గుడి – పుస్తక పరిచయం

వ్రాసిన వారు: కొల్లూరి సోమశంకర్
*****************

ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు – మధ్యలో చదవడం ఆపేసి ఆలోచనల్లోకి జారిపోతే (ఆ పుస్తకం గురించే సుమా!) లేదా పుస్తకం పూర్తయ్యాక మీలోంచి ఓ నిట్టూర్పో వెలువడడమో లేదా మీ కనుల నుంచి రెండు చుక్కలు జారడమో జరిగితే…. ఆ పుస్తకం నిశ్చయంగా మిమ్మల్ని కదిలించినట్లే. అందులోని వస్తువు మీ హృదయాన్ని సృశించినట్టే.

అత్యంత నిజాయితీతో చేసిన రచనలే అలా మనసుని తాకగలవు. ఆ కోవలోకి చెందినదే ప్రముఖ సినీ రచయిత జనార్థన మహర్షి రాసిన “గుడి” నవల.

జననం నుంచి మరణం వరకూ ఏదో ఒక రూపంలో తంతు, తతంగాలలో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక జీవన విధానం మనది. శిశువు జన్మించినప్పుడు బాలసార చేసినట్టే, వ్యక్తి మరణించినప్పుడు అంతిమ సంస్కారాలు చేస్తాము. చనిపోయిన వ్యక్తికి శ్రద్ధాపూర్వకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం అంటే ఆ వ్యక్తికి ఆత్మీయంగా వీడ్కోలు పలుకుతున్నట్లే.

మారుతున్న కాలమాన పరిస్థితులలో అంతిమ సంస్కారానికి కూడా నోచుకోకుండానే, చాలా మంచి నిర్జీవుల భౌతికకాయాలు దహనం చేయబడుతున్నాయి లేదా పూడ్చబడుతున్నాయి.

అనాధ అయిన విశ్వనాథుడు అనే పెద్దాయన ఓ శివాలయంలో అర్చన టికెట్లు అమ్ముతుంటాడు. ఆ గుడికి తరచూ వచ్చే రవీంద్ర అనే మధ్యవయస్తుడిని జాగ్రత్తగా పరిశీలిస్తూంటాడు. ఉన్నట్లుండి ఒక రోజు తనకు ‘తలకొరివి పెడతావా’ అని విశ్వనాధుడు రవీంద్రని అడగడంతో కథ మొదలవుతుంది.

“నేను మీకు తలకొరివి పెట్టడమేమిటి? మన మధ్య ఏమిటి సంబంధం” అని రవీంద్ర అడుగుటాడు.

“కొడుకే తలకొరివి పెట్టాలంటావా?” అని ఎదురు ప్రశ్నిస్తాడు విశ్వనాధుడు.

ఇలా మొదలైన ఈ కథ మానవ సంబంధాలని అద్భుతంగా స్పృశిస్తూ, అంతర్లీనంగా మన సంస్కృతుల గురించీ, కళల గురించీ చర్చిస్తుంది.
అంతిమయాత్రలలో చోటుచేసుకుంటున్న పెడధోరణులు, ధనమే అన్నీఅయి సమాజాన్ని చుట్టుకుపోతున్న వైనం చదువుతుంటే… ఏదో తెలియని వేదన మనసుని కుదిపేస్తుంది.
అసలు కథలో ఉపకథలా, రవీంద్ర కూతురు లావణ్యని ప్రేమిస్తున్నానంటూ తిరిగే రమణ, అతని కుటుంబం గురించి చెపుతారు రచయిత. అయితే ఇది మూల కథకి సమాంతరమైన కథలా కాకుండా అసలు కథలో భాగంగా కలిపివేయడంలో రచయిత నేర్పు కనబడుతుంది.

విశ్వనాధుడు, రవీంద్ర, కామాక్షి, లావణ్యల పాత్రలు, వాటి తీరుతెన్నులు మనకు నిజజీవితంలో ఎదురవుతాయి కాబట్టి ఆయా పాత్రల ప్రవర్తన పట్ల మనకి ఎటువంటి సందేహాలు కలగవు. కాకపోతే రమణ కుటుంబ నేపథ్యం, అతని తల్లిదండ్రుల గురించి చదువుతున్నప్పడు, రవీంద్ర కుటుంబం పట్ల వారి ప్రవర్తన కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. అంతటి సంపన్న కుటుంబం దిగువ మధ్యతరగతి వ్యక్తుల పట్ల చూపిన సంస్కారం ప్రస్తుత సమాజంలో మనకు అరుదుగా కనపడుతుంది. అటువంటి వ్యక్తులు నేడు లేరని కాదు, ఉంటారు, కానీ మరుగున ఉంటారు.

