శశాంక విజయము – ఒక పరిచయము – మొదటి భాగము

రాసినవారు: మల్లిన నరసింహారావు (వేదుల బాలకృష్ణమూర్తి)
********************************

నక్షత్రపుఁ బేరిటి చెలి,
నక్షత్ర సుఖంబు గోరి నక్షత్రములోన్,
నక్షత్రమునకు రమ్మని,
నక్షత్రముఁ బట్టి యీడ్చె నక్షత్రేశున్.

ఇందులో ఆరు నక్షత్రాలున్నాయి. వీని అర్థం – తార అనే నక్షత్రపు పేరుగల చెలి, ఆశ్లేషా ( ఆలింగన ) సౌఖ్యాన్ని కోరి తన చిత్తములో, మూలకు రమ్మని, హస్తాన్ని పట్టి చంద్రుడిని లాగిందట. తార, ఆశ్లేష, చిత్త, మూల, హస్త, చంద్రుడు ( నక్షత్రేశుడు ) ఇవన్నీ పైన చెప్పిన ఆ ఆరు నక్షత్రాలూను.

శశాంకవిజయం చంద్రుని కథ. చంద్రుడు నక్షత్రేశుడు. ఈ కావ్యాన్ని వ్రాసిన కవి శేషము వేంకటపతి. మధుర తంజావూరుల నేలిన తెలుగు నాయక రాజులలో ఒకడైన విజయరంగ చొక్కనాథుని ఆస్థానంలోని ప్రముఖ కవి.. ఇతడు “ ఉభయ భాషా కవిత్వ ప్రయోగ కుశలుడు “అని ఇతనిని ‘అహల్యా సంక్రందనం’ వ్రాసిన ప్రముఖ కవి ‘సముఖం వేంకట కృష్ణప్ప నాయకుడు’ కీర్తిస్తాడు. ఇతడు ‘చిత్ర , విస్తర , మధుర , ఆశు’ కవితలను చెప్పనేర్చినవాడు. ఈ గ్రంథానికి కృతి భర్త ‘శివదీక్షాపరురాలనురా’ వంటి పదాలను వ్రాసిన ఘనం సీనయ్య. శశాంక విజయం “అక్షయ మహానిధి “. చదివిన కొద్దీ చవులూరిస్తుంది. అనేకశాస్త్ర విషయాలకు పుట్టినిల్లు. చలం గారి “స్త్రీ “కి పూర్వీకురాలనదగిన ధీర ఈ కథానాయకురాలైన తార. ధర్మ వివాహాన్ని కాదని సహజ ప్రేమని ప్రతిపాదిస్తుంది. దేవగురుని భార్య గురుకుల వాసం చేస్తున్న శశిని క్రమంగా మచ్చిక చేసుకోవటం , తరువాత అతగానితో లేచిపోవటం, అది సహించక దేవతలు చంద్రుడి మీదికి యుద్ధానికి ఎత్తి రావటం , చంద్రుడు వారిని జయించటం – ఇదీ ఈ కావ్యానికి ఇతివృత్తం.

ఈ కథ ఇలా సాగుతుంది. నైమిశారణ్యంలో శౌనకాది మునులు సూత మహర్షిని చంద్రుని కథ చెప్పమని అడగ్గా అతను ఆకథను చెప్పటానికి ప్రారంభిస్తాడు. అత్రి మహర్షికి అతని భార్య అనసూయా దేవికి త్రిమూర్తుల వరంతో దత్తముని ( హరి అంశ ), దూర్వాసుడు(శివుని అంశ ), చంద్రుడు ( బ్రహ్మ అంశ ) పుత్రులుగా జన్మిస్తారు. కనిష్టుడైన చంద్రుడు వయస్సు వచ్చేసరికి మంచి అందంగా తయారవుతాడు..

సుద్దులచే బుద్దులచే
ముద్దులచేఁ దల్లి దండ్రి ముదమలరంగాఁ
దద్దయుఁ ద ద్దయ నెసగెను
ప్రొద్దుకుఁ బ్రొద్దుకును వింత పోణిమి మీరన్.(1-39)

బ్రహ్మ దేవుడు చంద్రుని ఉపనయనానికి వచ్చి చంద్రుడు “రాజ”ని కీర్తిపొందుతాడని, తారకానేత, ఓషధీశుడు, అవనీసుర జాతికి పాలకుడు అవుతాడని, రాజసూయం చేస్తాడని, జాతకం చెపుతాడు. విశ్వకర్మని పిలిచి అతనికి ప్రతిష్టానపురాన్ని నిర్మించి ఇమ్మంటాడు. ఆ పట్టణాన్ని గుఱించి చెబుతూ –

చారు చిరత్మ రత్నమయ సౌధముల న్బురి వైశ్య కన్యకల్
గీరనగింజ లాడు తఱిఁ, గ్రిందను జిందిన దివ్య రత్నముల్
పౌరులు ద్రొక్కుచు న్జనఁగ బాదుకొన న్ధరణీ పురంధ్రికిన్
వారక రత్నగర్భ యను నామముఁ వెట్టిరి సత్కవీశ్వరుల్. (2-19)

ఆ పట్టణంలో రత్నమయ సౌధాల్లో వైశ్య కన్యకలు ‘గీరనగింజ’ ( అచ్చన గండ్లు అని ఇంకో పేరుంది ఈ ఆటకు ) లాడుకుంటున్నప్పుడు చింది పడిన దివ్యరత్నాలు , పౌరులు తొక్కుతూ వెళ్ళగా , నేలలో పాతుకుపోవటం చేత ధరణికి కవీశ్వరులు రత్నగర్భ అని పేరు పెట్టారట. ఎంత గొప్ప ఊహనో చూడండి.

