దొంగదాడి కథ -3

(మొదటి భాగం ఇక్కడ, రెండో భాగం ఇక్కడ)
******
ఈ పుస్తకం ఆఖరు భాగంలో, శ్రీశ్రీ మహాసంకల్పం (మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం అంటూ ముగిసే ఈ గీతం 1947 ఆగస్టు 15న మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారం అయింది), ఎలమర్రూ –కాటూరూ అనే హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ గీతానికి అనువాదం, ఇంకొన్ని శ్రీశ్రీ కవితలు, ఒక ఇంటర్వ్యూ ఉన్నాయి. 1955, 56ల్లో వ్రాసిన రెండు కవితల్లో తనమీద దాడిచేసినవారి మీద విసుర్లున్నాయి. వాటిల్లో Les Neiges D’Antans అనే కవితలో కొన్ని పంక్తులు ప్రసిద్ధం.:

ఏరి తల్లీ నిరుడు మురిసిన
ఇనుప రచయితలు?

కృష్ణశాస్త్రపు టుష్ట్ర పక్షీ
దారి తప్పిన నారి బాబూ
ప్రైజు ఫైటరు పాపరాజూ
పలక రెంచేత?

ప్రజాస్వామ్యపు పెళ్ళికోసం
పండితా నారాధ్యుడాడిన
వందకల్లల పంది పిల్లల
అంధపత్రిక ఎక్కడమ్మా

ఎక్కడమ్మా ఎలక గొంతుక
పిలక శాస్త్రుల పనికి మాలిన
తలకు మించిన వెలకు తగ్గిన
రణగొణ ధ్వనులు?
ఏవి తల్లీ నిరుడు మురిసిన
హిమ సమూహములు?

(ఇది శ్రీశ్రీదే ఇంకో ప్రసిద్ద కవితకి పేరఢీ అని మీరు గుర్తు పట్టే ఉంటారు. శ్రీశ్రీ ప్రస్థానత్రయంలో ఆంధ్రపత్రిక అని ఉంది కాని, ఈ పాఠమే సరయిందని ఈ విషయాలెరిగిన మిత్రులు చెప్పారు. ఈ కవితలో ప్రయోగాలతో పాటు, “ఫౌల్ చేసి, గోల్ చేసి గెలిచిన ప్రతీపశక్తులు పట్టపగ్గాలు లేకుండా విజృంభిస్తున్నాయి” అంటూ అభ్యుదయ రచయితల మహాసభ అధ్యక్షోపన్యాసంలో అన్న మాటలూ బాగా ప్రసిద్ధి పొందాయి).

***

ఈ పుస్తకానికి అయిదు ముందు మాటలు ఉన్నాయి.

ఈ పుస్తకం ప్రచురించవలసిన అవసరాన్ని “ప్రకాశంగా” చెప్పారు, సంకలనకర్త విశ్వేశ్వరరావు. ఆమోద రూపకల్పన (manufacturing consent) అంటూ ఎన్.వెంకయ్య, విజయవాడ (ఈయన ఎవరో నాకు తెలీదు) 1955లో పరిస్థితులకు 2005లో పరిస్థితులకు ఉన్న సామ్యాన్ని చూపి, ఈ పుస్తకం చదవవలసిన అవసరం గురించి చెప్పారు. ఎప్పటికీ శ్రీశ్రీ అంటూ సహవాసి (అనువాదకుడు, పాత్రికేయుడు, చనిపోయారు), ఒంటరి యోధుడు చిరంజీవి అంటూ కె.ఎన్.వై. పతంజలి (రచయిత, పాత్రికేయుడు, చనిపోయారు), ఆంధ్రలో 1955 ఎన్నికలు – పూర్వాపరాలు అంటూ చలసాని ప్రసాద్ (విరసం నాయకులు) అప్పటి పరిస్థితులను వివరించారు. “భావాల్ని చంపే తుపాకులు” పుట్టలేదు అంటూ భావవిప్లవాల గురించి మోహన్ (చిత్రకారుడు) వ్రాశారు.

