ఒక వేసవి – Bill Bryson: One Summer – America, 1927

కొంతకాలం క్రితం, బిల్ బ్రైసన్ రచించిన, At home, A short history of private life, చదివాను. అతని రచనా శైలి, చిన్న చిన్న విషయాల వెనుక ఉన్న చరిత్రని తవ్వితీసి మనతో పంచుకోవటానికి అతను చేసిన కృషి నన్ను ఆకర్షించాయి. అందుచేత, లైబ్రరీలో అతని కొత్త పుస్తకం, One Summer కనిపించగానే చదవాలనిపించింది.

1927వ సంవత్సరం వేసవికాలంలో అమెరికాలో చాలా విశేషాలు జరిగాయి. వాటిలో కొన్ని తాత్కాలికమైన సంచలనాన్ని కలిగించినవైతే, మరికొన్ని సంఘటనల ప్రభావం ఇప్పటికీ ప్రపంచంపైన ఉంది. ఆ వేసవిలో జరిగిన సంఘటనలలో కొన్ని:

–           మిస్సిస్సిపి నదీ పరివాహకప్రాంతంలో చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా (ఇప్పటివరకూ కూడా) వరదలు వచ్చి విపరీతమైన ఆస్తినష్టం, జననష్టం జరిగింది. మే మొదటివారంలో 500 మైళ్ళ పొడుగున (దక్షిణ ఇలినాయ్ నుండి, న్యూ ఆర్లియన్స్ వరకు) మిస్సిస్సిపి నది పోటెత్తి ఉంది. 165 లక్షల ఎకరాలు నీటి పాలయ్యాయి. ఆరున్నర లక్షలమంది నిర్వాసితులయ్యారు. ఈ వరద స్థితి తగ్గటానికి 153 రోజులు పట్టింది. ఈ వరదల వల్ల ఒక పర్యవసానమేమిటంటే దక్షిణరాష్ట్రాలలో నివసించే నల్లవారు పెద్ద సంఖ్యలో ఉత్తరరాష్ట్రాలలో నగరాలకు వలసపోవటం మొదలుపెట్టారు. అప్పటినుంచి నగరాలలో జనాభా నిష్పత్తులు గణనీయంగా మారిపోయాయి.

–           ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు అధ్యక్షుడు – యూరప్‌లో ఉన్న మిగతా కేంద్రీయ బాంకుల అధ్యక్షులతో చర్చించి – యూరప్ ఆర్థిక స్థితి మెరుగు పరచడానికి అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించాలి అని తీసుకున్న నిర్ణయం వల్ల రెండు సంవత్సరాల తర్వాత స్టాక్‌మార్కెట్లు ప్రపంచమంతా పతనమై, తీవ్రమైన ఆర్థిక మాంద్యం వచ్చింది.

–           మొట్టమొదటి సారిగా, దారిలో ఎక్కడా ఆగకుండా, అమెరికానుంచి యూరప్‌కు అట్లాంటిక్ సముద్రాన్ని దాటి విమానంలో ప్రయాణించడం జరిగింది. ఛారుల్స్ లిండ్బర్గ్ అనే 25 సంవత్సరాల యువకుడు ఒంటరిగా స్పిరిట్ ఆఫ్ సెయింట్ లూయిస్ అన్న విమానం నడుపుతూ ఈ అద్భుతాన్ని సాధించాడు. ఫ్రాన్సు, ఇంగ్లండు, అమెరికా, మెక్సికో ప్రజలు అతనికి నీరాజనాలు పట్టారు. ఆ తర్వాత లిండ్బర్గ్ దేశమంతా విమానంలో తిరగడం అమెరికా అంతటా విమానాశ్రయాలు నిర్మించటానికి, విమాన ప్రయాణం పెరగడానికి దారితీసింది.

–           మొట్టమొదటి టాకీ చిత్రం The Jazz Singer చిత్రీకరణ ప్రారంభమయ్యింది. దానితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సినిమా ప్రధాన వినోదమాధ్యమమయ్యింది.

–           బ్రాడ్వేలో సంగీతనాటకాల రూపురేఖలను మార్చేసిన Showboat నాటకం ఆ సంవత్సరమే ప్రదర్శించబడింది.

–           AT&T కంపెనీ విలేఖరులకు టెలివిజన్‌ ప్రసారాన్ని మొదటిసారిగా ప్రదర్శించింది.  ఫ్రజానీకానికి వార్తలను, వినోదాన్ని తమ ఇంట్లోనే అందించటానికి అంకురార్పణ జరిగింది.

