నాన్న మామ మేము ’అను’ తోక కొమ్మచ్చి – ముళ్లపూడి అనూరాధ

ముళ్లపూడి వెంకటరమణ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె ’స్వాతి’ పత్రికకు రాసిన ఈ వ్యాసాన్ని ఇక్కడ పునఃప్రచురిస్తున్నాం. ఈ వ్యాసంలో పుస్తకవిషయాలకన్నా తెలుగుజాతి ఋణపడిపోయిన బాపూరమణల గురించి కొత్త కోణంలో చూపిస్తుంది కావున ఇక్కడ ప్రచురిస్తున్నామని గమనించగలరు. ఈ వ్యాసాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురించేందుకు అనుమతిచ్చిన అనురాధ ముళ్లపూడి గారికి, యునికోడు వర్షెన్ ఇచ్చిన జంపాల చౌదరిగారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. – పుస్తకం.నెట్

నేను… ముళ్లపూడి గారి అమ్మాయిని. నాన్న, ఒక పుస్తకం రాశారు. కోతికొమ్మచ్చి, దానికి రెండు తోక కొమ్మచ్చిలు కూడా  రాశారు. దాంట్లో నాన్న, మామ – అదే బాపు గారు – తీసిన సినిమాలు, కలిసిన నేస్తాలు, చేసిన అల్లర్లు, పాడిన రాగాలు.. వీటి గురించి చాలానే రాశారు.

NTR, ANR, సంజీవరెడ్డి, PVN లాంటి పెద్దవారి దగ్గర్నించి, రోడ్‌సైడ్ బుక్‌సెల్లర్స్, లైట్ బాయ్స్, వంటాళ్ళు… అందరికీ స్పాట్ లైట్ ఇచ్చారు.

మరి మాకో? అని మేము అడిగితే… అబ్బే, మన ఫామిలీ గురించి స్పెషల్ గా చెప్పాల్సింది యేముందమ్మా… అందరి ఫామిలీ లాగానే మనం కూడా..

కావొచ్చు, కాని…. మాలాంటి గ్రేట్ ఫెల్లోస్ గురించి కూడా చెప్తే, ఇంకా బాగుంటుందేమో? అని అడిగాను…

రాస్తానమ్మా… ఇదిగో రాస్తున్నా…. రాయాలా?? అని అడుగుతూనే, వెళ్ళిపోయారు. .. చెప్పకుండా మాయమైపోయారు… రాముడి పని పూర్తి చేశారు కాని.. మరి నా పనో?

లోగడికి విష్ణుమూర్తి కల్లో కనిపించి, ఏం వరం కావాలో కోరుకోమంటే, మా నాన్నని ఓ రచయితని చేసేయ్, మిగతాది నేను చూస్కుంటా అన్నాను…. మరి, యేం చూస్కున్నా?? ఆయనని ఎంత వేడుకున్నా, మా ఫామిలీ గురించి ఒక్క ముక్క రాయలేదు కదా… అందుకనే, తెగించేసి, నేను తెలుగూస్ అయినా కూడా, తెలుగులో కొన్ని నిజాలు రాసేయాలని సాహసించాను.

మరి పాఠకులకి ఇంటరెస్ట్ ఉండదేమో? అని నాన్న కల్లో కనిపించి, కొంచం ఖంగారుగా అడిగారు.
మరి నువ్వేమో రాయలేదు, మామకేమో పలుకే బంగారమాయె కదా? నీకంటే కూడా  మితభాషి… అన్నాను, నిద్రలోనే…
మరి కాన్వెంట్ పిల్లవి, నీకు తెలుగు రాదేమో? ఐనా, ఎవరిగురించి రాయాలని నీ తాపత్రయం? అని అడిగారు…

అల్లాగే,  మహాప్రభో! చెప్తా!

నా పేరు అనూరాధ. నాకు ఇంకో పేరు కూడా వుంది.
మా అమ్మ నన్ను రాక్షసీ అనేది.
నాన్న నన్ను ఇంగ్లీషులో రాక్సీ అని పిలిచేవారు.
మా బామ్మ నన్ను నల్ల పిల్ల అనేవారు.
నేను యేడిస్తే, అబ్బే, నువ్వు నల్లగా వున్నావనట్లేదమ్మా… నల్ల బంగారంలా వున్నావు అంటున్నారు. అంటే గోల్డ్ అన్నమాట.. అందుకని, నాన్న గోల్డ్స్ అని పిలిచేవారు. నాకు కూతురు పుట్టాక, దాన్ని గోల్డ్‌స్పాట్ అని పిలిచేవారు.

ఇంకా చాలా పేర్లు కూడా వున్నాయి…. రాకాసి, శూర్పణఖ, చుప్పనాతి, అని…
ఇంకా కొంతమంది, చాల కోపం వస్తే, చిన్న కక్కి అనేవారు. . అంటే మా బామ్మ పేరులెండి…
కొన్ని అనవాయిడబుల్ కారణాలవల్ల, నేను కొంచం తెలుగూస్ గా పెరిగేశాను. ఎలా??
నన్నూ ముందర అందరిలా చక్కగా ఒక తెలుగు బడిలోనే వేశారు. నేను రోజూ పొద్దున్నే, స్కూలుకి వెళ్ళేముందర, ఎదగడానికి తొందర యెందుకని ఏడుస్తూవుంటే, మా బామ్మ నన్ను, మా అన్నయ్యని, తమ్ముడిని రిక్షాలో స్కూల్లో దింపడానికి వొచ్చేవారు. సరే నా యేడుపు చూసి, నన్ను క్లాస్ లోకి యెత్తుకుని తీస్కెళ్ళి… ఆవిడకి మర్యాదతో వేసిన కుర్చిలో సెటిల్ అయ్యి, నన్ను కూడా ఒళ్ళో కూచొపెట్టుకుని, టీచర్ని పాఠం చెప్పమనేవారు. టీచర్ బిక్క మొహం వేసుకుని, ప్రిన్సిపాల్‌తో చెప్తే, ఆవిడ నాన్నతో ఇంగ్లీషులో కంప్లైన్ చేశారు. నన్ను  ఆ తెలుగు స్కూల్ సీట్ లోంచి దింపేసి, ఒక కాన్వెంట్ స్కూల్ సీట్ కి యెక్కించారు. ఇక తెలుగు యేం వస్తుంది??

మా ఇంట్లొ చాలామంది వుండేవారు. యెప్పుదూ హౌస్‌ఫుల్లే.
నాన్న, అమ్మ, నేను, మా అన్న, మా బామ్మ, బాపు గారు విత్ అమ్మగారు అండ్ ఫామిలీ, మా అత్తయ్యగారు అంటె నాన్న అక్కయ్య, మా బాబాయి, పిన్ని, వాళ్ల అబ్బాయి, అందరం ఒకే ఇంట్లో వుండేవాళ్ళం. మేము మొత్తం ఆరుగురు కోతులు, ప్లస్ రెండు బాస్ కోతులు. అంటే, బాపు గారి పిల్లలు ముగ్గురు, మా అన్న, నేను, మా తమ్ముడు… ఇంక మా మీద అధికారం చెలాయించడానికి బాపు గారి అక్కగారి కొడుకు రంగారావ్, మా అత్తయ్యగారి రెండో కూతురు కామేశ్వరి…

మామ, నాన్న  మీద ప్రతి ఒక్కరి ఇంఫ్లుయెన్సు ఉండేది… ముఖ్యంగా, వాళ్ళ అమ్మగార్లు, అక్కయ్యగార్ల మీద,  చాలా మర్యాద, భక్తి.
బాపుగారి అమ్మగారు యెంత మెత్తనో, మా బామ్మ అంత గట్టిగా వుండేవారు.  ఇంత మంది లేడీస్ ఉన్న చోట్లో మరి పాలిటిక్స్ పుట్టలు పుట్టలు పుట్టుకురావటండీ? యేమో మరి, రాలేదు. అంటే మా ఆడవాళ్ళం అందరు,  సాధు సంతులు అని అనుకునేరు… పంతాలు, కోపాలు, ఆర్గ్యుమెంట్లు, సెంటిమెంట్లు, నాన్న స్క్రిప్టులా, మామ కార్టూనులా, మహదేవన్ గారి బాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సహా 35 ఎమ్మెమ్ ఈస్ట్-మెన్ కలర్ సినిమాలా వుండేది, మా ఇల్లు.