***

ఈ పుస్తకంలో విషయాల గురించి నా అభిప్రాయాలు చెప్పేముందు ఈ పుస్తకం గురించి కొన్ని మాటలు-

చారిత్రక పత్రాలను ఒకచోట పోగు చేసి తరువాత తరాలకు అందజేసిన ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. మిత్రులు, సాహితీ మిత్రులు, శ్రీశ్రీ (ప్రింటర్స్) విశ్వేశ్వరరావుగారు ఈ పుస్తకాన్ని ప్రచురించటానికి ఎంత తపన పడి ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో నేను ఊహించగలను. ఆయన చేసే అన్ని పనుల్లోనూ కనిపించే నిజాయితీ, సమగ్రతకోసం ప్రయత్నం ఈ పుస్తకంలోనూ కనిపిస్తాయి. ఆయనకు నా ధన్యవాదాలు.

ఇటువంటి పుస్తకాలకు మూలపత్రాలతో పాటు, ఆ పత్రాల చారిత్రక సందర్భాన్ని (context) పాఠకులకు పరిచయం చేసే పరిష్కర్త / సంపాదకుడు చాలా అవసరం. అలాంటి పరిష్కర్త /సంపాదకుడు లేని లోటు నాకు ఈ పుస్తకంలో బాగా కనిపించింది. కనీసం, ముందు మాట వ్రాసేవారైనా పరిస్థితులను, పాత్రధారులను విపులంగా, విశదంగా వివరిస్తే బాగుండేది. ముందు మాట వ్రాసిన వారెవరూ ఆ పనిని చేయలేదు. 1955 ఎన్నికలు – పూర్వాపరాలు అన్న శీర్షికతో వ్రాసిన చలసాని ప్రసాద్ గారు కూడా ఆ పనిని సమగ్రంగా, పద్ధతిగా చేయలేదు. పుస్తకమంతా చదివాక కూడా కొన్ని మౌలికమైన విషయాలు (ఉదా: ఎన్నికలు ఏ తేదీలలో జరిగాయి; ఎవరికి ఎన్ని వోట్లు వచ్చాయి వంటి విషయాలు) కూడా తెలిసే అవకాశం తక్కువ. కొ.కు వ్యాసంలో చదవకపోతే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో కూడా తెలిసేది కాదు. అయిదు అసమగ్రమైన ముందుమాటలకన్నా, ఒక విపులమైన ముందుమాట, పాదపీఠికలు, సూచిక (index) ఈ పుస్తకం విలువను మరింత పెంచేవి. ముందు మాటలు వ్రాసిన వారందరూ నాకు ఇష్టులే ఐనా, ఒక మాట చెప్పాలి. ప్రతి ముందుమాటలోనూ శ్రీశ్రీ గొప్పతనాన్ని పొగడటం, ఆంధ్రపత్రికనీ, పండితారాధ్యులనీ, నార్లనీ తిట్టటం ఒకే పాటని వేరు వేరు గాయకులు ఒకే రాగంలో కొద్దిగా సంగతులు మార్చి పాడటమే కాని, వైవిధ్యం చాలా తక్కువ. కొత్తగా చెప్పిన విషయాలేమీ లేవు. “ఒంటరిగా నిలబడి మత్స్య యంత్రాన్ని ఛేదించిన వీరుడు శ్రీశ్రీ” లాంటి పొగడ్తలు అభిమానాన్ని వెలిబుచ్చవచ్చు కానీ తరచి చూస్తే డొల్లగా అనిపిస్తాయి (ఈ ఎన్నికలు పూర్తి అయేపాటికి శ్రీశ్రీ మానసిక అస్వస్థతకు లోనయ్యాడు; ఆయన పార్టీ అనుకోని దెబ్బ తిన్నది – ఇప్పటికీ కోలుకోలేదు). చరిత్ర పుస్తకాల పీఠికలలో ఉండవలసినది పొగడ్తలు కాదు – వాస్తవాలు, వివరాలు. ఈ పుస్తకాన్నే తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు; చారిత్రక ప్రాముఖ్యత ఉన్న విషయాలు ఉండే తెలుగు పుస్తకాలన్నిటిలోనూ దాదాపు ఇదే పరిస్థితి. చరిత్రకారుల మేధోబద్ధకం, అవసరాన్ని మించిన పొగడ్తలు, తెగడ్తలు, ఉద్వేగాలు, నిజవిషయాలు క్రోడీకరించటంలో నిర్లక్ష్యం వల్ల మన చరిత్రను తెలుసుకొని, అర్థం చేసుకొనే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం.

