మేం మళ్ళీ వస్తాం – తోలేటి జగన్మోహన రావుగారు
వ్యాసకర్త: మంజరి లక్ష్మి
*****
తోలేటి జగన్మోహన రావుగారు మామూలుగా కథా రచయిత. ఈయన రాసిన కథలు “తోలేటి జగన్మోహనరావు కథలు”, “లక్ష్మీకటాక్షం” అనే పేర్లతో కధా సంపుటాలుగా వచ్చాయి. ఈయన “మార్పు” అనే పేరుతో నక్సలైట్ ఉద్యమంతో పాటు మొత్తం కమ్యూనిష్టు ఉద్యమం గురించి రాసిన కథ బాగుంటుంది. ఈ పుస్తకానికి ముందే ఈయన “రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా” అనే పుస్తకం రాశారు. అందులో స్టాలిన్ రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో ఎంతో సరయిన నిర్ణయాలు తీసుకొంటూ హిట్లర్‌ని ఎలా మట్టి కరిపించిందీ అనేక వివరాలతో బాగా రాశారు. ఈయన సహజంగా కథా రచయిత అవటంవల్లనో ఏమో చాలా తేలికైన భాషలో (రంగనాయకమ్మగారికి మల్లేనే), అందరికీ తేలికగా అర్థమయ్యే విధంగా “మేం మళ్ళీ వస్తాం” పుస్తకాన్ని రాశారు. నా బోటి తక్కువ స్థాయి పాఠకులు కూడా చదివే విధంగా రాసినందుకు తోలేటి జగన్మోహన రావుగార్ని ఎంతో అభినందించాలి.
ఈ కమ్యూనిష్టు సాహిత్యం చదవాలంటే ఆ సబ్జెక్ట్‌తో పాటు, దానిలో వాడే భాష గూడా కొంత కఠినంగాను, వడికట్టు పదాలతోను ఉండటంతో నా బోటి వాళ్ళకు చదువుతుంటే ఒక్క వాక్యం కూడా ముందరికి నడవదు. అటువంటిది అందులో ఉన్న మొత్తం విషయాన్ని తార్కికంగా అవగాహన చేసుకోలేకపోయినప్పటికీ, ఆసాంతం నన్ను చదివించ గలిగినందుకే ఎంతో ఆనందిస్తూ ఈ పుస్తకాన్ని పరిచయం చేయటానికి సాహసించగలిగాను.
దీనిలో రచయిత ముఖ్యంగా తను చెప్పదలుచుకొన్నదాన్ని రొండు భాగాలుగా విడదీసి మొదటి భాగాన్ని “సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలలో పరిణామాలు” అనే పేరుతో సోషలిస్టు ఉద్యమ పతనానికి సంబంధించి సోషలిస్టు వ్యవస్థలో జరిగిన పరిణామాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. రొండవ భాగాన్ని “మార్క్సిజం అంటే ఏమిటీ?” అనే పేరుతో మార్క్సిజం అంటే ఏమిటో, సోషలిజం అంటే ఏమిటో చెప్పుకుంటూ వచ్చారు. తను చెప్పదలుచుకున్న ముఖ్యమైన అంశాలను ఈ పెద్దభాగాలలోనే కొన్ని చిన్న భాగాలుగా విడకొట్టి వాటికి తగిన పేర్లతో వివరంగా చెప్పుకుంటూ వచ్చారు.
మొదటి భాగంలో 1917 అక్టోబర్‌లో లెనిన్ నాయకత్వంలో కార్మిక వర్గ పోరాటం జరిగి సోషలిష్టు సమాజం ఏర్పడటం, (రష్యాలోనే మొట్టమొదటి సోషలిష్టు సమాజం ఏర్పడింది), ఆ తరువాత స్టాలిన్ లెనిన్ పంథాను జాతీయంగా, అంతర్జాతీయంగా కొనసాగించటానికి ప్రయత్నించటంతో పాటు సోషలిజం యొక్క ముఖ్య సూత్రమైన ప్రపంచ కార్మికుల ఐక్యతను నిలబెట్టటానికి కొమింటర్న్ అనే ఇంటర్నేషనల్ను ఏర్పరచి సామ్రాజ్యవాదంతో, కుహనా సోషలిష్టులతో అతను సంఘర్షించిన తీరు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తరువాత రష్యా దాన్ననుసరించి ఏర్పడిన మిగతా సోషలిష్టు దేశాలు చైనాతో సహా, 1953 లో స్టాలిన్ మరణానంతరం, ఎట్లా కాల క్రమేణా పతనమై పోయాయి అనేదానికి చారిత్రక కారణాలను వివరించుకుంటూ వచ్చారు.
ఈయనకు స్టాలిన్ మీద అతి అభిమానం అని విమర్శ ఉందంటూ, దానికి సమాధానంగా తను మొదట స్టాలిన్ వ్యతిరేక సాహిత్యాన్నే చాలా ఎక్కువగా చదివి అతన్ని అసహ్యించుకున్నాననీ, ఇటీవలి కాలంలో రష్యాలోని చారిత్రక విమర్శకులూ, జర్నలిష్టులూ రాసినవి, ఇంకా అనేక పుస్తకాల్నీ, జర్నల్స్‌నీ, కంప్యూటర్‌లో కూడా అనేక వ్యాసాలను చదివిన మీదటే తాను స్టాలిన్ మీద ద్వేషాన్ని పోగొట్టుకొని అతను ఎంత గొప్ప మార్క్సిష్టు-లెనినిష్టో తెలుసుకొని ఆ అవగాహనతోనే ఇదంతా రాస్తున్నానని ముందుమాటలో చెప్పారు. అదే తరహాలో తాను మావో వీరాభిమానిననీ, కానీ పైవన్నీచదువుతూ, మార్క్సిజం గురించి తెలుసుకుంటున్న క్రమంలో మావో ఎంత కుహనా మార్క్సిష్టో తన కర్థమైందనీ చెప్పారు. ఇది మాత్రం చాలా మందికి చాలా చాలా అశ్చర్యం కలిగించే విషయం. దీన్నిచూసే నేనసలు ఈ పుస్తకం చదవటానికి పూనుకున్నాను. ఆయన ఈ విషయాన్ని చాలా సోదాహరణంగా వివరించినప్పటికీ జీర్ణించుకోవటం చాలా కష్టమైన విషయమేననిపించింది, కనీసం నా బోటి వాళ్ళకు. ఇది తెలుసుకోవటానికైనా ఈ పుస్తకం తప్పకుండా చదివి తీరాలి.
