Things Fall Apart by Chinua Achebe
వ్యాసకర్త: రానారె
ఆకాశంనుంచి ప్రపంచ సాహిత్యాన్ని చూస్తే తళుక్కున మెరుస్తూ దృష్టిని తనవైపుకు ఆకర్షించే ఆఫ్రికన్ తారగా, ఆధునికాఫ్రికాసాహిత్యపితగానూ పేర్కొనబడిన రచయిత – చినువా అచేబె. ఇతని తొలి నవల థింగ్స్ ఫాల్ అపార్ట్. ఈ నవల చదివాక చినువా అచేబె గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో అంతర్జాలాన్ని గాలించగా తెలిసిన సంగతి ఇది.
ఆఫ్రికా ఖండంలోని దిగువ నైగర్ నదీ ప్రాంతం. 1890ల నాటి కాలం.
కథ ఇలా మొదలౌతుంది: “ఆ చుట్టుపట్ల తొమ్మిది గ్రామాల్లోనూ ఆ పైనా కూడా ‘ఒకాంక్వో’ను ఎరిగున్నవారే అందరూ. స్వయంశక్తితో సాధించిన ఘనకార్యాలు అతని కీర్తికి సుస్థిరమైన పునాదిరాళ్లు. పద్దెనిమిదేళ్ల యువకునిగా వున్నప్పుడు – ‘మార్జాలం’ – అమాలీన్‌జే’ని పడదోసి తన గ్రామానికి గౌరవాన్ని కట్టబెట్టా డతడు. ఉమోఫియా నుంచి మ్‌బైనో దాకా, ఏడేళ్లు అపజయమెరుగని మల్లయోధుడు అమాలీన్‌జే. భూమికి ఎన్నడూ వెన్నుతాకనివ్వని వాడు కనుకనే అతన్ని మార్జాలమన్నారు. ఇదిగో, యితగాడినే ఒక పోటీలో ‘ఒకాంక్వో’ పడదోసింది. ఆ పెద్దమనిషే స్వయంగా ఒప్పుకొన్నట్టు, వారి పట్టణ వ్యవస్థాపకుడు ఒక అడవిభూతాన్ని ఏడు రాత్రులూ ఏడు పగళ్లూ నిలువరించిన నాటినుండీ ఈనాటివరకూ జరిగిన అత్యంత భయంకరమైన పోరాటాల్లో, ఇదీ ఒకటి.”
ఒక్క పేరా చదివేటప్పటికి, తొమ్మిది గ్రామాలూ, కథా నాయకుడు, మల్లయోధులూ వారి బిరుదాలూ, మల్లయుద్ధాల పోటీలు, భూతాలూ వాటిని నిరోధించగలవాళ్లూ, పట్టణాలూ వాటి వ్యవస్థాపకుల గురించిన కథలూ, వ్యక్తికీ గ్రామానికీ గౌరవం తెచ్చే సాధనలూ … ఇంత ప్రపంచం నా కళ్లముందు నిలిచింది, సజీవమై. తరువాతి పేరాలు చదవకుండా ఎట్లా? ఆ సమాజం, అక్కడి తెగలు, వాళ్ల వ్యవసాయం, వ్యాపారం, పెద్దలు, పిన్నలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు, నేరాలు – శిక్షలూ, సామెతలు, వారి ఆడవాళ్లు, మగవాళ్లు, పెళ్లిళ్ల తంతు, పిల్లలూ … చదువుతూ పోతే, మొత్తంగా మరో ప్రపంచంలో కొత్తగా తిరుగుతున్నప్పుడు మన ప్రపంచంతో పోలికలున్నప్పుడు, వైరుధ్యాలూ వున్నప్పుడు, ఈ రెండు ప్రపంచాలలోనూ మార్పులు తెచ్చే మంచీ చెడ్డా, తట్టుకో గలిగినవాళ్లు, తప్పించుకున్నవాళ్లు, తప్పించుకోలేక పోయిన వాళ్లు, ఆ పరిస్థితులన్నీ బేరీజువేసుకోకుండా వుండలేం కదా. ఆద్యంతమూ ఇదే చేస్తూ పోయాను తొలిసారి.
