చివరకు మిగిలేది…

రాసిన వారు: Halley
************************

గమనిక : ఈ వ్యాసం ఏదో అక్షరాలు గుణింతాలు సమాసాలు గట్రా తెలిసినందువలన తెలుగు చదవటం అబ్బిన ఒక సామాన్య తెలుగు పాఠకుడు రాసిన వ్యాసం. నాకు “విమర్శక రత్న” వంటి బిరుదులు లేవు . సినిమా భాషలో చెప్పాలంటే నేను నేల ప్రేక్షకుడిలా నేల పాఠకుడిని . నేల పాఠకులకి రెవ్యూలు రాసే హక్కులు లేవు అవి కేవలం వేద పండితులే వ్రాయవలెను అన్న అభిప్రాయం ఉన్నవాళ్ళు దయ వుంచి ఈ రెవ్యూ చదవకండి .

“చివరకు మిగిలేది” – బుచ్చిబాబు – 90/- – విశాలాంధ్ర

నేను తెలుగు సాహిత్యంలో కొంచెం వీకు . నాకు బుచ్చిబాబు అంటే “చివరకు మిగిలేది” తెలుసు అంతే .  మొన్నామధ్యన ఈ నవల చదవటం జరిగినది . నాకు నచ్చినది కనుక ఈ నవల గురించి పది మందికి తెలియజెప్పాలని ఇదిగో పుస్తకం.నెట్లో ఇలా రాయవలసి వచ్చింది.

ఇక కథ విషయానికి వస్తే .. కథానాయకుడు దయానిధి జీవితం తాలూకా కష్టాలూ , సుఖాలు , ప్రశ్నలు , సవాళ్ళూ … (అంటే సవాల్ ఔర్ జవాబ్ లో సవాల్ కాదు ! .. బస్తీ మే సవాల్ లో సవాల్ ! ).. ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే మనుషులు .. అతన్ని నీడలా వెంటాడే అతని గతం ..ఆడుగడుగునా సంఘం నుంచి అతనికి ఎదురయ్యే ఛీత్కారాలు .. ఇవన్ని కలిపి ఒన్ టు థ్రీ మహరజ మిక్సిలో కలిపేస్తే కథ రెడీ . 1930-1950 ప్రాంతం కథ ఇది .

రాజమౌళి సినిమాలోలాగ ఈ నవలలో కథానాయికలకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు . అంటే ఉన్న నలుగురు హిరోయిన్లు (మరే మీరు త్తఫ్ఫుగా చదవలేదు ! .. నలుగురు !.. ఐతే అందరు మెయిన్ హీరొయిన్సు కాదు లెండి ) దయానిధి ఫాన్స్ !. దయానిధి యెం.బి.బి.యస్ చదివిన డాక్టరు . అతను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక తక్కువ కులం అమ్మాయితో ఒక “ఎఫైర్” (అదేంటో తెలుగులో వ్యవహారం అంటే ఆ ఫీలింగు రాదు !) నడుపుతూ ఉంటాడు . ఈ అమ్మాయి పేరు కోమలి . ఇది ప్రేమో , కామమో … కొంచెం రుచి కొంచెం చిక్కదనం లాగా కొంచెం కామం కొంచెం ప్రేమో నాకు ఆట్టే అర్థం కాలేదు !. ఈ వ్యవహారానికి దయానిధి అమ్మ తప్పితే ఇంక ఎవరి దగ్గర నుంచీ సపోర్టు దొరకదు అతనికి . కోమలి వాళ్ళ కుటుంబం మరియు దయానిధి వాళ్ళ అమ్మగారు అదో టైపు (అదేంటో తెలుగులో అదో రకం అంటే ఆ ఫీలింగు రాదు! )  అని లోకులు కూస్త్టూ ఉంటారు . తన తల్లి మరణించిన తర్వాత సంఘం నుంచి ఇటువంటి కామెంట్సు మరీ ఎక్కువ అయిపోతాయి ( శేంపిల్ : అమ్మ బుద్ధులే కొడుక్కి వచ్చాయి . లేకపొతే ఆ కోమలితో ప్రేమలు ఏంటి !).ఇదిలా సాగుతూండగా మరొక రెండు ఆడ పాత్రలు ప్రవేశ పెడతారు రచయిత… ఒకరు అమృతం.. మరొకరు సుశీల. అమృతంకి పెళ్ళి అయిపోయినా కూడా వరసకి బావ అయిన దయానిధి అంటే ఒక “ఇది” ( బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  “అది ఒక ఇది లే … ” ) . సుశీలకి దయానిధి అంటే ఇష్టమే కానీ దయానిధి అమృతంతోనూ మరియు కోమలితోనూ చనువుగా ఉండటం చూసి కాబోలు .. ఇష్టం బయటకి చెప్పదు . నిజానికి సుశీలకి దయానిధికి పెళ్ళి జరగటానికి ఆట్టే అడ్డంకులు లేవు అనట్టు గానే అనిపిస్తుంది . వీరు కాకుండా అమృతం తమ్ముడుగా జగన్నాథ్ పాఠకులకి కామిక్ రిలీఫ్ పంచుతాడు ( శేంపిల్ :  “…. కరెక్టు జగ్గూ !” నిధి అందుకున్నాడు . జగ్గన్నాథ్ : జగ్గూ – A jug the crow and the jug – దారుణం , నాథ్ అనండి ) . నమ్మిన బంటు పాత్రలో నారయ్య …  పాత సినిమాలలో జగ్గయ్య , గుమ్మడి, నాగయ్య లాగా అలరిస్తాడు ( నారయ్య అన్న పేరు వింటేనే పాత్ర అర్థం అయ్యుంటుంది చాలా మందికి !  ఇదే నవలలో కథానయకుడి పేరు “నారయ్య ” నౌకరు పేరు “దయానిధి” అంటే ఛీ అంటారేమో ! ) .

