సౌందర్య దర్శనం
వ్రాసిన వారు: భైరవభట్ల కామేశ్వరరావు
*********
ఒక అరవిచ్చిన గులాబి, ఒక రాలిన పండుటాకు, పసిపాప బోసినవ్వు, అవ్వ ముఖంలో ముడతలు, ఇంధ్రధనుస్సు, శ్రామికుని చెమట బిందువు – అన్నిట్లోనూ అందం చూస్తాడు మనిషి. చూసి ఆనందిస్తాడు. ఆనందించి ఊరుకుంటాడా? అసలు సౌందర్యమంటే ఏమిటి? అది ఎక్కడుంది? దాన్ని దర్శించడం ఎలా? అది భౌతికమా మానసికమా? – అంటూ ప్రశ్నలు గుప్పిస్తాడు. వాటికి జవాబులు అన్వేషిస్తాడు. బహుశా మనిషి తన గురించి తాను తెలుసుకొనే ప్రయత్నంలో భాగమే యీ పరిశ్రమంతా. అది అంతులేని అన్వేషణ. అలాంటి ఒకానొక ప్రయత్నం యీ పుస్తకం.
ఋషులు, తత్త్వవేత్తలు, కవులు, కళాకారులు, విమర్శకులు, శాస్త్రవేత్తలు – అనేకులు అనేకరకాలుగా సౌందర్యాన్ని అన్వేషించారు, దర్శించారు. ఇందులో కవులది ఒక ప్రత్యేక స్థానం. వారు సౌందర్యాన్ని దర్శించేందుకు విపరీతంగా మథన పడటమే కాదు, అసమగ్రంగానైనా తాము దర్శించిన ఆ సౌందర్యాన్ని భాష ద్వారా వ్యక్తపరిచేందుకు తీవ్రప్రయత్నం చేస్తారు. తద్వారా అది యితరులు కూడా దర్శించే అవకాశం కల్పిస్తారు. అలా, కవిత్వాన్ని ఒక తపస్సుగా భావించి, ఆ తపోగ్నిలో కాగిపోయిన ఒకానొక కవిలో, అతను సృజించిన కవితలో, సౌందర్యాన్ని దర్శించే అన్వేషణ యీ పుస్తకం.
ఇలాంటి అన్వేషణకు రసజ్ఞత, శాస్త్రజ్ఞత అనేవి రెండు కళ్ళు. సౌందర్యాన్ని గ్రహించేందుకు రసజ్ఞత అవసరమైతే, ఆ గ్రహించిన సౌందర్యాన్ని వివేచించి నిగ్గు తేల్చేందుకు శాస్త్రజ్ఞత అవసరమవుతుంది. ఈ రెండూ యీ పుస్తక రచయితలో పుష్కలంగా కనిపిస్తాయి. తన ప్రియురాలి “అపాంగ రేఖా చలన్మందహాస వాహినీ తరంగాల”కు కవి గుండియ చలించడాన్ని గుర్తించాలంటే రసజ్ఞత అవసరం. ప్రియురాలి కడకంటి చూపులలో కదలాడే చిరునవ్వుల అలలు – ఇది వ్యక్త సౌందర్యం. కవి సౌందర్యానుభవం అక్కడే ఆగిపోతే అతని కవిత్వాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉండదు. అలాంటి వ్యక్త సౌందర్యం నుండి అవ్యక్తమూ అలౌకికమూ అయిన సౌందర్యానుభవం దాకా యీ కవి ప్రస్థానం సాగుతుంది.
ఒకసారి నాలోన నూహించి యేమియో
స్త్రీవోలె సిగ్గుపొందెదను నేను
ఒకసారి యెదపొంగి యూగించి కవివోలె
మృదుకంఠ మెత్తి పాడెదను నేను
ఒకసారి హృదయ మూరక బాధపడి కంటి
తుదలందు నీరు జార్చెదను నేను
ఒకసారి వీతహేతుకముగ సౌఖ్యమ్ము
విరిసిపడ్డట్లు నవ్వెదను నేనుఏ మహాభావమో వచ్చి హృదయ మావ
రించి నా సంధులను గదిలించివైచు
ఆ మహాభావ మరసెద నన్న కొలది
నా విలోచన పథమెల్ల నల్లనయ్యెఇది యతిలోకభావమొకొ యెంచగ లౌకికభావమో పదిం
బది హృదయాంబుజాతమును వ్రచ్చి బయల్పడజూచు లోననే
యొదిగి చరించజూచు మరియున్ దనువెల్ల వడంకిపోయి నా
హృదయ మనంత వేగమున నిట్టటు కొట్టుకొనం దొడంగెడున్
అనే కవి హృదయాన్ని పట్టుకొని మనముందుంచి, “సౌందర్యానుభవ సాక్షాత్కారమంటే ఇదే” అని చెప్పటానికి కూడా రసజ్ఞత అవసరం. తన కవితా ప్రస్థానంలో ఆ కవి పొందిన అనేక సౌందర్యానుభవాలనూ, ఆతని కవిత్వంలో దాగిన సౌందర్య తత్త్వాన్నీ వెలికితీసి మనకు పంచిపెడతారు పుస్తక రచయిత. ఇది ఒక పద్ధతిలో, ప్రణాళికతో చేసేందుకు ఆ రచయిత శాస్త్రజ్ఞత తోడ్పడింది.
