ఏకవీర నవలలో ‘విధి’ , పాత్రలు ఏక కాలం లో సాధించిన విజయం

వ్యాసకర్త: డాక్టర్ యద్దనపూడి కామేశ్వరి
(ఈ వ్యాసం మొదట చినుకు మాసపత్రిక మే 2011 సంచికలో ప్రచురితం. పుస్తకం.నెట్లో ప్రచురించేందుకు పంపినందుకు రచయిత్రికి ధన్యవాదాలు)
********
“అతడు (నవలా రచయిత) నియంత కాడు; పోలీసుకాడు; దైవానికి సృష్టిపట్ల ఎంతటి బాధ్యతో, అతనికి తాను సృష్టించిన వారిపట్లా అంతటి బాధ్యత. తాను సృష్టించిన లోకంలో వ్యక్తుల జీవితాలలో, దైవాన్ని ప్రవేశపెట్టే, గొప్ప నవలాకారుడైన థామస్‌ హార్డీ – ఔదార్యాన్ని కోల్పోయి, రెండోశ్రేణి రచయితగా దిగిపోయాడు. ఆయన నవలల్లో పాత్రలు శిఖరానికి చేతులు చాస్తారు. విధి చేతిమీద ఒక్క వేటు వేస్తుంది. కర్మకి, విధికి, ఒక శక్తికి ఆధిపత్యం అప్పగించి, తన బాధ్యత ఒదులుకుని, తన పాత్రలతో పాటు తనూ పతనం చెందిన మహారచయిత హార్డీ. ఆనాటి సమాజానికి భయపడి, తెలిసుండి కూడా నిజం చెప్పక, విధిని కల్పించి తాను తప్పుకున్న హార్డీలో నిజాయితీ కొంత లోపించిందనే చెప్పుకోవాలి.” -బుచ్చిబాబు
(నవలలో కనబడని పాత్రలు-వ్యా: బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు, పుట 118-119)

థామస్‌ హార్డీ నవలల పైన బుచ్చిబాబుగారు చేసిన ఈ విమర్శను ఆమోదించని వారు కూడా ఉన్నారు. ఆమాటకు వస్తే మొనోథీయిస్టులైన క్రైస్తవులు అలా విధి పాత్రను చర్చించడం సమంజసం కాదని, భగవంతుని సృష్టిని బాగున్నట్లుగానే భావించవలసి ఉంటుందని దానిని మెరుగు పరచవలసిన అవసరంలేదని అంటారు. ఈవాదం క్రైస్తవ విశ్వాసానికి చెందిన ప్రైమరీ కాజ్‌, సెకండరీ కాజ్‌లకు సంబంధించిన చర్చలోకి మళ్ళుతుంది. ఇందువల్ల సాహిత్యంలో విమర్శకులు పేర్కొనే ‘విధి’ని క్రైస్తవ మత అనుయాయులు అందరూ ఒప్పుకుంటారా లేదా, వారిలో ‘విధి’ పట్ల ఏ చర్చి అనుయాయుల నమ్మకాలు ఏమిటి అనేవి విస్తృత మైన అధ్యయనాంశాలు.

ఆంగ్ల సాహిత్యంలో, ఆమాటకు వస్తే ఐరోపా సాహిత్యంలో Fate, Destiny, Providence, Prophecy మొదలైన దృక్పథాలు, వాటిని అనుసరించిన విమర్శలు చాలా సహజం. ఈ విధానం గ్రీకు సాహిత్యం మొదలుకొని అన్ని ఐరోపా సాహిత్యాలలోనూ ఉంది. ఐరోపా పౌరాణిక గాథల్లో ముగ్గురుదేవతలు నేసే మార్మికమైన నేత మానవుని నియంత్రిస్తోందా అనే విషయమే సాహిత్యంలో ‘విధి’పాత్ర చర్చద్వారా స్పష్టమవుతుంది. పైన చెప్పిన మాటలన్నీ ఛాయాభేదాలతో ఇంచుమించుగా ఒకే అర్థాన్ని చెపుతూ ఉన్నాయి. అందులో ఫేట్‌ అనే పదం నుండి ఫాటలిజం అనే ఒక దుఃఖాంతాన్ని సూచించే పదం పుట్టింది. ధామస్‌ హార్డీ నవలల్లో ఇది ప్రధాన పాత్ర వహించిందని విమర్శకులు అంటారు. మానవుని ప్రయత్నం ఏదైనా అది ముందుగా నిశ్చయింప బడిన విధివైపుకే దారితీస్తాయని, అందు వల్ల మానవుడు తన జీవితంలో ఉందని అనుకుంటున్న ‘ఎంచుకొనే స్వాతంత్ర్యం’ ఒక బూటకమనీ ఈ వాదం సారాంశం. ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఇటువంటివి లేక పోలేదు. గొప్ప అవతార పురుషుల పుట్టుకను, వారి జీవనమార్గాలను ఋషులు ముందుగానే దర్శించి చెప్పటమేకాదు, కొన్ని సందర్భాల్లో రాక్షసుల మరణ కారణాలను అశరీరవాణి చెప్పటం, కథ అందుకు అనువుగానే నడవటం జరుగుతూ ఉంటుంది. కంసుడు తన విధిని ఎదిరించే అనేక ప్రయత్నాలు చేసినా చివరకు అతడు కృష్ణుని చేతిలో హతమౌతాడు. అయితే ఆ ప్రయత్నాలన్నీ దుష్కర్మలే కావటం ఇక్కడ గమనార్హం. మార్కండేయుడు మహాశివుని శరణుకోరి, తపస్సు చేసి తన విధివ్రాత అయిన మరణాన్ని తప్పించుకొనటమే కాక చిరంజీవిగా వర్ధిల్లాడు. ఇటువంటి కథలు ఎన్నో ప్రాచీన భారతీయ పౌరాణిక సాహిత్యంలో కనిపిస్తాయి.

