రచయితలకు రచయిత

(డాక్టర్ ఎన్. గోపి రాసిన ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక “వివిధ” పేజీల్లో సెప్టెంబర్ 3, 2012న ప్రచురితమైంది. ఈ విషయం ఇక్కడ ప్రచురించడం ఏదైనా కాపీరైట్ ఉల్లంఘన అయిన పక్షంలో editor@pustakam.net కు ఈమెయిల్ పంపడం ద్వారా కానీ, ఇక్కడ వ్యాఖ్య రాయడం ద్వారా కానీ వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము. వ్యాసాన్ని టైప్ చేసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్)
**********
కథారచయిత సి.రామచంద్రరావు పేరు చాలామంది విని ఉండరు. ఆయన గత యాభై ఏళ్లలో పట్టుమని పది కథలు మాత్రమే రాశారని అయితే అవి పది కాలాలపాటు నిలిచే అద్భుతమైన అనర్ఘ రత్నాలని కూడా ఈ తరం వారికి తెలియదు.

అంతెందుకు ఈ వ్యాసం రాయడానికి ముందు దాకా ఈయన గురించి నాకేమీ తెలియదు. సీనియర్ కథా రచయితా నా చిరకాల మిత్రుడు వి.రాజారామమోహనరావు ఈయన కథల గురించి అప్పుడప్పుడు గొప్పగా చెప్తుంటే ఎప్పుడైనా చదవాలనుకునేవాణ్ణి మూడు నెలల క్రితం అనుకుంటాను, “నవ్య”లో “కంపెనీ లీజ్” అనే కథ చదివి ముగ్ధుణ్ణైపోయి ఆయనకు ఫోన్ చేసాను. ఆ కథ గురించి నా అభిప్రాయం విని ఆయన సంతోషించారు. ఆ సంతోషానికి గుర్తుగా మా ఇంటికి స్వయంగా వచ్చి “వేలుపిళ్ళై” అనే తన కథల సంపుటిని ఇచ్చివెళ్లారు. అప్పటి నుంచి ఒక్కొక్క కథే చదవడం ప్రారంభించాను. ఆ సంపుటిలో 9 కథలున్నాయి. “సామికుంబుడు” అనే కథ విడిగా ఇచ్చారు. తలచుకుంటే కథలను (121 పుటలు) ఒక్కరోజులో చదివెయ్యొచ్చు. కాని అవి అలాంటి కథలు కావు. నిజంగానే గొప్ప కథలు. కథల్లోకి వెళ్ళేముందు రచయిత గురించి కొంత తెలియడం అవసరం. సి.రామచంద్రరావు తమిళనాడులో చాలాకాలం టీ-ఎస్టేట్స్లో ఉన్నతాధికారిగా పనిచేశారు. ఈ కథలు యాభై అరవై ఏళ్ళ క్రితం రాసినవి. బ్రిటీష్ వారి కాలంలో తెల్లదొరల మధ్య నల్లదొరలా జీవించిన అనుభవంతో రాసినవి. టెన్నిస్ చాంపియన్ కూడా. ప్రస్తుతం గోల్ఫ్ ఆడుతున్నట్టున్నారు. వయస్సు ఎనభై దాటింది. టెంగ్లీష్ లాంటి విలక్షణమైన తెలుగు మాట్లాడతారు. ప్రవర్తనలో అరిస్టోక్రాటిక్ పరిమళం. పర్ఫెక్ట్ జెంటిల్మెన్.

ఈ కథల సంపుటి మొదటిసారి 1964లో అచ్చయింది. ఆ తర్వాత విశాలాంధ్ర వారు 1991, 2011లలో పునర్ముద్రణ చేశారు. కథలు వివిధ పత్రికల్లో విడిగా అనేకసార్లు పునర్ముద్రణ పొందాయి. బహుమతులు పొందాయి. వాటి ప్రాచుర్యానికి అదో గుర్తు. ఈ సంపుటిలోని కథల్లో వేలుపిళ్ళై, నల్లతోలు, ఏనుగుల రాయి, గాళిదేవరు, ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ, క్లబ్ నైట్స్, సామికుంబుడు అనే ఏడు కథలు టీ తోట జీవిత నేపథ్యంలో పుట్టినవి. టెన్నిస్ టోర్నమెంట్, ఉద్యోగం, కంపెనీ లీజ్ అనే మూడు కథలు వైవిధ్య సంభరితాలు. “సామికుంబుడు” ఇటీవలి కథ.