పుస్తకం మొదటి అధ్యాయంలో తన విమర్శకు ఆధారమైన భారతీయ సౌందర్య దర్శన, పాశ్చాత్య కళాశాస్త్ర తత్త్వాలను స్థూలంగా పరిచయం చేస్తారు. ఆ తర్వాత అధ్యాయంలో, తాను అన్వేషిస్తున్న కవిని తనదైన దృష్టితో మనముందుంచుతారు. కవి వ్యక్తిత్వమూ, అతని కవిత్వ మార్గము, శిల్పదృష్టి, రస దర్శనమూ మొదలైనవి మనకీ అధ్యాయంలో తెలుస్తాయి. “అడవిలో పారే స్వచ్ఛమైన మహాఝరిణీ ప్రవాహవేగం”తో తన కవితామార్గాన్ని పోల్చుకుంటాడా కవి. అలాంటి కవి మార్గాన్ని కుంతకుని ఆధారంగా అంచనా వేస్తారీ రచయిత. కవిత్వంలో సుకుమారము, విచిత్రము, మధ్యమము అనే మూడు మార్గాలను సూచించాడు కుంతకుడు. వాటి లక్షణాలను వివరించి, యీ కవి కవిత విచిత్రమార్గానికి చెందినదని సోదాహరణంగా నిరూపిస్తారు.
మూడవ అధ్యాయంలో, కవి సాగించిన సౌందర్యాన్వేషణ మూడంచెలలో ఎలా సాగిందో అంచనా వేస్తారు. ఆ మూడు అంచెలు – సౌందర్య పిపాస, సౌందర్య జిజ్ఞాస, సౌందర్య మీమాంస. పిపాస అంటే ఆస్వాదించాలనే కోరిక. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలన్న కోరిక. పరిశోధించాలనే/అంచనా వెయ్యాలనే కోరిక మీమాంస. ఈ కవి కవిత్వమూ, దాని తత్త్వమూ అచ్చంగా భారతీయ సంప్రదాయానికి చెందినవి. కాబట్టి మూడు స్థాయిలలో జరిగిన యీ అన్వేషణను అర్థం చేసుకోవాలంటే మనకు భారతీయ తత్త్వశాస్త్రం లోతులు కొంతైనా తెలిసుండాలి. వాటిని పాఠకులకు పరిచయం చేస్తూ, యీ కవి కవిత్వానికి వాటిని అన్వయిస్తూ సాగుతుంది రచయిత విశ్లేషణ. భారతీయ ఆలంకారికుల దృష్టిలో, రసాన్ని ఆవిష్కరించే అలంకారమే సౌందర్యం. సౌందర్యానుభూతీ రసానుభవం ఒకటే. అదే అలౌకికమైన కావ్యానందం, అంటే కవిత్వం అందించే ఆనందం. కవిత్వం అందించే ఆనందాన్ని గురించి పాశ్చాత్య కవిత్వ తత్త్వవేత్తలు కూడా చెప్పారు. అయితే, కవిత్వంతో పొందే ఆనందాన్ని, పరమయోగులు సాధించే బ్రహ్మానందం పక్కన నిలబెట్టడం మన కళాతత్త్వజ్ఞుల ప్రత్యేకత. ఈ కవి సౌందర్యదర్శనాన్ని తెలుసుకోడానికి కీలకం ఇక్కడుంది. దీన్ని సరిగా అర్థం చేసుకోకపోతే యీ కవి అర్థంకాడు. ఈ పుస్తక రచయిత ఆ కీలకాన్ని పట్టుకొన్నారు. పట్టుకొని, దాని ద్వారా ఆ కవి సౌందర్యాన్వేషణలో చేసిన పరిశ్రమను, సాధించిన ఫలితాలనూ మనకు వివరించారు.
