శతావధాని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి – కాశీ యాత్ర, మరికొన్ని రచనలు
తెలుగు వాఙ్మయచరిత్రలో యేనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్రది ప్రత్యేక స్థానం. ఒకప్పటి స్థలకాలమాన పరిస్థితులను చక్కగా వివరించిన పుస్తకం అది. తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు (1870 – 1950) కూడా కాశీయాత్ర గురించి వ్రాశారని నాకు ఈ మధ్యవరకు తెలీదు. అందుచేత ఈ పుస్తకాన్ని ఆసక్తిగా చదవటం ప్రారంభించాను.
ఈపుస్తకంలో కాశీయాత్రతో పాటు, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి (వేంశా) గారివే ఇంకో నాలుగు వ్యాసాలు (ఈ మధ్యే పునఃప్రచురించిన కథలు-గాథలులో చేరనివి), విశ్వనాధ సత్యనారాయణగారు తమ ఆత్మకథలో వారి గురువుగారి గురించి వ్రాసిన వ్యాసం, నాలుగు అనుబంధాలు, శ్రీరమణ గారి ముందు మాట, సంపాదకుడి సువివరమైన మనవిమాటలు ఉన్నాయి.
అంతకుముందొకసారికూడా వేంకటశాస్త్రిగారు వ్యాకరణం చదువుకొందామని చేతిలో డబ్బులు లేకుండానే కాశీకి బయలుదేరారు కాని, విశాఖపట్నమువరకును వెళ్ళి పయిని వెళ్ళలేక తిరిగివచ్చారు. అందుకని ఈసారి డబ్బు సమకూర్చుకోవటం మొదలు పెట్టారు. అప్పుడు కాశీకి వెళ్ళటానికి రైలు టికెట్టు 18 రూపాయలు. గురువుగారు గ్రామాల్లో సంచారానికి వెళ్ళినప్పుడు గ్రామస్థులెవరైనా అడిగితే పురాణం చెప్పి, వారు అయిదో పదో రూపాయలిస్తే గురువుగారి దగ్గర దాచుకొనేవారు. యాభై రూపాయలవరకు పోగయింది. ఆ డబ్బు తీసుకొని మార్గశీర్ష శుద్ధ తదియనాడు కాశీవెళదామని ముహూర్తం పెట్టుకున్నారు. ఆ ముహూర్తానికి ఆయన కాశీ బయలుదేరలేదుకాని, విచిత్రంగా ఆ ముహూర్తానికే ఆయన వివాహం అయ్యింది (వివాహ సందర్భంలో ఆచార ప్రకారం వరుడు కాశీయాత్ర అని కొన్ని యడుగులు నడుచుటచేత, అనుకొన్న ఉద్దేశముకూడ నెరవేరినట్లు సంతసించవచ్చును అంటారు వేంశా).
వివాహమైన కొద్ది రోజులకు గురువుగారి మాతృవియోగంవల్ల చదువుకు విఘ్నం కలిగింది. ఆ సమయంలో వేంశా, కందుకూరి కృష్ణశాస్త్రి అనే సహాధ్యాయి కలసి కాశీ వెళ్ళడానికి నిశ్చయించుకొన్నారు. ఐతే ఇద్దరిదగ్గర కలిపి చూసుకుంటే ఆరణాల మూడు దబ్బులు మాత్రం ఉన్నాయి. వారప్పుడు శనివేరప్పేట సంస్థానంలో బాహర్జలీ ప్రాంతంలో ఉన్న నిడమర్రు అనే గ్రామంలో ఉన్నారు. అక్కడ మొదటిసారిగా అష్టావధానం చేసి కాశీప్రయాణానికి సరిపడా డబ్బు సంపాదించుకొన్నారు.