పుస్తకం చదువుతుండగా చాలాసార్లు ఇంకొన్ని పత్రాలు కూడా చేర్చగలిగితే ఇంకొంత సమగ్రంగా ఉండేది అనిపించింది. ఉదాహరణకు, ఆంధ్రపత్రిక వారు పాఠకులను తమ అభిప్రాయాలను పంపమని ఎలా ప్రకటించారు? ‘లక్ష్య ప్రకటన’ ఆంధ్రప్రభలోనూ ఆంధ్రపత్రికలోనూ ఒక్కలానే వచ్చిందా? ఆరుద్ర ఉత్తరం విశాలాంధ్రలోనూ, ఆంధ్రపత్రికలోనూ కూడా వచ్చిందా? వుడ్‌లాండ్స్ హోటల్ తీర్మానం అసలు ప్రతి ఫొటోలో దేవులపల్లి తుడుపులూ, కొట్టివేతలూ ఉన్నాయా? ఆంధ్రప్రభ అచ్చువేసిన తీర్మానానికి, అసలు ప్రతికీ తేడా ఉందా? ఇలాంటివి ఇంకెన్నో ప్రశ్నలు వచ్చాయి. కొన్నివిషయాలకు ప్రచురించిన తేదీ ఇచ్చారు, కొన్నిటికి ఇవ్వలేదు. ఒకే పద్ధతి పాటించి ఉంటే బాగుండేది. ఇటువంటప్పుడే మంచి సంపాదకుడి అవసరం కనిపించేది.

ఇలా మిగిలేం పుస్తకంలో కమ్యూనిస్టు వ్యతిరేక కవితలు వ్రాసిన బాదర్ అనే కవి నిజనామం ఏమిటి అన్న చర్చ ఉన్నట్టు, చలసాని ప్రసాదరావుగారికి బాదర్ మీద చాలా కోపం ఉన్నట్టు గుర్తు. ఈ పుస్తకంలో ఆ కవి పేరు ఎక్కడా లేదు (ఒక్క ఆరుద్ర చిరునామాలో తప్ప – ఆయన ఉన్నది రాజా బాదర్ వీధిలో).

పుస్తకం ముఖపత్రం బాగుంది. అట్టపై ఉన్న ఫొటో: 1955 మధ్యంతర ఎన్నికల సందర్భంగా బెజవాడ పత్రికాగోష్ఠిలో – సుందరయ్య, అజయ్ ఘోష్, శ్రీశ్రీ. లోపలకూడా కొన్ని శ్రీశ్రీ ఫొటోలు ఉన్నాయి. మొదటి పేజీకి శ్రీశ్రీ ఆః కవిత (నిప్పులు చెరుగుతూ నింగికి నే నెగిరిపోతే…) చక్కగా అమరింది. నార్ల చిరంజీవికి ఈ పుస్తకం అంకితం ఇవ్వటమూ బాగుంది. వెనక పేజీలో పికాసో గుయెర్నికా చిత్రం అచ్చువేయటం అతిగానూ, అనుచితంగానూ అనిపించింది. ఈ పుస్తకానికి ముందు శ్రీశ్రీపై దొంగదాడి అని పేరు పెట్టినట్టు ఉన్నారు. మరి ఎందుకు మార్చారో?

పుస్తకాన్నివిశ్వేశ్వరరావుగారు, ఎప్పట్లానే, అందంగా ముద్రించారు. మొదట్లో దాదాపుగాలేని అచ్చుతప్పులు నెమ్మదిగా పెరిగాయి, మొత్తమ్మీద తక్కువే ఐనా.