చంద్రుడు కొంచెం పెద్దవాడయ్యేటప్పటికి అతనిని విద్యాభ్యాసం నిమిత్తం దేవగురు వైన బృహస్పతి దగ్గఱకు పంపుతాడు అత్రి. ఆ సందర్భంలో విద్య యొక్క గొప్పదనాన్ని గురించి అత్రి మహాముని చంద్రునితో —

చదువునఁ బ్రజ్ఞ, దాన సరసజ్ఞత, యందునఁ గార్యఖడ్గ కో
విదతయు, దానఁజేసి ప్రతివీర నృపాల జయంబు, వానిచే
పదనుగ మీఱు సంపదలు, నందునఁ ద్యాగము భోగ, మందుచేఁ
బదపడి కీర్తి, దాన ననపాయ పదంబును గల్గు నెంచగన్. 35

ఆఱని దివ్వె, యక్షయమహానిధి చూపు నవాంజనంబు, నూ
రూరికి వచ్చి తోడుపడ నోపిన బంధుఁడు, జ్ఞాతి వర్గము
ల్గోరని సొమ్ము, దేవ నర లోక వశీకర ణౌషదం, బసా
ధారణ మైన విద్య, వసుధ న్నుతియింప వశంబె యేరికిన్ ? 36

చెఱకునకుఁ బండు, పసిఁడికిఁ
బరిమళమును జిత్తమునకుఁ బ్రాణంబును, దా
నరుదుగఁ గల్గిన రీతిని;
నరపతులకు విద్య గలిగిన న్నలు వెసఁగున్. 37

ఈ పద్యాలు చదువుతుంటే భర్తృహరి సుభాషితాలు గుర్తుకొస్తాయి మనకు. ముఖ్యంగా

విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం !
విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యాగురూణాం గురుః !
విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం !
విద్యా రాజసుపూజ్యతే నహి ధనం విద్యావిహీనః పశుః!! .నీతిశతకం16..

విద్య నిగూఢగుప్త మగు విత్తము రూపము పూరుషాళికిన్
విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుఁడున్
విద్య విశిష్టదైవతము విద్యకు సాటి ధనంబు లే దిలన్
విద్య నృపాలపూజితము విద్య నెఱుంగనివాఁడు మర్త్యుడే. ఏనుగు లక్ష్మణ కవి గారి అనువాద పద్యం.

మానవులకు విద్యయే సౌందర్యం;అది గుప్త ధనం; చదువే కీర్తిని,సుఖాన్ని,భోగాన్ని కలిగిస్తుంది; విద్య గురువులకు గురువు. విదేశాలకు పోయినపుడు విద్య బంధువు లాంటిది. అదిమనకింకో కన్నులాంటిది, రాజసభలలో పూజార్హత విద్యకే గాని ధనానికి గాదు. ఇంతటి శ్రేష్ఠమైన విద్య లేని నరుడు వింతపశువు మాత్రమే. ఇదే కాకుండా ఇంకా—

విద్య యొసగును వినయంబు,
వినయంబునను బడయు పాత్రత,
పాత్రత వలని ధనంబు, దాని వలన
ఐహికాముష్మిక సుఖంబు లందు నరుడు
. అని కూడా మనం చిన్నప్పుడు చదవుకున్నాం.

ఆవిధంగా తండ్రి పంపగా వచ్చిన చంద్రుడిని శిష్యునిగా స్వీకరించి తనంతటి వానిగా చేస్తానని అంటాడు బృహస్పతి. శశిని దగ్గరగా తీసుకొని భార్య తారతో –

నీరజగంధి! వీఁడు జననీ జనకు ల్గడు గారవంబున
న్వారకఁ బెంపఁగా బెరిఁగినాఁ, డతి కోమల దేహుఁ, డీతనిన్
మేర యెఱింగి, యాదరము మీఱఁగ, వేళకు వేళకు న్మనం
బారసి, యన్న పానముల కాకొననీయక ప్రోవఁగాఁ దగున్ ,

– అని అప్పగిస్తాడు. ఆరోజులలో గురుకులవాసంలో విద్యాభ్యాసం, గురువులకు శిష్యుల పట్ల ఉండే అనురాగ వాత్సల్యాలు ప్రస్ఫుటమౌతాయి ఈ పద్యంలో.