–           అరాచకత్వానికి మద్దతుగా ఉగ్రవాదచర్యలు చేపట్టారన్న కారణంతో శాక్కో, వాంజెట్టీ అనే ఇద్దరు ఇటాలియన్ వలసదారుల్ని మసాచ్యుసెట్శ్ రాష్ట్రంలో ఉరి తీయడం జరిగింది. అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఈ చర్య నిరసించబడింది. దేశంలో అనేక చోట్ల బాంబుదాడులు జరిగాయి.

–           స్కూలుపన్నులు ఎక్కువకావటం వల్ల తన ఆస్థులని కోల్పోవలసి వచ్చిందన్న కోపంతో ఒక పిచ్చివాడు స్కూలు భవనం కింద బాంబులు పెట్టటంతో మిచిగన్‌లో 44గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

–           మౌంట్ రష్‌మోర్‌పై నలుగురు అమెరికా అధ్యక్షుల ముఖాలను చెక్కటం ప్రారంభించారు. ఇప్పుడు అమెరికాలో ప్రసిద్ధికెక్కిన ఆకర్షణలలో ఇది ఒక్కటి.

–           న్యూ యార్క్ యాంకీస్ బేస్‌బాల్ టీము ఆటగాళ్ళు బేబ్ రూథ్, లూ గెరిగ్‌ల మధ్య ఎవరు ఎక్కువ హోంరన్‌లు కొడతారన్న పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. సీజను ఆఖరుకు ముందు ఆటలో బేబ్ రూథ్ అరవయ్యో హోంరన్ కొట్టి కొత్త రికార్డు స్థాపించాడు. ఆ సంవత్సరపు యాంకీస్ టీము ఈ ఆట ఆడిన టీములన్నిటిలోకీ గొప్ప టీము అని ఇప్పటికీ చెప్పుకుంటారు. బేబ్ రూథ్, బేస్‌బాల్ ఆటకు సచిన్ టెండుల్కర్ వంటి వాడు. అతను రిటైర్ అయ్యే సమయానికి అతని పేరు మీద 56 రికార్డులున్నాయి.

–           చికాగోలో మాఫియా నాయకుడు యాల్ కపోన్ ఉఛ్ఛస్థితికి వచ్చాడు.

–           ఫోర్డ్ మోటార్ కంపెనీ, సామాన్య ప్రజలకు కార్లను అందుబాటులోకి తెచ్చిన తమ మోడల్ టి కారుల నిర్మాణాన్ని నిలపివేసింది. ప్రపంచంలో అప్పటివరకూ ప్రథమ స్థానంలో ఉన్న ఫోర్డ్ కంపెనీ ఆ స్థానాన్ని కోల్పోయింది.

–           అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ తరువాత సంవత్సరం వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయబోనని ప్రకటించాడు.

మే – సెప్టెంబరు నెలల మధ్యలో అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనలు ఇవి. ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. ఒక్కో విశేషాన్ని ఎత్తుకొని, దానిone summer alternate cover తాలూకు సంఘటనల పూర్వాపరాలు, అందులో పాల్గొన్న వ్యక్తుల విశేషాలు, సాంకేతిక వివరాలు అన్నిటినీ విపులంగా వర్ణిస్తాడు రచయిత. ఉదాహరణకు, అట్లాంటిక్ సముద్రాన్ని విమానంలో దాటడానికి విపరీతమైన పోటీ జరిగింది. అనేకమంది పైలట్లు ఈ ప్రయత్నంలో మృతి చేందారు. మొదటిసారిగా సాధించిన లిండ్బర్గ్ అమెరికాలోనూ, యూరప్‌లోనూ ప్రజలకు ఆరాధ్యనాయకుడయ్యాడు. ఆ కీర్తి అతన్ని విపరీతంగా ఇబ్బంది పెట్టింది. ఈ సంఘటనలలో పాత్ర వహించిన మనుషుల, సంస్థలందరిగురించీ మనకు ఈ పుస్తకంలో తెలుస్తుంది. అలాగే టెలివిజన్ నిర్మాణం గురించి, టాకీ చిత్రాల టెక్నాలజీ గురించి, ఇంకా…

ఈ సంఘటనలకు తోడుగా అప్పటి ప్రజల జీవనవిధానాలని, ప్రచారంలో ఉన్న ఆలోచనారీతులను కూడా రచయిత వివరంగా వర్ణిస్తాడు.