హిందువుల విశ్వాసాల ప్రకారం భగవంతుడు మానవులకు వారి వారి కర్మ ఫలాలను అందజేస్తాడు. అలా అందజేయడంలో తన నియమాన్ని అమలు జరుపుతాడు. మానవునికి మంచి చెడులలో తన ఇష్టానుసారం ఏది కావాలంటే దానిని ఎంచుకొనే స్వాతంత్ర్యం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కార్యకారణ సంబంధంపై ఆధార పడి ఉంది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. చేసిన కర్మ ఎటు వంటిదైనా దాని వెనుక ఉన్న ఉద్దేశమే ఫలితాన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. ఇది మానవుడు తాను చేసిన కర్మల ఫలితాలను తానే అనుభవించాలని అంటుంది. అంటే తన కష్టసుఖాలకు తననే బాధ్యుని చేస్తుంది. ఈ సిద్ధాంతం జన్మపరంపరకు విస్తరించి వర్తిస్తూ ఉంటుంది. మానవుని జీవితంలో అతని ప్రమేయం లేకుండా జరిగే ఘటనలు ఈ గతకర్మఫలితాలుగానే హిందువులు పరిగణిస్తారు. ఏ పూర్వ కర్మఫలితాన్ని తాను అనుభవిస్తున్నాడో మానవునికి తెలియదు కనుక, ఆ తెలియని దాన్ని ‘విధి’ అని వాడుకలో అంటూ ఉంటారు. మానవుని జాతక చక్రం అతని పూర్వకర్మల ఫలితాలను సూచించే సూచిక మాత్రమే. మానవుడు శాస్త్ర సహాయంతో దానిని ముందుగా గుర్తించి, తన ఇచ్ఛాశక్తితోనూ (willpower), భగవంతుని శరణాగతితోనూ ఆ సూచనను అంటే తన అధీనంలో లేక జరిగే పరిణామాలను నివారించటమో లేదా తగ్గించుకోవటమో చేయటం సాధ్యమే! ఈ చర్చ వల్ల హిందువుల విశ్వాసంలోని ‘విధి’ , క్రైస్తవుల విశ్వాసం లోని ‘విధి’ ఒకటి కాదని తేలింది.
“మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును”(గలతీయులకు-ఆరవ అధ్యాయము7-8) అనే బైబిలు వాక్యాలు ఈ కర్మసిద్ధాంతానికి దగ్గరగా ఉన్నాయి. కానీ ఈ అన్వయాన్ని క్రైస్తవులు అంగీకరించక పోవచ్చును. సాహిత్య అధ్యయనానికి స్థూలమైన ఈ అవగాహన చాలు. లోతైన మతసిద్ధాంత చర్చలు విషయాన్ని పక్కదారి పట్టిస్తాయి.