ఒక మహాయోగ సమాధిలో ఉన్న తనకి పట్టరాని సౌందర్య పిపాస తగిలి, సమాధి భగ్నమై తాను కవిగా అవతరించానని చెపుతాడా కవి. ఆ సౌందర్య పిపాసా స్వరూపమేమిటో తెలుసుకోవాలంటే యీ పుస్తకం చదవాలి. చదివితే, వాక్కుకి అతీతమైన పరబ్రహ్మను, మృదువైన వాక్కుల సౌకుమార్యంతో ఆ కవి ఎలా ఊహించాడో, జగత్తుకు అతీతమైన బ్రహ్మను యీ జగత్తులోనే ఎలా దర్శించేందుకు పూనుకున్నాడో మనకు బోధపడుతుంది. ఈశ్వరుణ్ణి ఆర్తితో పిలిచినా, ఒక గుడ్డి బిచ్చగాని అవస్థ చిత్రించినా, ప్రకృతి రామణీయకతను వర్ణించినా, ఒక మహాకావ్యంలో పాత్రలకు ఉజ్జ్వలత్వం కల్పించినా – అన్నిటా ఆ సౌందర్యపిపాస యీ కవి కవిత్వాన్ని ఎలా ప్రభావితం చేసిందో మనకు కొంత వరకూ అర్థమవుతుంది.
సౌందర్య జిజ్ఞాసను గురించి చెపుతూ పుస్తక రచయిత యిలా అంటారు:
“జాతికి సౌందర్యభిక్ష పెట్టే కవి ముందుగా సౌందర్యజ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా సౌందర్యానుభవాన్ని పొంది ఉండాలి. సమస్త ప్రకృతిలోనూ ఉండే సౌందర్యంతో పాటు హృదయంలో ఉండే సౌందర్యాన్ని కూడా దర్శించి అతడు తన జాతికి అందించగలగాలి. కావ్యంలోని కథ, పాత్రలు వంటివన్నీ ప్రమిద వంటివైతే ఆ ప్రమిదను ఆశ్రయించుకొని వెలిగే దీపం సౌందర్యం.”
అలాంటి సౌందర్య జ్ఞానం ఆ కవికుందా అంటే ఉందంటారు రచయిత. భారతీయ తాత్త్విక చింతనలో పరమేశ్వరుడే సౌందర్య నిధానం. సత్యం శివం సుందరం అనే త్రిపుటి అవిభాజ్యమైనదని, అదే భగవత్స్వరూపమని భారతీయ తత్త్వశాస్త్రం చెపుతుంది. ఈ కవి సౌందర్యజ్ఞానానికి యిదే పునాది అంటారు రచయిత. ఒక చోట కవి కృష్ణునితో, “ఓ వెన్నెల నవ్వుల వేణుగోపాలా! నాకు తెలిసిన సౌందర్యం నీనుండే నాకు సరఫరా అయింది. కిందటి జన్మలో నేను నీ వేణు ముగ్ధ నాదంలో ఒక బిందువును”, అంటాడు. దీన్ని వ్యాఖ్యానిస్తూ రచయిత యిలా అంటారు:
ప్రాణికోటి మనస్సులను పరవశింప జేయడం సౌందర్యానికి గల ప్రాథమిక లక్షణం. శ్రీకృష్ణుని వేణుగానంలో రహస్యమిదే. భగవంతుడైన శ్రీకృష్ణుడు తనలోని సౌందర్యాంశను మురళీగాన రూపంలో ప్రకటితం చేసి చరాచర ప్రకృతిని సమ్ముగ్ధం చేసాడు. అది సత్యమైన సౌందర్య సృష్టి. ఆ సత్యసౌందర్య ఆస్వాదనలో ప్రేరితుడైన మానవుడు ఆ సుందరగానంలో సంలీనం చెంది ఆ వేణుగాన ప్రవాహంలో ఒక బిందువుగా మారి ఆ చైతన్యం చేత సంక్రమించిన స్పురణతో సౌందర్యానికి పునస్సృష్టి చేస్తాడు. ఇది యీ కవి భావన.
కవి సౌందర్యజ్ఞానాన్ని మరికొంత లోతుగా పుస్తకంలో చర్చించారు రచయిత.
