హరిశంకర్ పార్శాయి రచనల ఆడియో
హరిశంకర్ పార్శాయి (1924-1995) ప్రఖ్యాత హింది రచయిత. వ్యంగ్య, హాస్య రచనలకు వీరు పెట్టింది పేరు. సరళంగా, సూటిగా ఉండే వీరి శైలి, సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితుల తమ కలమనే కొరడా ఝులిపించింది. సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు.
వీరి వ్యంగ్య రచనల సంకలనం ఎలా చేతజిక్కిందో తెలీదు గానీ, చిక్కిన కొన్ని గంటల్లోనే పార్శాయిగారి సాహిత్యపు చినుకులు తడిసి ముద్దైయ్యాను. ప్రేమ్‍చంద్, గుల్జార్ కథలు, హరివంశ్ రాయ్ బచ్చన్ కవితలు తప్పించి హింది సాహిత్యంతో నాకు పరిచయం లేదు. అందుకని హిందిలో వ్యంగ్యం చదవటం అదే మొదటిసారి. ఆ కొత్తదనం వల్ల కొంత నచ్చిందనుకున్నా, చదువుతున్న కొద్దీ కట్టిపడేసే నిశిత దృష్టి, చమత్కారం ఆయన రచనల్లో పుష్కలంగా ఉన్నాయని చదివే కొద్దీ తెలుస్తూ ఉంది.
పార్శాయిగారి రచనలు మార్కెట్లో విరివిగానే లభ్యమవుతున్నా, అంతర్జాలంలో ఆయన కథలను కొన్ని పోడ్‍కాస్ట్ లుగా మలచి archive.org లో పెట్టారు కొందరు సాహిత్యాభిమానాలు. ’ఆవాజ్’ అనే రేడియో ఛానల్ (?) పై ఇలా అనేక ప్రముఖ హింది కథకుల రచనలను “సునో కహానీ” శీర్షికన చదివి వినిపిస్తున్నారు. అలా పార్శాయిగారి రచనల్లో ఈ కింది కథలను, లేక వ్యంగ్య వ్యాసాలను వినవచ్చును.
అపీల్ కా జాదూ: ఈ కథలో విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలను తగ్గించమని ప్రధానిని వేడుకుంటారు జనం. వ్యాపారస్తులకు ప్రధాని అపీల్ చేస్తారు, నైతికతను పాటిస్తూ న్యాయమైన ధరలకు సరుకులను అమ్మమని. ఆ అపీల్ మహత్తు ఏమో గానీ, అందరు వ్యాపారస్థులు సరసమైన రేట్లకు అమ్మటం మొదలెడతారు. అప్పటివరకూ నడుం వంగిపోయే ధరల భారాన్ని మోస్తున్న సామాన్య జనం, ఇంతటి పెనుమార్పుకు ఎలా స్పందించింది అన్నది పూర్తి కథ విని తెల్సుకోవాల్సిందే! పార్శాయి మార్కు వ్యంగ్యాన్ని పదినిముషాల్లో పరిచయం చేసుకోడానికి చక్కని అవకాశం.
అశుద్ధ బేవఖూఫ్: మూర్ఖులందు శుద్ధ మూర్ఖులు వేరయా! అని చెప్తున్నారు రచయిత ఇందులో. మూర్ఖులలో శుద్ధ మూర్ఖుడినైనా కాకపోతిని అంటూ బాధపడుతూనే, అశుద్ధ మూర్ఖుల సాధకబాధకాలను కళ్ళకు కట్టినట్టు వివరిస్తారు. ఎంతగా అంటే, ఒక్కోసారి పార్శాయిగారు చెప్తున్న ఇమేజ్ ఏదో కళ్ళముందు నుండి పోయి, మన స్వీయానుభవమేదో మదిలో మెదలాడుతుంది. చల్లకొచ్చి ముంత దాస్తున్నారని తెలుస్తున్నా, ముంత కనిపిస్తున్నా కనిపించనట్టు ఉండడమేంటో మరోసారి గుర్తు చేసుకోవాలంటే, ఓ ఎనిమిది నిముషాలు మీవి కాదనుకోండి.