సంక్షిప్తంగా ఈ పుస్తకంలోని విశేషాల గురించి నేను చెప్పాలను కుంటున్న నాలుగు మాటలు ఇవి:
లెనిన్ కార్మిక, కర్షక మైత్రితో విప్లవం సాగించి కార్మికవర్గ ప్రభుత్వం ఏర్పరిచినప్పటికీ అనేక యుద్ధాలను, బయటనుంచి లోపలనుంచి కూడా ఎదుర్కోవల్సి రావటంవల్ల సోషలిస్టు వ్యవస్థని ఏర్పరిచే విషయంలో ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది. దాని వల్ల వ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోను, పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంత కుదుటపడ్డ తరువాత 1922 నుంచి 1932 వరకు దశలవారీగా సోషలిస్టు శక్తులు కాపిటలిష్టు శక్తుల మీద దాడి చేసి విజయం సాధించాయి. 1928-33 మధ్య వ్యవసాయరంగంలో ఏర్పడిన అత్యంత ధనవంతులైన రైతు వర్గానికి (వాళ్ళని కులక్‌లని పిలుస్తారట) వ్యతిరేకంగా మళ్ళా ఇంకో విప్లవం జరిగింది స్టాలిన్ నేత్రుత్వంలో. అదే సమిష్టి వ్యవసాయ విప్లవం. ఇది చాలా హింసా పూరితంగా జరిగిందన్న విషయం మైఖేల్ షోలోకోవ్ వ్రాసిన “బీళ్ళుదున్నారు” అనే నవలలో వివరంగా చెప్పబడింది. అయితే కాపిటలిస్టు దేశాలకు వంత పాడే వాళ్ళు చూపిన లెక్కలన్ని ఇంకా మరీ ఘోరంగా విపరీతంగా ఉన్నాయనీ, అవన్నీ తప్పనీ చెపుతూ స్టాలిన్ నేరాలు ఘోరాలు 1, 2 అనే భాగాల్లో తను చదివిన డాక్యుమెంట్లలో వివరణలను ఆధారంగా చూపిస్తూనే, అయితే చారిత్రక ఘట్టంలో అది తప్పని నరైందని టి.జె. రావుగారు వివరంగా రాశారు. ఈ విప్లవం జరుగుతున్న కాలంలో స్టాలిన్ ఈ ఉద్యమం అతివాద ధోరణిలో పోతున్నదని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడుతూ రాసిన – “విజయాలతో మత్తెక్కి” అనే లేఖ బాగా ప్రసిద్ధి చెందింది. దీనికి రైతులు ప్రతిస్పందించిన తీరు కూడా “బీళ్ళుదున్నారు” అనే నవలలో వివరంగా వచ్చింది. అయితే ఇందులో టి. జగన్మోహనరావుగారు 83.2 శాతం భూమి వ్యవసాయ రంగంలోకి వచ్చిందనీ, మెషీన్ ట్రాక్టర్ స్టేషన్‌లు నిర్మించటంతో సహకార వ్యవసాయం అత్యంత ఆధునికం చేయబడి వ్యవసాయ ఉత్పత్తిలో విప్లవాన్ని, తద్వారా పారిశ్రామిక విప్లావాన్నితీసుకొచ్చిందనీ రాశారు.
కానీ నేను రంగనాయకమ్మగారు అనువదించిన “చైనాలో ఏం జరుగుతోంది” అనే పుస్తకంలో దీనికి భిన్నంగా చదివాను. దాని ప్రకారం చూస్తే టి.జె. రావుగారు పైన చెప్పింది తప్పనీ, ఈ వ్యవసాయ విప్లవం విఫలమైందనీ, అక్కడి నుంచే రష్యా పతనం ప్రారంభమైనట్లుగాను కనపడుతోంది. ఆ పుస్తకంలో రాసిన ప్రకారం చూస్తే స్టాలిన్ రాసిన లేఖని చూపించి సమిష్టీకరణలో మమ్మల్ని బలవంతంగా చేర్చారు, అలా బలవంతం చేయకూడదని పార్టీ రాసింది అనే వాదంతో రైతులు సమిష్టీకరణ నుంచి బైటపడటం మొదలు పెట్టారుట. 59% సమిష్టీకరణలోకి వెళ్ళిన భూమి 21.7%కి తగ్గిపోయింది. మాస్కో ప్రాంతంలో అయితే 1930 మార్చిలో 73% భూమి సమిష్టీకరణలో ఉండేదల్లా జూన్ నాటికి 7% అయింది. మిగిలిన సమిష్టీకరణ క్షేత్రాలు కూడా రైతుల నిరుత్సాహంతో నష్టాల పాలవటం వల్ల చివరికి సమిష్టీకరణలో మిగిలిన రైతులు కూడా కొంత కొంత భూమిని ప్రైవేట్ ప్లాట్‌లుగా సొంతంగా సాగు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చేసిందిట. అలా సహకార వ్యవసాయం అనేది వెనక్కి పోయిందనీ చదివాను. ఫ్రెంచి మార్క్సిస్టు అయిన చార్లెస్ బెతల్‌హమ్ రష్యా గురించి 4 సంపుటాలు రాస్తే, ఆయన 1వ సంపుటంలో రాసిన ఈ విషయాన్ని రంగనాయకమ్మగారు తాను అనువదించిన “చైనాలో ఏం జరుగుతోంది” అనే పుస్తకంలో పెద్ద ఫుట్‌నోట్‌గా (పేజి నెం.195-200) దీన్ని ఇచ్చారు.
స్టాలిన్ సోషలిష్టు నిర్మాణంలో ఆర్థికాభివృధ్ధికి యంత్రాలను నిర్మించే భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించటం, ఆ విధంగా పంచవర్ష ప్రణాళికలతో ముందుకు సాగటంతో పాటు యుద్ధపాటవానికి కావలసిన వాటన్నిటినీ కూడా ఈ భారీ పరిశ్రమల ద్వారానే సమకూర్చుకోవటం జరిగింది. దానివల్లనే ఆ తరువాత హిట్లర్‌ను, రొండో ప్రపంచ యుద్ధంలో ఓడించటానికి ఉపయోగపడిందని చెపుతూ, అతను తీసుకొన్న నిర్ణయాలు ఎలా సరైనవో, అతన్ని వ్యతిరేకించిన వారి మీద అది ఎలా నైతిక విజయంగా పరిణమిఁచిందో సోదాహరణంగా రాసుకొంటూ వచ్చారు. ట్రాట్స్‌కీకి, స్టాలిన్‌కు ఈ విషయంలో ఉన్న సిద్ధాంత భేదాలను చెప్పుకుంటూ వచ్చి స్టాలిన్ ఏ విధంగా సరైన మార్క్సిష్టు-లెనినిష్టో నిరూపించారు. అలాగే టిటో రివిజినిజానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కార్మిక పక్షాన నిలబడి పోరాడిన వ్యక్తిగా స్టాలిన్ని కొనియాడారు. టిటో ఎలా జాతీయవాదో, రివిజనిష్టో సోదాహరణగా రాసుకుంటూ వచ్చారు. కానీ నేను చదివిన కొన్నిపుస్తకాలలో రొండో ప్రపంచ యుద్ధం కాలంలో రష్యా తాను కూడా ఒక సామ్రాజ్య వాద దేశంగా మారి, మొదట“జర్మనీ పోలెండ్‌ని ఒక వేపునుంచి ఆక్రమిస్తే సోవియట్ రష్యా కూడా పోలెండ్‌ని ఇంకో వేపునుంచి ఆక్రమించింది….. పోలెండ్‌ని పంచుకోవటానికి కూడా జర్మనీ రష్యాలు సెప్టెంబర్ 29న ఒక ఒప్పందం చేసుకొన్నాయి” (రంగనాయకమ్మ గారి కాపిటల్ పరిచయం 2, పేజీ 354) ఆ తరువాత ఫిన్‌లాండ్ దేశం తను ఇమ్మన్న భూ భాగాన్ని ఇవ్వనందుకు, దాని మీద బాంబులతో దాడి చేసి ఎంతో మందిని చంపి, ఆ భూభాగాన్ని ఆక్రమించి తరువాత కూడా తన క్రిందనే అట్టే పెట్టుకున్నదనీ, దాన్ని బట్టి చూస్తే అప్పటి నుంచే రష్యా సోషలిస్టు సామ్రాజ్యవాదిగా మారిందని తెలుస్తోంది. ఎం.ఎన్.రాయ్ రాసిన పుస్తకంలో కూడా తాను ప్రతిరోజు రష్యా రేడియోలో ఇంటర్నేషనల్ గీతం వింటూ ఉండే వాడిననీ, కానీ ఆ రోజు నుంచి ఇంటర్నేషనల్ గీతం రష్యా రేడియోలో రావటం ఆగిపోయిందనీ, రష్యా కూడా ఒక జాతీయవాదిగా, సామ్రాజ్యవాదిగా మారిందనటానికి అదే ఒక సంకేతంగా నిలిచిపోయిందని రాశారు.
