తెల్లకొక్కర్ల తెప్పం – హోసూరు తెలుగు కతలు

మొదట చూసినప్పుడు ఈ పుస్తకం పేరు నాకస్సలు అర్థం కాలేదు. కొద్దో గొప్పో తెలుగు బాగానే తెలుసు అనుకునేవాణ్ణి కానీ, ఇక్కడ నాకు తెల్ల అన్న మాట ఒక్కటే తెలిసింది. మిగతా మాటల కతలూ, కమామిషులూ తెలుసుకుందామని ఈ పుస్తకం కొన్నాను.  ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉండటం ఇంకో కారణం  కావచ్చు.

ఈ పుస్తకాన్ని ప్రచురించింది కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం (క్లుప్తంగా – కృష్ణరసం). తమిళనాడులో ఉత్తరంగా  ఉన్న ఈ కృష్ణగిరి జిల్లాకు ఒకపక్క ఆంధ్ర ప్రదేశ్, ఇంకో పక్క కర్ణాటక ఉంటాయి. ఇలా మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ జిల్లాలోనే హోసూరు ప్రాంతం ఉంది. రాష్ట్రవిభజన సందర్భంలో తెలుగు ప్రాంతమే ఐనా, ఈ హోసూరు ప్రాంతం తమిళనాడులోనే ఉంచబడింది. అక్కడ నెమ్మదిగా ’తమిళభాష తెలుగు భాషను మింగేస్తున్న సమయంలో’, తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ దిశగా జరుగుతున్న అనేక ప్రయత్నాలలో భాగంగా ఈ కృష్ణరసం సంస్థ ఆగస్టు 19, 2001న హోసూరులో ఆవిర్భవించింది. అప్పటినుండి పలు కార్యక్రమాలు ప్రతి యేటా నిర్వహిస్తున్న ఈ సంస్థ పుస్తకాలను కూడా ప్రచురించటం మొదలుబెట్టింది.

ఈ పుస్తకంలో కథలు వ్రాసిన డా. ఎన్. వసంత్ వృత్తిరీత్యా వైద్యుడు. హోసూరును ఆనుకుని ఉన్న చిన్నపల్లెలో పుట్టి పెరిగిన డా. వసంత్ చిన్నతనంలో, తమిళనాడులో ఉన్నామన్న స్పృహ ఉండేది కాదట. ’ఇంట్లో మాట్లాడేది తెలుగు. వీధిలో మాట్లాడేది తెలుగు. బడిలో చదివేది తెలుగు.  ఆడేది తెలుగు ఆట. పాడేది అచ్చతెలుగు పాట. చూసేది తెలుగు సినిమా.” ఆ మాటలు, ఆటలు,పాటలు, బడులు, ఊర్ల పేర్లు వారి కళ్ళ ముందే కనుమరుగవటం చూస్తూ సహించలేక, తరతరాలనుంచి ఆచరిస్తూ వచ్చిన జీవనవిధానం, భాషా బంధాలు ఒక్కసారిగా మాయమౌతుంటే భాషకోసం ఏదో చేయాలన్న తాపత్రయంతో రచయిత తెలుగు భాషోద్యమ సమాఖ్య తమిళనాడు శాఖలోనూ, కృష్ణరసంలోనూ చురుగ్గా పాల్గొనటం ప్రారంభించారు.

హోసూరు మాండలికంలో కథలు రాయాలనీ, అక్కడి సామెతలు, ఆచారవ్యవహారాలు, చిన్ననాటి జ్ఞాపకాలు కథలుగా మార్చాలని ప్రళయకావేరి కథల రచయిత స.వెం.రమేష్ ఆదేశించగా ఉత్తేజితుడైన  డా. వసంత్, రోజూ సాయంత్రం క్లినిక్ కాగానే ఒక అరగంట అమ్మ దగ్గర కూర్చొని ఆ ప్రాంతంలో నేటికీ వాడుకలో ఉన్న సామెతలు, ఆచారవ్యవహారాలు, తిట్లు, చెట్లు, కాయి, పండు, వ్యవసాయ పనిముట్లు, ఇట్లా చాలా విషయాల్లో ఆమె సాయం తీసుకుని కథలు రాయటం మొదలుబెట్టారు.