ఒకాంక్వో తండ్రి సోమరి. సాత్వికుడూనూ. కళారాధకుడు, కళాకారుడున్నూ. అప్పులు తెచ్చి ఎగ్గొట్టటంతో సహా. సంఘంలో గౌరవాన్ని పెంచుకుంటూ పోయే ఘనకార్యాలపట్ల అనాసక్తుడు. అందుకే ‘ఆగ్‌బలా’ (మన భాషలో వ్యంగ్యార్థం అబల) అనిన్నీ అనిపించుకుంటాడు. ఆగ్‌బలా అనే పదాన్ని ఆడది అని మాత్రమే కాక, తన తండ్రిలాంటి మగవాళ్ల విషయంలోనూ వాడతారనే సంగతి, ఆటపాటల్లో తన స్నేహితుని ద్వారా తెలుసుకుని బాధపడిపోయి, ఈ లక్షణాలన్నింటికీ బద్ధ వైరుధ్యం పెట్టుకుంటూ పెరుగుతాడు కథా నాయకుడు ఒకాంక్వో. మగాడు అనే మాటకు అతని నిర్వచనం ఈ వైరుధ్యం నుంచే ఏర్పరచుకుంటాడు. నిరంతరం కష్టపడే తత్వం మాత్రమేగాక, సోమరితనాన్నీ బలహీనతనూ ఈసడించడం ప్రయత్నపూర్వకంగా ఈతని తత్వం అయివుంటుంది. అలాగని దయలేనివాడు కాడు. పిరికివాడుగా కనబడతానేమో భయం అతన్ని జీవితమంతా వేధిస్తూవుంటుంది. అతని ఎదుగుదలకూ, పతనానికీ ఇదే ముఖ్య కారణం ఔతుంది.
తన లాంటి యువకులందరికీ తమ తండ్రుల నుంచి సంక్రమించిన సంపదలేవీ ఇతనికి ప్రాప్తించక పోయినా, తన తెగ గౌరవించే వ్యక్తుల స్థాయిని కేవలం స్వయంకృషితో పిన్నవయస్సులోనే సాధించుకున్న ఒకాంక్వో, ముగ్గురు భార్యలూ ఎనమండుగురు బిడ్డలతో పచ్చగా వున్న సమయంలో తన ప్రమేయం లేకుండా జరిగిన ఒక దారుణ ఘటనతో నేరస్తుడై, కట్టుబాటు ప్రకారం ఏడు సంవత్సరాల ప్రవాసం జీవితం గడవలసి వచ్చి, తన పితృభూమిని వదలి మాతృభూమికి వెళ్లవలసి వస్తుంది. అక్కడి తన మేనమామ గారు తననూ కుటుంబాన్నీ ఆదరించినా, పితృభూమిలో వుండి తాను పొందవలసిన వృద్ధి చేజారిందనే దిగులు మాత్రం వదలదతన్ని. ఈ వాలకం గమనించిన అతని ముదుసలి మేనమామ చెప్పేమాటలు చద్దన్నం మూటలే. అవేమిటో ఆ సందర్భం ఏమిటో ఆ రసం ఏమిటో, నవల చదివినప్పుడు నేను పొందిన మహత్వమైన అనుభూతిని ఇతరులకు దూరం చెయ్యకూడదనుకుని, నేనిక్కడ ప్రస్తావించడం లేదు.
ఈ తెగలలో, సంభాషణా చాతుర్యానికి ఒక విలువైన కళగా గుర్తింపు. ఆ కళను సాధించుకున్న మనిషికి గౌరవం. సామెతలు, పిట్టకథలు, జాతీయాలూ వీళ్ల మాటల్లో కోకొల్లలు. జాతీయత అనేది ఆ తెగవాళ్లు నెత్తిన పెట్టుకుని పూజించే దేవత – ముఖ్యంగా ఒకాంక్వో వరకూ.