ఇక సౌందర్యమీమాంస విషయానికి వస్తే యిదంతా తాత్త్విక చింతన. సౌందర్యానికి పుట్టుక ఎక్కడ? ఉపాధి ఏది? వానిని గుర్తించడమెలా? దాని వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది? మొదలైన విషయాల గురించిన విచారమే సౌందర్యమీమాంస అంటారు రచయిత. ఈ రకమైన తత్త్వ విచారాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కవి ఎలా చేసాడో వివరిస్తారు. అది చాలా విపులమైన లోతైన చర్చ. సౌందర్యాన్ని గురించి అనేక ప్రశ్నల ప్రస్తావన, వాటి గూర్చిన విచారణ కనిపిస్తుంది. మీమాంసకులకు తప్ప మామూలు కవిత్వాభిమానులకు ఈ విభాగం పెద్దగా ఆసక్తి కలిగించకపోవచ్చు. ఈ భాగంలో రచయిత చర్చించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు:
విషయము, విషయి అనే రెండు అంశాలలో సౌందర్యం విషయమవుతుందా? విషయి అవుతుందా?
సౌందర్యం మనసులో ఉంటుందా? వస్తువులో ఉంటుందా?
నైతిక విలువలనీ, ధర్మాన్ని అతిక్రమించే సౌందర్యానికి ఉనికి ఉందా?
సత్యమూ, సౌందర్యం ఒకటేనా? భేదం ఏమిటి?
సౌందర్యం రూపగతమా? గుణగతమా? కేవల భావనాత్మకమా?
ఒక జానపదగీతం, ఒక ఉదాత్త భావగీతం, ఒక లఘు కావ్యం, ఒక మహాకావ్యం అందించే సౌందర్యం ఒకటేనా?
ఈ ప్రశ్నలకు జవాబులు కవి రచనలలో (నాటకాలు, కవితలు, కావ్యాలు, విమర్శలు మొదలైనవి) వెతుకుతారు రచయిత. మచ్చుకు ఒక్క ఉదాహరణ, కవి ఒక నాటకంలో పాత్రల చేత పలికించిన ఒక సంభాషణ యిది:
ఒక పాత్ర: “నీ వేమొ సౌందర్యపిపాసి వలె కనిపించెదవు కాని నీకు నిజమైన సౌందర్యజ్ఞానమే లేదు. మానిసి సౌందర్యము కన్నులలో, చేతులలో, మొగములో నుండదు. అతని యాత్మలో నుండును. పూవుల యందము దాని రెక్కలలో దాని యాకృతిలో దాని వాసనలో నుండదు. దాని సృష్టిలో నుండును. నీ వంటి మిథ్యా సౌందర్యవాదులు పై మెఱుపులు చూసి భ్రమసి పోదురు”
రెండవ పాత్ర: “సౌందర్యము నేత్రముల చేత తెలిసికొన దగినది. అందుచేత నీ వాదము తప్పు”
మొదటి పాత్ర: “కాదు కాదు. అది మనస్సు చేత తెలిసికొన దగినది. అందుచేత నా వాదమే మంచిది.”
రెండవ పాత్ర: “అయినచో నా మనస్సు నా కన్ను చూచిన దాని నొప్పుకొనుచున్నది.”
