తెలుగు శబ్దసాగరం
(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. తెలుగు నిఘంటువులపై సంపాదకీయ వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్)
******
తెలుగుకు గల వ్యాకరణ దీపం చిన్నదని వెనుకటికి చెళ్ళపిళ్లవారు బాధపడ్డారు. వ్యాకరణ దీపమే కాదు-తెలుగుకు గల నిఘంటు దీపం కూడా చిన్నదే. ఇది మరింతగా బాధపడవలసిన విషయం. తెలుగు భాషకు అనేక విధాలుగా సేవ చేసిన సి.పి.బ్రౌన్ చక్కని నిఘంటువులు కూడా మనకు అందించిపోయాడు. అవి నేటికీ ఉపయుక్తంగానే ఉన్నాయి.
ఆ తర్వాత బహుజనపల్లివారి “శబ్దరత్నాకరం” వచ్చింది. సూర్యరాయాంధ్ర నిఘంటువు, శబ్దార్థ చంద్రిక మొదలైన తెలుగు నిఘంటువులు, కొన్ని ఆంగ్లాంధ్ర నిఘంటువులు వెలువడ్డాయి. కాని, ఇవేవీ సమగ్రమైనవి కావు; ఆధునికావసరాలకు తగినట్టివి కావు. శాస్త్రీయమైన పద్ధతులలో కూర్చినట్టివి కూడా కావు. సర్వసమగ్రమైన ఆధునిక నిఘంటువులను మనమింకా సంతరించుకోవలసే ఉంది.
బహుశా నేటి ప్రపంచ భాషలలో అమిత వేగంగా వృద్ధి అవుతున్నట్టిది ఇంగ్లీషు భాష. దానిలో ప్రతి యేడాది వందలాదిగా పదాలు వచ్చి చేరుతున్నాయి. లేదా సృష్టి అవుతున్నాయి. అందువల్ల ఇంగ్లీషు డిక్షనరీలను ఇంచుమించుగా ఏడాదికొకసారి, రెండేళ్ళకొకసారి “అప్ డేట్” చేసుకోవలసి వస్తున్నది.
మనలో గమనించేవారు లేరు గాని, తెలుగులో కూడా ఇదే విధంగా బహుశా వందలాది పదాలు కొత్తగా వచ్చి చేరుతూనే వుండివుండాలి. ఈ పదాలను సేకరించి అందజేసే నిఘంటువులు మనకి లేనే లేవు.
సైన్సు టెక్నాలజీలలోనే కాదు అన్ని విషయాలలోను విజ్ఞానం విపరీతంగా పెరిగిపోతున్నది. ఇందువల్ల భాషలు కూడా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల నిఘంటువులలో కూడా కనబడాలి.
ఇంతే కాదు, మన రాష్ట్రంలో తెలుగును ఉన్నత విద్య స్థాయిలో సయితం బోధన భాషగా చేయడం జరిగింది. మరి కొద్దికాలంలో దాన్ని పూర్తి స్థాయిలో అధికారభాషగా చేయడం కూడా జరుగనున్నది. ఈ నూతనావసరాలకు తగిన విధంగా నిఘంటువులు రూపొందవలసి ఉన్నది.
ఇప్పటివరకు తెలుగులో పాఠ్య గ్రంథాలను మాత్రమే తయారు చేస్తున్న తెలుగు అకాడెమీ తెలుగు నిఘంటువును రూపొందించే బాధ్యతను స్వీకరించనున్నట్టు ఇటీవల విద్యామంత్రి తెలియజేశారు. “తెలుగు శబ్దసాగరం” పేరిట రానున్న ఈ నిఘంటువు రచనకు మూడేళ్ళు పడుతుందట. పది లక్షలు వ్యయం కాగలదట. దానిలో సాహిత్యానికి సంబంధించిన పదాలే కాక, పత్రికలలో వస్తున్న పదాలు, సైన్సుకు, టెక్నాలజీకి సంబంధించిన పదాలు, మాండలిక పదాలు, వృత్తి పదాలు మొదలైనవన్నీ చేర్చుతారట.
ఇది తప్పకుండా హర్షించదగిన ఆలోచన. తెలుగులో ఇదివరకే వాడుకలో ఉన్న, కొత్తగా వాడుకలోకి వచ్చిన పదాలన్నిటినీ ఒకే సంపుటంలో చేర్చి అందజేయడం వల్ల విద్యార్థులకు, రచయితలకు తదితరులకు ఎంతైనా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇంగ్లీషు భాషతో మనకి గల అవసరాలు ఇప్పటితో తొలగిపోయేవి కావు కనుక, ఇప్పటివరకు ప్రామాణికమైన, నిర్దుష్టమైన ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు లేవు కనుక, అటువంటి దాన్ని తయారు చేసే బాధ్యతను కూడా తెలుగు అకాడెమీ చేపట్టడం అవసరం. అలాగే ఇంగ్లీషులో వస్తున్నట్టుగా సైన్సు, టెక్నాలజీ, రాజకీయాలు, అర్థశాస్త్రం, భూగోళం మొదలైన వివిధ విషయాలకు సంబంధించిన చిన్నచిన్న నిఘంటువులను విడివిడిగా తయారు చేయడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతారు.
నిజానికి ఇవి విద్యార్థులకే కాదు, ఇతరులకి కూడా చాలా ఉపయోగపడతాయి. తెలుగులో రిఫరెన్సు పుస్తకాలు చాలా తక్కువ. పారిశ్రామిక రంగంలో బేసిక్ పరిశ్రమలు ఎంత అవసరమో, వాఙ్మయరంగంలో బేసిక్ లిటరేచర్ గా పరిగణించదగిన రిఫరెన్సు పుస్తకాలు అంత అవసరం. సాహిత్యం, రాజకీయశాస్త్రం, అర్థ శాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రాలు, వైద్యశాస్త్రం ఇత్యాది వివిధ విషయాలలో ఇటువంటి రిఫరెన్సు పుస్తకాలు తెలుగు అకాడెమీ, సాహిత్య అకాడెమీ వలె ప్రభుత్వ సహాయం పొందుతున్న సంస్థలు నిర్వహించాలి. ఈ పనులు ఎంత త్వరగా జరిగితే మన భాషాభివృద్ధికి అంతగా దోహదం జరుగుతుంది.
ఆగస్టు 28, 1977
****
తెలుగు నిఘంటువులపై అంతర్జాలంలో ఉన్న కొన్ని వ్యాసాలు:
1. ఇంటర్నెట్‌లో తెలుగు డిక్షనరీలు – జంపాల చౌదరి గారి వ్యాసం, పుస్తకం.నెట్లో.
2. “మాండలిక వృత్తి పదకోశం” – 1962 నాటి ఆరుద్ర వ్యాసం, ఈమాట జూన్ 2008 సంచికలో.
3. “మాండలిక వృత్తిపదకోశ నిర్మాణం: భద్రిరాజువారి మార్గదర్శకత్వం” – బూదరాజు రాధాకృష్ణ గారి వ్యాసం ఈమాట జూన్ 2008 సంచికలో.
4. “తెలుగు నిఘంటువు గురించి..” వేలూరి వెంకటేశ్వరరావు గారి వ్యాసం ఈమాట సెప్టెంబర్ 2009 సంచికలో.
5. “మన తెలుగు నిఘంటువులు” మల్లీశ్వరి గారి వ్యాసం విశాలాంధ్రలో.
6. “నిఘంటువులు” వ్యాసం మాలిక పత్రికలో.
7. Great Lexicographers of Telugu – జనవరి 1966 నాటి “త్రివేణి” పత్రిక వ్యాసం.
Leave a Reply