పేరుకి తగ్గ పుస్తకం – మిత్రవాక్యం

వ్యాసకర్త: శ్రీనివాస్ ఉరుపుటూరి
********
అనగనగా నా బడి రోజుల్లో చదివిన “చేత వెన్నముద్ద” అనే చిన్న పుస్తకంతో వాకాటి పాండురంగరావు గారి రచనలతో నాకు తొలి పరిచయం. షె గువెరా, పాబ్లో నెరూదా, అబ్రహాం లింకన్, లూయీ పాశ్చర్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ వంటి చిరస్మరణీయుల జీవిత పరిచయాలనూ, ప్లస్ సమకాలీన ప్రతిభామూర్తులపై రాసిన నివేదికల్లాంటి చిట్టిపొట్టి వ్యాసాలనూ, ఒకట్రెండు ఎలిజీలనూ ఒక్కచోట చేర్చిన ఆ పుస్తకం నిజంగా చేత వెన్నముద్దే – హాయిగా చదివించిందీ, ఇంకా చదవాలనే చవి కల్పించింది కూడా…

ఆ తరువాత ఐదారేళ్ళకి అదే రచయిత రాసిన ఇంకో పుస్తకం నా చేతికి దొరికింది – పేరు దిక్సూచి. భారతీయమైన ఆధ్యాత్మికతకూ, పాశ్చాత్యమైన వైజ్ఞానికతకూ నడుమ slender bridges నిర్మించడానికి ప్రయత్నం చేసిన ఆ పుస్తకం నాకు అరకొరగానే అర్థమయినా అది నన్నెంతో ఉత్తేజపరిచింది. అందులో చదివిన “ముహూర్తం జ్వలితం శ్రేయం, న తు ధూమాయితం చిరం” (ఎంతోకాలం పొగలాగా ఉండిపోవడం కన్నా క్షణకాలం పాటు వెలిగిపోవడం మేలు), “ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః” (అన్ని వైపుల నుంచి ఉదాత్తమైన ఆలోచనలు మాకు చేరు గాక) లాంటి మంచి మాటలను పదే పదే మననం చేసుకునే వాడిని.

ఆ ప్రభావం నుంచి నేను ఇంకా పూర్తిగా తేరుకోలేదు… తొలి తొంభైల్లో వాకాటి పాండురంగ రావు గారు ఆంధ్రప్రభ వారపత్రికకు సంపాదక స్థానంలోకి వచ్చేసారు. “వారం వారం సగటు పాఠకుడికి ఎన్నో చెప్పాలని పడ్డ ఆవేదనయే…” ఆయనతో “”శారీ బయింగ్” నుంచి “సచ్చిదానంద స్థితి” దాకా” సంపాదకీయాలను రాయించింది. తను రాసిన ఈ పేజీ/పేజీన్నర వ్యాసాలకు మిత్ర వాక్యం అని పేరు పెట్టుకున్నారాయన.

“అప్పటికప్పుడు జరిగిన సంఘటనలకు ప్రతిక్రియగా రాసినవే అయినా, ఆ సంఘటనా కాలం తరువాత కూడా వాటి ప్రాధాన్యత వుంది అనిపించిన వాటినే…” చేర్చిన సంకలనాన్ని ఇటీవలే మళ్ళీ చదవడం నా మటుకు ఓ ఆసక్తికరమైన అనుభవం.

ఎంచేతనంటే –

ఓ ఇరవయ్యేళ్ళ తరువాత – వ్యాసాలు అవే కానీ వాటిల్లో పరామర్శించబడ్డ ప్రపంచమూ మారింది, అప్పుడు వాటిని చదివి భేషు, భేషని తలూపిన పాఠకుడూ మారాడు కనుక.

“ఈ మారిన సందర్భంలో ఈ వ్యాసాలకు ప్రాసంగికత ఉన్నదా?” అన్న ప్రశ్నకి సమాధానం వెదుక్కుంటూ రాస్తున్న పరిచయం ఈ వ్యాసం.