వీటిలో “వేలుపిళ్ళై” శిరోరత్నం లాంటి కథ. వినండి. వేలుపిళ్ళై ఒక టీ ఎస్టేట్ బజార్లో కిరాణా కొట్టు యజమాని. అక్కడ మరో మూడు కొట్లున్నాయి. అతని భార్య పవనాళ్ అనుకూలవతి కాదు. బాగా సంపాదించాడు. కాబట్టి అతనికో వినాయకుని గుడి కట్టాలనే కోరిక కలిగింది. డబ్బు పిచ్చి గల భార్య ఒప్పుకోదు. వినాయకుడి ప్రతిష్ట, శాంతీ చెయ్యాలంటే చాలా డబ్బు కావాలి. ఎవరో ఉపాయం చెప్పారు. ఇదివరకే ప్రతిష్టించిన విగ్రహం అయితే శాంతి అక్కర్లేదని. ఒక ధైర్యం చేసి కొన్మత్తూరు శివాలయంలో బయట ఒట్టిగా పడి ఉన్న విగ్రహాన్ని ఎత్తుకురావాలనుకుంటాడు. నలుగురి మంచి కోసం చేసేది దోషం కాదని అతని భావన. అలా విగ్రహాన్ని ఎత్తుకోచ్చే గొడవలో పారిపోతూ ఓ గుడిసెలో దూరతాడు. అక్కడ సెందామరై అనే ఆడమనిషి తటస్థిస్తుంది. అంతే! ఆమెను తెచ్చిపెట్టుకుంటాడు. సహజంగానే భార్య గొడవ చేస్తుంది. పుట్టింటికి వెళ్తూ వస్తూ కొన్నాళ్ళకు తెగతెంపులైపోతుంది. ఇక సెందామరై సాంగత్యంలో వేలుపిళ్లై దశ తిరుగుతుంది. ఆనందం అతని సొత్తు అవుతుంది.అయతే ఆమె మరణించడం వల్ల తట్టుకోలేక పిచ్చివాడవుతాడు వేలుపిళ్ళై. తిండీ తిప్పలు లేకుండా వినాయకుడి గుడిదగ్గరే పడి ఉంటాడు. మిత్రులు అతన్ని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఆమెపట్ల అతని మనస్సు విరవడానికి ఆమె నడవడి మంచిది కాదని కూడా చెప్తారు. ఈ కథలో ప్రముఖ పాత్ర అయిన వేలుపిళ్ళై కొట్టుకు సరుకు సప్లై చేసే గోపాల్ చెట్టియార్ కూడా అదే పద్ధతిలో చెప్పిచూస్తాడు. సెందామరై శీలవతి కాదని మిగతా వారికంటే అతనికి ఇంకాబాగా తెలుసు. ఎందుకంటే అతనికి ఆమెతో సంబంధం ఉండేది. చెట్టియార్ మాటలకు వేలుపిళ్ళై ప్రతిస్పందన మాటలతో కథ ముగుస్తుంది.

