వెలుగు నీడలు -ముళ్ళపూడి కళ్ళకి కట్టించిన వెండితెర నవల

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్
************
ముళ్లపూడి వెంకటరమణకు తెలుగువచనం సహజాభరణం. తెలుగువచనానికీ అయన సహజాభరణమే. ఆయన వచన రచనా ప్రక్రియల్లో ప్రయత్నించనివేవీ లేవు (ఉండుంటే ఒకటో అరో అయ్యుంటాయ్). కథలు, గొలుసుకట్టుకథలు, నవలలు, పేరడీలు, జోక్సూ, సినిమాస్క్రిప్టులూ, జీవిత చరిత్రలూ (కథానాయకుని కథ అంటూ అక్కినేని నాగేశ్వరరావు జీవితచరిత్ర రాశారు), జోక్సూ, కార్ట్యూన్లు (కార్టూన్లు కావండోయ్), సినిమా సమీక్షలు, ప్రసంగాలు, ముందుమాటలు, అనువాదాలు ఇలా చాలా ఉన్నాయి. ఇందుకో కారణం కూడా ఉంది. ఆయన జీవితాంతం రచయితగానే బ్రతికారు. పైగా నచ్చినవి వ్రాసుకునే ఫ్రీలాన్సర్ గానే వ్రాశారు తప్ప ఒకరిదగ్గర ఉద్యోగం చేసి నచ్చనివి వ్రాయాల్సిన స్థితి జీవితంలో చాలా కొద్ది సమయంలో మాత్రమే కలిగింది. వ్రాయడం ఆయనకి అవసరమే కాక ఇష్టం కూడాను. ఇష్టమే కాదు అవసరం కూడా. అందుకే కాబోలు ఆయన రచనల్లో ఎన్ని ప్రక్రియలు చేపట్టినా ఆ ప్రక్రియే మురిసేలా వ్రాశారు.

వెండితెర నవల ఓ విచిత్రమైన ప్రక్రియ. నవల లక్షణాలూ, సినిమా లక్షణాలకూ చక్కటి సమన్వయం సాధిస్తూ వ్రాయాల్సిన కత్తిమీదసాము. దృశ్య మాధ్యమమైన సినిమా ప్రేక్షకునితో చేసే సంభాషణను పాఠకునికి అందించాలి. పాత్రల ప్రవర్తననూ, సంభాషణనూ మాత్రమే కాదు ఆయా ప్రవర్తనకూ, సంభాషణకూ నటుల నటన వల్ల ప్రేక్షకునికి అందే ధ్వని కూడా పాఠకునికి చెప్పాలి. కొందరు మేటినటుల అభినయం, ఒక్కో షాటు మాట్లాడే మౌనాన్నీ చూసి మాత్రమే తెలుసుకోగలం. వాటిని వాక్యాలుగా మలచి ప్రేక్షకుని అంతరంగమనే వెండితెరపై వందరోజులాడించాలి. అదేమంత తేలిక కాదు మరి.

అంత క్లిష్టమైన ప్రక్రియని రమణనే సవ్యసాచి చక్కగా వ్రాశేసారనే చెప్పాలి. ఆయన ఆ ప్రక్రియలో ఇద్దరు మిత్రులు, భార్యా భర్తలు, వెలుగు నీడలు సినిమాల్ని నవలలుగా మలిచారు. ఇద్దరు మిత్రులు, వెలుగు నీడలు సినిమాలకు తానే సంభాషణలు వ్రాశారు. (మూడూ తన అభిమాన నటుడు, ఆప్తమిత్రుడూ అక్కినేని నాగేశ్వరరావువే.) వెలుగు నీడలు తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సిలబెట్టుకోగల సినిమా.

