రావీ పార్ – గుల్జార్ కథలు

(ఈ నెలనుండి ప్రతి నెలకో, రెండు నెలలకో, నెలలోని మొదటి వారంలో ఒకే రచయిత లేక ఒకే అంశానికి చెందిన పుస్తక పరిచయాలు – కనీసం మూడు – చేయాలని ప్లాన్. అందులో భాగంగా ఈ వారం హింది, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో వెలువడిన గుల్జార్ కథలను గురించిన పరిచయ వ్యాసాలను పూర్ణిమ, నాగిని, తృష్ణ అందజేస్తున్నారు. – పుస్తకం.నెట్)

రెండేళ్ళనాటి ’బెంగళూరు లిటరరీ ఫెస్టివల్’లో గుల్జార్ సెషన్ ఒకటి జరిగాక, ప్రేక్షకులను ప్రశ్నలు అడగమన్నప్పుడు ఎక్కువగా సినిమాలకు సంబంధించిన ప్రశ్నలే అడిగారని, “అలా అయిపోయింది జీవితం. గంట నుండి కవిత్వం వినిపించినా, చివరకు నన్ను సినిమా మనిషిగానే గుర్తుంచుకుంటారు” అని అన్నారు. సినీగేయ రచయిత, సినీ దర్శకుడు కాకుండా ఓ కవిగా జనాలు తనను గుర్తుపెట్టుకోవాలని ఆయన కోరికని ఆయన మాటలు శ్రద్ధగా వింటే అర్థమవుతుంది. ఆయన కవా? మంచి కవా? గొప్ప కవా? అన్న ప్రశ్నలకు ఎవరి సమాధానాలు వారికుంటాయి. అలానే ఆయన మంచి కథకుడా? గొప్ప కథకుడా? అంటే కూడా, ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. ఈ వ్యాసం నా అభిప్రాయం.

సాహిత్య ప్రక్రియనే కాదు, ఏ కళకైనా సరే, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. కళాకారుడిని తూచేవాళ్ళు వాటిని పరీక్షిస్తారు, పరికిస్తారు. ఆనక మార్కులు వేస్తారు. కథల విషయంలో అలా మార్కులేసేంత సీన్ నాకు లేదు. ఓ కథ చదివినప్పుడు అది నన్ను ఆకట్టుకుందా? ఆలోజింపజేసిందా? ఆపైన కథంతా మర్చిపోయినా, అది రేకెత్తిచ్చిన భావాలు మాత్రం మరుపునకు రాలేకపోయాయా? అన్నవే నాకు ముఖ్యం. ఆ లెక్కన చూసుకుంటే గుల్జార్ రాసిన కథలు నాకిష్టం, చాలా ఇష్టం.

నాలుగేళ్ళ క్రితం మళ్ళీ హింది పుస్తకాలు చదవాలనుకున్నప్పుడు తీసుకున్న పుస్తకాల్లో గుల్జార్ కథల సంకలనం “రావీ పార్” ఒకటి. వీటిని “ఉర్దూ” నుండి “హింది”లోకి “అనువదించా”రని అప్పట్లో అనుకునేదాన్ని. అరబిక్ స్క్రిప్ట్ చదవటం నాకు రాదు. దేవనాగరి లిపిలో ఈ కథలుండడం నాబోటివారికి అనువాదాల జోలికి పోనవసరంలేకుండా ఓ చక్కని వెసులుబాటు.

ఈ సంపుటిలోని కథలన్నింటిలో నాకు నచ్చిన, నా మనసుకు దగ్గరైన కథ “ఖౌఫ్”. బొంబాయి నగరంలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో మనిషిలోని అభద్రత, అపనమ్మకం కలిగించే భయపు విశ్వరూపాన్ని చూపించే కథ ఇది. కథంతా కర్ఫ్యూ సడలించిన వేళలో, లోకల్ ట్రైన్‍లో జరుగుతుంది. ఓ అనామక మనిషి. బిక్కుబిక్కుమంటూ ఒక్కడే. తాను చేరాల్సిన గమ్యస్థానం కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తూ. మధ్యలో ఆగిన స్టేషన్‍లో మరొకడు ఎక్కుతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యా ఏమవుతుందన్నదే తక్కిన కథ. ఈ కథను రచయిత చాలా నేర్పుగా, ఒడుపుగా చెప్పారని నాకనిపిస్తూ ఉంటుంది. ఆ అనామక మనిషి భయాన్ని పాఠకుడికి అర్థమయ్యేలా, అనుభవంలోకి వచ్చేలా కథాశిల్పాన్ని ఎన్నుకున్నారు. మధ్యమధ్యలో ఫ్లాష్‍బాక్స్ ద్వారా అతడి సాధారణ జీవితాన్ని పరిచయం చేస్తూ, ప్రస్తుతం అతడున్న మానసికావస్థను కళ్ళకు కడుతూ, మనల్నీ ఆ లోకల్ రైలు ప్రయాణం చేయిస్తారు.