చెట్టియార్ భావించినట్టు వేలుపిళ్ళై అమాయకుడు కాకపోవచ్చు. లోకం దృష్టిలో సెందామరై ఎటువంటిదైనా తన జీవితంలో ఆమె స్థానమే అతనికి ముఖ్యం. ఆమెను తెచ్చుకున్నాకనే అతని దశ తిరిగింది. 55ఏళ్ళ వయసులో ఆమె అన్నిరకాలుగా సుఖపెట్టింది. పోల్చుకోవడానికి పక్కన అతని భార్య పవనాళ్ ఉండనే ఉంది. ఆమెకు డబ్బు మీదే ధ్యాస. పైగా అతని మీద ప్రేమలేదు. అలాగని వేలుపిళ్ళై అవినీతిపరుడేమీ కాదు. ప్రాపంచికమైన పోకడలకు మించి సెందామరైతో అతని బంధం ముడిపడింది. ఆమెపట్ల అతని ప్రేమ నిజాయితీతో కూడి ఉంది. అందుకే ఆమె చావును అతను తట్టుకోలేకపోయాడు. శారీరికసుఖంతో ఆగిపోని ఒక సంవేదనాత్మక స్థితి వారిద్దరి మధ్య ఏర్పడింది. అందుకే సెందామరై తనకేమిటో అది ముఖ్యంగాని ఇతరులతో ఆమె నడత అతనికి అక్కర్లేకపోయింది. మానవ స్వభావం అంత తేలిగ్గా విశ్లేషణకు లొంగదని కూడా ఇందుమూలంగా అర్థమౌతోంది. వేలుపిళ్ళైది ఉదాత్తమైన సంస్కారం అని చెప్పి కూడా తప్పుకోలేని పరిస్థితి మనకెదురౌతుంది. ఫలితార్థమేమిటంటే, అదంతే! వేలుపిళ్ళై కథలో ఒక నవలకు సరిపడేంత ఇతివృత్తముంది. అయినా అది ఒక కథలో ఇమిడింది. ఇరుకుగా కాదు, హాయిగా. దానికి ఆయన మాత్రమే చెప్పగలిగిన కథన పధ్ధతి, కథన శిల్పం అందాం పోనీ. కథ ప్రారంభించగానే రెండో వాక్యంలోనే కథలోకి వెళ్ళిపోతాం. కథకు ముందు మన వేలు పట్టుకుంటారో లేదో గాని ప్రవేశించగానే వదిలేస్తారు. ఇంతకు ముందు అనుభవంలో లేని ఒక వాతావరణంలోకి అడుగుపెట్టగానే అది మనకు అలవాటయిపోతుంది. బహుశా రచయితా కథను ఒక జీవితంలా పూర్తిగా అనుభవిస్తూ చెప్పడం కారణం కావచ్చు. అంతేకాకుండా తనకు పూర్తిగా తెలిసింది కాబట్టి పాఠకులను ఒక దిశవైపు impress చెయ్యాలనే తాపత్రయం లేదనుకుంటాను. చివరన వేలుపిళ్ళై చెప్పిన మాటలు మనతోపాటే ఆయనా వింటున్నంత సహజంగా ఉంటుంది ఆయన ధోరణి.