ఏలూరు ద్వారా బెజవాడకు వెళ్ళి అక్కడ రైలెక్కి బోనగల్లులో దిగి వత్సవాయి, జగ్గయ్యపేట, మక్కపేటలలో మకాం చేసి, మళ్ళీ బోనగల్లు వచ్చి అక్కడనుండి సికందరాబాదు చేరి, వారం రోజులు పట్టణము చూసి, అక్కడ రైలెక్కి వాడీ, ధోండు, జబ్బలపూరు, ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. రాత్రి పన్నెండుగంటల వేళప్పుడు కాశీచేరినవారికి ఆరాత్రి ఎవరో వసతి కల్పించారు. కాశీకి వచ్చినవారందరినీ గంగ పరీక్షిస్తుందని, ఆ పరీక్షకాగనివారిని అక్కడనుండి వెళ్ళగొడుతుందని, ఆ పరీక్ష ముఖ్యంగా గ్రహణి (అతిసార) రూపంలో ఉంటుందని గురువుగారు చెప్పేవారట. అది గుర్తుకువచ్చిన శాస్త్రిగారు, రోగనివృత్తికి పద్యాలు చెప్పే అలవాటు వల్ల, వెంటనే గంగాదేవిమీద కవిత్వం చెప్పారు. తర్వాత కృష్ణశాస్త్రిగారు గ్రహణితో తీవ్రంగా బాధపడినా కాశీలో తాను యే రోగగ్రస్తుడూ కాకపోవటానికి ఈ స్తోత్రమే కారణమని శాస్త్రిగారి నమ్మకం.
తెలుగువారు ఎక్కువగా ఉండే నారదఘట్టం చేరారు మర్నాడు. ఆరోజుల్లో సత్రాల్లో మధ్యాహ్నభోజనమే ఉండేది. చాలామంది విద్యార్థులు ఏకభుక్తమే చేసేవారు. శాస్త్రిగారికి మాత్రం వచ్చిన మరునాడే, పైడా వెంకన్నగారి సత్రంలో, శాస్త్రి గారి కవితాసామర్థ్యాన్ని గురించి విన్న సత్రాధికారి రాత్రిభోజనం కూడా ఏర్పాటు చేశాడు. శ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్త్రులు (బ్రహ్మయ్యశాస్త్రిగారి గురువు)గారివద్ద వ్యాకరణం తరువాయి నేర్చుకోవటం మొదలుబెట్టారు. స్వయంగా ఇద్దరు విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. కాశీలో ఉండగా భోజన తాంబూలాలకేమీ ఇబ్బందిపడలేదు. గంగను అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ ఈదటమూ చేశారు. ఒక్కసారి స్నేహితులు బలవంతంగా తాగించిన భంగుమాత్రం ప్రాణాపాయస్థితికి తీసుకువెళ్ళింది.
కొన్నిరోజులతర్వాత, తల్లితండ్రులనుంచి ఇంటికి తిరిగిరమ్మని ఉత్తరమూ, దారిఖర్చులూ వచ్చాయి. నిర్జలైకాదశి తర్వాత, కాశీని విడవలేక, విడవలేక బయలుదేరారు. లక్కవరమునుండి వచ్చిన వందనపు నరసయ్య అనే కోమటిబిడ్డ తిరుగుప్రయాణానికి జత కలిశాడు. ఇద్దరూ కలసి గయకు వెళ్ళి అక్కడనుండి కలకత్తా చేరారు. కలకత్తాలో కొన్ని మోసాలకు గురైన తరువాత, స్టీమరు టికెట్టు తీసుకొని కటకం (కటక్) చేరారు. కటకాన్నుంచి యెడ్లబండిపై జగనాథక్షేత్రానికి చేరుకొన్నారు. అక్కడనుంచి గంజాం, ఆపై బరంపురం చేరుకొన్నారు. అక్కడనుంచి శ్రీకూర్మం, సింహాచలం, ఉప్పమాక మొదలైన క్షేత్రాలు సేవించుకొని తుని చేరారు. పిఠాపురం పైగా చామర్లకోట చేరాక, అక్కడ నరసయ్య కాలువ పడవెక్కి వెళ్ళిపోయాడు. కాకినాడ పైగా యానాము బయలుదేరిన వేంశా, సమీప గ్రామం నీలపల్లె దేవాలయంలో ఆగి తల్లితండ్రులకు కబురంపగా వాళ్ళు అప్పటి సంప్రదాయం ప్రకారం బాజాభజంత్రీలతో వచ్చి యింటికి తీసుకువెళ్ళేరు.
వేంకటశాస్త్రిగారు, ఆయన సహచరుడు కాశీనుంచి గంగకావిళ్ళతో బయలుదేరారు. ఈ ప్రయాణంలొ వారు చాలా ఇబ్బందులు పడ్డారు. కలకత్తాలో మోసపడ్డారు. కాశీనుంచి కటకం వరకూ స్వయంపాకమే. సముద్రప్రయాణమూ, బండి ప్రయాణమూ ఇబ్బంది పెట్టాయి. దీనికితోడు ప్రయాణంలో వేంశా గ్రహణి వ్యాధితోనూ, జ్వరంతోనూ బాధపడ్డారు. మధ్యదారిలో కొంతదూరం గంగకావిళ్ళు భుజాన మోద్దామని ప్రయత్నించి ఇబ్బందులు పడ్డారు. కాశీకి బయలుదేరింది పుష్య శుద్ధ త్రయోదశిన. తిరిగి వచ్చింది ఆషాఢమాసంలో (సుమారుగా ఆరు నెలలు).