చంద్రుడు తన విద్యాభ్యాసకాలంలో నేర్చుకొన్నవిద్యల గుఱించి—
చదివెను ఋ గ్యజు స్సామాది వేదంబు,
లధికరించెను ద ద్రహస్య జాత,
మభ్యసించెను లక్ష ణానీకముల నెల్ల,
నధిగమించెను ష డంగములను,
బఠియించెఁ గాణాద భాష్య మీమాంసలు,
తెలిసె వ్యాస మతంబు తేటపడఁగ,
గ్రహియించె సాంఖ్య యోగముల మర్మము లెల్ల,
నాకళించెను బురాణాదికముల,
నేర్పెఁ దెల్లముగా దండనీతి శాస్త్ర,
మరసె నాద్యంతముగను వైద్యాగమంబు,
నెఱిఁగె సాంగ ధనుర్వేద మెల్ల, నపుడు
సోముఁ డుద్య త్కళా స్తోమ ధాముఁ డగుచు.

– ఎన్నెన్ని విద్యలు చదివాడో చూడండి. ఈరోజుల్లో మన పిల్లలే చదువుకోడంలో చాలా కష్టపడుతున్నారని అనుకుంటుంటాం మనం.

అరసి విశుద్ధ శబ్దములు, నర్థములున్, ధ్వనివైభవం, బలం
కరణము, రీతివృత్తులును, గల్పన, పాకము, శయ్యయు, న్రస
స్ఫురణము, దోషదూరత, యచుంబిత భావము లొప్పఁ, జిత్ర వి
స్తర మధు రాశు లీలఁ గవితల్ రచియింపఁగ నేర్చె నంతటన్. 54

శేషము వేంకటపతి కవిగారు కూడా అన్ని రకాలయిన కవితలనూ చెప్పారిందులో.

అంగనల సొక్కు మందులు,
సంగీతము, భరతశాస్త్ర సరణియు విద్యా
సంగతు లగు గంధర్వుల
సంగతి న మ్మేటి నయ మెసంగఁగ నేర్చెన్. 55

.అఱువది నాలుగు విద్యల
నఱు పది, యఱ పది మొగంబు లయ్య నుతింపన్
సురగురుని కరుణఁ జిర భా
సుర గురు నియతిన్ , సుబుద్ధి సోముఁడు నేర్చెన్. 56

ఇలా విద్యాభ్యాసం జరుగుతుండగా చంద్రుడు క్రమక్రమంగా యవ్వనవంతుడౌతాడు.

You Might Also Like

7 Comments

  1. పుస్తకం » Blog Archive » శశాంక విజయము – ఒక పరిచయము – రెండవ భాగము

    […] ********************* మొదటి భాగం లంకె ఇక్కడ. సీ. ఇది మనోహర కాంతి నింపైన బింబంబు […]

  2. నరసింహారావు మల్లిన

    వ్యాఖ్యాతలందరికీ కృతజ్ఞతలు. రెండో భాగం కొద్దిరోజుల్లో ప్రచురితమవుతుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.

    1. Ajay

      Where to buy this book

  3. ammaodi

    తారా శశాంకం గురించి మంచి టపా చూపించారు. చక్కని పద్యాలతో బావుంది. నెనర్లు!

  4. రాకేశ్వర రావు

    చాలా బాగుంది వ్యాసము। రాసినోరి` గుఱించి ఇంకొన్ని వివరములు ప్రొద్దులో ఇచ్చినట్టు ఇస్తే బాగుంటుంది।

    `పత్రికాయాజమాన్యం ఇలా పత్రికలలోకూడా వకారాన్ని మింగేస్తే కష్టం।

  5. సౌమ్య

    ఆ మొదటి పద్యం భలే ఉంది 🙂

    ఇలాంటి పుస్తకం చదవడం సంగతి అటుంచితే – కనీసం ఒకటుందన్న విషయమన్నా తెలిసేది కాదు – ’పెన్నాతీరం’ తిరగేయకపోతే. ఇప్పుడైతే, ఈపుస్తకం కథ గురించి కాస్త అవగాహన కలిగిందంటే, మల్లిన నరసింహారావుగారి వల్లే. అందుకు ఆయనకు ధన్యవాదాలు.
    [ఇప్పుడీ వ్యాఖ్య చేసింది – ఇదొక మస్ట్ రీడనో…మస్ట్ పొజెస్ అనో భావించి కాదు. ఆ సంగతి నాకు తెలీదు….అన్నాళ్ళ క్రితం పుస్తకం, అదీ నిషేధం విధించినది – అనగానే క్యూరియాసిటీ..అంతే]

    ఇంతకీ, ఇంతకంటే శృంగార వర్ణనలు లేని తెలుగు కావ్యాలే లేవంటే నేన్నమ్మను. అవి కూడా ఎందుకు నిషేధింపబడలేదు??

  6. రవి

    ఈ వారాంతానికి సరిపడే పరిచయం. మరో సారి పూర్తిగా చదవాలి.

Leave a Reply