A search in secret India – Paul Brunton
రాసిన వారు: బుడుగోయ్
*********************
ఏమిటీ ఈ పుస్తకం కథా, కమామిషూ?
పాల్ బ్రంటన్ ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు. చిన్నప్పటి నుండే ఇండియా, ఆసియా అంటే కాస్త కుతూహలం. పెద్దయ్యాకొద్దీ అది కాస్త పెరుగుతూ పోయింది. తూర్పు దేశాల తత్త్వాలు, మిస్టిసిజం లాంటి విషయాలపై ఆసక్తి మెండు. లండన్‌లో ఒకసారి ఒక అనామక భారతీయునితో పరిచయం ఈ ఆసక్తిని కాస్త ఎక్కువ చేస్తుంది. సరే ఈ యోగులు, ఫకీర్ల గురించి తెలుసుకోవాలని ఇండియా వచ్చి చాలా మంది ఆసక్తికరమైన వ్యక్తులను కలుస్తాడు. ఆ అనుభవాలే ఈ పుస్తకం.
ఆ మాత్రం దానికి ఇండియా రావడమెందుకు? పుస్తకాలు చదవొచ్చు గా?
తన మాటల్లో చెప్పాలంటే భారతీయులెవరూ విమర్శనాత్మక దృష్టితో రాయలేదట. ఆరాధనా భావమే ఎక్కువటా. పోనీ తెల్లవాళ్ళు రాసింది చూద్దామా అంటే ఈ యోగులు తమంతట తాము బయటపడరు. ఎవరైనా ఉత్సాహంకొద్దీ దగ్గరికొచ్చినా ఏమీ తెలియనట్టు నటించి దూరం చేసుకోవటంలో సిద్ధహస్తులట. తనకు విమర్శనాత్మక ధోరణీ, లిజెనింగ్ స్కిల్సూ ఉన్నాయి కాబట్టి వీరి కథేంటో స్వయంగా తేల్చుదామని ఇండియా వచ్చాడుట.
బీటిల్స్, జూలియ రాబర్ట్సూ బోల్డంత మంది వస్తూనే ఉంటారుగా. పెద్ద వింతేముందీ? అలాగే పరమహంస యోగానంద, మహేష్ యోగి, స్వామి రామ అక్కడికి కూడా వెళ్ళారుగా?
ఈయన రచనా కాలం 1930. వీళ్ళందరికంటే ముందే ఇవన్ని పరిశోధించాడు. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కట్టిపెట్టి, ఈ మినీ సాహసయాత్రకు బయల్దేరిన విషయాన్ని మాత్రం మెచ్చుకునే తీరాలి.
మరి ఈ యాత్రేదో సఫలంగా జరిగిందా?
ఓహ్! భేషుగ్గా.. దేశమంతా పర్యటించి ఆకాలంలోనే గొప్ప గొప్ప గురువులనూ, అణాకానీ మోసగాళ్ళనూ, నిజం ఫకీర్లనూ ఇలా చాలామందినే కలిశాడు. తను ముఖ్యమైనవి అనుకున్న అనుభవాలు మాత్రమే ఈ పుస్తకంలో రాశాడు.
ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెకెళ్ళాడేంటి?
ఒక ఈజిప్టు ఐంద్రజాలికుణ్ణీ, ఇంకా ప్రపంచానికి తెలియనప్పటి మెహెర్ బాబానూ, కుంభకోణం దగ్గర శంకరాచార్యులనూ, ఒక పేరు తెలియని యోగినీ, ఒక మౌన మునినీ, రమణ మహర్షినీ, పూరిలో సాధువులనూ, రాజమండ్రిలో ఒకరిద్దరూ మోసగాళ్ళనూ, కలకత్తాలో మాస్టర్ మహాశయనూ (మహేంద్రనాథ్ గుప్త – రామకృష్ణ కథామృతం రచయిత. ఈయన ప్రస్తావన యోగి ఆత్మకథలో కూడా ఉంటుంది), బనారస్‌లో బాబాలను, జ్యోతిష్కులనూ దయాల్ బాగు షహబ్జీ మహరాజ్ నూ, ఇంకా దారంట ఒకరిద్దరు అట్టే పేరు తెలీని సాధువులను.
అబ్బో పెద్ద లిస్టే ఉంది. మరి పుస్తకం ఎలా ఉంది. చదవాలా?
యోగులు, అధివాస్తవిక/ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటే తప్పక చదవమంటాను. మెహెర్ బాబాను తిట్టి పోసినా, మాస్టర్ మహాశయుణ్ణీ, రమణ మహర్షినీ, షహబ్జీ మహరాజ్ ప్రాక్టికాలిటీ+స్పిరిచువాలిటీ ని బానే చర్చిస్తాడు. చాలా క్రిటికల్ గా పరిశీలించినా ఫిజిక్సుకు అందని కొన్ని విషయాలున్నాయని పాశ్చాత్యులు నిజంగా ఇండియా నుండి నేర్చుకునేది ఏదైనా ఉంటే ఇవేనని తీర్మనిస్తాడు. అలాగే వర్తమాన భారతాన్ని తూర్పార బట్టుతాడు. (1930 లో ఇండియాని. ఐనా దురదృష్టవశాత్తూ ప్రస్తుతానికి అప్పటికీ పెద్ద తేడా కనిపించదు ఆ వర్ణనలు చదువుతుంటే.)