ఈ పుస్తకంలో మొత్తం 20 కథలున్నాయి. కథలన్నీ హోసూరు యాస, బాసల్లోనే ఉన్నాయి. కథలన్నీ నిడివిలో చిన్నవే. లోతు కూడా తక్కువే. చాలా కథలు చిన్నపిల్లవాడి దృష్టికోణంలోంచి చెప్పినవి. నాలుగు కథలు ప్రాంతీయంగా ప్రచారంలో ఉన్న చిన్న జానపద కతలు. మిగతా కథలకు వస్తువులు అక్కడి పండగలు, పూజలు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, ఆటలూ, పాటలూ, మరువలూ, మొడుగులూ, వానరాయడూ, వానకోయిల్లూ.

ఈ కతల్లో కథకన్నా ముఖ్యమయ్యింది భాష, వాతావరణ చిత్రణ.  తన చిన్నతనపు పల్లెజీవనాన్ని, దశబ్దాలు గడుస్తున్నకొద్దీ ఊర్లో వస్తున్న మార్పుల్నీ, ఆ మార్పులకు ఎదురీది తెలుగుని బ్రతికించటానికి స్థానిక ప్రజలు చేసిన, చేస్తున్న వీరోచిత ప్రయత్నాలనీ రచయిత కళ్ళకు కట్టేట్టుగా వర్ణించారు.

ఏటిగడ్డ కథలోంచి తీసి వెనుక అట్టమీద వేసిన ఈ భాగాన్ని ఓసారి ఆస్వాదించండి –

“ఏటిగడ్డ గురించి ఎంత పొద్దు సెప్పినా పొద్దు సాలే లేదు. పడమర పక్కలా ఎత్తరముగా నిలిశిన సూడేశ్వరుని కొండ, తూరుపు దిక్కులా బిరబిర పారే ఏరు, ఉత్తరాన ఒగటి రొండు వానలకే నిండి మరువపారే శెరువు. శెరువుకట్ట కింద కాన, కట్ట మింద జంబునేరిడి మాన్లు. కాన వబ్బల్లా కెంబారకాకి పాటలు. మాన్ల నీడల్లా బాపన తొణెకెత్తల కుణుసులు… కామునిబిల్లు ఏటిగడ్డ పైనికి వొంగే వన్నెల్ని ఏరుకొనేది…”

మనకు (అంటే నాకు) తెలిసిన తెలుగులానే ఉన్న ఈ తెలుగులో నాకు తెలిసీ తెలియకుండా, తెలియకపోయినా తెలిసినట్టున్న మాటలు చాలానే ఉన్నాయి. ప్రతి కథ తరువాత ఇచ్చిన పదాలు, అర్థాల వల్ల ఇంకొంత తెలిసింది. బాపనతొణికెత్త అంటే ఒకరకం తొండ అట. కామునిబిల్లు అంటే ఇంద్రధనుస్సట (ఇంద్రధనస్సు ఏటి గడ్డ పైకి వంగి రంగుల్ని ఏరుకొంటుంది అని ఆఖరి వాక్యం అర్థం).  ఇలాంటి వర్ణనలు ఈ పుస్తకంలో చాలా కనిపిస్తాయి.

కొన్ని మాటలు వెంటనే అర్థమౌతాయి. కొన్ని మాటల నిర్మాణం ఆశ్చర్యంగా ఉంటుంది. కోడిగుజ్జాము అంటే కోడి కూసే జాము. మబ్బుమసుకులు అంటే మసకచీకటి. ఎలనీరుకాయలు అంటే కొబ్బరికాయలు (టెంకాయలు అని కూడా). ఎలా వచ్చాయో కాని కొన్ని పదాలు హిందీలోంచో, ఉర్దూలోంచో వచ్చినట్లు ఉన్నాయి  (శురువు చేయటం – మొదలుబెట్టడం, సుదారించు – సరిచేయు, ఓదార్చు వంటివి). కొన్ని పదాలు గుర్తు  పట్టటం కష్టమే – మట్టిగాడు (చిరతపులి), మీజు (ఈదు) వంటివి. పదాలు పూర్తిగా తెలియకపోవటం ఈ కథలను ఆస్వాదించటానికి పెద్దగా అడ్డం రాదు.