***
“వివేకానందుడి ఆలోచనల బడి”లో చదువుకున్న వాకాటి వారిలో “భారతీయత” అనబడు హిందూ ధర్మ సంస్కృతుల పట్ల ఆదరభావం, సంస్కరణ దృక్పథం, సమన్వయ ధోరణీ కాస్త ఎక్కువే. సైన్సూ, మతమూ ఆధునిక మానవుడికి రెండు కళ్ళ లాంటివని, ఆ రెండింటి నుండీ అందరికి మేలు చేయగల అంశాలను ఎన్నుకొనగల విజ్ఞత కోసం ప్రయత్నించడం మన కర్తవ్యమని అంటారు.

“వినదగునెవ్వరు చెప్పిన” మార్కు ఓపెన్ మైండెడ్‌నెస్‌తో వాకాటి వారి ‘మిత్రవాక్యం‘ మనకు హింసకు మూలం ఎక్కడుందో చెప్పిన జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాన్ని, లక్ష్మణ యతీంద్రుల అధ్వర్యంలో లక్షన్నర విస్తళ్ళ విందు భోజనానికి వేదికగా నిలచిన పెదముత్తీవి గ్రామాన్ని, “ధ్యానం” గురించి సుందర చైతన్యానంద తీసిన డాక్యుమెంటరీ సినిమాను, “ఆధునికతలోని శ్రేయోదాయకమైన అంశాలను స్వీకరించి సమగ్ర జీవితానికి సిలబస్‌నిచ్చే మతం [నిజంగానే] ఉంది” అని తనకు ఆశ్వాసననిచ్చిన పుట్టపర్తిని, భగవద్గీత మీద ఓ సినిమా తీసేందుకు పన్నెండేళ్ళ పాటు మూడు వందల భగవద్గీతలను అధ్యయనం చేసిన “సినీ ఋషి” జి.వి.అయ్యర్‌ను, కామాలే గానీ ఫుల్ స్టాపులు లేకుండా ప్రవహిస్తున్న భారతీయ జన జీవన స్రవంతి పై మార్క్ టుల్లీ రాసిన పుస్తకాన్ని, స్వదేశీ సాంకేతికతా, స్థానిక వనరులతో చౌక ఇళ్ళు కట్టి చూపిన లారీ బేకర్‌ను పరిచయం చేస్తుంది.

***
పైన పేర్కొన్న వ్యాస సందర్భాలన్నీ మన ముందొక ఆదర్శాన్ని, ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తే – మిగతా వ్యాసాల్లో మూడో వంతు హోల్మొత్తమ్మీద మానవాళీ, ముఖ్యంగా మనము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తాయి. మచ్చుకి కొన్ని ప్రశ్నలు:

1. వరల్డ్ వాచ్ ఇన్‌స్టిట్యూట్ వారి వార్షిక నివేదిక భూగోళ ఆరోగ్యం గురించి ఏం చెప్పింది?
2. మానవ జాతి వర్తమానం, భవిష్యత్తు గురించి క్లబ్ ఆఫ్ రోమ్ ఏమని హెచ్చరిస్తున్నది?
3. ‘మహారాజశ్రీ అమెరికా” వారి నగరాల్లో ఏం జరుగుతోంది?
4. రష్యా పునర్నిర్మాణం గురించి సోల్జెత్సిన్ ఏమంటున్నారు?
5. పని ఒత్తిడి జపనీస్ యువతీ యువకుల మీద, కుటుంబాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది?
6. కార్పొరేటు పంచతారకాస్పత్రులలో లోపిస్తున్నదేమిటి?
7. జంక్ ఫుడ్డుకి విరుగుడేమిటి?
8. మన నట్టింట తిష్ఠ వేసిన అంటువ్యాధి ఏమిటి?