“1947 పూర్వం వీరేశలింగం, చిలకమర్తి, ఉన్నవ ,చలం, విశ్వనాథ వంటి చెప్పుకోదగ్గ రచయితలందరూ వ్యక్తి బాధ్యతకే ప్రాధాన్యం ఇచ్చారు. అనూచానంగా వస్తున్న ఆచారాలని సంస్కరించడానికి గాని, స్వేచ్ఛనూ సుఖాన్నీ అనుభవించటానికి గానీ ధర్మవ్యతిక్రమణకు గాని, ధర్మాచరణకుగానీ వ్యక్తిదే బాధ్యత అనే ధోరణిలో పాత్రచిత్రణం జరిగింది. ఒక్క ఏకవీర నవలలో ‘ఘటన’కు పూర్తిప్రాధాన్యం ఇవ్వటం చూస్తాం. అక్కడ కూడా ఘటనను ఎదిరించి చివరిదాకా వ్యక్తిపోరాడుతూ ఉండటం కనిపిస్తుంది. ఇలా పాత్రచిత్రణం జరగడానికి కారణం 1947 పూర్వం నవలలకి ఆధారభూతమైన సంస్కరణవాదం, ఆధ్యాత్మికవాదం, స్వేచ్ఛాప్రేమ సిద్ధాంతం వంటి అతివాద కాల్పనికత, అన్నీకూడా వ్యక్తినిష్ఠమైనవీ, వ్యక్తికి ప్రాధాన్యాన్ని యిచ్చేవి కావడమే.”- ఆర్‌.ఎస్‌.సుదర్శనం-తెలుగు నవల-పాత్రచిత్రణము; వ్యా మహతి; యువభారతి ; పుట.105-106. 1972

ఏకవీర నవల వెలువడిన కాలం తెలుగు సాహిత్యంలో ఎన్నో విప్లవాత్మక భావాలు వ్యక్తమవుతున్న కాలం. విదేశీయుల రాజ్యాధికారంతో పాటుగా అప్పుడు నెలకొని ఉన్న అన్ని వ్యవస్థలను రచయితలు ప్రశ్నిస్తున్నకాలం. ఉన్నవ మాలపల్లి, చలం దైవమిచ్చిన భార్య, మైదానం ఏకవీర నవల కంటే ముందే వెలువడ్డాయి. స్పందన, చేవ గల రచయితలందరూ తమ భావాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్న కాలమది. ఆధునిక తెలుగు సాహిత్య సృజనకారులందరూ ఆంగ్లసాహిత్యాన్ని బాగా చదినవినవారే. వారి సాహిత్య సృజనపై ఆ దృక్పథ ప్రభావం పడి ఉండే అవకాశం ఉంది. వివాహ వ్యవస్థ కు ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొన దలచి విశ్వనాథ ఏకవీర నవలను రచించారు అనిపిస్తుంది. అప్పుడు బాగా ప్రచారంలో ఉన్న స్వేచ్ఛాప్రణయ సిద్ధాంతాన్నిఎదుర్కొంటూ, మనువూ మనసు ఒకేచోట ఉండాలని ప్రబోధిస్తూ చేసిన ఈ రచన తెలుగుసాహిత్యంలో అమూల్యమైనదిగా మిగిలిపోయింది. ఈ నవలలో విధి వ్యవస్థా ధర్మానికి అనుగుణంగా పని చేయటాన్ని మనం గమనించవచ్చు. ఈ నవలలోని విచిత్రమేమంటే, ఇందులో వ్యక్తిధర్మానికి, వ్యవస్థా ధర్మానికి సంఘర్షణ కలుగుతుంది. కానీ వ్యక్తులు తమ విలువలను పోగొట్టుకోకుండానే వ్యవస్థాధర్మం గెలుస్తుంది. అందువల్ల ఏకవీర నవలలోని గెలుపు ఏకకాలంలో వ్యక్తిదీ, వ్యవస్థదీ కూడాఅయింది. అంటే వ్యక్తీ, విధీ కూడా విజయాన్ని సాధించేలాగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ నవలను రచించారు. ఈ విచిత్రం ఎలా సాధ్యపడిందో వివరంగా పరిశీలించవలసి ఉంది. ఈ పరిశీలన ఆ నవలలో విధికి ఎదురీదిన పాత్రల చరిత్రను, ధర్మరక్షణలో వ్యక్తిబాధ్యతను నిరూపిస్తుంది. ఆర్. ఎస్‌ సుదర్శనంగారు అన్నట్లుగా ఈ నవలలో ‘ఘటన’ కు పూర్తిప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, వ్యక్తులు దానికి లొంగకపోవటమే ఆనవలకు ఒక ప్రత్యేతను కలుగజేస్తోంది. ఇది వ్యక్తి విజయానికి హారతి పడుతుంది. ఈ కారణం వల్ల స్థూలంగా చూస్తే దుఃఖాంతంగా కనిపించే ఈ నవల నిజానికి దుఃఖాంతం కాదు.

ఏకవీర నవల హిందూ విశ్వాసాలకు అనుగుణమైన నవల, హిందూ మత స్థాపనకు ప్రాధాన్యమిచ్చి నవల అయినందు వల్ల అందులో ‘విధి’ పాత్రను అధ్యయనం చేసేటప్పుడు హిందూ దృక్పథాన్ని అనుసరించి పరిశీలించటం సమంజసం.