“దక్షిణాన ఏమోగానీ, ఉత్తరాన మాత్రం మేమందరం ఆగస్టు పదిహేను అంటే స్వాతంత్ర్యంకన్నా విభజనే గుర్తొస్తుంది. అందులో విభజననాటి భయనాక దృశ్యాలు నేనిప్పటికీ మరువలేను. అట్లాంటి అనుభవాలన్నీ మనం సిస్టంలోనుంచి ఏదో విధంగా బయటపడాలి. అందుకే నా కథల్లో, కవితల్లో ఆ ప్రస్తావన తప్పక ఉంటుంది” అని ఆయన ఒక చర్చా కార్యక్రమంలో చెప్పారు. ఈ సంపుటిలోనూ ఆ నేపథ్యంలో నడిచిన కథలున్నాయి. “రావి పార్” అలాంటి కథే! విభజన సమయంలో వలసవచ్చేస్తున్నవారు ఒక రైల్లో వస్తుండగా, ఓ వ్యక్తి కవలల పిల్లల్లో ఒకడు మరణిస్తాడు. నిర్జీవ పసివాణ్ణి “రావి” నదిలో పారేస్తే పుణ్యమొస్తుందని ఎవరో సలహా ఇస్తారు. ఆయన అలానే చేస్తాడు, తీరా చూస్తే అతడు పారేసింది బతికున్న పసివాణ్ణి. (ఇదేదో పాత హింది సినిమాలోచూసిన గుర్తు నాకు. నూతన్ అనుకుంటా, అందులో చనిపోయాడనుకొని బతికున్న పిల్లవాణ్ణి పడేస్తుంది.) హిందు-ముస్లిమ్ వివాదాల నేపథ్యంలో ఆసక్తికరంగా చెప్పుకొచ్చిన కథ “ధువా”.

పార్టిషన్ జరిగిన చాన్నాళ్ళ వరకూ, అప్పుడు తప్పిపోయిన కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ, గుల్జార్ యే తమ తప్పిపోయిన కొడుకని ఒక కుటుంబం ఆయనను సంప్రదించిన వైనం, ఎంత కాదన్నా వాళ్ళు గుల్జార్ తమ ఇంటివాడే అనుకోవడం, చివరకు ఆ కుటుంబం ఓ అనుబంధం ఏర్పడ్డం – ఇవ్వన్నీ చక్కగా ఆవిష్కరించిన కథ “బట్వారా”. ఈ కథలో నాకు చాలా ఇష్టమైన “అమోల్ పాలేకర్”, “సాయి పరాంజపె” పాత్రలుగా కనిపిస్తారు.  తన సినీజీవన ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన “బిమల్‍దా” కథ కూడా ఇందులో ఉంది.

సినిమాలకు సంబంధించే మరో కథ – సన్‍సెట్ బుల్వార్డ్. గతించిన వైభవం తిరిగొస్తుందేమోనన్న ఆశతో ఎదురుచూసిన ఒకనాటి అందాలనటి జీవితంలోని ఆఖరిరోజును ఈ కథ కళ్ళకు కడుతుంది.

హింది/ఉర్దూ కథకులపై ప్రేమ్‍చంద్ ప్రభావం ఎంతో కొంత ఉంటుందనుకుంటాను. గుల్జార్ రాసిన “ఫసల్”, “డాలియా” కథలు ఆ కోవకే చెందుతాయనిపించింది. భారత గ్రామీణ ప్రజానీకాన్ని కొందరు పెద్దలు ఎలా దోచుకుంటున్నారో చూపే కథలివి.