ఆ తరువాత అనేక కారణాలు చూపిస్తూ అంతర్గతంగా రొండో ప్రపంచయుద్ధం వల్లా, బాహ్యంగా సోషలిస్టు దేశాలన్నీ చైనాతో సహా జాతీయవాదులుగా, రివిజనిష్టులుగా మారటం వల్లా, స్టాలిన్ మరణానంతరం రష్యాలో కొత్తగా ఎదిగిన నయా బూర్జువా వర్గం, మిగతా బూర్జువా వర్గాల సహకారంతో కృశ్చేవ్ నాయకత్వంలో ఎలా ప్రభుత్వాన్ని స్వాధీనంలోకి తెచ్చుకొన్నదీ, మిగతా సోషలిష్టు దేశాల్లో (అవి రష్యా అంత గొప్ప స్థాయి సోషలిష్టు దేశాలు కాకపోయినప్పటికీ!) సోషలిష్టు వ్యవస్థలు కూడా ఎలా కాపిటలిష్టు వ్యవస్థలుగా తిరోగమనం చెందింది ఆయన దృక్పథంలో అయన బాగానే వివరించారు. రష్యా గురించి రాసిన ఈ మొత్తం వ్యాసంలో స్టాలిన్ ఉక్కుమనిషనీ, మార్కిష్టు లెనినిష్టు మహోపాధ్యుడనీ, వ్యక్తి పూజ తప్పే అయినప్పటికీ రొండో ప్రపంచయుద్ధంలో గెలవటానికీ స్టాలిన్ వ్యక్తి పూజ కూడా సహాయ పడిందనీ గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు.
చైనాలో పరిణామాలను గురించి కూడా ఈ మొదటి భాగంలోనే వివరించారు. చైనా విప్లవం రష్యా విప్లవం మల్లే కార్మికవర్గ విప్లవం కాదు. రైతాంగ విప్లవం. ఇది మావో నాయకత్వంలోని కమ్యూనిష్టు పార్టీ కింద జరిగింది.
ఇందులో మావో ఉత్త జాతీయవాదే కానీ అంతర్జాతీయ కార్మిక లోకానికి దారి చూపించగల లెనిన్, స్టాలిన్‌ల వంటి గొప్పమార్క్సిష్టు మేధావి కాదనీ, ఉత్త భావవాదే కానీ, భౌతికవాది కాదనీ, అతను మార్క్స్ రాసిన కాపిటల్ అసలు చదవలేదనీ, అతను చెప్పే (కుహనా) మార్క్సిష్టు సూత్రాలు కూడా అసలు మార్క్సిష్టు తత్వశాస్త్రాన్ని అన్వయించి చూస్తే సరైనవి కావనీ, ఏది చెప్పినా కూడా, ఆచరణలో అంతా అవకాశవాదం, కప్పదాటు విధానాలనే అనుసరించాడనీ సోదాహరణంగా చెప్పుకుంటూ వచ్చారు. అతను జాతీయ బూర్జువాలతో పోరాడాల్సింది పోయి ఐక్యత-ఘర్షణ-ఐక్యతా అని చెప్పి వాళ్ళతో తన నాయకత్వం నిలుపుకోవటానికి ఐక్యతే పాటించాడు. అంతర్జాతీయంగా కూడా టిటోతోనూ, కృశ్చేవ్‌తోను, చైనాకు ఉపయోగకరంగా ఉన్నంతవరకూ వాళ్ళతో పాటు స్టాలిన్‌ను విమర్శిస్తూ వచ్చి, ఆ తరువాత వాళ్ళు చైనా ఉపయోగాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మళ్ళా వాళ్ళను విమర్శిస్తూ స్టాలిన్‌ని అంతకు ముందు తిట్టిన వాడే సమర్థిస్తూ రాసుకొచ్చాడనీ చైనాలో ప్రచురించిన పత్రాలు, వ్యాసాల ఆధారంగా తన వాదనను చాలా బాగా సమర్థించుకుంటూ, రాసుకుంటూ వచ్చారు. మావో చైనాలో వ్యవసాయ సోషలిజం సాధించాలని చూశాడనీ, అతని మీద మార్క్సిష్టు అర్థశాస్త్రం కన్నా చైనాలో పూర్వం ఉన్న తైపింగ్, ఇంకా ఇతరుల విప్లవ నినాదాలే ఎక్కువగా పని చేశాయనీ అన్నారు.
