Rahul Dravid – Timeless Steel.

ఓ ఇరవై రెండు మంది మూర్ఖులు ఆడుతుంటే మరో ఇరవై రెండు వేల మంది మూర్ఖులు చూసే ఆటే క్రికెట్ అని వెనుకటికో పెద్దాయన ఉవాచ. ఓ వంద వందలు కొట్టనంతమాత్రం చేత ఆటగాళ్ళను భుజాలకు ఎత్తుకోనక్కర్లేదని ఇప్పటి ఆయన కామెంట్. అయ్యుండచ్చు. కాకపోనూ వచ్చు. అది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయాలను ఎదుటివారి మీద రుద్దనంత వరకూ అంతా ఒకే!
2000-2012 మధ్య కాలంలో భారత టెస్ట్ క్రికెట్ జట్టు బ్యాటింగ్‍కు వెన్నుముక్క అన్నంతగా ఆడిన రాహుల్ ద్రావిడ్ 2012 రిటైర్మెంట్ ప్రకటించగానే ఎవరి తాహతుకు తగ్గట్టు వాళ్ళు మైక్రో, మాక్రో బ్లాగింగ్ స్పేస్‍లలో, పత్రికల్లో నివాళులు అర్పించారు. అదే కాలంలో ఇంటర్నెట్ పై క్రికెట్‍కు కేరాఫ్ అడ్రస్‍గా మారిన espncricinfo.com సైటు వారు, వారి స్థోమతకు తగ్గట్టు ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదలజేసారు. అదే Rahul Dravid – Timeless steel. ద్రావిడ్ ఆడిన కాలంలో, రాహుల్ విరమణ ప్రకటించిన వెనువెంటనే వచ్చిన వ్యాసాలతో కూడిన పుస్తకం ఇది. Anthological Biography అని ఆంగ్ల వికి ఉవాచ. cricinfo.com ఎడిటర్లు, సబ్-ఎడిటర్లు, వారి ఆస్థాన బ్లాగ్లర్లు, మాజీ – ప్రస్తుత క్రికెటర్లు, ద్రవిడ్ సన్నిహితులు, అతడి భార్య మొదలైనవారు ద్రావిడ్‍ను గురించి రాసిన వ్యాసాలు పాతిక పైచిలుకే ఉన్నాయి. వాటితో పాటు తప్పక చదవలసిన, వినవలసిన – క్రికెట్ అభిమానులే కానవసరం లేదు – ద్రావిడ్ బ్రాడ్‍మన్ ఒరేటరీ పూర్తి పాఠం కూడా ఇందులో పొందుపరిచారు.
పుస్తకాన్ని ఎడిట్ చేసిన వారు వ్యాసాలు కొన్ని కాటగరీలలోకి వర్గీకరించారు. కానీ నేను నా సొంత వర్గీకరణలో వ్యాసాల గురించి చెప్తా:
౧. రాహుల్ ’ది సెకండ్ ఫిడిల్’ ద్రావిడ్: మన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లో ( లేక హీరోలో) ఉన్నప్పుడు ఇద్దరూ అన్ని విధాలా సరిసమానమైన స్థాయిలో ఉన్నా, ఒకరే హీరోని (లేక హీరోయినో) పెళ్ళాడి సెటిల్ అవుతారు. ఇంకో మనిషి అన్ని రకాల త్యాగాలు చేసి, క్లైమాక్స్ లో అలా అస్తమించే సూర్యునివైపుకు నడుచుకుంటూ పోతారు. చాలా మందికి రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ అలా ఒకే స్థానం కోసం పోటీపడినవారు. అందులో కారణాంతరాల వల్ల ద్రావిడ్‍కే ఎనలేని అన్యాయం జరిగిందని వీరి వాదన. అందుకని అవకాశం వస్తే చాలు, బకెట్లకు బకెట్లు సానుభూతి వ్యక్తం చేసేస్తూ ఉంటారు. అలాంటి వ్యాసాలు ఉన్నాయిందిలో.
౨. రాహుల్ ’ది వాల్’ ద్రావిడ్: భారత టెస్ట్ క్రికెట్ పోయిన దశకంలో సాధించిన విజయాల్లో ద్రావిడ్ కీలక పాత్ర లేనివి చాలా తక్కువ. ఆ కోలకత్తా టెస్ట్ మాచ్‍ను లక్ష్మన్ మాచ్‍గా అందరూ అభివర్ణించినా, అందులో ద్రావిడ్ ఇన్నింగ్స్ అపురూపం. ద్రావిడ్ కోణం నుండి సిద్ధార్థ మోంగా రాసిన వ్యాసంలో ఆ కోలకత్తా మాచ్‍ను దాదాపుగా మళ్ళీ జీవించచ్చు. అలానే రోహిత్ బిజ్‍నాథ్ రాసిన ’అడిలైడ్ 2003’ వ్యాసం కూడా ఆనాటి విజయం తాలూకు సంబరాలను మళ్ళీ కళ్ళ ముందుకు తెస్తుంది. అలానే ద్రావిడ్ ఆడిన మరికొన్ని విజయాలు తాజా అవుతాయి, ’గ్రేట్ ఇన్నింగ్స్’ విభాగంలో వచ్చిన వ్యాసాలు.