యేనుగుల వీరాస్వామయ్యగారి పుస్తకంతో పోలిస్తే, యాత్రాగ్రంథంగా ఈ పుస్తకం తేలిపోతుంది. వీరాస్వామయ్యగారిది ముఖ్యంగా యాత్రాస్మృతి (ట్రావెలాగ్). తాము వెళ్ళిన ప్రతిచోట అక్కడి ప్రజలు, పరిస్థితులు గురించి విపులంగా వర్ణించటానికి ప్రయత్నించారు. వేంకటశాస్త్రిగారిది ఆత్మకథాశకలం. తన కథ చెపుతూ ఉంటే అందులో అనేక విషయాలు వస్తాయి. ఆ విషయాలను విస్తరించుకొంటూ చెపుతూ పోతూ ఉంటే మనకు సరదా కలిగించే అనేక విషయాలు తెలుస్తాయి. 58 పేజీల కాశీయాత్రలో శాస్త్రిగారు ఏలూరు నుంచి కాశీ వరకు వెళ్ళటం ఒక పేరాగ్రాఫులో అయిపోతుంది. తిరుగుప్రయాణానికి పదిపేజీలు పట్టింది కానీ, అది చాలావరకూ ఆ ప్రయాణంలో ఆయన పడిన బాధల చిట్టాతోనే నిండిపోయింది. కాశీలో తాను చూసిన, చదివిన విషయాలగురించి వివరణ కూడా తక్కువే. ఐనా 19, 20 శతాబ్దాల సంధికాలంలో మన జీవన విధాన విశేషాలు కొన్ని తెలుస్తాయి. ఇందుకు సంపాదకుడందించిన పాదపీఠికలు (foot-notes) బాగా ఉపయోగిస్తాయి.
కాశీయాత్ర కాకుండా ఇందులో ఇంకో నాలుగు వ్యాసాలున్నాయి. వాటిలో ఒకటి తిరుపతి వేంకటేశ్వర కవులు అనే పేర, ఇంకొకటి తిరుపతి వేంకట కవుల పేర ఉన్నాయి. అయినా ఇవి వేంశావేనని సంపాదకుల అభిప్రాయం. మొదటి వ్యాసం శృంగారవర్ణనము. ఫూర్వులు అనాగరికులనియూ, వారు అయుక్తముగా శృంగారమును వర్ణించిరనియూ, కొన్ని కావ్యములను పరిష్కరించి యా శృంగారవర్ణనములను తొలగించి ప్రచురింపవలయుననియూ కొందరు చేస్తున్న వాదనను ఖండిస్తూ, శృంగారవర్ణనంలో తప్పేమీ లేదని, అలంకార, లక్షణశాస్త్రాల్లో శృంగారం పట్ల నిషేధమేమీ లేదని వీరి వాదన. వ్యాసము గ్రాంథికభాషలో ఉన్నది.
శతావధానములు అన్న వ్యాసము కూడా ఇంకొకరికి సమాధానముగా వ్రాసిన వ్యాసమే. శతావధానం గొప్ప విషయమేమీ కాదని, తివేంకవుల ప్రసిద్ధికి ప్రజల వేలంవెర్రి కారణమని పండితమాన్యుడిపేర వచ్చిన ఒక వ్యాసానికి ఈ వ్యాసం సమాధానం. అవధానం చరిత్రను కొంత వివరిస్తుంది. కొందరు ప్రసిద్ధులైన అవధానులను ప్రస్తుతించారు. అవధానం అన్నది కవిత్వంకన్న, చిత్తైకాగ్రతకు, ధారణకు, బహుళశాస్త్రజ్ఞానానికి సంబంధించిన విషయంగా వీరు నిర్వచించారు. ఐతే, అప్పటికే అవధాని బిరుదం సామాన్యమైపోయిందని, కొందరికి అర్హతలేకుండానే ఆ బిరుదం ఇవ్వబడిందనీ విచారించటమూ కనిపించింది. పండితమాన్యుడుగారెవరో వారికి తెలిసినట్లే ఉంది. ఆయన్ను పేరెత్తకుండానే ఉతికి ఆరవేసిన విధానం వినోదాత్మకంగా ఉంది.