కోమలి వ్యవహారం ముదిరి పాకాన పడి, నానా గొడవ జరిగి మొత్థానికి కొన్ని పదుల పేజీలు అయ్యాక కోమలి ఇంకెవరితోనో ఊరు వదిలి పోతుంది , దయానిధికి ఇందిరతో వివాహం జరుగుతుంది . కుటుంబ కలహాలు , దయనిధి కాంగ్రెస్సువాదం , మామగారితో దాని గురించి పట్టింపులు వగైరా కారణాల వలన ఇందిరకు దూరంగా ఉండవలసి వచ్చి అతను మద్రాసులో ఒంటరిగా ప్రాక్టీసు  పెడతాడు .  తిరిగి మళ్ళీ రోస్ అని ఒక ఆడ అసిస్టెంట్ అతని దగ్గర జీతం లేకుండా పని చేయటం , శ్యామల అనే ఒక ఆడపేషంటు అతని ఆసుపత్రిలో కొన్ని దినములు ట్రీట్మెంట్ కోసమని ఉండటం వల్ల సంఘంలో మళ్ళీ రకరకాల పుకార్ల్లు పుడతాయి ( కోమలి , అమృతం, ఇందిర , సుశీల , రోస్ , శ్యామల , నాగమణి (సొంత ఊరిలో ఎదురింటి అమ్మాయి) – ఒక్క దయానిధికి ఇంత మందితో చనువు ఉంటే మన సంఘం ఊరుకుంటుందా ! ). ఈ పుకార్లతో  ప్రాక్టీసు దెబ్బతిని దయనిధి రాయలసీమలో కొత్త జీవితం మొదలుపెడతాడు.

“నరసింహ” సినిమాలో రజనీకాంతుకు గ్రనేటు కొండ దొరికినట్టు (నిజానికి నవలే పాతది కనుక “నరసింహ” సినిమానే కాపీ అని అనుకుందాం)  దయానిధికి వజ్రాలగని తాలూకు ఆనవాళ్ళు దొరకటంతో దశ తిరిగి ధనవంతుడు అయిపోతాడు ( ఇటువంటివన్నీ సినిమాలలో లేదా నవలలో మాత్రమే  జరుగును !). ఎప్పుడో ఊరు వదిలి వెళ్ళిన కోమలి తిరిగి దయానిధి సరసన చేరుతుంది , వచ్చిన డబ్బుతో దయానిధి పెట్టిన ఆసుపత్రి పనులలో సాయపడుతూ , అపుడపుడూ పాత ప్రేమను గుర్తుకు తెస్తూ దయానిధితో కాలం గడుపుతూ ఉంటుంది.

