చమక్కులు…. చురకలు… వెరసి “టేకిటీజీ” !

వ్రాసిన వారు: కొల్లూరి సోమశంకర్
********
ఓ మాంఛి పుస్తకం చదివి చాలా రోజులయ్యిందనుకుంటూ…… ఏం చదువుదామాని వెతుకుతుంటే… ఎప్పటినుంచో చదవాలనుకుని పక్కన పెట్టుకున్న వాటిల్లోకి తొంగి చూస్తే, డొక్కా శ్రీనివాస ఫణి కుమార్ గారి “టేకిటీజీ” కనపడింది. “బోల్డు కామెడీ… కుంచెం సెటైరు” అనే ఉపశీర్షిక నేనెంచుకున్న పుస్తకం సరైనదేనంటూ భరోసా కల్పిస్తున్నట్లు అనిపించింది. ముందుమాటలు, అభిప్రాయాలు రాసిన ప్రముఖుల పేజీలను గబాగబా ముగించి అసలు వాటిని
చదవడానికి తొందరపడ్డాను.

మొదటి గల్పికతోనే – ఈ పుస్తకం చదవాలన్న- నా నిర్ణయం తప్పుకానందకు బోల్డు సంతోషం…. మొదటి గల్పికలోని మొదటి వాక్యమే బ్రహ్మాండంగా పేలింది. “పాట వచ్చినవాడూ, పెళ్ళాం పక్కనే ఉన్నవాడూ….” అంటూ కథ రాయడం వచ్చనుకునే వాడూ ఓ పట్టాన ఊరికే ఉండలేడు అంటారు “బేమ్మడూ.. నల్లమేక”లో. ఒక కథ రాస్తే దానికి వచ్చే విమర్శలు, కామెంట్లు ఎలా ఉంటాయో ఇందులో చెబుతారు.

భార్యల నోట్లోంచి వచ్చే “ఏవండీ” అనే సౌండుకి ఉన్న వివిధ రూపాల గురించి తెలుసుకోవాలంటే “శాస్త్రోక్త విధానేన” చదవాలి. “శాస్త్రప్రకారం బేస్‌మెంట్
చూసేవాళ్ళు పశ్చిమద్వారం గుండా వెళ్ళాలిట…” అంటూ అతిథుల్ని తన తిప్పించి తిప్పించి బేస్‌మెంట్ లోకి తీసుకెళ్ళిన గిరిబాబు గురించి చదువుతూ, నవ్వకుండా
ఉండలేము. వాస్తు గురించి అనవసర భయాలు ఎలా విస్తరిస్తాయో ఇది చదివాక అర్థమవుతుంది.

బంగాళా దుంప లేకపోతే ప్రపంచం ఏమై ఉండేదో మీకేమయినా తెలుసా? ధరణిలో ధర్మం నిలిపినది బంగాళాదుంప! ఆ వివరాలు తెలుసా? తెలియదా? అయితే వెంటనే “చి. బొ. శ్రీ . ర” చదివేసేయండి. డైట్ కంట్రోల్ అంటూ నోరు కట్టేసుకుని, మొహం వేలాడేసుకునే వారి గురించి కూడా ఇందులో చదవచ్చు. “ముందొక త్రాసు కొనుక్కో, నువ్వు రోజుకి పది గ్రాముల పప్పు, వంద మెతుకుల అన్నం మాత్రమే తినాలి” ఇంకా ఇలాంటి ఆరోగ్య చిట్కాలు పాటించినవారి గతి ఏమయిందో తెలుసుకోండి.

గాంధీ గారు ఎందుకు దిగులుగా ఉన్నారో కారణం తెలుసుకోవాలంటే “సహస్ర శిరచ్ఛేద అపూర్వచింతామణి” చదవండి. రచయిత ముందుగానే చెప్పినట్లు ఈ కథకీ, శీర్షికకీ అసలు సంబంధమే లేదు. అస్సలు లేదంటే ఏ మాత్రం లేదని కాదు, ఓ కూస్తంత ఉందనుకోండి. అనుక్షణం లైమ్‍లైట్‌లో ఉండాలని ప్రయత్నించే నేటి నాయకుల హడావుడిపై చక్కని సెటైర్ ఇది.

ఇందులోని అన్ని స్కెచెస్ కంటే బాగా నవ్వించినది “గంధర్వ కోకిల”. “ఎవడు కవిత చదివితే దిమ్మ తిరిగిపోయి, మైండు బ్లాంకయిపోయి, జీవితేచ్ఛ నశిస్తుందో…వాడే…” అంటూ ఓ కవి గురించి చెబుతారు రచయిత. ఇది చదువుతుంటే పడీ పడీ నవ్వుతాం. మధ్యలో ఓ జంధ్యాల సినిమాలోని శ్రీలక్ష్మి పాత్ర కళ్ళముందు కదలాడుతుంది. మచ్చుకి ఓ కవిత –
“అమృతం కురిసిన రాత్రి
అందరూ పడుకున్నారట
నేనూ పడుకునుంటే పోయేది
నా ఖర్మగాలి మేలుకున్నాను
ఆ రోజు కవిత్వం వడగళ్ళుగా కురిసింది
నా రూఫు డేమేజి అయిపోయింది
టాపు లేచిపోయింది”

ఇదే కవి రాసిన “మూడు చుక్కలు” అనే కవిత కింద అక్షరాలా మూడు మూడు చుక్కలున్నాయట.