ఇట్లాంటిదే ఇంకో కథ “కంపెనీ లీజ్“. ఇది టీ ఎస్టేట్ భిత్తికపై చిత్రించిన కథ కాదు. ఆ పరిధి బయటదే. స్త్రీపురుష సంబంధాల్ని ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనుబంధం స్వభావాన్ని చిత్రించే కథ. రాజేష్, సునీత సంపన్న దంపతులు. రాజేశ్ కు సొంత కంపెనీ ఉంటుంది. సునీత మరో పెద్దకంపెనీలో ఉన్నతోద్యోగి. సునీత తండ్రి ద్వారా సంక్రమించిన స్థలంలో ఓ పెద్ద ఇల్లు కడ్తారు. అయితే దానిని ఏ కంపెనీకైనా లీజుకు ఇవ్వాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మూడు నెలల ముందుదాకా ఆ ఇంట్లో ఫాతిమా అనే పనిమనిషి పనిచేస్తుంది. ఆమెతో పదేళ్ళుగా రాజేశ్ కు శారీరిక సంబంధం ఉండటం వల్ల ఆమెకు మిగతా పైవాళ్ళపై అజమాయిషీ ఉంటుంది. ఆ సంబంధం బయటపడి సునీత పెద్ద గొడవ చేస్తుంది. రాజేశ్ ఫాతిమాను పనిలోంచి తీసేస్తాడు. కొన్నాళ్ళకది సద్దుమణుగుతుంది. ఓరోజు ఎక్కడో సునీతకు ఫాతిమా తారసపడుతుంది. ఆమెను ఇంట్లోంచి సరే, కంపెనీలోంచి కూడా తీసేశారని తెలుస్తుంది. రాజేశ్ ను అడిగితే అబద్ధం చెప్తాడు. నిజానికి కంపెనీలోంచి తీసెయ్యడానిక్కూడా అతడే కారణం. ఫాతిమా ఉద్యోగం పోయి అతి దీనావస్థలో ఉంటుంది. ఓరోజు కంపెనీ లీజు ఒప్పందాల గురించి చర్చించుకుంటుండా సడెన్ గా సునీత లీజు ఉద్దేశం మానుకొని తాను ఆ ఇంటికి వెళ్ళిపోతానంటుంది. పైగా అతన్ని భర్తగా వదిలేసి, కొత్తింట్లో ఫాతిమాను పెట్టుకుంటానంటుంది. తనకు శారీరికానందం ఇచ్చిన ఫాతిమాను తన పరువుకోసం ఆమె బతుకు తెరువును ఊడగొట్టించేదాకా నిద్రపోలేదు రాజేశ్. సునీత ఇప్పుడతన్ని క్షమించలేకపోయింది. ఆ కోపాన్ని సునీత మాటల్లోనే విందాం. “ఆవేశం చల్లారిపోగానే నీ వంచన నన్ను అంతగా బాధపెట్టడం మానేసింది. రాజేశ్! భార్యాభర్తల మధ్య ఉండాలనుకున్న కట్టుబాటు సడలడం మించి పెద్ద ఉపద్రవమేదీ ముంచుకు రాలేదనిపించి సర్దుకుపోగలిగాను. కాని, ఇప్పుడు నీ ప్రయోజనం కోసం ఫాతిమా ఉద్యోగాన్ని ఊడపీకించి తన బ్రతుకుతెరువుకే ఎసరుపెట్టడం నన్ను అమితంగా భయపెడుతుంది. ఎంతటి అన్యాయానికైనా ఒడిగట్టగల సమర్ధుడిలాగా కనిపిస్తున్నావు. నేను తట్టుకోలేను” తప్పును క్షమించవచ్చు గాని తెలిసి చేసే వంచనను, మౌలికమైన మానవతా రాహిత్యాన్ని క్షమించలేకపోవడాన్ని తెలియజెప్పే కథ “కంపెనీ లీజ్”. అంతే కాదు. ఆర్థికపరమైన ఒప్పందాలపట్ల ఉన్న శ్రద్ధ సజీవ వ్యక్తుల మధ్యన ఉన్న సంబంధాల పట్ల లేకపోవడం ఘోరం, నేరం అని చెప్తున్నాడు రచయిత.

నల్లతోలు” అనే కథ మొదలైంది మొదలు ముగిసేదాకా తెలియనంత సంభాషణారమ్యంగా ఉంటుంది. పేట్ రావ్(ప్రతాప్ రావును ఇంగ్లీషు వాళ్ళు అలా పిలిచేవారు) అనేవాడు టీ ఎస్టేట్ లో పెద్ద ఉద్యోగి. అన్ని రకాలుగా ఆంగ్ల మానసపుత్రుడు. “వ్రత్తి వ్రత్తి పలుకవే వైదీక పిల్లీ” లాగా అతి ప్రవర్తకుడు. ఓరోజు తెల్లవాళ్ళతో క్లబ్బులో డ్రింకుపార్టీ ఉంటుంది. దానిలో ఇతనొక్కడే నల్లవాడు. తాగుడు తలకెక్కిన బ్రిటిషువాళ్ళ చేత వర్ణపరంగా అతనికి ఘోరమైన అవమానం జరుగుతుంది. తాగినప్పుడు sub-consciousలో ఉన్న నల్లద్వేషం ఒక్కసారిగా బయటపడుతుంది. హోదాలో అతను వారికన్నా ఉన్నతుడైనా అతన్ని అవమానించి బయటకు గెంటేస్తారు. బ్రిటీషు వారి ముందు అతనిదేప్పటికీ నల్లతోలుగానే మిగిలిపోతుంది. పేట్ కు దొరల జీవన విధానంపైన గల గొప్ప ఇష్టాన్ని క్రమంగా ఉన్మీలం చేస్తూ దొరలాగే ప్రవర్తించే అతని కృత్రిమ అభిజాత్యాన్ని అతని పాత్రకు ఆపాదిస్తూ పార్టీలో తనచుట్టూ అల్లుకున్న భ్రమను పటాపంచలు చేస్తూ అత్యంత నిపుణంగా కథను ముగిస్తాడు రచయిత.

