తెలుగు గురించి ఆంగ్లంలో

ఇటీవలి కాలంలో, అనుకోకుండా చదవడం తటస్థించి లాభపడ్డాను అనుకుంటున్న పుస్తకాల గురించి సంక్షిప్త ప్రస్తావన ఈ వ్యాసం ఉద్దేశ్యం. వీటిలో, తెలుగులోని ప్రాథమిక వ్యాకరణం గురించి చదివిన ఆంగ్ల పుస్తకాలు కూడా ఉన్నాయి. “తెలుగు భాష వ్యాకరణం గురించి ఆంగ్లంలో వివరించే పుస్తకాన్ని, అదీ తెలుగువారికే పరిచయం చేయడమేమిటి? నీ మొహం!” అని ఒకపక్క లోపలి మనిషి కేకలు పెడుతున్నా, ఒక్క నాలుగుముక్కలైనా రాయాలి అనిపించింది. అందుకు కారణాలున్నాయి – ఒకటి, ఇది చదువుతూనే రోజూవారీ మాటల్లో ఇదివరకు గమనించని చాలా విషయాలు గమనించాను. రెండవది, ఒక భాష వ్యాకరణం ఇంకో భాషలో చదివితే ఎలా ఉంటుంది? అన్నది అర్థమైంది. మూడవది – నాతోటి అమాయకపు జీవులకి ఈ వ్యాసం ఏవన్నా ఉపయోగపడుతుందేమో అన్న ఆశ ఒకటి. అందుకని, ఏదో, నా అనుభవాలు పంచుకుందామని ఈ చిన్న వ్యాసం – autobiographical essay అనుకోవచ్చు.

కొంచెం నేపథ్యం చెప్పడం అవసరమిక్కడ: దాదాపు రెండేళ్ళ క్రితం Descriptive grammar and handbook of modern telugu అని, కోరాడ మహదేవశాస్త్రి గారి తెలుగు వ్యాకరణం మా గ్రంథాలయంలో కనబడింది. తెలుగు నేర్చుకునే విదేశీయులకోసం రాయబడ్డ పుస్తకమది. ఆసరికే “ఇంకా నాకు ప్రాథమిక వ్యాకరణమే రాదు, స్కూల్లో ఏం చెప్పారు? నాకు తెలుగులో ఎప్పుడు ఫస్టు మార్కులు ఎలా వచ్చేవి?” అన్న మీమాంసలో ఉండడం వల్ల, కనీసం ఇదన్నా చదువుదామని చెప్పి అరువు తెచ్చుకున్నాను. ఒక్క రెండు మూడు అధ్యాయాలు చదివేసరికి నిరాశ ఆవరించింది. ఎందుకంటే, విదేశీయుల సౌలభ్యం కోసం కాబోలు… ఋ” ని “రు” అని పలకాలి అనీ, థ ని ధ అని పలకాలి అని… ఇలా రాసారు కొన్ని చోట్ల. ఆ తరువాత, కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నా కూడా, ఇక మనవల్ల కాదు ఈ పుస్తకం… చదివితే తెలుగు వ్యాకరణం తెలుగులో చదువుకోవాలి, లేదంటే ఆ విషయం వదిలేసి, వ్యాకరణం తెలీకుండానే బ్రతకడం అలవర్చుకోవాలి అనుకున్నాను.

