తెలుగు కథలూ – నా అనుభవాలూ, అభిప్పరాయాలూ

“De gustibus non est disputandum.”

“ఎవరి రుచి బతుకులు వాళ్ళవి.”

“రసపట్టులో తర్కం కూడదు.”

“కథలంటే నాకు పెద్దచూపు లేదు, ఆమాటకొస్తే అసలు సాహిత్యం మీదే నాకు పెద్దచూపు లేదు.”

ఈ స్టేట్మెంట్ చూసి జనాలు నామీద విరుచుకుపడకుండా పై మూడు కొటేషన్లూ గుర్తు చేశాను. సాహిత్యం నాకున్న గాఢమైన అభిరుచుల్లో ఒకటి. మనకిష్టమైన విషయాల్లో కాకపోతే మన తిక్కలు ఎక్కడ చూపించుకుంటాం? అందుకే ‘అనువుగాని చోట’ కాకుండా నాకు తేలికైన, లోకువైన సాహిత్యం విషయంలో  మాత్రం హాయిగా నా తిక్కలకి నేను కళ్ళేలు వదిలేస్తాను. అయినా పబ్లిగ్గా వాగాలంటే భయం. పోనీ బిడియంగా పైపైన తేల్చేద్దామంటే, ఇదేమీ ఉద్యోగంలో రాసే ఈమెయిలో, డాక్యుమెంటేషనో కాదాయె. ఇష్టమైన చోట ఆవేశం వద్దన్నా తన్నుకొస్తూ ఉంటుంది. ఏం చేస్తాం!!

సాహిత్యం మీదా, కథలమీదా సిద్ధాంతాలూ, విమర్శలూ, చర్చలూ కన్నా దండుగమారి పని ఇంకోటి లేదని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అయినా అది మరీ ‘దండుగ’ కాదు లెండి. మాంఛి సినిమా చూసొచ్చాకా, దాంతస్సాదియ్యా, దురద తీరేలా దానికి ఈకలు పీకి కూలంకషంగా చర్చించకపోతే మజా ఎక్కడొస్తుంది? ఆ సినిమా మీద మన ‘ప్రేమ’ ఎలా తీరుతుంది? కాబట్టి నచ్చిన కథమీదో కవితమీదో కాసింత ఆవేశంగా చర్చించకపోతే దాన్ని పూర్తిగా ఆస్వాదించినట్టు కాదనే కదా.

అసలు నన్నడిగితే ఏ కథకైనా ఒకటే ఫీడ్ బ్యాక్ ఉంటుంది. ‘బాగుంది/బాలేదు’. ఎందుకు బాగుంది, ఎందుకు బాలేదు అని అడగడం దండుగ. అడిగి, చర్చల్లోకి దిగామా, ఆ కథమీదో సాహిత్యం మీదో మనకి ప్రేమ ఎక్కువైపోయిందనే అర్థం. (గట్టిగా తిట్టినా అదీ ఓ రకం ప్రేమే.) కథల మీద నాకు ‘పెద్ద చూపు’ లేకపోయినా ప్రేమ కొంచం ఎక్కువే.

చిన్నప్పుడు మా అమ్మా, ఆవిడ స్నేహితురాలూ వీక్లీలు ఇచ్చి పుచ్చుకునేవారు. నాకు ఇంకా హైస్కూలుకి పోయే వయస్సు కూడా లేదు. నేనూ, నా ఫ్రెండూ (అంటే మా అమ్మ స్నేహితురాలి కొడుకు) రెండ్రోజులకోసారైనా  వాళ్ళింట్లోనో మా ఇంట్లోనో చేసిన చింతకాయపచ్చడో, గోంగూర పులుసో చిన్న బేగ్గులో పెట్టుకుని, దానితో పాటూ ఒకటో రెండో వీక్లీలు కూడా పెట్టుకుని వాళ్ళింటికీ మా ఇంటికీ బట్వాడా చేస్తూ తిరుగుతూ ఉండే వాళ్ళం. ‘వీక్లీలు’ అంటే అన్ని వీక్లీలూ కావు, ‘ఆంధ్రప్రభ’ ఒక్కటే. అందులో మాత్రమే మంచి కథలు పడేవిట. నేను మా ‘ఆంటీ’ ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ వీక్లీలో కొన్ని పేజీలు చిన్నగా మడతపెట్టి ఉంచేవారు. అంటే ఈ కథ తప్పకుండా మా అమ్మ చదవాలని ఆవిడ సూచన అన్నమాట. చదివాకా ఆ కథల గురించి వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు చర్చించుకునేవాళ్ళు. కొన్ని కథలు మరీ బాగుంటే ఏ ఆదివారం మధ్యాన్నమో తీరుబడిగా ఉన్నప్పుడు మా అమ్మ ఇంట్లో అందర్నీ కూచోబెట్టి చదివి వినిపించేది. పదేళ్ళ చిల్లర వయసులో అలా విన్న ఓ కథ, ‘కాయిపు అప్పారావు’ గారిది. ఇంకా గుర్తుంది. కథ పేరు గుర్తు లేదు. నేను హైస్కూల్లోకి వచ్చాకా వాళ్ళు ‘ప్రభ’ కూడా చదవడం మానేశారు.

