తాత్త్విక చింతనాఫలాలు ఆర్.వసుంధరాదేవి రచనలు – 1
వ్యాసకర్త: నశీర్
**********
స్త్రీ రచయితల పట్ల నాకున్న ఫిర్యాదును ఈ మధ్య ఒకసారి మాటల సందర్భంలో నా మిత్రుని దగ్గర వ్యక్తం చేశాను. స్త్రీ రచయితలు మనిషికీ మనిషికీ మధ్య మానవ సంబంధాల్నే (man in relation to man) ఇతివృత్తంగా తీసుకుంటారు; మనిషికీ అతణ్ణి ఆవరించిన విశ్వానికీ మధ్య సంబంధాన్ని (man in relation to universe) పరిగణనలోకి తీసుకునే వారు చాలా అరుదు — కనీసం మగ రచయితలతో పోల్చినపుడు. మానవ జీవితానికి అర్థమూ, అంతట్నీ పెర్‌స్పెక్టివ్‌లో కుదురుకునేట్టు చేసే అంతిమ సత్యమూ, దృగ్గోచర ప్రపంచపు నికరమైన చెల్లుబాటు పట్ల సంశయాలు, జీవితానికి ఆవలా ఈవలా ఉన్న చీకట్లూ… ఇలాంటి ప్రశ్నల గురించి మగ రచయితలు సతమతమైనంతగా స్త్రీ రచయితలు కారు; వాళ్ళు ఎక్కువగా కుటుంబ జీవితాలు, సామాజిక జీవితాలు, ఆడమగా మధ్య అనుబంధాల ఈక్వేషన్లూ… వీటితోనే సరిపెట్టుకుంటారు. (వాళ్లు స్త్రీ వాదులైతే వాళ్ళ పరిధి మరింత కురచగా ఈ చివరి ఇతివృత్తానికే పరిమితమవుతుంది.) ఈ ఇతివృత్తాల్లో ఒకటి ఎక్కువా ఇంకోటి తక్కువా అని కాదు, కానీ మగ రచయితలు ఈ పరిధిని దాటినంతగా స్త్రీ రచయితలు దాటరని నా ఫిర్యాదు. దీనికి ఋజువుగా, మనిషికీ అతని చుట్టూ విశ్వానికీ మధ్య సంబంధాన్ని చర్చించే శాస్త్రమైన తత్త్వశాస్త్ర పరంపరలో, ఒక్క స్త్రీ తత్త్వవేత్త పేరూ లేకపోవటాన్ని సూచించాను. నా మిత్రుడు ఇలాంటి వాదనను ఇప్పుడే కొత్తగా వింటున్నట్టు, సాలోచనగా, “నిజానికి మగాళ్ళ కన్నా ఆడాళ్ళకే తత్త్వవేత్తలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళే ప్రకృతికి మనకన్నా దగ్గరగా ఉంటారు. వాళ్ళ నెలసరి ముట్లూ, మనిషిని మోసి జన్మనిచ్చే గర్భధారణానుభవం ఇవన్నీ వారిని మనకన్నా ప్రకృతికి సన్నిహితుల్ని చేస్తాయి. మరెందుకు అలా జరగదో!” అన్నాడు. బహుశా వారు ప్రకృతికి మరీ అంత సన్నిహితంగా మమేకం కావటం వల్లనే, దాన్నించి విడివడి, దాన్ని ఆబ్జెక్టివ్‌గా పరిశీలించలేరేమో అనిపించింది. ఈ అంశంపై మా మాటలు ముగుస్తుండగా, నా మిత్రుడు నాకు ఆర్. వసుంధరా దేవి రచనల్ని చదవమని సూచించాడు. అవి ఇప్పుడు పెద్దగా బయట లభ్యం కావటం లేదు. అదృష్టవశాత్తూ రెండు కాపీలు దొరికితే చదివాను. ఒకటి “రెడ్డెమ్మ గుండు” అనే నవల, రెండు “గాలి రథం” అనే కథా సంపుటి.