ఈయన చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవం గురించి రాసిన చాలా విషయాలు రంగనాయకమ్మగారు రాసిన “కమ్యూనిష్టు పార్టీ ఎలా ఉండకూడదు” అనే పుస్తకంలో ఉన్న విషయాలకు దగ్గరగా ఉన్నాయి. ఈ పుస్తకాన్ని యుంగ్ చాంగ్ అనే చైనా రచయిత్రి “వైల్డ్ స్వాన్” అనే పేరుతో రాస్తే దాన్ని వెనిగల్ల కోమలిగారు తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగు అనువాదం పేరు “అడవి గాచిన వెన్నెల”. ఈ పుస్తకాన్ని రంగనాయకమ్మగారు “కమ్యూనిష్టు పార్టీ ఎలా ఉండకూడదు” అనే పేరుతో విమర్శనాత్మక-పరిచయం చేశారు. ఇందులో కథానాయిక (రచయిత్రే) తన అమ్మమ్మ కాలం నుంచి తన దాకా చైనాలో జరిగిన విషయాలను, తన అనుభవాలతో కలిపి రాశారు. అందులో ఆమె తల్లితండ్రులు కమ్యూనిష్టు పార్టీ సభ్యులై విప్లవకాలంలో ఎంతో కష్టపడి పని చేశారు. అయితే ఈ సాంస్కృతిక విప్లవ కాలంలో వాళ్ళ కుటుంబమంతా రెడ్ గార్డుల చేతుల్లో చాలా చాలా బాధలకు గురయ్యారు. ఈ “అడవి గాచిన వెన్నెల” పుస్తకం చదివితే టి.జె.రావుగారు రాసిన విషయాలు ఇంకా బాగా తెలుసుకొనే వీలుంది. అయితే దీని మీద రంగనాయకమ్మగాఋ రాసిన అభిప్రాయాలు (విమర్శలు) తెలుసుకోవాలి అంటే “కమ్యూనిష్టు పార్టీ ఎలా ఉండకూడదు” అనే పుస్తకం కూడా తప్పక చదవాలి.
ఇందులో తోలేటీ జాగన్మోహన రావు గారు మావో ఈ సాంస్కృతిక విప్లవాన్నినడిపింది పార్టీలో తన నాయకత్వం నిలుపుకోవటానికి చేసిందేననీ, దానికోసం సైన్యాన్ని కూడా దింపాడని, అది చివరికి మావో మీద సైన్యం పట్టు సాధించే విధంగా పరిణమించిందని కొంతమంది పరిశీలకులు చెప్పినట్లుగా సాంస్కృతిక విప్లవానికి ఇంకొక కొత్త కోణాన్ని కూడా చేర్చారు. కానీ ఈ సాంస్కృతిక విప్లవానికి మరో కోణం కూడా ఉంది. దాన్ని ఈ రచయిత ఎక్కడా ఈ పుస్తకంలో ప్రస్తావించ లేదు. ప్రెంచి మార్క్సిష్టు రచయిత చార్లెస్ బెతెల్‌హం రాసిన పుస్తకాన్ని తెలుగులో రంగనాయకమ్మగారు “సాంస్కృతిక విప్లవం, పరిశ్రమల నిర్వహణ”అనే పేరుతో అనువాదం చేశారు. ఇది తప్పక చదవవలసిన పుస్తకం. దీనిలో, సాంస్కృతిక విప్లవం మొదట ఉపరితలంలోనే ప్రారంభమైనప్పటికీ, అది సాగుతున్నకొద్దీ పునాది భాగమైన ఆర్థిక రంగంలోకి కూడా పాకిందనీ, ముఖ్యంగా కార్మికులు ట్రేడ్ యూనియన్‌లను ఎదిరించి, తమ పరిశ్రమల నిర్వహణను తామే నిర్వహించుకోవాలని నిర్ణయించుకోటం జరిగింది. ప్రాథమికంగా వర్కర్స్ మానేజ్‌మెంట్ టీములుగాను, యంత్రాలకు సంబంధించి కార్మికులు, ఇంజనీర్లు, కార్యకర్తలు కలిసి పనిచేసే త్రీ-ఇన్-ఒన్ టీములుగాను ఏర్పడటం, మళ్ళా వాళ్ళందరూ కలిసి విప్లవ కమిటీలను ఎన్నుకోవటం, కార్యకర్తలు కూడా శ్రమలో పాలు పంచుకోవటం, ప్రతిరోజూ కార్మికులందరూ సమావేశమై కార్మికులు ఉత్పత్తి విషయాలను, మిగతా విషయాలను చర్చించుకోవటం అనేవన్నీ గొప్ప ప్రయోగాలుగా సాగాయనీ, అవి సోషలిస్ట్ సమాజంలో కార్మికులు తమ ఫ్యాక్టరీలను తామే నడుపుకోవటం ఎలాగో మొట్ట మొదటి సారిగా చూపించిన గొప్ప విప్లవాత్మకమైన, గుణాత్మకమైన మార్పులను సూచించే విధంగా ఉన్నాయనీ రాయబడింది. ఫ్రెంచి మార్క్సిష్టైన చార్లెస్ బెతల్‌హం అనేకసార్లు చైనా వెళ్ళి అక్కడ ఉండీ ఇతరులను ఇంటర్వ్యూ చేసి రాసిన పుస్తకం ఇది. భారీ పరిశ్రమలైనట్లైతే కార్మికులు తమ మేనేజ్‌మెంట్‌లో నిర్వహించుకోవటం కష్టమని చెప్పి, పరిశ్రమలను వికేంద్రీకరించి కార్మికుల మేనేజ్‌మెంట్ క్రిందే నడపటమనేది కూడా జరిగింది. ఇది గొప్ప సోషలిష్టు వ్యవస్థను నిర్మించుకోవటానికి అవకాశం కల్పించింది.
అయితే తోలేటి జగన్మోహన్ రావుగారు తన పుస్తకంలో భారీపరిశ్రమలూ, భారీ ఉత్పత్తిసాధనాలతో, ఏకీకృత ప్లాన్‌లతో, ఏక వ్యక్తి మానేజ్‌మెంట్లతో నడపడమే సోషలిష్టు సమాజానికి సరయినదని చెప్పుకుంటూ, సమర్థించుకుంటూ వచ్చారు. ఉత్పత్తి శక్తులు సరిగా అభివృద్ధి చెందక పోవటం వలననే సోషలిస్ష్టు వ్యవస్థలు కూలి పోయినట్లుగా కూడా చెప్పుకుంటూ వచ్చారు.
ఈ ఉత్పత్తి శక్తుల అభివృద్ధి గురించి రంగనాయకమ్మగారు ‘చైనాలో ఏం జరుగుతోంది’ అనే పుస్తకం ముందు మాటలో ఇలా రాశారు. ”రష్యా సమాజంలో ఇక వర్గాలు లేనేలేవు (స్టాలిన్) అనే తప్పు అవగాహనే గాక, సోషలిజానికి మూలం వుత్పత్తి శక్తుల అభివృద్ధి అనే తప్పు ధోరణి కూడా రష్యా పార్టీలో ఉంది. ఈ వుత్పత్తి శక్తుల సిద్ధాంతం రివిజనిష్టు లందరికీ ఆరాధ్య సిద్ధాంతం. సోషలిజాన్ని ప్రారంభించడానికీ, అభివృధ్ధి పరచడానికీ శ్రామికవర్గాల అధికార నిర్వహణ లేనిచోట వుత్పత్తి ఎంత పెరిగితే మాత్రం దానివల్ల గుణాత్మకమైన మార్పు ఏం జరుగుతుంది ……. వుత్పత్తి శక్తుల అభివృద్ధి మీదే సోషలిజం ఆధారపడుతుందని చెప్పేవారి ప్రకారం చూస్తే వుత్పత్తి శక్తులు ఏ స్థాయికి పెరిగితే సోషలిజం సాధ్యమౌతుందీ? …. “ వర్గపోరాటం నడుస్తూ ఉఁటేనే నిజానికి ఉత్పత్తి శక్తుల పెరుగుదల కూడా భారీగానే జరుగుతుందని చెపుతూ చైనా గురించి ఇలా అన్నారు “ఉత్పత్తి శక్తుల విషయంలో చైనా విప్లవ పంధా సరైన అవగాహనతోనే వున్నా, `సోషలిస్టు పునాది విషయంలోనూ, `పార్టీ పాత్ర’’ విషయంలోనూ, ఇంకా కొన్ని విషయాల్లోనూ పొరపాటు అవగాహనలతో ఉంది”(చైనాలో ఏం జరుగుతోంది పేజీ నెం.45). ఇది చదివితే టి. జే. రావుగారి ఉత్పత్తి శక్తులపై రాసిన అవగాహన తప్పుగా ఉన్నట్లు తెలిసిపోతుంది.
