The People’s Scientist – Dr. Y Nayudamma

గత ఏడాది నేను చదివిన పుస్తకాల్లో నాకు బాగా నచ్చిన, నన్ను అమితంగా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఒకదానిని గురించి ఇప్పుడు రాయబోతున్నాను. మొన్న ఒక ఫ్రెండ్ ఎక్కడో అన్నట్టు, ఒక పుస్తకంలో ఎంత సరుకున్నా, దాన్ని ఓ పాఠకుడి చదివేటప్పుడు, అతడిలో ఉన్న సరుకును బట్టే అర్థమవుతుందని, పుస్తకంలో ఏ విషయాన్నైనా పాఠకుడు తన పరిధిలోనే అర్థంజేసుకోగలడు. (లేదా, సింపుల్‍గా రానెరాగారిలా చెప్పాలంటే “ఇది ఓ పుస్తకం ద్వారా ఈ పాఠకుని పరిచయం”.)  ఈ పుస్తకానికి ఓ పరిచయం రాయడానికి నాకు నా కారణాలు ఉన్నాయి. అవి నావి. వాటికినూ, ఈ పుస్తకం ఎవరి గురించో ఆ మనిషికినూ, లేక పుస్తకం రాసినవారికి సంబంధించినవే కానవసరం లేదు.

సచిన్ టెండూల్కర్ అంటే వంద సెంచరీలు బాదిన బాట్స్-మెన్, రాజర్ ఫెడరర్ అంటే ఎన్నెన్నో గ్రాండ్‍స్లామ్స్ గెల్చిన టెన్నిస్ ఆటగాడు అంటే అందులో తప్పుబట్టడానికేం లేదు. కానీ ఆ స్టేట్మెంట్స్ తో నాకొచ్చే తగువు ఏంటంటే వాళ్ళు గుర్తుండిపోవడానికి వాళ్ళు ఆడిన ఆట, సాధించిన రికార్డులూ ముఖ్యమే అయినా అవి మాత్రమే వాళ్ళని “define” చేయటం నాకు నచ్చదు. ఫెడరర్ గురించిన పుస్తకాలేవీ నేను చదవలేదుగానీ, సచిన్ గురించి వచ్చే చాలా బయోగ్రఫీలు ఒకేలా ఉంటాయి – సచిన్ కవర్ డ్రైవ్ చేస్తున్నప్పటి ఫుట్ మూమెంట్‍ని బంధిస్తూ, నడివీధిలో సచిన్ నిలువెత్తు విగ్రహం పెట్టినట్టు. ఓ పక్క మనిషి ఇంకా బతికే ఉన్నా, మనిషి అక్షరాల శిథిలాల్లో కూరుకుపోయి శ్వాస వదలడానికి సిద్ధంగా ఉన్నాడేమోనని అనుమానం వచ్చేలా రాస్తారు! How annoying!

“కాలగర్భంలో కలిసిపోయాడు” అంటుంటారుగా, పోయిన మనుషుల గురించి. అలా కలిసిపోయిన మనిషి చేసిన ఘనకార్యాలను ఏకరువు పెట్టచ్చు. అతడు తిరిగిన ప్రదేశాలు, దేశాల గురించి రాయొచ్చు. ఆయనతో కలిసి తిరిగిన మనుషులతో మాట్లాడించచ్చు. కానీ మనిషిని మళ్ళీ అంతే సజీవంగా పాఠకుని ముందుకు తీసుకురావటం మామూలు విషయం కాదు. విజయాలగురించే కాదు బలహీనతల గురించి అంతే easeతో ప్రెజంట్ చేయటమూ అంత తేలిక కాదు. అవార్డులు, రివార్డులను పెట్టుకునే అరగా బయోగ్రఫీని మార్చక, ఒక నిండు వ్యక్తిత్వాన్ని అర్థంచేసుకునే వీలు కల్పించటం చిన్న విషయం కాదు. ఇవి సాధించిన పుస్తకం, చంద్రహాస్‍గారు రాసిన “The People’s Scientist: Dr. Y. Nayudamma.”

