నా విశ్వనాథ -1
వ్యాసకర్త: డాక్టర్ అబ్బరాజు మైథిలి
**********
ఆయనకీర్తిశేషులైన నాటికి నావయసు పది సంవత్సరాలు.. ఆస్థానకవి అని తప్ప ఇంకా ఏమీ తెలియదు. తర్వాతి కాలంలో విన్నది ఆయనను గురించి వ్యతిరేకోక్తులనే… చదివిన తొలి నవల చెలియలికట్ట మనస్సుకెక్కనూలేదు ఆ పదిహేడేళ్ల వయసులో. స్వైరం లో మాత్రమే సౌందర్యం చూసే అజ్ఞానం అప్పటికి, ఏ నియమాలెందుకు ఎట్లా ఆవశ్యకమో తెలియదు.
గుంటూరు నవోదయా బుక్ స్టోర్ లో ఒక పై అరలో పెద్ద పెద్ద పుస్తకాలు.. సముద్రపు దిబ్బ, మ్రోయు తుమ్మెద కనిపిస్తూ ఉండేవి. తీసుకుందామనిపించినా భయం వేస్తూ ఉండేది చదవగలనా అని. [కొన్ని యేళ్ల తర్వాత వెళ్లి పిచ్చిదానిలాగా అడిగాను ఆపుస్తకాలేమయినాయని. అక్కడివారెవరికీ గుర్తే లేదట.] చిన్నగా కనిపించిన నాస్తికధూమం, హెలీనా తీసుకున్నాను. ప్రయాసతో చదివాను. అవి అసలేమి చెప్తున్నాయో అంతుపట్టలేదు. ఏకవీరలోని వేదన అర్థరహితమనీ అనుకున్నాను. ఒక్క హా హా హూ హూ మాత్రం ఆకర్షించింది. కష్టపడి సంపాదించి వేయిపడగలూ చుట్టబెట్టీ ఒక్క దీవెనా పొందలేదు, అప్పటికింకా బహుశా అది సమయం కాదు.
వివాహమై, బిడ్డల తల్లినయి, ఇరవై ఆరేళ్లు నిండుతూన్నప్పుడు, 1992 లో మళ్ళీ మొదలుపెట్టినప్పుడు తెలిసిందని అనిపించింది ఆ ఉద్గ్రంథం ఏమిటో, ఎందుకో. పదే పదే ప్రతిదినమూ పారాయణ వంటిది చేసి, నా చుట్టూ లోకాన్నంతా మరి ఇంకొకలాగా చూసి, వెతకటం మొదలుపెట్టాను ఇంకా ఏమేమి చెప్పారని. తిరిగి ఏకవీర, సింహళ రాజకుమారుడి స్నేహఫలము..అంతే.
ఒక ఉత్తరం రాశాను ‘గ్రంథకర్త కుమారులకి’. ‘అమ్మా, నమః’ అని ప్రారంభించి జవాబు ఇచ్చారు పావని శాస్త్రి గారు. ఆయన ఇల్లంటూ ఒకటి ఉందని ఆశ్చర్యపడుతూ వెళ్లి చూశాను. ఇక్కడ పడక, ఇక్కడ జపం, ఇక్కడ రచన…హృదయంలో కైమోడ్చాను.
శాస్త్రిగారి పితృప్రేమ ఎన్నదగినది.. ఆధునిక పాఠకులకు విశ్వనాథని పరిచయం చేయాలనే తాపత్రయంతో పులిమ్రుగ్గుని సరళవ్యావహారికంలో తిరగరాసి ఉన్నారు. అచ్చులోలేని పుస్తకాలని అందుబాటులోకి తేవాలనే గట్టి తపన. చిన్న కథల సంపుటిని ముందుగా వేశారు. మెల్లిగా చారిత్రక నవలలు అన్నీ ప్రచురించారు. మంగళగిరి లో ఉద్యోగం చేస్తూ ఉండే మా నాన్నగారు ఒక మంచిరోజున విజయవాడనుంచి ఆ కట్టను మోసుకొచ్చారు మా ఊరికి. అన్నిటినీ అతురనై పదిరోజులలో ముగించాను. పురాణవైర గ్రంథమాల మొత్తమూ, కాశ్మీర, నేపాళరాజవంశ నవలలూ, ధర్మ చక్రము, కడిమిచెట్టు వంటి ఇతరాలూ వాటిలో ఉన్నాయి. భారతదేశ చరిత్రని స్పర్ధతో, కూటనీతితో, ఆంగ్లేయులు ఎట్లా మార్చారో కొన్ని వారాలపాటు అందరికీ చెప్పుకున్నాను. ప్రతిపుస్తకపు వెనక అట్టమీద ఇంకా దొరకని పుస్తకాలు కనిపించేవి.