బద్‍చలన్: అనగనగా ఓ ఊరికి ఓ ఆఫీసరు ట్రాన్సఫర్ అవుతాడు. అతడికన్నా ముందే అతడు పాత ఊర్లో చేసిన ఘన కార్యాలన్నీ అందరికి పరిచయం అవుతాయి కొత్త ఊరిలో. అందరూ మూతి బిగించేవారు, తల తిప్పుకునేవారే తప్ప పలకరించేవాళ్ళే లేరు! ఏమన్నా అంటే, “ఇది మర్యాదస్థులుండే వీధి” అంటారు. మరి అంతటి మర్యాదస్తుల మధ్య ఈయనెలా నెగ్గుకొచ్చాడు? ఎవరిది మర్యాద? ఏది అమర్యాద? అని ఆలోజింపజేసే బుల్లి వ్యాసం.
బద్లీ: మంచివాళ్ళకి మంచే జరుగుతుందా? నిజంగా? అణ్యం పుణ్యం ఎరుగని వాళ్ళకి ఎందుకో మరి కష్టాలు? ఒక ఊర్లో ఓ “భోళా-రామ్” అతడి భార్య సర్వగుణ సంపన్నురాలు. సంతానం లేకపోయినా, భోళారామ్ తమ్ముడినే సొంతకొడుకులా చూసుకుంటుంటారు. ఆ తమ్ముణ్ణి పట్టణం పంపి పై చదువులు చెప్పించాలని. కానీ వాణ్ణి వదిలి ఉండలేరు. అందుకని ఈ ఊరి నుండి పట్టణానికి అర్జీ పెట్టుకుంటాడు. పని విషయంలో నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండే తను, అడిగితే ఇన్స్పెక్షన్ కు వస్తున్న పెద్దాఫీసరు కాదనడని నమ్మకం. మంచివాడికి ఏం మంచి ఒరిగింది? అన్నది కథ చివర్లోనే తెలుస్తుంది. చక్కని చిక్కని కథ! బలంగా తాకే కథ! వినమనే చెప్తాను.
బెచారా, భళా ఆద్మీ: మనకన్నా ఎక్కువ స్థితిలో ఉంటే కన్నుకుట్టేస్తుంది. మనకన్నా దీనస్థితిలో ఉంటే జాలి జడివానలా కరుస్తుంది. మనకెలాంటి కష్టనష్టాలు వాటిల్లనంత వరకూ ఎదగలేకపోతున్న అవతలివాడిని చూసి నోరు చప్పరించి, “పాపం, మంచి ఆయనే! అయినా కష్టాలు” అనేస్తుంటాం. మంచివాడికి మూకుమ్మడిగా ప్రకటించే ఈ సూడో-అభినందనను సోదాహరణంగా వివరిస్తారు రచయిత.
బోర్: “నడిరోడ్డు మీద హత్యాప్రయత్నం చేసేవాడిని వెంటనే లాక్కుపోయే పోలీసు, అదే ఒక మహా-బోర్ చేతిలో పడి నరకం అనుభవిస్తుంటే, ఏ పోలీసూ, ఏ చట్టమూ కాపాడలేదు!” అంటూ తమ గోడును వెల్లబోస్తుంటారు, రచయిత. అనేక సందర్భాల్లో అనేక విధాలుగా బోర్‍ల బారిన పడి తల బొప్పి కట్టించుకున్న విధానాన్ని వినితీరాల్సిందే! (ఈ కథ వినిపించినవారు అంతగా బా చదవలేదు. కొంచెం సర్దుకుపోవాలి మరి!)