తోలేటి జగన్మోహన రావుగారు స్టాలిన్ పిడివాదం వలన సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలో విలువ సూత్రాన్ని పరిగణలోకి తీసుకోలేదని, స్టాలిన్ మీద ఆరోపణ ఒకటి ఉందని చెపుతూ “మార్క్స్ సరకు విలువ ఆ సరకు ఉత్పత్తికి సామాజికంగా అవసరమైన శ్రమను బట్టి నిర్ణయించబడుతుందన్నాడు” అని చెపుతూ దానికి కొనసాగింపుగా చెప్పిన దానిలో సరకు ఉత్పత్తి విలువకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్నతేడాను ఎత్తేసి, మార్క్సే సరకు విలువను, మార్కెట్ ధరను పర్యాయ పదాలుగా వాడినట్లుగా అర్థం వచ్చేటట్లుగా “సరకు ధర సరఫరా గిరాకీల మీద ఆధారపడుతుందనీ, గిరాకీ కంటే సరఫరా ఎక్కువైనప్పుడు సరకు ధర విలువకంటే తక్కువ ఉంటుందనీ, సరకుకు గిరాకీ ఎక్కువైనప్పుడు, సరకు ధర విలువ కంటే ఎక్కువ ఉంటుందనీ, గిరాకీ, సరఫరా సమంగా ఉన్నప్పుడు సరకు ధర విలువకు సమానంగా ఉంటుందనీ మార్క్స్ వివరించాడని” రాశారు. ఇక్కడ టి.జె రావుగారు అసలు ఏ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఉత్పత్తి విలువ, (మార్కెట్) ధర, సరఫరా, గిరాకీ అనేవి వాడటం జరిగిందో తెలియటం లేదు. పెట్టుబడిదారీ సమాజంలోనైతే సరుకు ఉత్పత్తి విలువ, మార్కెట్ ధర ఒకటి కావు. పరిశ్రమకూ, పరిశ్రమకూ మధ్య పెట్టుబడుల కాంపొజిషన్స్ చాలా తేడాలు ఉండటంవల్ల వాటినుంచి వచ్చే అదనపు విలువలు కూడా వేరు వేరుగా ఉంటాయి. కానీ పెట్టుబడిదారుల మధ్య విపరీతమైన పోటీ ఉండటంతో, సమాన పెట్టుబడులకు సమాన లాభాలు రావాలి అనే సూత్రం వల్ల, పెట్టుబడిదారులు పెట్టుబడి మీద జనరల్ లాభాన్ని మాత్రమే వేసుకొని మార్కెట్ ధరను నిర్ణయిస్తారు. అప్పుడు సరకు యొక్క మార్కెట్ ధర సరకుకన్నాఎక్కువగానో, తక్కువగానో (కొన్ని సార్లు విలువతో సమానంగా కూడా ఉండవచ్చు.) ఏర్పడి ఆ సరుకు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఈయన చెప్పిన సరఫరా గిరాకీల సూత్రం అన్వయించబడి మార్కెట్ ధర కన్నా ఎక్కువగానో తక్కువగానో అమ్ముడవుతాయి. ఆ విధంగా ప్రతి పెట్టుబడిదారుడు తను పెట్టిన పెట్టుబడికి రావలసిన జనరల్ లాభాన్ని కొద్దిగా ఆటో, ఇటోగా పొందగలుగుతాడు. అదే సోషలిష్టు వ్యవస్థలోనైతే పరిశ్రమలన్నీ జాతీయం చేయబడతాయి కాబట్టి ఇక్కడ పరిశ్రమకీ, పరిశ్రమకీ మధ్య పోటీ ఉండే ప్రశక్తే లేదు. ఇక్కడ కార్మిక ప్రభుత్వమే ఉత్పత్తిని ప్లాన్‌చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ పోటీ ప్రశక్తే ఉండదు కాబట్టి ధరలు విలువల్నించి తప్పిపోయే ప్రశక్తి కూడా ఉండదు! ఎక్కడి ఉత్పత్తి విలువను అక్కడే ధరగా నిర్ణయించుకోవచ్చు. ఉత్పత్తి ఖర్చులకు సోషల్ ఫండు భాగాన్ని కూడా కలుపుకొని ధరను నిర్ణయిస్తారు. ఆ సోషల్ ఫండ్ భాగాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తే, దాన్ని ప్రభుత్వం కార్మికుల ఉమ్మడి అవసరాలకు వినియోగిస్తుంది.