సిగ్గూ బిడియమూ అంటూ భారతి పత్రికలో 1938లో వ్రాసిన వ్యాసం కొంత కోతికొమ్మచ్చిలాడి, సిగ్గుకు అర్థాన్ని కొంత విస్తరించి, కొన్ని కొత్త విషయాలను తెలిపింది.
మా విద్యార్థి దశ నాటి కవిత్వం అని తొలినాళ్ళలో ఆయన రాసిన కవిత్వాన్ని తూకం కడుతూ 1941లో భారతిలో వ్రాసిన వ్యాసం నన్ను ఈ పుస్తకంలో బాగా ఆకర్షించిన వ్యాసం. చిన్నతనంలో ఈయన తెలుగులో కవిత్వం చెప్పుతాడని గురువుగారు ఎవరితోనన్నా ప్రస్తావిస్తే ఈయన చాలా అవమానంగా భావించేవారట. “ఆరోజులనాటికి సంస్కృత పండితులు చాలామంది ఉండేవారు. తెలుగంటే లేశమూ గౌరవం లేదు. అసలు చదువు రాకపోయినా తప్పు లేదుగాని తెలుగు చదువుకున్నాడంటే తప్పుగా కనబడేది.” బ్రహ్మయ్య శాస్త్రులుగారి దగ్గర చేరాక వేంశా తెలుగులో కవిత్వం చెప్పటం మానేసి, సంస్కృతంలో శ్లోకాలు వ్రాయడం మొదలుబెట్టారు. సమాసభూయిష్టంగా, కఠినంగా వ్రాయడం గొప్పగా భావించేవారు. భావం కన్నా, శబ్దం మీద ధ్యాస ఎక్కువ. యమకం మీద మోజు ఉండేది.
కాలక్రమేణా వారి దృక్పథం మారింది. మన కవిత్వం మనకేగాని యితరులకు అర్థం కాకూడదనే ఊహ అంతరించింది. కవిత్వమనేది లోకం కోసమే అయితే దుర్బోధంగా రచించడంకన్నా అనాలోచితప్పని ఉండదని యెరుక కల్గింది. తుదకి తెలుగుకవులే అయ్యారు. తెలుగులోనే చాలా వ్రాశారు. “గొల్లలకూ, గొడ్లకాపరులకూ అర్థమయ్యే” కవిత్వం తెలుగులో వ్రాశారు. ద్రాక్షాపాక కదళీపాకాలే దేశభాషాకవిత్వానికి పరిగ్రహణయోగ్యాలు. తక్కినవి క్వాచిత్కంగా మాత్రమే గ్రహించతగ్గవి అని వారి తీర్మానం.
అనుబంధాలలో తిరుపతి వెంకట కవులు వ్రాసిన గ్రంథాల పట్టిక, 1911 ఆగస్టు సెప్టెంబరులలో గుంటూరు, నరసరావుపేటలలో వారు చేసిన శతావధానాల గురించి పత్రికలలో వచ్చిన కథనాలూ, కాశీకి విజయనగరం మహారాజాలకు ఉన్న సంబంధం గురించి సంపాదకుడు వ్రాసిన వ్యాసమూ ఉన్నాయి. తిరుపతి వేంకట కవులు చేసిన శతావధానాల్లో కొన్ని పూర్తి శతావధానాలు కావని తెలియడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది – చాలా అవధానాల్లో నలభై మంది పృశ్చకులవరకు మాత్రం సమాధానాలు చెప్పడానికే కాలవ్యవధి సరిపోయేదట. నాలుగవ అనుబంధంలో విజయనగరం సంస్థాన చరిత్ర, ఆ పాలకులకు కాశీకి ఉన్న సంబంధం వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం కాశీలో విజయనగరం కోఠీలో ఉన్న విజయనగరం వారసుడు – సర్ విజ్జీ చిన్న కుమారుడు – కువర్ వెంకటేశ సింగ్ అలక్‌నారాయణ గజపతి గారికి ఆనందగజపతి, గురజాడల గురించి తెలియదంటే కొద్దిగా దిగుల్లాంటిది కలిగింది.