మొదటి పాత్ర: “అట్లు కాదు. నీ మనస్సు నీ కంటి కధీనమైపోయినది. మనస్సును వివేకవంతము చేసికొని కంటిని మనస్సు చెప్పినట్లు వినిపించుము”
సౌందర్య పిపాస, జిజ్ఞాస, మీమాంస అనే మూడంశాలే కాక మరిన్ని కోణాలలో కూడా యీ కవి కవిత్వతత్త్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేసారు రచయిత. అందులో భాగంగానే, కవిలో కనిపించే సౌందర్యానుభవం, ఉదాత్త సౌందర్యం, సౌందర్య ప్రయోజనం మొదలైన విషయాలెన్నో విశ్లేషించారు. వాటన్నిటినీ యిక్కడ ప్రస్తావించాలంటే సాధ్యం కాదు. ఈ కవి సౌందర్యదర్శనమంతా కనిపించే పద్యం అని రచయిత పేర్కొన్న పద్యం ఒక్కటీ ఇక్కడ ఉదాహరిస్తాను:
లివలివలాడు నుప్పుకడలిం బలె నైన హృషీకరాశిలో
దవశిఖ రేగగా దలచెదన్ దయతో నిది నీవు కుత్తుకన్
సవరన దాల్పకున్న యెడ స్వామి! తనూ దహనంబు గల్గునా
కవుదువొ కావొ తెల్పగదవయ్య సుధా హరణాభిలాషికిన్
ఈ పద్యాన్ని గురించి రచయిత యిలా వ్యాఖ్యానిస్తారు. కవి ఇంద్రియసమూహం ఉప్పుకడలి లాంటిది. అది స్థిరమైనది కాదు. చంచలమైనది (లివిలివలాడుతూ ఉంటుంది). ఇది ఒక వ్యక్తిలోనూ ఉంటుంది. బయట ప్రపంచంలోనూ ఉంటుంది. తన అంతరంగానికీ బయటి ప్రపంచానికీ మధ్య సమన్వయం సాధించే ప్రయత్నంలో దవశిఖి (దవాగ్ని) రేగింది. అది హాలాహలం లాంటిది. యథాతథంగా దానివల్ల కలిగేది హాని మాత్రమే. దానినుండి కవి రక్షించబడాలి అంటే సమన్వయం కుదరాలి. అలా కుదిరినప్పుడు కవికి తన అంతరంగమూ, చూట్టూ ఉన్న లోకమూ కూడా సుందరంగా కనిపిస్తాయి. అలాంటి సౌందర్య దర్శనం కోసమే కవి నిరంతర మథనం కొనసాగిస్తాడు. ఈ మథనం కొనసాగించే వారందరికీ అమృతకలశం అందదు, అంటే సౌందర్య దర్శనం కలగదు. మరి దాన్ని సాధించడం ఎలా? అంటే, లౌకిక వస్తువులోని అవాంచనీయ లక్షణాలన్నిటినీ గరళంగా తన కుత్తుకలో ఇముడ్చుకొని దాని నుండి ఒక అలౌకిక రమణీయత స్వయం సముద్భూతం కావడానికి పరమేశ్వరానుగ్రహం కావాలంటాడీ కవి. ఇతరులు దీనినే “ప్రతిభ” అంటారు. ఆ పరమేశ్వరానుగ్రహం లేకపోతే కవి ఆ నిరంతర మథనంలోనే భస్మమైపోతాడు. సృజన వ్యాపార లక్షణమిది. అందుకే, ఆ అపాయంనుండి తనను తాను రక్షించుకోవాలనే, భగవంతుడు తనను ప్రతిభా మహితుణ్ణి చేస్తాడో, చేయడో ముందుగానే చెప్పమని, ఒక మాట యిమ్మని నిలదీసి ప్రశ్నిస్తున్నాడు కవి. ఈ ప్రశ్నలోని అంతరార్థమేమిటి? ఒక సామాన్య లౌకిక వృత్తంనుండి దానికి దూరమైన సుందరోజ్జ్వల వృత్తాన్ని సృష్టించగల ప్రజ్ఞ తనకున్నదా? లేదా? అని ఆత్మశోధన చేసుకుంటున్నాడన్న మాట. ఇది యీ కవి సౌందర్య దర్శనంలోని విలక్షణత్వం. ఈ శోధ ముగిసిన తర్వాతనే కవి “కలదు నాలోన క్షీరసాగరము నేడు” అని ధీమాగా ఉంటాడు. ఆ క్షీరసాగర భారంతో, ఆ సౌందర్య దర్శనంతో “మ్రోయలేనింక లోకాల తీయదనము. ఆలపింతు నానంద తేజోంబు నిధుల” అంటూ ఆ సౌందర్య ప్రపంచాన్ని కవిత్వంగా ఆవిష్కరిస్తాడు.
