పద్యానికి కరుణశ్రీ
(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మరణించినపుడు వచ్చిన సంపాదకీయ వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్)
******
గణ యతి ప్రాసలతో కూడిన పద్యం తెలుగు వాడి సొత్తు. సంస్కృతంతో సహా ఏ భాషా ఛందస్సులో లేని సొగసు తెలుగు పద్యానిది.
ఆ సొగసైన తెలుగు పద్యాన్ని సొంతం చేసుకున్న మహనీయ కవి కరుణశ్రీగా తెలుగు నెల నాలుగు చెరుగుల పేరుపడిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. పద్య విద్యనూ పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన కవిశేఖరుడు పాపయ్య శాస్త్రి గారు. తెలుగు పద్యాన్ని ఎంత రమ్జుగా, రమ్యంగా, సరళంగా, మధురంగా, శ్రవణసుభగంగా నడిపించడానికి వీలుందో అంతగాను నడిపించిన ఘనత పాపయ్య శాస్త్రి గారిది. ఆదివారం అర్థరాత్రి శాశ్వతంగా కన్నుమూసిన కరుణశ్రీ మృతితో తెలుగు పద్యం విలవిలలాడుతుంది, గిలగిల కొట్టుకుంటుంది, వెలవెలపోతుంది. కళ తప్పి వెలుగు కోల్పోతుంది. అంతగా విడదీయరాని సంబంధం వుంది తెలుగు పద్యానికి, కరుణశ్రీకి మధ్య.
తెలుగు పద్యానిది వెయ్యేళ్ళ చరిత్ర. ఈ వెయ్యేళ్ళలో తెలుగు పద్యం ఎన్నో పోకడలు పోయింది. నన్నయదొక పోకడ, తిక్కనదొక పోకడ, శ్రీనాథుని దొకటి, పోతనదొకటి, పెద్దనది మరొకటి.
ఆకాశమార్గాన అందనంత దూరాన విహరించే తెలుగు పద్యాన్ని నేల మీదికి లాక్కొచ్చి, ప్రతి పల్లెటూరిలో ప్రతి నోట పలికించిన ఘనత తిరుపతి వేంకట కవులది. కాగా,
తెలుగు పద్యాన్ని హుమాయిలా, రుబాయిలా పరువెత్తించిన నేర్పు జాషువాది. వారి తర్వాత అంతగాను, అంతకన్నా మిన్నగాను పద్య కవితను ప్రజల మధ్యకు చొచ్చుకుపోయేటట్టు చేసి ఔననిపించుకున్నవారు కరుణశ్రీ.
నాలుగు, నాలుగున్నర దశాబ్దాల నాడు, కరుణశ్రీఏ ఒక కవితలో “సరస సంగీత సామ్రాజ్య చక్రవర్తి”గా కీర్తించిన ఘంటసాల మధుర కంఠం నుంచి అమృతవాహినిలా జాలువారిన –
“అంజనరేఖ వాల్గనుల యంచులు దాట, మనోజ్ఞ మల్లికా
కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ
కంజదళాక్షీ! నీ ప్రణయ గానములో పులకింతునా – మనో
రంజని! పుష్ప వృష్టి పయిరాల్చి నిమన్ పులకింపజేతునా!”
అనే పద్యంతో మొదలయ్యే కరుణశ్రీ “సాంధ్యశ్రీ”, “అద్వైతమూర్తి” కవితలను విని పులకించని తెలుగువారు ఎవరుంటారు?
అలాగే –
“అది రమణీయ పుష్పవనమా వనమందొక మేడ, మేడపై
నది యొక మారుమూలగది, ఆ గది తల్పులు తీసి మెల్లగా
పదునయిదేండ్లయీడు గల బాలిక; పోలిక రాచపిల్ల, జం
కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్”
అని మొదలయ్యే “కుంతీ కుమారి”లో కన్యా మాతృత్వ శోక భారాన్ని ఘంటసాల విషాద మధురంగా వినిపించగా కంటతడి పెట్టని తెలుగువారు ఎవరుంటారు?
పద్యం వ్రాస్తే కరుణశ్రీ వ్రాయాలి. పద్యం పాడితే ఘంటసాల పాడాలి అనేది ఒక నానుడి అయింది. కరుణశ్రీ కవితా మాధుర్యం, ఘంటసాల కంఠ మాధుర్యం – ఆ రెండింటిది ఒక అపూర్వమైన కలయిక. అది తెలుగువారు చేసుకున్న అదృష్టం.
కరుణశ్రీ కవితలో సారళ్య, తారళ్యాల తర్వాత ప్రధానంగా చెప్పవలసింది కరుణ రసావేశం. నవ రసాలలో కరుణపైనే ఆయన మొగ్గు. “ఏకో రసః కరుణ ఏవ” అన్న భవభూతి వాక్కు కరుణశ్రీకి వేదవాక్కు. “కరుణకు, కవికి అవినాభావ సంబంధం” అని, తన కవితకు స్ఫూర్తి కరుణ రసానిదేనని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. అందుకే పాపయ్య శాస్త్రి గారు తన కాలం పేరే “కరుణశ్రీ”గా పెట్టుకున్నారు. పరమ కారుణ్యమూర్తి గౌతమ బుద్ధుడిని ఎన్ని కవితలలో కీర్తించారో!!