జంసవరి  కథలోంచి ఒక ముక్క:  జంసవరి పండగ (విజయదశమి) నాడు  ఉదయాన్నే రచయిత అప్ప “…లేశి, గుద్యాండ్లు, దోకరుబర్లు, కొడువండ్లు, మొచ్చులు, శిబాసి, పికాసి, బాడిసి, మానుమడక, ఇనుము మడక, గడపారి, పొలికి, గుంటువ, కార్ల పొలికి, మానుపొలికి, మక్కిరె, మరము, గొర్రు, జడ్దిగము, మడి అసునుమాను, మోకులు, పట్యాండ్లు, శిక్కాలు, పగ్గాలు, అన్నీ కణజము తావ పెట్టి పూజశేస్తా ఉండాడు”.

అలాగే గుమ్మయ్య మొడుగు కతలో మొదటి పేజీలో నలభై మూడు రకాల మొక్కల (ఆకుల, పూల, పండ్ల) పేర్లు, ఇరవయ్యారు జీవాల పేర్లు (నేను లెక్కబెట్టాను) వాటి స్థావరాలు, ఔషధగుణాలతో సహా కనిపిస్తాయి. ఆపత్తు కతలో మొదటి వాక్యం: “రాగులు, సామలు, సజ్జలు, కొర్రలు, బరుగులు, వడ్లు, ఉలవలు, నూగులు, అనుములు, సాసువులు రాసులు రాసులు పండేవి మా గౌనోళ్ళ నేలలా”.

పిన్నయ్య పెండ్లి కతలో, పెళ్ళి అయ్యాక, పెండ్లికొడుకూ, పెంద్లికూతురూ మెరగనికి (ఊరేగింపుకు) బయిదేలిరి. “శెంద్రప్ప మేస్టరు ఇంటి తావ మెరగని నిలిశె. మంగలోళ్ళ రామప్ప కొలువు నిలిపి గొంతెత్తి, ’వేమన పద్దెమునకు ఎదురు పద్దెము లేదు, రామలచ్చుమనులకన్న రాజు లేరు, సతీపతికన్న సంగాతి లేదయా, విశ్వదాబిరామా వినరా వేమా అన్నట్లుగా పెండ్లికూతురూ పెండ్లికొడుకూ ఇద్దురూ శిలకల మాదిరిగా, గోరొంకల మాదిరిగా బిడ్డాపాపలు కలిగి నూరేండ్లు సల్లంగా ఉండాలని మన శెంద్రప్ప మేస్టర్లు పది రూపాయిలిచ్చి బో గొప్పగా బోయశస్సుగా పొగిడించినారహో’ అని పొగిడినాడు. ఇట్లా మావూరులా ఉండే నాలుగీదులూ సుట్టే తలికి నూరు వేమన పద్యాలన్నా శెప్పింటాడు రామప్ప”.