రాబోయే పేరా స్పాయిలర్. మీరు సినిమా ఇప్పటివరకూ చూడకుంటే ఈ పేరా వదిలి చదువుకోగలరు.
రాజసేవ అనే బ్రిటీష్ కాలంనాటిదీ, ఆ కాలంనాటి బూజుపట్టిన భావాలదీ ఓ పత్రిక నడుపుతూంటారు రావుబహద్దూరు వెంకట్రామయ్య. బిడ్డలు కలుగగానే ఆయన భార్య కనకదుర్గమ్మ పెంపుడు కూతుర్ని నిరాదరిస్తుంది. దాంతో ఆ పాపను ఆర్థికంగా సాయం చేస్తూ గుమాస్తా వెంగళప్పకిచ్చి పెంచమంటే ఆమె సావిత్రంతటిదై వైద్యవిద్య చదువుతూంటూంది. ఆమె క్లాసులోనే చదువుతూండే నాగేశ్వరరావులాంటి చంద్రం సుగుణను ఆకర్షిస్తాడు. లండన్ లో ఉన్నత విద్యను పూర్తిచేసి డాక్టరుగా ప్రాక్టీసు చేయడానికి భారతదేశం వచ్చిన డా.రఘు తన మేనల్లుడికి ట్యూషన్ మాస్టరుగా ఉన్న సుగుణను ఇష్టపడతాడు. ఈ నేపథ్యంలో చంద్రానికి క్షయరోగం సోకడంతో సుగుణ రఘును పెళ్లిచేసుకోవడానికి ఒప్పిస్తాడు. పెళ్లయ్యాక చంద్రం ఆశయాలమేరకు దంపతులిద్దరూ సేవలా వైద్యం చేస్తూ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటూంటారు. రఘు వైద్యం చేయించగా క్షయ నయమై చంద్రం తిరిగివస్తాడు. అతనికోసం బయలుదేరిన రఘు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతాడు. ఆ బాధలో మునిగిపోతున్న చంద్రం వెంకట్రామయ్య దంపతుల కూతురు వరాన్ని పెళ్లిచేసుకునేలా ఒప్పిస్తుంది సుగుణ. ప్రెస్ ని సుగుణ డబ్బుతో అభివృద్ధిచేసి కొత్త పత్రిక తెచ్చి లాభాల బాట పట్టిస్తాడు చంద్రం. కనకదుర్గమ్మ వరానికి దుర్బోధ చేసి పవిత్రమైన చంద్రం-సుగుణల అనుబంధాన్ని అనుమానించేలా చేస్తుంది. చంద్రం ప్రెస్ వర్కర్లకు బోనస్ ప్రకటించినప్పుడు ఇంట్లో రేగిన గొడవను చినికిచినికి గాలివానగా మారుస్తుంది కనకదుర్గమ్మ. ఆ తర్వాత ఆ వర్కర్స్-ఓనర్ గొడవ ఏమైంది? ఆ కాపురం ఎలా నిలిచింది? అన్నదే ముగింపు.

ఈ ఇతివృత్తంలో ప్రత్యేకత అంతా పొరలుపొరలుగా ఎన్నో సమస్యలను ముడిపెట్టడంలోనే ఉంది. సుగుణ-చంద్రంల ప్రేమ, వెంకట్రామయ్య కుటుంబం, రఘు-సుగుణల సంసారం, ఆపై చంద్రం-వరలక్ష్మిల పెళ్ళి గొడవ వంటి వేర్వేరు కథల్ని ఒకటిగా పేనడమే కాక వెంకట్రామయ్య పాత్రని బ్రిటీష్ బానిసత్వానికి ప్రతీకగా, చంద్రం పాత్రను అభ్యుదయ సేవాశీలానికి ప్రతీకగా నిలిపి వాటి మధ్య కూడా ఓ సంఘర్షణను తీసుకువచ్చారు. రాజసేవ పత్రిక, రావుబహద్దూరు బిరుదునూ వెంకట్రామయ్య బ్రిటీష్ దాస్యానికి చిహ్నాలుగా చూపించగా, అభ్యుదయ కవితలు (ప్రేయసితో షికారుకు వెళ్లి కూడా శ్రమజీవుల పాటలకు పరవశించి వారి అభ్యుదయం కాంక్షిస్తాడు), సుగుణ-రఘులను వైద్యసేవకు పురిగొల్పడం చంద్రం అభ్యుదయ భావాలకు చిహ్నాలుగా చూపారు. సుగుణ-కనకదుర్గమ్మలకీ ఇలాంటిదే మరో భావజాల ఘర్షణ ఉంటుంది అంతర్లీనంగా. ఇటువంటివి కథకు సాహిత్యపరంగా విలువనిచ్చాయి.