తెఱచిరాజు, స్వర్గానికి నిచ్చెనలు, పాతవి, వంశీ బుక్ స్టాల్ లో దొరికాయి. [స్వర్గానికి నిచ్చెనలు మూడోసారికి గాని అర్థమవలేదు. తెఱచిరాజు ఇంకా మొత్తం తెలియలేదు.] దేవతల యుద్ధము, పులుల సత్యాగ్రహము, నర్తనశాల నాటకం కూడా పాతవి అక్కడే దొరికాయి.
కోవెల సంపత్కుమారాచార్య గారు వేసిన రూపకాలు- సంపాదకీయాలు, పీఠికలు దొరికాయి… సరిపోలేదు. ఈలోపు పావనిశాస్త్రి గారు దివంగతులైనారు. రచన లో ‘సీత’ రాశారు అచ్యుతదేవరాయలు. ఒకేసారి ప్రౌఢమూ సుకుమారమూ అయిన వ్యక్తీకరణలో, ఆ శ్రీవిద్యాన్వయంలో,ఆ వాక్యాల విరుపులో తండ్రిగారు దర్శనమిచ్చారనిపించింది. వేయిపడగలు లోని చిన్న రామేశ్వరశాస్త్రి కదా వారు.. చాలా కాలం క్రితం ‘కైక’ కూడా రాశారు. వారి వెంటబడి నందమూరు వెళ్లాను. ఆయన ఇల్లుండిన వీథి, ఆ చుట్టూ మాగాణి, వేయిపడగలు లోని వేణుగోపాలస్వామి గుడి, విశ్వనాథ శోభనాద్రిగారు ప్రతిష్టించిన ‘మా స్వామి’ విశ్వేశ్వరుని ఆలయం… అన్నీ తిరిగాను. అచ్యుతదేవరాయలను అడిగాను ‘మీరచన మీ తండ్రిగారిదివలె ఉంటుందికదా’ అని. ఆయన అంగీకరించలేదు, తన పైన నన్నయ్య గారి ప్రభావం మాత్రం ఉందన్నారు. ‘మీరు నాన్న పోలికా అమ్మ పోలికా’ అని అడిగాను… ‘మా అమ్మ పోలికే మొత్తం’ అన్నారు సగర్వంగా. ప్రాణం ఉసూరుమన్నది. ఆయన చిన్నప్పుడు తండ్రికి దూరమయి బంధువుల ఇంట్లో పెరిగారని జ్ఞాపకం వచ్చి ‘అయ్యో’ అనిపించింది. అయినా వారిని అడిగాను పుస్తకాలు వేయండీ అని. అక్కడే ఉన్న పెద్ద వయసు రైతు ఒకరి నోటివెంట విశ్వనాథ వారి ఆకార విశేషాలను విని కాస్త శమించాను.
ఆ తర్వాత సంవత్సరంన్నర కి దొరికాయి మొత్తం నవలలూ, నాటకాలు, నాటికల సంపుటులు. వారసులు ప్రచురించారు. అమితమైన ఉత్కంఠతో ఎదురుచూసి ఆ పెట్టెలని ఇంటికి తెచ్చుకున్న రోజు ఇప్పటికీ గుర్తు ఉంది. ఇవాళ్టికీ అచ్చులో లేని కవిత్వ విమర్శా గ్రంథాల కోసం ఆశపడుతూ ఉన్నాను … వీలయితే ఆ ముద్రణకి ఒక చేయి అందించాలనుకుంటున్నాను.
తెలుగు ఋతువులు, వరలక్ష్మీ త్రిశతి, కిన్నెరసాని పాటలు వంటి కొన్నిటిని మినహాయిస్తే నా పరిజ్ఞానం తొంభయి శాతం వచనరచనల పైన ఆధారపడినదే. కల్పవృక్షం ఛాయలోకి నెమ్మదిగా ప్రయాణిస్తున్నాను.
ఈ మొత్తం నవలలూ నాచేతికి వచ్చేనాటికి డ్యూమాస్ ని, డికెన్స్ ని, విక్టర్ హ్యూగో ని, జార్జ్ ఇలియట్ ని, జేన్ ఆస్టిన్ ని సందర్శించాను, ఇంకా కొందరు స్రష్టలను కూడా. వీరెవ్వరూ విడివిడిగా ఏ ఒక్కరూ విశ్వనాథ తో సరి తూగలేరు. కొంతమంది కలిస్తే, కొన్ని చోట్ల.. ఏమో ! షేక్స్పియర్ ను నేను చదవలేదు కనుక ఆ ప్రస్తావన చేయను. మాస్తి వేంకటేశ అయ్యంగార్ కంటే, శివరామ కారంత్ కంటే, కల్కి కృష్ణమూర్తి కంటే, ఎం.టి.వాసుదేవన్ నాయర్ కంటే… నవలా రచనలో విశ్వనాథ గొప్పవారు…[ నేను చదివినవి అనువాదాలే అయినా.] ఆయా రచయితలను ఆ ప్రజలు ఎట్లా ఔదలదాల్చారో ఒక్కసారి గమనిస్తే….