రెడ్డెమ్మగుండు (నవల):
“భారతి” పత్రికలో ప్రచురితమైన ఈ నవల 1985లో ముద్రితమైంది. అంతా పదార్థమయమే అనే భౌతికవాదానికి (మెటీరియలిజం) ఒక ఎదురు సమాధానంగా ఈ నవలను రాశారు. నవల ప్రారంభమయ్యే సరికి శివరావు అనే పేరా సైకాలజీ శాస్త్రవేత్త రెడ్డెమ్మ గుండు అనే ఊరికి బస్సులో ప్రయాణిస్తుంటాడు. ఆ రెడ్డెమ్మగుండు స్థల పురాణం ఏమిటంటే, రెండు వందలేళ్ళ కిందట ఆ ఊళ్ళో ఒక అందాల ఆడపడుచు రెడ్డెమ్మ ఉండేది. ఆమె ఒకసారి చేలో కాపలా కాస్తుండగా ఆమె అందాల్ని చూసి మోహించిన ఒక నవాబు గుర్రంపై ఆమె వెంట పడతాడు. ఆమె పారి పోయి ఒక పెద్ద గుట్ట మీద ఉన్న గుండు చాటున దాక్కుంది. మరి కన్పించలేదు. ఆమె ఇంట్లో వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ రాతి గుండులో చిన్న చీలిక ఉంది. రెడ్డెమ్మ అందులోంచి మాట్లాడుతుంది. ఇక ఎన్నడూ బయటకు రాకుండా అందులోనే విగ్రహంగా వెలిసి అందరి కోరికలు తీరుస్తూ పూజలందుకుంటుంది.
శివరావు ఒక అమెరికన్ ఫౌండేషన్ తరపున ఇక్కడకు వారం రోజుల పాటు పరిశోధనకు వస్తాడు. “మనుషులు తాము ఏర్పరుచుకున్న నమ్మకం నుంచీ, రూపం నుంచీ వరాలు పొందుతున్న వైనం పరిశోధించే” పని అతనికి అప్పగించబడింది. దీంతో పాటూ అతనికి మరో లక్ష్యం కూడా ఉంది. మనిషికి అనుభవాల్నించి కొన్ని అనుభూతులు పుడతాయి; ఆ అనుభూతుల్ని ఆ అనుభవాలు లేకపోయినా పుట్టించాలన్నది శివరావు బృహత్ ప్రయత్నం. శివరావు బుద్ధి ప్రైమసీ మీద, మానవ మేధ శక్తుల మీదా అపరిమితమైన నమ్మకం ఉన్నవాడు. మహత్తులనేవి ప్రత్యేకంగా ఏవీ లేవని, ఇంకా ప్రాయోగికంగా నిరూపితంగాని భౌతిక దృగ్విషయాలే మహత్తులనీ అతను భావిస్తాడు. అతనిది సత్యాన్వేషణే గానీ, అది ఒక తాత్త్వికుని సత్యాన్వేషణ కాదు, శాస్త్రజ్ఞుని సత్యాన్వేషణ, నియత ప్రయోగాలతో ఫలితాలతో సంబంధమున్న అన్వేషణ.
అతను ఆ పల్లెటూళ్ళో ఉన్న వారం రోజుల్లోనూ అతనికి ఎదురైన వ్యక్తులూ, అనుభవాలూ అతని దృక్పథాన్ని ఏ రకంగా మార్చాయన్నదీ, చివరకు అతను తెలుసుకున్న సత్యం అతణ్ణి ఏ పర్యవసానానికి తీసుకెళ్ళిందన్నదీ మిగతా కథ. ఇక్కడ అతణ్ణి ప్రభావితం చేసిన ముఖ్యమైన వ్యక్తి రెడ్డెమ్మ పునర్జన్మేమో అనిపించే మరో పద్దెనిమిదేళ్ళ అమ్మాయి రెడ్డెమ్మ. మిగతా పాత్రల్లో హేతువాదానికి మూఢంగా కట్టుబడిన ఒక యువకుడు చిన్నూ, మనిషిని హేతువుకు అతీతమైన అంశ నడిపిస్తుందని నమ్మే అతని మేనమామ నారాయణ స్వామీ ముఖ్య పాత్రలు. ఉన్న పాత్రల్లో నారాయణ స్వామి ఆసక్తికరమైన పాత్ర అనిపిస్తాడు.
కథనం ఎక్కువగా తాత్త్విక సంభాషణల ద్వారానే జరుగుతుంది. ఫ్రాయిడ్ నుంచి జార్జిశాంతాయనా దాకా, క్వాంటం ఫిజిక్సు నుంచి అద్వైతం దాకా అన్నీ ఈ సంభాషణల్లో చర్చకు వస్తాయి. ఈ సంభాషణలన్నీ ఈ నవలకు రచయిత నిర్దేశించిన అంతిమ పర్యవసానం వైపు డయలెక్టికల్ ధోరణిలో సాగుతుంటాయి. ఇందులోని పాత్రలకు వారి వారి సైద్ధాంతిక నమ్మకాలకు మించి వేరే వ్యక్తిత్వమంటూ ఏదీ ఉండదు. (ఆ సైద్ధాంతిక నమ్మకాలు కూడా వారి స్థానిక ఐడెంటిటీస్‌కి అసాధ్యమనిపించే ఎత్తుల్లో ఉంటాయి.) పాత్రలన్నీ కొన్ని కొన్ని ఐడియాస్‌కు ప్రతినిధులు మాత్రమేనని చెప్పవచ్చు. Conflict is not between characters but their ideas.
