చెప్పెడు మతమై యుండవలెను. మతమునకు మతమే, జీవితముకు జీవితమే యైనచో బిరుసుగా వండిన యన్నమున కన్నమే, నీళ్ళ మజ్జిగకు నీళ్ళ మజ్జిగే! వైదిక మతస్తులు వారి రాజ్యాంగములలో వారి మత సిద్ధాంతములే కావ్యములుగా పురాణములుగా రాసి, యదియే ప్రధాన విద్యగా ప్రజల చేత చదివింతురు. ప్రజలు చదివిరనగా వానినే చదువుట. అందుచేత పరంపరాగతమై సత్యహింసాదులు ప్రధానమైన లక్షణముగా పెంపకములో నుండును. విద్య యదియే! జీవిత మట్లే నడువ వలెను. ఈ మహా పథకమొక్కటి సంఘమునందభివ్యాపించియుండి పాపభీతి, పుణ్యలోక వాంఛ, న్యాయము, ధర్మము, మొదలైన గుణములు గల సంఘము సిద్ధమగును. రాజు చేయవలసినది ఈ వ్యవస్థను సంరక్షించుటయే. చార్వకాది మతములు వృద్ధి పొందినప్పుడు రాజు వాని నదుపులో పెట్టవలెను.
ఈ పరిచయం ఇంతటితో సమాప్తం. ఏమయ్యా! పుస్తకంలో ఉన్న లైనులు ఏకబిగిన వల్లె వేసినచో పరిచయం చేసెసినట్టేనా అని అంటారేమో! నా ఉద్దేశంలో ఈ పుస్తకమునకు సంబంధించినంతవరకు ఇవే ప్రధాన విషయాలు. వేరే ఏమీ అక్కర్లేదు!
Amarnath
“1950లు 1960లు లోనే ఈ గొప్ప ప్రయోగం చేసెను అనీ మనకి చెప్పే దిక్కు లేదు నేడు. “స్టార్ వార్స్” సిరీస్ తెలుసునా అంటే వోహో తెలుసును అని అనటం మాత్రం వచ్చును మనకు. యెందుకంటే మనము తెలుగు వారము కాబట్టి!”
పులిమ్రుగ్గులో ఆంధ్రుల గురించి జయద్రథుడి వ్యాఖ్య:
“ఏ ఇతర దేశములో నైనను వట్టి ఎడారిలో నొక దర్భమోడు లేచినచో అది మహావృక్షమని మన్నింతురు. మీ ఆంధ్రులు మహావృక్షములను దర్భమోడులని చెప్పుదురు. మీ జాతి లక్షణమది!”
🙂