ఓ తండ్రి సూటి ప్రశ్న: “Does He know a mother’s heart?”

ఈ పుస్తకం వెనకాల ఓ ముప్పయ్యైదేళ్ళ అధ్యయనం ఉంది. అత్యంత బాధాకరమైన జీవిత విషాదమూ ఉంది.

అరుణ్ శౌరి వాళ్ళ అబ్బాయి ఆదిత్యకు సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం). నడవలేడు, నిలబడలేడు. కుడిచేయి పని చేయదు. ఎడమచేయి జెర్కీగా కదులుతుంది. కుడి కంటితో చూడలేడు. మైనస్ 5 పవరున్న కళ్ళద్దాల సహాయంతో ఎడమకంట లీలగా కనబడుతుంది. ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ మాట్లాడటమూ ప్రయాస కలిగించే పనే! ఇన్ని కాదు గానీ వీటిల్లో ఏ ఒక బాధ సంప్రాప్తించినా జీవితం నరకప్రాయంగా ఉంటుంది కదా. ఇవన్నీ చాలనట్లు ఎప్పుడూ ఏదో ఓ రుగ్మత దాడి చేసి ఆదిత్యనూ తన కుటుంబాన్నీ విలవిలలాడిస్తూ ఉంటుంది.

ఎదురొచ్చిన ప్రతి కష్టాన్నీ ఎదుర్కొంటూ, పనిలో పనిగా “ప్రాపంచిక దుఃఖానికి మూల కారణంబెవ్వడు (ఎయ్యది?)” అనే ప్రశ్నకి సమాధానాన్ని వెదుకుతూ, వివిధ మత గ్రంథాలను , ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలను తరచి చూసారు శౌరి. తన నిజజీవిత విషాదాన్నీ, అధ్యయన సారాంశాన్నీ 425 పేజీలలోకి దించేసి Does He know a Mother’s Heart? అని అడుగుతారు, జాలిగా, కోపంగా.

మనమనుభవించే సుఖ దుఃఖ పరంపరలకు దేవుడినో, కర్మనో కారణంగా భావిస్తాము. హిందూ ఆధ్యాత్మికతతో కొంచెం ఎక్కువ పరిచయం ఉండి దాన్ని ఒంటబట్టించుకున్న వాళ్ళు కొందరు, “అసలిదంతా మాయ. అనుభవమూ లేదు, అనుభవించేవాడూ లేడు. అంతా మిథ్య!” అనేస్తారు. ఈ మూడు (దేవుడు, కర్మ, మాయ) భావనలను “దుఃఖ దీపకాంతి”లో నిశితంగా పరిశీలిస్తారు శౌరి ఈ పుస్తకంలో.

***

మనమనుభవించే సుఖదుఃఖాలన్నీ మన మన కర్మానుసారంగానో, యథేచ్ఛగానో దేవుడే ప్రసాదిస్తాడనే నమ్మకాన్ని చాలా గట్టిగా ప్రశ్నిస్తారు, శౌరి.

ఎవరీ దేవుడు? ఈయన అవాఙ్మానస గోచరుడైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు కాడు. “ఆకాశపు తెర వెనకాల పొడుగు గడ్డం పెట్టుక్కూర్చున్న వాడు”, సృష్టి స్థితి లయలకు కారకుడు, సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు, కరుణాళువు, పరిపూర్ణుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఆకైనా అల్లాడదు. మనం చేసే మంచి-చెడుల జమాఖర్చులు ఎప్పటికప్పుడు రాసేసి మనమనుభవించాల్సిన సుఖదుఃఖాల లెక్కలు గట్టే మహాగణకుడు-కం-న్యాయమూర్తి ఆయనే.

“దేవుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్“ కేసులో దేవుణ్ణి బోనులో నించోబెట్టి అడిగిన కొన్ని ప్రశ్నలు, మచ్చుకి:

1. కోటానుకోట్ల నక్షత్ర సముదాయాలున్న ఈ సువిశాల విశ్వంలో , ఒక మారుమూలనున్న చిన్న నక్షత్రం చుట్టూ తిరిగే ఓ చిన్నపాటి గ్రహం మీద బిలబిలలాడే లక్షలాది జీవరాశుల్లో ఒక జాతికి చెందిన మనిషి అనే ప్రాణికి నీ పట్ల భక్తి ఉందా లేదా అన్న పట్టింపు నీకెందుకు? ఈ ప్రవక్తలూ, మత గ్రంథాలూ, ధర్మ యుద్ధాలూ – ఎందుకివన్నీ?

2. వందల, వేల, లక్షల సంఖ్యల్లో మనుషులనూ, జంతువులనూ హతమార్చే ప్రాకృతిక ఉత్పాతాలు నీ వల్లే సంభవిస్తాయా? లేక నీ ప్రమేయం లేకుండానే వస్తాయా? వాటికి నీవే కర్తవైతే నీకు విచక్షణా, క్షమా ఉన్నాయనే అనుకొమ్మంటావా మమ్మల్ని?

3. ఏ తప్పూ చేయని వారికి (కొండొకచో, నీ భక్తులకు సైతం) దుస్సహమైన దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తావు?

4. మేము – మనుషులము – అనుభవించే దుఃఖానికి కట్టకడపటి బాధ్యత ఎవరిది? మేం ఎందుకు పాపం చేస్తాము? మాకు నిర్ణయ స్వేచ్ఛ ఉందా, లేదా?

5. నీవు సర్వశక్తిమంతువూ, సర్వజ్ఞుడవూ, కరుణాళువువూ కూడా అయితే – లోకంలో ఇంత చెడూ, ఇంత దుఃఖమూ ఎందుకున్నాయి? కరుణామయుడవైన నీకు ఈ చెడునీ, దుఃఖాన్నీ తొలగించగలిగే శక్తి లేదా? లేక, సర్వశక్తిమంతుడివైనప్పటికీ ఈ చెడునీ, దుఃఖాన్నీ నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోతావా?

పాత ప్రశ్నలే! “వితండవాదమే”. సమాధానాలు దొరకనంతకాలమూ మనకు మళ్ళీ మళ్ళీ ఎదురవుతూ ఉంటాయి.

మతం గురించి విమర్శనాత్మకంగా రాయాల్సి వచ్చినప్పుడు, సాధారణంగా రచయితలు తాము పుట్టి, పెరిగి, వదులుగా పాటిస్తున్న/వదిలేసిన మతాన్ని తిట్టడమూ, “పరుల” మతాలను గౌరవించడం పరిపాటి. అలాంటి పొలిటికల్ కరెక్ట్‌నెస్ పట్ల తన అవిధేయతని మరోసారి ప్రకటించుకున్నారు, శౌరి. దేవుడి స్వభావానికి సంబంధించిన ఈ చర్చ, ప్రధానంగా, బైబిల్, ఖురాన్లలోని అబ్రహాం, లాట్ (Lot), జోబ్ (Job) కథల ఆధారంగా, “మంచీ-చెడూ, విశ్వాసావిశ్వాసాలూ అన్నింటికీ నేనే కారణం.” అని దేవుడు చెప్పిన మాటల ఆధారంగా సాగుతుంది.

కొటేషన్ల ఎంపికలో పొరబాటు ఉండక పోవచ్చు, ఎంచుకున్న “ప్రమాణ వాక్యాల” నుంచి తను రాబట్టిన నిర్ధారణలు తప్పు కాక పోవచ్చు. కానీ, తన విశ్లేషణ కేవలం బౌద్ధికమైనదే, ఔట్‌సైడర్స్ పెర్‌స్పెక్టివ్‌కి ఉండే పరిమితులు ఉండే ఉంటాయని నాకు అనిపించింది. పైగా, పాఠకులను గుక్క తిప్పుకోన్వివ్వకుండా కొటేషన్లు గుప్పించడం వల్ల పుస్తకం పఠనీయత బాగానే దెబ్బ తిన్నది.

ఆమాట అలా ఉంచితే, అస్మదీయ-తస్మదీయ, అస్తి-నాస్తి సంవాదాలకు, అభిప్రాయ భేదాలకు అతీతంగా నేర్చుకోదగ్గ ఓ మంచి విషయాన్ని పలు మార్లు చెబుతారు. ఓ ఆలోచన/ప్రతిపాదన సబబైనదా? అని పరిశీలించేప్పుడు “”ఫలానా వాళ్ళు చెబితే, ఫలానా పుస్తకంలోనిదైతే ఒప్పు, కాకుంటే తప్పు” అనే ధోరణిలో కాకుండా పూర్వ నిర్ధారితమైన అభిప్రాయాల నీడ పడకుండా, నిష్పక్షపాతంగా , వివేచించాలని సూచిస్తారు శౌరి. తను బోధించిన పాఠాన్ని తానే ఆచరించి చూపారు కూడా – బీహార్ భూకంపం సందర్భంలోనూ, యూదుల సమస్య విషయంలోనూ గాంధీగారి అభిప్రాయాలను చర్చించిన ఆసక్తికరమైన అధ్యాయంలో.

Personal/Interceding/Intervening Godకి సంబంధించిన చర్చకి ముక్తాయింపు (శౌరి పుస్తకం నుంచే):

”What a delight to meet you,’ I say on encountering a friend. ‘How are things?’ ‘God is kind’, he says. ‘Business is really looking up’. Perhaps, that is why things are the way they are, I tell myself. God is so busy ensuring that everybody’s business prospers, how can He have time for climate change?…”

***

దుఃఖితుల గురించి అట్టే బాధపడని దేవుణ్ణి ప్రశ్నించి, ప్రశ్నించి వదిలేసాక, రామకృష్ణ పరమహంసా, రమణ మహర్షీ బోధనల పరిశీలనలో పడతారు శౌరి. ప్రపంచమనే తామరాకు మీద నీటిబొట్లలా జీవించినా, వీరిద్దరూ తమనాశ్రయించిన వారికి దుఃఖోపశమనాన్ని కలిగించడానికి ప్రయత్నించిన వారే. వీరిద్దరు ఈ విషయమై ఏమని బోధించారు? దుఃఖాన్ని ఎలా అధిగమించగలమని చెప్పారు?