నాన్నకి, మామకి పొద్దస్తమానం కళాపోసనే… అదయ్యాక, కాసింత పనులు, బిజినెస్సులు. కాని, రోజూ భోజనమయ్యాక, మామ రామాయణం, భాగవతం, ఫెయిరీ టేల్స్, తెనాలి రాముడు కథలు చెప్పేవారు. నాన్న సాయంత్రం మమ్మల్ని తన చిన్ననాటి జ్ఞాపకాలు,  జోక్సులు, సినిమా అనెక్డోట్స్ తో ఎంటె‌ర్టెయిన్ చేసేవారు. అవే మాకు లైఫ్ లెసన్స్ గా మారాయి. మామ రామాయణ గాధలు, నాన్న జీవిత కధలు ఈ రోజుకీ మాకే కాధు, మా పిల్లలకి కూడా ఇన్ఫోటైన్‌మెంట్ ఛానెల్సు.

చెప్పొచ్చేదేంటంటే, మా రెండిళ్ళ అడ్మినిస్టేషన్ మొత్తం అంతా అమ్మ, అత్త చూసుకునేవాళ్ళు. ఇంట్లో పనులు, పనివాళ్ళు, పిల్లలు, పూజలు అమ్మ చూసుకునేది; బయట కూరలు, బేరాలు, పిలుపులు, పేరంటాలు, ఇవన్నీ అత్త పూచీ. ముందరనించే ఇద్దరు యెవరికి వారే రోల్స్ డిఫైన్ చేసేసుకున్నారు, అందువల్ల, కాంట్రవర్సీ యెక్కువ రాలేదు. కాంట్రవర్సీ అంటూ వచ్చేదల్లా మా బామ్మకి, అత్తకి, నాకు…

మా బామ్మకేమో రాధాస్వామి సత్సంగ పిలుపులు, అత్తకేమో పెత్తనాల గొడవలు, నాకేమో ఫ్రెండ్సుల బాధ్యతలు… మరి మాలో కారు యెవరికి దక్కాలి? హా! నాన్న యెన్ని రాజకీయ బేతాళ కథలు రాసినా, దీనికి మట్టుకు జవాబు చెప్పలేకపోయారు… పెద్దావిడ, పెంచిన ప్రాణం, జీవన సత్యాలు నేర్పిన తల్లి/ గురువుకా? లేక, అంత పెద్దింటి పిల్ల, సొంతాలన్నీ వొదులుకుని, తన ఒక్కగానొక్క స్నేహితుడిని నమ్మి వొచ్చిన ఇంటి కోడలికా? లేక, ‘లేదు’ అన్న మాటకి అర్ధం తెలీని పసిగుడ్డు, దేశ సేవలకోసం వారమంతా కష్టపడి, చెమటోడ్చి స్కూలుకి వెళ్ళొచ్చి, ఉద్ధరించిన సొంత కూతురికా??? ఆ సమస్యకి, మేము ముగ్గురం – అహా యెంత  గొప్పవాడో, నా తరఫునే జడ్జిమెంట్ ఇచ్చాడు/ రు అనే అనుకునేవాళ్ళం. అదీ ముళ్లపూడి గారి మాయ.

అత్త అంటే నాన్నకి చాలా గౌరవము…  దాని కంటే యెక్కువ… గారాబం. నాకంటే కూడా! ఒట్టు! డాడ్ ప్రామిస్! అత్త యెంతంటే అంతే… అన్నిటికీ ఓ యస్, అలాగే అమ్మాయ్, అనేవారు… అత్త చేత ప్రతి పండగకి ఆవడలు అడిగి చేయించుకుని,  లొట్టలేసుకుని పరమానందంగా తినేవారు… పళ్ళన్నీ తీసేశాకకూడా! అత్తకైతే నాన్నేమో ఒక బిగ్ బ్రదర్, తండ్రి, బెష్టు ఫ్రెండ్ కూడా… అత్తకి తెలిసిన పద్ధతిలో, యెంతోకొంత తను కూడా నాన్నని ఇన్స్పైర్ చెసేది. మరి యెప్పటికప్పుడు, “వెంకట్రావ్, పైన మోటార్ పనిచెయ్యట్లేదు, వెంకట్రావ్, ఇంకా కార్పెంటర్ రాలేదు… వెంకట్రావ్!!! ఇవ్వాళ డ్రైవరొస్తాడా?!!” అని రోజుకి మూడుసార్లు, వారానికి ఇరవైరెండు సార్లు ఇన్స్పైర్ చెయ్యకపోతే, నాన్న గోదావరి గట్టు మీద క్యాంపేసేవారా, మనందరికి ఇంత గొప్ప డవిలాగులు అందించేవారా!! అదే విష్ణు మాయ..

ఇంకా మీకు ఇంకో అమ్మమ్మగారి గురించి చెప్పలేదుగా… సత్తిరాజు సూర్యకాంతమ్మ గారు. నాన్నకి ఉద్యోగాల వేటల సమయంలొ అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మల్లో,  ప్రముఖ పాత్ర యీవిడదే.. మామకంటే నాన్నే యీవిడకి యెప్పుడూ ఫస్టు. ఏమి వంట చేసినా, నాన్నని తల్చుకునేవారు, నాన్నకి తన వాటా పక్కన ఉంచేవారు. ఆ అలవాటే మామకి కూడా వొచ్చింది.. యెంత పెద్ధ ఆర్గుమెంట్లైనా, అన్నం దగ్గర కూచునేసరికి, మొదటి ముద్ద కలపకుండా, ఒక ప్లేట్‌లో  నాన్నకి ఆ రోజు యేం చేస్తే అది.. గుత్తివంకాయ కూరా.. ఇది వెంకట్రావుకి పంపించు, చాల ఇష్టం…  ఈ కందిపప్పు పచ్చడి, పచ్చిపులుసు తొరగా తీసుకెళ్ళు, మళ్ళీ మీ నాన్న భోజనం అయిపోతుంది అనేవారు..

హూం,.హూం.. సెంటిమెంట్లు ఆపు అంటున్నారు.

మామ్మ.. అదే సూరమ్మగారు – మా అందరికి అమ్మమ్మగారు – చెంగల్పట్టు శాంతమూర్తులు.. మా బామ్మ అందరితో పేచీలు పెట్టుకుంటే, అమ్మమ్మగారు ఆవిడకి సద్దిచెప్పేవారు… చాల బెస్టు కుక్స్, నాన్న చెప్పేవారు. అమ్మో ఆవిడ హ్యూమర్ కూడా ఆవిడ చేసే పెసరపప్పు పచ్చడిలో వేసే పచ్చిమిరపకాయ లాగ చుర్రు మనేది…  ఒకసారి, పండగకి, అమ్మని పోరి పోరి షిఫాన్ చీర కొనిపించుకున్నా.” అమ్మమ్మగారూ, ఆశీర్వదించండి” అన్నాను, దణ్ణం పెడుతూ.. “కళ్యాణప్రాప్తిరస్తు… బావుందమ్మా చీర.. దేవతావస్త్రాలు కాబోలు, ఖరీదు చాలా అయ్యుంటుంది…, కదూ?” అని అడిగారు, విత్ ఎ ట్వింకిల్ ఇన్ హెర్ ఐ. తల్చుకుని, తల్చుకుని, యెంత నవ్వుకున్నానో…

అమ్మమ్మగారు స్కూలుకి వెళ్ళారో లేదో తెలియదు కాని, పద్యాలు మట్టుకు యెంత బాగా చెప్పేవారో. ఆవిడ చాలా కళాపోసకురాలు. బామ్మ హిందీ పండితురాలైతే, అమ్మమ్మగారు తెలుగులో పులి, రియల్ టైగర్. ఇంక ఆవిడ పోతన పద్యాలు మొదలుపెట్టారంటే, వింటూనే వుండచ్చు. కుప్పించి యెగసిన కుండలమ్ముల కాంతి, అని మొదలుపెట్టి, దానికి ఫుల్ వ్యాఖ్యానం చెప్పేవారు. వింటూవుంటే,  అస్సలు బుర్రలో టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా వుండేది, వితౌట్ కమర్షియల్   బ్రేక్స్. అమ్మమ్మగారికి శరత్‌చంద్ర నవలలు అంటే యెంత పిచ్చో… ఆ కథలన్నీ చెప్పెవారు, సీన్  బై సీన్, ఫ్రేం బై ఫ్రేం… ప్లస్ వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు, నాన్న మామల అల్లర్లు, ఓహో… ఇంక యెంతో గొప్ప మెడ్లీ అంటే నమ్మండి.. గ్రౌచో మీట్స్ వాల్మీకి మీట్స్ లారెల్ అండ్ హార్డీ మీట్స్ పోతన మీట్స్ బాపు-రమణ…

నెక్స్టు, మా అత్తయ్యగారు – నాన్న అక్కయ్య. మాకు చాల చిన్నప్పుడే, మా మావయ్యగారు పోయారని, నాన్న అత్తయ్యగారిని, వాళ్ళ చిన్న అమ్మాయి కామేశ్వరిని మద్రాస్ తీసుకొచ్చేశారు. పెద్దకూతురు లక్ష్మిని, మా బాబాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. అత్తయ్యగారు గ్రేట్ కుక్,  చాల క్రియేటివ్ కూడా. శాంతమైన స్వభావం. అస్సలు దేనికీ ఎక్సైట్ అయిపోరు, మా బామ్మ లాగ. చుట్టూ యెంత కలవరమౌతున్నా కూడా, సైలెంటుగా లేసులు అల్లేస్తూ వుండేవారు. మా బామ్మ ఆ రోజు యెంత టెన్షన్  పెట్టారో తెలుసుకొవాలంటే, సాయంత్రానికి, అత్తయ్యగారు యెన్ని మైళ్ళు లేసులు అల్లారో చూస్తే తెలిసిపోయేది… చిన్న కూతురు కామేశ్వరిని బియ్యే అయ్యాక, వల్లభజోశ్యుల నరసింహారావు గారితో పెళ్ళి చేశారు. నాన్న అన్నయ్యగారిని పెద్ద అల్లుడు అని పిలిచేవారు. రిటైరయ్యాక, అన్నయ్యగారు, కామేశ్వరి, వాళ్ళ అమ్మాయిలతో హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు.