పెళ్ళిళ్ళలో వేమన పద్యాలు చదివించుకొని చదివింపులు ఇచ్చే ఆచారం ఉంది ఈ ప్రాంతంలో అని  స.వెం.రమేశ్ చెప్పారని ఇంతకు ముందు ఎక్కడో చదివాను. ఆది ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టించారు డా. వసంత్. చిన్న పుస్తకం. అందమైన అట్ట (కవర్ డిజైన్: లేపాక్షి). మంచి కాగితం మీద చక్కగా శ్రద్ధగా ముచ్చటగా ముద్రించారు. అచ్చుతప్పులు ఉన్నట్టు అనిపించలేదు. కతలుగా అంత గొప్పగా  లెకపోయినా ఈ కతలు రాసిన విధానం, తెలుగు మీద అక్కడివారికి ఉన్న మక్కువ, దిగువసీమోళ్ళు వాళ్ళ ఊళ్ళు వచ్చి వారిపైన పెత్తనం చేస్తుంటే అస్తిత్వపొరాటం చేస్తున్న వారి భాషాప్రేమ, నిబద్ధత అచ్చెరువు కలిగిస్తాయి. హోసూరు ప్రాంతపు ఆచార వ్యవహారాలు కొంత పరిచయమౌతాయి. ’తెలుగుకోసం భాషాభిమానులు పడే బాధ, తెలుగు సంఘాల పోరాటం, రాజకీయ నాయకుల ఆరాటం, మొత్తంగా ఇక్కడి తెలుగులు భాషకోసం పడిన పడుతున్న తాపత్రయాన్ని కొంతవరకైనా కథలుగా మలచా’లనుకొన్న రచయిత ప్రయత్నం సఫలమైందని అనుకొంటున్నాను.  కృష్ణరసం అధ్యక్షుడు నా.వెం.అశ్వత్థరెడ్డి వ్రాసిన ముందుమాటలో ఈ పుస్తకంపేరుని ఎర్నూగుపూలుగా పొరపడ్డారు.

ఇంతకీ తెల్లకొక్కర్ల తెప్పం అంటే చెప్పనేలేదు కదూ. కొక్కర అంటే కొంగ (కొక్కరాయి, కొక్కెరాయి) అట. తెప్పం అంటే తెప్ప. వాళ్ళ ఊరి శెరువు నిండి మరువ బారినబుడు శెరువులా తెల్ల కొక్కర్లు తెప్పం మీద వస్తాయట. ఆది నిజిమో తవిళో తెలియాలంటే తెల్ల కొక్కర్ల తెప్పం చదవాల్సిందే.

—–
తెల్లకొక్కర్ల తెప్పం
హోసూరు కతలు

డా. ఎన్. వసంత్
2010
కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం
2-1095, ఆవులపల్లి రోడ్డు, బస్తి
హోసూరు 635 109
కృష్ణగిరి జిల్లా, తమిళనాడు.
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో లభిస్తుంది.
95 పేజీలు// 60 రూ.

You Might Also Like

10 Comments

  1. Anil అట్లూరి

    ఎలనీరు = లేత కొబ్బరికాయ నీరు. కొంజెం ఎలనీరు సాపడ్ అన్న తమిళుల వాడుక తెలుసు.

  2. Rao Pamganamamula

    పుస్తక పరిచయము చాలా బాగుంది. మబ్బు తెప్ప ?

  3. సురేశ్ కొలిచాల

    జంపాలగారు: రచయిత చెప్పకపోయినా, పూర్వాశ్రమంలో వారి ఊరు పేరుకు తెల్లకొక్కర్లకు సంబంధం ఉండిఉంటుందని నా అభిప్రాయం. పుస్తకం పూర్తిగా చదవకుండా ఈ అభిప్రాయాన్ని బలమైన ప్రతిపాదనగా వాదించడం సబబు కాదు.

    అయితే, మా జవాబులకు ప్రతిగా తెల్లకొక్కర్ల తెప్పం, ఎర్నూగు పూలు పుస్తకాల కాపీలు నాకూ మోహనరావు గారికి అందజేయగలిగితే అవకాశం ఏమైనా ఉందా? :-).

  4. Jampala Chowdary

    కృష్ణరసంవారే ఇంకో పుస్తకం – హోసూరు ప్రాంతంనుంచి వివిధ రచయితల కథాసంకలనం
    ‘ఎర్నూగు పూలు’ – కూడా ప్రచురించారు.

  5. సురేశ్ కొలిచాల

    హోసూరు మాండలికంలో కథలు రాయాలన్న ఆలోచన చాలా మంచి సంకల్పం. ఈ ప్రయత్నానికి పురికొల్పి, ప్రోత్సహించిన స.వెం.రమేశ్ గారికి, ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన జంపాల గారికి అభివందనాలు.