ఓ వంద పేజీలు నిండిపోయిన సంభాషణల్లో మనకు కనబడే దుఃఖ కారణాలు ఇవి:

1. దైవేచ్ఛ (God’s Inscrutable Will). మనకు అర్థం కాని లీల!

2. ప్రారబ్ధ కర్మం – గత జన్మలలో అనుభవించగా మిగిలిపోయిన కర్మశేషం

3. అదలా జరగాలని రాసి పెట్టి ఉంది గనక (నియతి వాదం)

అహాన్ని మరిచి సంపూర్ణ సమర్పణా భావంతో జీవించగలిగితే కష్టాలు బాధించవంటారు రామకృష్ణ పరమహంస. ‘పవర్ ఆఫ్ అటార్నీ’ పైవాడి చేతిలో పెట్టి హాయిగా ఉండక, “నేనూ, నాదీ అనడం పామరత్వం. నీవే నేను. నీవే అంతా. నీదే అంతా అనుకోగలిగితే ఏ కష్టమూ నిన్ను బాధించదు. బండిలో కూర్చున్నవాడు పెట్టే బేడా తల మీద మోయడం దేనికి? వాడిని మోసిన బండి వాటిని మాత్రం మోయదా?” అని అడుగుతారు తనదైన శైలిలో.

“దేహమే నీవనే భ్రమను వదిలిపెడితే, ఇంద్రియాల ద్వారా అవగతమయ్యే ఈ ప్రపంచమూ, దాని వాసనలూ బంధాలూ ఉత్తి మాయ అని గ్రహించగలిగితే ఈ బాధలు మనలను బాధించవు. అవి mere scratches on the surface అని గ్రహించండి.” అంటారు రమణ మహర్షి.

“ఏ పాపం ఎరగని పసి పిల్లలకు సైతం కష్టాలూ/బాధలు ఎందుకు కలుగుతాయి?” అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం:

“ప్రపంచం అంటే ఏవిటో, నీవెవరివో తెలుసుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఉదయించవు. ఈ వ్యత్యాసాలూ, అమాయకులకు కష్టాలూ, బాధలూ – ఇవన్నీ “నీవు” లేనప్పుడు లేవు. ఇవన్నీ ఎందుకని అడుగుతున్నది ఎవరు? నువ్వు. నీవెవరివో తెలుసుకో ముందు. తానెవరో తెలుసుకున్న వాడికి ఏ ప్రశ్నా ఉండదు.”

కనబడేది మాయ. చూస్తున్నాను అనుకోవడమూ మాయే. తనను తాను తెలుసుకున్న జ్ఞాని మాయనూ, మాయాజనితదుఃఖాన్నీ అధిగమిస్తాడు అని తాత్పర్యం.

దేవుడి మీద కోపంతో ఊగిపోయినట్లు కాకుండా ఈ ఇద్దరు జ్ఞానులను, ఆధ్యాత్మికానుభవులను చాలా గౌరవంతో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు శౌరి. అవసానదశలో ఎంతో యాతనను అనుభవిస్తూ కూడా తమను దర్శించేందుకు వచ్చిన వారి పట్ల వారు చూపిన ఆదరభావమూ, కరుణల గురించి రాస్తూ, “These traits – solicitude and compassion… [of these saints] are so unlike what we see of God through His deeds” అని అంటారు. అయినా తండ్రిగా, తాత్త్వికుడిగా సమాధానపడరు.

అదిత్ అనుభవించే అనుదిన నరకయాతనకు ఓ దైవిక ప్రయోజనం ఉంటుందా? అది అతడు ఏదో జన్మలో చేసుకున్న పాపానికి శిక్షా? తన కుటుంబ సభ్యుల కర్మఫలమా? అరుణ్ శౌరికో, ఆయన భార్యకో ఏవో గొప్ప గొప్ప పాఠాలు నేర్పడానికి ఇదంతా జరిగిందా?

ఏ హెచ్చెరుక ఈ కింది ప్రశ్నలకు జవాబివ్వగలుగుతుంది?

“But has my son not suffered an injury to the brain or not? Can he stand and walk? Can he talk like others?… Have these things happened or not? Or is it just that because my wife and I did not fathom the ‘Who am I’, these things appear to have happened when in fact, they have not? The question is not. ‘Are these injuries significant or not”… The question is of fact: have the injuries occurred or not? If they have, why they have been visited on this hapless child?”

ఈ విచికిత్సలో భాగంగా కర్మ గురించీ, మాయ గురించీ మౌలికమైన విశ్లేషణ చేస్తారు రచయిత.

మహాభారతంలోని అనుశాసనికపర్వంలోని గౌతమి కథతో మొదలై ఉపనిషత్తులూ, బ్రహ్మసూత్ర భాష్యాల మీదుగా, సి.జి.యుంగ్, ఎరిక్ ఫ్రామ్‌లను పరామర్శిస్తూ పున్నిక-బ్రాహ్మణుడి కథ దగ్గర ముగుస్తుంది కర్మ సిద్దాంత వివేచన. ఎప్పుడో ఏ జన్మలోనో చేసుకున్న కర్మఫలమే మనం ఇప్పుడు అనుభవించే సుఖదుఃఖాలనీ, కర్మఫలశేషం ఉడిగిపోయేదాకా మనం పునర్జన్మలనెత్తుతూ ఉంటామనే ప్రతిపాదనలను మనలను మనం మభ్యపెట్టుకునేందుకు పనికొచ్చే “convenient fiction”గా వర్ణిస్తాడు శౌరి. ఐతే – సుఖదుఃఖ మూలాల వివరణభారాన్ని మోపకుండా ఉంటే, పునర్జన్మలూ, ఆత్మ అనశ్వరత్వమూ అంటూ దాన్ని పొడిగించకుండా ఉంటే, ‘ఫలానా కర్మకి ఫలానా ఫలితమే రావాలి కదా’ అని నిలదీయకుండా ఉంటే కర్మ సిద్ధాంతం ఇప్పటికీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది అని సూచిస్తారు.

కర్మ సరే – మాయను ఎలా అర్థం చేసుకుంటాము? చూసేవాడు (perceiver) లేకపోతే ప్రపంచం (perceived) మాయమయిపోతుందా? ఇదంతా ఓ పెద్ద కల మాత్రమేనా? “జమీందారు రోల్సుకారు, మహారాజు మనీపర్సు, పాలికాపు నుదుటి చెమట” అంతా మాయే అంటే ఎలా నమ్మడం?

నిజం చెప్పాలంటే – ఈ పుస్తకంలో మాయకు సంబంధించిన చర్చను చదువుతూ ఉంటే ఇనుప గుగ్గిళ్ళను నములుతున్నట్లనిపించింది నాకు. ‘ఉన్నది చూస్తున్నామా? చూస్తున్నాము కాబట్టి ఉన్నదనుకుంటున్నామా?’ అన్న సమస్య తత్త్వశాస్త్రంలో చాలా మౌలికమైనదంటారు కానీ నాకందులో అంతుబట్టనిదేమున్నదో అర్థం కాదు. “స్వప్నావస్థకీ, జాగ్రదవస్థకీ అట్టే తేడా లేదు”,”నేను (అహం) లేనప్పుడు లోకమే లేదు” అని పదే పదే రమణ మహర్షి చెబుతూ ఉంటే “ఎందుకింత మొండి, ఈయనకి?” అనుకునే వాణ్ణి.

మాయ గురించి ఈయన ఇంతగా నొక్కి వక్కాణించడానికి మూడు కారణాలున్నాయి అంటారు శౌరి. వాటిల్లో చాలా ముఖ్యమయింది ఆయనకి లభించిన ఆధ్యాత్మికానుభవం. అత్యున్నతమైన ఆధ్యాత్మికానుభవాన్ని పొందిన రమణ మహర్షి వంటివారు మాట్లాడే అంతరువు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుందని, ఆ స్థాయి నుంచి చూసే వారికి మన జీవితాలూ, సుఖ దుఃఖాలూ అల్పస్థాయికి చెందినవిగా అనిపిస్తాయని, దాదాపుగా అవాస్తవమైనవిగా, భ్రమాజనితమైనవిగా తోస్తాయని అంటారు శౌరి.

***

దేవుడూ, కర్మా, మాయా – ఈ తరతరాల కంటితుడుపు, సర్దుబాటు మాటలను దాటి ఆలోచించే ఓ సుదీర్ఘ “నాస్తిక ప్రకరణం” తరువాత రచయిత ఆలోచనా జగన్నాథ రథచక్రాలు ఆచరణా భూమార్గం పడతాయి.

“దుఃఖం ఎందుకు?” అంటే It just happens అంతే! ఈ జన్మలో మనం చేసుకున్న కర్మ కానప్పుడు దుఃఖానికి కారణాలు రెండే – those two demons – time and chance. దుఃఖాన్ని అనుభవించేవాడికి మత గ్రంథాల్లో, గురువుల ప్రవచనాల్లో ఉపశమనం లభించదు. లభించినా అది తాత్కాలికమే. తీసేయలేనంత దుఃఖమే సంభవిస్తే దాన్ని భరించాల్సిందే. దాన్ని తొలగించుకునే మార్గాలను వెదకాల్సిందే. As often suffering can be put to work అని చెబుతారు. ఆ సాధనలో తను నేర్చుకున్న పాఠాలను బోధిస్తారు. ఈ పుస్తకంలో ఎంతో విలువైన భాగం ఇదే.

“మనకెదురైన ప్రతి సందర్భంలో ఏం చెయ్యాలో, ఎలా స్పందించాలో నిర్ణయించుకోగల అవకాశమూ, బాధ్యతా మనకుంటాయి. అన్నీ అమరినప్పుడే కాదు, ఏదీ అనుకూలించనప్పుడు కూడా మనకున్న ఈ అపరిహార్యమైన, అంతిమమైన స్వేచ్ఛను జారవిడుచుకోకూడదు. అత్యంత నిస్సహాయతలో ఉన్నవాడికి సైతం ఛాయిస్ ఉంటుంది – విహ్వలంగా విలపిస్తాడో, ధీరత్వంతో పరిస్థితులను ఎదుర్కొంటాడో తేల్చుకోవాల్సి ఉంటుంది.”, నాజీ నిర్బంధ శిబిరాల్లోంచి విక్టర్ ఫ్రాంక్ల్ నేర్చుకొచ్చిన పాఠం అది.