తన గురువుగారిగురించి విశ్వనాధవారు వ్రాసిన వృత్తాంతాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చెల్లియో చెల్లకో అంటూ శ్రీరమణ వ్రాసిన ముందుమాట ఆయన మాత్రమే రాయగలది. సంపాదకుడి మనవిమాటలలో చెళ్ళపిళ్ళవారిమీద చాలా గౌరవం, అభిమానం కనిపిస్తాయి. వారి చరిత్రను, ప్రతిభను మనకు చక్కగా పరిచయం చేశారు. కొంత శాఖా చంక్రమణం, కొంత అనవసర ప్రసంగం, కొంత సొంత గొడవ ఈ మనవిమాటల విలువను కొంత తగ్గించాయి.
ఈ పుస్తకం విషయంలో ముఖ్యంగా నన్ను ఆకర్షించింది సంపాదకత్వంపై సంపాదకుడు శ్రీ రవికృష్ణ పెట్టిన శ్రద్ధ. ఈరోజుల్లో తెలుగు పుస్తకాలలో అరుదుగా కనిపిస్తున్న విషయం ఇది. సంపాదకుడి మనవిమాటల్లో సంపాదకునికి ఉండవలసిన బాధ్యతలు అని ఆయన ఊహించినవి పదింటిని తెలిపారు. ఈ విషయంలో శ్రీ రవికృష్ణతో నేను ఏకీభవిస్తున్నాను. సంపాదకులు, ప్రచురణకర్తలూ వీటిని చదివి, చర్చించి, జీర్ణించుకొని, సర్వత్రా పాటిస్తే తెలుగుసాహిత్యపు స్థాయి చాలారెట్లు పెరుగుతుందని నా నమ్మకం.
ఈ పుస్తకంలో చాలా విపులమైన పాదపీఠికలు ఉన్నాయి. వేంశా ప్రస్తావించిన అనేక వ్యక్తుల, ప్రాంతాల, విషయాల గురించి ఈ పాదపీఠికలు వివరంగా తెలుపుతాయి. వయస్సులో చిన్నవాడైన సంపాదకుడు ఈ పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించాడో కాని చాలా ముచ్చటవేసింది. కాశీపట్టణంలో వేంశా ప్రస్తావించిన అనేక భవనాల, ఘట్టాల తాలూకు అప్పటి, ఇప్పటి ఛాయాచిత్రాలు సేకరించి ప్రచురించటం పుస్తకం విలువను పెంచింది. వివిధ దశలలో వెంశా ఫొటోలు, ఆయన చేవ్రాలు చేర్చటం ముదావహం. రాయన గిరిధర గౌడ్ ముఖపత్రంకోసం రచించిన వేంకటశాస్త్రి వర్ణచితం శాస్త్రిగారి రచనల్లో కనిపించే ఆత్మవిశ్వాసాన్ని, చమత్కారప్రియత్వాన్ని చక్కగా, ఆకర్షణీయంగా ప్రతిబింబించింది. పుస్తకాన్ని చాలా అందంగా, శ్రద్ధగా ప్రచురించారు. అచ్చుతప్పులు అరుదుగా ఉన్నాయి. సంపాదకుణ్ణి, ప్రచురణకర్తలనీ అభినందించాలి.
కాశీ యాత్ర (మరికొన్ని రచనలు)
శతావధాని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి(సం: మోదుగుల రవికృష్ణ)డిసెంబరు 2012ప్రచురణ: అన్నమయ్య గ్రంథాలయం, అన్నమయ్య వీది, గుంటూరుప్రతులకు: M. Ravikrishna,26-19-10, ‘0’ Lane, Main Rd,AT Agraharam, Guntur 522006cell phone: 9440 320 580Also available at www.kinige.com176 పేజీలు/ 100 రూ.