 “సినిమాల్లో పట్టనివి కొన్ని కథలయ్యాయి.” అని ఈ పుస్తకం ముందుమాటలో రాశారాయన. “దస్ పైసె ఔర్ దాదీ”, ఆయన రాసి, తీసిన “కితాబ్” సినిమాకు చాలా దగ్గరగా ఉంటుంది. “గుడ్డో” కథ కూడా జయా బచ్చన్ నటించిన “గుడ్డీ” సినిమాను తలపుకు తెచ్చింది.

“హాబూ కీ ఆగ్” కథలో నిప్పును తొలిసారి చూసిన మానవులు, దాన్ని ఓ వింత పశువు కింద జమకట్టి దానితో చేసే విన్యాసాల గురించి ఉంటుంది. మానవ వికాస పరిణామ క్రమంలో జరిగిన ఘట్టాలను ఈ కథలోని మానవుల క్రమానికి పోల్చుకుంటే కొన్ని సరిగ్గా లేనట్టనిపించవచ్చు. వాటిని పట్టించుకోకుండా చదివితే, ఈ కథలో కూడా ఆలోజింపజేసే సంగతులు దొరకవచ్చు. “జంగల్‍నామా” కథ, “జింగల్ బుక్”కు ఆయన రాసిన పాటమాటలను గుర్తుకు తెస్తుంది.

ఆడపిల్ల పెళ్ళి, కట్నం, విడాకులు, సింగిల్ వుమన్ జీవితం నేపధ్యంలో కూడా కొన్ని కథలున్నాయి. చిన్ననాటి ప్రేమకథలు, అంగవైకల్యాన్ని అధిగమించే మనోబలమున్నవారి కథలూ ఉన్నాయి.

కవులైనవారు కథలు రాసినా అందులోని ప్రతి వాక్యమూ ఓ కవితలా ఉంటుంది. గుల్జార్ కథలు చాలా వరకూ అలా ఉండవు. సరళమైన భాషలోనే ఉంటాయి. ఈ సంపుటి మొత్తానికి “చౌరస్ రాత్” ఒక్కటే కవితాత్మక ధోరణిలో సాగుతుంది. అద్భుతంగా రాసిన అందమైన ప్రేమకథ అది.

కథా నేపథ్యమేవైనా ఇవేవీ happy-go-lucky కథలు కావు. జీవితాన్ని నిశితంగా చదివినవాళ్ళు రాసే కథలు. మన చుట్టూ ఉన్న కథలనే మనం విస్మరించలేనంత బలమైన తీరులో చెప్తారు. అందుకని ఈ కథలను చదవటం అంత తేలికకాదు. చదవగలిగితే మర్చిపోవటం అంత కన్నా కష్టం.

“కవిత్వం చెప్పి నెత్తురోడాను, కథలు చెప్పి దెబ్బలకు పట్టీ కట్టుకున్నాను” అని గుల్జార్ ముందుమాటలో అన్నారు. ఈ కథలు గాయాలను రేపేవిగానూ, వాటిని మాన్పేవిగానూ ఉంటాయి.

హిందిలో కథలు చదవాలనుకునేవారికి: కొన్ని టైపోలు అవీ ఇబ్బంది కలిగించినా ఈ కథలు చదువుకోవడం మరీ అంత కష్టమేమీ కాదు. పైగా తెలియని పదాలకు అంతర్జాలం నుండి బోలెడంత సహాయం కూడా లభిస్తుంది.

Raavi Paar
Gulzar
Rupa & Co.
2009
Paperback
171

You Might Also Like

2 Comments

  1. Nagini

    “”కథా నేపథ్యమేవైనా ఇవేవీ happy-go-lucky కథలు కావు. జీవితాన్ని నిశితంగా చదివినవాళ్ళు రాసే కథలు.”” Very true 🙂

  2. తృష్ణ.

    ఇందులోనూ, ‘ధువా’ లోనూ కొన్ని కామన్ కథలున్నట్లున్నాయ్ పూర్ణిమగారూ.. “ఖౌఫ్” కథకు మీ అనువాదం మీ బ్లాగ్లో చదివిన గుర్తు..

    “ఒకే రచయిత లేక ఒకే అంశానికి చెందిన పుస్తక పరిచయాలు” అనే ఐడియా బాగుంది 🙂

Leave a Reply