“నిజంగా నీకోసమే స్వార్థంగా జీవించాలనుకుంటున్నావా? అయితే ఎవరికైనా సహాయం చెయ్యి” అన్నారట దలై లామా. ఆ మాటకి అరుణ్ శౌరి సవరణ: “నిజంగా నీకోసమే స్వార్థంగా జీవించాలనుకుంటే నీకు ప్రత్యుపకారం చేయలేని వాడికి సహాయం చెయ్యి.”. అందుకు పొడిగింపు మదర్ థెరెసా మాటల్లో – “Help until it hurts.”

సాధన కొద్దీ పరిణతి అనే మాట ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నవారికే కాదు, సేవా వ్రతంలో ఉన్నవారికి కూడా – ఇంకా చెప్పుకోవాలంటే – అన్ని రంగాలలో మన చేయగలిగే కృషికి – వర్తిస్తుంది. మన ప్రవృత్తిలో మన లక్ష్యానికి సహాయపడగలిగేదేమిటి? అడ్డుపడేదేమిటి? లక్ష్య సాధనకు మనం చేసే ప్రయత్నం మన ప్రవృత్తి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? లక్ష్య సాధనా మహత్కార్యంలో పడిపోయాక మనం పక్కవాడితో ఎలా ప్రవర్తిస్తున్నాం?…

ధమ్మపదంలో చెప్పినట్లు “రజతకారుడు వెండిలోనుంచి మలినాలను తొలగించినట్లు, – ఒకదాని తరువాత మరొకటి, కొంత శుభ్రపరిచాక [తృప్తికీ నిరాశకూ లోనవకుండా] ఇంకా కొంచెం, [ఒక్కసారితో వదిలేయకుండా] మళ్ళీ మళ్ళీ…” మనలోని దోషాలను తొలగించుకుంటూ ఉండడమే కర్తవ్యం – దుఃఖంతో నిత్య సహవాసం చేసే వారికైనా, దానికి దూరంగా ఉన్న అదృష్టవంతులకైనా.

ఇంతా రాసాక, “In the foregoing, I have listed a few lessons that ring true to me in the light of my own experience… No reader will think that I have learnt the lessons fully, and I hope that no reader will think that I think that I have learnt even a fraction of them.” అని వినయంగా ముగిస్తారు.

పుస్తకం అంతటితో ముగియదు. గుండెలు బరువెక్కించే ఓ రెండున్నర పేజీల ఉపసంహారం మిగిలే ఉంది. విధితో శౌరి కుటుంబపు పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.

***
కొసరు వివరాలు:
1) హార్పర్ కొలిన్స్ ప్రచురణ; 432  పేజీలున్న ఈ పుస్తకం (పేపర్‌బాక్) ధర 399 రూపాయలు. ఇంగ్లీష్ పుస్తకాలమ్మే అన్ని పెద్ద దుకాణాల్లో కొనుక్కోవచ్చును.

2) లాండ్‌మార్క్ ఆన్‌లైన్‌ (295 రూపాయలే); అమెజాన్ లింకు

3) మొదటి అధ్యాయం నుంచి కొన్ని పేజీలు;  ఆలోక్ సిక్కా బాబా ఆమ్టేను అడిగిన ప్రశ్న

4) ప్రతాప్ భాను మెహతా సమీక్ష

5) రచయితతో ముఖాముఖి

Flipkart Link here.

You Might Also Like

40 Comments

  1. Srinivas Vuruputuri

    కొన్ని నెలల క్రితం జరిగిన ఇండియా ఇంక్లూజన్ సమ్మిట్-2014 లో అరుణ్ శౌరి చేసిన ప్రసంగం – మీతో పంచుకోవాలనిపించింది.

  2. varaprasad

    wonderfull,coments kooda vipulamga chala bavunnai ..mukyamga sowmy garu,poornima garu,tadepallivaru baga rasaru.inka rachayita naration bavundi………………

  3. వీక్షణం – 1 (కొత్త శీర్షిక ప్రారంభం) | పుస్తకం

    […] ఇటీవలే అరుణ్ శౌరీ పుస్తకంపై పుస్తకం.నెట్లో జరిగిన చర్చ నేపథ్యంలో – వివిధ దేశాలు, మతాల మధ్య […]

  4. సౌమ్య

    ఇవ్వాళ హిందూ పత్రికలో Dear Prophet అన్న పుస్తకం గురించిన పరిచయం చదివాను. బహుశా శౌరి పుస్తకం చదివిన వారికి ఈ పుస్తకం కూడా ఆసక్తికరంగా అనిపించవచ్చని ఇక్కడ పంచుకుంటున్నాను.

    “The story goes back and forth in time and space as Zarina recalls the events that led to Hamid’s disappearance. Sometimes frustrated, sometimes distraught but always introspective, in looking for Hamid, she finds herself embroiled in an internal struggle of belief and identity. As evident by the title, the narrative is formed by letters Zarina writes to the Prophet of her religion, Islam. ”
    http://www.thehindu.com/arts/books/letters-to-the-prophet/article3977540.ece

  5. చంద్రహాస్

    బాటసారి సినిమాలో ఇలాంటి సందేహాలకు మల్లాది (రచయిత సముద్రాల అని రాసినా అది మల్లాది వారిదే అని సుస్పష్టం) సమాధానం చదవండి (భానుమతి గొంతులో వినండి):

    వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టివిలాసం
    అల్పబుద్ధితో జ్ఞానదాతనే సలుపరు పరిహాసం
    బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బతుకును జనసముదాయం
    బదులుకోసమై వెతుకుటమాని బతుకుటయే న్యాయం

  6. Srinivas Vuruputuri

    @Thadepalli

    >>… కానీ అంతకుముందు తాను ఎన్నో పురుగుల్ని అలాగే మింగానని అది మర్చిపోతుంది. కర్మని అనుభవించాల్సి వచ్చినప్పుడు మనమందఱమూ ఆ కప్పలాగానే ఆలోచిస్తాం.

    అదిత్ trauma మొదలయ్యేప్పటికి తనకి కొన్ని గంటల వయస్సే ఉండి ఉండాలి. “…A premature child. Barely four pounds. In distress. Placed in an incubator. As they could not locate a vein in his tiny arms, the doctors had stuck needles through his scalp… A horrible sight for us… His sugar level is not stabilising, some nurse came and said to us. ‘Will you please sign these forms for a blood transfusion?’…” (‘Does He know a mother’s heart?’ మొదటి అధ్యాయం నుంచి)

    ఏ రకంగా ఆలోచించినా సమాధానపడాలనిపించదు… తిరగబడకుండా ఎలా ఉంటాడు ఏ తండ్రైనా?

    1. తాడేపల్లి

      అంతా విని ఆవుకథ చెప్పినట్లు, అన్నీ ఈ జన్మకే సంబంధించినవనుకుంటే ఎలా ? Man has an extended existence beyond this immediate life and generation. పుట్టుకతో డయాబెటిక్కులుగా, గుండెరంధ్రపు రోగులుగా ఉన్నవాళ్లున్నారు. ఈ జన్మలో అందఱమూ మంచివాళ్ళమే. కానీ ఇదివఱకు ఏం చేశామో మనకు తెలుసా ? ఎంత తీవ్రాతి తీవ్రతర పాపాలకు తెలిసి, తెలిసి కఠినహృదయంతో, అర్ధ నాస్తికత్వంతో, మానవద్వేషంతో ఒడిగట్టామో మనకు తెలుసా ? అమాయకంగా కనిపించే ఏ పసిబిడ్డా వాస్తవానికి అమాయకుడు కాడు. రావణాసురుడు కూడా పుట్టినప్పుడు అమాయకంగానే కనిపించి ఉంటాడు. ప్రతివాడూ తన నెత్తిమీద విపరీతమైన కర్మఫలాల్ని వెంటబెట్టుకొని తల్లికడుపులోంచి బయటికొచ్చినవాడే. ఎన్ని మాటలు ఎంత మంచి భాషలో చెప్పినా మానవులమైన మనం సంకుచితులమూ, స్వార్థపరులమే తప్ప దేవుడికంటే విశాలహృదయులమూ, దయామయులమూ ఎట్టి పరిస్థితుల్లోనూ కాము. పరిపాలనా బాధ్యతలున్నవాళ్లు ఎంత దయామయులైనా ఆ దయకి తమని తాము పనికిరాకుండా చేసుకుంటారు ఎక్కువమంది మనుషులు. తన కొడుకు కంటే ముందు ప్రపంచంలో చాలామంది అలాంటి జన్మరుగ్మతలతో బాధలు పడుతున్నారని పాత్రికేయుడైన అరుణ్ శౌరికి తెలియదనుకోలేం. కానీ తన కొడుకు బాధే తనను ఈ పుస్తకం వ్రాయడానికి పురికొల్పిందెందుకు ? ఇతరుల బాధలు ఎందుకు పురికొల్పలేదు ? ఇంతమాత్రమే మనిషి హృదయవైశాల్యం. మనం ఇలాంటివాళ్ళమయ్యుండీ అందఱినీ పోషించే భగవంతుణ్ణి తప్పుపట్టుతాం. ఎందుకు ? కష్టాలొస్తే తప్ప మనకు భగవంతుడు గుర్తురాడు కనుక. బావున్న రోజుల్లో మాత్రం పిక్నిక్కులూ, టూర్లూ, కృష్ణా ఒబెరయ్ లో విందులూ, వీడియో చాట్లూ, ఫోటో ఆల్బమ్ లూ ! సుఖపెడుతున్నందుకు ఒక్కరోజు కూడా దేవుడికి కృతజ్ఞత చెప్పుకునేవాళ్లు లేరు. కానీ కష్టమొచ్చి మీదపడగానే ప్రశ్నించడానికి తయారవుతారు.