సుశీల మరియు ఇందిరల మరణం , అమృతానికి ఒక బిడ్డ జన్మించటం ( ఇది దయానిధి-అమృతం ల అక్రమ సంతానం అన్నట్టుగా అనిపించటానికి కావలసినన్ని హింట్లు ఇస్తాడు రచయిత ! ) , దయానిధి మిత్రుల జీవితాలు , జగన్నాథ్ కెరీరు బాపతు వగైరా సంఘటనలు మిగిలిన పేజీలను నింపుతాయి . దయానిధి సర్కారు జిల్లా వాడు అని అతను రాయలసీమలో ఆస్తులు కలిగి ఉండకూడదని ( మన తె.రా.స కూతల మల్లే ! ) అతనికి నలుగురు పెళ్ళాలనీ అతను అంత మంచి వాడేమీ కాదని అల్లర్లు రేగటంతో నారయ్య మరణం .. దయనిధి కోమలి ఊరు వదిలి పారిపోవటంతో కథ ముగుస్తుంది.

జీవితానికి అర్థం యేమిటి ? అన్న ప్రశ్నతో మొదలు అయిన ఈ నవల . చివరకు మిగిలేది .. సమాధానం తెలుసుకోటానికి చేసిన ప్రయత్నాలు వాటి తాలూకా జ్ఞాపకాలు – తనను తాను సమాధానపరుచుకోవటం … అన్న దయానిధి స్వగతంతో ముగుస్తుంది !

రచయిత అక్కడక్కడ అడిగే ఫిలసాఫికల్ ప్రశ్నలు నవల చదివాక కూడా వెంటాడతాయి. సంఘం (దాని కట్టుబాట్లు) మరియు గతం ఒక మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చక్కగా వివరించారు.  అయితే నవల మగవారికి మరియు మగరాయుళ్ళవంటి ఆడవారికి మాత్రమే నచ్చుతుంది యేమో !   నవల చివరి పేజిలో ఒక మిని-సమీక్ష ఉంది .. అందులో ఎవరో ఒకాయన (ఒకావిడ ? .. వద్దు అలా చూడకండి నేను ఫెమినిష్టుని కాను . ఏదో ఆడో మగో తెలియక అలా రాసాను అంతే) ఇలా రాసారు .. తెలుగు కల్పనాసాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ “చివరకు మిగిలేది” అని … నిజమేనేమో ! . లేకపోతే ఎపుడో అరవై యేళ్ళ క్రిందటి నవల నేను ఇప్పుడు చదవటం ఏమిటి !

You Might Also Like

87 Comments

  1. కొత్తపాళీ

    ఇది అనేక విషయాలకి సంబంధించి చాలా ఆసక్తికరంగా ఉంది.
    హేలీ గారు ఈ నవలగురించి (ఇంకోదేన్ని గురించైనా సరే) ఈ పద్ధతిలో (శైలిలో, టొన్‌లో, భాషలో) రాయకూడదు అనే వాదన్ని సమర్ధించలేదు.
    హేలీ గారు రాసినదాన్లో వ్యంగ్యం, నవల నచ్చకపోవడం వల్ల వచ్చినదని కూడా నేననుకోను.
    క్లాసిక్ అయిన ప్రతికళాసృష్టికీ ఆటోమేటిగ్గా విభిన్న దృక్కోణాలనించి చూసే అవసరం ఒకటి ఏర్పడుతుంది. మన ఆధునికసాహిత్య క్లాసిక్సన్నిటినీ మనం ఇట్లా మళ్ళీ పరిశీలించాలి.
    సరికొత్త కాంత్రవర్సీకి తెరతీస్తున్నాను. డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ద్రౌపదిని పరామర్శించిన తీరుకీ, హేలీ గారు దయానిధిని పరామర్శించిన తీరుకీ పోలికలేమిటి, తేడాలేమిటి?

    1. pavan santhosh surampudi

      యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు పరామర్శించిన తీరు కన్నా హేలీ గారి పరామర్శే చాలా నిజాయితీతో గలది. ఆయన నవల చదివారు, తనకు అర్థమైన రీతిలో కథాంశం తిరిగిచెప్పారు. తనకేం అనిపించిందన్నదే ఆయన ప్రాధాన్యత పాత్రల మనసులో రచయిత చెప్పని ఏ కోణాలున్నాయి లాంటీ దిక్కుమాలిన చర్చ ఏం ప్రారంభించలేదు.
      యార్లగడ్డవారు ద్రౌపది మనస్సులో ఏమనుకుందన్నది కూడా ఊహించుకుని కొంత కల్పించి చీప్ లుక్ వచ్చేలా, బరితెగించి తిరిగేవాళ్లకి ఓ జస్టిఫికేషన్ ఇచ్చేలా వ్రాశారు ఆ ద్రౌపది నవల.