కట్ చేస్తే, నెలన్నర క్రితం తెలిసినవారితో అనుకోకుండా అయిన చిన్న సంభాషణ ప్రేరణతో, Semantic Universals in Indian Languages అన్న పుస్తకం చదవడం తటస్థించింది. పుస్తకకర్త ప్రముఖ భాషావేత్త Anvita Abbi. ఈ పుస్తకంలోని ప్రధానాంశం – వివిధ భరతఖండపు భాషల్లో (అవి భిన్న భాషా కుటుంబాలకి చెందినవి అయినప్పటికీ) ఉన్న సమానార్థక ప్రయోగాల గురించి (ఉదా: సిరిసంపదలు, ధన్-దౌలత్-హిందీ వంటివి). ఈ పుస్తకం గురించి నాకు ఇతరత్రా ఇబ్బందులు (ఎడిటింగ్ ఘోరంగా ఉండటం, ఒక్కోచోట పక్కదారి పట్టడం వంటివి) ఉన్నా, ఇది చదువుతూ ఉండగా చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతో పాటు – భాషాశాస్త్ర పుస్తకాలు చదివి అర్థం చేసుకోగలిగినంత అవగాహన నాకు తెలుగు వ్యాకరణంపై లేదన్న సంగతి మళ్ళీ అర్థమైంది. (అసలుకి ఏ వ్యాకరణమైనా మాకు పాఠశాలల్లో నేర్పిన పద్ధతిలో నేర్పిస్తే సరిగ్గా రాదన్న అభిప్రాయమూ ఏర్పడిపోయింది). సరే, అయినా, ఈ పుస్తకం వల్ల కలిగిన ఉపయోగాలు రెండు – ఒకటి, ధ్వన్యనుకరణ పదాలు (Onomatopoeia, ఉదా: కావ్ కావ్ మని అరవడం), ద్విరుక్తి (Reduplication, ఉదా: ఇంటింటి వంటివి) వంటి అంశాల గురించిన ఆసక్తి, రెండవది – ఇవన్నీ ఊరికే పైపైని తెలుసుకోవడం కాకుండా కాస్త లోతైన అవగాహన రావాలంటే వ్యాకరణం సరిగా తెలియాలన్న ఎరుక.

మొదటి అంశంలో తెలుగుపైని దృష్టి పెట్టి కొంచెం వివరంగా అర్థం చేసుకోవడానికి – డాక్టర్ పేరి భాస్కరరావు గారు రచించిన Reduplication and Onomatopoeia in Telugu అన్న చిరు పుస్తకమూ, ఎ.ఉషాదేవి గారు సంకలనం చేసిన “ధ్వన్యనుకరణ పదకోశం” (తెలుగు యూనివర్సిటి ప్రచురణ, 2001) అనబడు తెలుగు ధ్వన్యనుకరణ పద నిఘంటువూ చాలా ఉపయోగపడ్డాయి. భాస్కరరావు గారి పుస్తకం – దాని పరిమాణం వల్ల ఆట్టే భాషాధ్యయనం పరంగా ఉపయోగపడలేకపోయినా, ప్రత్యేకించి తెలుగు మీద మాత్రమే దృష్టిపెట్టి రాశారు కనుక కనీసం తెలుగువారికి ఆసక్తికరంగానే అనిపించవచ్చని నా అభిప్రాయం. వీటిలో ఇచ్చిన రిఫరెంసుల వెంబడి వెళితే ఈ ప్రక్రియల గురించి ఇంకాస్త అర్థమవుతుందన్న ఆశ కలిగింది. (ఏమాటకామాటే, ఈ నిఘంటువు తె.వి.విద్యాలయం వారి షాపులో ఇంకా దొరుకుతోందట. భలే పదాలు ఉన్నాయి ఇందులో. ఆసక్తిగలవారు కొనుక్కుని చదవగలరు!). ఇవి చదువుతున్నప్పుడే పదనిర్మాణశాస్త్రం (morphology) గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి – Francis Katamba, John Stonham రాసిన ప్రాథమిక స్థాయి పుస్తకం Morphology లోని కొన్ని నాకు relevant అనిపించిన అధ్యాయాలు చదివాను. మరీ అంత లోతుగా అర్థం కాకపోయినా, పుస్తకం చదవకముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం awareness కలిగిందని మాత్రం చెప్పగలను. బహుశా, రాబోయే కాలంలో మళ్ళీ ఎప్పుడో చదివి కొంచెం మెరుగ్గా అర్థం చేసుకోవాలి.