      తిరగబడితే ఉపయోగమేముంది, ఇంకా దేవుడికి ఇంకా ఇంకా దూరం కావడం తప్ప ? అదీ, మార్చలేనిదాని గుఱించి ? ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయి. కానీ దేవుడి మీద తిరగబడితే దేవుడేమీ కూలిపోడు. మనిషే కూలిపోతాడు. బిడ్డ తియ్యని విషాలు కోరతాడు. తల్లి బలవంతంగా వాడికి చేదుమాత్రలు మింగిస్తుంది, వాడి శ్రేయస్సు కోసమే. మానవుల సంవత్సరం దేవతలకి ఒక రోజుతో సమానం (భగవంతుడికది నానో సెకండ్ లో లక్షో వంతు కూడా కాదు). మనం బ్రతికేది 70 – 80 ఏళ్ళనుకుంటే ఆ కాలఖండం వాళ్ళకి 70 రోజులతో సమానం. అందుచేత తప్పనిసరి కర్మఫలంగా మానవులు పడే బాధల్ని వాళ్ళు మఱీ తీవ్రంగా తీసుకోరు.

      సత్యాన్వేషణలో “నేను, నాది” అనేవాటికి తావులేదు. లౌకిక విజ్ఞానాల్ని ఆవిష్కరించిన మహానుభావులు కూడా ప్రాణాలకు తెగించి కనుగొన్నారు మనకు తెలిసిన సైన్సులన్నింటినీ ! మనిషికి శాశ్వతంగా భవబంధాల నుంచి విముక్తి కలిగించే ఆధ్యాత్మిక జ్ఞానం ఆ మాత్రం చేయదా ? దేవుడు మన కోరికని తీఱిస్తే అక్కడికి మన అవసరం తీఱుతుంది. తీర్చకపోతేనే అంతర్మథనం మొదలవుతుంది. ఉన్నదాన్ని ఉన్నట్లు అంగీకరించడం వల్లనే జ్ఞానోదయం కలుగుతుంది.

    2. Purnima

      “…. తిరగబడకుండా ఎలా ఉంటాడు ఏ తండ్రైనా?”

      ఎందుకు ఉండలేడు? Are you suggesting that revolting is the only way to go about, when put under pain? What about “resigning to fate”?

      నాకిలాంటప్పుడే “ఫిక్షన్” మీద ఎనలేని మక్కువ పుట్టుకొచ్చేస్తుంది. నాకందులో దొరికినన్ని సమాధానాలు ఇలాంటి పుస్తకాల్లోగానీ, వాటిపై జరిగే చర్చల్లో గానీ దొరకవు. ఇజ్రాయెల్ కు చెందిన రచయిత ఎట్‍గర్ కరెట్ రాసిన ఒక కథలో ఒక నలభై సంవత్సరాల ఇల్లాలు టెర్రరిస్టు అటాక్ లో మరణిస్తుంది. (ఆ పై కథేమవుతుందన్నది అప్రస్తుతం.) అంత్యక్రియలైన రాత్రి భర్తకు పీడకల వస్తుంది.లేచి కూర్చుంటాడు. చెప్పలేనంత బాధ అతణ్ణి తొలిచేస్తుంది. ఆమె మరణం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు నరేటర్ అనే మాటలు ఇలా ఉంటాయి:

      “Some people commit suicide after someone close to them goes, others turn to religion, and there are those who sit in the kitchen all night and don’t even wait for the sun to rise.”

      అదీ కథ (అని నా ఉద్దేశ్యం). ఒక్కోళ్ళది ఒక్కో విధానం బాధను అనుభవించడంలో, దాన్ని అర్థం చేసుకోవడంలో. Shourie had his way. If that comes across to few as crying foul – so be it! అన్ని existentialist dilemmasకు “దేవుడి”లో సమాధానాలు దొరికేవాళ్ళు ఇలాంటి పుస్తకాలపై చర్చలో ఎందుకు పాల్గొంటారో ఏంటో? భారమంతా దేవుడిమీద వేసేసాక, ఇంకా ఇలాంటి చిన్నచిన్నవాటికి ఎందుకో ఆవేశం,ఆయాసం? నేనే గనుక దేవుడి మీద దేవుడేం చేసినా నా మంచికే అని నమ్మేట్టు అయితే ఈ పుస్తకం జోలికి పోయుండేదాన్ని కాదు.

      ఇహ అలా దేవుడి మీద భారం వేయలేనివారిని వేధించే ప్రశ్నలకు శౌరి పుస్తకం ద్వారా ఎంతో కొంత లాభం ఉంటుంది.

      ఇక్కడ వస్తున్న వ్యాఖ్యలు గురించి: పుస్తకపరిచయాలు లేక సమీక్షలు ఆయా రచనలకు lossy compressions మాత్రమే, పుస్తకపరిచయ వ్యాసం చదవటం పుస్తకాన్ని చదవటం ఒకటి కాదని గుర్తిస్తే మరింత ఉపయోగకర చర్చలు జరుగుతాయి.

    3. రవి

      పూర్ణిమ గారి వాఖ్యే నాది కూడా.

      Truth is not an unknown entity, rather it is an unknowable one – అని నా అభిమాన తత్వవేత్త మాట. బుద్ధి ద్వారా తెలియదగింది, (ఏ + బి) హోల్ స్క్వేర్ లాంటి ఫార్ములా లకు లొంగగలది ఆ తెలియనిదయితే ఆ ఫార్ములా భట్టీ పట్టేసో లేక, ఆ ఫార్ములా ఉంది, కావలసినప్పుడు తెలుసుకోవచ్చనో మభ్యపెట్టేసుకుని జీవితం గడిపెయ్యచ్చు. కర్మ సిద్ధాంతంతో ఆగిపోయి ఉంటే ఒక బుద్ధుడు జన్మించి ఉండేవాడు కాదు. రోగిష్టి వాణ్ణి, ముసలి వాణ్ణి, శవాన్ని చూసి, వాడు ఏదో పాపం చేశాడు – రిజల్టు ఇది, అని మేథమాటిక్స్ ఫార్ములా తో కన్విన్సు అయిపోయి ఇంటికి తిరిగెళ్ళి ఉండేవాడు.

      Truth is the highest form of negative understanding కనుకనే ఏ సమాధానమూ తృప్తి పర్చలేక అన్వేషణ సాగిస్తాడు మనిషి.దేవుడే సూపర్ బాస్ అని కన్విన్సు అవడం మనిషికి కుదరదు కనుక ఈ విధమైన తిరుగుబాటో, గ్రహపాటో మరొకటో బయలుదేరుతుంది. ఇది తపన గా స్వీకరించటం న్యాయం తప్ప దేవుణ్ణి తిట్టాడు, తన్ని తగలెయ్యండి అనడం – ఏం పద్ధతిది?

      అన్నిటికీ దేవుడే ఉన్నాడు అనుకుంటే ఇవి చదువనవసరం లేదు. మన బాధే అరుణ్ శౌరీ తన మాటల్లో చెబుతున్నాడు అనుకుంటే చక్కగా ఈ పుస్తకాన్ని ఆస్వాదించవచ్చు.

    4. SIVARAMAPRASAD KAPPAGANTU

      @POORNIMA

      “…దేవుడి మీద భారం వేయలేనివారిని వేధించే ప్రశ్నలకు శౌరి పుస్తకం ద్వారా ఎంతో కొంత లాభం ఉంటుంది….”

      Well said.

    5. తాడేపల్లి

      Truth is not an unknowable one but know able from several approaches. పాతపుస్తకాలు చదివి తెలుసుకున్నా లేదా బుద్ధుడిలా ఎవఱికి వారు అన్వేషించినా అక్కడ వాస్తవంగా ఉన్న సత్యం ఒకటే. ప్రతి కొత్త అన్వేషకుడితోనూ సత్యం మారిపోదు. ఒకఱు తెలుసుకుంటారు. ఇతరులు వారిని నమ్మి అనుసరిస్తారు. ప్రతీవారూ తెలుసుకోలేరు. ఎందుకంటే అది తెలుసుకోవడానికి కుతూహలం కంటే వేఱైన కొన్ని మును వలయికలు కావాలి. అవి సాధారణ ప్రజలకి సమకూడవు. లేదా వారు వాటిని సమకూర్చుకోవడానికి ప్రయత్నించరు.

      నేను ఇక్కడ వ్రాసిన విషయాలు నాకు స్పష్టంగా తెలిసి, చూసి వ్రాసినవి.

    6. రవి

      >>Truth is not an unknowable one but know able from several approaches.<<

      Then it's an 'information' and can be reduced to a 'fact'.

      ఇంద్రధనుస్సును గురించి తెలుసుకోవాలనుకున్నవాడు బయటకు రావలసిందే, వర్షంలో తడవవలసిందే, ఎదురుచూపులు చూడవలసిందే. దాని గురించి వినడం, చదువడం, దానిని చూడడానికి, చూచి స్వయంగా అనుభవించడానికి సరికాదు. ఇతరులు ఎంతమంది దాన్ని గురించి చెప్పినా, వర్ణించినా అది స్వయంగా చూడటంతో సరిపోలదు. ఇంద్రధనుస్సు గురించి తెలుసుకోవడానికి ఇష్టం లేని వాడు వాడిలోకంలో వాడు ఉంటే అది వాడి ఇష్టం. Let him cry, curse, abuse, theorize and do whatever. If somebody interested in that, let them be! The describers of rainbow cannot provide the actual thing of 'seeing rainbow' to a seeker.

      ఆధ్యాత్మిక చర్చల్లో జవాబు వల్ల సమాధానం దొరకదు. ప్రశ్న అంతరించినప్పుడే సమాధానం. ఒకడికి పెద్ద బంగళా కావాలి. అది లేక దుఃఖం వచ్చింది. రేప్పొద్దున బంగళా దొరికిన తర్వాత కూడా ఆ దుఃఖం తొలగదు. పైగా పెరిగే అవకాశం ఉంది. అలాంటిదే అరుణ్ శౌరీ బాధ. తన కొడుకును చూసి దుఃఖీస్తున్నాడు. కర్మ సిద్ధాంతం అనే జవాబు వల్ల అతని దుఃఖం తీరదు. ఎలా తీర్చుకోవాలో అతనే తెలుసుకుంటాడు. అది అతని బిజినెస్.