***

ఇంతకూ ఇక్కడ దొంగదాడి నిజంగానే జరిగిందా? ఎవరు, ఎలా దొంగదాడి చేశారు? ఈ కథలో ఎవరు హీరోలు? ఎవరు విలన్లు?
నా ఉద్దేశంలో నిజంగానే ప్రణాళికాపూర్వమైన దొంగదాడి జరిగింది. హీరోలు విలన్లతో పాటు, ఒక విదూషకుడు – పోనీ వికటకవి, చాలామంది చిల్లర హాస్యగాళ్ళు కనిపించారు. కొన్ని హాస్య సన్నివేశాలు కూడా ఉన్నాయి.

దొంగదాడి అని ఎందుకు అనుకుంటున్నాను? కమ్యూనిస్టు రచయితలకు వ్యతిరేకంగా మిగతావారందరినీ ఏకం చేయాలని ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ సంపాదకులు విడివిడిగానో, కలిసో నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది. ఆ ప్రయత్నంలో వేసిన మొదటి బాణం ‘ఒక రచయిత’ ఉత్తరం. ఇది వ్రాసింది సంపాదకవర్గంలో మనిషి. దీన్ని అనామకంగా వేయటం సంపాదకుల ఉద్దేశాన్ని దాచిపెట్టి మభ్యపెట్టటమే. మొదటి ఉత్తరంలో పేరు పెట్టకుండా శ్రీశ్రీ చెప్పిన మాటలు వ్రాయడం రెచ్చగొట్టటానికి చేసిన ప్రయత్నమే. రెండవ ఉత్తరంలో ఒక రచయిత శ్రీశ్రీ మీద విరుచుకుపడిన తీరు కూడా ఆక్షేపణీయమే. అంతే కాక, నెలన్నరపాటు జరిగిన ఈ ఉత్తరాయణంలో అన్ని ఉత్తరాలూ (రెండు తప్ప) శ్రీశ్రీకి వ్యతిరేకంగానే వచ్చాయని, శ్రీశ్రీ అభిమానులెవ్వరూ ఆంధ్రపత్రికకి ఉత్తరాలు వ్రాయలేదని నమ్మటం కష్టం. ఆంధ్రపత్రిక సంపాదకులు శ్రీశ్రీకి అనుకూలంగా ఉన్న ఉత్తరాలు వెయ్యలేదని నా అనుమానం.

నా అనుమానం నిజమే అనిపించే ఆధారం నాకొకటి దొరికింది. ఆంధ్రపత్రిక ఆఖరు రోజున సంక్షిప్తీకరించి ప్రకటించిన ఉత్తరాలలో, నాకు బాగా తెలిసిన మిత్రుడి పేర ఒకే వాక్యంతో ఉన్న ఉత్తరం కనిపించింది. ఆ వాక్యం అభ్యుదయ రచయితల్ని విమర్శిస్తున్నట్టుగా ఉంది. నాకు తెలిసినంతమటుకూ నా మిత్రుడు శ్రీశ్రీ అభిమాని, వామపక్షపాతి. ఈ ఉత్తరం ఆయనది కాదేమో అని అనుమానించి ఆయన్నే అడిగాను. ఆ మిత్రుడి సమాధానం: “It is mine, but a very bad misquote. I was defending SrISrI in that letter about the rash comments made by some antagonists ‘on bombing Visakhapatnam and people running away.’ They cut the meat out and put the line I ridiculed the “progressive” poets of that time, who condemned SrISrI”. ఆంధ్రపత్రికవారు తమకు కావాల్సినవి మాత్రమే వేసుకున్నారు అనటానికి ఇది ఒక ఆధారం.