మా బాబాయి కూడా చాలా స్వీట్ అండ్ షై గా వుండేవారు. ఆయనకి కూడా చాల గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమర్. వాళ్ళ ఆవిడ, అదే, మా పిన్ని,  మా తమ్ముడిని,” ఒరే గాడిద కొడకా ఇలా రా” అంటే… “యెవరు తల్లీ గాడిద – నువ్వా? నేనా?” అని నవ్వేవారు. ఆయన యెంత మంచివారంటే, యెవ్వరు, యెప్పుడు, యేదడిగినా ఇచ్చేసేవారు. వాళ్ళ కొడుకు, ప్రసాద్, అంటే మా తమ్ముడు – అందరికీ తమ్ముడే. ఒరే తమ్ముడునించి, తమ్ముడు మామ, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు గారు… యే వరసతో పిలిచినా తమ్ముడే… సొంతంగా ఒక విడియో స్టూడియో పెట్టుకున్నాడు, వైఫ్ ఉదయ, అసిస్టెంట్ రాధాయై చెన్నైనే యేలేస్తున్నాడు.

బామ్మ, ఆవిడ ముగ్గురు పిల్లలు భలే మంచివాళ్ళు. యెవరైనా కష్టంలో వుంటే చూడలేరు. చుట్టూరా మనుషులు, బాంకులో డబ్బులు లేనప్పుడుకూడా మంచివాళ్ళే. నిజంగా హీరోలు. ప్రసాద్ కూడా అల్లాంటి వాడే, యెప్పుడూ యెవరికో ఒకరికి దానాలు చేస్తూ వుంటాడు. కామేశ్వరి, వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు అస్తమానం దేశసేవలు చేసేస్తూవుంటారు. ఇక మా అన్నగారు చెప్పనే అక్కర్లేధు. నాన్న వాడిని ‘దొర’ అని పిలిచేవారు. దేశోద్ధారకుడు. వాడు చేసిన సోషల్ సర్వీస్ ఇంతా అంతా కాదు

ఇక మిగిలింది రాక్షసి పొజిషన్. తప్పనిసరై ఆ భారం నేను నెత్తిన వెసుకున్నాను. కొన్ని సార్లు ఫామిలీ కొసం యెంతైనా శాక్రిఫైస్ చెయ్యాలికదా.

మామకి ముగ్గురు కోతులు, అదే, పిల్లలు అని చెప్పాను కదా….

పెద్ద అమ్మాయి, భానుమతి. ఇంట్లో గట్టిగా యెవరైనా తుమ్మితే, హోమ్-మేడ్ రెమెడీలతో తయారు. నాన్నకి మామకి ఆవిడే పర్సనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్. వాళ్ళ బావ, రంగారావుని పెళ్ళి చేసుకుని, ఫామిలీతో మద్రాసులోనే సెటిలయిపొయ్యారు. ఇక్కడ వాళ్ళ అత్త మామలకి, బామ్మకి, తరవాత వాళ్ళ అమ్మా-నాన్నకి, మా అమ్మా నాన్నకి… పుదీనా జ్యూసులు, అలోవేరా పేస్టులు, మిరియాల కషాయాలు…. డాక్టర్ కాని డాటర్. ఆహా, యేమి ఆమె మహిమ… భాను ఇటు వొస్తోంది అంటే, ఇక నెప్పి పోయిందే, గాయబ్! పోయె పోచ్చె!.. ఆవిడ రాక తోనే రోగాలు గాయబ్, ఇక మందులు యేల… మా వోల్ మొత్తం ముఠాలో ఫస్ట్‌బార్న్;   అందులోనూ ఆడపిల్ల.. వాట్ ఏ కాంబినేషన్ గురూజీ…ఒక చేతిలో గరిట, ఇంకో చేతిలో బీపీ మెషీన్, ఇంకో చేతిలో… సారీ, యెప్పుడూ నాలుగు చేతులున్నట్టు కనిపిస్తేనూ…

వేణు, మామ పెద్ద కొడుకు. రాక్-అండ్-రోల్ స్టార్‌గా అవతారం యెత్తి,  సీతా కల్యాణంలో చిన్న రాముడి వేషం కట్టి, కళాక్షేత్ర దాసుడు అయ్యి, తరవాత అమెరికా విజయాలు చేశాడు. భువనని పెళ్ళి చేసుకుని ఆపద్బాంధవుడిలా అప్పుడపుడు గెస్ట్ అప్పియరన్సులు ఇస్తూవుంటాడు. కన్నప్ప టైంలొ నాన్నని — భగవంతుడిలా — కాదు — సొంత కొడుకులాగానే ఆదుకున్నాడు. ఇంక చెప్పను, వేణు ఆల్రెడీ తిడుతున్నాడు… మా చిన్నెస్టు కోతి చిన్న బాబు, ఎలియాస్ వెంకట్ ఎలియాస్ CB, ముద్దుల కొడుకు. అందరికీ వాడంటే యెంత ప్రేమో. భక్తగారు వాడిని చిప్‌మంక్ అని పిలిచేవారు. యెప్పుడూ ఒక బ్యూటిఫుల్ స్మైల్‌తోనే కనిపిస్తాడు. పెళ్ళయ్యాక భారతి, CB మా మూడు ఇళ్ళకి గార్డియన్ ఏంజెల్స్‌గా ఇక్కడే సెటిలయ్యారు. మా బామ్మ కి CB అంటే చాలా ముద్దు.. నాన్న, మామ ఏం సినిమా తీస్తే ఆ పేరుతో పిలిచేవారు. బుద్ధిరాజు, బాలరాజు,  రామరాజు… ఇంకానయ్యం, ఆవిడ వుండగా వాళ్ళు కోతికొమ్మచ్చి అని సినిమా తీయలేదు…

మేము ఆరుగురు కోతులు పెద్ద అవుతూవుండగా, మాకు జూనియర్ కోతులు ముగ్గురు యాడ్ అయ్యారు. శంకర్‌బాబాయి (అంటే మామకి తమ్ముడు) శాంత పిన్ని వాళ్ళ పిల్లలు అరుణ, అపర్ణ, అనిల్ మా ఇంటి దగ్గిరకే షిఫ్ట్ అయ్యారు, వైజాగ్ నించి. ఇప్పుడన్నమాట అసలు మొదటి లవ్ స్టోరీ మొదలు. లేత మనసులు మూగ మనసులుగా మారి, మా అన్న శంకర్ గారి కుమార్తె అరుణశ్రీకి ముత్యాల ముగ్గులు వెయ్యడం నేర్పించి…  ఇంటిగుట్టు చెప్పి మన ఫామిలీకి కళంకం తీసుకురావట్లేదు, అగ్రజా… ఊరికే, హాస్యం చేస్తున్నా, అంతే… నాన్న మామ చేసిన సీతాకల్యాణం తరువాత అరుణాకల్యాణం మా ఇంట్లో పెద్ద హిట్టు. చూపులు కలసిన శుభవేళా అంటూ మా అన్నగారు చక్కగ మా వొదినకి పనీర్ పిజ్జా ప్రెమతో చేసి, మురిపించి, వరించి పెళ్ళడాడు. చూడ ముచ్చట జంట, అప్పుడు. ఇప్పుడు డబ్బు చెయ్యలేదు గాని, మా అన్నకి ఒళ్ళైతే బాగానే చేసింది… మళ్ళీ సిక్స్‌ప్యాక్-కి కరిగించుకోడానికి ఇంకొంత కాలం పడుతుంది అంటున్నాడు… అల్లాకానీ…

అసలు, నాన్న మామల సినిమాల్లో మేము రాముడు కన్న రొమాన్సే  యెక్కువ చూశామనుకుంటా. మన తెలుగువారే కాకుండా అరవదేశం, కన్నడ దేశం నించి కూడా వెతికి, వరించి, వివాహం చేసుకున్నాము. అంటే నేను ఇక్కడ ఎన్‌టీరామారావుగారి “మేము” అన్న ఏకవచనం ఉపయోగించట్లేదు సుమండోయ్… ముగ్గురు అరవ్వాళ్ళు, ఒక తుళు, కూడా ఇప్పుడు సినిమా టైటిల్స్‌లో   బాపురమణల పేర్లు చూసి చప్పట్లు కొట్టడానికి చేరారు.