      ఎలాగైతే నదికి సాధారణ లోతు ఉండదో, అదే విధంగా ఆధ్యాత్మికత లో సాధారణ ప్రజ, అసాధారణ ప్రజ అన్న తేడాలు అసంబద్ధం.

      ఇదంతా వ్యర్థ చర్చ. సమస్య ఏదీ తప్పు, ఏది ఒప్పు అని కాదు. ఎవడికి కావలసినది వాడే నిర్ణయించుకుంటాడు, కోవాలి. చివరికి అదే జరుగుతుంది కూడాను.

      (పుస్తకం వారికి: ఈ వ్యాఖ్య సమీక్షకు సంబంధించనిదని భావిస్తే తొలగించగలరు.)

    7. తాడేపల్లి

      “…Then it’s an ‘information’ and can be reduced to a ‘fact…”
      తెలుసుకునే పద్ధతులున్నాయి. వాటిని త్రోసిపుచ్చి ఎవడూ తన జుట్టు తను పట్టుకుని తాను లేవలేడు. ఆ పద్ధతులు తెలుసుకోవాలంటే ముందు పూర్వగ్రంథాల్నీ గురువుల్నీ అంగీకరించాలి.

      “…కర్మ సిద్ధాంతం అనే జవాబు వల్ల అతని దుఃఖం తీరదు. ఎలా తీర్చుకోవాలో అతనే తెలుసుకుంటాడు. అది అతని బిజినెస్…”

      ఆయన బిజినెస్ మనకు అవసరం లేదు. అంతర్మథనం అందఱికీ ఉంటుంది. కానీ ఇంకా ప్రక్తియలో ఉన్న ఆలోచనల్ని పుస్తకాలుగా వ్రాసి ఫాలోయర్సుని పోగేసుకోవడాన్నే నేను తప్పుపట్టుతున్నాను.

      ఈ చర్చలో సుహృద్భావనకూ, పరస్పర అవగాహనకూ బదులు అహం ప్రవేశించినట్లు కనిపిస్తోంది. ఇది అనవసరమైన గాంభీర్యాన్ని, వ్యంగ్యాన్ని సంతరించుకుంటోంది. కనుక నేను ఇంతటితో ఈ చర్చనుంచి విరమించుకుంటున్నాను. ఈ అవకాశమిచ్చిన అందఱికీ నా నెనర్లూ, నమస్కారాలు.

  7. Srinivas Nagulapalli

    శ్రీనివాస్ గారు
    మీ ప్రశ్నలు, అమ్మో- చాలా పెద్దవి- ఒప్పుకుంటారనుకుంటాను 🙂

    పుస్తక సమీక్ష, అభిప్రాయాల నిడివిలో చెప్పుకోవడం కూడా కష్టం. ఒకటి రెండు ఆలోచనలు పంచుకోవటం.
    1. మనలో లేమి, మనలో పరిధులు ఉన్నాయి కాబట్టే, భగవంతుడు అవేవి లేని వాడూ, పరిపూర్ణుడు అంటాం అనిపిస్తుంది. అంటే, మనతో పోల్చుకుని పెట్టిన విశేషణమే అనిపిస్తుంది. ఆరోగ్యమే సహజం ఎప్పుడూ. కాబట్టే, దానికి విరుద్ధమైనది ‘అనా’రోగ్యం అంటామనిపిస్తుంది, అన్ని భాషల్లో సైతం. Being at ease is natural, and when not at ease is called ‘dis-ease’. When ease gets disturbed somehow-knowingly or unknowingly causes ‘disease’. That is why we research causes for diseases and cures. Thank God for giving us ability to investigate,understand and hopefully even solve!
    2. రవీంద్రుని మాటలే గుర్తుకొచ్చాయి. భగవంతుడు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే అతని ఉనికిని సైతం ప్రశ్నించే స్వేచ్చ ఇచ్చినందుకు.
    3. నాకు తెలియదు. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అనుకున్నాక ఇంకేం చెప్పగలం! కాదనుకుంటేనే, ఎన్నో చెప్పగలం, కనీసం మనల్ని consult అడిగి అయినా కొన్ని పనులు చేసుంటే ఎంత బాగుండేది, అయనకు సాయపడేవాళ్ళం కదా, అని కూడా అనాలనిపిస్తుంది 🙂
    ======
    విధేయుడు
    శ్రీనివాస్

    1. Srinivas Nagulapalli

      మరో రెండు మాటలు, మరోమారు కృతజ్ఞతలు చెప్పుకోవడం.

      ఇక్కడ లేవనెత్తిన చాలా ప్రశ్నలు లోతైనవి- అవి ఇక్కడే పుట్టినవీ కాదు, ఇక్కడే ఆగిపోవు కూడానూ. అవి ఎప్పుడూ ఉన్నవే, ఉండేవే, ఒకరు చెప్తే కాదు, ఎవరికివారు ఆ ఆకలి సొంతంగా తీర్చుకోవాలేమో అనిపిస్తుంది.

      వస్తురీత్యా పుస్తకం అవేశపూరితం ఆవేదనాభరితం అని పేరులోనే వ్యక్తమవుతుంది. బహుశ, ఇప్పటిదాకా చేసిన పుస్తక పరిచయాలన్నింటిలో, ఈ పుస్తకం గొప్పదేమీ కాకపోయినా, ఇంత ఆక్రోశంతో, ఉక్రోషంతో (ఏడుపుందో లేదో తెలియదు) రాసింది లేదేమో! ఆక్రోశంతో రాసిందానికి ఎంతోకొంత ఆవేశ స్పందనలు రావడం సహజమేమో! అయితే, ఎంతో క్లిష్టమైన ఆంశాలను అంతకంటే సంయమనంతో చేసిన ఈ సమీక్ష అందుకే ఈ సైటులో “నభూతో” ఏమో అనిపిస్తుంది. కృతజ్ఞతలు.

      సాలోచనకు, సాధనకు ఉపయోగపడే కొన్ని మంచి ఆంశాలను ప్రస్తావించినందుకు తాడేపల్లి గారికి కూడా కృతజ్ఞతలు.

      దేవుడిపై పూర్తిగా భారం వేసినవారు ఇదెందుకు చదువుతారు, అదెందుకు అంటారు, ఇక్కడెందుకు రాస్తారు అంటే, ఆ దేవుడు వారిని చదవమన్నవి చదువుతారు, రాయమన్నవి రాస్తారు, బతకమన్నట్లు బతుకుతారేమో అనిపిస్తుంది. మిగితావారు, వాళ్ళకు ఇష్టం ఉన్నవి చదువుతారు, రాస్తారు, మనలాగ!
      ==========
      విధేయుడు
      శ్రీనివాస్

  8. Dr.kanupuru Sreenivasulu Reddy.

    శ్రీయుతులు తాడేపల్లి గారు ,
    ఇది యుగ యుగాల శేషప్రశ్న .మీ జవాబు కంటే గత్యంతరం లేదనిపిస్తుంది ఈ తర్కం అనవసరమేమో నని అనిపిస్తుంది.దేవుడు అనబడే వాని ప్రమేయము చాలా స్వల్పము ,కొన్నినింటి కి మాత్రమే అంటే నమ్మకాన్ని నమ్ముకుంటే అదే దేవుడేమో!!!.కాలాని వ్యర్దం చేయడం అనవసరం.
    మరోలా భావించకండి.
    డా.శ్రీనివాసులు రెడ్డి..

    1. తాడేపల్లి

      God is essentially THE POWER. It is not correct to say that he has power. He IS the power. But He need not and would not use it for satisfying everyone’s whim and fancy. Just like the governmental power need not be used for our personal ends just because we elected it. Having said that Karma is also a power, one of God’s powers. One power of His does not counteract another of His, just like a govt department does not fight another.

      In exceptional cases, He uses it. After giving a deep and serious thought for many years over the future needs of our nation , I prayed to Him for a mega national project that will cost us around $ 60 billion at the present rates of currency and He kindly granted it. That project will be surely and certainly implemented at least after me if not during my lifetime. I got His assent and that is enough for my life.

    2. తాడేపల్లి

      “…“మనకెదురైన ప్రతి సందర్భంలో ఏం చెయ్యాలో, ఎలా స్పందించాలో నిర్ణయించుకోగల అవకాశమూ, బాధ్యతా మనకుంటాయి. అన్నీ అమరినప్పుడే కాదు, ఏదీ అనుకూలించనప్పుడు కూడా మనకున్న ఈ అపరిహార్యమైన, అంతిమమైన స్వేచ్ఛను జారవిడుచుకోకూడదు. అత్యంత నిస్సహాయతలో ఉన్నవాడికి సైతం ఛాయిస్ ఉంటుంది – విహ్వలంగా విలపిస్తాడో, ధీరత్వంతో పరిస్థితులను ఎదుర్కొంటాడో తేల్చుకోవాల్సి ఉంటుంది.”,

      మతం చెప్పేది కూడా ఇదే. మనిషికి 1% స్వేచ్ఛ ఉంది. దీన్ని జ్ఞానసంపాదన కోసం (తాను స్వేచ్ఛాజీవిని కాదు, బందీని అనే సత్యాన్ని తెలుసుకోవడం కోసం, విడుదల నిమిత్తం కృషి చేసే అవకాశం కోసం) అనుమతించాడు భగవంతుడు. లేకపోతే దీన్ని కూడా ఇచ్చి ఉండేవాడు కాడు. మనిషి భవిష్యత్తులో ఏం కాబోతున్నాడో/ కాబోతున్నదో నిర్ణయించేది ఈ ఒక్కశాతమే. కానీ ఈ 1% కూడా దుర్వినియోగం చేయబడుతుంది. శిష్యుల మధ్య “మనిషికున్న స్వేచ్ఛ ఎంతవఱకు ?” అనే చర్చ వచ్చినప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస అన్నారు : “ఒక ఆవుని కన్నెత్రాటితో రాటకు కట్టేస్తే ఆ కన్నెత్రాడు ఎంత ప్రదేశం వఱకు సాగగలదో అంతవఱకే ఆ ఆవు తిరగగలదు. మనిషికున్న స్వేచ్ఛ కూడా ఇలాంటిదే.” అని !