నా ప్రమేయం లేకుండా పుస్తకం ఇంటికి వస్తుంది కదా అని అసలు ఏంటీ పుస్తకం, ఎవరీ నాయుడమ్మ లాంటి వివరాలేమీ నేను పట్టించుకోలేదు. కొరియర్ తెరిచి చూసేసరికి అట్టపై మగమనిషి బొమ్ముంటే అవ్వాక్కై “నాయుడమ్మ అంటే లేడీ కాదా?” అని నాలుక కర్చుకున్నాను. చదవటం మొదలెడితే, “పొరబడిన వాళ్ళల్లో నువ్వేం మొదటిదానివి కావమ్మాయ్! ఒకసారి గమ్మత్తుగా ఏం జరిగిందో తెల్సా?” అని అంటూ ఆయన పేరు చూసి పొరబడి, ఆయణ్ణి రైలులో లేడిస్ కంపార్ట్మెంటులో ఎలా ప్రయాణించేలా చేశారోనన్న సంఘటన ఉంటుంది. నవ్వు తెప్పిస్తుంది. రైలు దిగి తన ఊరెళ్ళేటప్పుడు ఎడ్ల బండిలోనే వెళ్ళడానికి ఇష్టపడే ఆయణ్ణి చూసి ఇష్టమూ కలుగుతుంది. పోనుపోను ఆయన వివరాలెన్నో తెలుస్తాయి. ఎక్కడ పుట్టిందీ, ఎలా ఏటికి ఎదురీదిందీ, ఏయే చదువులు చదివిందీ, ఏయే దేశాలకు పోయిందీ, ఏమేం సాధించిందీ, అవి సాధించుకోడానికి ఎందర్ని కూడదీసుకున్నదీ – ఇలా బోలెడు వివరాలు తెలుస్తాయి. తెలుస్తున్న కొద్దీ ఓ ప్రఖ్యాత సైంటిస్ట్ జీవిత చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలను తెల్సుకోవడం, ఆయన సాధించిన విజయాలకు అబ్బురపోవడం, జబ్బలు చరచుకోవడం లాంటివన్నింటితో పాటు ఓ స్నేహశీలి, ఎల్లప్పుడూ నవ్వుతూ, తాను నమ్మింది చేస్తూ, జీవితాన్ని ఆసాంతం ఆస్వాదించిన మంచి మనిషిగా కూడా పరిచయమవుతారు. (ఆ తర్వాత, గచ్చిబౌలి (అక్కడ ఈయన పేరిట ఇన్స్టిట్యూట్ ఉంది) వైపు వెళ్ళివస్తున్నప్పుడెప్పుడో నా స్నేహితులతో, ఆయన నాకు మహాబాగా పరిచయమున్నట్టు, నా స్నేహితుడు అయ్యినట్టు ఆయన గురించి వాళ్ళకి కబుర్లు చెప్తునాన్నమాట.)

ఒక డిగ్రీ చేతికివచ్చిందా? అది ఇంకా చేతిలో పడినా పడకుండా, ఆఫర్ లెటర్ వచ్చిందా? ఒకట్రెండేళ్ళల్లో విదేశాలకు చెక్కేశామా? చెక్కేసి, డాలర్లో, పౌండ్లో పోగేసి, వీలైనంత టాక్సులు ఎగ్గొట్టే మార్గాంతరాలు వెతుక్కుంటూ మనకి మాత్రమే సొంతమయ్యే ఆస్తులు కొనుక్కుమా? – ఈ chain of eventsలో ఏ ఒక్కటి అటూ-ఇటూ అయినా, వాళ్ళని outcasts‍గా ట్రీట్ చేసే జెనరేషన్‍లో ఒక మనిషిగా, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో సైన్స్-సైన్స్ అంటూ మనవాళ్ళు పొంగిపోయిన విధానం, ప్రపంచ పటంలో సైన్స్ పరంగా మన పేరూ ఉండేలనే బలమైన కోరిక, అందుకు సహకరించిన ప్రభుత్వం, దాన్ని సద్వినియోగం చేసుకున్న ఇలాంటి సైంటిస్టులను చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడేమో అవకాశాలు బహు కష్టమైనా కూడా, అన్ని సుఖాలను వదులుకొని, వాళ్ళు సాధించాలనుకున్నవి సాధించారు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు చాలా గొప్పగా తోచింది. బహుశా, ఇప్పటివాళ్ళల్లో కూడా ఇలాంటి వాటి కోసం శ్రమించేవాళ్ళున్నారేమో! కానీ ఉద్యోగాల్లో, జీవితాల్లో “సెటిల్” అయిపోయినవాళ్ళోసారి ఈ పుస్తకం చదివితే బాగుంటుందని నా ఆశ. కొత్తగా ఏం చేసేయకపోయినా, కొంత కొత్తగాలి తాకినట్టవుతుంది.