సౌమ్య
ఇదివరలో మీరు రాసిన వ్యాసం చదివినప్పుడు ఈ పుస్తకం చదవాలి అనుకుని, “మనకెక్కడ అర్థమవుతాయి ఇవన్నీ” అని ఊరుకున్నా. ఇన్నేళ్ళకి కుదిరింది 🙂 ఇవ్వాళే ఈ పుస్తకం చదివాను (ఇంకా అనుబంధాలు అవలేదు). విశ్వనాథ వారి వ్యాసం, చెళ్ళపిళ్ళ వారు రిటర్న్ ట్రిప్ గురించి రాసిన వర్ణనలూ నచ్చాయి నాకు. మనవిమాటలు లో కొంచెం అనవసర వివరాలు ఉన్నట్లు నాకు అనిపించినా, పుస్తకాన్ని సంపాదకుడి వ్యాఖ్యానంతో చదవడం బాగుంది నాకు. ఇకపోతే ఈ యాత్రాకథనం నాకు ఆట్టే ఆసక్తి కలిగించలేదు (ఏనుగుల వీరాస్వామయ్య పుస్తకం నేను చదవలేదు). ఆయన అక్కడ పొందిన విద్య గురించి, అక్కడి గురుకుల వాసం పద్ధతుల గురించీ ఇంకాస్త వివరంగా రాసి ఉంటే బాగుండుననిపించింది నాకు కూడా … రవికృష్ణ గారు మొదట్లో రాసినట్లు.
SravanthiY
youtube లో గరికపాటి నరసింహ రావు గారి మహాభారత ప్రసంగాల ద్వార తిరుపతి వెంకట కవుల గురించి నేను మొట్ట మొదటి సారి తెల్సుకున్నాను. అప్పటికే “చెల్లియో – చెల్లకో, జెండా పై కపిరాజు ” లాంటి పధ్యాలు విన్నా , ఇవి ఎవరు రాశారు ? అని నేను ఆలోచించనదుకు సిగ్గు పడుతున్నాను. వారి గొప్పతనం తెలుసుకున్న తరువాత, అంతటి తిరుపతి కవుల లో ఒకరు రాశిన పుస్తకం కాబట్టి చదవాలి అని ఆకర్షితురాలిని అయ్యాను కానీ, “అన్నప్రాసన రోజే ఆవకాయ” అనట్లు, ఇది తెలుగు సాహిత్యం మీద పట్టు లేని వారికీ, కొత్త గా తెలుగు పుస్తకాలు చదవటం మొదలు పెట్టిన నా లాంటి వారికీ సరైన పుస్తకం కాదేమో అనిపించింది. జంపాల గారు చెప్పినట్లు కొంత గ్రాంధికం లో ఉన్న , వేంశా గారు వాడిన తెలుగు శబ్ద ప్రయోగాలూ నాకు చదవటానికి / అర్థం చేసుకోవటానికి చాల క్లిష్టం గా అనిపించాయి. ఉదాహరణ కు చెళ్ళపిళ్ళ గారు రాసిన పద్యాలు. వాటికి సంపాదకులు తాత్పర్యం రసి ఉంటె బాగుణ్ణు అనిపించింది. వేంశా గారు “వ్యాకరణం” ,”తర్కం”, “కౌముది” లాంటి కొన్ని శాస్త్రాల గురించి చెప్పారు. ఇవి ఏంటో, ఎలా అభ్యసించే వారో అది కూడా మన సమాజం లో ఫ్రెంచ్/బ్రిటిష్ influence భారత విద్యా వ్యవస్థ మీద ఉన్న సమయం లో ( వేంశా గారు కూడా బడి లో ఫ్రెంచ్ చదివినట్లు రాశారు) ఎలా ఉండేదో తెలుసుకోవాలన్న నా కుతూహలానికి సమాధానం ఈ పుస్తకం లో దొరకలేదు అనే నిరాశ కుడా ఉంది.
మనం వాడే అంకెలు ఇంగ్లీషు వని తెలుసు. అలాగే period ( . ) quotes (“) కుడా. ఇవి బ్రిటిష్ influence వలన మన సాహిత్యం లోకి ఎపుడు వచ్చాయో తెలుసుకోవాలి అని ఉంది. చెళ్ళపిళ్ళ వారు 1934 లో ఈ పుస్తకం రాసినప్పుడే ఇవి “కాశి యాత్ర” కథ లో వాడినారా లేక సంపాదకులు వీటిని మన సౌఖ్యం కోసం ఉపయోగించినరా అని కూడా తెలుసుకోవాలి అని ఉంది.
కాశీకి పోయాడు వేంకటశాస్త్రి… | పుస్తకం
[…] ప్రాప్తి స్థానాలు: 1. M. Ravi Krishna, #26-19-10, ’0′ Lane, Main Road, A.T.Agraharam, GUNTUR – 522006. Cell: 9440 320 580 2. నవోదయా బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్ 3. విశాలాంధ్రా అన్ని బ్రాంచీలలో. కినిగె లో ప్రతులు లభ్యం. ఈ పుస్తకంపై మరో వ్యాసం ఇక్కడ. […]
S. Narayanaswamy
“సంపాదకుడి మనవిమాటల్లో సంపాదకునికి ఉండవలసిన బాధ్యతలు అని ఆయన ఊహించినవి పదింటిని తెలిపారు. ”
ముదావహం. రవికృష్ణగారికి అభినందనలు.