      “ఎలా React అవ్వాలో అది మన చేతుల్లోనే ఉంది” అని చాలామంది అనగా విన్నాను. నా అభిప్రాయంలో అది కూడా మన చేతుల్లో లేదు. ఉదాహరణకి, తాను ఎవఱితో ప్రేమలో పడాలో మనిషి నిర్ణయించుకోవడం జఱగదు. అలా పడిపోతారంతే !

    3. తాడేపల్లి

      చెడుని భగవంతుడి కంటే వేఱుగా చూడడం వల్ల మనల్ని దాన్నుంచి భగవంతుడు రక్షించి గట్టున పడేయాలనే ఆశింపు (expectation) ఉంటుంది. అలా పడేయనప్పుడు ఆయన మీదా, ఆయన ఏర్పఱచిన నియమాల మీదా చాలా కోపం వస్తుంది. కానీ మంచీ, భగవత్ స్వరూపమే. చెడూ భగవత్ స్వరూపమే. ఆయనలోనే దివ్యాంశలూ ఉన్నాయి, ఆయనలోనే రాక్షసాంశలూ ఉన్నాయి. అయితే పాము విషం పాముకు ప్రమాదకరం కానట్లుగా తనలోని ఈ చెడు వల్ల భగవంతుడికి ఏ విధమైన నష్టమూ లేదు. లోకంలో Absolute good, absolute bad అంటూ ఏమీ లేవు. ఇవి సాపేక్ష శబ్దాలు (relative terms). ఒకఱి నష్టం ఇంకొకఱికి లాభం. ఒకఱి చెడు ఇంకొకఱి మంచి. ఒకఱికి జఱిగే న్యాయం ఇంకొకఱికి అన్యాయం. పాము తనని మింగేటప్పుడు మిగిలి ఉన్న ఆ కొద్దిక్షణాల ఆయుర్దాయంలో అది చాలా అన్యాయమని కప్పకి తోస్తుంది. కానీ అంతకుముందు తాను ఎన్నో పురుగుల్ని అలాగే మింగానని అది మర్చిపోతుంది. కర్మని అనుభవించాల్సి వచ్చినప్పుడు మనమందఱమూ ఆ కప్పలాగానే ఆలోచిస్తాం.

  9. తాడేపల్లి

    ఒకప్పుడు ధర్మస్థలమ్ బ్లాగులో వచ్చిన ఈ వ్యాసం చదవండి :

    http://dharmasthalam.blogspot.in/2009/12/blog-post.html

  10. Dr.kanupuru Sreenivasulu Reddy.

    Please do read, Why Do Bad Things Happen to Good People by Rabbi Harold Kushner–Download from internet.[1943]
    You are all doing great job. please do continue.
    Dr.Ksr,

    1. తాడేపల్లి

      చూశానండీ శ్రీనివాసులు రెడ్డిగారూ ! కానీ వాళ్ళకి వాళ్ళ జూడియో-క్రిస్టియన్ నేపథ్యం మూలాన కర్మఫలమూ, పూర్వజన్మ అనే కాన్సెప్టులు బొత్తిగా తెలీవని అర్థమయింది. ఈ రెంటినీ అంగీకరించనంత కాలమూ, ఇంకా భగవంతుడు సృష్టి కంటే వేఱు కాదనే సత్యాన్ని కూడా తెలుసుకోనంత కాలమూ మనిషికి ఏమీ అర్థం కాదు. అరుణ్ శౌరిలా, రబ్బి హెరాల్డ్ కుష్నర్ లా దేవుడి మీద మళ్ళీ మళ్లీ తిరుగుబాటు చేయాల్సి వస్తూనే ఉంటుంది. (రబ్బి కుష్నర్ గారు బైబిల్ ని దాదాపుగా త్రోసిపుచ్చినట్లే కనిపిస్తోంది. ఆయన Concept of God లో దేవుడు భారత రాష్ట్రపతిలాంటి రబ్బర్ స్టాంపు) ఆధ్యాత్మిక సత్యాల స్థానంలో ఊహలు రాజ్యమేలతాయి. దీని మూలాన మనకు ఒక దశలో ఆత్మహత్య చేసుకోవడం తప్ప గత్యంతరం కనిపించదు.

  11. Madhava Murthy Sankarabandi

    I read this book about 6 months back. It’s intense description of pain,hope of human perceptions. One has to see Shorie as the person who has taken task of bringing up his son in challenging atmosphere. I guess Shorie says there is lot pain in our life than happiness with so many philosophers experiencing it. Philosophically speaking when a rat is killed by cat to satify it’s hunger, the pain rat undergoes when gets killed is more than the pleasure when cat has it’s meal. In our lives, we experience more pain/unhappiness than happiness. But the pleasure has it’s reach, it will make all the sufferings insignificant.

    ( How to select Telugu lipi From this website)

    1. SIVARAMAPRASAD KAPPAGANTU

      ఈ సైటులో తెలుగు వ్రాసే సౌకర్యం లేదనుకుంటాను. మీరు సైటులోకి వెళ్ళి అక్కడాడ పైన బాక్సులో అంగ్లంలో వ్రాస్తే కింది బాక్సులో తెలుగులో వస్తుంది. గూగుల్ ట్రాన్స్‌లిటరేషన్ కంటె బాగా ఉన్నది. లేఖిని మన తెలుగు వ్రాత లాజిక్‌కు సరిగ్గా సరిపోతుంది.మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఆంగ్లంలో టైపు చేసి తెలుగులోకి తెచ్చుకోవచ్చు.

    2. SIVARAMAPRASAD KAPPAGANTU

      Sorry in my comment I have not given the name of the site where you can type in English to get Telugu equivalent:

      Lekhini.org

  12. తాడేపల్లి

    నా మాటలపై మీరు చేసిన వర్ణనకి Tautology సరైన పదం కాదనుకుంటాను. ఒకటి గమనించండి. ఏది exceptionalo నిర్ణయించుకొని మనం ప్రార్థన చేయం. మనం జస్ట్ ప్రార్థన చేస్తామంతే !

    దేవుణ్ణి ఒప్పించే ప్రయత్నం చేయడానికే ప్రార్థన, తపస్సు అని పేరు. Exceptions గుఱించి కాదు నేను ఇక్కడ ఒప్పించడం మనేమాట వాడింది. మీరు అలా తీసుకున్నారు. Nature course ని ఆపవలసిందిగా భగవంతుడితో చెప్పడం గుఱించి నేనా మాట వాడాను. అలా ఒప్పించడానికి ప్రయత్నించడం వఱకే మన పని. అది exceptional అవునో కాదో తేల్చేది మనం కాదు.

    సాధారణంగా నాలుగు సందర్భాల్లో దేవుడు ప్రార్థనలతో కన్విన్స్ అవుతాడు. ఒకటి – ఆ ప్రార్థన భక్తుడికి గానీ, అతని సంబంధీకుల గుఱించీ గానీ కానప్పుడు. రెండోది – ఆ ప్రార్థనాసారాంశం తన Macro plan లో ఇముడుతుంది అనిపించినప్పుడు. మూడోది – కొన్ని వేలమంది ఒకేసారి ఒకే విషయం గుఱించి ప్రార్థన చేసినప్పుడు. నాలుగోది – ఆ ప్రార్థనాసారాంశం ఆ భక్తుడి కర్మఫలానికి అనుగుణంగా ఉందని ఆయన భావించినప్పుడు. ఇలాంటి సందర్భాల్లో ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఈ మూడూ కాని సందర్భాల్లో కూడా కన్విన్స్ అవుతాడు కానీ దాని ఫలితం చాలా ఆలస్యంగా కనిపిస్తుంది.

    ఇవి అనుభవం ద్వారా మనం తెలుసుకున్న చిల్లఱ నియమాలే. కానీ వాస్తవంగా ఆయనకి నియమాలేమీ లేవు. అవి ప్రకృతికి మాత్రమే ఉన్నాయి. కొన్నిసార్లు ఏ కారణమూ లేకుండానే ఆయన కొంతమందిని కుండపోతగా అనుగ్రహించడం కూడా ఉంది. “ఇది ఆయన పసిహృదయం” అని రామకృష్ణపరమహంస పేర్కొన్నారు.

    1. Srinivas Vuruputuri

      మీరన్న మాటలు, నేనన్న మాటలు వరుసగా పేర్చుకొని చూస్తే… మీ మాటల్ని నేను అన్వయించుకున్న తీరులో కొంత గందరగోళం ఉందనిపించింది. అయితే నేను tautology అనే మాట వాడింది దేవుణ్ణి exception ఉందని ఒప్పించడం గురించి కాదు. ఏది exception అవుతుందో ఎలా తేలుతుందన్న దాని గురించి. సరే…. దీన్నింక పొడిగించను. 🙂

      రామకృష్ణ పరమహంస సంభాషణలు చదువుతూ ఉంటే ఆయన సరళత్వం, నిష్కాపట్యం తెలిసిపోతూ ఉంటాయి. ఆయన ఉపమానాలు ఎంతో బావుంటాయి. ఆయన్నీ, రమణ మహర్షినీ అంతగా గౌరవిస్తూనే దేవుడి మీద అంత కోపం చూపించడం ఓ పెద్ద వైరుధ్యం ఈ పుస్తకంలో కనబడే అరుణ్ శౌరిలో.