నాయుడమ్మగారు ఈదిన కష్టాల కడలి గురించి రాసేటప్పుడైనా, లేక ఆయన వైవాహిక జీవితం గురించి రాసేటప్పుడైనా, లేక ఇందిరా గాంధి హయాంలో ఆయన ఇమడలేని పదవిని ఒప్పుకొని ఇబ్బందులు పడినప్పటి సంగతుల గురించి రాసేటప్పుడైనా ఎక్కడా మెలోడ్రామా లేకుండా, ఒకరి జీవితంలోకి బలవంతంగా జొరబడి, మూలమూలల్లోంచి వివరాలన్నీ రాబట్టినట్టుగా లేకుండా balancedగా ఉంది. మర్యాదను అతిక్రమించకుండా, ఓ మనిషిని గురించి ఎంత తెల్సుకుంటే మనకి ఉపయోగకరమో అంత మాత్రమే తెలిపేట్టుగా ఈ బయోగ్రఫీ ఉండడంవల్ల  దీని మీద నాకు ఒక ప్రత్యేకమైన గౌరవం.

ఇంతకీ నాయుడమ్మ అంటే ఎవరు? ఆయన ఏ రంగంలో కృషి చేశారు? ఏం సాధించారు? లాంటి ప్రశ్నలకు జవాబులను వికిలలోనో, లేక ఇలాంటి అరకొర పరిచయాల్లో తెల్సుకునేకంటే ఈ పుస్తకం చదువుకోవటం అన్ని విధాల మంచిది. నాకు తెల్సినంతలో బాగా రిసెర్చ్ చేసి రాసిన పుస్తకంలానే అనిపించింది. అయితే అది ఎంతవరకూ నిజమన్నది ఆయా రంగాల్లో ప్రవేశమున్నవాళ్ళు మాత్రమే చెప్పగలరు. నా మట్టుక్కు నాకు, ఒక inspiring personality గురించి తెల్సుకునే అవకాశం కలిగింది ఈ పుస్తకం ద్వారా. అది చాలు నాకు! ఎందుకంటే సచిన్ కవర్ డ్రైవ్ ఎలా ఆడతాడే analysis చదివి, దాన్ని ప్రాక్టీసు చేయడం నా పని కాదు కాబట్టి. ఓ షాట్ బాగా ఆడడానికి కావాల్సిన నేర్పు, ఓర్పు ఎలా అలవర్చుకున్నాడో తెల్సుకొని అందులో ఆవగింజలో అర భాగమంత నేను ఆచరించగలిగినా నా బడుగు జీవితానికి సరిపోతుంది. అలాంటివి ఈ పుస్తకంలో పుష్కలంగా ఉన్నాయి. అవికాకుండా కూడా చాలా ఉన్నాయి. నాకు కనిపించినవే నేను చెప్తున్నాను. మీకేం కనిపిస్తాయో మీరే చూసుకోవాలిగా!

పుస్తకం తెలుగు, ఇంగ్లీషు భాషలలో లభిస్తుంది. నేను ఇంగ్లీషులోనే చదివాను. తెలుగుది ఇంకా చదవలేదు. అరుదైన ఫోటోలు, కొన్ని ఉత్తరాలు కూడా వీటిలో పొందుపరిచారు.

