Eating Animals – Jonathan Safran Foer

ఇటీవలి కాలంలో Eating Animals అన్న పుస్తకం చదివి శాకాహారినైపోయాను అని ఒక స్నేహితురాలు చెప్పడంతో, కుతూహలం కొద్దీ చదవడం మొదలుపెట్టానీ పుస్తకాన్ని. మొదట, ఆల్రెడీ శాకాహారులైనవాళ్ళకి ఇదేం పనికొస్తుంది? అనిపించినప్పటికీ, పుస్తకం మొదలుపెట్టాక ఆపకుండా చదివించింది. ఆధునిక పద్ధతుల్లో జరిగే factory farming ఆధారంగా నడిచే మాంసాహార ఉత్పత్తి వ్యవస్థ గురించి ఎన్నో సంగతులు తెలిసాయి. “మనం తినే ఆహారం ఎలా ఉత్పత్తి అవుతోంది?” అన్నది మామూలుగా చాలామంది అంతగా పట్టించుకోని విషయం కనుక, ఈ పుస్తకం గురించి పరిచయం చేయాలి అనిపించింది.

ఈ రచయిత ఇదివరలో కొన్ని నవలలు రాసి పేరు తెచ్చుకున్నాడు. ఊహతెలిసిన నాటి నుండి తన ఆహారపుటలవాట్లతో ప్రయోగాలు చేస్తూ ఉండేవాడట. అతనికి కొడుకు పుట్టే సమయంలో అతనికి- “నేను, నా కుటుంబం ఏం తింటున్నాం? మన ఆహారం ఎలా తయారవుతోంది? నా కొడుక్కి ఏం పెట్టాలి రేప్పొద్దున్న?” అన్న మీమాంస కలిగి, మూడేళ్ళు వాళ్ళ దేశం (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) లో గల వివిధ మాంసాహారం ఉత్పత్తి చేసే సంస్థలు, ఫ్యాక్టరీల చుట్టు తిరిగి, వాటిలోని పరిస్థితులను పరిశీలించి, ఎంతోమందితో మాట్లాడి పోగుచేసిన సమాచార సారమే ఈ పుస్తకం.

మొదట కాసేపు ఉపోద్ఘాతం లాగ తన ఆహారపుటలవాట్ల చరిత్ర చెప్పాక, పాయింటుకు వస్తాడు రచయిత. మరేమో కోళ్ళూ, గొర్రెలూ తింటే కుక్కల్ని ఎందుకు తినకూడదు? అంటూ మొదలుపెడతాడు (నిజానికి కొన్ని చోట్ల కుక్కల్ని కూడా తింటారనే విన్నాను. బహుశా అమెరికాలో తినరేమో మరి). ఆ తరువాత, క్లుప్తంగా ఆధునిక పద్ధతుల్లో చేపలు పట్టడం, దాని పర్యవసానాలు చెప్పాక నిఘంటువు తరహాలో కొన్ని పదాలకి వివరణలు రాస్తాడు. అక్కడ నుండి ఈ అంశంపై రచయిత ఆలోచనా విధానం బాగా తెలుస్తుంది. కొన్ని ఎంపిక చేసిన పదాలకు అతను ఇచ్చే వివరణల్లోనే చేపలు, మనుషులు ఆహారంగా వాడే ఇతర జలజీవాలు; పందులు; కోళ్ళు; గొర్రెలు; ఆవులు వగైరా వివిధ రకాల జంతు మాంసాల ఉత్పత్తి గురించి, అందులోని కౄరత్వం గురించి, వీటి చుట్టూ జరిగే తాత్విక చర్చల గురించి, మార్కెట్లో కనబడే వివిధ పదజాలం గురించి (ఉదా: organic, fresh, free-range, bio వంటివి) – ప్రాథమిక అవగాహన కలిగించాక, కొంచెం వివరాల్లోకి వెళతాడు తదుపరి అధ్యాయాల్లో.