  13. తాడేపల్లి

    మిమ్మల్ని ఒప్పించాలని కాదు. నాకు జ్ఞాపకం వచ్చినది వ్రాస్తున్నాను. బెంగుళూరులోని National Institute of Mental Health and Neurosciences లో మనోవైద్యుడుగా పనిచేసిన డాక్టర్ సి.ఆర్. చంద్రశేఖర్ గారు అనేకమైన వాస్తవ కేస్ అధ్యయనాల్ని క్రోడీకరించి 1995 లో ’పునర్జన్మ ఎష్టు నిజ ?’ అని ఒక కన్నడ పుస్తకం వ్రాశారు. దొఱికితే చదవండి. ఆయన ఆ పుస్తకంలో తఱచుగా శ్రీమతి సత్వంత్ పస్రీచా అనే పరిశోధక డాక్టర్ మాటల్ని ఉటంకించడం కనిపిస్తుంది. ఆవిడ దృష్టికి144 పునర్జన్మ కేసులు వచ్చాయట.

  14. తాడేపల్లి

    శ్రీ అరుణ్ శౌరిగారు ఏం వ్రాశారో తెలియకుండానే ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. మన్నించగలరు. ఒక విషయం చెప్పాలనిపించింది. తర్కంతో జన్మల్ని తెలుసుకోలేరు. మన తర్కం ఎల్లప్పుడూ self-serving and self-sustaining. ప్రతితర్కానికీ ఎంతో కొంత స్వానుభవం కావాలి. అదీ గాక తర్కం info inputs మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కొత్త snippet of info తోనూ మన తర్కం మారిపోతుంది. పుట్టినప్పట్నుంచీ కళ్ళు లేనివాడికి ఎంత తర్కం చేసి చెప్పినా రంగులనేవాటిని ఎలాగైతే బోధపఱచలేమో అలాగే ఇది కూడాను. కానీ పూర్వజన్మల్ని తెలుసుకునే పద్ధతులున్నాయి. ఎవఱికి వారు ఇతరుల సహాయం లేకుండానే తెలుసుకునే పద్ధతులున్నాయి. కానీ పుణ్యబలం తక్కువగా ఉన్నవారూ, లేదా గుండెధైర్యం తక్కువగా ఉన్నవారూ వాటి గుఱించి తెలుసుకుంటే చాలా మనోవ్యథకి లోనవుతారు. క్రుంగిపోతారు. కనుక ప్రతివారికీ అది శ్రేయస్కరం కాదు. కనుకనే ప్రకృతి ఆ పరిజ్ఞానాన్ని సామాన్యమానవులకు ఉపసంహరించింది. అంతమాత్రాన జన్మలు లేవనుకోవడం సరికాదు. జన్మలు లేకపోతే కర్మసిద్ధాంతం లేదు. కర్మసిద్ధాంతం లేనప్పుడు ధర్మాధర్మ వ్యత్యాసం కూడా లేదు. అది లేదు గనుక దేవుడు కూడా లేడు. ఏ జీవీ శూన్యంలోంచి వచ్చినది కాదు. అలాగే ఏ జీవీ శూన్యంగా మారబోవడం లేదు. ప్రతిదానికీ ఒక బ్యాక్ గ్రౌండూ, ఒక ఫోర్ గ్రౌండూ తప్పనిసరిగా ఉన్నాయి. ఉంటాయి. ఈ మాట స్పష్టమని అనిపిస్తే సరే, లేకపోతే వదిలేయండి.

  15. తాడేపల్లి

    మాయ అంటే లేనిదని కాదు. ఈ పదాన్ని magic అని illusion అని కూడా అనువదించినవారున్నారు. అలాంటిది చదివినప్పుడల్లా నాకు నవ్వొస్తుంది. మాయ అంటే పరస్పర విరుద్ధమైన వాస్తవాలు కలిగినదనీ, తాత్కాలికమైనదని అర్థం. ఒక స్థితిలోంచి వేఱే స్థితిలోకి వెళ్ళాక గడిచిపోయిన స్థితి మాయ అవుతుంది. కానీ ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితే సర్వస్వంగా శాశ్వతంగా అనిపిస్తుంది.

    మాయ అనేది ఒక సిద్ధాంతం కాదు. అది ఒక ప్రతిపాదన కాదు. వర్తమాన జీవన వాస్తవానికి ఇస్తున్న వివరణ అంతకంటే కాదు. చాలామంది ఇక్కడే పప్పులో కాలేస్తారు. కాలేసి దాని మీద తిరగబడతారు. మాయ అనేది – ఆధ్యాత్మిక సాధనలో చాలా చాలా ముందుకెళ్ళి సిద్ధి పొందిన తరువాత ప్రపంచం సాధకుడికి కనిపించే స్థితి. అది ప్రాచీన సిద్ధులు తమ శిష్యుల కోసం గ్రంథస్థం చేశారు. మన కోసం కాదు. అది నిజానికి రహస్య విద్య. దురదృష్టవశాత్తూ ఎలాగో అది ఆ పుస్తకాలతో పాటే పబ్లిక్ లోకి జాఱుకొని వచ్చి విమర్శలకు గుఱవుతోంది.

  16. తాడేపల్లి

    ఇంకా ఆలోచనాప్రక్రియలో నడుస్తున్న విషయాల్ని పుస్తకరూపంలో వెలువఱించడం వాంఛనీయం కాదు. ఈ విషయంలో నేను శ్రీ అరుణ్ శౌరిగారిని కొంచెం తప్పుపట్టడానికి సాహసిస్తాను. దీని వల్ల ఆలోచనల పురోగతికి అంతరాయం వాటిల్లుతుంది. ఎందుకంటే జనం ముద్రితాక్షర రూపంలో ఉన్నదాన్ని ప్రక్రియలో ఉన్నదానిగా భావించరు. అది అంతిమ పిండితార్థమనే చూస్తారు. అదీ గాక ఈ ప్రపంచంలో ఎంత అపరిణత ఆలోచనకైనా కొంతమంది భావసారూప్య వ్యక్తులు దొఱుకుతారు. వాళ్ళంతా కలిసి ఒక అపరిణతుల క్లబ్బుగా ఏర్పడతారు. ఇలా అపరిణతత్వం ఒకసారి సిద్ధాంతమయ్యాక వాళ్ళ మధ్య చర్చలు కూడా సరైన దిశలో సాగవు.

    భగవంతుణ్ణి బోనులో నిలబెట్టడం….. చాలా పెద్దమాట. ఎంతెంత మాటలూ ముందూ వెనకా చూడకుండా వాడేస్తున్నారు. బహుశా ఇది ఈ తరం లక్షణమేమో !

    ముందు ఇది అర్థం చేసుకోవాలి అందఱూ. God operates on the Least Intervention principle. ప్రకృతి ప్రపంచ పరిపాలన కోసం కొన్ని చట్టాలు చేసుకుంది. వాటిల్లో ఆయన జోక్యం చేసుకోవడం చాలా చాలా అరుదు. జోక్యం చేసుకోవడానికి, ప్రకృతిని పక్కకి తొలగమని శాసించడానికి తగినంత బలమైన exceptional కారణం కనిపించాలి ఆయనకి ! ఆ కారణం ఉందని మనమాయన్ని ఒప్పించగలగాలి. మానవులుగా మనవి Micro plans. భగవంతుడికి Macro plans ఉంటాయి. Micro లో ఎదురయ్యే ఇబ్బందుల్ని Macro లో అలా పరిగణించరు. రెండోది, అంతమాత్రాన భగవంతుడు పట్టించుకోవడం లేదనేది సరికాదు. ఆయన ప్రతి జీవికీ నీడలా వెన్నంటే ఉన్నాడు. ఆయనకి అన్నీ చక్కగా వినపడుతున్నాయి. అన్నీ చూస్తున్నాడు, ఈ పుస్తకం డాట్ నెట్ లో వ్యాసమూ, వ్యాఖ్యలతో సహా ! ఆయన మంచి నెటిజెన్. నిజానికి మనం అనుభవిస్తున్నామని అనుకుంటున్నవన్నీ ఆయనే అనుభవిస్తున్నాడు.

    కర్మ అనేది ప్రకృతి చట్టాల్లో ఒకటి. అందుకే ఆ సహజ ధర్మానుసారం అది సమాజ చట్టం కూడా అయింది. పని చేసినందుకు జీతమడుగుతున్నాం గదా అందఱమూ ! తప్పు చేసినవాడికి శిక్షపడాలని డిమాండ్ చేస్తున్నాం కదా ? ఇదంతా కర్మసిద్ధాంతమే. జన్మలనేవి ఆ కర్మచట్టాన్ని అమలు జఱపడానికి ఆధ్యాత్మిక స్థాయిలో ప్రకృతి ఎంచుకున్న వ్యవస్థ. జన్మలు తప్పకుండా ఉన్నాయి. ఏం కాబోతున్నానో నాకు తెలుసు. ఏమీ అనుకోకపోతే ఒక మాట. ఈ ప్రస్తావన మీద ఇంత లావుపాటి పుస్తకాలు అవసరం లేదు. ఇక్కడ విషయం చాలా సరళం. అది ఆపరేట్ అయ్యే విధానం కూడా చాలా సరళం, దాని వెనక ఉన్న ప్రిన్సిపుల్స్ సాధారణ అవగాహనస్థాయికి చాలా సంకిష్టమైనప్పటికీ ! ఎంత మహోన్నత ఉటంకింపులూ, గ్రంథపఠనాలూ కూడా స్వీయ అన్వేషణకి, ఆచరణకీ సాటిరావు. గురూపదేశం లేని గ్రంథపఠనం నాస్తికత్వానికీ, శూన్యవాదానికీ దారితీస్తుంది.

    1. Purnima

      >> “. బహుశా ఇది ఈ తరం లక్షణమేమో ! ”

      అయినదానికి, కానిదానికి “ఈ తరాన్ని” అనటం, బహుశా “ఆ తరం”వారి అలవాటు అనుకుంటాను.

    2. Srinivas Vuruputuri

      బాలసుబ్రహ్మణ్యం గారికి

      మీ రెండు వ్యాఖ్యలకు కలిపి ఒకే జవాబు రాస్తాను.