ఏకవీర నవలలో పాత్రల అధీనంలో లేని అంశాల వల్ల వాటి పరిణామంలో వచ్చిన మార్పులు ఏమిటి- ఆ పరిణామం ఆ పాత్రల గొప్పతనాన్ని తగ్గించిందా పెంచిందా అనే అంశాన్ని పరిశీలిద్దాం. అలా పరిశీలించినప్పుడు విధి నవలాగత పాత్రలతో ఎలా ఆడుకుందో, ఆ ఆటలో పాత్రలు గెలిచాయో, విధి గెలిచిందో స్పష్టమౌతుంది. ఏకవీర నవలలోని కథ అందరికీ సుపరిచితమే అనే దృష్టితోనే ఈ వ్యాసాన్ని కొనసాగిస్తాను. ఈ నవలలో ప్రేమించుకున్న రెండు జంటలు ‘విధి’ వశాత్తు తారుమారౌతాయి. ప్రేమ విఫలమైనప్పుడు మరొకరిని వివాహమాడటం అన్నది సహజమే. అయితే ఈ కథలో ఇద్దరు స్నేహితులు ఒకరు ప్రేమించిన మగువను మరొకరు వివాహమాడటం జరిగింది. ఈ అంశం ఈ కథకు ఒక ప్రత్యేకతను కలిగించింది. దీన్ని పాత్రల ప్రమేయం లేకుండా జరిగిన విషయంగా గ్రహించవచ్చు. దాన్ని విధి అని, లేదా ఘటన అనీ మనం అంగీకరిస్తే ఇప్పుడు పాత్రల స్వభావంపై, వారి నైతిక విలువలపై, ఆ ఘటన ప్రభావం ఎలా ఉందో పరిశీలనాంశం అవుతుంది.

ఈ నవలలో ఏకవీర, మీనాక్షి, కుట్టాను, వీరభూపతి అనే నాలుగు పాత్రల కథ వర్ణించ బడింది. ఈ నాలుగు పాత్రలూ ఉత్తమ విలువలు కలిగిన పాత్రలు. ధర్మబద్ధమైన జీవితాలను గడపటమే వారి జీవిత ధ్యేయం. పురుషపాత్రలు స్నేహానికి ప్రాణం పెట్టే వ్యక్తులు. మిత్రుల క్షేమాన్ని కోరేవారు. తమ శక్తి కొద్దీ వారికి సహాయ పడేవారు. ఇలాటి ఈ నలుగురూ తారుమారు వివాహాల వల్ల వారి ప్రధాన విలువ అయిన ధార్మిక జీవనాన్నిగడిపటానికి అవకాశంలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఆ పరీక్షను వారు ఎలా అధిగమించారు? ఆక్రమంలో వారి వ్యక్తిత్వాలు బలహీన పడ్డాయా-రాటుతేలాయా? ఆ పరిస్థితి వారివారి వ్యక్తిగత సాంసారిక జీవనంపైన మాత్రమే కాక, స్నేహం పట్ల వారికి ఉన్న పవిత్రమైన భావంపైనా ఎలాటి ప్రభావాన్ని చూపిందో పరిశీలించవలసి ఉంది. అలాగే ఇంతటి సంఘర్షణ వారి వృత్తి జీవితాలపైనా, ఇతర సాంఘిక కార్య కలాపాలపైనా, మానవుల మధ్య ఉండ వలసిన సుమానుష సంబంధాల పైనా ఎలా ప్రభావాన్ని చూపిందో అధ్యయనం చేయ వలసి ఉంటుంది.