మీ పరిచయం పుస్తకాన్ని కొని చదివించేలా ఉంది!
Sreenivas Paruchuri
<>
I don’t know about 1948 and 1955 editions, but I thought that it was first published in 1942. Thats also what Sri Akkiraju Ramapatirao says. By the way, AKR says that he was reprinting it after 60 years. The AKR edition you are referring to was published in June 2002 (supatha prachuraNalu).
I saw the book and also “naa yeruka” during my recent trip but have not bought them. My Telugu book buying has significantly come down in the past 3 years.
ఏల్చూరి మురళీధరరావు
శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
నమస్సులతో,
మీరన్నట్లు శ్రీ అక్కిరాజు వారి పునర్ముద్రణ జూన్ 2002 లోనే వెలువడింది. 2004 అని నేను టైపు చేసినది పొరపాటు.
ఆదిభట్ల వారి “నా యెఱుక”ను శ్రీ కఱ్ఱా ఈశ్వరరావు గారు మహాకవి శ్రీ మిన్నికంటి గురునాథశర్మ గారిచే పరిష్కరింపజేసి, డా. యస్వీ జోగారావు గారి పూనిక మూలాన 1978లో ప్రచురించారు. ఆ ప్రతులు ఇంకా అక్కడక్కడ దొరుకుతూనే ఉన్నాయి. దానిని డా. గుండవరపు లక్ష్మీనారాయణ గారు పునఃపరిశోధించి, పునర్ముద్రణకు సిద్ధం చేశారని తెలుసు కాని, ఇటీవలి రెండవ ముద్రణ ప్రతిని నేను చూడలేదు.
“కాశీయాత్ర”ను గురించి “మన సారస్వత, చరిత్రల పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవవలసిన పుస్తకం” అని శ్రీ జంపాల చౌదరి గారన్న మాట “నా యెఱుక”కు కూడా అనువర్తిస్తుంది కాని, నేనూ ఇప్పుడు మీ స్థితిలోనే ఉన్నాను …
ఏల్చూరి మురళీధరరావు
రెండు మూడు తరాల మునుపు అవిరళప్రచారంలో ఉండిన శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి “కాశీయాత్ర”ను పునర్ముద్రించిన ప్రకాశకులకు, దానిని గురించిన ఆసక్తికరమైన పరిచయాత్మక సమీక్షతో ఆనాటి సాహిత్యవాతావరణాన్ని మళ్ళీ ఒకసారి కన్నుల ముందుకు తెచ్చిన శ్రీ జంపాల చౌదరి గారికి అభినందనలు.
“కాశీయాత్ర” మొదటిసారి ఒకప్పటి క్రౌను సైజులో లఘుపుస్తకంగా 1942లో అచ్చయింది. వెంకటశాస్త్రి గారు జీవితులై ఉండగా 1948లో ఒకమారు, ఆ తర్వాత దుర్గేశ్వరశాస్త్రి గారు వేసినది ఒకటి – అప్పట్లో మొత్తం మూడు పర్యాయాలు పునర్ముద్రణకు నోచుకొన్నది. 2004లో అక్కిరాజు రమాపతిరావు గారు ఒక చక్కటి లఘుపరిచయాన్ని, అనుబంధంగా సుమారు 152 పదాలతో ఒక విలువైన స్థల – నామ – విశేషవిషయ అకారాదిసూచికనూ చేర్చి మరొకమారు అచ్చువేశారు. ఆ అకారాదిసూచికలోని పదాలకు బహుశః అప్పటి పరిమితుల వల్ల వివరణలను ఇవ్వలేదు. పూర్వముద్రణల వివరాలు అందులో లేవు. వచన రచనను దేశీ వారి హెల్విస్టా 14 పాయింటు బోల్డు టైపులో సరికొత్త తీరున ముద్రిస్తూ శ్రీ శాస్త్రిగారు తమదైన పద్ధతిలో ఎంతో పట్టుదలగా వ్రాతప్రతిలో పెన్సిల్ మార్కులు వేసి మరీ శ్రద్ధతీసుకొన్న పదాల మధ్య స్పేసింగులను చూడాలంటే లితోగ్రాఫుగానో, ఆఫ్ సెట్టులోనో ముద్రిస్తే కన్నుల పండుగగా ఉండేది. ఆ తీరుతీయాలను 2004 నాటి పునర్ముద్రణలోనూ పాటిస్తే బాగుండేది కానీ ఎందుకో అలా జరగలేదు. ఈ సరిక్రొత్త ముద్రణను నేనింకా చూడలేదు కాబట్టి ఇప్పుడెలా ముద్రించారో తెలియదు.