factory farms లోకి వెళ్ళి పరిశీలించడానికి అనుమతులు ఇవ్వరు కనుక రహస్యంగా అర్థరాత్రుళ్ళు వీటిల్లోకి జొరబడి పరిశీలనలు చేస్తాడు ఈ రచయిత. మధ్యమధ్యలో factory farmer దృక్కోణం, PETA activist దృక్కోణం, సంప్రదాయ పద్ధతుల్లో, జంతువుల్ని సహజ వాతావరణాల్లో పెంచుతూ మాంసం ఉత్పత్తి చేసేవారి దృక్కోణం అంటూ ఇతర monologues వస్తూ ఉంటాయి పుస్తకం లో. వీటన్నింటి మధ్య ఈ ఆధునిక పద్ధతులు ఎలా మొదలయ్యాయి? వీటి వల్ల జంతువులపై చూపే కౄరత్వం అటు పెడితే, మనకి లభిస్తున్న మాంసాహారంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి? దాని వల్ల ఏమౌతోంది? ఈ కొత్త కొత్త రోగాలకి మూలాలు ఎక్కడ? అసలీ పద్ధతుల వల్ల ఇతరత్రా పర్యావరణంలో జరిగే మార్పులు ఏమిటి? వీటికి సంప్రదాయ పద్ధతులకీ తేడా ఏమిటి? ఇవన్నీ కూడా వివరిస్తాడు. నిజానికి రచయిత స్వగతాల కంటే, ఈ వివరాలు, ఈ భిన్న దృక్కోణాలే ఆసక్తికరంగా ఉన్నాయి ఈ పుస్తకంలో.

అయితే, పుస్తకం చదివాక కూడా నాకు అర్థం కానిది ఒకటి ఉంది. నిజానికి, పుస్తకం పేరు వల్ల అన్యాపదేశంగా అలా సూచిస్తున్నట్లు అనిపిస్తుంది కానీ, ఈ రచయిత తాను శాకాహారి అయినా, ప్రపంచం అంతా శాకాహారులు కావాలని కాదు సూచించేది (నాకర్థమైనంతలో). అలా అయిపోతే బాగుంటుంది కానీ, అందాకా “మాంసం తిన్నా ఆరోగ్యకరమైన పద్ధతుల్లో చేసినది మితంగా తినండి” అన్నది అడ్వొకేట్ చేసినట్లు అనిపించింది నాకు. ఇతనితో సంభాషణలోనూ, ఇతర పత్రికల్లోనూ Nicolette Hahn Niman సూచించేదీ అదే. ఈ పుస్తకం, ఆపై చదివిన కొన్ని వ్యాసాల తరువాత నేను కూడా – మాంసాహారులు ఆరోగ్యకరమైన సంప్రదాయ పద్ధతుల్లో పెరిగిన జంతువుల మాంసం తినడం నయం, ఫ్యాక్టరీ ఫార్మింగ్ జంతువులకే కాదు, మనుషులకీ మంచిది కాదు అన్న అభిప్రాయానికి వచ్చాను కానీ, ఈ పుస్తకంలో లోపించిన ప్రధానాంశం (అని నాకు అనిపించింది) ఏమిటంటే, పాల ఉత్పత్తిలో ఉన్న జీవహింస గురించి కనీస ప్రస్తావనైనా లేకపోవడం. ఈ రచయిత చెప్పిన పద్ధతిలో ఆలోచిస్తే, ఆవుల్ని permanent state of lactation లో ఉంచడం మాత్రం ethical అవుతుందా? అన్న ప్రశ్న వెంటాడింది నన్ను. సరే, ethics సంగతి అటు పెడితే, factory farms ద్వారా తయారైన మాంసం సంప్రదాయ పద్ధతుల్లో తయారైన దానితో పోలిస్తే ఆహారవిలువల్లో తూగదనీ, అలాగే పరిశ్రమలు అనుసరించే పద్ధతి sustainable కాదనీ అనేక రుజువులతో చూపిస్తాడు రచయిత. ఇదే లాగ ఆలోచిస్తే మరి ఫ్యాక్టరీ పాలు కూడా ఆరోగ్యకరం కాదా? అని మళ్ళీ ప్రశ్న. మనుషులందరూ శాకాహారులైపోతే సమస్య తీరిపోతుందని ఈయన భ్రమ పడుతున్నట్లు ఒక్కోచోట అనిపించింది నాకు. అందరూ శాకాహారులు అయిపోయి, factory farming వద్దనుకున్నాక మరి ఈ ఏడు బిలియన్ల ప్రపంచ జనాభాకి సరిపడా శాకాహారం sustainable పద్ధతుల్లో ఉత్పత్తి చేసుకోగలమా? అన్న ప్రశ్న ఈ రచయిత మనసులో ఉదయించినట్లు కనబడదు.