ఇక వెండితెరనవల రచించిన పద్ధతి కూడా విలక్షణంగానే అమరింది. దృశ్యాలనూ వాటివెనుక లోతులనూ వివరించేప్పుడు సంఘటనను వ్యాఖ్యానించే గ్యాప్ లో దొరికిన అవకాశాన్ని ముళ్లపూడి సద్వినియోగం చేసుకున్నారు. ఎన్నో కొటేషన్ల లాంటి పరిశీలనలు పరిచారు. అవసరానికి తగ్గట్టుగా హావభావాలు (అన్ని హావభావాలు వ్రాసేసి బోరుకొట్టరు. చాలా ముఖ్యమైనవీ ఆ నటుడు సహజంగా చేయనివి మాత్రమే వ్రాశారు), వర్ణనలు, మనోభావాలు కూడా అవసరానికి తగ్గట్టుగా వ్రాశారు. అవన్నీ కూడా తన సహజ రమణీయ శైలిలో వ్రాశారు. మచ్చుకు కొన్ని చూడండి మిగిలినవి పుస్తకంలో చదువుకోవచ్చు-

(సుగుణ) జీవితం హాయిగా జీవన సూత్రం మీదుగా; రఘు తన బుగ్గ మీద వేసే చిటికెల్లా తేలిపోతున్నాయి; మేనల్లుడులా నిశ్చింతగా ఆడుకుంటూన్నాయ్; ఆడపడుచు మాటలలా నిండుగా ఉంటున్నాయి; కాపరానికొచ్చి ఇన్నేళ్ళయినా ఎప్పుడూ, నిన్న వచ్చిన పెళ్లికూతురిలా బుజ్జగిస్తాడు రఘు. పెళ్ళాడమని అడగబోతున్న ప్రియురాలినిలా మన్నన చేస్తాడు.(ఇదంతా స్క్రిప్టులో ఉండదు. కాని కథలో భాగమే) కాఫీ తను తెస్తే “అరెరె. నువ్వు తెచ్చావా? నౌకర్లున్నారుగా” అంటాడు. (అంటూ కథలోని సంభాషణల్లోకి సాఫీగా సాగిపోతారు రచయిత).

కన్నీటి తెరలలోంచి మసకగా కనిపిస్తోంది-అచేతనమైన సుగుణ విగ్రహం. అఖండ జలపాతం నెత్తిన పడుతూంటే, కదలక నిలబడ్డ పాలరాతి బొమ్మలా కనిపిస్తోంది సుగుణ. ఇద్దరి కన్నీరూ ఏకమై, వరద గోదావరిలా సుళ్ళు తిరుగుతూ హోరుమని ప్రవహిస్తోంది ఏ దుఃఖసముద్రంలోకో…”సుగుణా” అన్నాడు చంద్రం నెమ్మదిగా (ఇదే రచయితలోని గొప్పదనం నెమ్మదిగా అన్నమాటలోనే మనకు నాగేశ్వరరావు ఎంత ఆర్ధ్రంగా అంటాడో వినిపిస్తుంది).

