తెలుగు పండుగలు – తిరుమల రామచంద్ర
౧౯౭౫ లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వేసిన ఈ చిన్ని పుస్తకం తెలుగు పండుగలు అన్నింటిని మాసాల వారీగా పరిచయం చేస్తుంది. ఇందులో ఒక్కొక్క పండుగ నాడు ఏమేం చేస్తారు? ఆ పండుగ ఎప్పుడు వస్తుంది? వంటి మౌలిక ప్రశ్నలే కాక, కొన్ని చోట్ల ఎందుకు ఫలానా రోజే చేసుకోవాలి? అనాదిగా అలాగే చేసుకుంటున్నారా? వంటి చర్చలు కూడా ఉన్నాయి. ఈ వ్యాసం ఈ పుస్తకం గురించి ఒక చిన్న పరిచయం, నా అభిప్రాయాలూనూ. నెలల వారీగా పుస్తకంలో చెప్పిన వరుసలోనే వెళతాను.
చైత్ర మాస పండుగలు: ఉగాది, శ్రీరామ నవమి, హనుమజ్జయంతి –
పురాణేతిహాసాల్లో అనేక ఉగాదుల గురించి చదివితే ఆసక్తి కరంగా అనిపించింది. ఉగాది గురించి ఆయన చెప్పిన విషయాల్లో నాకు ఆసక్తి కరముగా అనిపించిన వాటిని ఇక్కడ పంచుకుంటున్నాను.
“…భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో సూర్యుడు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు లంకానగరంలో ఉదయించడం వల్ల – అనగా భూమధ్య రేఖపై ఉండడం వల్ల – ఆనాడే యుగ, దిన, మాస, వర్షారంభం అవుతుందని నిర్ణయించాడు. ఇలాటి నిర్నయమయిన తర్వాత హేమాద్రి మొదలయిన వారు “బ్రహ్మ ఈ జగత్తును చైత్రమాసంలో శుక్ల పక్షంలో మొదటి దినాన, సూర్యోదయ వేళ సృష్టించినాడు. గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వత్సరాధిపతులను ప్రవర్తిమ్పజేసినాడు” అని ఆస్తికులకు బోధించినారు; పండుగ చేసుకునే పద్ధతినీ వివరించినారు.” ”
శ్రీ రామ నవమి, హనుమజ్జయంతి వ్యాసాల్లో- పండుగలు ఎప్పుడొస్తాయి, ఎలా చేసుకుంటారు? అన్న విషయం మాత్రం వివరించారు.
వైశాఖ మాస పండుగలు: అక్షయ తృతీయ, పరశురామ జయంతి, నరసింహ జయంతి –
ఇక్కడ వర్ణించిన అక్షయ తృతీయ కీ, ప్రస్తుతం బంగారం షాపుల వాళ్ళు ప్రచారం చేస్తున్న అక్షయ తృతీయకీ అసలు పోలికలు లేనట్లు తోచింది. రెండూ ఒకటేనా? అని సందేహం వచ్చింది. పరశురామ, నరసింహ జయంతులు జనం నోళ్ళలో నానే పండుగలు (సెలవులిచ్చే పండుగలు) కావు కనుక, వాటి గురించి మరికాస్త వివరంగా రాసి ఉండాల్సింది అనిపించింది. ఏ దసరా గురించో, దీపావళి గురించో మనం వద్దన్నా బోలెడు కథలు వింటాము చిన్నప్పటి నుంచి. కానీ, ఇలాంటి రోజుల గురించి ఇంకొంచెం చెబితే, నాబోటి వారికి అర్థమయ్యేది అనిపించింది. తరువాతి వ్యాసాల్లో కూడా ఇలాగ విశేషంగా జరుకోబడని పండుగల గురించి కట్టే-కొట్టే-తెచ్చే పద్ధతిలో చెప్పడం (ఉదా: వామన జయంతి) కొంచెం నిరాశ కలిగించింది.