మా వానర సైన్యం లోకంలో యే మూల వున్నా కూడా, ఒకరిని ఒకరు తెలుసుకుని,  ఒడిదుడుకులు తట్టుకొని,  మసకెయ్యని పున్నమిలా (???)… సినేమా పాటలొద్దు, పాయింటుకి వొస్తా… అదే, సపోర్టుగా, ఫ్రెండ్స్‌గా వున్నాము, వుంటాము.

సినిమా కథలంటే గుర్తొస్తున్నాయి… చిన్నప్పుడు చాలా షూటింగులకి తీసుకెళ్ళేవారు. నాన్న మామ సెలెబ్రిటీస్ అని మాకు అప్పుడు తెలియదు. ఏదో సినిమాలు తీస్తారు, బొమ్మలేస్తారు, బాగా నవ్విస్తారు అని మట్టుకు తెలుసు. మేమేమో వుండేది అరవ దేశంలొ, వాళ్ళేమో అచ్చవైన పధహారణాల తెలుగు బిడ్డలు. మేము తెలుగూస్ కదా, సో, కమర్షియల్‌గా వాళ్ళవల్ల మాకేమి అడ్వంటేజ్ లేదు. మా చిన్నప్పుడంతా వాళ్ళు నాన్న మామ గానే తెలుసు, బాపు రమణలుగ మాకు చాలా తరవాతే పరిచయం అయ్యారు.

షూటింగ్సులో కూల్‌డ్రింక్సులు, టిఫ్ఫిన్లు, భోజనాలు  గోదావరి నదిలా ప్రవహిస్తూనే వుండేవి.. మాకే కాదు, సెట్‌లో అందరికీ రోజూ విందుభోజనమే… నాన్నకి మామకి మట్టుకు ఇంటినించే భోజనాలు. అవ్వే చారూ కూరా బోర్ కొట్టదా నాన్నా, చక్కగా షూటింగ్ సాప్పాడు తినచ్చు కదా అంటే, నవ్వేవారు.. “మా కివే విందమ్మా” అనే వారు. నాన్న ఒక ఫుల్ టేబుల్‌స్పూన్ అన్నం తింటారు, మామ ఒక అర టీస్పూన్ తింటే గొప్ప. కాని కారియర్ మట్టుకు ఆరు గిన్నెల పొడుగు. సమూహభోజనంబు అని చెప్పి మరీ యీ టీస్పూన్లు టేబుల్‌స్పూన్లు తింటే, మిగతావాళ్ళేం కావాలి?  “నాకు డబ్బు లేనప్పుడు, నేను సంపాదించుకున్నాక రోజూ మీగడ పెరుగు తోనే అన్నం తింటానని కలలు కనేవాడిని. అప్పుడు ఆరు దోశలు, పది ఇడ్లీలు, వడలు  తిన్నాక, ఇంకా ప్లేస్ ఉంటే పొంగల్ విత్ చట్నీ లాగించేసి, అరిగించుకునే శక్తి వుండేది. కాని ఇప్పుడు డబ్బు వచ్చింది కాని, మీగడ పెరుగు రానంటోందమ్మా…, మరి అరిగించుకునే శక్తి లేదు కదా…”

కాని నాన్నకి తినడం కంటే తినిపించడంలొనే ఇంకా థ్రిల్. రోజుకి ఒక కొత్త కాంబినేషన్ ట్రై చెయ్యమనేవారు. హెల్తుకి తిండికి చాలా లింకులు పెట్టేవారు. పాత ఉసిరికాయ పచ్చడి, పాత నిమ్మకాయిఊరగాయి, సూర్యకాంతం గారు (సినీ నటి) స్పెషల్‌గా చేసి ఇచ్చిన యెండావకాయలని గోల్ద్డ్ కంటే ఖరీదైనవి అని రోజూ మొదటి ముద్ద అవే పెట్టించేవారు. మా బిజీ 7-10 యేళ్ళ వయసు తిండి మీద ధ్యాస చూపకపోతే, క్లాసులు తీసేవారు. ఇప్పుడు చక్కగా మీకు, మంచి హెల్త్ వుంది. ఉన్నప్పుడే అన్నీ లాగించెయ్యండమ్మా, అనేవారు. ఇంట్లో పనివాళ్ళకి కూడా కలిపే భోజనాలు వండించేవారు – మిగిలితే ఇవ్వడం కాదు. వాళ్ళకి ఇచ్చేది కూడా నీట్‌గా, ప్రజెంటబుల్‌గా వుండేవి… ఇవ్వన్నీ నాన్న గొప్ప అని చెప్పట్లేదు, ఇంట్లో పద్ధతి ఇలా వుండేది, నాన్న వల్ల…

భోజనాల టైం నాన్నకి బెస్ట్ టైం ఆఫ్ ది డే. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్  అన్ని పూటలు స్పెషల్. ఐ లవ్ ఫుడ్  అనేవారు. ఐ సెలెబ్రేట్ ఫుడ్. ఒక చిన్న కథ. నాన్న నన్ను యెప్పుడు తిట్టలేదు, చాలా గారాబం చేసేవారు. నేను కాలేజ్ బెల్   కొట్టగానే ఊరుమీద పడి తిరిగేదాన్ని. ముళ్లపూడి వారి ఫస్ట్ డిగ్రీ హోల్డర్ని  కదండీ, అందుకు ఓ కారు ఇచ్చేశారు, నో ప్రశ్నలు ఆస్కుడ్…  ఒక్క విషయంలో తప్ప. డ్రైవర్ని సరిగ్గా ఒంటి గంటకి లంచ్ కోసం వొదిలెయ్యాలి… నేను లేట్ చేశానో, ఆరోజు ఇక వుంది నా పని. అంటే కొట్టేసి, తిట్టేసి, నా కారు లాక్కుని, నన్ను బందీ చేసేవారే ఐతే విప్లవం చెయ్యచ్చు. కానీ అలాక్కాదే మరి. ఒక సారి, పుస్తకాల మైకంలో పడి (నాకు కూడ మా నాన్న లాగానే పుస్తకాల పిచ్చి) బుక్‌స్టోర్ లోపలికి  వెళ్తే, అస్సలు టైం తెలియదు) మా డ్రైవర్ని లంచికి పంపడం మర్చిపోయాను. మూడింటికి ఇంటికి చేరుకున్నాక డ్రైవర్ని లంచికి పంపాను. అమ్మ నాకు కోపంగా అన్నం పెట్టింది. నాన్న అన్నం తినకుండా పడుకున్నారని. సాయంత్రం లేచాక, నాన్న నన్ను తిట్టలేదు. తప్పు కదమ్మా అన్నారు. అంతే. మరి అన్నం నా మూలంగానే మానేశావా అని అడిగితే, అబ్బే, అదేమీలేదమ్మా అన్నారు. కాని అమ్మ కోపంలోనే  తెలిసింది, నాన్న అలకగృహంలోకి వెళ్ళారని. యెదటివాళ్ళ తప్పుని తానే చేసినట్టు రెస్పాన్సిబిలిటీ తీసుకునేవారు. నా ప్రకారం అది వరల్డ్‌లోనే వరస్టు పనిష్‌మెంట్. గిల్టుచ్చుకుని కొట్టేవారండీ! అదే, ఇక దాని తరవాత, నేను భోజనాల టైంలో మళ్ళీ యెప్పుడూ కళాపోసణలు చెయ్యలేదు.