ఈయన చెప్పిన ప్రకారం రష్యా సోషలిస్టు సమాజంలో స్వేచ్చా విపణి ఉన్నట్లైతే గిరాకీ, సరఫరాల వల్లైనా ఆ సోషల్ ఫండు భాగమే తగ్గాలి కానీ విలువ భాగం ఎలా తగ్గుతుంది? నేను రంగనాయకమ్మగారి పుస్తకాల్లో చదివిన దాన్నిబట్టి చూస్తే అసలు సోషలిస్టు సమాజంలో ప్రభుత్వమే తయారైన ఉత్పత్తిని, ఉత్పత్తి సంస్థలనుంచీ కొనుగోలు చేసి (సోషల్ ఫండ్ భాగాన్ని తనే కలిపి కానీ, లేక ఉత్పత్తి సంస్థలే ముందుగా కలిపి ఉంచిన ధరకు కానీ(షోషల్ ఫండ్ ఎంత శాతం కలపాలనేది కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది)) వాటిని డిస్ట్రిబ్యూట్ చెయ్యడం చేస్తుంది. మరిక్కడ సోషలిష్టు సమాజంలో టి.జె. రావుగారు చెప్పిన గిరాకీ, సరఫరాల ప్రశక్తి మాత్రం రావలసిన పనేముంది. స్టాలిన్ కాలంలో రష్యాలో జరిగిన విషయాలను టి.జె. రావుగారు వివరించిన విధానాన్ని బట్టి చూస్తే మహామహోపాధ్యాయుడూ, గొప్ప లెనినిష్టు-మార్క్సిష్టు మేధావీ అయిన స్టాలినుక్కూడా సోషలిస్టు సమాజంలో ధర ఎలా నిర్ణయింపబడుతుంది అనేది తెలిసినట్లుగా లేదు. ప్రభుత్వమే డిస్ట్రిబ్యూట్ చేసే సందర్భంలో ప్రజల అవసరాలనుబట్టి కొన్ని ఉత్పత్తులను, సోషల్ ఫండ్ భాగాన్ని కానీ, రవాణా ఖర్చులను కానీ వదిలేసి అసలు విలువకే అందించటం చెయ్యవచ్చు. స్టాలిన్ కాలంలో పరిశ్రమలు నిర్వహించిన విధానం చూస్తే స్వేచ్ఛా విపణి, ప్రభుత్వ సంస్థలు గుత్త సంస్థల రూపంలో నడిచినట్లు, మన భారత దేశాల్లాంటి దేశాలలోకి మల్లేనే ప్రభుత్వం ప్రజలకు అవసరమైన ఉత్పత్తులను ఎక్కువ ధరలకు కొని తక్కువ ధరలకు (సబ్సిడీ ధరలకు) ఇచ్చే సంక్షేమ రాజ్యంగా నడిచినట్లు కనపడుతున్నది. అందుకనే ఆ తరువాత రష్యాలోని విధానాలను పరిశీలించినవాళ్ళు అక్కడ సంక్షేమ రాజ్యం నడిచింది కానీ సోషలిస్టు సమాజం ఏర్పడనేలేదని చెపుతారు. కానీ రంగనాయకమ్మ గారు అనువాదం చేసిన “సాంస్కృతిక విప్లవం పరిశ్రమలనిర్వహణ” పుస్తకం చదివినట్లైతే సాంస్కృతిక విప్లవం కాలంలో చైనాలో జరిగిన సోషలిష్టు శ్రమ విభజనా, సోషల్‌ఫండును కలుపుకొని ధరను నిర్ణయించే విధానం, కార్మికులే మానేజ్‌మెంట్ బాధ్యతలు నిర్వహించుకుంటూ ఉత్పత్తి చేసే సోషలిస్టు ఉత్పత్తి విధానం ఇవన్నీ కూడా ఒక వెలుగు వెలిగి రష్యాలో కన్నా, చైనాలోనే ఎక్కువ సోషలిస్టు పంధాను అనుసరించటానికి ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ రచయిత దీన్ని ఎక్కడా ప్రస్తావనగానన్న తీసుకు రాలేదు. రష్యా (స్టాలిన్)కన్నా ఎక్కడ చైనా (మావో) గొప్పగా కనపడుతుందోననే ఇలా రాశారనిపిస్తుంది, ఎందుకో అది ఈ రచయితకు అస్సలు ఇష్టం లేని విషయంగా కనిపిస్తోంది.
మార్క్సిజం – లెనినిజం అని మాటిమాటికి ఈ రచయిత రాస్తూ వస్తున్నారు. మార్క్సిష్టు సిధ్ధాంతాన్ని రాసింది మార్క్సే కాబట్టి మార్క్సిజం అంటే సరిపోతుంది కదా! లెనిన్ ఆ సిధ్ధాంతాన్నిఅప్పటి రష్యా పరిస్థితులకూ, ప్రపంచ పరిస్థితులకూ అన్వయించటమో, విస్తరింప చేయటమోనే కదా చేసింది. అసలు సిద్ధాంతాన్ని రాసిన వ్యక్తి పేరుకు ఇలా తోకలు తగిలించుకుంటూపోతే ఎక్కడికి చేరతాం. అఁదుకని అసలు తోకను కత్తిరించి మార్క్సిజం అంటేనే కరక్టుగా ఉంటుంది.
తోలేటి జగన్‌మోహనరావుగారు కొంతమంది మార్క్సిష్టు సిద్ధాంతంలో లోపం లేదనీ, కమ్యూనిష్టు పార్టీ, దాని నాయకుల ఆచరణలోని లోపాల వల్లనే సోషలిష్టు సమాజాలు కూలిపోయాయనే కారణం చెపుతూంటారని రాస్తూ – గాంధీ సిద్ధాంతం కూడా మంచిదేననీ, దాన్ని ఆచరించటంలోనే తప్పులు జరుగుతున్నాయనీ గాంధీ సమర్థకులు కూడా అంటే మనం (మార్క్సిష్టులు) ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. మార్క్సిష్టు సిద్ధాంతావగాహనతో గాంధీ సిద్ధాంతంలో ఉన్న తప్పుని శాస్త్రీయంగా మనం ఎత్తి చూపించలేమా? అలా అయితే మార్క్సిష్టు సిద్ధాంతం సరైనదనీ, మేం మళ్ళీ వస్తాం, కమ్యూనిష్టు సమాజాన్ని ఏర్పాటు చేస్తాం అనీ ఇంత పుస్తకం రాయటం దండగ కాదా!
తోలేటి జగన్‌మోహనరావుగారు `స్టాలిన్ విమర్శ చెయ్యటాన్ని సమర్థిస్తూ విమర్శలో ఐదు శాతం నిజం ఉందనుకున్నా విమర్శను అణచి పెట్టకూడదన్నడనీ, నీకు పూర్తిగా తెలిసినప్పుడే నోరు విప్పు అంటే (మేధోపరంగా తక్కువ స్థాయిలో ఉండే ప్రజలు) కార్మికులు ఏ విషయం మీదనైనా విమర్శించడానికి సాహసించరన్నాడనీ, ఇది విమర్శను తొక్కి ఉంచి, కార్మికుల చొరవను అణచి వేస్తుందని హెచ్చరించాడననీ’ చెప్పి, తాను దాన్ని మనసులో ఉంచుకొనే ఈ పుస్తకాన్ని రాశానని చెప్పారు. నేను కూడా పై మాటలనే ఆధారంగా చేసుకొని తోలేటి జగన్‌మోహనరావుగారిచ్చిన భరోసా తోనే ఆయన రాసిన “మేం మళ్ళీ వస్తాం” అనే ఈ పుస్తకం మీద ఈ పరిచయ-విమర్శ రాయటానికి సాహసించాను.