మీరెప్పుడైనా హిందీలో విచారించారా? మీకు హిందీ రాదా? అయినా పర్వాలేదు, “ఆంగ్లము- శిక్ష” చదివితే, మీకు హిందీలో విచారించడం వచ్చేస్తుంది. ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అనే కాన్వెంటు బడులలో పిల్లల ఇంగ్లీషు ఎలా ఉంటుందో రచయిత హాస్యంగా చెప్పినా, అది చాలా వరకు నిజమనే వాస్తవం మనసుని కలుక్కుమనిపిస్తుంది. “ఒసే మీ పాదరొచ్చాడు, గో” అని ఒక పిల్ల అంటే, దానికి జవాబుగా “నోయే. అది మా ఫాదర్ కాదు. ఎవరో అంకుల్సే. సరే, ఇప్పుడు నీ చేతిలో బాల్ త్రో…”. “నీ మొహం చాలా ఫొటో జెనెటిక్ గా ఉందన్నాడు ఓ పెద్దాయన”; అందరూ విరాళాలివ్వండి అని అనాల్సిన చోట “ప్లీజ్ డొనేట్ యువర్‌సెల్ఫ్” అని అన్నాడొక ఫ్రొఫెసర్. ఇలాంటివన్నీ వినీ వినీ విసుగెత్తిన రచయిత తెగించిన వైనం దీంట్లో చదవచ్చు.

చిత్రలేఖనంలో రచయిత ప్రావీణ్యం గురించి తెలుసుకోవాలంటే “శీనుగాడూ చిత్రలేఖనమూ ఇందుమతి” చదవాలి.

మల్టీ లెవెల్ మార్కెటింగురంగళ్ళు ఇండియాలోనే కాదు, అమెరికాలోనూ ఉంటారని చెబుతారు రచయిత ” కూర్మా చెపాతి”లో. జీ.డి. పాకం అనే దానికి పూర్తి అర్థం తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

శిల్పం అంటే స్టాట్యూ కాదని, అదొక రైటింగ్ టెక్నిక్ అని మీకు తెలుసా? చైతన్య స్రవంతి అంటే ఏంటో తెలుసా? మనకి వచ్చిన ఆలోచన వచ్చినట్లు పేపర్ మీద పెట్టేయడమే ఈ టెక్నిక్ లోని అందం అంటూ చెబుతారు రచయిత “చైతన్య స్రవంతి”లో.

పాతికేళ్ళ క్రితం నాటి తాజా వార్తలకీ, నేటి బ్రేకింగ్ న్యూస్‍కీ మధ్య తేడాని చమత్కారంగా చెప్పారు “తాజా వార్తలు”లో. వార్తలు చదివేడప్పుడు ఓ ప్రముఖ న్యూస్ రీడర్ హావభావాలను వర్ణిస్తారు రచయిత. దూరదర్శన్ లోని వార్తలు గుర్తొచ్చి పెదాలపై నవ్వు కదలాడుతుంది. ఓ ప్రముఖ టివి సీరియల్ టైటిల్‍ని వ్యంగ్యంగా మార్చారు రచయిత “దక్షిణానికి వెళ్ళే రిక్షా” అంటూ. ఆ సీ……రి……య………ల్ పేరేంటో చాలా మందికి వెంటనే స్ఫురిస్తుంది.

“మీరు తెలుగువాళ్ళా?” అని అడిగాడతను చక్రాన్ని. చక్రవర్తి ఆ ప్రశ్నకి ఉబ్బితబ్బిబైపోతూ, “నో, నోహొ, మాది హైదరాబాదు” అన్నాడు గర్వంగా. ఇలాంటి
వాక్యాలతో సున్నితంగా నవ్విస్తునే, చురకలంటిస్తారు రచయిత “ఎకానమీ కాగ్గోల”లో.

“ఉత్తుత్తినే” చదువుతుంటే నవ్వాగదు. టెలిగ్రాంకి ఉత్తరానికి తేడా ఏంటో ఇది చదివితే తెలుస్తుంది. పదిమార్కుల ప్రశ్నకి ఎంత జవాబు రాయాలో ఇది చదివితే అర్థమవుతుంది.

“పేరాశ”లో తల్లిదండ్రులు పిల్లలకి పెట్టిన పేర్లు గమ్మత్తుగా ఉంటాయి. మొదటి పిల్లకి ఆరాటం, రెండవ పిల్లకి పోరాటం, తర్వాత పుట్టిన అబ్బాయికి నీరాటం, తర్వాతి పిల్లాడికి వనాటం…… అని పెట్టేసాడో దేవుడిని నమ్మని శాల్తీ. అంతేకాదు తన పేరు లోని ప్రహసనాన్ని కూడా హాస్యంగా వివరిస్తారు రచయిత.