ఇక పద్మరాజు, నారాయణబాబుల ప్రకటన చూద్దాం. ప్రకటన చదివితే వెంటనే అర్థమయ్యే విషయం – కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులు; వారి దృక్పథం భారతీయాత్మకు వ్యతిరేకం. వారిని రచయితలు, కళాకారులు ఖండించాలి అని. ‘ఒక రచయిత’ మొదటినుంచీ రచయితల్ని అడుగుతున్నదీ అదే. మరి ఆ విషయం స్పష్టంగా చెప్పకుండా ముసుగులో గుద్దులాట ఎందుకు? వుడ్‌లాండ్స్ హోటల్ ప్రకటనలో ఉన్న ధ్వనికి, తరువాత విపులీకరించిన ప్రకటనలో ఉన్న ధ్వనికి చాలా తేడా ఉంది. ఆరుద్ర రెండవ తీర్మానానికి సమ్మతి తెలిపాడు అని వీరు నిజంగా భావిస్తే, మిగతావారి సంతకాలని అభ్యర్థిస్తూ వ్రాసిన లేఖలో ఆరుద్ర పేరు ఎందుకని లేదు? ఇది ఆరుద్రని వాడుకొని ఇరకాటంలో పెట్టటానికి చేసిన పని అనే నాకు అనిపించింది (ఆరుద్ర మొదట మాత్రం ఎందుకు సంతకం పెట్టాడు అన్న ప్రశ్న ఆయనను వెంటాడింది). ఎన్నికల ద్వారా అదికారంకోసం ప్రయత్నిస్తున్న ఒక పార్టీని ప్రజాస్వామ్య వ్యతిరేకపార్టీగా ముద్ర వేయడంలోనూ, వేల యేళ్ళుగా రాచరిక నియంతృత్వంలో ఉన్న దేశపు ఆత్మ ప్రజాస్వామికమని నమ్మించటంలోనూ, వీరు చూపిన చాకచక్యం అబ్బురాన్ని కలిగించింది.

ఈ తీర్మానం కమ్యూనిస్టు వ్యతిరేకుల మానసపుత్రిక అనే అనిపిస్తుంది. విపులీకరణలోనూ, రచయితల మహాసభ ఆలోచనను వదలివేయటంలోనూ నార్ల, శంభుప్రసాద్, పండితారాధ్యుల, పిలకా గణపతిశాస్త్రి వంటి వారందరి హస్తమూ ఉందన్న అభిప్రాయం బలంగా కలుగుతుంది. ఈ విషయంలో వారు పారదర్శకంగా ప్రవర్తించలేదు అని నా అభిప్రాయం. (లక్ష్య ప్రకటన మొదటి సమావేశంలో ముఖ్యపాత్ర వహించిన మొక్కపాటి వారి సంతకం ప్రకటన కోసం సంతకాలు కోరిన ఉత్తరంలోనూ, పత్రికాప్రకటనలోనూ లేకపోవటం వెనుక ఏమైనా మతలబు ఉందా?)

ఆంధ్రపత్రికలో నెలన్నరపాటు సంపాదకీయాలు, ఉత్తరాలు అన్నీ ఒక్కడి మీదే గురిబెట్టబడ్డాయి అన్నది విస్పష్టం. ఒక రచయితపైన పత్రికాముఖంగా, పత్రికాధిపతుల ఆమోదంతో, ఇటువంటి మూక ఉమ్మడి దాడి ఇంకెప్పుడూ ఎవరిపైనా జరగలేదనుకుంటాను. నార్ల చిరంజీవి దీన్ని వేటగా అభివర్ణించటంలో అతిశయోక్తి లేదు.