జ్యేష్ఠ మాస పండుగలు: ఏరువాక పున్నమ, మంటెద్దుల అమావాస్య : ఈ రెండింటి గురించీ నేను ఇక్కడే మొదటిసారి చదివాను. “దేశమంతట జరిగే ఈ వ్యవసాయ ప్రారంభ పూజను వ్రత గ్రంథకారులు గాని, ధర్మశాస్త్ర గ్రంథకారులు గాని తెలుపకపోవడం విచిత్రంగానే ఉంది” అని రాసారు ఇక్కడ. బహుసా వ్యవసాయ కుటుంబంలో లేనందువల్ల కాబోలు నాకు తెలియనిది – అని అప్పటి దాకా అనుకుంటున్న నేను ఈ వాక్యం చదివాక ఊపిరి పీల్చుకున్నా 🙂
శ్రావణ మాస పండుగలు: నాగపంచమి, శ్రావణ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి
నాగుల చవితి, పంచమే కాక ఇంకా బోలెడు నాగ పూజ రోజులు ఉన్నాయట..నాగాబలి, నాగ దష్టోద్ధరణ పంచమి, నాగాపుజ, అనంత పంచమి – ఇలా ఉన్నాయని చెబుతూ, “పాముల భయం, ఋతువుల ప్రభావం, నాగజాతి వారి ఆచారాలు, వారి పరాజయానంతరం సమ్మేళనం మొదలయినవన్నీ మేలవించినది ఈ పండుగ అని స్పష్టమవుతున్నది” అని తేల్చారు. ఇక శ్రావణ పూర్ణిమ (రాఖీ) గురించి చెప్పిన విషయం ఆసక్తి కరంగా ఉంది. “వేదాధ్యయన దీక్ష కోసం నూతన యజ్ఞోపవీత ధారణం అన్న ఆచారం ఇతర వర్గాలలో నూతన కార్యారంభానికి రక్షాబంధంగా ఏర్పడింది, కనుక దీనికి రక్షా పూర్ణిమ, రాఖీ పూర్ణిమ అనే వ్యవహారం ఏర్పడ్డది .. … నిజానికి ఇది దీక్షా కంకణధారణమే తప్ప చెల్లెలి ప్రసక్తి లేదు”. ఈ చివరి ముక్క నాకు అంత ఆశ్చర్యం కలిగించలేదు కానీ, ఆ యజ్ఞోపవీతం-రక్షా సంబంధం మాత్రం కొంచెం ఆశ్చర్య పరచింది. వరలక్ష్మీ వ్రతం గురించి పెద్దగా ఏమీ విశేషాంశాలు లేవు ఇందులో. కృష్ణాష్టమి గురించి చెబుతూ – కృష్ణుడి జన్మ తేదీ గురించిన చర్చ వివరించారు. “..దీనిని బట్టి ఇది మొదట జ్యోతిష్య శాస్త్ర ప్రాధాన్యం కలిగినట్టిదని, తర్వాత దీనికి కృష్ణ జన్మగాథ అనుసంధింపబడిందని తోస్తుంది” అని ముగించారు. ఇది కూడా ఆశ్చర్యమే నాకు 🙂
భాద్రపద మాస పండుగలు: వినాయక చవితి, వామన జయంతి, అనంతపద్మనాభ చతుర్దశి, మహాలయ పక్షము
వినాయక చవితి సంబంధిత కథల గురించి, ఆవేళ చేసే పనుల గురించి వివరంగా రాసారు. వామన జయంతి ని నామ మాత్రంగా స్పృశించి వదిలేసారు. మళ్ళీ అనంత పద్మనాభ చతుర్దశి గురించి వెనుక ఉన్న కథ చెప్పారు. ఈ పండుగ పేరు ఇదే మొదటి సారి వినడం కనుక, నాకు ఆసక్తికరంగా అనిపించాయి ఆ కథా, వివరాలు. మహాలయ పక్షం గురించిన కథలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. పితృ దేవతలకి తర్పణం వదలడం మాత్రమే చేస్తారు అనుకున్నా కానీ, ఇతరత్రా విశేషాలు కూడా ఉన్నాయి అని తెలిసింది.
ఆశ్వయుజ మాస పండుగలు : నవరాత్రోత్సవం, విజయ దశమి, దీపావళి
వ్రత గ్రంథాలలో ఉన్న విషయాలను పురాణ కథలతో పోలుస్తూ, ఈ కథలు ఎలా ఆయా పండుగలకి జత కాబడ్డాయో అంటూ చెప్పిన సంగతులు ఆసక్తి కరంగా అనిపించాయి.
కార్తీక మాస పండుగలు: తులసీ పూజ, చాతుర్మాస్యం : తులసీ పూజ వ్రత కథ కంటే కూడా దానికి రామచంద్ర గారి అన్వయము ఆసక్తి కరంగా అనిపించింది. ఇక, చాతుర్మాస్యం గురించిన వ్యాసం నాకు చాలా అస్పష్టంగా ఉన్నట్లు తోచింది.