“సామికుంబుడు” కథ ఇటీవల రాసినా బ్యాక్ డ్రాప్ అప్పటి టీ తోటలదే, ఇంతకాలానికి రాసారు అంటే అది Re-collection in tranquility అయి ఉంటుంది. మేనేజిమెంటు, లేబర్ మధ్య ఉండవలసిన సౌమనస్య సంబంధాలను ఈ కథ సూచిస్తుంది. సామికుంబుడు అనేది టీ లేబర్ లో వాడుకలో ఉన్న దేవుడి పూజ, అందరూ సమిష్టిగా జరుపుకునే సంబరం. ఆ పూజకు అఫీషియల్ గా బక్షీస్ ఇవ్వడం ఆనవాయితీ. దానిని తీసేయ్యబోతే లేబర్ కది నచ్చదు. లేబర్ తో చర్చించడానికి సంపత్ దొర ఫీల్డుకెళ్తాడు. అక్కడ అతని కారు చెడిపోతే లేబర్ ఐదుమైళ్ళు తోసుకెళ్తారు. దానికి బదులుగా డబ్బులివ్వబోతే తీసుకోరు. సామికుంబుడు తంతుకు కూడా అయ్యే ఖర్చు రెండు మూడు వందలే. దాన్ని ఆపేస్తానంటే ఒప్పుకోరు. అది సామూహిక శ్రామిక సంస్కృతికి సంబంధించిన ఒక విశ్వాసం, ఒక వేడుక, దాన్ని డబ్బులతో కొలవడం కుదరదు. లెక్కప్రకారం పొతే ఏదీ తేలదు. పైగా మానవసంబంధాలు అస్పష్టంగా మారతాయి.

“ఏనుగుల రాయి” కథలో రచయిత ఏనుగుల ప్రవర్తనను వర్ణించిన తీరు, “కాడా” తెగ జీవనవిధానాన్ని చిత్రించిన విధానం అమోఘం. “గాలిదేవరు కథ” అంటే గాలిదేవత లేదా వర్షదేవత. సకాలంలో వర్షాన్ని కురిపించే దేవత. చిన్న కాఫీ తోటల యజమానికైనా, పెద్ద కంపెనీ మేనేజర్ కైనా ఆ దేవత అనుగ్రహం తప్పనిసరి. అయితే గాలి దేవత మహాత్మ్యం కొందరి స్వార్ధానికి పనికొచ్చే మూఢనమ్మకమవుతుంది. దానిముందు తర్కం వీగిపోవటాన్ని రచయిత ఎంతో చక్కగా చెప్పుకొచ్చారు. ఆ కథను నేను చెప్పడం కంటే దానిలో కాఫీ లేబరు జీవన స్థితిగతులను గురించి రచయిత ఎం చెప్పాడో చూడండి. “బ్రిటీష్ పరిపాలనలో కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా ఉన్నా సరిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొంత మెరుగే కాని, ఇంకా వాళ్లకి చెయ్యవలసినవి చాలా ఉన్నాయి. పాపం, ఎండనక, వాననక రోజస్తమానూ కాఫీ చెట్లల్లో తిరుగాడుతూ ఉంటారు. ఇంటికి పొతే రాత్రి ఎలక్ట్రిక్ దీపమైనా ఉండదు. చాలామటుకు ఇళ్ళు కూలిపోతున్నట్లుంటాయి. వర్షాకాలం అంటే కొండ కిందలాగా నాలుగు రోజులుండి పోయేది కాదు. నాలుగు మాసాలు ఏకధారగా కుండపోత. ఇంట్లో సరయిన స్నానాల గది ఉండదు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి అంత వర్షంలోనూ చిన్నాపెద్దా ఇంటి వెనకాల దూరంగా కట్టిన రేకుల చూరు కిందకి పరిగెత్తవలసిందే. మేనేజరు సోమయ్య వీరి సౌకర్యాల కల్పనకు స్పందించాడు గాని, ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తే బావుంటుందని రాయబోయాడు గాని, మేనేజిమెంటుకీ, తక్కిన చిల్లర ఉద్యోగులకీ ఉండే వ్యత్యాసం సన్నగిల్లిపోతుందేమోనని భయం వేసింది” అని అంటాడు.