మా అందరికీ నాన్న మామల డిస్కషన్స్‌కి ఆడియెన్స్‌గా కూచ్చోవడం ఒక పెద్ద ట్రీట్. నాకు ఊహ తెలిసప్పట్నించి, ఇద్దరూ లంచ్ ముందర, డిన్నర్ ముందర 2-3 గంటలు సెషన్ వేసేవారు. సినిమా ప్లాన్ చేస్తున్నా, లేకపోయినా… రోజూ రెండు పూటలా విషాలతో, వడియాలతో, లోకోత్తరమైన విషయాలు పంచుకుని నంచుకుని… అసలు రోజంతా మాట్లాడుకోడానికి యేముంటుంది చెప్మా… కానీ వుండేది… ఒక్క టాపిక్ కూడా రిపీట్ అయ్యేది కాదు. ఒక పూట వరల్డ్ సినిమా ఐతే, ఇంకోసారి కార్టూన్స్ గురించి. ఓ పూట తూగోజి-పగోజి, పనసపొట్టు కూర-అరిటిదూట పచ్చడి డిబేట్లు ఐతే, ఇంకో పూటకి పిజి వోడ్‌హౌస్ దగ్గర మొదలుపెట్టి,  భారతంలో అర్జునుడి పొగరు దాక చర్చించేవారు. కొన్ని సార్లైతే బాడ్మింటన్ గేం లా ఒకరి తరవాత ఒకరు, జోక్స్ అలా కంటిన్యువస్‌గా చెప్తూనే వుండేవారు. లెఫ్ట్-నుంచి  పక్కింటి పిన్నిగారిని మామ సర్వ్ చేస్తే, రైట్ నుంచి నాన్న ఆకలి జోక్సుతో రిసీవ్ చేసుకునేవారు.  కొన్ని పాతవి, కొన్ని ఐసెన్బర్గ్‌వి, మరికొన్ని కల్పించినవి, ఇంకొన్ని మా ఫామిలీ మీదే. రోజూ వేరే-వేరే టాపిక్స్.   ఒక్కటి తప్ప: ఆంధ్ర జనుల ఫిల్మ్ టేస్ట్ గురించి ఇక యెన్నిసార్లు చెప్పినదే చెప్పి, అడిగినవే అడిగి, అదే టాపిక్ ముప్ఫై వేల సార్లు డిస్కస్ చేసే వారు…  “మనం బాగా వొచ్చాయి అనుకున్న సినిమాలు మరి యెందుకు తెలుగు వాళ్ళకి నచ్చట్లేదు. క్రిటికల్ అక్లెయిమ్ కాదు, కమర్షియల్ సక్సెస్‌గా ఒక్క సినిమా ఐనా తీయాలి, రిక్షా వాళ్ళు కూడా మన్ని మెచ్చుకోవాలయ్యా”, అనుకునేవారు… . అక్కడినుంచీ వాళ్ళు తీసిన ఒక్కొక్క సినిమాని అనలైజ్ చేసుకునేవారు…. దాని లోతు యెంత, దాని వెడల్పెంత, దాని పొడుగెంత…  ఆ డిస్కషన్స్ వింటూవుంటేనే, ఫిల్మ్ క్లాస్‌లో కూచ్చున్నట్టు ఒక ఫీలింగ్. ఇవన్నీ మరుపురాని మెమరీస్. నాన్నని మిస్ ఐనప్పుడు, యేడుపు తన్నుకొచ్చినప్పుడు, దాన్ని నడ్డిమీద కొరడాతో చంపేసి, పక పక నవ్వులు రాలించి,  కితకితలు పెడుతూ, మళ్ళీ మళ్ళీ నెమరెసే మెమరీస్.

నాన్నకీ మామకీ చాలా విషయాలు కామన్. చాలా వాటిల్లో సేమ్ టేస్ట్,   సేమ్ అలర్జీస్ వుండేవి. అంతకు రెట్టింపు విషయాల్లో వాళ్ళిద్దరూ డిఫరెంట్.   మామ యెప్పుడూ పంక్చ్యువల్.   వెళ్ళేది షూటింగుకైనా సరే, సినిమా ఐనా సరే, ట్రెయిన్ స్టేషన్ అయినా సరే, రెస్టారెంట్కి అయినా సరే ఆల్వేస్ ఆన్ టైం. నిజం చెప్పాలంటే ఈవెన్ బిఫోర్ టైం. నాన్న కూడా ఆన్ టైమే కాని ఆయన ఓన్ టైం. సాయంత్రం ఆరు గంటలకి ట్రెయిన్ అంటే, మామ రెడీ అయిపోయి, సరిగ్గా రెండున్నరకి కిందకి వొచ్చేస్తారు. మాతో కాసేపు జోక్ చేసి, ఇంక వాచీని చూడడం మొదలుపెడతారు. నాన్నేమో మజ్ఝాన్నం నిద్రలో వుంటారు. మెల్లగ మూడున్నరకి బయటికివస్తారు. “యేవయ్యా వొచ్చేశావా, కాఫీ తాగుతావా? ఇదుగో శ్రీదేవీ…!” ముందు మామ సాఫ్ట్‌గా “నాకు కాఫీ వొద్దయ్యా, నువ్వెళ్ళి రెడీ అవ్వు “ అంటారు… తరవాత, నాన్న వేడి వేడి కాఫీ మెల్లగా సిప్ చేస్తూవుంటే, మామకి బాయిలింగ్ పాయింట్ దగ్గిరౌతూ వుండేది. ఇక నాలుగు గంటలకల్లా ఓర్పు, తూర్పుకి తుర్రుమనేది, ఒక్క సారి: వెళ్ళవయ్యా.. ట్రెయినుకి లేట్ అవుతోంది అని గట్టిగా అరిస్తే, అప్పుడు, నాన్న మెల్లగా ఆ కాఫీ కప్ కింద పెట్టి.. “ఆ, ఇంక టైము ఉంది కదయ్యా, తొందర యేల…” అని లోపలకి వెళ్ళేవారు… ఆ వోల్కనో ఎరప్షన్ లాగ వొచ్చిన కోపం మామకి 30 సెకండ్లు  కూడా వుండేది కాదు. మళ్ళీ నాన్న రెడీ అయ్యి బయటకి వొచ్చేసరికి, అంతా  మామూలే, జోక్సు, తిండి, ట్రెయిను… మేము పక్కన కూచ్చుని ఇవ్వాళ యెంత సేపటికి మామకి బరస్టింగ్ పాయింట్ వొస్తుంది అని చూస్తూ వుండేవాళ్ళం. ఇంకో విషయంలో కూడా ఈస్ట్ ఈస్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఈస్ వెస్ట్, అండ్ ద ట్వెయిన్ షల్ట్ నెవర్ మీట్ అని నిరూపించారు. మామని నాన్న పని రాక్షసుడు అనేవారు. యేకంగా రెస్ట్ లేకుండా మామ రోజుకి 18-20 గంటలు పని చెయ్యగలరు, చెసేవారు. ఆ రూంనుంచి అలా మెహ్దీ హస్సన్ గారి ఘజల్స్ అలా వినిపిస్తూనే వుంటాయి, ఇలా బొమ్మలు, కార్టూన్లు వొచ్చేస్తూనే వుంటాయి… మరి నాన్నకేమో తిండి నిద్ర తరవాతే ఇంకో ధ్యాస. స్క్రిప్ట్ అయ్యాక, మామ యెండల్లో పడి షూటింగ్ చేస్తున్నారే, అని నాన్న ఫీల్ అయిపోయేవారు… అయ్యో, మామ అక్కడ అంత కష్టపడుతున్నాడే, నేను ఇక్కడ్ ఏసీలో హాయిగా మందు కొడుతున్నానే అని చాలా బాధ పడిపోయి, మామకోసం మళ్ళీ ఇంకోటి కూడా వేసుకునేవారు.

మజ్ఝాన్నం తప్పన్సరిగ నిద్రపొయేవారు. నేను కనక పీఎంని అయితే, స్పెయిన్ లాగ, ఇండియాలో  కూడా మజ్ఝాన్నం సియెస్టా కంపల్సరీ చేసేస్తాను, అనే వారు. నాకు తెలిసి, నాన్న జస్ట్ త్రీ డేస్ మట్టుకే మజ్ఝాన్నం నిద్ర మిస్ చేసారు. ఒకసారి మా బామ్మ పోయినప్పుడు, తరవాత ఒక సారి ఎన్‌టీఆర్‌గారు లెసన్స్ టైంలో సరిగ్గా మజ్ఝాన్నం రెండు గంటలకి మీటింగ్ పెట్టినప్పుడు, ముత్యంమూడోసారి, నా పెళ్ళి టైంలో సియెస్టా మిస్ చేశారు. మరి యెప్పుడు పని చెసేవారో తెలిసేది కాదు.