    అయితే, ఈ పుస్తకం పేరు గురించి చెబుతూ “మా ఊరి శెరువు నిండి మరువ బారినబుడు శెరువులా తెల్ల కొక్కర్లు తెప్పం మీద వస్తాయట” అంటూ రచయిత ఇచ్చిన వివరణలో కొంత నిజంతో పాటు కొంత folk-etymology ఉందని అనిపిస్తుంది. చాలా ఊళ్ళ వ్యుత్పత్తి విషయంలో అవసరం లేని కట్టుకథలు కల్పించి చెప్పడం సాధారణమైన విషయమే.

    ఈ ఊరి పేరు విషయంలో నా అభిప్రాయం ఇది: ద్రావిడభాషలలో కొక్కెర- అంటే కొంగ. దీని మూల ధాతువు *కురు/కొరుంక-. తుళు భాషలో దీన్ని కొరుంగ అంటారు. తమిళంలో కొక్కు, కురుక్కు అని, కన్నడలో కొక్కరె అని అంటారు. తెల్ల కొక్కర అంటే Egret.

    “తెల్ల కొక్కర్లు తెప్పం మీద వస్తాయట” అంటూ రచయిత ఇచ్చిన వివరణలో folk-etymology కనిపిస్తుంది. తెప్పం అంటే తెప్ప (raft) అన్న అర్థమే కాకుండా దిబ్బ (high land) అన్న అర్థం కూడా ఉంది. నిజానికి దిబ్బ, తిప్ప, తెప్ప ఒకే ధాతువుకు చెందిన సోదర (cognate) పదాలు. దిబ్బ/తిప్ప/తెప్ప అన్న పదాంశం ఉన్న ఊరి పేర్లు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఎన్నో ఉన్నాయి. నల్గొండ జిల్లాలో తెప్పలమడుగు, శ్రీకాకుళం జిల్లాలో తెప్పలవలస, తూగో జిల్లాలో చవిటిదిబ్బలు కొన్ని ఉదాహరణలు.

    కడప జిల్లాలో కొక్కరాయపల్లె అన్న ఊరు, కర్నూలు జిల్లాలో కొక్కరచేడు అన్న ఊళ్ళు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో కొంగర అన్న ఊరు ఉంది (ప్రముఖ సినిమా నటుడు జగ్గయ్య ఇంటిపేరు కూడా కొంగర కదూ!). ఇవన్నీ కాక మైసూరు దగ్గర కొక్కరె బెళ్ళూరు అన్న ఊరు ఉంది. బెళ- అంటే తెల్లని; కొక్కరె బెళ్ళూరు అంటే తెల్ల కొక్కర్ల ఊరు అనే అర్థం చేసుకోవాలి. కాబట్టి హొసూరులో ఉన్న తెలుగువారు ‘తెల్లకొక్కర్ల దిబ్బ’ అన్న అర్థం ఉన్న ఊళ్ళో (కొక్కరె బెళ్ళూరుగానీ మరో ఊరుగానీ) నివసించేవారని మనం ఊహించవచ్చు.

    సురేశ్.

    1. Jampala Chowdary

      కృతజ్ఞతలు సురేశ్.
      ఈ పరిచయం వ్రాస్తున్నప్పుడే ఈ మాటల గురించి మీరో, జె.కె.మోహనరావుగారో వివరిస్తారని ఆశపడ్డాను.
      తెల్లకొక్కర్ల తెప్పం ఒక కత పేరు; ఊరి పేరు కాదు (రచయిత “మా వూరు” గురించి చాలా చెప్పారుకాని, ఊరు పేరు ఎక్కడా చెప్పినట్లు లేదు). కథలో వచ్చే సంగతి. ఆ కతలో జరగప్ప చెప్పినట్టు కొన్ని సమాశారాలు నేరుగా సూసి అర్తము శేసుకుంటే ఆ ఆనందమే వేరు… తెప్పం మాటకు కత చివర ఇచ్చిన పట్టికలో తెప్ప అన్న అర్థమే ఇచ్చారుచ కథలోనూ ఆ అర్థమే సరిపోయింది.