అలాంటి ఈ సమాజంలోకి కొత్తగా ప్రవేశిస్తాడు ‘తెల్లవాడు’ – వాడి మతం తోనూ, వాడి న్యాయం తోనూ, ప్రభుత్వంతోనూ. ఈ తెల్లవాడు చాలా తెలివైనవాడు. వాడి తెలివిని వీళ్లు గుర్తించేటప్పటికి తెల్లవారిపోతూవుంటుంది. అలాగని, తెల్ల వాళ్లందరినీ ఒకే గాటన కట్టివేయలేదు రచయిత. తప్పంతా తెల్లవానిదేనా? తెల్లవాని ఒప్పులేమిటి? మొత్తంగా ఏది ఎందుకు ఎలా జరిగింది? చివరికి ఒకాంక్వోకు మిగిలేదేమిటి? ఈ నవల చదివినవాళ్లకు మిగిలేదేమిటి!? వెండితెర(e-book display)మీద చూడండి. లేదా పుస్తకం చదివి చూడండి.
ఎందుకు?
ఇది ఒక మనిషి కథ కనుక.
పుట్టుక నుంచి చావుదాకా ప్రతి మనిషికీ ఎదురయే పరిస్థితుల చిత్రణ ఇందులో వుంది కనుక.
తన చేతుల్లో వున్నవీ, తన చేతుల్లో లేనివీ, పుట్టిన వాతావరణం, సమాజం, జయాపజయాలు, సన్మానాలూ అవమానాలూ, అంతస్సంఘర్షణ, అదృష్ట దురదృష్టాలు, అన్నింటినీ మించిన విధి శక్తీ, …చివరకు మిగిలేది ఏమిటనే ప్రశ్నకు జవాబు వెతుక్కునే సామాన్య మానవునితో దేవుడిలాంటి మిత్రుడొకడు మాట్లాడినట్లుంటుంది కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు. వాటిలో ఒకటి ఈ Things Fall Apart.
కొన్ని తళుకులు:
మనకు ఇలవేలుపు లున్నట్టుగా, ఈ కథలోని తెగ వారికి “Chi” వ్యక్తిగత దైవం. చీ గురించి రెండు సందర్భాల్లో రెండు సామెతలు కనబడతాయి: ఒకటి, Man could not rise beyond the destiny of his chi. రెండు, When a man says yes his chi says yes also.
దోమ ఎప్పుడూ చెవిదగ్గరికొచ్చి రొద చేస్తుంది. ఎందుకో తెలుసా? “నన్ను పెళ్లి చేసుకో”మని చెవిని అడిగిందంట దోమ ఒకసారి. చెవి ఈ మాట విని దొర్లిదొర్లి నవ్వి అన్నదంట, “అస్తిపంజరంలా వున్నావిప్పటికే, ఎన్నాళ్లు బతుకుతా ననుకుంటున్నావు నువ్వు?”. ఈ అవహేళన భరించలేక మౌనంగా వెళ్ళిపోయిన దోమ, అవకాశం దొరికినప్పుడల్లా, “నేనింకా బతికున్నాను చూశావా” అని గుర్తుచేస్తూ వుంటుందంట చెవికి. అదీ కథ. ఇది ఆఫ్రికన్ ఆడవాళ్లు తమ పిల్లలకు చెప్పే కథల్లో ఒకటి. నేనూ ఇదివరకే విని వున్నా నిది. తాబేటిచిప్ప ఎందుకలా పగిలిపోయినట్టు వుంటుందో తెలుసా? దీనికీ ఒక కథ వుంది.