ఐతే తన వ్యతిరేకులకి తనమీద ఇలా దాడి చేయటానికి బహు లక్ష్యాలను ఇచ్చింది మాత్రం శ్రీశ్రీనే. ముందూ వెనుకా చూడకుండా పద్మవ్యూహంలోకి చొరబడిపోయి బయటకు రావటం తెలీక ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన అభిమన్యుడి మోస్తరు ఆయన నడవడి. ఒక రచయిత తన మొదటి ఉత్తరంలో శ్రీశ్రీ పేరు ఎత్త లేదు. ఆ ఉత్తరానికి జవాబు ఇవ్వవలసిన అవసరం నిజంగా శ్రీశ్రీకి లేదు. పోనీ జవాబు ఇచ్చి, మాస్కో విశ్వవిద్యాలయం విషయంలో ఒక రచయిత వేసిన దూడను చూపించాలని ఉబలాటం ఉంటే ఆ ఒక్క విషయం గురించి వ్రాసి ఉన్నా ఒకలా గుండేది. లేదూ, ఒక రచయితతోనూ, ఆంధ్రపత్రికతోనూ లడాయి పెట్టుకోవటానికి సిద్ధం అనుకుంటే ఒక రచయిత వాదాన్ని విపులంగా పూర్వ పక్షం చేయాలి, లేదా కనీసం తన వాదం ఏమిటో స్పష్టంగా, విశదంగా చెప్పాలి. శ్రీశ్రీ ఈ రెండు పనులు చేయలేదు. ఫ్రత్యర్థికి కావలసిన మార్గంలోకే చర్చను మళ్ళించాడు శ్రీశ్రీ; దీనికి తోడు నిజాయితీ ఉంటే నా ఉత్తరం ప్రచురించండి అని ఛాలెంజీ ఒకటి. అంబులపొదిలో ఉన్న బాణాలన్నీ తీసి తలో దిక్కూ వేసేశాడు. ఆయన మీద ఎగబడడానికి అవకాశం కోసం కాచుకుకూచున్న అందరికీ తన కవచంలో రంధ్రాల్ని చూపెట్టాడు. ఇంకేమీ, పొంచి ఉన్న ప్రతీపశక్తులన్నీ ఒక్కసారిగా మీదబడ్డాయి. పోనీ అప్పుడైనా వదిలేశాడా. లేదు. మళ్ళీ ఇంకోసారి చర్చలో దూరాడు. ఈ సారైనా తన వాదనను స్పష్టంగా చెప్పాడా అంటే అదీ లేదు. తిన్నగా ఒక దారిలో వెళ్ళకుండా, ప్రత్యక్షసంబంధం లేని అనేక విషయాలు ప్రస్తావిస్తూ సాగుతాయి ఈ ఉత్తరాలు. ఈ రెండు ఉత్తరాల్లోనూ కొంత అమాయకత్వమూ, కొంత అతితెలివీ కనిపిస్తాయి. అసలు విషయమేమిటంటే శ్రీశ్రీ గొప్ప కవే కాని, చర్చలో పాల్గొని అవతలి వ్యక్తి వాదంలో ఒక్కో విషయాన్ని తీసుకుని దాన్ని పూర్వపక్షం చేసి ఖండించి, తన వాదాన్ని స్పష్టంగా వినిపించే ఓపిక, క్రమశిక్షణ శ్రీశ్రీకి లేవు. శ్రీశ్రీ ఉత్తరాలను, ఆరుద్ర, నార్ల చిరంజీవిల ఉత్తరాలను పోల్చి చూస్తే ఈ తేడా స్పష్టంగా తెలుస్తుంది. సంచలనాత్మకమైన మాటలు కొన్ని అనేసి, నేనన్నవి నేను అనేశాను, మీ చావు మీరు చావండి అన్న శ్రీశ్రీ మోడస్ ఆపరాండి ఇక్కడ బెడిసికొట్టింది. ఈ దాడిలో గాయాలు ప్రత్యర్థులు చేసినవే కావు; స్వయోఘాతాలు కూడా చాలా ఉన్నాయి. అవతలివారు “ఫౌల్ చేసి గోల్ చేసిన” మాట నిజమే ఐనా, శ్రీశ్రీ సెల్ఫ్ గోల్స్ కూడా నష్టం కలిగించాయి. అందుకే ఈ ప్రకరణంలో ఆయన విదూషకుడు, వికటకవి లేదా అమాయక విషాద నాయకుడు. కవిగా శ్రీశ్రీపై నాకు అమితగౌరవం. ఐనా, ఆంధ్రపత్రికకు ఆయన వ్రాసిన లేఖలు నాకు సమర్థనీయంగా అనిపించలేదు.

శ్రీశ్రీని విమర్శించటానికి మాస్కో విశ్వవిద్యాలయ ప్రసక్తి తెచ్చిన ఒక రచయిత పప్పులో కాలు వేసిన మాట వాస్తవం. అది శ్రీశ్రీ బయటపెట్టిన తర్వాత తాను తప్పు చేయలేదు అని బుకాయించటానికి, పప్పులో కాలు బయటకు తీయటానికి, కడుక్కోవటానికీ ఒక రచయిత చేసిన మాటల ఫీట్లు మంచి వినోదాన్ని కలిగిస్తాయి.