ఇక రెండవ అంశం విషయానికొస్తే, వ్యాకరణం. తెలుగు వ్యాకరణం మళ్ళీ ఆంగ్లంలో చదివే ప్రయత్నం చేయబూనాను. తెలుగులో తెలుగు వ్యాకరణం చదవాలని నిర్ణయించుకున్నావు కదా అప్పట్లో? అనుకోవచ్చు. మళ్ళీ దీనికీ ఓ కారణం ఉంది. ఇటీవలి కాలంలో భాషాశాస్త్రం అభ్యసిస్తున్న వారితో సంభాషణల్లో దొర్లిన పదజాలం వల్ల, బహుశా ఆంగ్లంలో చదివితే, ఈ భాషావేత్తలెవరన్నా నాద్వారా ఏదన్నా తెలుసుకోగోరితే (మా డిపార్ట్మెంటులో ఏదో ఒక ద్రవిడ భాష మాట్లాడే ఏకైక మనిషిని నేనే కనుక), వీళ్ళకి ఆంగ్లంలో వివరించగల అవగాహన నాకూ వస్తుంది కదా…అన్న ఆలోచన. ఈ నేపథ్యంలో A Grammar of Modern Telugu అన్న పుస్తకం కనబడింది. రచన – భద్రిరాజు కృష్ణమూర్తి, జె.పి.ఎల్.గ్విన్ గార్లు. ఇది రోజూ కొంచెం కొంచెం చదవడం మొదలుపెట్టాను. ఒకసారి చదివి, ప్రాథమిక అవగాహన తెచ్చుకోవడానికే నాకు దాదాపు మూడు నాలుగు వారాలు పట్టింది. బహుశా ఈసారి పుస్తకం కొనుక్కుని (దొరికితే!) తదుపరి కాలంలో చాలాసార్లు చదువుతానేమో అనిపిస్తోంది ఇప్పటికి.

ఇంతకీ, ఈ చివరి పుస్తకం తాలూకా పరిశోధనలు అరవైల ప్రథమార్థంలో జరిగితే, పుస్తకంగా వెలువడేందుకు తరువాత చాలా ఏళ్ళు పట్టింది. అయితే, అప్పటికీ ఇప్పటికీ భాష వాడుక లో చాలా మార్పు వచ్చిందేమో అనిపించింది ఇక్కడ వివరించిన సంగతులు చూస్తే. అందుకని కూడా అనుకుంటాను, ఈ వ్యాకరణం prescriptive గా కాకుండా descriptive గా ఉండటం నచ్చింది నాకు. ఇది కాక, ఈ పుస్తకం మహదేవశాస్త్రి గారి వ్యాకరణంతో పోలిస్తే, comprehensiveగా కూడా అనిపించింది (ఆ పుస్తకం నేను చివరిదాకా చదవలేకపోయాను కనుక, పై వాక్యాన్ని జస్టిఫై చెయ్యమని అడిగితే చెయ్యలేను). ఆంగ్లంలో తెలుగు వ్యాకరణం చదవడం వల్ల ఇప్పుడు నాకో లాభం కనబడ్డది – ఆంగ్లంతో పోల్చుకుని పోలికలు-తేడాలు అర్థం చేసుకోవడానికి అనువుగా ఉంది. మొత్తానికి, బాగా క్షుణ్ణంగా, సరైన పద్ధతిలో తెలుగు వ్యాకరణం అభ్యసించాలి అనుకునే adult Telugus కి ఈ పుస్తకం ఉపయోగపడకపోవచ్చు కానీ, ఎక్కడో ఒక చోట పునఃప్రారంభం జరగాలని చూస్తున్న వారికి భేషుగ్గా పనికొస్తుంది. చాలా సులభంగా అర్థమయ్యేలా, ఉదాహరణల సహితంగా రాశారు.

ఇప్పటికి ఇవే సంగతులు. ముందే రాసినట్లు, నా ప్రయత్నాలని (ongoing efforts ని) ఇలా పంచుకుంటే ఇలాంటి పడవమీదే ఇంకెక్కడో ప్రయాణం చేస్తున్న ఎవరికైన ఉపయోగపడవచ్చని నా ఆశ. అంతే. మరెప్పుడైనా నేను ముందుకు కొనసాగిన పక్షంలో మరికొన్ని పుస్తకాల గురించి ప్రస్తావించగలను. లేని పాండిత్యాలకి ప్రకర్షలుండవు అన్న విషయం గమనిస్తే ఈ వ్యాసం ఎందుకు రాశానో అర్థమవుతుందనుకుంటున్నాను.

You Might Also Like

Leave a Reply