manjari lakshmi
చారిత్రక అభివృధ్ధి క్రమంలో బానిస వ్యవస్థ కన్నా, ప్యూడల్ వ్యవస్థ, దానికన్నా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృధ్ధికరమైనవి. అలాగే పెట్టుబడిదారీ వ్యవస్థ కన్నా సోషలిస్టు వ్యవస్థ, దానికన్నా కమ్యూనిష్టు వ్యవస్థ అభివృధ్ధికరమైనవి అలా సమాజం అభివృధ్ధికరమైన వ్యవస్థల వైపే నడుస్తుందీ అని చెప్పటానికి నేను స్పైరల్ అని వాడాను. అది సరైన పదం అవునో కాదో మళ్ళా వెరిఫై చేసుకోవాలి. మీరు చెప్పింది ఉత్పత్తి గురించి. అది పెట్టుబడి దారీ వ్యవస్థలోనైతే స్పైరల్‌గానూ, షోషలిస్టు వ్యవస్థలోనైతే సర్కులర్ గాను ఉంటుంది. పెట్టుబడిదారులు వాళ్ళ లాభాల కోసం పోటీలు పడడం వల్లా, ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టీ, ఒక యేటిని మించి ఒక యేడు ఉత్పత్తిని పెంచుకుంటూ పోతూ ఉంటారు. అంతే కాక పెట్టుబడిదారులు ఉత్పత్తి చేసే వాటిల్లో జీవితావసర వస్తువులతో పాటు ఉత్పత్తి సాధనాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి చేయబడి ఉంటాయి కాబట్టి వాటిని వినియోగంలోకి తేవాలన్నా (అమ్ముడు పోవాలన్నా) ఒక సంవత్సరానికి మించి, ఇంకొక సంవత్సరం ఉత్పత్తి పెరుగుతూ పోవలసిందే. లాభాల పోటీల కోసం పెట్టుబడిదారులు ఒకళ్ళ ఉత్పత్తి ఇంకొకళ్ళకు తెలయనివ్వకుండా జాగర్త పడుతూ ఉంటారు కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఉత్పత్తంతా కావలసిన పాళ్ళలో లేకుండా అస్థవ్యస్థంగా తయారయి, అధికోత్పత్తి జరిగి, ఉత్పత్తి అమ్ముడు పోకుండా సంక్షోభాల్లో కూరుకు పోతూ ఉంటుంది. అదే సోషలిస్టు వ్యవస్థలోనైతే ఉత్పత్తి, పంపిణీ విధానాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం అవసరమైన మేరకే ఉత్పత్తి జరిగేటట్లుగా చూసుకోవచ్చు. ఒకవేళ ఎక్కడైనా ఉత్పత్తిలో కొరత ఏర్పడితే దాన్ని ఆ యేడు రేషన్ ప్రకారం పంపిణీ చేసుకొని, ఆ మేర మరుసటి నంవత్సరం ఉత్పత్తిని పెంచుకొని వాడుకోవచ్చు. దేశంలో ఒక ప్లాన్ ప్రకారం ఉత్పత్తి చేయాలంటే, ఉత్పత్తి సాధనాలు విడి విడి వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు. ఉత్పత్తి సాధనాలన్నిటి పైనా సమాజం మొత్తానికీ హక్కు ఉండాలి. భూమితో సహా అన్నీ సమాజ పరం చేయబడితేనే ఈ అధికోత్పత్తి, సంక్షోభాలు, యుధ్ధాలనించి బయటపడ కలుగుతాము.
D.L.vidya
మంజరి లక్ష్ని గారూ మీరు బ్బాగున్నానండీ అని రాయడంతో రెండేళ్ళ క్రితం నాటి స్నేహ వీచికలలో ఒకటి నన్ను చేరి ఆ స్నేహ సౌరభాల్ని గుర్తుచెసినట్టనిపించింది.అప్పటి వళ్ల్ళలో మీరు ఒక్కళ్ళైనా మిగిలేరుసంతోషం.మార్క్సిజం ప్రకారం పెట్టుబడిదారీ అభివ్రుధ్ధి స్పిరల్, నూతన సమాజపు అభివ్రుధ్ధి సర్కులర్.అంతే కదా.
manjari lakshmi
బాగున్నాను విద్యగారు. నాకూ ఆ నెగేషన్ ఆఫ్ నెగేషన్ అంతగా అర్ధం కాలేదు. మార్క్సిజం తర్కం ప్రకారం అభివృధ్ధి అనేది స్పైరల్‌గానే జరుగుతుంది కదా. తక్కువ కాలాన్ని పరిగణలోనికి తీసుకున్నప్పుడు సమాజం కొంత మళ్ళా వెనక్కి వెళ్ళినట్లు కనపడ్డా అది ముందుకే అభివృధ్ధి చెందుతుంది. అయితే ఆ అభివృధ్ధి క్రమంలోనే ఒకసారి నెగేషన్ ఆఫ్ నెగేషన్ కూడా జరుగుతుందని (గతి తర్క సూత్రాలలో అది కూడా ఒకటి కాబట్టి), ఇంక రాబోయేది మాత్రం నిలబడుతుందని తోలేటి జగన్మోహన్‌రావుగారి అభిప్రాయమేమో. మామూలుగా తోలేటి జగన్మోహన్‌రావుగారి అభిప్రాయమైతే ఉత్పత్తి సాధనాల పెరుగుదల సోషలిష్టు సమాజంలో అందరి అవసరాలు తీర్చే విధంగా అభివృధ్ధి చెందక పోవటం వల్ల ఆ సమాజాలు నిలబడ లేదనీ, ముఖ్యంగా చైనాలో మావో ఆ విధమైన కృషి చెయ్యలేదనీ. నాకు ఆయన చెప్పిన మార్క్సిష్టు తత్వశాస్త్రం సూత్రాలు అంత అర్ధంకాకే, ఆయన రాసిన రొండో భాగం జోలికి పోలేదు. . నేను రాసిన దాని మీద కొన్ని విమర్శలు వచ్చాయి. చైనాలో వచ్చింది రైతాంగ విప్లవం అనకూడదట. నేను రాసింది చారిత్రక దృకధంతో కాక ఉత్త భౌతిక వాద దృక్పధంతో ఉందిట. స్టాలిన్ భయంకరమైన రొండవ ప్రపంచ యుధ్ధాన్ని ఎదుర్కోవటానికి తప్పని సరిగా చేయవలసి వచ్చి చేసిన దాన్ని నేను విడిగా చూపించానుట. స్టాలిన్ “సోషలిజం ఆర్ధిక సమస్యలు” అనే పుస్తకం చదివి అప్పుడు అతనికి సోషలిష్టు సమాజంలో ధర గురించి తెలుసో లేదో అనే విమర్శ చెయ్యాలిట. స్టాలిన్ రాసిన “లెనినిజం-పునాదులు” అనే పుస్తకం చదివితే గానీ మార్క్సిజం – లెనినిజం అని ఎందుకు అనాలో తెలియదుట.