  6. సురేశ్ కొలిచాల

    telugodu చెప్పిన దాంట్లో కొంత నిజం ఉంది. వాస్తవానికి హొసూరు ఉన్నది తమిళనాడులో అయినా అక్కడ ఎక్కువ మంది మాట్లాడేది కన్నడ భాషనే. హొస అంటే కన్నడ భాషలో కొత్త. హొసూరు అంటే కన్నడంలో “కొత్తూరు.” అదే తమిళ భాషలో అయితే పుత్తూరు (పుదు ‘కొత్త’ + ఊరు) అయ్యుండేది.

    అయితే, జంపాలగారు చెప్పినట్టుగా శురువు చేయటం, సుదారించు అన్నవి హిందీ/ఉర్దూ నుండి అరువు తెచ్చుకున్న పదాలే.

    సుదారించు: ఈ పదం హిందీ/ఉర్దూ పదమైన सुदरना/سدرنا/sudarnā నుండి వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ పదానికి మూలం సంస్కృతపదమైన సు+ధరణ- నుండి వచ్చిందని John Shakespear ఊహ.

    శురువు చేయటం: ఇది కచ్చితంగా అరబ్బీ భాషకు చెందిన షురూహ్ అన్న పదానికి చెందిందే (روع shurūﻌ).

    ఇక కన్నడ ప్రభావం ఉన్న పదాలు చూస్తే కామునిబిల్లు, బాపునితొణె వంటి పదాలు నిస్సందేహంగా కన్నడ పదాలే.
    కామునిబిల్లు: మనం తెలుగులో హరివిల్లు అనీ, ఇంద్ర ధనుస్సు అని అన్నట్టుగానే rainbowని కన్నడంలో కామనబిల్లు ‘కాముని విల్లు’ అని అంటారు.

    బాపునితొణె: ఈ పదానికి బాపనులకు/బ్రాహ్మణులకు ఎటువంటి సంబంధం లేదు. తొండ (తొణ్డ) అన్న మూల ధాతువు కన్నడలో తొణ్ణ- గా మారుతుంది (పండు/పణ్డు ‘fruit’ > పణ్ణు > హణ్ణుగా మారినట్టు). వాపు- అన్న పదం కన్నడంలో బాపు- గా మారుతుంది (విల్లు > బిల్లు గా మారినట్టు). బాపుని తొణ్ణె అంటే ‘బలిసిన తొండ’ అని అర్థం.

    అయితే, మిగితా పదాలు కచ్చితంగా కన్నడ నుండి వచ్చిన పదాలేనని చెప్పలేం. మూలద్రావిడ భాషాపదాలు అన్ని ద్రావిడ భాషల సొత్తు. ఈ మధ్య ఎవరో ఒక పెద్దమనిషి “తెరువెవ్వరి వేడెద భూసురేంద్ర” అన్న మనుచరిత్ర లోని పద్యపాదం ఉటంకిస్తూ “పెద్దన తెరువు అన్న తమళ పదం వాడాడు, కాబట్టి పెద్దనకు తమిళం తెలుసు” అని నాతో వాదించాడు. “అయితే బ్రతుకు తెరువు అన్న పదం కూడా తమిళపదమేనా?” అని నేనడిగిన ప్రశ్నకు అవాక్కయ్యాడు. ఆయనకు ఆంధ్రభారతి నిఘంటువు నుండి తెరువుకు సంబంధించిన ఈ కింది మాటలు చూపించి తెరువు తెలుగుపదం కూడానని ఆయనతో చెప్పి ఒప్పించాను: కాలితెరువు, చుక్కలతెరువు, తెట్టతెరువు, తెరుపుమరుపు, తెరువరి, తెరువాగు, తెరువాటీడు, తెరువాటు, తెరువాటుకాడు, తెరువుకాడు, తెరువుగట్టు, తెరువుగాఁపరి, తెరువుపెట్టు, తెరువువచ్చు, తెరువువెట్టు, తెరువుసాఁగు, బ్రతుకుతెరువు, మింటితెరువరి, మినుకు తెరువరులు, వినుతెరువరి, వేలుపుతెరువు