అలా జంటలు తారుమారు అయిన విషయం ఆనలుగురికీ తెలియకుండా ఉండటం అన్నది కథలో మరో ముఖ్యమైన అంశం. ప్రేమించిన జంటలు తమ సామాజిక హోదాను దాటి, వాటికి వ్యతిరిక్తమైన చోట తమ ప్రేమను నిలిపాయి. రాకుమారి ఏకవీరకు, రాకుమారుడు కుట్టానుకు వివాహం కావటం ఎంత సహజమో, సామాన్య రైతుకుటుంబానికి చెందిన వీరభూపతికి, సామాన్య కుటుంబానికి చెందిన మీనాక్షికి వివాహం జరగటం అంతే సహజం. ఇది విధి బలీయత అని చెప్పలేము. కేవలం సహజ పరిణామం. అంతే కాక ఏకవీర అంతఃపురవాసం ఆమెను ఇతర పాత్రలనుండి దూరం చేసి, జరిగిన తారుమారు వివాహల వ్యథను కప్పివేయటం, కథలో మలుపులను కలిగించే మరొక ముఖ్యాంశం. అంతఃపురవాసం కూడా ఆనాటి సామాజిక ఆచారమే కాని ఈఘటనకు విధి బలీయత మాత్రమే కారణం అనటానికి లేదు. కథలో ఉత్కంఠను నిలపటానికి రచయిత ఎంచుకొన్నకాలం, ఆయన ప్రతిభ మాత్రమే ఇందుకు కారణం.
ఈ నాలుగు పాత్రలూ కూడా నైతిక విలువలకు కట్టుబడిన పాత్రలు. మీనాక్షి, కుట్టానులది గాఢమైన ప్రేమ కావటం వల్ల వారు జీవన సహచరులతో దాంపత్య ధర్మాన్ని నెరవేర్చేందుకు అంత త్వరగా సిద్ధపడలేక పోయారు. వారి ప్రధాన విలువ ఏకత్రానురాగ సూత్రం. ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ అనే నియమమే ఏకత్రానురాగ సూత్రం. మనసు, మనుగడా ఒకరితోనే కాబట్టి మనసు కుదుట పడే వరకు వారు సమయం కోరుకున్నారు.

ఏకవీర, వీరభూపతులది కేవలం వలపు. రూపవ్యామోహం. వివాహ వాస్తవికతకు వారు త్వరగా కట్టుబడటానికి అది దోహదం చేసింది. వారు కూడా ఏకత్రానురాగసూత్రానికి కట్టుబడ్డవారే. ఏకవీర పూర్వ ప్రణయాన్ని వదలి, వివాహానికి కట్టుబడి స్వచ్ఛమైన మనసుతో భర్త సేవకు సిద్ధపడింది. వీరభూపతి ప్రేమ ఎడారిలో నీటి ప్రవాహంలాగాఅదృశ్యమైపోయింది. అతడు, మీనాక్షిని తన వంశాభివృద్ధికోసం స్వీకరించటానికి సిద్ధ పడ్డాడు. ఏ ఒక్క జంటలోనూ ఏ ఇద్దరిదీ ఒకే మాట కాక పోవటం వల్ల ఏ జంట కాపురమూ సవ్యంగా జరగలేదు.ఈ నలుగురి పరిస్థితీ ఇలా విషమించటానికి వారి మనసులపై వారికి నియతిలేక పోవటమే కారణం. అంతేకాని ఇందులో విధి బలీయత ఏమీలేదు.

కథ నడవగా, కుట్టానుకు తన స్నేహితుని భార్యే తన పూర్వ ప్రణయిని అనే విషయం తెలిసింది. అతడు కలత చెందాడు. రాత్రి తెల్లవార్లూ మథన పడ్ఢాడు. తెల్లవారే సరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. పసుపు కుంకుమలతో, చీర సారెలతో మిత్రుని ఇంటికి తరలి వెళ్ళాడు. విషయాన్ని స్పష్టం చేశాడు. అతని వైఖరి మీనాక్షి గుర్తించింది. పరిణామానికి సిద్ధపడింది. వీరభూపతికి విషయం పట్ల ఎటు వంటి హెచ్చరిక లేదు. ఆ సంఘటనకు అతడు ఏమీ సిద్ధపడిలేడు. కానీ కుట్టాను విషయాన్ని చెప్పగానే, ప్రస్తుతం తాను తమ అనుబంధాన్ని సోదరబంధంగా పరిగణిస్తున్నాను అని స్పష్టం చేయగానే వీరభూపతి కుట్టానును అభినందించాడు. అతనిని ఋషి అని పొగిడాడు. సుందరేశ్వరుని అవతారంగా పరిగణించాడు. అంతేకాని వారిరువురపై ఎటువంటి దుశ్చర్యకు పాల్పడలేదు. మీనాక్షిని కించ పరచలేదు. స్నేహితుని దూరం చేసుకోలేదు. ఈ సంఘటనలో మూడు పాత్రల ఉదాత్తత పెరిగిందేకాని తగ్గలేదు. విధి చేసిన పరిహాసం పాత్రల వ్యక్తిత్వాలను బలపరచింది.