ప్రతీ కవికీ యిలాంటి అంతర్మథనం తప్పదు. అందులోంచి కొంత గరళమూ పుడుతుంది, అమృతమూ లభిస్తుంది. గరళాన్ని విడిచిపెట్టి అమృతాన్ని స్వీకరించే వివేకం పాఠకులకుండాలి. మంచి విమర్శ, అలాంటి వివేకాన్ని పాఠకులకు కలిగిస్తుంది. నా దృష్టిలో, అలాంటి సద్విమర్శకు ఒక చక్కని ఉదాహరణ యీ పుస్తకం. కవిత్వం, ఆ మాటకొస్తే ఏ సాహిత్యమైనా, ఆహారం లాంటిది. మనసుకీ, హృదయానికీ మేత. మనం తినే ఆహారంలో తనకి అవసరమైనదాన్ని జీర్ణం చేసుకొని, అవసరం లేని భాగాన్ని శరీరం విసర్జిస్తుంది. సాహిత్యం విషయంలో కూడా అదే చెయ్యాలి. సద్విమర్శ అలాంటి జీర్ణశక్తిని పాఠకులకు అందిస్తుంది. దురదృష్టవశాత్తూ మన తెలుగు సాహిత్యంలో, అయితే అజీర్ణాన్నీ, లేకపోతే అరుచినీ పెంచే విమర్శే ఎక్కువగా ఉందని నాకనిపిస్తుంది. అలాంటి విమర్శే జనాన్ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది కూడా! ఈ సందర్భంలో హెగెల్ గతితార్కికత గుర్తుకొస్తుంది. మన సాహిత్యం “థీసిస్” “ఏంటీ థీసిస్” అనే దశలలోనే ఆగిపోయి, అక్కడే గిరికీలు కొడుతూ ఉండిపోయిందేమో అనిపిస్తుంది. “సింథసిస్” దశకి చేరితే తప్ప ఒక కొత్త ఆవృత్తి మొదలుకాదు. నూత్న సృజనకి ఆస్కారం ఉండదు. ఆ “సింథసిస్” దశకు చేరేందుకు ఇలాంటి పుస్తకాలు మరిన్ని అవసరమని నా అభిప్రాయం. ఇంతకీ చెప్పలేదు కదా – యీ పుస్తక రచయిత, 2012 సంవత్సరానికి అజోవిభోకందాళం ఫౌండేషన్ వారిచ్చే విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారం అందుకున్న శ్రీ ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తిగారు. పుస్తకం పేరు, “విశ్వనాథ సౌందర్య దర్శనము”.
*****
విశ్వనాథ సౌందర్య దర్శనము
యు.ఎ.నరసింహమూర్తి
వెల – రూ.175
ప్రచురణ – అజో-విభో-కందాళం ప్రచురణలు
ఇంటర్నెట్ ద్వారా పుస్తకం లభించే చోటు
Radhika
“లౌకిక వస్తువులోని అవాంచనీయ లక్షణాలన్నిటినీ గరళంగా తన కుత్తుకలో ఇముడ్చుకొని”-
ఈ విషయాన్ని విశ్వనాథ తన ‘సాహిత్య సురభి లో “అల్పునకు మ్రింగ జేదైన హాలాహలము
భంగి బొంగెడి కోపంబు మ్రింగికొనగ” అన్న పద్యాన్ని వివరిస్తూ వ్రాశారు.
“……. కవితా దృష్టితో చూసినచో (కవి) తనకు వచ్చిన ప్రతి యూహయు లోకము మీదికి విసరరాదు…….హాలాహలము వలె లోకము మీద పడినచో దహించెడి భావములుండును. వానిని సత్పురుషుడయిన కవి దిగమ్రింగవలయును.”
కొత్తపాళీ
కామేశ్వర్రావుగారూ, మళ్ళి తీరిగ్గా చదివాను. ఎంతో హాయిగా ఉంది. సృజన ప్రక్రియని గురించి మనసులో అడపాదడపా అస్పష్టంగా కదులుతూ ఉండే ఆలోచనలకి ఒక చక్కని ఆకృతి ఏర్పడింది మీ వ్యాసంతో. పుస్తకం చదవమని ప్రేరేపించేట్టుగా ఉన్నది పరిచయం. కొన్నాళ్ళుగా విశ్వనాథ సాహిత్యం మీద ఆసక్తి రేగుతున్నది. అంచేత తప్పక చదువుతాను. మీకు మరోసారి అభినందనలు.
సంపాదకులకి సూచన:
చివరిలో పుస్తకం పేరు రచయిత పేరు తప్పు పడినాయి
ఫౌండేషన్ పేరు తప్పు పడింది.
పుస్తకం దొరికే చోటుకి లంకె ఇద్దామనుకున్నారేమో .. లంకె ఏదీ లేదు.
సౌమ్య
ఆ చివర్లో ఉన్న పొరబాట్లన్నీ నావే. క్షమించండి. ఇప్పుడు సరిచేశాను.
కొత్తపాళీ
Beautiful, sir. ఇంకా తీరిగ్గా ఆస్వాదిస్తూ చదవాలి – వచ్చే వారాంతం, ధన్యవాదాలర్పించుకుంటూ.
kiran
తొలి చూపు లో విస్మయం
ఉచ్వాస లో నిశ్వాస లయం
ఒక్కో క్షణం పునః పునర్జీవనం
అమృత సాగరం సౌందర్యం