కారు షికారు హుషారుగా సాగిపోతోంది. కనకదుర్గమ్మగారి మొహం కూడా, ఐదు నిమిషాలకోసారి కళకళలాడిపోతోంది. మిగతా నాలుగుమ్ముప్పావు నిమిషాలూ, మూతీ ముక్కూ విరుచుకుని, ముందుసీట్లో దుష్టులకేసి చూడటంతో, కాలక్షేపం అయిపోతోంది. ప్రకృతి శాయశక్తులా ప్రేక్షకులకు కన్నులవిందు చేస్తోంది. గాలి హాయిహాయనిపిస్తోంది. పచ్చని ప్రశాంతతకూ రూపకల్పన అన్నట్టుగా చెట్లు నెమ్మదిగా తలలూపుతున్నచోట ఈ “కారు” ఆగింది. (కారు షికారు సమయంలో వచ్చిన అవకాశాన్ని వృథా పోనివ్వకుండా చక్కగా పాత్రపోషణ చేసిన వైనం చూశారుగా)

కాని ఇలాంటి ప్రత్యేకమైన వ్యాఖ్యలూ, వర్ణనలూ, పూరణలూ ఎంత నచ్చాయో, ఆ వాక్యాలు ఇటాలిక్స్ లో ఇవ్వడం నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే-పక్కనే ఓ పెద్దాయన కూచుని భోజనంలో ఏ పదార్థం బావుంటుందో చూపిస్తూ అవి తినమని బలవంతం చేస్తున్నట్టుగా అనిపించింది. “నీకు తెలీదురా అబ్బాయ్! ఆ స్వీటు బావుంటుంది. తిని చూడు. ఈ హాటు వేసుకోకపోతే ఏం భోజనంరా?” అని చెప్పినట్టుగా అనిపించింది. పైగా అలాంటి వాక్యాల ప్రత్యేకతను గురించి చెప్తూ వాటిని ఇటాలిక్సులో ప్రచురించామని ముందుమాటలో ప్రచురణకర్త చెప్పారు. ఇక వారి ఉద్దేశం మరింత స్పష్టం. మేం తెలియజెప్పకపోతే ముళ్లపూడి రచనాసాగరగర్భంలోని మణులూ మాణిక్యాలూ మీకు ఆనవు అన్నట్టేగా. అప్పుతచ్చులూ బాగానే పడ్డాయి నా పంటికింద (పై వాక్యాలు వ్రాస్తూంటేనే వాక్యానికి ఒకటి చొప్పున వచ్చయి ఆ అప్పుతచ్చులు. పరిస్థితి ఇదీ అని సూచించడానికి అలా తప్పులుగానే కొట్టేద్దామా అనుకుని తమాయించుకున్నాను.)

మళ్లీ రచనలోకి తిరిగివస్తే సావిత్రి సాత్వికాభినయాన్నీ, ఎస్వీఆర్ లేని గొప్పల్నీ, డాంబికాల్నీ, రేలంగి చమత్కృతిని, నాగేశ్వరరావు, జగ్గయ్యల పాత్రోచిత నటననీ, సూర్యకాంతం గయ్యాళీతనాన్ని ముళ్లపూడి అక్షరాల్లోకి దించిన తీరు వివరించలేం. అక్షరాల్లో చేసినంత చేసి అక్షరాల్లో లొంగని కొన్ని భావప్రకటనలు మాత్రం బాపుబొమ్మల్లో వేయించి చూపించారు. వివిధ అభినయాల్లో నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య, రేలంగి తదితరుల నటన బొమ్మకట్టే బొమ్మలు
వేయించి సంబంధిత పేరాల్లో వేయించారు. దీన్ని బట్టి వారి నటనంతా ఊహించుకోండి అన్నట్టుగా. అక్కడక్కడా కొన్ని సినిమాస్టిల్స్ కూడా వేశారు. ఇన్ని చేశారు కాబట్టే మంచి సినిమా చూసిన అనుభూతి దక్కింది నాకు.

చివర్లో సినిమా గురించిన వివరాలు కూడా ఇచ్చారు.

వెలుగునీడలు(వెండితెర నవల)
రచన: ముళ్లపూడి వెంకటరమణ
సంచాలకత్వం: ఎం.బి.ఎస్.ప్రసాద్
ప్రచురణ: హాసం ప్రచురణల సంస్థ
ప్రచురణకర్త: వరప్రసాద్ రెడ్డి
బొమ్మలు: బాపు
వెల: రూ.40
పేజీలు: 94
సోల్ డిస్ట్రిబ్యూటర్లు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

You Might Also Like

Leave a Reply