నా చిన్నప్పుడు, అంటే చాలా చిన్నప్పుడు, నన్ను పొద్దున్నే ఆరు గంటలకి స్కూలుకి రెడీ అవ్వడానికి అమ్మ లేపేది.  అప్పుడు చూస్తే, నాన్న మంచం మీధ పడుకుని వుండేవారు. అమ్మా! నన్ను మట్టుకు స్కూలుకి పంపుతున్నావు, నాన్న మట్టుకు ఇంకా పడుకునే వున్నారు… అని భూపాల రాగం మొదలుపెట్టేదాన్ని. షుష్. నాన్న పని చేసుకుంటున్నారు. వాట్? పని? అంటే వర్క్? కాం? వెలై? ఆహా, జన్మలో చెస్తే ఇల్లాంటి పనే చెయ్యాలి నా సామిరంగా, అనుకునేదాన్ని. చాల యేళ్ళ తరవాత తెలిసింధి… నాన్న, నిజంగానే పని చేసేవారని. సీజనల్‌గా స్టైల్ మారేది. సమ్మర్లో వాకింగ్ చేస్తూ ఆ రోజు రాయవలసిన సీనులు ఆలోచించుకునేవారు. వింటర్లో కళ్ళు మూసుకుని, పడుకుని ఆలొచించేవారు. మామతో రాత్రి చేసిన డిస్కషన్ అంతా బుర్రలో రికార్డ్  అయిపోతుంది. దాంతో మార్నింగ్ డయలాగ్స్ అన్నీ మెంటల్‌గానే రాసేసుకుని, తరవాత టిఫిన్ అయ్యాక పేపర్ మీద బరికేసేవారు. ఇక బరకడమే… ఒక్కొక్క సిట్టింగ్లో 20-30 పేజీలు రాసేసేవారు. ఎడిటింగ్ కూడా చాల తక్కువే. మామ కరెక్షన్స్ చెప్పటం గాని, నాన్న రీరైట్ చేయటం గాని నేను యెప్పుడూ చూడలేదు. ఫస్ట్ డ్రాఫ్టే  ఫైనల్ డ్రాఫ్ట్. మామ దగ్గరకి వెళ్ళేదాక. ఆ తరవాత కథ ఇంకో భాగంలో.

హ్యాండ్‌రైటింగ్ అంటే గుర్తొస్తుంది… దాంట్లో కూడా, నాకు నాన్నతో పొటీనే. నా హ్యాండ్‌రైటింగే బాగుంటుంది, నీది కోడి కొక్కిరించినట్టు వుంటుంది అని వేళాకోళం చెసేదాన్ని. నేను స్కూల్కి సెలవు పెడితే, మర్నాడు లీవ్‌లెటర్ కోసం అమ్మ దగ్గరకే వెళ్ళేదాన్ని. నాన్న ఇంగ్లీషు  హ్యాండ్‌రైటింగ్ మా కాన్వెంట్‌వాళ్ళకి అర్ధమవ్వదనిన్నీ, నేను ఊరికే, ఉత్తుత్తిగానే యెగ్గొట్టానని, అందుకే మావాళ్ళు ఇలా అర్ధంకాని లిపి లో రాశారనిన్నీ అనుమానిస్తారని… నాకు భాను, వేణుల లీవ్‌లెటర్స్ చూసి యెంత జెలసీగా వుండేదొ. చక్కగా మామ ప్రింట్ లాంటి రైటింగ్‌లో లీవ్ అడిగితే, ఒక్క రోజేం ఖర్మ, ఆ నెల అంతా తీసుకోమనేవారేమో…

నాన్న ప్రయాణం అంటే, ఇంట్లో అందరికీ సరదానే. ఆ భోజనాలు, ప్యాకింగు, ప్లానింగు, ఆహా,… హిమాలయన్ ట్రెక్‌కి వెళ్ళేలాగ ప్యాక్ చేసేవారు. మామ యెంత లైట్‌గా ట్రావెల్ చేసేవారొ, నాన్న అంతకంత సామాను తీసుకెళ్ళేవారు. నాన్న బట్టలకి సూట్‌కేస్  ఒకటే, కాని, విషయాలు, దానికి ఎగస్ట్రాలు, భోజనాలు, అరిటాకులు, విత్ గరిట్స్! ఊరగాయలు, కందిపొడులు…  పెళ్ళి సందడే మరి. నాన్నకి మామకి కాకుండా, వాళ్ళతో ట్రావెల్ చేసే ఫ్రెండ్‌కి, ప్లస్, ట్రెయిన్లో యెవరైనా పాసెంజర్ పాపం, వల్ల కంపార్ట్మెంట్లో నాలుగో సీట్ కి వస్తే? మరి ఆయనకి మందు అలవాటు వుంటే? మరి వాళ్ళ ఇంట్లో సాప్పాడు ప్యాక్ చేసి ఇచ్చుండకపొతే? సో, ఆ నాలుగో టికెట్టుక్కూడా ఇంటినించే మందోబస్తు, తిండోబస్తు కూడా…  ఇదంతా చెన్నై నుంచి అయితే, ఇక అటునుంచి నవోదయా రామ్మోహనరావు గారు వాళ్ళ ఆవిడ ఝాన్సక్క స్పెషల్‌గా చేసే పులిహోర అండ్ ధద్ధోజనం.. వీళ్ళు వేసుకొనే రెండున్నర టీస్పూన్లు కాకుండా, మా అందరికీ నెక్స్ట్ డే స్పెషల్ ట్రీట్‌గా తెచ్చేవారు.

ఇద్దరికీ పిల్లలు అంటే మహా చెడ్డ ప్రేమ. ఎంత షూటింగులో వున్నా, స్క్రిప్ట్ మధ్యలో వున్నా, బొమ్మలేస్తున్నా, మమ్మల్ని యెప్పుడూ నెగ్లెక్ట్ చెయ్యలేదు. అంటే రోజూ కూచుని పధమూడో యెక్కం నేర్పించేవారు అని అనుకునేరు. అబ్బే. మేము యే క్లాస్‌లో వున్నామని కూడా మమ్మల్ని అడిగి తెలుసుకునేవారు. ఒక్క పేరెంట్ టీచర్ మీటింగ్‌కి వొస్తే ఒట్టు! కాని, ET స్టార్ వార్స్,  సూపర్‌మాన్ సినిమాలకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి తీసుకెళ్ళేవారు. 007 వేషాలు యెంత మంది యాక్టర్లు వేశారు, జీన్ రెన్వాయర్ రూల్స్ ఆఫ్ ద గేం యెలా తీసాడు, సీతా కల్యాణంలో తాటకి వధ గ్రాఫిక్సు కథ, ఎట్సెట్రా ఎట్సెట్రా లాంటి గొప్ప విషయాలు బోధపరిచేవారు.

నేను స్కూలు ఫైనల్ యియర్‌లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి ఆర్టికిల్స్ రాసాను. నా మొదటి ఆర్టికిల్ పడినప్పుడు నాన్న యెంత థ్రిల్ అయిపోయారో. ఒక రోజు స్కూల్ నించి వొచ్చేటప్పటికి, నాన్న నాకోసం ఇంపేషెంట్‌గా వెయిట్ చేస్తున్నారు. నాకు ఎక్స్‌ప్రెస్ నించి నా ఫస్టు చెక్కు వొచ్చింది. సెవెంటీఫైవ్ రుపీస్‌కి.   నాన్నకి, మా బామ్మకి ఇక సంతోషం ఆగలేదు. అప్పటికే, ఊరిలొ అందరికి నేను రైటర్ని అయిపోయానని చెప్పేశారు. పెద్ద పార్టీ ప్లాన్ చేసేస్తున్నారు. మర్నాడు నా చెక్ ఇమ్మని అడిగితే, ఇవ్వనన్నారు. మరి బ్యాంకులొ వెయ్యద్దా అంటే, ఆ సెవెంటీఫైవ్ రుపీస్ చెక్ తనకి ఇచ్చేయమన్నారు. దానికి ఎక్స్ఛేంజి‌గా నాకు ఒన్  హండ్రెడ్ సెవెంటీఫైవ్ రుపీస్ ఇస్తానన్నారు…. మట్టి బుర్ర.. అప్పుడు నాకు నాన్న సెంటిమెంటు అర్థమవ్వలేదు. అమ్మో నాది అని, లాక్కుని, అర్జెంటుగా చెక్ బ్యాంక్‌లో వేసేసుకున్నాను… అయినా నాన్న నాకు ఒన్  హండ్రెడ్ సెవెంటీఫైవ్ రుపీస్ ఇచ్చారు.