అలాగే శ్రీశ్రీని రాక్షసుడిగానో, అజ్ఞాని గానో, మూర్ఖుడిగానో, అకవిగానో చిత్రీకరించటానికి కొందరు ఉత్తరకుమారులు చేసిన ప్రయత్నమూ మంచి హాస్యంగానే ఉంటుంది. ఒకే మూసలో ఉన్న చాలా ఉత్తరాలు విసిగిస్తాయి.

ఇక ఇక్కడ హీరోలు ఎవరంటారా? నార్ల చిరంజీవి ఉత్తరం ఒక క్లాసిక్. తన యజమానుల దృక్పథానికి వ్యతిరేకంగా, స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించిన నండూరి రామ్మోహనరావు మెచ్చుకోదగ్గ మనిషి. లక్ష్య ప్రకటనదారుల ప్రజాస్వామ్య చిత్తశుద్ధిపై నమ్మకం లేదని సంతకం పెట్టటానికి నిరాకరించిన విద్వాన్ విశ్వం (ఆంధ్రప్రభలో సహసంపాదకుడు, నార్ల వేంకటేశ్వరరావు కింది ఉద్యోగి), కొడవటిగంటి కుటుంబరావు (చక్రపాణి కింది ఉద్యోగి) నిస్సందేహంగా హీరోలు.

ఇంకో విషయం. ఈ దొంగదాడివల్లనో, శ్రీశ్రీ ఉపన్యాసాలవల్లనో, నార్ల సంపాదకీయాలవల్లనో ఎన్నికల ఫలితాలు మారాయి అనుకోవటానికి ఆధారాలేమీ లేవు. నిరక్షరాస్యులైన వోటర్లు అత్యధికంగా ఉన్న ఎన్నికలలో, కొంతమంది విద్యావంతుల, సాహితీవేత్తల మధ్య జరిగిన సంవాదాలు ఎంత ప్రభావం చూపి ఉంటాయి? జరిగిందల్లా కొంతమంది రచయితల, పాత్రికేయుల భావాలు, స్వరూపాలూ అందరకూ తేటతెల్ల మవటమే. సుందరయ్య జీవితచరిత్రలో 1955 ఎన్నికల పలితాలు విశ్లేషణలో ఈ పత్రికల, రచయితల వివాదాల గురించిన ప్రస్తావనే లేకపోవడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు.

ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటే అప్పటి ఆవేశ కావేషాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ ఇప్పటి తెలుగు పత్రికల సాహితీపుటలలో వాదనలు గుర్తొచ్చి పరిస్థితులు మారలేదన్న స్పృహ నిస్పృహను కలిగిస్తుంది. ఉద్రేకాలు, ఉద్వేగాలు కనిపించినంతగా తర్కము, సంయమనము మన సాహితీకారుల వాదనలలో, విమర్శలలో కనిపించకపోవటం దురదృష్టం.

తెలుగు రాజకీయాలు, తెలుగు సాహిత్య రాజకీయాలు, చరిత్ర, సాహిత్య చరిత్రలపై ఆసక్తి ఉన్నవారు తప్పక చదవ వలసిన పుస్తకం ఈ దొంగదాడి కథ.

((అయిపోయింది))
****

దొంగదాడి కథ – 1955 ఎన్నికలు, చారిత్రక వాస్తవాలు
జూన్ 2006
ప్రచురణ: విశ్వేశ్వరరావు, సాహితీ మిత్రులు
విజయవాడ
ఫోన్: 9392971359
ప్రతులకు: నవోదయ, విజయవాడ; ఇతర పుస్తకవిక్రేతలు
254 పుటలు; 100రూ.
కినిగె.కాం కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. Srinivas Nagulapalli

    ఎన్నో విషయలను ఎంతో ఓపికతో అందించిన సమీక్షకు జంపాలగారికి కృతజ్ఞతలు.