కథలు చెప్పుకోవడానికే కూర్చుంటారు జనం. ఆ చెప్పుకనే కథలో ఒక్క పాటయినా లేదే అని ఆక్షేపణ వినవలసి వస్తుంది ఒకోసారి. ఈ తెగల్లో పాటలకు పెద్ద పీటే. ఒక మహిళ చనిపోయినప్పుడు పాడే పాట, ‘For whom is it well, for whom is it well? There is no one for whom it is well.’
మన పల్లెల్లో ‘బందెలదొడ్డి’ సంగతి తెలిసేవుంటుంది చాలా మందికి. వీళ్లు కూడా, దొంగ గొడ్లు మరొకరి పంటను మేసి నష్టం కలిగిస్తే, దాని యజమానికి పెద్ద జరిమానానే విధిస్తారట.
దొంగావు సంగతి సరే, మా పల్లెల్లో దేవుని గోవు అనేదొకటి వుం(డే)ది. దేవుని పేరిట ఒక ఆవు వుంటుంది, స్వేచ్ఛగా తిరుగుతూ. ఇంటికొస్తే ఏదో ఒకటి పెట్టి పంపాలి. అది పొలాల్లో పడి తిన్నా దాన్ని కొట్టకూడదు. ఇలాంటిదే ‘ఉమోఫియా’ తెగవారికి అత్యంత పవిత్రమైనది ఒక కొండచిలువ. అది ఇట్లో పక్కమీదకొచ్చినా దాన్నేమీ అనరు. అది వచ్చి ఇంట్లో ఎలుకలను పట్టి తినిపోతూవుంటుంది. ఇలాంటి పవిత్రమైన పామును చంపడమే కాదు, కోసి కూరొండుకు తినేస్తాడొక క్రిస్టియన్. అందులోనూ కొత్తగా మతం మారిన క్రిస్టియన్. అతని తండ్రి ఆ తెగలోని గౌరవనీయులలో ఒకడు. “Enoch’s devotion to the new faith had seemed so much greater than Mr.Brown’s, that the villagers called him the outsider who wept louder than the bereaved.” అతని మీద ఆ తెగలోని వాళ్ల ఏహ్యభావాన్ని ఇంతకంటే గొప్పగా చెప్పడానికి వీలౌతుందా? హేట్సాఫ్ టు అచేబె.
ఇలా ఆ పామును తినడానికి సాహసించిన అతని కారణాలేవో అతనికి వుండే వుంటాయి. ఈ ఈనచ్ తగవులాడే తత్వం గురించిన, చిన్న వివరణ: Enoch was short and slight of build, and always seemed in great haste. His feet were short and broad, and when he stood or walked his heels came together and his feet opened outwards as if they had quarreled and meant to go in different directions. Such was the excessive energy bottled up in Enoch’s small body that it was always erupting in quarrels and fights. ఇందులో నాకు నచ్చిన దేమిటంటే, “as if they had quarreled and meant to go in different directions”, ఎందుకంటే సరిగ్గా ఇదే మాట మా పల్లెలోనూ నేను విన్నాను. ఈ కథ మా పల్లెల్లో జరిగిందే అన్నట్టు, దగ్గరితనం కలిగించిన మాట ఇది.
వర్ణనల విషయానికొస్తే, ఒకే ఒక్కటి మాత్రం ప్రస్తావిస్తాను. మిడతల దండు వచ్చి వాలటం. అసలు మిడతలు ఒక దండుగా వచ్చి పడి పంటలను సర్వనాశనం చేసి పోతాయని విన్నానంతే. ఇది చదివితే కళ్లకు కడుతుందా దృశ్యం. ఇంతేగాక, తెల్లవాడు వచ్చి వాలడానికి ఇదొక ప్రతీక లాగ వాడినట్టనిపించింది రెండోసారి చదువుతున్నప్పుడు.