పైగా, మొత్తం పుస్తకం USA చుట్టూనే తిరుగుతుంది. ఒక పట్టాన భారతదేశంలో ఏం జరుగుతోంది? అన్న విషయం అర్థం కాలేదు నాకు. అన్ని ప్రశ్నలకీ ఈ రచయితే సమాధానం చెప్పాలని లేదు కానీ, కొంచెం నామమాత్రంగానైనా ప్రపంచంలోని ఇంకొక్క దేశాన్నైనా ప్రస్తావించి ఉండాల్సింది. ఈ రచన అతని వ్యక్తిగత ప్రయోజనాలకోసమే మొదలయినప్పటికీ, విస్తృతంగా పరిశోధన చేసినట్లు అనిపించింది. అలాగే, అసలు విషయం చెప్పేందుకు అటూ, ఇటూ కొంచెం కథ చెప్తేనే కానీ కుదరదు అన్నట్లు ఉండే శైలి ఇతనిది. మొదట్లో రెండు మూడు అధ్యాయాలు సొంతగోడు వెళ్ళబోసుకోడానికే సరిపోతుంది. ఒక పక్క “..is as objective as any work of journalism” అంటూనే ఈ సోదంతా ఎందుకు చెబుతున్నట్లు? అనిపించింది. అదేపనిగా సందు దొరికినప్పుడల్లా కాఫ్కా ఉపమానం వాడ్డం కూడా అనవసరం అనిపించింది. అయినా కూడా అసలు పాయింటు గురించి చర్చ మొదలయ్యాక ఆపకుండా చదివించింది. అలాగే, జంతువుల్ని చంపడం జీవనాధారంగా కలిగినా కూడా అందులో సంప్రదాయ పద్ధతుల్లో పనిచేసేవారికీ, పరిశ్రమలు నడిపేవారికీ ఆలోచనా విధానంలోనే కాదు, వారు తయారుచేసే మాంసాల్లో కూడా ఎంత తేడా ఉందో చదివితే ఆశ్చర్యం కలిగింది. ఒక్కసారి ఆ ఫ్యాక్టరీలకెళ్ళి ఆ కోళ్ళూ, గొర్రెలూ వగైరా ఎలా పుడుతున్నాయో, పెరుగుతున్నాయో, అసహజమైన ఎదుగుదలతో అంత త్వరగా ఎలా చంపబడుతున్నాయో చూస్తే ఎవరికీ ఆ ఫ్యాక్టరీల బ్రాండు మాంసం తినాలనిపించదేమో అనిపించింది.

మొత్తానికైతే, మనం తినే ఆహారం ఎక్కడ నుంచి వస్తోంది? అన్న ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా ఉదయించి ఉంటే తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

*******
పుస్తకం వివరాలు:
Eating Animals
Jonathan Safran Foer
352 పేజీలు, పెంగ్విన్ ప్రచురణ
పుస్తకం గురించిన వెబ్సైటు, వికీ లంకె
అమేజాన్ కొనుగోలు లంకె, flipkart లంకె (పేపర్ బుక్ గానూ, ఈ బుక్ గానూ లభ్యం)

You Might Also Like

One Comment

  1. డింగు

    బాగుంది మీ పరిచయం. ఇలాంటి విషయాలనే కొన్నిరోజుల క్రితం మంచుపల్లకి బ్లాగులో చదివాను.
    http://manchupallakee.blogspot.com/2012/03/part-1-of-4.html

Leave a Reply