ఈ రచనలో నవలా ధోరణి తక్కువ. నవలా శిల్పాన్ని పట్టించుకోదు. తాత్త్విక వ్యాసంలా సాగిపోతుంది. కాబట్టి దీన్ని అలా భావించి చదివితేనే ఆకట్టుకుంటుంది. తెలుగులో తత్త్వశాస్త్రం మీదే నాన్‌ఫిక్షన్ రచనలు చేసిన వారి కన్నా స్పష్టంగా ఆర్. వసుంధరాదేవి వచనం ఆయా తాత్త్విక భావనల్ని వ్యక్తీకరించగలదు. ఉదాహరణకి నారాయణస్వామి పాత్ర ఒక్క వాక్యంలో ఎగ్జిస్టెన్షియలిజాన్ని ఇలా వివరిస్తాడు:
“ఎక్సిస్టెన్షియలిజం మనిషి ఏకాకి అంటూ మన మామూలు దేవుణ్ణి తోసి పారేసి; మనిషి ఒంటరి తనాన్ని గుర్తించి; అతను తన జీవితానికి అర్థం తానే వెతుక్కోవాలనీ, తనవైన విలువల్ని తానే నిర్మించుకుకోవాలనీ తీర్మానించి; మనిషికి అనంతమైన స్వేచ్ఛనీ, అనంతమైన బాధ్యతనీ కూడా ఇచ్చి అతనికి పట్టం కట్టిన నిజమైన మానవతావాదం కదా!”
శివరావు పాత్ర కొన్ని పేరాల్లో జార్జి శాంతాయనా తత్త్వ సారాంశాన్ని వ్యక్తం చేస్తాడు:
“ఈ శతాబ్దపు ప్రారంభంలో జార్జి శాంతాయనా అన్న దార్శనికుడు … ప్రవృత్తి అన్నది హేతుబుద్ధికి శత్రువు కాదన్నాడు. సహజ ప్రవృత్తులతో సంబంధం లేని ఆలోచన మనిషిని పిచ్చివాడిగా చేస్తుంది. ఆలోచనతో సంబంధం లేని ప్రవృత్తులు మనిషిని జంతువుగా దిగజారుస్తవి. ఈ రెండింటి కలయికే మనిషి. సహజప్రవృత్తులు మానసిక చైతన్యపు పరిధిలోనికి వచ్చి సామరస్యం పొందటమే హేతుబుద్ధి అన్నాడు.
“శాస్త్రీయ విజ్ఞానం అంటే మనిషి అనుభవంలో కన్పిస్తున్న కొన్ని నియతుల్ని క్రోడీకరించటం మాత్రమేననీ, ప్రపంచాన్ని శాసించే అనుల్లంఘ్యమైన చట్టాలు కావనీ అతనికి బాగా తెలుసు. అయినా కూడా బుద్ధి, అది సాధించే విజ్ఞానం మాత్రమే మనిషిని ముందుకు తీసుకెళ్ళ గల శక్తి కలిగినవని అతని నమ్మకం.
“అతను భౌతిక వాది. మనిషిలో పుట్టే ప్రతి ఊహకీ, చలనానికీ, చైతన్యానికీ కూడా ఏదో భౌతికమైన హేతువు వుంటుందని అతని విశ్వాసం. మానసిక పరిణామాలకు మూల కారణాలైన భౌతిక నియమాలను కనుక్కున్నప్పుడే మనస్తత్వశాస్త్రం సాహిత్య స్థాయి నుంచీ విజ్ఞానశాస్త్రపు పరిధిలోకి వెళ్ళ గలదని అన్నాడతను…”
శాస్త్రీయ పదజాల నిర్మాణంలో పేలవంగా వెనుకబడ్డ తెలుగు భాషలో ఈ సంగతుల గురించి రాయటం కష్టం. అది ఈ రచయిత అనాయాసంగా చేసారనిపిస్తుంది.
నిజానికి ఇది తాత్త్విక నవల కాదు, తత్త్వ శాస్త్రం గురించి మాట్లాడే నవల మాత్రమే. కానీ ఆ మాట్లాడటం తెలుగులో ఒక్క స్త్రీ రచయితలు మాత్రమే కాదు, ఏ రచయితా మాట్లాడనంత ఎక్కువ మాట్లాడుతుంది.
*****
రెడ్డెమ్మగుండు
రచన: ఆర్. వసుంధరాదేవి
ప్రథమ ముద్రణ: 1985
ప్రాప్తిస్థానం: కినిగె
[“గాలి రథం” కథా సంపుటిపై సమీక్ష తరువాయి భాగంలో…]
Leave a Reply