పాముల విషయం చెప్పుకుంటున్నాం కనుక, ఈ తెగవాళ్లు పాము పేరును గట్టిగా చెప్పరు – అది వింటుందేమోనని భయం. ఇలాంటి భయమే నలికిరిని చూస్తే వుంది మన పల్లెల్లో ఇప్పటికీ. నలికిరీ నలికీ నాగుబాము తమ్ముడా, మీ అన్నకు చెప్పొద్దు నా పేరు ఫలానా – అని దానితో మా చిన్నప్పుడు మొర పెట్టుకునేవాళ్లం.
ఈ నవలలో కనిపించే మరో ‘ఉమోఫియా’ నుడి – “There must be a reason for it. A toad does not run in the daytime for nothing. రెండుసార్లు కనిపిస్తుందిది.
వాళ్ల సంభాషణల్లో పొంగే హాస్యానికి మచ్చు: Oracle said ‘Your dead father wants you to sacrifice a goat to him.’ Do you know what he told the Oracle? He said, ‘Ask my dead father if he ever had a fowl when he was alive.’” ఈ మాటలు మాట్లాడుకుంటున్న మగవాళ్లు అందరూ నవ్వుతారు. ఒకాంక్వో కూడా నవ్వుతాడు, తన తండ్రి గుర్తొచ్చి, ఇబ్బందిగా.
నేరుగా ‘థాంక్యూ’ చెప్పడం మన పల్లెల్లో మొన్నమొన్నటి వరకూ అసంబధ్దం. ఇలాంటిదే కనిపిస్తుంది ఇందులో –
“I do not know how to thank you.”
“I can tell you,” said Obierika. “Kill one of your sons for me.”
“That will not be enough,” said Okonkwo.
“Then kill yourself,” said Obierika.
“Forgive me,” said Okonkwo, smiling.“I shall not talk about thanking you any more.”
నేనొక పుస్తకాన్ని వెంటవెంటనే రెండుసార్లు చదవడం ఇధే మొదలు. మొదటి కారణం, నాకు అలా వీలు కుదరడం. కాగా, అసలు కారణం, ఈ కథనం నాకెంతో ప్రీతి కలిగించినది కావడం. అలా రెండోసారి చదివేటప్పుడు, దాదాపు చివరిలో, “ఈ నవల తెలుగులో వస్తే ఎలా వుంటుందో” ననుకుంటూ, ఒకట్రెండు పేరాలను తెలుగులో రాసుకుంటూ పోయాను సరదాగా. ఇలా వచ్చాయవి:
———-
ఆ రాత్రి ‘ఒకాంక్వో’కు సరిగా నిద్ర పట్టలేదు. గుండెల్లోని చేదుమంటకు ఒక పసివానిలోని ఉత్తేజం జతయినట్లుందిప్పుడు. పడకకు చేరే ముందు, యుద్ధంలో తాను ధరించే దుస్తులను కిందకి దించివుంచాడు – ప్రవాసం నుండి తిరిగొచ్చిన తరువాత వాటినతడు తాకి వుండలేదు. నడుం చుట్టూ కట్టుకునే నార వస్త్రాన్ని దులిపాడు. పొడవాటి ఈకలు పొదిగిన శిరస్త్రాణాన్ని, డాలునూ పరీక్షగా చూసుకున్నాడు. అన్నీ తృప్తికరంగానే వున్నాయి.
వెదురు పక్కమీద ఒత్తిగిలుతూ, తెల్లవాని న్యాయస్థానంలో తనకు జరిగిన పరాభవాభవానికి ప్రతీకారం చేసి తీరాలని ప్రతినబూనుకున్నాడు. ‘ఉమోఫియా’ యుద్ధోన్ముఖ అయితే అంతా మంచికే. కాక, వాళ్లంతా పిరికిపందలు కా దలచితేమాత్రం, తనకు తానే పగసాధిస్తాడు. గతించిన యుద్ధా లతని మదిలో మెదిలాయి. ‘ఇసీకె’తో చేసిన యుద్ధం అన్నిట్లోకీ ఉదాత్తమైనది, అనుకున్నాడు. అప్పటికి ‘ఒకూడు’ ఇంకా బ్రతికే వున్నాడు. ‘ఒకూడు’ ఒక సమరగీతం ఆలపించేవాడు – అనితర సాధ్యం ఆ గానం. అతడు యోధుడు కాడు, కానీ ప్రతీ మనిషినీ ఒకో సింహంలాగా మార్చేదతని కంఠం.