చిన్నప్పుడు చందమామల టైపు కథల పుస్తకాలు అప్పడాల్లా నమిలేసి, ‘అమ్మా తోచట్లేదే’ అని మారాం చేసేవాణ్ణి. అంటే, ‘చదవడానికి ఏదో ఒకటి ఇవ్వు’ అని నస అన్నమాట. మా అమ్మ నాకోసం పుస్తకాలు వెతకలేక నానా పాట్లూ పడేది. ఆ వయసులోనే భానుమతీ రామకృష్ణ గారి ‘అత్తగారి కథలు’ బట్టీ పట్టేశాను. అలాగే అమరావతి  కథల్లో ఓ రెండు కథలు చదవమని మా అమ్మ ఇచ్చింది. పిల్లాడి పుస్తకాల కోసం చుట్ట మానేసిన ఓ తండ్రి కథా, మామ్మ తాటాకు బొమ్మల పెళ్ళి కథా. ఏడెనిమిదేళ్ల క్రితం మళ్ళీ అమరావతి కథలన్నీ చదివాను. ఆ పుస్తకం చదువుతుంటే చిన్నప్పుడు చదివిన ఆ రెండు కథలూ బుర్రలోంచి కొంచం కూడా చెరిగిపోలేదని అర్థమైంది.

చిన్నప్పుడు (ఇప్పటికీ) నాకు హాస్యమే ఎక్కువ  ఇష్టం. మిగతాదంతా ‘చెత్తే’. చిన్నప్పట్నించీ తిక్క పాళ్ళు ఎక్కువే కాబట్టి నాకు నచ్చే టైపువే చదివేవాణ్ణి గానీ మిగతావి ఏవీ ఎక్కేవి కావు. ఓ ప్రత్యేకమైన ‘కారెక్టర్’ ఉన్న పుస్తకాలూ, కథలూ మాత్రమే లీనమైపోయి చదివేవాణ్ణి. యండమూరీ, మల్లాదీ రాసినవి ఒక్క కథగానీ, నవల గానీ చదవకుండానే ఇంతవరకూ గడిచిపోయింది. (యండమూరిది ఓ కథ ఆ మధ్య ఈనాడు ఆదివారం లో చదివిన గుర్తు. తల్లి శవాన్ని తవ్వేదో, పాతిపెట్టేదో ఓ కథ). జీవితంలో ఏమైనా మిస్సయ్యానేమో!

అసలింతకీ కథలమీద ‘పెద్దచూపు’ ఎందుకు లేదంటారా? ఏదైనా ఓ ‘విషయం చెప్పదలచుకుంటే’ దానికోసం కథ రాయడం దండుగ అని నా అభిప్రాయం. వంద పేజీల కథలో చెప్పదలచుకున్నది రెండు వాక్యాల్లో చెప్పొచ్చు. దానికోసం ఎందుకంత బిల్డప్పూ, కేరెక్టరైజేషనూ, సంభాషణలూ, చెత్తా, చెదారమూను! బాపూ గారన్నట్టుగా ‘సందేశాలు’ చెప్పాలంటే కోట్లు కర్సు పెట్టి సినిమాల్దియ్యడమెందుకూ? ఫోన్ చేసి చెప్పొచ్చుగా. ఈ రోజుల్లో అయితే ఎస్సెమ్మెస్సు పంపించెయ్యొచ్చు – చవగ్గా.