కరుణశ్రీ కవితలో మరొక ప్రధానమైన పాయ దేశభక్తి. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవవీరులను, గాంధీ మహాత్ముడిని ఎన్నో కవితలలో చదువరుల హృదయాలను ఉప్పొంగించే ఆవేశంతో ఆయన గానం చేసారు. ముఖ్యంగా “అల్లూరి సీతారామరాజు” కవితలో
“రాచరికంపు రక్కసి కరమ్ములు సాచి అమాయిక ప్రజన్
దోచు పర ప్రభుత్వమును దోచిన రాజుల చిన్నవాడ! వీ
రోచితమైన తావక మహోద్యమమాంధ్ర పురా పరాక్రమ
శ్రీ చరణమ్ములందు విరజిమ్మె నవారుణ విప్లవాంజలుల్”
వంటి పద్యాలు చదివి ఒడలు గగుర్పొడవని పాఠకుడుండడు.
ఇంకా దైవభక్తి ప్రచోదితమైన కవితలు, రాసిక్య ప్రధానమైన కవితలు, సమకాలిక రాజకీయ, సాంఘిక పరిస్థితులకు స్పందించి వ్రాసిన కవితలు, వ్యంగ్య కవితలు కడచిన మూడు, నాలుగు దశాబ్దాలలో కరుణశ్రీ లేఖిని నుంచి పుంఖాను పుంఖంగా వెలువడ్డాయి. పద్య కవిత వ్రాసినా, గద్య కవిత వ్రాసినా కరుణశ్రీ బానీ స్పష్టంగా తెలిసిపోయేది. ఆయనదొక ప్రత్యేక శైలి. అయితే గద్య కవితలో కంటే పద్య కవితలోనే ఆయన ముద్ర ప్రస్ఫుటంగా కనబడేది. “కవనార్థంబుదయించినారము..” అని తిరుపతి వేంకటకవులు అన్నట్టు “పద్యార్థంబుదయించి నాడను..” అని చెప్పుకోగల కవి ఆయన. పద్య కవితకు రోజులు కాని రోజులలో పద్య కవిత వ్రాసి ఓహో అనిపించుకోవడం ఆయనకే చెల్లింది.
తెలుగు పద్యం పట్ల ఆయన మమకారం ఎంతటిదంటే నన్నయ నుంచి దక్షిణాంధ్ర కవుల వరకు గల ఆంధ్ర కవిత్వంలో రమణీయమైన, బహుజన ప్రచారం పొందిన రసవద్ఘట్టాలను “కల్యాణ కల్పవల్లి”గా సంకల్పించి రసిక పాఠక ప్రీతి కావించారు.
మంచి గంధం వంటిది, మల్లెపూల పరిమళం వంటిది ఆయన వ్యక్తిత్వం. ఎవరినీ నొప్పించని మృదు స్వభావం, సరస సంభాషణా చాతుర్యం ఆయన సొత్తు. వక్తగా అనర్గళ వచోధారతో శ్రోతలను ఆకట్టుకోగలిగిన నేర్పరి. భావ కవితా యుగ ప్రభావం ఇంకా వీడని తరానికి చెందిన వారైనా, దానికి భిన్నమైన మార్గంలో నడిచి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న మధురకవి. ఆయన “ఉదయశ్రీ” కవితా సంపుటి – బహుసా తెలుగులో ఇంకే గ్రంథానికి లేనన్ని సార్లు – యాభై ముద్రణలు పొందినదంటేనే ఆయన కవిత్వాన్ని తెలుగువారు ఎంతగా ఆదరించారో గ్రహించవచ్చు. ఆయన కవితా స్మృతికి ఇదే మా శ్రద్ధాంజలి.
జూన్ ౨౩, ౧౯౯౨
(June 23, 1992)
patnala eswararao
karunashree gari padyaalanu paaTyagrandhaalalo pedithea pillalaku telugu bhaaasha patrla,padyam patla abhiruchi perugutundi.
Srinivas Nagulapalli
మంచి వ్యాసాన్ని నండూరిగారు వ్రాసినా, దాన్ని చదువగలిగేటట్లు పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
పూల చుట్టు ముళ్ళులుంటాయేమో కాని, అన్ని పువ్వులు కోమలంగానే ఉంటాయి, ఏ మాత్రం గుచ్చుకోకుండా.
వాటి ఉనికిని తెలియజేయడానికి అవి ఎప్పుడూ మృదువైన మనోహరమైన సౌరభాన్నే వెదజల్లుతాయి.