అల్లాగే, నా డిగ్రీ అయ్యాక, నాకు ఇంగ్లీషులో చాల ప్రైజులు వొచ్చాయి. దాంతో సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారు, నా కాలేజ్‌లో. అవి తీసుకెళ్ళి నేను అప్లై చేసిన అడ్వర్టైజింగ్ ఏజన్సీలో చూపించాలి, నా రెస్యుమే తో. మళ్ళీ షామియానా, పార్టీ, అందరికీ భోజనాలు, హడావిడి. మర్నాడు నా సర్టిఫికెట్లు యెక్కడ వెతికినా కనిపించలేదు. ఇల్లంతా గాలించేశా… ఫైనల్‌గా నాన్నని అడిగాను, నా సర్టిఫికెట్లు యెక్కడైనా చూశావా అని. చూడడమేమిటమ్మా, చక్కగా ల్యామినేట్ చెయ్యించి, ఫ్రేం కట్టించడానికి పంపాను.. ఇవ్వాళ సాయంత్రానికల్లా వొచ్చేస్తాయి… డాడీఈఈఈ…. అని పంచ భూతాలకి వినిపించేలా అరిచాను… నాన్నకి నా కోపం అర్ధం కాలేదు… జాగ్రత్తగానే వుంటాయమ్మా.. చక్కగా మనం హాల్లో గోడ మీద తగిలించొచ్చు. మా సీతాకల్యాణం లండన్ సర్టిఫికెట్ పక్కనే ఇవి కూడా పెట్టొచ్చు…. నేను, ఆ ఒక్క సెకన్లో నవరసాలు ఫీల్ అయిపొయాను. ఇప్పుడు తల్చుకుని రాస్తుంటే కూడా, నాకు ఒళ్ళు జలదరిస్తుంది .. ఏం చేసుకునేది, ఇంత వెన్నెల… నేను ఒక్కదాన్నేకాదు, ఇంట్లో ఒక్కక్కళ్ళూ ఇంత స్పెషల్‌గా ఫీల్ అయ్యేవారు. ప్రతివారికి నాన్నతో ఒక స్పెషల్ రిలేషన్షిప్.. అదన్నమాట, మా నాన్న మాయ.

మా ఇంట్లో చాలామంది వుండేవారని చెప్పానుకదా. వారంతా మా ఫ్యామిలీ మెంబర్స్ మట్టుకే కాదు. ఎప్పుడూ యెవళ్ళో ఒకళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోనే వుండేవారు. మా చిన్నప్పుడు నాన్న మామల ఫ్రెండ్స్ ఇంటికి వొస్తే భలే సందడిగా ఉండేది. మ్యూజిక్ సెషన్స్, లిటరరీ సెస్షన్స్, సినిమా సెషన్స్… ఇల్లాగ వాళ్ళకి సెపరేట్ ఇంటరెస్ట్స్‌కి డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉండేవారు. పైకి పకోడీ బజ్జీలు ఇవ్వడానికి మమ్మల్ని పంపిస్తే మేము అవి డెలివర్ చేశాక, తలుపు చాటు నుంచి చూసేవాళ్ళం. పెద్ద్దయ్యాక యెన్ని ఊళ్ళు తిరిగినా, యెన్ని కల్చర్స్  ఎక్స్‌పీరియన్స్ చేసినా, ఇంత సంపూర్ణంగా, రెండు చేతులతో జీవితాన్ని ఇంత మనస్ఫూర్తిగా వెల్కం చేసిన ఇద్ధరు వ్యక్తుల్ని నెనైతే యెక్కడా చూడలేదు.

నాన్న మామ లాగానే మేము ఒక విషయంలో చాల అదృష్టవంతులం. స్నేహం. స్నేహాలు. స్నేహితులు. చిన్నపట్నించి మాఇంట్లోనే పెరిగిన మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఇంటికి వొస్తారు. మాకే కాదు, మా ఇంట్లొ యెవరికి యే ప్రాబ్లం వొచ్చినా వెంటనే, మాకంటే ముందర హెల్ప్‌చేయటానికి వొస్తారు… అది మా మీద ఉన్న ప్రేమ కంటే యెక్కువగా నాన్న మామల మీద ఉన్న అభిమానం, అఫెక్షన్. తెలుగు భాష రాకపోయినా, బాపు-రమణల స్నేహం భాష అర్ధం చేసుకున్నారు, వాళ్ళ ఫాన్స్ అయ్యారు  మా ఫ్రెండ్స్ కూడా.

చూశారా, చూశారా, నేను మా ఫామిలీ గురించి రాయాలని మొదలుపెట్టి, మళ్ళీ బాపు-రమణల చుట్టూనే ప్రదక్షిణం చేస్తున్నా… మరి అదే బాపు రమణల మాయ…

ఇక అంతేనా? అంతేనంటే ఇంకా చాలా విషయాలు వున్నాయండి. అవన్నీ నా సొంత విషయాలండీ…  నాకు డిగ్రీ అవ్వగానే పెళ్ళి చూపులు మొదలెట్టేశారు. నేను వొద్దు మొర్రో అంటే వినేవారు యెవరూ లేరు. అమ్మ ఆర్డర్ ఇచ్చేసింది, నాన్న మట్టుకూ చాలాసేపు ఆలోచించి, అమ్మకి గట్టిగా తల ఊపేశారు. రాధా స్వయంవరం చాల యేళ్ళే సాగింది. నచ్చిన బొమ్మలు దొరకలేదు, దొరికినవి యేమో మరి, నచ్చలేదు… వాట్ టూ డూ? నాన్నని గ్యారంటీ ఇమ్మన్నాను. నీది, అమ్మది మ్యారీడ్ లైఫ్‌లాగా  నాకూ వొస్తుందంటే సరే, నువ్వు ఛూజ్ చేసిన వాడినే నేను చూస్తా.. వాడే నా మొగుడు అంటాను. అలా గ్యారంటీ ఇవ్వగలవా అని అడిగేదాన్ని. సారీ, లైఫ్‌లో నో గ్యారంటీస్ తల్లీ. మీ అమ్మని కూడా, మామ, మీ నండూరి మావయ్యలు చెప్తే, వెళ్ళి చూశాను. పెళ్ళికి సరే అన్నాను. మరి అప్పుడు నీకెలా తెలిసింది, నీ డ్రీం గర్ల్ అమ్మే అని? అబ్బే, అవ్వన్నీ నాకేం తెలుసు? అమ్మని పెళ్ళిచూపులు గది లోకి తీసుకొచ్చారు. అమ్మ పాదాలు చూశాను. అంతే, ఫ్లాట్ అయిపొయ్యాను. ఓ ఐ సీ, అదా సంగతి! ఇక దాని తరవాత రోజూ నా రెండు కాళ్ళూ కొబ్బరి పీచుతో తోమేసి, పసుపు రాసేసి, వీక్లీ ట్వైస్ పెడిక్యూర్స్‌కి వెళ్ళిపోయి, గజ్జెలు, పట్టాలు పెట్టేసుకుని, తెగ ట్రై చేసేశాను…  అంటే, అదే మొహం, చింపిరి జుట్టు, లాగు చొక్కాలు వేసుకున్నా, నా పాదాలు మట్టుకు, సొగసు చూడ తరమా! అల్లాగ తయ్యారు చేసుకున్నాను… ఒక్క మొగుడు బొమ్మ కూడా దొరకలేదు… మా అమ్మకేమో నేను నల్లగా వున్నానని, అందువల్లనే నాకు వరుడు రాడు కాక రాడేమోనని అనుమానం వొచ్చింది. ఆ తరవాత, రోజూ నా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఒక కొత్త ఫైర్‌నెస్ క్రీం… సరేలెద్దురూ, యెధవ న్యూసెన్సు… యెలుకతోలుని తెచ్చి యెందాక వుతికినా, ఆ నలుపు నలుపేగాని, తెలుపు యెక్కడనుంచి వొస్తుంది?