కార్డ్స్: శుభాకాంక్షలు తెలుపుతూ రెక్కలు కట్టుకు వచ్చిన గ్రీటింగ్ కార్డునూ, ఉన్న కోటాను తెగ్గోయించుకొని మొహం వేలాడిపోతున్న రేషన్ కార్డుకి మధ్యన నలిగిపోయే సామాన్యుడి ఆలోచనలు ఇందులో చూడొచ్చు. గ్రీటింగ్ లో ఉన్న శుభాకాంక్షల్లా కొంచెం ఆశావాహ దృక్పథం అవలంబిద్దామంటే, వాస్తవాన్ని కఠోరంగా గుర్తు చేసే రేషన్ కార్డు వెరసి, ది గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్ తమాషా!
చార్ బేటే: నలుగురు కొడుకులను కని, పెంచి , పెద్దజేసి, స్వర్గస్థులవుతారు ఓ వృద్ద దంపుతులు, స్వర్గంలో విడిపోడానికి ఈ కొడుకులు చేసిన నిర్వాకమేమిటో చెప్పే కథ “చార్ బేటే”.
డిప్యుటి కలెక్టర్: ప్రభుత్వోద్యాగాలకు అభ్యర్థులను స్వీకరించే ప్రక్రియను హాస్యస్ఫోరకంగా వివరించారు ఈ చిట్టి కథలో. రికెమండేషన్స్ పనిజేసే తీరునూ చెప్పారు. మధ్యలో వచ్చే తవిక హైలైట్.
డపోల్‍శంక్ మాస్టర్: ఇది రెండు నిముషాల ఆడియో. సినిమాలో ఒక చిన్న సీన్ అనుకోవచ్చు. ఇదివరలో చాలా చూసే ఉన్నాం. రికమెండడ్ కాండిడేట్ ని అడిగే ప్రశ్నలకు, తక్కిన వారిని అడిగే ప్రశ్నలకు మధ్య వ్యత్యాసం.
ఖేతి: బయటదేశాల మీద ఆధారపడకుండా ఆహారధాన్యాల విషయంలో ప్రగతి సాధించాలని ప్రభుత్వం చేసిన వినూత్న ప్రయోగం, పండించడానికి రైతులు అవసరం లేరు, కాగితంపై వ్యవసాయం చేసేయచ్చనే ఈ మూడు నిముషాల కథ, నిజంగానే మన ప్రగతికి అద్దం పడుతుంది.
ముండన్: మంత్రిగారి గిరిజాల జుట్టు రాత్రికి రాత్రి మాయమైతే.. మీరే వినండి.
నయా సాల్: కొత్త ఏడాది శుభాకాంక్షలు, పార్శాయి స్టైల్ లో.
ఉఖడే కంభే: మరో పార్శాయి మార్కు కథ.
ఆశ్లీల్: అశ్లీల సాహిత్యం పదికాలాల పాటు చల్లగా ఎందుకు ఉంటుందో తెలియజెప్పే కథ. 😉
పై ఇచ్చిన లింకులలో అత్యధికంగా కథలు చదివి వినిపించింది అనురాగ్ శర్మ. అవసరమైన నాటకీయతను జొప్పిస్తూ, స్పష్ట ఉచ్చరణతో బాగా చదివారు. పుస్తకాలు అందుబాటులో లేని కారణంగానో, లేక అలవాటు తప్పిపోయి హింది పఠనం జోలికి వెళ్ళనివారికో, వీరు చేసిన ఈ ప్రయత్నం చాలా ఉపయోగకరం. పార్శాయిగారి రచనలు నిడివిలో తక్కువగా ఉండడం చేత కూడా వినడానికి అనుకూలంగా ఉన్నాయి. డౌన్ లోడ్ చేసుకొని, ఏ ఐపాడ్ లోనే పడేసుకుంటే, ఒక ఐదు పది నిముషాల ఆటవిడుపు కావాలనుకున్నప్పుడల్లా వినొచ్చు. ఆనందించండి.
2012లో చదివిన పుస్తకాలు | పుస్తకం
[…] శ్రద్ధా కా దౌర్ – హరిశంకర్ పార్సాయి: ఈయన కూడా find of the yearయే! ప్రేమ్‍చంద్, […]