    పుస్తకానికి పెట్టిన పేరు ఆశ్చర్యంగా అనిపించింది.
    “దొంగదాడి కథ
    1955 ఎన్నికలు
    చారిత్రిక వాస్తవాలు”

    కథలో వాస్తవాలు ప్రధానం కాదు, వాస్తవాలలో కథకు చోటులేదు. మరి ఇట్లా ఎందుకు పెట్టారు పేరు, కథలో వాస్తవాలు పెట్టారా, లేక వాస్తవాలను కథగా చెప్పారా అన్నది తెలియదు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆధారంగా 1956 లో తెలంగాణా తో కలిపి అంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వ పక్షంగా అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి కాని, అప్పటి కళాకారుల అభిప్రాయలు గాని, ఈ పుస్తకంలో ప్రస్తావన ఏమన్నా ఉందా తెలియదు. వ్యక్తుల గురించి,కాదు, ఒక్క వ్యక్తి ప్రధానంగా ఉన్న సంఘటనల గురించే ఎక్కువగా వివరించే పుస్తకంలో, అప్పటి వ్యవస్థల గురించి కూడా తెలుసుకోదగ్గ విషయాలుంటే మూడు భాగాల సమీక్షా పరిచయంలో జంపాలగారు తప్పక ప్రస్తావించేవారు అనే నమ్మకం.
    —–
    విధేయుడు
    _శ్రీనివాస్

  2. muthevi ravindranath

    మూడు భాగాలుగా సాగిన ఈ పుస్తక సమీక్ష అద్భుతంగా ఉంది. నేను డా. జంపాల చౌదరి గారి అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన తన సమీక్షలో రాగద్వేషాలకు అతీతంగా ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను నిర్మొగమాటంగా వెలిబుచ్చారు. ఆ ఎన్నికలలో కమ్యూనిస్టుల ఓటమికీ శ్రీ శ్రీ పై జరిగిన దొంగ దాడికీ కార్య-కారణ సంబంధమేమీ లేదనేది స్పష్టం.శ్రీ శ్రీ ఓ ఆవేశపరుడైన భావుకుడు. క్రమశిక్షణ కలిగిన నేత ఎంత మాత్రమూ కాదు. ఆయన కవిత్వం ఎన్నటికీ వన్నె తరగని మేలిమి బంగారం. కాని నాకు తెలిసి ఆయన ఉపన్యాసాలు ఏమాత్రం ఉత్తేజకరంగా ఉండేవికాదు. మరి అప్పట్లో ఎలా ఉండేవో ? ఏది ఏమైనా కమ్యూనిస్టు పార్టీ ఓటమికి శ్రీ శ్రీ పై జరిగిన దొంగదాడి కీ ముడిపెట్టడం తగదు. నేనూ శ్రీ శ్రీ కవిత్వానికి వీరాభిమానినే . నాటి పార్టీ ఓటమికి (ఒకవేళ గెలిచి ఉంటే ఆ గెలుపుకూ) ఆయన్ని బాధ్యుడిని చేయజూడడం శ్రీశ్రీ పై మితిమీరిన అభిమానం ఉన్నవాళ్ళు చేసేపని.వ్యక్తిగా ఆయన చూపగల ప్రభావం, ఆయన శక్తి,యుక్తులు, పరిమితులు ఎరిగినవారెవరూ ఆ పని చేయరు. ఈ దృష్ట్యానే సుందరయ్య గారు అసలు ఈ విషయాన్ని ప్రస్తావించక వదిలేసి ఉంటారు.ఇది జంపాల గారు పేర్కొన్నట్లు కేవలం కొందరు విద్యావంతులు, సాహితీవేత్తల నడుమ జరిగిన సంవాదంగానే మనం చూడాలి.విస్తృత జన బాహుళ్యాన్ని ప్రభావితం చేసి, ఎన్నికల ఫలితాల్ని నిర్దేశించేటంత సత్తా ఈ ‘దొంగ దాడి’కి
    లేదనేది సుస్పష్టం.మొత్తం మీద డా.జంపాల గారి సమీక్ష అందరినీ ఆకట్టుకునేదిగా ఉండి, పుస్తకాన్ని చదివింప జేస్తుంది.అందుకేలాంటి సందేహమూ లేదు. — ముత్తేవి రవీంద్రనాథ్.

Leave a Reply to muthevi ravindranath Cancel