American Born Chinese – గ్రాఫిక్ నవల

పుస్తకం: American Born Chinese by Gene Luen Yang

నేపథ్యం: ఆ మధ్య కోర్స్ ఎరా (కోర్సుల ఎర అనమాట) వెబ్సైటులో “Comic Books and Graphic Novels” అన్న కోర్సు మొదలైంది. నాకు సాహిత్య కోర్సులు వినేంత attention span లేనప్పటికీ, కామిక్స్, గ్రాఫిక్ నావల్స్ అనగానే ఆకర్షణ కలిగి, వినడం మొదలుపెట్టాను. మొదటి విడుత విడియోల్లో ప్రస్తావించారు ఈ పుస్తకాన్ని. ఆసక్తికరంగా అనిపించింది. తరువాత, జర్మనీ దేశపు “inter library loan” పుణ్యమా అని, ఈ పుస్తకం మరో ఊరి నుండి ప్రయాణం చేసి వచ్చి నా వద్ద వాలింది. ఒక్క గంటా గంటన్నరలో మొదటి విడత చదవడం పూర్తి చేసి, రేపింకోసారన్నా చదవాలి అనుకున్నాను. చదివాను. ఈ పుస్తకం గురించి నేను బహిరంగంగా రాసుకుంటున్న నోట్సు ఈ వ్యాసం.

పుస్తకం:‌ ఈ చిన్న గ్రాఫిక్ నవలలో మూడు కథలు సమాంతరంగా నడుస్తూంటాయి. మొదటి కథ ఒక కోతుల రాజుది. అతగాడికి తనని ఎవరన్నా కోతి అని భావిస్తే నామోషీగా ఉంటుంది. “నాకున్న ప్రతిభా వ్యుత్పత్తులకి నన్ను కోతి అనడం ఏమిటి? నేనూ దేవతల్లో చేరాలి” అని అతని తాపత్రేయం. కానీ, వాళ్ళు అతన్ని తమలో ఒకరిగా చూడరు. అస్తమానం “కోతి” అనే పిలుస్తారు. అది ఆ కోతుల రాజుకి అవమానంగా తోస్తుంది. అతగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవత్వం పొందాలన్న ధ్యేయంతో కృషి చేస్తూంటాడు. రెండో కథ: జిన్ అనే అమెరికన్ చైనీస్ కుర్రవాడి కథ. స్కూల్లో “చైనీస్” అనిపించుకోవడం అతనికి నచ్చదు. “అమెరికన్” లా ఉండాలని అతని తాపత్రేయం. తోటి ఏసియన్ పిల్లలతో స్నేహాలు చేయడానికి కూడా ఇష్టపడని వాడితను. మూడో కథ:‌డానీ అనే అమెరికన్ కుర్రవాడిది. ఏటేటా అతని కొరియన్ కజిన్ చిన్-కీ రావడం, వాడు వెళ్ళగానే, వాడి వల్ల తన చుట్టుపక్కల వాళ్ళ మధ్య తన ఇమేజి దెబ్బతిని డానీ స్కూలు మారడం…పక్కా అమెరికన్ లా బ్రతికే ఇతనికి నచ్చని విషయం. దీని గురించి అతనికి విపరీతమైన ఫ్రస్ట్రేషన్. ఈ మూడూ‌ పైకి వేర్వేరు కథల్లా ఉంటాయి కానీ, చివరికొచ్చేసరికి అన్నీ కలుస్తాయి అనమాట. ఇదీ ఈ పుస్తకంలో విషయం క్లుప్తంగా చెప్పాలంటే.

కథ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. పుస్తకంలో బొమ్మలు వివిధ రంగులతో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రాచీన చైనీసు కథల స్ఫూర్తితో అల్లిన కోతుల రాజు కథలో అతను నేర్చుకున్న విద్యల గురించి వర్ణించడానికి వాడిన బొమ్మలు, మాటలు రెండూ చాలా నచ్చాయి నాకు. స్టీరియోటైప్ ఆలోచనలను చక్కగా చూపారు అనిపించింది. ముగింపు సన్నివేశం వద్ద ఇంకొంచెం పొడిగించి ఒక logical conclusion కి తెచ్చి ఉండాలి అనిపించింది కానీ, బహుశా నేను ముగింపుని సరిగా అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు.