      1. ఆలోచనలన్నీ ఓ కొలిక్కి వచ్చాకే రాయకుండా ఓపిక పట్టడం మంచి పనే. అయితే అదంత ఈజీ కాదేమో… 1979లో కాబోలు, అరుణ్ శౌరి Hinduism – Essence and Consequences అనే పుస్తకం రాసాడు. ఇప్పుడు తనకి డెబ్బై ఏళ్ళుంటాయేమో… దుఃఖ కారణాల గురించి మరో పుస్తకం తనకి రాయాలనిపిస్తే – తనకు తోచినదేదో నిజాయితీగా చెప్పాలనిపిస్తే – అది అర్థం చేసుకోదగ్గదిగానే అనిపిస్తుంది. పాఠకులు వారి వారి సంస్కారాన్ని బట్టి దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అచ్చులో చదివినదల్లా అంతిమ వాక్యమని అనుకునేవాళ్ళు అల్పసంఖ్యాకులనే అనుకుంటాను. కొంత ఆలోచింపజేయడం, చర్చకు కొంత అవకాశం కలిగించడం, కొత్త ఆలోచనలకు తలుపులు తెరిచే ఉంచడం – ఇవీ రచయిత ఉద్దేశ్యాలని అనుకుంటాను.

      2. “దేవుణ్ణి బోనులో నించోబెట్టడం” నా రాతలోని flippancy/అపరిణతి, అంతే!

      3. “విశ్వచలన సూత్రాలను ఏర్పరచాక దేవుడు ఎప్పుడో తప్ప ప్రకృతి పని తీరులో కలగజేసుకోడు” అని మీరన్నప్పుడు ఈ పుస్తకంలోని టాగోర్ వాదన గుర్తుకు వచ్చింది నాకు.

      “అసాధారణ సందర్భాల్లో కలగజేసుకుంటాడు. మనమున్నది అసాధారణ సందర్భమని మనమాయన్ని ఒప్పించాలి” అన్న్నప్పుడు మీ వాదన గాంధీ tautological argumentలా వినిపించింది. దేవుడు ప్రకృతి నియమాలను ఎప్పుడు జరుపుతాడు? Exceptional సందర్భాలలో. ఫలానా సందర్భం exceptional అని మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు ప్రకృతి నియమాలను పక్కకు జరిపినప్పుడు.

      4. కర్మ సిద్ధాంతం గురించి శౌరి చాలా చెప్పారు. చదివి చర్చించాల్సింది చాలానే ఉంది అందులో. పునర్జన్మలను ఒప్పుకోరన్న మాట నిజం. ఒప్పుకోకపోవడానికి తార్కిక కారణాలనే చూపించారు. “తర్కానికి పరిమితులుండవా?” అంటే అది వేరే సంగతి. 🙂

      5. మాయ గురించి మీరిచ్చిన వివరణ నాకు నచ్చింది. అది ఎందుకు “రహస్య విద్య” అయ్యిందో, ఎందుకు పబ్లికులోకి జారి వచ్చిందో తెలియదు కానీ అయిన దానికీ కానిదానికీ వాడి ఆ మాటకి అర్థం మార్చేసినట్లున్నాము.

      మీ శ్రీనివాస్

  17. జంపాల చౌదరి

    Very well written!
    Thank you.

  18. Srinivas Nagulapalli

    Thanks Srinivas garu for sharing an objective and heart-rending review.

    Hope we learn more and soon about the causes and in turn cure the cerebral palsy-
    one of the most debilitating and devastating diseases afflicting many still.

    Considering the number of bacteria, viruses, potential infections and harm that can
    attack us any time or all the time, and if one tries to calculate probability of life amidst innumerable factors against it, it is hard to arrive at a number any greater than zero.
    Wonder if the question instead should be, not why a particular disease, how life and health is possible! It seems astonishing and a greatest miracle of miracles that people
    live, and many for most part even enjoy health.

    Title of book is a question and it seems to leave reader too with more questions.
    “Does He know a mother’s heart?” presupposes it is a He, not a She. Also odd to read that book talks about Ramakrishna Paramahamsa for whom it was only She- Mother.
    If he considers the possibility of omniscient God, and then asks Him why and hunts for motives, it assumes ability to figure out the mind of that omniscient one- a contradiction.
    More questions.
    ===========
    Regards
    -Srinivas

    1. Srinivas Vuruputuri

      శ్రీనివాస్ గారికి

      ఓపిగ్గా చదివి మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు కృతజ్ఞతలు.

      1. భగవంతుడు పరిపూర్ణుడని భావించే పక్షంలో భగవంతుడి సృష్టిలో అనారోగ్యాలే ఉండకూడదు కదా. 🙂

      2. జగత్పితయో, జగన్మాతయో… మనిషిని పోలి (anthrapomorphic) ఉంటాడనో, ఉంటుందనో కదా మనందరి నమ్మిక? :-).

      3. “సర్వజ్ఞుడైన దేవుడిని అర్థం చేసుకోగలనుకోవడం…” “God’s inscrutable will” argument, again! 🙂

      మీ శ్రీనివాస్

  19. సురేశ్ కొలిచాల

    చాలా చక్కగా రాసావ్ శ్రీనివాస్! కొన్ని వాక్యాలకు తెలుగు అనువాదం చాలా గొప్పగా ఉంది. దేవుణ్ణి బోనులో నించోబెట్టి అడిగిన ప్రశ్నలకు తెలుగు సేత చదవడానికి హాయిగా ఉంది. ఈ పుస్తకంలో లైబ్‌నిట్జ్‌ రాసిన Theodicy గురించి గానీ, ప్రపంచంలోని దుఃఖానికి, వైపరీత్యాల గురించి (The Problem of Evil) ఇతర తత్త్త్వవేత్తల అభిప్రాయాలేమైనా అరుణ్ శౌరి ఉటంకిస్తాడా?

    అయితే ఈ సమీక్షలో కొన్నిచోట్ల ఏవి అరుణ్ శౌరి అభిప్రాయాలో, ఏవి సమీక్షకుని అభిప్రాయాలో తెలియటంలేదు.

    ‘ఉన్నది చూస్తున్నామా? చూస్తున్నాము కాబట్టి ఉన్నదనుకుంటున్నామా?’ అన్న సమస్య తత్త్వశాస్త్రంలో చాలా మౌలికమైనదంటారు కానీ నాకందులో అంతుబట్టనిదేమున్నదో అర్థం కాదు. “స్వప్నావస్థకీ, జాగ్రదవస్థకీ అట్టే తేడా లేదు”,”నేను (అహం) లేనప్పుడు లోకమే లేదు” అని పదే పదే రమణ మహర్షి చెబుతూ ఉంటే “ఎందుకింత మొండి, ఈయనకి?” అనుకునే వాణ్ణి.

    రమణ మహర్షి అభిప్రాయాలు నాకంతగా తెలియవు కానీ, Idealism గురించిన సిద్ధాంతాలు, దానిపై వచ్చిన విమర్శలు, ప్రతి-సిద్ధాంతాలు చదివితే తత్త్వశాస్త్రంలో ఈ ప్రశ్న ఎందుకు మౌలికమైనదో తెలుస్తుందనుకుంటాను.

    చాలావరకు అనువాదాలు బాగున్నా, వ్యాసం చివర్లో ధమ్మపదంలో శ్లోకం ఉటంకించిన వాక్యాలు కొంత హడావుడిగా రాసినట్టుగా అనిపించాయి. ధమ్మపదంలో శ్లోకం ఇది:

    అనుపుబ్బేన మేధావీ, థోకథోకం ఖణే ఖణే;
    కమ్మారో రజతస్సేవ, నిద్ధమే మలమత్తనో. —ధమ్మపద 239

    ఈ శ్లోకానికి నాకు తోచిన pseudo-సంస్కృత సేత:

    అనుపూర్వేన మేధావి, స్తోక్యస్తోక్యం క్షణే క్షణే
    కర్మకారో రజతస్తేవ నిర్ధమే మలమత్తనో(?)

    తెలుగు సేత:
    వెండి మలినాలు కమ్మరి తొలగించినట్లు
    ప్రతిక్షణము కొంత కొంత
    (or అవిశ్రాంత పరిశ్రమతో)
    మేధావి తొలగించు తనలోని దోషాలు

    1. Srinivas Vuruputuri

      పూర్ణిమ గారికి, సురేశ్ గారికి, జంపాల చౌదరి గారికి – ఈ పుస్తక పరిచయాన్ని చదివి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

      సురేశ్, మీ ప్రశ్నలకు జవాబులివిగో:

      1. శౌరి Leibnizని ప్రస్తావించలేదనుకుంటా. Removing the Props అనే అధ్యాయం(పైన పేర్కొన్న “నాస్తిక ప్రకరణం”)లో ఫిలాసఫర్‌లు లేవనెత్తిన ప్రశ్నల ప్రస్తావన ఉంది. లింకులు పంచుకున్నందుకు థాంక్స్.

      2. మీరు ఉటంకించిన “కన్‌ఫ్యూజన్” వాక్యాలు నావే. ఇంకాస్త స్పష్టంగా రాయాల్సింది నేను. Idealism (భావవాదం) గురించి నండూరి వారి విశ్వ దర్శనంలో కొంత చదివాను. ఇంకా చదవాలి.

      3. చివర్లో కొంత హడావుడిగా రాసిన మాట నిజమే. ధమ్మపదం శ్లోకానికి శౌరి అనువాదం సరిగానే ఉంది (As the sliversmith removes impurities from silver so the wiseman from himself – one by one, little by little, again and again).

      మీ “pseudo-సంస్కృతానువాదం” చాలావరకు సరిపోయింది. పుల్లెల శ్రీరామచంద్రుడిగారి అనువాదం దిగువన ఇస్తున్నాను:

      “అనుపూర్వేణ మేధావీ స్తోకం స్తోకం క్షణే క్షణే
      కర్మారో రజతస్యేవ నిర్ధమేత్మలమాత్మనః”

      మరోసారి కృతజ్ఞతలతో
      శ్రీనివాస్

  20. Purnima

    This is a tough book to read. Much tougher to write about. Kudos to you, for having come up with a beauty.

Leave a Reply