ఏ మాత్రం గుచ్చుకోని పాండిత్య ప్రకర్ష, కనపడని స్వోత్కర్ష, ఇసుమంతైనా తాను నొవ్వక ఇతరులను నొప్పించని
శైలితో కరుణ రస ప్రధానంగా పఠితులని ఆకట్టుకునే విధంగా “పుష్పవిలాపం” కావ్యం వ్రాయడం, కాదు,
జీవిత మహాకావ్యాన్ని సైతం ఆవిష్కరించడం “కరుణశ్రీ” గారి గొప్పతనం అనిపిస్తుంది.
ఎంతో మంది రామాయణాన్ని ఏన్నో రీతుల్లో ఎన్నో భాషల్లో రాసారు, రాస్తారు కూడా. శివధనుర్భంగం climax ఘట్టాన్ని, ఇంతకన్నా రమణీయంగా చెప్పగలరా అనేటట్లు ఉంటుంది కరుణశ్రీ గారి పద్యం
ఫెళ్ళు మనె విల్లు గంటలు గల్లుమనె, గు-
భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లు మనియె
జానకి దేహమున్, నిమేషంబునందె
నయము, జయము, విస్మయము గదురా !
ఆ పద్యం ఘంటసాల పాడడం బంగారానికి సువాసన కలగడం. కరుణశ్రీగారి కవితాశక్తిని చూపే ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
ఎంతో గొప్ప విషయాలను సైతం సరళంగా అందంగా హృదయానికి హత్తుకునేటట్లు చెప్పడం ఆయన పద్యాల్లో అడుగడుగునా కనిపిస్తుంది.
“అష్టాంగ మార్గం” గురించి బోలెడన్ని పుస్తకాలే ఉన్నాయి. కాని చిన్న ఆటవెలదిలో చెప్పడం ఆయనకే సాధ్యం.
“మంచి దృష్టి” మరియు “మంచి సంకల్పంబు”
“మంచి భాషణంబు”, “మంచి చర్య”,
“మంచి జీవనంబు”, “మంచి ప్రయత్నంబు”,
“మంచి సంస్కృతి” యును, “మంచి దీక్ష”
అని చిన్న పద్యంలో సంపూర్ణంగానూ సంక్షిప్తంగానూ చెప్తారు.
ఇదియె “అష్టాంగ మార్గ”, మీ యెనిమిదింటి
నభ్యసించిన మనుజు లనంత సుఖము
లందుకొందురు, శాశ్వతానంద మబ్బు;
నష్టమగు తృష్ణల్ దుఃఖమన్నదియె రాదు
అని వివరిస్తారు.
కరుణశ్రీ గారు కరుణ గురించి చెప్పిన పద్యం-
—————————————
“కరుణ శాంతి నిచ్చు; కరుణ కాంతి నొసంగు
కరుణ లేని నాడు ధరణి లేదు;
కరుణ శుభము నిచ్చు; పరమ సౌఖ్యము నిచ్చు;
కరుణ లేని నరుడు గడ్డిబొమ్మ”
—————————————
పద్యాలే కాదు, వచన కవితను కూడా అంతే రమణీయంగా హృద్యంగా చెప్పారు కరుణశ్రీ గారు.
“సత్యం శివం సుందరం!
ఈ జగమే దేవుని మందిరం
మనస్సు కలిగిన మమత్వ మెరిగిన
మానవులం మన మందరం”
అంటారు “సత్యమేవజయతే” కవితలో.
అదే కవిత చివరలో వారు చెప్పిన పంక్తులు
“పరమశివుని ఈ సృష్టి సుందరం
ప్రకృతిలోని ప్రత్యణువు సుందరం”
వారి పద్యాలకు రచనలకు కూడా వర్తిస్తుంది అనిపిస్తుంది.
“కరుణశ్రీగారి సృష్టి సుందరం
ప్రతిపద్యం ప్రతి పదం సుందరం” !
పూలు ఈశ్వరసృష్టి. పద్యం కవిసృష్టి. ఎంతో అందం ఇంకెంతో అలరించే సౌరభం కలిగిన పూలైనా,
వాడిపోతాయి, రాలిపోతాయి. కాని కరుణశ్రీ వాణి ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుందని బుద్దుని పరంగా చెప్పిన
వారి చివరి పద్యం
కరుణామయుడగు బుద్ధుని
కరుణశ్రీవాణి విశ్వకల్యాణ గుణా
కరమై, ఆచంద్ర దివా
కరమై వెలుగొందు దిగ్దిగంతములందున్
అన్న పద్యం, బుద్ధుని కరుణశ్రీవాణికే కాదు, “కరుణశ్రీ”గారి వాణికి కూడా అని ధ్వనించడం కాకతాళీయం కాదు.
అందులో అతిశయోక్తి లేదు- ఎప్పుడు చదివినా అలరిస్తూ వెలుగులను అందిస్తూనే ఉంటుంది అనిపిస్తుంది.
===========
విధేయుడు
_శ్రీనివాస్
Dr Apparao Nagabhyru
ఆ పద్యం ఘంటసాల పాడడం బంగారానికి సువాసన కలగడం
నాకు బాగా నచినన్ది
అప్పారావు plymouth UK