  2. జంపాల చౌదరి

    వెక్కిరింపుకూ, విమర్శకూ ఏ వస్తువూ అతీతం కాదు, కాకూడదు. అబిప్రాయభేదాలకు ఎప్పుడూ అవకాశమూ, ఆస్కారమూ ఉంటుంది.

    HalleY గారు పుస్తకం నచ్చింది కాబట్టి పదిమందికీ పరిచయం చేయాలని రాస్తున్నాను అన్నారు మొదటి పారాగ్రాఫులో. ఆ తర్వాత రచయిత లేవనెత్తిన ప్రశ్నలు నవల చదవడం పూర్తయ్యాక కూడా వెంటాడతాయి అని కూడా అన్నారు. ఐతే ఆ రెండు వాక్యాలు తీసేసి సమీక్ష (లేదా పరిచయం) చదివితే ఈ పుస్తకం ఆయనకు మిక్సీలో వేసి రాసేసిన ఫార్ములా పుస్తకంలా కనిపించిందనీ, గందరగోళంగానూ, వేళాకోళంగానూ అనిపించింది అన్న అభిప్రాయం వస్తుంది. ఈ అస్పష్టతతోనూ, వైరుధ్యాలతోనే ఈ వ్యాసంతో ఇబ్బంది. ఉద్దేశపూర్వకంగానో, అనాలోచితంగానో కానీ హాస్యం ఎక్కువై, చెప్పదల్చుకొన్న విషయాలు చెప్పలేదేమో అనిపిస్తుంది.

  3. కామేశ్వర రావు

    ఒక పుస్తకానికి ప్రదేశం, కాలం మొదలైన అంశాల వల్ల ఒక పరిధి పరిమితి ఏర్పడతాయి. అది చివరకు మిగిలేది కావచ్చు, వేయిపడగలు కావచ్చు, మైదానం కావచ్చు, చెలియలికట్ట కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు, మహాభారతం కావచ్చు, హేరీ పోటర్ కావచ్చు. ఆ పరిధిలో ఉన్నవాళ్ళకి ఆ పుస్తకం నచ్చుతుంది. దాని బయటనున్న వాళ్ళకి అది నచ్చదు. కొన్ని పుస్తకాలలో కొన్ని విషయాలకి విస్తృతి ఎక్కువ ఉండవచ్చు కొన్నిటికి తక్కువ ఉండవచ్చు.

    ఈ విషయాన్ని ఈ టపా రచయితతో బాటు ఇక్కడ కామెంటిన వాళ్ళలో ఇంచుమించి ఎవరూ దృష్టిలో ఉంచుకున్నట్టు లేదు. ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. ఇక్కడ Halleyగారు చెప్పిన దానిలో కొందరికి వెటకారం, అవహేళన కనిపించింది. ఇది నిజమే! అయితే ఇది నాకు వ్యంగ్యం కోసం చేసినట్టుగా నాకనిపించలేదు. అతనికి ఆ పుస్తకం చదివినప్పుడు అతను వెటకారంగా చెప్పిన అంశాలు నిజంగానే వెటకారంగా ఎందుకు తోచి ఉండకూడదు? కేవలం తన అయిష్టాన్ని వ్యంగ్యంగా చెప్పడం కోసం అలా రాసేడని ఎందుకనుకోవాలి? అలాగే మనకి చాలా సీరియస్ గా తోచిన నవల మరొకనికి ఎందుకిలా తోచింది దాని వెనక నిజమైన కారణాలేమైనా ఉన్నాయా అని ఎందుకు ఆలోచించ కూడదు?

    Halleyగారు, మీ వయసు అప్రస్తుతం అన్నారు. నేను దానికి ఒప్పుకోని. అది అవసరమే. ఒక పుస్తకాన్ని అర్థం చేసుకొనే తీరుకి వయసుతో సంబంధముండడానికి చాలా అవకాశమే ఉంది.