౩. రాహుల్ ’ది ప్లెయిన్’ ద్రావిడ్: అవడానికి అందరూ బాట్స్మెనే అయినా, కొందరు చేతిలో అది మంత్రదండంలా, మరి కొందరి చేతిలో కుంచెలా, మరికొందరి చేతి లో ఆయుధంలా ఉంటుంది. బంతిని చూసి బాట్‍తో కొట్టటం అనేది ఆట. ఒక్కో మనిషి ఒక్కో తీరున దాన్ని a sight of joyగా మారుస్తారే, అది ఆటలోని జీవం. అందరూ బంతిని కొట్టటంలో ఆటకు అందానికి తెస్తే, బంతిని వదలటమే ఓ కళగా మార్చాడు ద్రావిడ్. కాకపోతే అందులో ఉన్న గమ్మత్తు అందరికి అర్థం కాదు. అర్థంకాని వారి లెక్కల్లో ద్రావిడ్ untalented. అయినా కేవలం కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి పైకొచ్చిన విధంబు ఎట్టిదనెనూ.. అంటూ రాసుకొచ్చిన వ్యాసాలూ ఉన్నాయి. వాటిలో సంజయ్ మంజ్రేకర్ రాసిన వ్యాసం చదవకున్నా మరేం నష్టం లేదు (అని నా అభిప్రాయం).
౪.రాహుల్ ’ది హ్యూమెన్’ ద్రావిడ్: ఎంత ఎత్తుకు ఎదిగినా, అంతే ఒద్దికగా ఉండే మనుషులు చాలా అరుదు. క్రికెట్ ఫీల్డ్ పైన రాహుల్ ఎంతటి జంటిల్‍మెనో ఆట చూసే ప్రతి ఒక్కరికీ తెల్సిన విషయమే. ఆట ఆడనప్పుడు రాహుల్ ఇష్టాలూ, అతని వ్యాపకాలు, మనుషులతో సఖ్యంగా ఉండే గుణం – వీటిని గురించి అతని సన్నిహితులు, స్నేహితులు రాసిన వ్యాసాలు చదివితే తెలుస్తాయి. సురేశ్ రైనా చెప్పుకొచ్చిన కబుర్లు అంతగా ఆకట్టుకునేవి కాకపోయినా, జాన్ రైట్ తనదైన తీరులో రాహుల్ గురించి చెప్పుకొచ్చారు. ఇహ, అతడి భార్య విజిత రాసిన వ్యాసం ఓ క్రీడాకారుడు ఎంత సాధన, ఎన్ని త్యాగాలు చేస్తే, అత్యున్నత శిఖరాలకు ఎదుగుతాడో తెలియజెప్తుంది.
౫. అభిమానుల నీరాజనం: ఇట్లాంటిదో వ్యాసం ఇందులో ఉంటుందని నేను ఊహించలేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరుగుతున్నవారిని inspire చేయగల లక్షణం క్రీడాకారులకు ఉంటుంది. Jarrod Kimber రాసిన “The Reason I Got Married.” అన్న వ్యాసంలో ద్రావిడ్ వల్లే తనకు పెళ్ళి జరిగిందని భావించే అభిమాని చెప్పే కబుర్లు తెలుస్తాయి. సంపాదించటం, ప్రపంచాన్ని చుట్టిముట్టటం, బంధుమిత్ర బలగాలను ఏర్పర్చుకోవటం, పేరుప్రఖ్యాతలు సాధించటం – వీటికన్నా touching lives is much bigger achievement అని నాకనిపిస్తుంది. అందుకే ఈ వ్యాసం తెగ నచ్చేసింది.
ఇవికాక రాహుల్ ద్రావిడ్ పలు సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. కొన్ని ఫోటోలు కూడా జతపరిచారు. పుస్తకం ఓవరాల్‍గా నాకు నచ్చినా, కాస్త ఆదరాబదరాగా తీసుకొచ్చారీ పుస్తకం అనిపించింది. రాహుల్, తనదైన బాటింగ్ శైలితో ఎలా భారత క్రికెట్‍కే ప్రపంచ క్రికెట్‍కు కూడా తన సేవలను అందించాడన్నది దాని గురించి మరింత విస్తృతంగా చర్చించే వ్యాసాలు ఉండుంటే బాగుండేది.
రోజూ ఉదయాన్నే సొంత మెయిలో, ఆఫీసు మెయిలో చెక్ చేసుకోకముందే క్రిక్-ఇన్ఫో తెరిచి, లైవ్ మాచులు లేకపోయినా ఒకటికిరెండు సార్లు మధ్యలో దాని తెరిచి చూస్తూ, రాత్రి దుకాణం కట్టేసేముందు కూడా దానిమీద లుక్కేసి బొజ్జునే నాలాంటి వాళ్ళు ఈ పుస్తకం చదవనవసరం లేదు అనుకున్నాను గానీ, పుస్తకం చదివాక మాత్రం అనిపించింది, చదివినా చదవకున్నా కొని దాచిపెట్టుకోవాల్సిన పుస్తకం ఇది అని.
varaprasad
than q mam,valuble information about rahuldravid