***
పుస్తకం.నెట్ లో విశ్వనాథ పై, ఆయన సాహిత్యం పై వచ్చిన ఇతర వ్యాసాలను ఇక్కడ చదువగలరు.
Akhil Pattamatta
I am not able to buy Viswanatha vari books online. I live in Hyderabad. Where will be they available? Kindly help me.
Nagaraju Ramaswamy
మైథిలి అబ్బరాజు గారికి. విశ్వనాథున్ని సమగ్రంగా అధ్యయనం చేశారు కనుకనే మీ వైదుష్యం ఇంత సంపన్నంగా రుపొందింది. మీ రచనలు విడువకుండా చదువాలని మనసు తొందరిస్తుంటుంది.మీ శైలి ప్రత్యేకం. మీ వచనానికో వందనం.
pavan santhosh surampudi
మైథిలి గారూ,
ఇక్కడ భువనచంద్ర గారు కామెంటు రాసి ఈ టపాను గుర్తుకుతెచ్చారు. ఇంతకీ ఆ రెండోభాగం ఎపుడు రాస్తారు? అప్పట్లో నేను సర్లే మరో రెండు, మూడు నెలల్లో రాసేస్తారేమోననుకున్నాను. ఇప్పుడు అది చూస్తే అర్థ సంవత్సరం గడిచిపోయినట్టుంది. ఎన్నాళ్ళు పట్టవచ్చు. మాకు చదవాలనివుంది.
BHUVANACHANDRA
ఒక సముద్రాన్ని అద్భుతంగా మీ వ్యాసమనే ”’అద్దంలో”చూపించారు …ఆ అద్దమూ ఎంత పరి శుభ్రంగా వుందంటే …సాగర సౌందర్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించింది ……..మనసారా ఆశీర్వదిస్తూ …..భువనచంద్ర
Amarnath
నేను చూసిన విశ్వనాథ గారి నవలలలో పురాణవైర గ్రంధమాల లోని మొదటివైన భగవంతుని మీద పగ, నాస్తిక ధూమము వంటి వాటిలోని భాషకు చివరవైన పులిమ్రుగ్గు వంటి వాటిలోని భాషకు తేడా వుంది.
అలాగే వీర వల్లడు, చెలియలి కట్ట వంటివి కొంత సరళ మైన భాషలో వున్నాయి. ఆయా కాల మాన పరిస్థితులకు తగినట్టు గా విశ్వనాథ గారు అలా వ్రాసారని(చెప్పారని) అనుకున్నాను.
“శాస్త్రిగారి పితృప్రేమ ఎన్నదగినది.. ఆధునిక పాఠకులకు విశ్వనాథని పరిచయం చేయాలనే తాపత్రయంతో పులిమ్రుగ్గుని సరళవ్యావహారికంలో తిరగరాసి ఉన్నారు”
మైథిలి గారి ఈ పై వాక్యాల తో నేను చదివినవి తిరగ రాసినవా లేక అసలైనవేనా అని సందేహం కలుగుతోంది. నేను చదివిన విశ్వనాథ గారి నవలలు మైథిలి గారు చెప్పిన పురాణవైర గ్రంథమాల, కాశ్మీర, నేపాల రాజ వంశ చరిత్రలు వున్నకట్ట లోనివే.
మైథిలి గారు నా సందేహ నివృతి చేయగలరని ఆశిస్తున్నాను.
అది అలా ఉంచితే.. ఈ వెబ్ సైట్ ని కొత్త గా ఇప్పుడే చూసిన నాకు, విశ్వనాథ గారి సాహిత్యం ఇంకా ఇందరికి పరిచయం వుండటం, ఇందరు ఇష్ట పడటం, ఇలా చర్చ జరగటం చాలా ఆనందం గా వున్నది.
మైథిలి అబ్బరాజు
మీరు చదివినవి ఒరిజినల్ వేనండీ. నాకు తెలిసి పులి మ్రుగ్గు ఒక్కటే పావనిశాస్త్రి గారు తిరగరాశారు. విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు, వీరవల్లడు, మా బాబు, హాహా హూహూ, దమయంతీ స్వయంవరం, నందిగ్రామ రాజ్యం [ఇది చివరి నవల ] వంటి కొన్నిటిని విశ్వనాథ వారే వ్యావహారిక భాష లో రాశారు. రచనా వ్యాసంగం చివరిలో వాడటం కాదు, అప్పుడప్పుడూ -ముఖ్యంగా వస్తువును బట్టి వ్యావహారికం వాడారనుకుంటాను
Amarnath
థాంక్స్ మైథిలి గారు.