మొత్తానికి, వీడే నా మొగుడని, అరవ కార్తిక్‌ని తీసుకొచ్చాను, మెప్పించాను. అందరూ సై అన్నారు, నన్ను నల్ల పిల్ల అని కూడా అన్నారు.. అదే, అరవంలొ నల్ల అంటే మంచి పిల్ల కదా.. మొత్తానికి కక్కిగారే కరెక్టు… నేను నల్ల పిల్లనే!!! తరవాత నాన్నకి మామకి ఫ్రెండ్ అయ్యాడు, వాళ్ళతో తెలుగు విందులు, ఇంగ్లీషు మందులు… ఓహో ఇక యేమందు మీముందు…

ఇప్పుడు,  మా థర్డ్ జెనరేషన్ రెడీ. సౌందర్య, సౌమ్య, రాధిక, లాస్య, అనన్య, ఆదిత్య, తేజస్విని, హిరణ్య, బాల, ఆనవ్… కొమ్మకి రెమ్మొచ్చి, కొత్త కొమ్మచ్చికి సైన్యం తయారు. బాపు రమణలు యెవరో వింటుంటారు, చూస్తున్నారు, కాని, ఇంత మామూలు వాళ్ళు, పైగా తాతయ్యలు, బయట ఇంతమందికి యెలా తెలుసు? ఇంతమందికి యెందుకు నచ్చారు? సినిమాలు తీస్తారనా, లేక మంచి సినిమాలు తీశారనా? బొమ్మలేస్తారనా? కథలు రాశారనా? యేమో, ఐ డోంట్ నో. కాని సెకండ్ జెనరేషన్‌కి మట్టుకు వాళ్ళు నాన్న మామ కాబట్టి నచ్చారు. మాకు ఫదివేల జోక్సు చెప్పారు. తిండంకంటే తినిపించే రుచే గొప్పదని నేర్పారు. చీకటిలొ గోరంత దీపం చూడమన్నారు – ఫ్లాప్ అయినా కూడా. యేడుపొచ్చినప్పుడు నవ్వమన్నారు, హీరో లాగ. మా థర్ద్ జెనరేషన్ కూడా, ఇంకా కొంచం పొడుగయ్యాక, అర్థం చేసుకుంటారు. సెవెంటీ యియర్స్ కాదు, సెవెన్ హండ్రెడ్ యియర్స్ అయిన సరే, బాపు రమణలు ఫ్రెండ్స్‌గా వుంటారు. కలిసి అల్లరి చేస్తారు, మందు కొడతారు, సినిమాలు చూస్తారు, హాయిగా నవ్వుకుంటారు. నవ్వడం లోను, నవ్వించడంలోనూ వాళ్ళకి అదో తుత్తి.

ఇక అంతేనా? అంతేనంటే ఇంకా చాల విషయాలున్నాయండీ. మిగతావి ఇంకా మళ్ళీ ఇంకో రేపు చెప్తాగా. భట్టు గారి అట్టు యెలా వుంటుందో నాకు తెలియదు కాని, సామాలత్త అట్టు, అట్టు, అదే పెసరట్టు మీద ఒట్టేసి చెప్తున్నా, మా ఇంట్లో యెవరిని అడిగినా బాపు-రమణల మీద ఇంతకంటే ఇంకా యెక్కువ విషయాలు, నచ్చిన విషయాలు, నాన్న మామ చర్చించిన విషయాలు చెబుతారు. కావలిస్తే అడిగిచూడండి…

You Might Also Like

17 Comments

  1. Deepthi Spandana

    అద్భుతహ: ఇంతటి మహానుభావుల కళలని, సాహిత్యాన్ని కని వినే భాగ్యం మనకి కలగటం మన అదృష్టం.. అందులోనూ మన తెలుగువాళ్లు కావటం మహత్భాగ్యం..! బహుశా ఇంతటి పేద్ద పేజి నేను చదవలేదు..కోతికోమ్మొచ్చి మరియు మిగాతా కోమ్మొచిలు చదువుతున్నప్పుడు ఎంత అనుభూతి కలిగిందో ఈ వ్యాసం చదువుతున్నపుడుకూడా అదే ఆనందం.. బాపు రమణలు ఎప్పటికి చిరస్మరణీయులు !

  2. హైమ కుమార్

    ఈమధ్య నెట్ లో ఇంత పెద్ద తెలుగు పేజీ చదవలేదు.రాసింది ఎవరో తెలిసాక తెలుగు వాడెవరన్నా చదవకుండా ఉంటారా.అద్బుతహ..

  3. anuradhika gadepalli

    అమ్మ!నిజంగా అసలు ఎంత అదృష్టవంతులో మీరు! మీకు మీ కుటుంబానికి తెలుగువారందరూ రుణపడి ఉంటారు! ఇంత అద్బుతమైన జ్ఞాపకాలు మాకు పంచినందుకు!

  4. soni.M

    koti kommacchi moodu bhagalu chadivinappudu kaligina anubhooti mee okka vyasamlo kaligindiandi Anuradhagaru!!! chadavadam poorti cheseseariki kallu neellatho nindipoyeyi. Ye janamlo entha punyam chesukunnaro ..Goranthadeepam lo tana kooturiki vere character cheta antha manchi matalu cheppinchina Ramanagaru meeku jeevithamkosam entha nerpi untaro kadaa.LOng live Anuradhagaru.

  5. డా. మూర్తి రేమిళ్ళ

    @ sriram Velamuri comment konchem marchi cheppalanipinchindi, Anuradha garooo,

    Meeru adrushtavantulu – Ramana gaari santanam ga putti, memu dhanyulam mee raatha ki, pustakam vaari soujanyaanikee.

    Ee sandarbham lo oka chinna announcement and need all your support in posting this on PUSTKAM home page.

    Dear All,

    Bangalore/ Karnataka lo vundi Bapu gaari geetalanee, Mullapudi vari Raatalnee miss ayipotunnamu, andhra velli vetukkune time+vopika Leni vaallandirikee ee nava vasantha vedukalaki ahwaanam.   

    “Aaha Ramana! Bapu Re!! Abhimana Vedika” invites you all to Bapu Bommala Koluvu on the occaassion of Nanda Nama Ugadi and Sri Rama Navami.

    The venue: Karnataka Chitra Kala Parishath, Bangalore

    The dates: March 29-30,2012 10 am to 7pm

    The offering: A feast of art works by Bapu

    The Additional offerings: chance to buy/order  select art works of Bapu and buy available books of Mullapudi Venkata Ramana ( mullapudi sahiti sarvaswam etc) bapu cartoons and Mithunam story by Sreeramana in Bapu script.

    Please plan to make it and also pass on tonthe relevant people in your companies/ agencies/ organisations to post in the BROADCAST messages, and manavaallu andarikee andinchandi ee subha vaarthani.

    ( yeppati nuncho vunna abhimaanaaniki oka roopu nichi, venue book cheyyadaaniki ivvala chesina naama karaname “AAHA RAMANAA-BAPU RE ABHIMAANA KALAA VEDIKA” . Ee peru yela vundo kuda cheppagalaru)

    1. పుస్తకం.నెట్

      Kindly send us the detailed announcement (something like a scanned copy of phamplet would do) at editor@pustakam.net. We’d be more than glad to put the announcement on home page and spread a word about your venture.

    2. డా. మూర్తి రేమిళ్ళ

      Many thanks for the quick and positive response. I have already mailed you the event brochure. Please see full details at : http://murthyremilla.blogspot.in/2012/03/blog-post.html

  6. GURUMURTY VARAHABHOTLA

    anuradha garu,
    many thanks for sharing your life experiences .I did feel about it when sri ramana garu did not mention about his family,but your article has given some insight about it.
    I pray almighty that you all live up to the expectations of sri ramana garu and bapu garu and carry thier name forward.
    Kind regards
    Gurumurty varahabhotla

  7. sreeram velamuri

    మీరు అదృష్టవంతులు.మేము ధన్యులం

  8. subhadra

    ఎంత బాగా రాసారు అనూరాధగారూ. మీ నాన్నగారి అంశ మీకు తప్ప్కుండా ఉంది అనిపించింది చదివినంతసెపు. మీ, మా స్మృతులలో ఎప్పుడూ సజీవంగా ఉంటారు మీ నాన్నగారు. వారిని గురించిన జ్ఞాపకాలతో మీరొక పుస్తకం రాయవచ్చుకదా.. ఆలోచించండి. ఈ వ్యాసాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు.

  9. G.S.Lakshmi

    ఎంత బాగా చెప్పారండీ!…

  10. జ్యోతిర్మయి

    అనురాధగారూ ఎంత బాగా చెప్పారండీ…
    >> ఏం చేసుకునేది, ఇంత వెన్నెల>>
    వెలుగులు మాకూ పంచినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.

  11. dvenkat

    ఎంత బాగా చెప్పారండి! ఒకపక్క ఆనందంగా మరో పక్క కుళ్ళు గానూ ఉందండి

  12. chelluru.sambamurty

    నిజంగా అద్భుతం…రమణ గారి కలం తో వ్రాసి ఉంటారు
    ఔనా

  13. phani

    I missed that “swati”. Thank you for re-publishing here.

  14. Ravi Nanduri

    Sri Ramana gari gurunchi entha telusukunte antha haayi … Thanks Anuradha garu … chala baga rasaru … Ramana gari lifestyle, writings lo vunna beauty – amazing …

  15. చిన్ని ఆశ

    అప్పుడే రమణ గారు సాహితీ లోకాన్ని వదలి వెళ్ళీ సంవత్సరం అయ్యిందా?
    ఇంకా ఆయన “కోతికొమ్మచ్చి” మా చేతుల్లో కొత్తగానే ఉంది….
    వారి కుమార్తె “అనురాధ ముళ్లపూడి” గారితో చెప్పించాలనే బహుశా ఆయన రాయలేదేమో…

Leave a Reply