పని ఒత్తిడి గురించి రాసిన ‘జపాన్ కరోషి‘ అనే వ్యాసం చదివి కుతూహలం కొద్దీ గూగుల్ చేసి చూసాక, కంపెనీ లాయల్టీ పేరిట గొడ్డు చాకిరీని ప్రోత్సహించే కార్పొరేట్ మానేజర్లకు ఇలాంటి విషయాలు తెలుసునో లేదో అనే సందేహం కలిగింది. మానేజ్‌మెంట్ కళాశాలల్లో, బిజినెస్ స్కూళ్ళలో ఇలాంటివి చర్చిస్తారో…?
****

ఈ పుస్తకంలోని మరికొన్ని వ్యాసాలు ఇంకాస్త వ్యక్తిగతమైన అంతరువులో రచయిత ఫాఠకుడితో ముఖాముఖి మాట్లాడుతున్నట్లుంటాయి.

గది చిమ్మడం, పుస్తకాలను కొనుక్కోవడం, దగ్గరివారి పెళ్ళికి వెళ్ళి రావడం, విశ్రాంత జీవితం గడుపుతున్న స్నేహితుడి రెండవ బాల్యం… సందర్భం ఏదైనా – పాఠకుడి ఆలోచననో సంవేదననో ఉన్నతీకరించేందుకే వాడుకున్నారు వాకాటి వారు.

వాచవిగా కొన్ని ఉదాహరణలు ఈ క్రింద ఇస్తున్నాను.

ఓ నలభయ్యేళ్లనాడు రచయితకి ఓ స్నేహితుడుండే వాడట. ఆ అబ్బాయి చదువుకున్న ఉన్నత పాఠశాలలో వ్యాసరచన, వక్తృత్వం లాంటి పోటీల్లో విజేతలకు బహుమతిగా నచ్చిన పుస్తకాన్ని ఎన్నుకునేందుకు విజేతలను మద్రాసులోని పెద్ద పెద్ద పుస్తకాల అంగళ్ళకు తీసుకెళ్ళే వారట. “నేడు మావాడి ఇంట్లో ఒక అయిదారు వందల పుస్తకాలు తెలుగువీ, ఇంగ్లీషువీ ఉన్నాయి అంటే ఆనాటి వాడి బడి వెలిగించిన దీపమే అది!” అని చెప్పుకొస్తారు “చేతి చివర ఆకాశం” అనే పుస్తకంలో.

“ఉత్తరం రాయడానికి తీరిక ఉండదు కొందరికి! ఇలాంటివారు నెల రోజుల్లో చేయలేని వాటిని మరి కొందరు ఒక్కరోజులో చేయగల్గుతారు. రెండు తరహాల వారికీ అదే రోజే, అవే ఇరవైనాలుగు గంటలే! తేడా అల్లా రెండవ తరహా వారికి వారి కాలం విలువ తెలుసు, అంతే!” అంటారు, కుక్కుట స్పృహ అని పేరు పెట్టిన డిసెంబర్ చివరి వారపు సంపాదకీయంలో.

డిస్కవర్ పత్రికలో ఓ వ్యాసాన్ని చదివిన హుషారులో సెన్స్ ఆఫ్ వండర్ గురించి రాసిన ఈ మూడు వాక్యాలను చూడండి:

“నిజమైన అన్వేషణ ఏదైనా, తట్టిన కొద్దీ తలుపులు తెరచుకుంటాయి. తెరచిన ప్రతి వాకిలి దాటగానే ఇంకో పది మూసిన తలుపులు ఎదురవుతాయి. అలయక సొలయక ముందడుగు వేయడమే మన కర్తవ్యం.”

***
వైవిధ్యం, పఠనీయత, సదుద్దేశ్యం విషయాల్లో మంచి మార్కులు తెచ్చుకునే ఈ వ్యాసాల్లో నాకు బాగా నచ్చింది – వాకాటి వారి ఓపెన్ మైండెడ్‌నెస్. విలువలను ఏర్పర్చుకోవడం, వాటిని పాఠకుల ముందుంచడం అనే పనులను ఎంతో నిష్ఠగా, బాధ్యతగా చేసారనిపించింది. మనిషికీ మనిషికీ, మనిషికీ పర్యావరణానికీ ఉండాల్సిన సంబంధాల గురించి ఆలోచనను ప్రేరేపించడం ఈ వ్యాసాల ప్రధాన కాంట్రిబ్యూషన్.