మార్గశిర మాస పండుగలు: సుబ్బరాయ షష్ఠి, వైకుంఠ ఏకాదశి – సుబ్బరాయ షష్ఠి వ్యాసం మొత్తం చదివాక కూడా అది ఏ నెలలో ఎప్పుడొస్తుందో అర్థం కాక గూగుల్ చేసి కనుక్కున్నా. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి కీ ఒక్కో పేరు ఉంటుందనీ, ఆ పేర్ల వివరాలు చదివాక వాటి మధ్యలో మార్గశిర లో వచ్చే ఏకాదశి…అంటూ వర్ణన చదివాక గానీ, వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసం లో వస్తుంది అని అర్థం కాలేదు. ఏదేమైనా, అన్ని ఏకాదశులకీ పేర్లు ఉన్నాయని ఇన్నాళ్ళూ నాకు తెలియదు కనుక, ఈ విషయంలో రామచంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుకోవలసిందే.
పుష్య మాస పండుగలు: సంక్రాంతి – ఇప్పుడే కొన్ని చోట్ల సరైన నెల-తిథి వివరాలు ఇవ్వలేదు అన్నా కదా…ఇదొకటి. నాకు ఇది మార్గశిర లో వస్తుందా, పుష్య మాసంలో వస్తుందా? అన్నది అర్థం కాలేదు ఇక్కడ ఉన్న వివరణలు చదివాక. అలాగే, అన్ని పండుగల తారీఖులూ ఆంగ్ల కేలెండర్ ప్రకారం చూస్తే సంవత్సరం సంవత్సరానికీ మారతాయి. సంక్రాంతి మాత్రం ఒక రోజు అటూ ఇటూగా ఎప్పుడూ అప్పుడే ఎందుకొస్తుంది? – అన్న ప్రశ్న కు ఈ వివరణలో ఎవన్నా సమాధానం ఉంటుందేమో అని ఆశించాను… కానీ లేదు. ఇక పోతే, నన్ను ఆకట్టుకున్న అంశం – “ధనుర్మాసం లో పొంగలి వండడం వైద్యశాస్త్రం ప్రకారం ఆచారమయింది. చలికాలంలో రాత్రులు పెద్దవి, పగళ్ళు చిన్నవి కనుక, నిద్రలేవగానే ఆకలి అవుతుంది గనుక ముద్గాన్నం తినమన్నారు. ఈ ఆచారం దేవాలయాలలో ప్రాకింది. భోగి అన్నది సంస్కృత పదంగా కనిపిస్తుంది కానీ నిజానికి పొంగలి నుంచి పుట్టిందనే నా విశ్వాసం. ఈ పద వ్యవహారం ఉత్తరదేశంలో లేనందున, ఇది పొంగించు, పోగు అనే సంస్కృతేతర పదాల నుంచి పుట్టి భోగి అయ్యి సంస్కృతీకరింపబడి భోగి అయిఉంటుంది” అన్న భాగం. దీనికి వెనుక భాషా శాస్త్ర ప్రూఫులూ, వైద్యుల ప్రూఫులూ ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ, ఊహా గానానికి మాత్రం బాగుంది.
మాఘ మాస పండుగలు: రథ సప్తమి, మహా శివరాత్రి : చిన్నప్పటి రోజుల్లో రథ సప్తమి నాడు తల స్నానం చేసి గుడికి వెళ్ళడం జ్ఞాపకం ఉంది. అయితే, అది సూర్యారాధన కోసం ఏర్పడ్డ పండుగ అని ఈ పుస్తకంలో చదివే దాకా నాకు తట్టనేలేదు! 🙂 శివరాత్రి గురించి చెబుతూ –“నాకు చూడగా ఇది సృష్టి లింగోద్భవ కాలమని, వసంత లింగోద్భవ కాలమని, తర్వాత శైవ కథలు దీనికి అనుసంధింపబడినవని తోస్తుంది” అన్నారు. వసంత లింగోద్భవ కాలం అంటే ఏమిటో నాకు తెలీదు. బహుసా వసంత ఋతువు కి సంబంధించి ఏదో కాబోలు అనుకున్నా.