కథ మొదట్లోనే, జిన్ తన గురించి ప్రవర చెప్పుకోవడం మొదలయ్యాక, “నీకు పెద్దయ్యాక ఏం కావాలనుంది?” అని ఒక ముసలావిడ అడిగిన ప్రశ్నకి “ట్రాంస్ ఫార్మర్” అని చెబుతాడు. అక్కడ జరిగిన చర్చలో ఆవిడ “It’s easy to become anything you wish, so long as you’re willing to forfeit your soul” అంటుంది చివర్లో. ఆ వాక్యం, నా దృష్టిలో ఈ పుస్తకంలో అంతర్లీనంగా నడిచే థీం కి ఒక సూత్రీకరణ. కొంచెం వివరంగా చెప్పాలంటే, పుస్తకంలో recurring theme గా నాకు అనిపించినది – ఒక గుంపులోకి వచ్చిన బయటివాడు తను వాళ్ళలో ఒకడిగా గుర్తింపు పొందడానికి పడే తాపత్రేయం. కోతుల రాజు దేవతలతో సమానంగా గుర్తించబడడానికి, జిన్ అమెరికన్ గా అనిపించుకోవడానికి, డానీ అతని కజిన్ చిన్-కీ తో తిరగడం నామోషీ అనుకోవడానికీ – అదే కారణం అనిపించింది (తెలుగు మాట్లాడకపోవడం ఫ్యాషన్ అనుకోడానికి కూడా అనుకోండి! అది ఈ నవలలో లేదు.) కోతులరాజు దేవతల వద్ద పరాభవం పొందాక, తిరిగి తన రాజ్యానికి వస్తాడు. అక్కడ ఒక వాక్యం: “When he entered the royal chamber, the thick smell of monkey fur greeted him. He’d never noticed it before”..ఇది చదివాక, ఎందుకో వెంటనే సి.రామచంద్రరావు కథ “నల్లతోలు” గుర్తువచ్చింది. అలాంటి కథ అది ఒక్కటే అని కాదు. నేను వేరేవి చదవలేదనీ కాదు. ఏమిటో, అలా గుర్తువచ్చిందంతే.

పుస్తకంలో మధ్య మధ్య కనబడే చైనీసు అక్షరాలు నాకు అర్థం కాలేదు. పుస్తకం ముందో, వెనకో వాటి గురించి ఓ ముక్క పరిచయం చేసుంటే‌ బాగుండేది అనిపించింది. అయితే, ఈ బాపతు విషయాలు పక్కన పెడితే పుస్తకం చిన్నది. గంటలో చదివేయొచ్చు. మళ్ళీ మళ్ళీ చదువుకోవచ్చు. రెండు మూడు సార్లు చదివాను మొదలుపెట్టిన రెండు మూడు రోజుల్లోనే. చదివిన ప్రతిసారీ, immigrant population గురించి ఎన్నో ప్రశ్నలు కలిగాయి. “A Larger Memory” అని వివిధ ప్రాంతాల నుండి అమెరికాకి వలస వచ్చిన ethnic groups గురించి Ronald Takaki రాసిన పుస్తకం కూడా గుర్తువచ్చింది. పేరుకి “ఆమెరికన్ బార్న్ చైనీస్” పుస్తకం టీనేజీ పిల్లలకు ఉద్దేశించనదే అయినా, పుస్తకంలో కొంచెం పెద్దవారిని కూడా ఆలోచింపజేసే అంశాలు చాలానే ఉన్నాయి. నా మట్టుకు నాకు గొప్ప నవలే.

అంతర్జాలంలో కనబడ్డ ఒకట్రెండు పేజీలు ఇక్కడ జతచేస్తున్నాను – పుస్తకంలోపల ఎలా ఉంటుందో ఒక అవగాహన ఉండడానికి:

American_Born_Chinese

yang_2

పుస్తకం వివరాలు:
American Born Chinese
రచన: Gene Luen Yang
పేజీలు: 233
Flipkart.com కొనుగోలు లంకె ఇక్కడ.
ఈ పుస్తకాన్ని గురించి, రచయిత మాటల్లో, ఒక యూట్యూబు విడియో ఇక్కడ.

చివ్వరగా ఒక్క మాట: ఈ వ్యాసం చదివాక మీరు పుస్తకం చదివారు అనుకోండి, పుస్తకం మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎవళ్ళ వ్యక్తిగత అభిరుచులను బట్టి వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. పుస్తకం మీద నాకు ఇష్టం కలిగింది. పదుగురికీ దానిని పరిచయం చేయాలన్న తాపత్రేయం పెరిగింది. అందుకు మాత్రమే ఈ వ్యాసం. పుస్తకం నచ్చకపోతే మీకు అభిరుచి లేదని కాదు, ఇది అందరికీ తప్పనిసరిగా నచ్చాలనీ కాదు. వ్యాఖ్య రాసే ముందు ఈ విషయం దృష్టిలో ఉంచుకోగలరు.

You Might Also Like

One Comment

  1. డింగు

    గ్రాఫిక్ నవలను పరిచయం చేయడం బాగుంది. విదేశాల్లో వీటికింత ఆదరణ ఉంటుందని తెలియదు. మనోళ్ళు ఇలాంటి సాహిత్యం పెద్దగా పట్టించికున్నట్లు లేదు. నేను పుస్తకం.నెట్ స్పూర్తితో ఒక గ్రాఫిక్ పుస్తకం చదువుతున్నాను. తికమక పదాలు ఉండవు. బొమ్మలు బాగుంటే పాత్రలు అలా మన ముందు కదుల్తున్నట్లు ఉంటుంది.

Leave a Reply