1927లో అమెరికా మంచి ఉఛ్ఛస్థితిలో ఉంది. ప్రతి ఆరుగురిలో ఒక్కరికి ఒక కారు (అంటే, సగటున కుటుంబానికి ఒక్క కారు) ఉండేది (కానీ దూరప్రయాణాలకు మంచి రోడ్లు ఇంకా రాలేదు). సంవత్సరానికి 10,000పైగా పుస్తకాలు ప్రచురింపబడేయి. రెండున్నర కోట్ల కుటుంబాలుంటే, మూడున్నర కోట్ల వార్తాపత్రికలు ప్రతిరోజూ అమ్ముడుపోయేయి. కోటికి పైగా ఇళ్ళల్లో ఫోనోగ్రాఫు, టెలిఫోనూ ఉండేవి. ప్రపంచంలో తయారయ్యే కార్లలో 80 శాతం, సినిమాలలో  85 శాతం అమెరికాలోనే తయారు అయ్యేవి. ప్రపంచంలో ఉన్న బంగారు నిల్వలలో సగం బంగారం అమెరికాలో ఉండేది. ఆ సంవత్సరమంతా స్టాక్‌మార్కెట్ నిరంతరంగా పెరుగుతూనే ఉంది.

జాతి వివక్ష, లింగవివక్ష విపరీతంగా ఉండేవి. కొత్తగా వలసవచ్చినవారిని (యూదులు, ఇటాలియన్లు, ఐరిష్‌వారు వగైరా) చిన్న చూపు చేసేవారు – వారివల్ల సంఘానికి అపకారం జరుగుతుందని భావించే వారు, వారికి పునరుత్పత్తి హక్కు లేకుండా చేయాలని వాదించేవారు ఎక్కువగానే ఉండేవారు. అప్పటివరకూ వలసదారుల్ని ఆహ్వానించిన అమెరికా వలసలను నిషేధించటం మొదలుబెట్టింది. అప్పుడు ప్రొహిబిషన్ అమలులో ఉండేది – దానివల్ల తాగడం తక్కువకాకపోవడం బదులు ఇంకా ఎక్కువయ్యింది. చట్టవ్యతిరేక వ్యాపారాలు చేసేవాళ్ళు బాగా బలపడ్డారు.

bill bryson

బిల్ల్ బ్రైసన్ శైలి సరళంగానూ, ఉత్కంఠభరితంగానూ ఉంటుంది. కొంత వ్యంగ్యం, కొంత ఎగతాళి, కొంత సంభ్రమం మిళితమై ఉంటుంది. చారిత్రకంగా ముఖ్యమైన విషయాలతోపాటు, తేలిక విషయాలను కూడా చిత్రిస్తాడు (ఉదాహరణకు, ఆ రోజుల్లో జండాకర్రపై రోజుల తరబడి కూర్చోవడం అనే ప్రక్రియ ఉండేది; దాన్నీ విపులంగానే వర్ణిస్తాడు). తేలిగ్గా, సరదాగా చదువుకోవచ్చు. కొత్త విషయాలు చాలా తెలిశాయి. ఇంతకు ముందే తెలిసిన విషయాలు ఇంకొంత లోతుగా తెలిశాయి.  చాలా చారిత్రక సంఘటనల గురించి, చాలామంది చారిత్రక వ్యక్తుల గురించి మంచి అవగాహన కలిగిస్తుంది. 1927తో ఆగిపోకుండా, ఈ పుస్తకంలో ముఖ్య సంఘటనల పర్యవసానాలను, ముఖ్యవ్యక్తుల జీవిత పరిణామాల గురించి చివరి ప్రకరణంలో ఇచ్చిన వివరాలు, రిఫరెన్సులు, ఇండెక్సు, 16 పేజీల ఫొటోలు పుస్తకాన్ని సమగ్రం చేశాయి.

ఈ పుస్తకం చారిత్రక సంఘటనల క్రోడీకరణే కాని, ఆ సంఘటనలపై, సమాజంపై విశ్లేషణ మాత్రం కాదు. మన దృక్పథాన్ని బట్టి, ఇది ఈ పుస్తకానికి బలంగానో, బలహీనతగానో భావించవచ్చు.

చరిత్ర మీద, చారిత్రక విషయాలమీద ఆసక్తి ఉన్నవారు సరదాగా చదువుకోవచ్చు.

One Summer – America, 1927

Bill Bryson

Double Day, 2013

509 pages

You Might Also Like

3 Comments

  1. సౌమ్య

    గత వారంలోనే నేను షేక్స్పియర్ జీవితం గురించి Bill Bryson రాసిన పుస్తకం చదివాను. ఈయన పుస్తకాల్లో కనబడే historical details ఆశ్చర్యం కలిగిస్తాయి నాకు. కొన్ని trivia అసలు ఎలా పడతారో చాలా కుతూహలంగా అనిపిస్తుంది. Thanks for writing about this book. Will check it out.

    1. varaprasad

      బాగా చెప్పారు సౌమ్య గారు,మీరు కొంచెం ఎక్కువ సమయం కేటాయిస్తే మేము మరిన్ని మంచి పుస్తకాలను చదవగలం,

  2. kotari mohan rao

    vaari bio data n photo ivvandi maaku aanandangaa untundi.

Leave a Reply