Out of the wilderness
“Out of the wilderness” అన్నది ప్రముఖ ఇంగ్లండ్ క్రికెటర్ గ్రహాం గూచ్ సారథ్యంలో 1982లో ఒక ఇంగ్లండ్ జట్టు దక్షిణాఫ్రికాలో జరిపిన పర్యటన గురించి గూచ్ రాసిన పుస్తకం. అయితే, ప్రతి జట్టూ బోలెడు పర్యటనలు చేస్తూనే ఉంటుంది. దాని గురించి రాయడంలో అంత కొత్తేముంది? అనొచ్చు. ఈ పర్యటనకొక ప్రత్యేకత ఉంది. ఎనభైలలో దక్షిణాఫ్రికా పై ఆ దేశంలో గల వర్ణవివక్ష కారణంగా అంతర్జాతీయ నిషేధం ఉండింది. అప్పుడు దక్షిణాఫ్రికాతో తక్కిన దేశాలకి క్రీడాసంబంధాలు కూడా అధికారికంగా ఉండేవి కావు. అలాంటి సమయంలో అధికారికంగా “ఇంగ్లండ్” అన్న పేరుతో కాకున్నా,1982లో ఇంగ్లండ్ ఆటగాళ్ళ జట్టు ఒకటి గూచ్ సారథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటించింది. ఈ పర్యటనలో ఆడిన టెస్టులకీ, ఇతర మ్యాచ్‌లకూ అధికారిక గుర్తింపు కూడా లేదు. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా గెలుచింది. అయితే, ఓ పక్క అంతర్జాతీయంగా దక్షిణాఫ్రికాని వెలివేసిన నేపథ్యంలో ఇలా అక్కడికి వెళ్ళినందుకు ఆ తరువాత ఈ జట్టులోని ఇంగ్లండ్ ఆటగాళ్ళనందరినీ మూడేళ్ళపాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెలివేసారు. ఈ పుస్తకం లో గూచ్ చెప్పింది ఈ కథే. ఎందుకు తాము అక్కడికి వెళ్ళారు, వెళ్ళాక, వచ్చాక -వారి అనుభవాలేమిటి? మూడేళ్ళ తరువాత ఎవరెవరి కెరీర్లు ఏమయ్యాయి? – ఇది ఈ పుస్తకంలో చెప్పబడిన కథ. (నేపథ్య చరిత్ర కోసం వికీ పేజీ చూడండీ.)
క్రికెట్ విశేషాలు పక్కన పెడితే, వ్యక్తిగా గూచ్ గురించి ఈ పుస్తకం ద్వారా కొంతవరకూ అర్థం చేసుకోవచ్చు. తన కుటుంబం గురించీ, తన జట్టు గురించీ, తన స్నేహితుల గురించీ – గూచ్ ఎంతగా ఆలోచిస్తాడో ఈ పుస్తకం చదువుతూ ఉంటే అర్థమైంది. అలాగే, ఓ పక్క తామే విమర్శలు ఎదుర్కుంటూ తామే విసుగ్గా ఉన్నప్పుడు, సదరు మనుషులు తమ పనుల వల్ల తమ వారిపై ప్రభావం ఎలా ఉంది? అన్నది పట్టించుకునే అవకాశాలు తక్కువ. కానీ, గూచ్ తను దక్షిణాఫ్రికా వెళ్ళినందువల్ల ఓ పక్క తానెదుర్కుంటున్న విమర్శల గురించి కాక, ఇంగ్లండులో తన భార్య ఎంత బాధపడుతోంది, తన కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏమేం ఎదుర్కుంటున్నారు? వాళ్ళపై దీని ప్రభావం ఏమిటి? అన్నది కూడా ఆలోచించాడు. గూచ్ ఈజ్ ఎ గుడ్ హజ్బెండ్ – అనుకున్నా ఈ ప్రకరణాలు చదువుతున్నప్పుడు. ఇదంతా ఆలొచించి అర్థం చేసుకోడం వేరు, పబ్లిగ్గా ఇలా పుస్తకంలో ఒప్పుకోడం వేరు. గూచ్ అది కూడ చేసాడు. అలాగే, తాము చేసిన ఈ పనితో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా దీనివల్ల లేకలేక సాకారమైన కెప్టెన్సీ కలను పోగొట్టుకున్న ఫ్లెచర్ గురించి మాట్లాడినపుడు – గూచ్ లో మంచి స్నేహితుడు కనిపించాడు. గూచ్ క్రికెట్ నేనెప్పుడూ చూడలేదు. ఒకటీ అరా ఫొటోల మినహా మనిషిని గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు. కానీ, ఈ పుస్తకం చదువుతూ ఉంటే మాత్రం Gooch – the human being చాలా నచ్చేశాడు. అఫ్కోర్సు, గూచ్ ది క్రికెటర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పడం అనవసరం అనుకోండి, అది వేరే విషయం 😉