D.L.vidya
మంజరి లక్ష్మిగారూ,బాగున్నారా.మీ సమీక్ష బాగుంది.మేం మళ్ళీ వస్తాం కొంచెం చదివాను.ఇంకా పూర్థి చెయ్యలేదు.15వ పేజీలో ఇలా రాసేరు.”1917 అక్టోబర్ విప్లవంలో కేపిటలిసాన్ని తిరస్కరించిన సోషలిసం తిరస్కరించబడింది,నెగేషన్ ఆఫ్ నెగేషన్ వాస్తవ చరిత్రలో జరిగింది.ఒక క్రమం అంతమై ఇక్కడి నుంచి మళ్ళీ ఒక నూతన క్ర్4అమం ప్రారంభమైంది.ఎంత బలహీనంగా ఉన్నా నేడు ప్రపంచవ్యాపితంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పొరాటాలు ఈ క్రమం ప్రారంభమైందని సూచిస్తున్నాయి.ప్రస్తుతం చరిత్ర పెట్టుబడిదారీ వ్యవస్థను తిరస్కరించే దశలో ఉంది కనుక నేను భవిష్యత్తు మార్క్సిజానిదే అంతున్నాను.” అని రాసేరు జగన్మొహన్రావ్ గారు.భవిష్యత్తు సోషలిజానిదే .అయితే మాత్రం ఏం సుఖం?మళ్ళీ నెగేషన్ ఆఫ్ నెగేషన్ ఒక సూత్రంగా వర్తీతూపోతే ఎన్ని సార్లు సోషలిజం వచ్చినా అన్ని సార్లూ కేపిటలిజం దాన్ని తోసిరాజంటూ ఉండదా?ఎప్పటికీ శాస్వతంగా సోషలిజం వచ్చేదిలేదు అనిపించడంలేదా? ఈ థీరీని ఇక్కడ ఉపయోగించకూదదేమో అనిపిస్తోంది.చరిత్రలో అనేక సార్లు విప్లవాలు జరిగి ఓడిపోయేకే శస్వతంగా పాత వ్యవస్త పోవడం జరిగింది కాబట్టి,సోషలిజానికీ అదే జరుగుతుంది,పీడిత వర్గాలు అనుభవంతో శాశ్వత విజయాన్ని సాధించి సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పరుచ్కుంటాయి అనుకోవచ్చుకదా.
KOTARI MOHAN RAO
i red the review by krishna prasad in andhra jyothi sunday book n phoned to him as he was my senior in university days, objecting the hope of the writer toleti jaganadam, the marxist media bombarded the socialism was? is ? success, it is fully wrong, but krishna prasad garu forced me to accept as the impact of marxism is existing even india, two days n nights i was thinking the same without sleeping, at last i decided not accept with the arguments of kp n toleti as life is a mixture of so many movements , even some still used to say britisher’s regime was better, it also like the hope of TOLETI, even CHE also wondered at the socialistic pattern in RUSSIA, i support it as i recently red in his life at KATHYANI’ S BOOK.
A.Surya Prakash
ఇది చదివిన వారిలో మరికొందరు అధయన వ్యాపకాన్ని పెంపొందించుకుంటే బాగుండును!
Manjari Lakshmi
నేను ఇల్లు, ఉద్యోగం అంటూ యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తుండే దాన్ని. మేము 95 లో టి.వి. కొన్నప్పటినుంచి పుస్తకాలు (నవలలు, కథలు) చదవటం కూడా క్రమంగా మానేసి, విపరీతంగా క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికీ, అర్ధం కాక పోయినా, ఇంగ్లీష్ సినిమాలు (బ్రూస్‌లీ సినిమాలు, కరాటే, కుంఫు సినిమాలు, స్క్వాజ్‌నెగ్గర్, సిల్వస్టర్ స్టాలిన్ సినిమాలు) చూడటానికీ అలవాటు పడిపోయాను. కొన్ని పరిస్థితులు కారణంగా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దాంతో ఎందుకనో బాగా డిప్రెషన్‌లో కెళ్ళిపోయాను. దీంతో టి.వి. కూడా చూడలేకపోయాను. అప్పుడప్పుడు రంగనాయకమ్మగారికి ఫోన్‌చేసి ఎవరైనా మాట్లాడే వాళ్ళున్నారా (మీ అభిమానులు) అని అడుగుతూ ఉండేదాన్ని. నా బాధ పడలేకనో ఏమో, అప్పుడే జె.యు.బి.వి. ప్రసాద్‌గారి”ఆ కుటుంబంతో ఒక రోజు” అనే కధా సంకలనం మార్కెట్‌లో కొచ్చింది, ఆమె ప్రసాద్‌గారి పుస్తకం చదివి అతనికి నీ అభిప్రాయం రాయి అన్నారు. అలా ప్రసాద్‌గారితో పరిచయం మొదలైంది. ఇంక అక్కడినుంచి నా కష్టాలు మొదలయ్యాయి. “మీరూ ఏదైనా రాయండి, పుస్తకం.నెట్‌లో వచ్చే వాటిని చదివి, వాటి మీద ఏమైనా రాయండి. పుస్తకం.నెట్‌లో వచ్చే పరిచయాలను చూసి ఆ మోడల్‌గా మీరు చదివిన పుస్తకాల గురించి రాయండి,” అని ఒకటేమేన వేపుకు తినేవారు. “నాకు రొండు వాక్యాలు కూడా రాయటం రాదు. మీ లాంటి వాళ్ళు రాస్తే మా లాంటి వాళ్ళం చదివి పెడతాం” అనేదాన్ని నేను. అయినా నన్ను రాయండి, రాయండి అని షంటుతూనే ఉండేవారు. ఆ బాధ పడలేక ప్రసాద్‌గార్ని లోపల్లోపల భయంకరంగా తిట్టుకుంటూండేదానిని. చివరికి, అసలే నాకు బాగాలేకపోతే ఈ ప్రసాద్‌గారి బాధొకటొచ్చిపడింది, ఎలాగైనా ఈయన్ని వదిలించుకొంటేగాని నాకు సుఖం లేదని కూడా అనిపించింది. కానీ మిరకిల్‌గా నా కాయనిచ్చిన సజషన్స్ పనిచేసి నేను ఆ డిప్రెషన్‌లో నుంచి బయటపడి (కొద్దిగా కొద్దిగా ప్రసాద్ గారు చెప్పిన పనులు చెయ్యటంవల్ల) మామూలు మనిషిని కాగలిగాను. ప్రసాద్‌గారు, ఆయనకు తెలియకుండానే, ఒక సైకియాట్రిష్టుకు మల్లే ప్రవర్తించి, నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయటపడేసి, నాకిష్టమైన ఒక వ్యాపకాన్ని ఏర్పాటు చేసుకొనేటట్లుగా చేసి, నన్నుమామూలు మనిషిని చేశారు. ఈవిషయంలో ప్రసాద్‌గారికి నేను జీవితాంతం ఋణపడి ఉండవల్సిందే. డాక్టర్ చేదుమందు ఇచ్చినప్పుడు భయంకరంగా తిట్టుకున్నా, అది మన రోగాన్ని తగ్గించినపుడు ఆ డాక్టర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే కదా! నా అనుభవం ఎవరికైనా ఉపయోగ పడుతూందేమోనని ఇక్కడ రాస్తున్నాను. నేను బాగుపడటానికి పరోక్షంగా సహకరించిన పుస్తకం.నెట్ నిర్వాహకులకు కూడా ఈ పోస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
S. Narayanaswamy
Very interesting.
నేను చదివిన కొద్ది కథల దృష్ట్యా తోలేటి గారు మార్క్సిస్టు మేధావి అని ఊహించెలేదు ఎప్పుడూ! మీ పరిచయం, సమీక్ష కూలంకషంగా ఉన్నాయి.