“ఎస్. పి. శ్రీనివాస్” అనే టైటిల్ చదివి, ఇదేదో త్వరలో తీయబోయే క్లాస్ మాస్ క్రైం హారర్ సెక్సీ, మిక్సీ సినిమా పేరు అనుకోవద్దంటూ మొదలుపెడతారు రచయిత. ఎక్కాలు అప్పజెప్పేపద్ధతిని నేర్పుతారు, నక్షత్రాల పేర్లు, తెలుగు సంవత్సరాల పేర్లు అప్పచెప్పడం ఎలాగో తమాషాగా చెబుతారిందులో.

“సినిమా పేర్లు ఒక తులనాత్మక పరిశీలన” అనే రెండు భాగాల గల్పిక పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. నేటి నిర్మాతదర్శకులకు తగినన్ని టైటిల్స్, కాప్షన్స్ అందిస్తుంది.

శనివారం కోసం ఎదురుచూసీ చూసీ, ఆ రోజూ తనకు నచ్చినట్లు ఉండాలనుకుంటూంటారు రచయిత. కానీ ఏ శనివారం అలా జరగదు. చివరికి విసుగెత్తి, “శనివారం నాది… కాదు” అని అంటారు.

గుంగుస్వామి కథ చదివితే, నేటి నకిలీబాబాల చరిత్రలు కళ్ళముందు కదులుతాయి. ఓ అమాయక భక్తురాలు అడుగుతుంది ” స్వామీ, నేను అంటే ఎవరు స్వామీ?” దానికి బదులుగా గుండు గుల స్వామి గారు “నేను అంటే నే… ను. నీలోనూ నేనే, నాలోను నేనే ” అని సెలవిచ్చారు. ఇంతలో రచయితని పాటపాడమని అడిగాడతని మిత్రుడు. రచయిత పాడిన పాటకి, అందరూ కలసి మీద పడి నోరు నొక్కేసారు. ఆ పాటేమిటో తెలుసుకోవాలంటే “గుంగు
స్వామి” చదవండి.

కడుపుబ్బా నవ్వుకోడానికి “పెళ్ళినాటి ప్రమాణాలు” చదివితీరాల్సిందే.

వీటిని ఇదే వరుసలో చదువుకోనవసరం లేదు, దేన్నుంచయినా మొదలుపెట్టచ్చు. హాయిగా నవ్వుకోవచ్చు. 160 పేజీల ఈ పుస్తకం పాఠకులని ఏ మాత్రం నిరాశపరచదు. ఏకబిగిన చదివిస్తుంది. మనం పొందే హాయినవ్వులకి అరవై రూపాయల వెల తక్కువే అనిపిస్తుంది.

నిత్యజీవితంలోని టెన్షన్స్, ఒత్తిడులు, ఆందోళనలూ, ఆదుర్దాలు…. వగైరాలన్నింటి నుంచి కాసేపయినా దూరంగా ఉండాలనుకుంటే, ఈ పుస్తకం చదవండి. దిగుళ్ళు, బెంగలు అన్నీ మాయమై, కొత్త ఉత్సాహం వస్తుంది. సినీ పరిభాషలో “కెవ్వు… కేక… అదుర్స్” అని మీరే అంటారు.

సత్యం.. సత్యం.. పునః సత్యం.

గతంలో కౌముదీ.నెట్ లో నెలవారీ ప్రచురితమైన గల్పికలని పుస్తకంగా ప్రచురించిన వారు విజయవాడ నవోదయ పబ్లిషర్స్. ఈ పుస్తకం నవోదయ పబ్లిషర్స్ వద్ద, రచయిత వద్ద, హైదరాబాదులోని సంస్కృత భాషా ప్రచార సమితి (అబిడ్స్) వారి కార్యాలయంలోనూ, ఇంకా ఇతర పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది.

రచయితని phanidokka@yahoo.com అనే ఈమెయిల్‌లోనూ, 404-435-0309 అనే ఫోన్ నెంబరులోనూ సంప్రదించవచ్చు.

ఇది బంధుమిత్ర సపరివార సమేతంగా చదవదగ్గ పుస్తకం అని చెప్పడానికి నేను ఏ మాత్రం సందేహించను.

You Might Also Like

2 Comments

  1. Seetharam

    మరో ముళ్ళపూడి రమణ గారు పుట్టి నేను రమణ గా ఆల్రెడీ ఉన్నాను కదాన్చెప్పి శీనివాసుడి పేరెట్టుకున్నారంతే… శ్రీనివాస ఫణికుమార్ గారు కూడా ముళ్ళపూడి వారంత, ఇంకా ఎంతో అవ్వాలని మా అందరి ఆకాంక్ష. ఈ పుస్తకము కొని చదివిన వారు విచారించరు. అది తథ్యము..

    సీతారామం

  2. రాజన్

    వెంటనే పుస్తకం కొని చదివెయ్యాలన్నంత ఉత్సాహం కలిగించింది మీ వ్యాసం. సరదాగా చదువుకుని, రొటీన్ లైఫ్ ఒత్తిడుల నుండి కాసేపు రిలాక్స్ అవడానికి.. ఓ మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.

Leave a Reply