క్రికెట్ టూర్ సంగతికొస్తే, దక్షిణాఫ్రికా లో క్రికెట్ ఆటపై అందరికీ ఉన్న అభిమానం, శ్రద్ధ, స్కూల్ స్థాయి నుండీ అక్కడ ఈ ఆటకు ఉన్న ఆదరణ, అక్కడ జరిగే పోటీల క్వాలిటీ – వీటి గురించి చదువుతూ ఉంటే, ముచ్చటేసింది. అక్కడి స్కూళ్ళ స్థాయిలోనే ఎంత శ్రద్ధ తీసుకుని కోచింగ్ అదీ ఇస్తారో చూస్తూ ఉంటే, ఇంగ్లండ్ నుండి వెళ్ళిన గూచే ఆశ్చర్యపడ్డాడంటే, ఇక మనలాంటి దేశాల వాళ్ళు ఏమనుకుని ఉండేవాళ్ళో అప్పట్లో. ఇక, ఈ టూర్ గురించి రాస్తున్నంతసేపూ – దక్షిణాఫ్రికా జట్టు ప్రదర్శన గురించి చదువుతూ ఉన్నంతసేపూ – ఒకే ప్రశ్న నా మనసులో మెదులుతూ ఉండింది. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు అవకాశం దొరికుంటే అప్పట్లో నిన్నమొన్నటి ఆస్ట్రేలియా, ఒకప్పటి విండీస్ జట్టులా వీరవిహారం చేసి ఉండేదేమో..అని. ఆ కాలం లో క్రికెటర్లుగా మంచి ఫాంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్ళను తలుచుకుంటే జాలి వేస్తుంది నాకు. అలాగే, రాజకీయాలకూ, క్రీడలకూ, దేశాల మధ్య ఉన్న స్నేహాలకూ, సంబంధాలకూ మధ్య ఉన్న ఈక్వేషన్ల గురించి ప్రశ్నలు… ప్రశ్నలు.. ప్రశ్నలు. ఎందుకు బ్రతుకులోని ఒక పార్శ్వంలోని మార్పులు ఇంకో పక్కని అంత తీవ్రంగా influence చేయాలి..అని.
సరే, ఈ వాదన ఎలాగో తెమిలేదీ కాదు, పుస్తకం.నెట్ దానికి వేదికా కాదు. Out of the wilderness విషయానికొస్తే, చాలా ఆసక్తికరమైన పుస్తకం. మీకు దొరికితే మాత్రం తప్పక చదవండి. ఇది ఇప్పుడు ప్రచురణలో ఉందో లేదో నాకు తెలియదు. ఉన్నా, ఇండియన్ ఎడిషన్ ఉండే అవకాశాలు తక్కువలాగానే తోస్తున్నాయి.
పుస్తకం వివరాలు:
Out of the wilderness
By Graham Gooch
First Published: 1986
Publishers: Harper Collins
Amazon link: here
వెంకటరమణ
రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో లేకున్నా ఆటను వాళ్ళు కాపాడుకున్న విధానాన్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఒకరు చేసిన తప్పుకి భావి తరాలు బలి అవ్వటం అంటే ఇదే. అయినా 1991-92 లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించి ఆడిన మొదటి సిరీస్ లోనే మన వాళ్ళను ఓడించారు. ఆ జ్ఞాపకాలు లీలగా కదులుతున్నాయి. కపిల్ దేవ్ పీటర్ కిర్స్టన్ ను బౌలింగ్ చేసేటప్పుడు బంతి వేయకుండానే రనౌట్ చేయటం, రామన్ సెంచరీ – రవిశాస్త్రి గెలిపించటం … , 1992 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఆట జరుగుతుండగా వర్షం వచ్చి, వెలిసిన తర్వాత అదే దక్షిణాఫ్రికా ఒక బంతికి 21 పరుగులు చేయలేక వెనుదిరిగిన, వారి గురించి గూచ్ ఏమనుకొని ఉంటాడో . వాళ్ళ గురించి ఆలోచింపచేసే ఉంటుంది ఆ మ్యాచ్.