భాషా, కథనం వీటి సంగతేంటి?
మంచి చేయి తిరిగిన రచయిత. పదిపేజీలు చదివితే చాలు వదలకుండా చదవాలనిపిస్తుంది. క్యూరియస్ రీడ్.
ఇంత కష్టపడితే తనకేమైనా ఫలం దక్కిందా?
పాల్ యాత్రంతా ముగించి వెనక్కి వెళ్ళేందుకు షిప్పు టికెట్టు కొన్నాక, మనసు మార్చుకుని రమణమహర్షిని మళ్ళీ కలవాలనుకుంటాడు. అలా కొన్నాళ్ళు అక్కడ గడుపుతుంటే అతనికొక వర్ణానాతీతమైన అనుభవం కలుగుతుంది. చివరికి ఆయన్ని గురువుగా ఒప్పుకొని కొన్నాళ్ళు అరుణాచలంలో గడిపి తిరిగివెళ్ళిపోతాడు.
తరువాతేమయిందేమిటి?
వికీ మాటల్లో చెప్పాలంటే “He had a profound experience in Arunachalam. Later on, he quit his journalistic career and dedicated his life to inward and spiritual quest. He wrote lot of books on Eastern yoga, yogis, spirituality, quest for truth which went on to become best sellers He was famous for being a philosopher, mystic, traveller and guru”.
**************
Buy from Flipkart.com here.
appaji
free download is available in internet
Srinivas Nagulapalli
మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు.
ఇండియాను సందర్శించడానికి ఎంతో దూరాలనుంచి ఎంతో మంది ఇప్పటిదాకా వచ్చారు, ఇప్పటికీ వస్తుంటారు, ఎప్పటికీ వస్తారు.ఎందుకు రావడం అంటే ట్రావెల్ ఏజెంట్లు రంగు రంగుల pamphlets తో ఎన్నో ఆకర్షణీయమైన దృశ్యాల జాబితా చూపిస్తారు. మరి Paul Brunton చూసిన ఇండీయా గొప్పతనం ఏమిటి?
ఏమిటి అంటే, ఇండియా గొప్పతనం ఎత్తైన హిమాలయాలు ఉన్నందుకు కాదు. పవిత్రమైన గంగ ప్రవహిస్తున్నందుకూ కాదు. ప్రపంచంలోనే అద్భుతమైన అందమైన కట్టడం తాజ్ మహల్ సైతం కాదు. హిమాలయాలను మించిన ఎత్తైన వ్యక్తిత్వం, కలుషితం కాని గంగ కన్నా పవిత్రత, కాల పరిస్థితులచే మాయని తెల్లని స్వచ్చమైన మానవత్వం, అన్నీ మూర్తీభవించిన మహాత్ములను అందించడంలోనే ఇండియా గొప్పతనం అనిపిస్తుంది. అటువంటి మహాత్ములలో ఒకరైన రమణ మహర్షిని సందర్శించిన యాత్రానుభూతి ఈ పుస్తకంలో అక్షరాల ఆవిష్కృతమవుతుంది. ఆ అనుభూతి Paul Brunton పుస్తకానికే కాదు అతని జీవితానికి సైతం తలమానికం.
పామును చూస్తే భయపడడం సహజం. కాని కోరలు విప్పి పడగెత్తిన పామును సైతం నిర్భయంగా, కాదు, ప్రేమతో స్వహస్తాలతో నిమిరి దాని భయం పోగొట్టి సాగనంపిన యోగి రామయ్యగారి ఉదంతం పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు చెప్తారు. పాము సైతం యోగి రామయ్యకు తలవంచి సాగిపోవడం, తెలుగు మాత్రమే వచ్చిన రామయ్యగారు, ఇంగ్లీషు మాత్రమే వచ్చిన Paul Brunton పైన చెరగని ముద్రవేయడం వారి పరిచయ సందర్భాలు మనకు మిగిల్చిన అక్షర వీడియోలు.
అనుపమానమైన ఒక ఆనందమైన ఆధ్యాత్మిక అవ్యక్తానుభూతిని వ్యక్తపరచడం అసాధ్యం కాకపోయినా అందరికీ సాధ్యం కాదు. అరుదైన ఆ అదృష్టం అవకాశం Paul Brunton గారిది అని అందామనుకున్నాను, కాని, అది పుస్తకం ద్వారా పాఠకులందరిదీ ఏమో అనిపిస్తుంది.
==========
విధేయుడు
_శ్రీనివాస్
srinivasaraov
Brunton got the blessings of Bhagavan Ramana Maharshi and with this particular book so many westners came to know about Bhagavan. I read somewhere that Brunton later followed
Bhagavan’s ‘who am I’ and got realization.