ఈ నవలలో పాత్రల ప్రమేయం లేకుండా జరిగిన మరొక ఘటన కుట్టానుకు భార్య పట్ల తన ప్రేమను తెలియజెప్పే అవకాశం రాకపోవటం. అతడు రాచకార్యంపై మధురను విడిచి వెళ్ళటం. రాచకార్యం పై వెళ్ళిన కుట్టాను తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాడు. తన వృత్తి బాధ్యతను, తన వ్యక్తిగత జీవనసంఘర్షణ ప్రభావితం చేయకుండా జాగ్రత్తపడ్డాడు. తిరిగివచ్చి తన మిత్రునికి, భార్యకు మధ్య జరిగిన ఘటనను తెలుసుకున్నాడు. కానీ దాన్ని లెక్కచేయలేదు. మేలిముసుగుతో అంతఃపురంలో ఉండవలసిన రాకుమారి వీథికెక్కి మత చర్చ జరిపిందని తెలుసుకున్నాడు. కానీ తన ఉన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఆమె పాండిత్యానికి సంతోషించాడు. ఉప్పొంగిన ప్రేమతో భార్యను కౌగలించుకొన్నాడు. అతడు ఎక్కడా తన వ్యక్తిత్వానికి మచ్చ రాకుండానే వ్యవహరించాడు. ఆ ఘటన అతని వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని కలిగించింది. విధి అతనిని లొంగదీసుకోలేదు.

ఈ సందర్భంలో మీనాక్షి , ఏకవీర, వీరభూపతుల ప్రవర్తనను పరిశీలిస్తే కథానాయిక ఏకవీరకు తన అంతరంగ పరిస్థితిని గురించిన అవగాహనకు వీరభూపతి కౌగిలింత తోడ్పడింది. ఆమె ఇక కుట్టాన్‌ భార్యగా తన అస్తిత్వాన్ని కొనసాగించలేదు. మనసా తన సామాజిక అస్తిత్వాన్ని వదలివేసింది. ఒకానొక శూన్యస్థితిని పొందింది. ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళలేదు. వీథిలోనే నిలబడిపోయింది. ఆమెను భగవంతుడైన చొక్కనాథుడు ఆవహించాడు. రాబర్ట్‌ డి నోబిలికి ఆమెకు వాదం జరిగింది. మతమార్పిడులను ఖండించి సనాతనధర్మ స్థాపనకు ఆమె దోహదం చేసింది. అతడు నగరం వదలివెళ్లాడు. భగవంతుని నిష్క్రమణతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను పరిచారికలు అంతఃపురంలోనికి కొనిపోయారు. తెల్లవారి కుట్టాను పంపిన నగను పరిచారికలు ధరింపజేశారు. దాని స్పర్శ ఆమెకు కత్తివాదర తగిలినట్లు తోచింది. అతని ఇంటిలో నిలబడలేక, బాధను తాళలేక పెరటిలో అరటిచెట్టు వద్దనిలబడింది. కుట్టాను ఆమెను మహాప్రేమతో సమీపించినప్పుడు, ఆమె ఒడబడలేదు. జరిగిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అతనికి చెప్పింది. ఆమెకు తన స్పర్శగుణ తీవ్రతను గురించిన అవగాహన ఉంది. కుట్టాను కౌగిలి తనకు ప్రాణాంతకమనే తెలివిడి ఉంది. అందుకే ఆమె వైగై నది వద్దకు పరుగుతీసింది. అతని కౌగిలిలో తన అంతరంగ స్వచ్ఛతను ప్రకటిస్తూ మరణించింది. అది ముమ్మాటికి ఆత్మహత్య కాదు. ఆమె ధర్మబద్ధతకు నిదర్శనం. ఆమె మరణం ఆ పాత్ర వైఫల్యాన్ని చూపదు. భగవంతుడు పెట్టిన పరీక్షలో ఆమె గెలుపునే చూపింది. ఆమె తన ఏకత్రానురాగ సూత్రమనే విలువను కోల్పోలేదు. భర్త ఆదరణను కోల్పోలేదు. సమాజగౌరవాన్ని కోల్పోలేదు. ఆత్మసంస్కారాన్ని కోల్పోలేదు. అందువల్ల విధి ఆమెను ఓడించలేదు. ఆమె దానికి ఎదురొడ్డి నిలబడింది. సమాజానికి తన వంతు సేవను చేసి ఈ లోకాన్ని వదలి వెళ్ళింది.