ప్రతుల కోసం:

Buy at Flipkart

The People’s Scientist - Dr. Y Nayudamma
K. Chandrahas
Biography
2013
Paperback
172

You Might Also Like

5 Comments

  1. Srinivas Battu

    థాంక్స్ అండి….చాల బాగా రాసారు…definite గ…తెలుగు బుక్ చదువుతాను…

  2. సౌమ్య

    Here is an article that appeared in Sakshi this week, his grand-daughter’s views on Dr Nayudamma. This book was mentioned by her in the article.

    http://www.sakshi.com/news/family/not-only-my-husband-my-grandfather-also-artist-165280

  3. Jayasree Devineni

    గొప్ప అనుభూతితో చదివాను ఈ పుస్తకాన్నిEnglish లో. జీవితమంతా కుతూహలంతో, స్పష్టమైన ఆలోచనలతో, నిర్దుష్టమైన అభిప్రాయాలతో, ప్రతి ఒక్కరని గౌరవ భావంతో చూసిన నాయుడమ్మ గారంటే నాకు ఎనలేని గౌరవం కలిగింది. గర్వంగా అనిపించింది.
    ఆయన సాధించిన పనులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఒక శాస్త్రవేత్తగా కాని, C.S.R.I. అధినేతగా కానీ, ఆయన తోలు పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరికి అందుబాటలో ఉండటం, అవి ఎంత వరకు వారికి ఉపయోగ పడుతున్నాయో ఎప్పటి కప్పుడు కనుక్కోవటం గురుంచి చదివితే ఆయన ఎంత noble person తెలుస్తుంది.
    అంత అర్థవంతము, అరుదైన జీవితం గడిపిన ఆయన గురుంచి అంత చక్కగాను రాసిన చంద్రహాస్ గారి జీవితం కూడా ధన్య మైనదనిపించింది.
    ఏం పనులు చేసినా ఫలితాలు చూడాలంటారు కదా. Hyderabad Metro Rail Director, S V S Reddy గారి లో నాయుడమ్మ గారి ప్రతిబింబం కనుపడుతోంది. గర్వ కారణంగా ఉంది నాకు.
    ఈ పుస్తకాన్ని ఎంత మంది చదవగలిగితే అంత బాగుంటుందని నా కోరిక.
    తెలుగులో కూడా చదువుతాను పూర్ణిమ గారు.

  4. pavan santhosh surampudi

    //సైన్స్-సైన్స్ అంటూ మనవాళ్ళు పొంగిపోయిన విధానం, ప్రపంచ పటంలో సైన్స్ పరంగా మన పేరూ ఉండేలనే బలమైన కోరిక, అందుకు సహకరించిన ప్రభుత్వం, దాన్ని సద్వినియోగం చేసుకున్న ఇలాంటి సైంటిస్టులను చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడేమో అవకాశాలు బహు కష్టమైనా కూడా, అన్ని సుఖాలను వదులుకొని, వాళ్ళు సాధించాలనుకున్నవి సాధించారు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు చాలా గొప్పగా తోచింది. బహుశా, ఇప్పటివాళ్ళల్లో కూడా ఇలాంటి వాటి కోసం శ్రమించేవాళ్ళున్నారేమో! కానీ ఉద్యోగాల్లో, జీవితాల్లో “సెటిల్” అయిపోయినవాళ్ళోసారి ఈ పుస్తకం చదివితే బాగుంటుందని నా ఆశ. కొత్తగా ఏం చేసేయకపోయినా, కొంత కొత్తగాలి తాకినట్టవుతుంది.//
    ఆ కొత్తగాలి నాకు కొత్తగాలి కాదు. రోజూ తగులుతూ ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకడు ఆ కాలానికి, ఆ భావజాలానికి తగ్గ వాడు ఉన్నాడు. పై వాక్యాలు చదువుటూంటే ఊపిరి పీల్చి వదలడమనే సహజప్రక్రియ భారమైపోయింది. అప్రయత్నంగా కన్నీళ్లు వస్తున్నాయి. ఒకనాడు నాకు పరిచయస్తుడైన వాడి గురించి ప్రపంచం కొత్త కొత్త సంగతులు కనుక్కునిమరీ నాకు చెప్తుందేమో.

    1. pavan santhosh surampudi

      ఇవన్నీ సొంత సోది అని తెలిసినా ఎందుకు రాస్తున్నానంటే “ఈ పుస్తకానికి ఓ పరిచయం రాయడానికి నాకు నా కారణాలు ఉన్నాయి. అవి నావి. వాటికినూ, ఈ పుస్తకం ఎవరి గురించో ఆ మనిషికినూ, లేక పుస్తకం రాసినవారికి సంబంధించినవే కానవసరం లేదు.” అన్నారు కదా పూర్ణిమ గారు. అలాగే వ్యాఖ్య విషయంలో నేనూనూ.

Leave a Reply