మైనస్ పాయింట్ల గురించి చెప్పాల్సి వస్తే –

అక్కడక్కడ వాక్య నిర్మాణంలో హార్మొనీ లోపించినట్లనిపించింది. కొన్ని వ్యాసాలు మొదట్లో బావున్నా అతి సాధారణీకరణ, అత్యుదాత్తీకరణల వల్ల దెబ్బ తిన్నాయనిపించింది.

సెక్యులరిజం మీద రాసిన ఒకట్రెండు వ్యాసాలు నాకీసారి అంతగా నచ్చలేదు. Storming of the Bastille ఫ్రెంచి విప్లవానికి దారి తీసినట్లు  బాబరీ మసీదును కూల్చేసిన సంఘటన ఏ హిందూ పునరుజ్జీవనోద్యమానికో దారి తీస్తుందని వాకాటి వారనుకున్నారనుకుంటాను. తదనంతర పరిణామాలు ఆయన అభిప్రాయాలను మార్చి ఉండేవా? ఏమో…

***
ముక్తాయింపుగా వాకాటి వారి మరో మంచి మాట:

“కళ్ళు చూస్తాయి. నిజమే. కానీ మనసు ఏది చూడమంటే దానినే చూస్తాయి…మనం కావాలి అనుకున్న దానినే చూస్తాము మిగతాది చూపుకు గాని ఆమాటకొస్తే ఆలోచనకు గాని ఆనదు…ఈలోగా నా దృష్టికి ఆనిన అంశాన్ని నేను ‘ఏకైక సర్వకాలీన సత్యం’గా ప్రచారం చేస్తాను. నువ్వేమో నీకు దొరికిన సత్యాన్ని పరమార్థంగా రుద్దడానికి యత్నిస్తావు. మనిద్దరమూ గనక సత్యాన్వేషులమే అయితే ఒకరి నుంచి ఒకరు లాభం పొందవచ్చు. నా వెయ్యవ ముక్కా, నీ నూరవ అంశమూ కలిపి అసలైన దానికి మరింత చేరువవుతాము.”

ఆమెన్!

***
1994లో “వినూత్న ప్రచురణలు” మొదట అచ్చువేసిన ఈ అరవై వ్యాసాల సంకలనాన్ని, 2004లో వాకాటి ట్రస్టు వారు పునర్ముద్రించారు. ఇదిప్పుడు మార్కెట్‌లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నవోదయా బుక్‌షాపులోనో, విశాలాంధ్రలోనో ప్రయత్నించి చూడండి.

You Might Also Like

4 Comments

  1. మిత్రవాక్యం – 2 | పుస్తకం

    […] చదివిన మిత్రవాక్యం సంకలనంలో పై వాక్యాలతో ముగిసే చక్కని […]

  2. డా. మూర్తి రేమిళ్ళ

    ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు srinivas garu. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో చూడాలి. మీ దగ్గర ఉందా ?

    నేను కూడా ‘ చేత వెన్న ముద్ద ‘ చదివేను ఎప్పుడో. అప్పుడు దాన్ని కాపీ తీసుకోవాలి అన్న ధ్యాస లేదు. తర్వాత ఎంత వెతికినా దొరక లేదు (ఆ పుస్తకం మొదట్లో నేను చదివిన వాళ్ల దగ్గర్ కూడా) . ఇప్పుడు DLI లో, వేరే చోట్ల వెతికినా దొరక లేదు. మీ దగ్గర కానీ వేరే వారి దగ్గర కానీ కాపీ/సాఫ్ట్ కాపీ దొరికితే ధన్యుణ్ణి. తెలియ చెయ్యగలరు.

    1. Srinivas Vuruputuri

      మిత్రవాక్యం నాదగ్గర ఉందండీ! చేత వెన్న ముద్ద కూడా కొనుక్కున్నట్లు జ్ఞాపకం. ఒకసారి చూసి చెబుతాను.

      మిగతా వివరాలు ఈ-మెయిల్లో మాట్లాడుకుందాం.

  3. murali

    మంచి పుస్తకం నేను చదివాను .. ఆ పుస్తకానికి మీ పరిచయం బాగుంది

Leave a Reply