    ఈ నేపథ్యంలో, ఎలనీరు, మీజు అన్న పదాలను పరిశీలిద్దాం:
    ఎలనీరు: ద్రావిడ భాషలన్నింటిలో ఎళ అంటే లేత అన్నదే అర్థం. వర్ణ వ్యత్యయం వల్ల తెలుగులో ఈ పదం లేఁత అని మారిపోయింది. అయినా కొన్ని ప్రాచీన పదబంధాలలో ఇది ఎల అన్న రూపంలోనే కనిపిస్తుంది. ఎలతేటి, ఎలనాగ ఇందుకు ఉదాహరణలు. ఎలనీరు అన్న పదానికి “లేఁత టెంకాయలోని తియ్యని నీరు” అన్న అర్థం బహుజనపల్లి శబ్దరత్నాకరములో కనిపిస్తుంది. కాబట్టి ఇది తెలుగు పదం కాదు అని చెప్పలేం.

    మీజు: ఇతర ద్రావిడ భాషలలో ఈ పదానికి సంబంధించిన సోదరపదాలను (cognate words) చూస్తే మనకు నీందు, ఈఁదు, ఈజు అన్న పదాలు కనబడుతాయి. నిజానికి కన్నడలో ఈజు, ఈసు, హీజు అన్న పదాలే తప్ప నీందు, మీందు, మీంజు అన్న పదాలు కనిపించవు. తమిళంలో నీందు ఉంది కానీ పదాదిలో ‘మ’ కారంతో పదాలు లేవు.

    అయితే, తెలుగులో ఈ పదాన్ని ఈఁదు అని మధ్యలో అరసున్నతో రాస్తారు. అంటే ఒకప్పుడు ఈ పదాన్ని ఈందు లేదా తమిళంలో లాగా నీందు అని పలికేవారన్న మాట. ప్రాచీన తెలుగులో కొన్ని ప్రాంతాలలో పదాది న- కారం లుప్తమై ఆపై అది మ- రూపాన్ని సంతరించుకోవడం కనిపిస్తుంది. ఉదాహరణకు నేము- (we) అన్న పదం ఏము-గా మారి కొన్నినాళ్ళకు ఆధునిక రూపమైన మేము-గా మారిందని శాసనాల ఆధారంతో మనం చెప్పవచ్చు.

    ఈ రకమైన మార్పుల వల్ల మూల ద్రావిడ *నీందు , ఆంధ్ర దేశంలో ఈఁదు గానూ, హొసూరు తెలుగులో మీందు గా మారి, ఆపై మీజు గానూ మారిందని చెప్పవచ్చునేమో (అయిందు > అంజుగా మారినట్టు).

    మిగిలిన పదాల గురించి మరింకెప్పుడైనా!

    సురేశ్.

  7. J K Mohana Rao

    జంసవారి = జంబూసవారి (మైసూరు దశరా), శురూ చేయడము = ప్రారంబించుట (కన్నడములో ఇలాటి ఉర్దూ హిందీ పదాలు దైనందిన జీవితములో వాడుతారు, ఇలాగే వాపసు = తిరిగి రావడము, రస్తా = రోడ్డు, ఇత్యాదులు), సుధారించు = సహించు, ఓర్చు (కన్నడము), ఎళనీరు = లేత నీరు (కొబ్బరి నీళ్లు), సాసువులు = ఆవాలు (కన్నడము), హొసూరు = కొత్త ఊరు

  8. telugodu

    all these words, “kamanabillu”, “eeju” “elanIru” “suru” “sudarinchu” are kannada words.

Leave a Reply