ఆ రోజులను తలచుకుంటూ, “సరైన మొనగాళ్లు ఇక లేరు” నిట్టూర్చాడు ఒకాంక్వో. “ఆ పోరులో మేము కోసిన ఊచకోతను ‘ఇసీకె’ ఏనాటికీ మరచిపోదు. వాళ్ల మనుషులను పన్నెండుమందిని మేము హతమార్చితే, వాళ్లు మా వాళ్లనిద్దరిని చంపారు. నాలుగో సంతవారానికల్లా వాళ్లు శాంతిమంత్రం జపించారు. మగాళ్లు మగాళ్లుగా వుంటూవుండిన రోజులవి.”
———-
సుప్రసిద్ధ సాహితీవేత్త టి.యస్.ఇలియట్ మాట -పోనీ క్వోట- ఒకటి చెప్పుకోవాలి, “Although it is only too easy for a writer to be local without being universal, I doubt whether a poet can be universal without being local too.” పందొమ్మితో శతాబ్దపు చివరినాళ్లలోని ఒక ఆఫ్రికా తెగకు చెందిన మనిషి జీవితకథను, ఆ తరువాతి తరానికి చెందిన వ్యక్తి ఆంగ్లం నేర్చుకుని రాస్తే, ఆ తరువాతి తరంలో ఎక్కడో తెలుగు దేశంలో పుట్టిన వాణ్ణి ఆనందిపజేయగలిగిందంటే, అచేబె విషయంలో ఇలియట్ మాట అతికినట్టే కదా! మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అన్నట్టు, పాఠకునికి కావలసింది రసం. చినువా అచేబె నవలాకారుడే కాదు, కవి కూడా. ఒక కవి వచనం రాస్తే అందులో రసాని కేమి తక్కువ!? ఈ నవలా పఠనంలో ఇదమిద్ధం అని చెప్పజాలని రసమేదో నా మనోజిహ్వకు అందింది. నాలుగు మాటలు నాతో మాట్లాడిస్తోంది. మరో వెయ్యి మాటల చిత్రాలు నా మనసుమీద స్పష్టంగానో అస్పష్టంగానో గీసి, నిలిపింది.
Things Fall Apart
Historical Fiction
Paperback
Historical Fiction
Paperback
Amarnath
చాలా బాగుందండీ మీ వ్యాసం. మీకు కలిగిన రసస్పందన తెరలు గా వచ్చి, ఈ వ్యాసం చదివే వాళ్ళని తాకుతున్నట్టుంది. మీరు చూపించిన ఉదాహరణలు అన్నీ నిజంగానే మన పల్లెటూళ్ళ వాతావరణానికి దగ్గరగా వున్నాయి.
థాంక్స్ చెప్పటం ఒక కృతకమైన అలవాటుగా నాకు కూడా అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది (నేను కూడా పాటిస్తున్నప్పటికీ 🙂 )
ప్రతిసారీ కృతజ్ఞతలు అనో ధన్యవాదాలు అనో తెలుగు లో అన్నట్టు గా ఊహించుకుంటే దాని కృతకత్వం అర్ధమవుతుంటుంది.
దీనికి బదులు గా మన సాంప్రదాయం లో దీవించటం ఉందేమో. ఎవరైనా చిన్న సహాయం చేస్తే (మంచి నీళ్ళివ్వడం, lift ఇవ్వడం లాంటివి ) చల్లగా వుండమనో, సుఖంగా బ్రతుకమనో దీవించటం క్రిందటి తరం వాళ్ళలో ఇప్పటికీ కనపడుతుంటుంది.