వీరభూపతి కూడా తన తప్పిదానికి, క్షణమాత్రమైన తన ఉద్రేకానికి పశ్చాత్తప్తుడయ్యాడు. భార్య తెలియజెప్పిన మీదట మిత్రునికి చేసిన ద్రోహాన్ని తెలుసుకొని చింతించాడు. ప్రాయశ్చిత్తంగాను, మలిన మానసంతో, శరీరంతో గృహస్థజీవితాన్ని స్వీకరించలేని, కొనసాగించలేని నిస్సహాయతతోనూ అతడు సన్యాసం స్వీకరించాడు. హిందువుల సన్యాసం అంటే అప్పటిదాకా ఉన్న వ్యక్తిత్వాన్ని వదలి, పేరు మొదలుకొని సమస్తాన్నీ వదలుకొని కొత్త విరక్త జీవితాన్ని ప్రారంభించటం. అప్పటి వరకూ ఉన్న అస్తిత్వాన్ని వదలు కోవటమంటే మరణంతో సమానమే. అతడు మనసులేని సంసారం కంటే సన్యాసమే మేలని తలచాడు. అతడు కూడా ఆవిధంగా తన ఏకత్రానురాగసూత్రమనే విలువను కోల్పోలేదు. కోల్పోయి కుహనా కుటుంబాన్ని కొనసాగించి సమాజానికి ద్రోహం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే సమాజానికి ఉపకరించలేని తనను తానే సమాజ జీవన ప్రధాన స్రవంతి నుండి తొలగించుకున్నాడు.

పేదింటి పిల్ల మీనాక్షి, తనకు ఇష్టంలేని వివాహం జరిగినప్పటికీ, ఎంత నిస్సహాయురాలైనప్పటికీ, తన ఏకత్రానురాగసూత్రాన్ని వీడలేదు. మనసులో పూర్వ ప్రియుని ఉంచుకొని, భర్తతో గార్హస్థ్య జీవనాన్ని నిరాకరించింది. ఆ విధంగా మీనాక్షి కూడా విధిని జయించి, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొన్నది. కుట్టాను తన పట్ల, తాను కుట్టాను పట్ల మానసిక బంధాన్ని సోదరబంధంగా మలచుకొన్నతరువాత మాత్రమే ఆమె మనసా వీరభూపతినే భర్తగా స్వీకరించింది. తన భర్త పూర్వప్రేయసే కుట్టాను భార్య అని గ్రహించినా ఆ విషయాన్ని గుంభనంగానే ఉంచింది. అలా చేయటం వల్ల ఆ మిత్రుల మధ్య తలెత్తగల ఇబ్బందికర పరిస్థితిని పరిహరించింది. అతని పరఙ్ముఖత్వాన్ని ఓపికగా భరించింది. భర్త, ఏకవీరల కౌగిలింతను ప్రత్యక్షంగా చూచినా ఉద్విగ్నురాలు కాలేదు. కానీ ఇరువురిలో ఎవరినీ ఆమె నిందించలేదు. ఏ ఉద్విగ్నతా లేకుండా విషయాన్ని వారికి తెలియపరచింది. సాధారణ స్త్రీలాగా ఆమె వారితో జగడమాడలేదు. ‘నీవెంత ఉద్విగ్న ప్రణయినివి’ అని మాత్రమే ఏకవీరతో వ్యాఖ్యానించింది. అక్కడ ఉద్విగ్నత మాత్రమే ఆ పరిణామానికి కారణం. ఆమె కూడా తన మానవసంబంధాల పట్ల అప్రమత్తంగానే ఉంది. ఏ బంధమూ చెడిపోలేదు. ఏ వ్యక్తితోనూ ఘర్షించలేదు. ఓపికగా భగవంతుని పరీక్షను తన శక్తికొద్దీ ఎదురొడ్డి నిలచింది.

ఈ విధంగా నవలలోని నాలుగు పాత్రలు తమ తమ జీవితాలలో, తమ ప్రమేయం లేకుండా ఎదుర్కొన్న సంఘటనలు, మలుపులు వారి వారి వ్యక్తిత్వాలను మెరుగు పరచాయి. వారి విలువలను వారు నిలబెట్టుకున్నారు. అంటే విధి పెట్టిన పరీక్షలో వారు విజయులయ్యారు. అదే సమయంలో వ్యవస్థా ధర్మానికి ఎటువంటి ఆఘాతమూ కలుగలేదు. ఆ పాత్రలు అలా ఆఘాతాన్ని కలుగకుండా ఉండటానికే తమ జీవితాలను మీదుకట్టారు. అలా విఘాతం కలుగ నంత వరకే సాధారణ జీవితాన్ని కొసాగించాయి. విఘాతం కలిగినప్పుడు, ఏకవీర ప్రాణాలనే వదలివేసినది, వీరభూపతి సన్యాసం స్వీకరించాడు. కుట్టాను , మీనాక్షులు అటువంటి పరిణామాలకు లోను కాకపోవటానికి వారు తమ ఆత్మధర్మాన్ని వీడకపోవటమే కాదు, వ్యవస్థాధర్మాన్ని కూడా దాటక పోవటమే కారణం. ఈ పరిణామాలు ఇలా జరగటానికి వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, పైకి వ్యక్తి, వ్యవస్థల మధ్య సంఘర్షణగా కనిపిస్తున్నప్పటికీ, నిజంగా ఏకవీర నవలలోని పాత్రలు వ్యవస్థాధర్మానికే కట్టుబడి ఉండటానికి చివరి వరకూ కృషిచేశాయి. ఆ పాత్రలకు ఉన్న విలువలలో, తమ అంతరాత్మకు విరుద్ధంగా నడచుకోక పోవటంతో పాటు, వ్యవస్థకు కట్టుబడి ఉండటంకూడా ఒక విలువే! ఈ కారణంగానే ఈ నవలలో, విధి, పాత్రలు రెండూ విజయాన్ని సాధించటం జరిగింది.