ఈ అభిప్రాయానిక్కూడా ఓ కౌంటరుంది. అసలు ‘విషయం చెప్తున్నాడు’ అని కథలో తెల్సిపోయిందా, కథ తుస్సుమన్నట్టే. కథలంటే ‘కాంతా సమ్మితాలు’. ఇంటావిడ సరైన సమయం, అయ్యగారి ‘మూడూ’ కనిపెట్టి, ప్రేమగా టిఫిన్ చేసిపెట్టి, మంచి కాఫీ ఇచ్చి, కిక్కెక్కేలా కబుర్లు చెప్పి – అప్పుడు టెండరు పెడుతుందే, అలా ఉండాలి కథంటే. తొందరపడి ముందే మేటరు లీకైతే అంతే సంగతులు. ఈ సంగతి నాకర్థమయ్యిందెప్పుడంటే పందొమ్మిదివందల తొంభై తొమ్మిది లోనో, రెండు వేల్లోనో ‘ఇండియా టుడే’ లో ‘వోల్గా’ మంచి కథ రాసింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడు చెల్లాయికి కుదిరిన అమెరికా సంబంధం చెడగొట్టడానికి కంకణం కట్టుకుంటాడు. వారెవా, ఏమి కథ! మనసులో చెరిగిపోని ముద్ర వేసింది కాదూ! ఆగండాగండి. అందులో ఏదో ‘ఫెమినిస్టు’ సందేశం ఒకటి గుండెల్లోకి చొచ్చుకుపోయింది. ఏమిటో తెలీదు. తెలియక్కరలేదు. జరగాల్సిన ఆల్కెమీ ఏదో లోపల జరిగిపోయింది. ఫెమినిజమనే మాట వినిపిస్తే బెదిరే గొడ్లకి ‘కాంతా సమ్మితం’గా ఏదో సందేశం వెళ్ళింది. ఏవో కొన్ని కేరెక్టర్లు గ్లామరైజ్ చెయ్యబడ్డాయి. ఆ గ్లామర్ మనల్ని వొదల్దు. రేప్పొద్దున్న నా కొడుకు కేటరింగ్ కోర్సు చదివి వంటవాణ్ణి అవుతానంటే ఎంత బాగుణ్ణు అనిపిస్తుంది. హేట్సాఫ్ ‘వోల్గా’!

హైద్రాబాదులో కొత్తగా ఉజ్జోగంలో చేరిన ఆ రోజుల్లో ప్రతివారం తెలుగు ఇండియా టుడే కోసం ఎంత ఎదురు చూసేవాణ్ణో. వాటిలో పడ్డ తెలుగు కథల్ని శ్రద్ధగా చదివేవాణ్ణి. కొన్ని, కొన్ని కథలు ఎంత బాగుండేవి! వాటిల్ని దాచి, మళ్ళీ మా ఊరు వెళ్ళినప్పుడు అమ్మా, నాన్నల్ని కూచోబెట్టి నేను స్వయంగా చదివి వినిపించేవాణ్ణి. ఓ నరసారావుపేట ‘రావు గారు’ అమెరికా వెడతాడు. అక్కడ ‘ఆర్. ఎల్. ట్రైనేట్రమ్’ గారిని కలుసుకుంటాడు. గుండెల్ని తాకిన కథ. అందులో డైలాగులు అన్నీ కళ్ళముందే ఉన్నాయి. మరో ‘కప్పడాల’ కథ (అప్పడాల్ని కప్పడమ్స్ అని మార్కెటింగ్ చేస్తాడో ఎంబీయే). మంచి హాస్యంగా ఉంటుంది. అలాగే మరి కొన్ని.

అలాంటి కథలు అప్పుడప్పుడూ చదివినా తర్వాత ఏడాది లోగానే ఉద్యోగార్థం ఆంధ్రదేశాన్ని వదిలేశాకా అసలు కథల గురించి పట్టించుకోడమే మానేశాను. ఎప్పుడేనా ఇంటర్నెట్లో ఏదైనా కథ కనిపించినా – సీతమ్మోరు ఇచ్చిన హారాన్ని హనుమంతులవారు కొంచం కొరికి అవతల పారేసినట్టు – అక్కడక్కడా చూసి వదిలెయ్యడమే. ‘హత్తుకుంటే’ చదవడమే, లేకపోతే లేదు.

ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు కోప్పడకండేం. చెప్పాగా, నా తిక్క నాదని. హత్తుకునే కథలేమైనా ఉంటే మాత్రం, బాబ్బాబు, నా తిక్కలు పట్టించుకోకుండా కొంచం చెప్పండేం!! (ఈ రాతలు చదివి మీరు తిట్టినా మీకిది నచ్చేసినట్టే లెక్క).