ఇందులోని తిథుల వివరాలలో “జాతకచర్య”కు, వాస్తవంగా ఆ ఘటనలు జరిగిన కాలానికి చిన్న చిన్న తేడాలు ఉన్నట్లు ప్రథమదృష్టికి అనిపించవచ్చును. ఆ వైరుద్ధ్యాలను వెంకటశాస్త్రి గారి కుమారులు దుర్గేశ్వరశాస్త్రి గారు వేరొక చోట సరిగా సమన్వయించారు.
భవభూతి ఉత్తర రామచరిత్రలో ప్రతిమాగృహంలోకి వెళ్ళి తన పూర్వీకుల చిత్తరువులను చూసి బిత్తరపోయిన శ్రీరాముడి లాగా “కాశీయాత్ర”ను చదివినపుడల్లా నా కనిపిస్తుంది: ఎంత ముక్తాముక్తంగా శాస్త్రిగారు ఆ కథను చెప్పగలిగారు, వారే చెప్పకుండా ఉంటే తెలుగువారికి ఆనాటి ఆ పండితపరంపరను గురించి కనీసం కర్ణాకర్ణిగా నైనా చెప్పేవారు ఉండేవారా? అని. మానవల్లి గంగాధరశాస్త్రి గారు, ద్రావిడ సుబ్రహ్మణ్యశాస్త్రులు గారు, శివకుమార పండిట్ జీ వారు వంటి మహానుభావులను అంత గౌరవంతో శాస్త్రిగారు ఎందుకు స్మరించారు? అన్న జిజ్ఞాస కలిగిన తర్వాత నాకు ఆ రోజుల్లో వారు జీవించి ఉండగానే ఆ మహామహుల జీవితచరిత్రలు సంస్కృతంలో కావ్యాలుగా రచింపబడిన సంగతి, ఆ కావ్యాలలోని ఆనాటి ఆంధ్రుల ప్రస్తావనలు తెలిసివచ్చాయి. భాగవతుల హరిశాస్త్రులవారి పేరును తొలిసారిగా వీరు ఈ పుస్తకంలోనూ, ఆ తర్వాత కథలు – గాథలు లోనూ వ్రాసిన తర్వాతనే హరిశాస్త్రులవారి జీవితచరిత్ర, చిన్నయసూరి గారితో వాదవివాదాల చరిత్ర తెలుగువారికి తెలిసివచ్చాయి. ఇది చదివి, కథలు – గాథలు చదివితే ఇంద్రగంటి గోపాలశాస్త్రుల వారు, చర్ల బ్రహ్మయ్యశాస్త్రుల వారు మొదలైన మహనీయుల వివరాలు పరస్పరానుబంధంతో తెలుస్తాయి.
అనేక విధాల శాస్త్రిగారు వ్రాయదలచుకొన్న విషయాలకు సంచి మొదలు మనకు “కాశీయాత్ర”లో కనబడుతుంది. ఇందులోని కాలాట్ఠకం, వైద్య రోలంబరాజీయం, పరిభాషేందుశేఖరం ఇందులో ప్రస్తావితాలైనవాటిని గురించి శాస్త్రిగారి ఆ తర్వాత విపులీకరించి పెక్కు వ్యాసాలలో వ్రాశారు.
ఒక విధంగా “పాణినీయం” చదువగోరినవారికి “శబ్దమంజరి” ఎలాటిదో, “కథలు – గాథలు” చదువదలచినవారికి “కాశీయాత్ర” అలాంటిది.
అదృశ్యమైపోతున్న దర్శనీయ దృశ్యాన్ని దర్శనగోచరం చేసినందుకు శ్రీ చౌదరి గారికి అభినందనలు!
chavakiran
ఏల్చూరి గారు,
ఈ లింకు చూడండి ఒకసారి. http://kinige.com/kbrowse.php?via=tags&tag=Modugula+Ravikrishna