విశ్వనాథ సత్యనారాయణగారు భగవంతుని ఈ నవలలో ప్రత్యక్షంగా ప్రవేశ పెట్టారు. ఆయన అనుమతితో ఏకవీరను ఆవహించిన భగవంతుడు చొక్కనాథుడు ఆమె పాండిత్యాన్ని తనకు ఇష్టమైన సనాతన మతస్థాపనకు ఉపయోగించుకొన్నాడు. ఇలా చేయటం వల్ల విశ్వనాథ సత్యనారాయణగారు ఏ బాధ్యత నుండీ తప్పించుకోలేదు. తాను ఏ విలువలతో తన పాత్రలను సృష్టించారో ఆ విలువలను ఆ పాత్రలు కోల్పోకుండా జాగ్రత్త వహించారు. ‘విధి’ పెట్టిన పరీక్షలో ఆ పాత్రలు తమ వ్యక్తిత్వాలను బలపరచుకొన్నాయి. ‘ఏకవీర’ లోని నాలుగు పాత్రలూ, ధర్మానికి కట్టుబడ్డపాత్రలు. నైతిక విలువలు కలిగిన పాత్రలు. చాలా బలమైన ఇచ్ఛాశక్తి (willpower) కలిగిన పాత్రలు. కుట్టాను తన వృత్తిధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహించినట్లు, ఏకవీరను ఆవహించిన చొక్కనాథుడు ఆమె జీవితాన్ని సామాజిక ప్రయోజనానికి ఉపయోగించుకొన్నట్లు విశ్వనాథ రచించి, భగవంతుడు తన సృష్టికి తానే న్యాయం చేసుకొన్నట్లుగా నిరూపించారు. ఆ నిరూపణతో పాటుగా తన నవలాసృష్టికి తాను సంపూర్ణన్యాయం చేసుకొన్నారు.

You Might Also Like

4 Comments

  1. akella raviprakash

    విశ్వనాధ వారి వేయిపడగలు చదివాను ,ఏకవీర చదవలనిపింప చేస్తోంది మీ వ్యాసం
    చాల మంచి భాష శైలి మీకు స్వంతం , ఇంకా విసృతంగా రాయాలి మీరు

  2. Halley

    ఎప్పటి నుంచో ఏకవీర చదవాలి చదవాలి అని అనుకుంటున్నాను కానీ కుదరలేదు . మీ వ్యాసం చదివాక అర్థం అయ్యింది ఎంత మిస్ ఐపొయనో అని . వీలు చూసుకొని ఆ నవల చదివి మీ ఈ వ్యాసం మళ్లీ చదువుతాను . ధన్యవాదాలు !

  3. kv ramana

    ఏకవీర ఎప్పుడో చదివాను. సినిమా రెండు మూడుసార్లు చూశాను. కథ వరకు గుర్తే. అందులోని లోతులు గుర్తులేవు. మీ పరిశీలన బాగుంది. విశ్వనాథ వారి హృదయాన్ని పట్టుకుని, ఆయనకు న్యాయం చేశారనిపించింది. అభినందనలు.

    1. kameswari yaddanapudi

      ఏకవీర-విశ్వనాథ కథన కౌశలం అనే పేరుతో నేనురచించిన పుస్తకాన్ని ఎమెస్కో వారు ప్రచురించారు. అలాగే ఏకవీర నవలకు ఆపేరే ఎందుకు పెట్టారు అనే విషయాన్ని చర్చించే నావ్యాసం తెలుగువిశ్వవిద్యాలయం ప్రచురణల విభాగంలో దొరికే ప్రపంచతెలుగుమహా సభల ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. ఆ నవల సినిమాగా ఎందుకు విఫలమైందో ఎమెస్కో వారి ప్రచురణ తెలుపుతుంది. మీకు ఆసక్తి ఉంటే చూడండి. వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.

Leave a Reply