శిల్పపరంగా “క్లబ్ నైట్” మరపురాని కథ. పాఠకుడు డ్రింకు పార్టీలో తానూ ఓ భాగస్వామి ఐనట్టు అనుభూతి చెందుతాడు. సంభాషణలు నడపడంలో రామచంద్రరావు గారు దిట్ట. చెట్ల మీద ఆకులు మొలచినంత సహజంగా మాటలు అలా అలా సాగిపోతుంటాయి. ఈ కథలో విజయ్ పాత్ర ఈ రచయితదేనా అన్న అనుమానం కలుగుతుంది. “ఫ్యాన్సీ డ్రెస్ పార్టీ”, “టెన్నిస్ టోర్నమెంట్”, “ఉద్యోగం” కథలు మీకే వదిలేస్తున్నాను.

ఇవి తెలుగు భాషలో ఉన్నాయి కాబట్టి తెలుగు కథలే అనుకోవాలి. కాని స్థలం తమిళ ప్రాంతానిది. పాత్రలూ అక్కడివే. కాలం కూడా స్వాతంత్ర్యం వచ్చినప్పటి కొత్తది. రచయిత తెలుగువాడు. ఆంగ్ల వాతావరణంలో పెరిగినా, టెంగ్లీషు లాంటి భాష మాట్లాడినా ఈ కథలో రామచంద్రరావు వాడిన భాష తెలుగు నుడికారంతో గుబాళిస్తుంటుంది. దానికి ఉదాహరణలు కొల్లలుగా చెప్పొచ్చు. మీరే చూడండి. ఇక తమిళ తంబీలు ఈయన చేతలో పడి మనకు ఆత్మీయులైపోతారు.

ఆ రోజుల్లో ఇంగ్లాండు నుంచి వచ్చిన బ్రిటీషు దొరలూ చాలా వరకూ గొప్పవాళ్ళేం కారు. ఇంగ్లండులో గడవని వాళ్ళూ అధికార కాంక్షా, ధనకాంక్షా పరులెందరో వారిలో ఉన్నారు. రచయిత వారిని ఎక్కడా పైకెత్తపోగా వారిలోంచి ఒక బ్రిటీషుతనాన్ని పిండిచూపాడు.

ఇక ఈ కథలను ఎక్కడ నిలబెట్టాలి? వీటి స్థాయి ఏమిటీ? అసలు ఏ కథకైనా స్థాయిని ఎలా నిర్ణయిస్తాం? ఇవి సమస్యల కథలు కావు. సమస్య తీరగానే వాటిని మరచిపొయ్యే అవకాశముంది. (కన్యాశుల్కం అపవాదం). కాని సిరారా కథలు ఒక కాలంలో జరిగినా ఆ కాలంలోనే ఆగిపోవు. ఆ కాలంలో వాటిలో ఉన్న పాత్రల పేర్లు, హోదాలు తొలగిపోయి రక్తమాంసాలు గల మనుష్యులుగా మిగిలిపోతాయి. అక్కడ అవి మానవ కథలుగా సాక్షాత్కరిస్తాయి. అవి ఏ దేశంలో ఏ భాషల వారు చదివినా అటువంటి అనుభూతినే పొందుతారు.

ఇక కథ చెప్పడంలో రామచంద్రరావు గారి నైపుణ్యం గానీ విషయ వివరణలో ఆయన నిజాయితీ గాని అకృత్రిమ మూలకం. ఆయన ఎక్కువగా రాయకపోవడానికి మళ్ళీ ఇంతస్థాయిలో రాయలెనన్న భయం కూడా కారణం కావచ్చు. రసవాద విద్య తెలిసిన సంవేదనాశీలి కాబట్టి నిజానికి ఆ భయానికి ఆస్కారం లేదు. శ్రీశ్రీ అన్నట్టు “ఔనౌను శిల్పమనర్ఘం” లాంటి రచయిత సి.రామచంద్రరావు. సందేహం లేదు ఆయన రచయితలకు రచయిత.

****

వేలుపిళ్ళై
సి.రామచంద్రరావు కథలు
ఫిబ్రవరి 2011
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విజ్ఞాన భవన్, 4-1-435, బ్యాంక్ స్ట్రీట్
హైదరాబాద్ – 01
120 పేజీలు; 55 రూ.
కినిగే.కాం లంకె ఇక్కడ
ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన పాత వ్యాసాలు ఇక్కడ చదవండి.

You Might Also Like

Leave a Reply