లావణ్యకి, రమణకి వివాహం సందర్భంగా, పెళ్ళి గురించి రచయిత చెప్పిన మాటలు అద్భుతంగా ఉంటాయి. కూతురు పెళ్ళి సక్రమంగా అయి, మంచి కుటుంబానికి కోడలయిన ఆనందంలో రవీంద్ర గుండె ఆగిపోతుంది. తనకు తలకొరివి పెడతాడనుకున్న రవీంద్రకి తానే తలకొరివి పెట్టాల్సి రావడంతో తట్టుకోలేకపోతాడు విశ్వనాథుడు. ఎవరికీ చెప్పకుండా ఊరువదిలి వెళ్ళిపోతాడు. రవీంద్ర మరణం కథకి కీలకమైన మలుపు అవుతుంది. కథనాన్ని ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తుంది. సాధుజంతువులకి, క్రూరజంతువులకీ తేడా ఏమిటి? మనిషి క్రూరజంతువెందుకయ్యాడు? ధ్యానమంటే ఏమిటి? సమస్య అంటే ఏమిటి? సమస్యకి రెండో కోణం నుంచి చూడడం ఎలా? ఎవరు దురదృష్టవంతులు. ఎవరు అదృష్టవంతులు? మనశ్శాంతి పొందడం ఎలా? ప్రేమించబడడం ఎలా అనే ప్రశ్నలకి ఉదాహరణలతో కూడిన సమాధానాలు లభిస్తాయి.

తన శవాన్ని నలుగురు శ్రద్ధాపూర్వకంగా మోస్తే చాలనుకున్న విశ్వనాథుడి అంతిమయాత్ర ఎలా జరిగింది? ఒక రవీంద్రని పోగొట్టుకున్న విశ్వనాథుడు రెండో రవీంద్రకి ఏం నేర్పాడు? జీవితం అంటే ఏమిటి? మరణం అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడ ఉంటాడు? గుడిలోనే ఉంటాడా? పాపం నశించాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు ఈ నవలలో దొరుకుతాయి.

అద్భుతమైన సంభాషణలతో, చివరిదాక ఆసక్తిగా చదివిస్తుందీ నవల. మచ్చుకి కొన్ని…

“ఎన్ని చేపల
ఏడుపో
సముద్రం ఉప్పు…”

“ఒకటే చూసే
రెండు కళ్ళు
ఒకదాన్నొకటి చూసుకోవు

ఎప్పుడూ కలిసుండే
రెండు పెదాలు
ఒక్కమాటతో
విడిపోతాయి

అందుకే
కళ్ళకి ధ్యానం కావాలి
పెదాలకి మౌనం కావాలి.”

“కాబట్టి ద్వేషించి నిన్ను నువ్వు కాల్చుకోడం ద్వారా మిగిలేది బూడిదే. ఇష్టం లేని వ్యక్తి ఎదగడాన్ని ఇష్టపడు. అప్పుడు నీ గమ్యం మరింత పెరుగుతుంది. తర్వాత నీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. అప్పుడు నీకు ఇస్థం లేని వ్యక్తి చేసిన మేలు తెలిసి…… అతని మీద ఇష్టం పెరుగుతుంది.”

“నీకు బాలమురళీకృష్ణలా, బాలసుబ్రహ్మణ్యంలా పాడాలని ఉందా? బాత్రూంలో స్నానం చేస్తూ…. హాయిగా పాడుకో…. ఆ గదిలో నీకంటే గొప్ప గాయకుడు లేడు…. అద్దం ముందుకు వచ్చి అందమైన నీ జుట్టు అద్దంలో చూసి దువ్వు. నీ అభిమాన హీరోల కంటే స్టయిల్‌గా దువ్వు…. దాని ముందు డాన్స్ చెయ్యి…. నీలోని గొప్ప యాక్టర్‌ని చూసుకో. ఇలా రోజులో….. నువ్వవడు కావాలనుకున్నా అవ్వచ్చు. అలా ఎందరివో నువ్వయి… ఏదో ఒక రోజు ‘నీలోని నువ్వు’ నిజమైన హీరోవని తెలుసుకొనే స్థితికి రా.”

ఇలాంటి స్ఫూరిదాయకమైన సంభాషణలతో హృదయాన్ని తాకుతుందీ నవల. దీనిపై పెట్టే సమయమూ, డబ్బూ ఏ మాత్రం వృధా కావని నా విశ్వాసం. 151 పేజీలున్న ఈ పుస్తకం ప్రచురణ “శ్రావణి – శర్వాణి”. వెల 100/-. పుస్తకం లభించే చోటుని ప్రత్యేకంగా పేర్కొనకపోయినా, రచయిత సుప్రసిద్ధుడు కాబట్టి అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుందని ఆశించవచ్చు.

చదవదగ్గ పుస్తకం – “గుడి”.

You Might Also Like

4 Comments

  1. drsjatinkumar

    sameeksha chesinapaddathi chala baavundi. chaavunu gurinchi enta undoe bratakatam gurinchi anta ekkuva vundi

  2. కొల్లూరి సోమ శంకర్

    @ రాజు గారు,
    బాలసారె బారసాల గురించి ఆసక్తికరమైన చర్చ ఇక్కడ….

    https://groups.google.com/forum/?fromgroups=#!topic/telugupadam/8sFakkWUMvQ

    ఆ రెండిటిలో ఏ పదం వాడినా తప్పు లేదని అనుకుంటున్నాను

  3. Raju

    Parichayam baagundi, mooDava paragraph lo Baarasaala badulugaa Baala saara ani vraayaDam jarigindi, achchuthappu ni didda galaru.

    DhanyavAdaalu

  4. జంపాల చౌదరి

    ఈ పుస్తకం ఈ మధ్య దేవస్థానం అనే చిత్రంగా జనార్దన మహర్షి దర్శకత్వంలోనే వచ్చింది కదా.

Leave a Reply