ఫాల్గుణ మాస పండుగలు: ఫాల్గుణోత్సవం (హోలీ) – వైదిక కాలంలో నూతన వర్షం ఈనాడే మొదలయ్యేదట. ఇంతకీ, ఈ పుస్తకంలో ఈ పండుగ రోజు చేయబడేవి గా వివరించిన పనులు మాత్రం చాలా వింతగా ఉన్నాయి (బుక్క పిండి చల్లుకోవడం, బండ బూతులు తిట్టుకోవడం వగైరా). ఏడు రోజులు జరిగేదట బుద్ధుడి కాలంలో! నేనింకా ఏదో అందరూ ఆనందంగా రంగులేసుకుంటూ రాబోయే వసంతాన్ని గురించి తలచుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటారు అని మాత్రమే అనుకున్నా. దానితో పాటు ఇన్ని కథలున్నాయి అనమాట 🙂
ఎక్కడికక్కడ నాకు కొన్ని సందేహాలు తలెత్తకపోలేదు. ఉదా: కొన్ని పండుగలు వివరిస్తూ ఆ నెలలు-తిథుల వివరాలు రాయరు. అక్కడికి నేనేదో పూజలు చేసేసుకుంటా అని కాదు కానీ, ఏదో, కొన్నింటి గురించి చెప్పి కొన్నింటి గురించి చెప్పకపోతే వివరాలు ఎక్కడనుంచి తెలుస్తాయి? అని. అంతే. ఏదేమైనా, కొంచెం కష్టంగానే అనిపించింది పుస్తకం చదివి అర్థం చేసుకోవడం. కొన్ని చోట్లేమో – పండుగ ఎలా చేసుకోవాలి? అన్న విషయమో…లేదంటే ఆ పండుగ వెనుక ఉన్న పురాణ కథో చెప్పి ఆపేస్తారు. కొన్ని చోట్ల ఆ కథల జోలికి వెళ్ళకుండా చరిత్రలోకి వెళతారు. కొన్ని పదాలు – ఆయన అలవోకగానే వాడేస్తారు కానీ, అది చదువరులు అందరికీ అర్థం కావాలి కదా! ఉదా : వసంత లింగోద్భవం, విషువత్తు వంటివి. ఎందుకంటే ఈ పదాల వంటివి తెలిసిన వారు ఈ పండుగల గురించి ఈ మాత్రం తెలుసుకోకపోయి ఉంటారా? అని సందేహం. అలాగే, వరుసగా మాసాల వారీగా వస్తే, ఆషాడ మాసంలో పండుగలు లేవు. ఎందుకు? అన్నది అక్కడ రాయలేదు. ఎందుకు? అన్నది తెలిసిన వాళ్లకి ఎలాగో ఈ పుస్తకం చదవాల్సిన అవసరం లేకుండానే ఇందులోని వివరాలు తెలిసే ఉంటాయి అని నా అభిప్రాయం.
-ఈ కారణాల వల్ల నాకీ పుస్తకం టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అన్నది కూడా అర్థం కాలేదు. బహుశా తెలుగు పండుగల మీద ఇంతకంటే సులభంగా అర్థమయ్యే పుస్తకాలు కూడా ఉండవచ్చును అనుకోండి, అది వేరే సంగతి. అయితే పుస్తకంలో మధ్యమధ్యలో చేసిన ఊహాగానాలు, పాత కాలాల నాటి సంప్రదాయాల గురించిన విశేషాలు, పండుగల రోజుల్లో ప్రజలు ఏం చేసేవారో వివరంగా చెప్పిన వ్యాసాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. చివర్లో ఈ రచనకు ఉపయోగపడ్డ గ్రంథాల జాబితా కూడా ఇచ్చారు.
తెలుగు పండుగలు
రచయిత: శ్రీ తిరుమల రామచంద్ర
ప్రచురణ:ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు.
ముద్రణ తేదీ: మార్చి, ౧౯౭౫
వెల: రెండు రూపాయలు.
౪౪ పేజీలు .
కామేశ్వరరావు
“అలాగే, అన్ని పండుగల తారీఖులూ ఆంగ్ల కేలెండర్ ప్రకారం చూస్తే సంవత్సరం సంవత్సరానికీ మారతాయి. సంక్రాంతి మాత్రం ఒక రోజు అటూ ఇటూగా ఎప్పుడూ అప్పుడే ఎందుకొస్తుంది? – అన్న ప్రశ్న కు ఈ వివరణలో ఎవన్నా సమాధానం ఉంటుందేమో అని ఆశించాను… కానీ లేదు.”
దీనికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది:
http://en.wikipedia.org/wiki/Makara_Sankranthi
అస్సాంలో ఈ పండగ పేరు “భోగలి బిహు”ట!