You Might Also Like

12 Comments

  1. ravishankar

    im also very intrested in stories i have small collection i ll send to your postal address give me your address

  2. Asifuddin

    చిన్నప్పటి మాట వదిలెయ్యండి …మంచి కథ తీరే వేరు ..ఈ జీవితం లోనే మరోజీవితం జీవించిన అనుభవం కలుగుతుంది ..ఒక టికేట్టుకే రెండు సినిమాలు ..లాగా ,
    మంచి కథ చదివితే ..కలిగే అనుభూతి విలువకట్టలేనిది ..
    కాకపోతే ఆ అనుభూతి పొందే హృదయం కావాలి .

  3. జంపాల చౌదరి

    >>పిల్లాడి పుస్తకాల కోసం చుట్ట మానేసిన ఓ తండ్రి కథా,

    ఇది చాసో గారి “ఎందుకు పారేస్తాను నాన్నా?” కథ కాదూ? అమరావతి కథల్లో కూడా ఇలాంటి కథ ఒకటి ఉన్నట్టు గుర్తు లేదు.

  4. saraswathi

    asalu katha ante prathi okkari jeevitham lo sadharanamga jarige vishayale. ante evaro okari jeevithamlo jariginadhanini kondharu rasthe kondharu vaari ishta ishtalanu gurthuchesukuntu raastharu. katha ante chadivekodhi next pagi lo emundhi anela vundedhi katha. asakthiga vundadam tho patu edho oka mess kuda vundali kadhalo. emantaru mitrularaa nenu cheppindhi sababugaane vundha???????

  5. jhon

    eppudu vasthe emicheyyali

  6. satyam

    చిన్నప్పటి మాట వదిలెయ్యండి …మంచి కథ తీరే వేరు ..ఈ జీవితం లోనే మరోజీవితం జీవించిన అనుభవం కలుగుతుంది ..ఒక టికేట్టుకే రెండు సినిమాలు ..లాగా ,
    మంచి కథ చదివితే ..కలిగే అనుభూతి విలువకట్టలేనిది ..
    కాకపోతే ఆ అనుభూతి పొందే హృదయం కావాలి .
    బుచ్చిబాబు గారి ” నన్ను గురించి కథ వ్రాయవూ ”
    “పొగ లేని నిప్పు “,తీర్పు చేసిన వాడికే శిక్ష ”
    మచ్చుకి ఈ మూడు చదివి ..మాట్లాడండి …మీ ఆలోచన ..అభిప్రాయం .

  7. రవి

    “జీవితంలో ఏమైనా మిస్సయ్యానేమో!”

    అస్సలు మిస్సవలేదు. నేను గ్యారంటీ.

  8. nagamurali

    మహేష్, మంచి ప్రశ్నలే. 🙂

    గీతాచార్య, 😉

    అబ్రకదబ్ర, నెనర్లు. హమ్మయ్య, నాకు మంచి సపోర్టు దొరికింది అయితే.

  9. అబ్రకదబ్ర

    అచ్చంగా మీ అభిప్రాయాలే నావీనూ కథల గురించి. వాటి విషయంలో నా అనుభవాలు కూడా అటూఇటుగా మీలాంటివే. ప్రతి వాక్యంతోనూ ఏకీభవిస్తున్నాను. ముఖ్యంగా ‘మెసేజిలివ్వటానికి టెలిగ్రాము చాలుగా’ తో 100% 🙂

  10. కత్తి మహేష్ కుమార్

    తర్కం లేని యవ్వన ప్రేమలోనే తర్కాన్ని కోరుకునే మనకు సాహిత్యం,కథలో తర్కం కూడదంటే ఎట్లా? రసస్పందనలో తర్కం కూడదు. కానీ తర్కంలోనే రసస్పందన పొందితే తప్పేముంది?
    విషయం చెప్పడానికి కథ రాయడం తప్పే…కానీ ఆలోచనని (ఐడియాని) కథగా మలిస్తే “కథెక్కడ?” అంటారే!
    హేమిటో మరిన్ని ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.

  11. తెలుగు కథలూ – నా అనుభవాలూ, అభిప్పరాయాలూ « Naga Murali’s Blog

    […] తెలుగు కథలూ – నా అనుభవాలూ, అభిప్పరాయాలూ పుస్తకంలో తెలుగు కథలూ – నా అనుభవాలూ, అభిప్పరాయ…. […]

Leave a Reply