నా అభిప్రాయం కూడా అదే. వస్తువు లేక కథా ప్రాసంగిక కాల మాన పరిస్థితులను బట్టి భాష వాడారని అనుకున్నాను.
rajesh
Thanks for sharing your comments.. i am unable to find this books.. can u please tell me where these books are available
మైథిలి అబ్బరాజు
రాజేష్ గారూ , మీరు ఫేస్ బుక్ లో ఉన్నట్లయితే అక్కడ విశ్వనాథ వారి మనుమలు విశ్వనాథ సత్యనారాయణ [జూనియర్ ] గారు ఉన్నారు. వారిని సంప్రదించండి.
నా విశ్వనాథ -1 | Bagunnaraa Blogs
[…] అతిథి వ్యాసకర్త: డాక్టర్ అబ్బరాజు మైథిలి […]
కౌటిల్య
ఇవాళ్టికీ అచ్చులో లేని కవిత్వ విమర్శా గ్రంథాల కోసం ఆశపడుతూ ఉన్నాను >>>
విమర్శల సెట్టు దొరుకుతున్నదండీ! అచ్చులోనే ఉన్నది…
mythili
కృతజ్ఞురాలిని కౌటిల్య గారూ. మీ వ్యాఖ్య చూస్తూనే విజయవాడ బయలుదేరి పుస్తకాలు తెచ్చేసుకున్నాను.
S. Narayanaswamy
good show. Would like to read the next parts
mythili
చాలా సంతోషం సర్, రాస్తాను
Srinivas Vuruputuri
మైథిలిగారికి
ఎంతా బాగా రాసారు! హేలీగారి వ్యాసాలు చదువుతున్నప్పటినుంచి అనుకుంటూ ఉన్నాను – విశ్వనాథవారి పుస్తకాలు చదవాలని. మీ వ్యాసం చదువుతున్నప్పుడు ఇంక ఆలస్యం చేయకూడదని నిశ్చయించుకున్నాను.
విజయగోపాల్‌గారూ, మీ వ్యాఖ్య కూడా అంతే ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
శ్రీనివాస్
mythili
ధన్యవాదాలండీ ..మీ అధ్యయనం నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశిస్తున్నాను
Halley
చక్కని వ్యాసం .
“స్వర్గానికి నిచ్చెనలు” గురించి ఏదైనా వ్యాసం కానీ విశ్లేషణ గానీ మీకు తెలిసి అంతర్జాలం లో ఎక్కడైనా లభ్యం అయితే తెలుపగలరు. మీరే పుస్తకమ్.నెట్ కి ఒక వ్యాసం రాసిపెట్టినా కూడా అభ్యంతరం లేదు
mythili
థాంక్ యూ. ప్రయత్నిస్తానండీ. ఈ తరం వారు విశ్వనాథను చదువుకుంటున్నారనే తెలివిడి బ్రహ్మానందాన్ని కలిగిస్తోంది. వారిలో మా అమ్మాయి కూడా ఉండటం నా అదృష్టం.
Vijayagopal
హిమాలయ పర్వతశ్రేణి యున్నది.
ఈయమ్మ యందలి కొండ యొకదాని సానువులందు కనులు దెరచినది.
అక్కడి వాతావరణమీపెను గ్రమ్ముకొన్నది.
ఓయమ్మ మైథిలీ,
ఇంకను జూడవలసినది సాగరమంత యున్నది.
అది యత్య్త గభీరమును, గహ్వరమును.
అందీదుట మన బోంట్లకు తరము గాదు.
కేవల దర్శన మాత్రముననే యది నిన్ను కాలాంతరములకు గదిలించనెమో
నీ భాగ్యముననేమున్నదో
A.penchalareddy
మైథిలి గారు బాగు౦ది.మీరు ఇ౦కా,ఇ౦కా మరెన్నో మ౦చి వ్యాసాలు వ్రాయాల౦డి.నా ఫ్.బి లోని ఫ్రె౦డ్స్ జాబితా లో మీరే మొదటి వార౦డి.కాబట్టి మీరు ఏప్పుడూ ము౦దు౦డాల౦దడీ..
mythili
నమస్సులండీ! నా పుణ్యపేటి ఎంతటిదో …నా భాగ్యమెట్లున్నదో…
mythili
నమస్సులండీ! నా పుణ్యపేటి ఎంతటిదో …నా భాగ్యమెట్లున్నదో…