    ఒక పుస్తకమ్మీద ఒకరు తమ అభిప్రాయాన్ని ప్రకటించడం ఎంత మాత్రం తప్పుకాదు. ప్రకటించిన విధానాన్ని కూడా నేను తప్పుబట్టడం లేదు. అయితే, ఒక బ్లాగుకీ, పుస్తకం.నెట్ కీ నేను ఒక తేడా ఉందని అనుకుంటున్నాను. కాదంటే చెప్పండి, నా అభిప్రాయాన్ని సరిదిద్దుకుంటాను. ఒకరు తన బ్లాగులో ఒక టపా రాసారంటే అందులో ఆ రాసినతని ఆత్మతృప్తి తప్ప వేరే ప్రయోజనం ఆశించడం వ్యర్థం. కాని పుస్తకం.నెట్ లో ఒక టపాకి(లేదా వ్యాసం) ఆ పాఠకులు ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తారు. ఇప్పుడు ఈ వ్యాసాన్ని ప్రకటించడంలో పుస్తకం వాళ్ళు ఆశించిన ప్రయోజనం ఏమిటన్నది స్పష్టంగా లేదు. రాసే అతను కేవలం తన అభిప్రాయాన్ని ప్రకటించడం కోసమే ఈ వ్యాసం రాసినట్టుగా అనిపిస్తోంది. ఇది కేవలం ఒక పాఠకుని అనుభవం అయితే, ఇది ఆ పుస్తకానికి కాని దాన్ని చదవాలనుకునే వాళ్ళకి కాని ఒరిగే ప్రయోజనం ఏమిటి? ఒక పుస్తకం గురించి నచ్చిన విషయాలు నాలుగు మంచిగా రాస్తే ఆ పుస్తకం మరో నలుగురు చదివే ఉపయోగం ఉంటుంది. లేదు ఒక పుస్తకం సమాజానికి, మనిషికి హాని చేసేదని అనుకుంటే దాన్ని వివరిస్తూ చదవద్దని హెచ్చరిస్తే దానికీ ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు రాసిన వ్యాసానికి ఏమిటి ప్రయోజనం? కేవలం ఒక పాఠకుని అనుభవంగానే అందరూ దీన్ని తీసుకుంటారు కాని, అంతకన్నా ఎక్కువగా ఆలోచించే అవకాశం లేదు కదా. అంతకన్నా పూర్ణిమగారు చెప్పినట్టు, తన స్నేహితులకి చాలామందికి నచ్చలేదని తెలిస్తే, దాని గురించి ఎందుకు నచ్చకపోయి ఉండవచ్చు, ఇందులో ఏమైనా pattern ఉందా మొదలైన విషయాలని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాసంలో అలాంటిదేమీ కనిపించలేదు.

    పుస్తకం ఎంతో నచ్చిన వాళ్ళు, (అంతగా) నచ్చనివాళ్ళకు అది ఎందుకు నచ్చి ఉండకపోవచ్చును అని, (అంతగా)నచ్చని వాళ్ళు మరికొంత మందికి ఎందుకు అంత గొప్పగా నచ్చింది అని, నిజాయితీగా ఆలోచిస్తే దానికొక ప్రయోజనం. లేదంటే చివరకి మిగిలేది ఎవరికి వారే యమునా తీరే!

  4. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    చివరికి మిగిలేది ఎప్పుడో నా కాలేజ్ రోజుల్లో చదివాను.ఆప్పట్లో ఏం అర్థం కాలేదు.సుజాత గారి వ్యాఖ్యలు,ఇతరుల అభిప్రాయాలు చదువుతూంటే ఇంకోసారి చదవాలేమో అనిపిస్తోంది.

    నిషిగంధ గారిలా నేను నవీన్ గారి అంపశయ్య చదివాను.నవల మొత్తం మీద కథానాయకుడు చేతిలో డబ్బులేకపోయినా అప్పు చేసి ప్రేయసి మెప్పు కోసం థియేటర్ కి వెళ్ళి,తర్వాత నానా అగచాట్లు పడే నాలుగైదు పేజీలు తప్ప నాకేం నచ్చలేదు.సమీక్ష రాద్దామనే ఉద్దేశంతోనే దాన్ని కొన్నా,నాకు నచ్చలేదు కాబాట్టి ఆ ప్రయత్నం విరమించుకొన్నాను.

  5. mandaakini

    ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులు, దేవుళ్ళు ఎన్నో కార్టూన్ లలో, ఎన్నో వ్యాసాలలో అవహేళనకు గురి అయ్యారు. ఆ విషయాన్ని వ్యతిరేకిస్తే మూఢ భక్తి అంటారు. చలం, బుచ్చిబాబు నా లాంటి ఎంతో మందికి నచ్చక పోవచ్చు. అది కొంతమంది ఎగతాళి గా విమర్శిస్తారు. దానికి ఇంత వ్యతిరేకతా! మరీ విడ్డూరంగా ఉంది.
    ఎవరి శైలి వాళ్ళది. ఎవరి ధోరణి వాళ్ళది. ఇంతటితో ఈ అనవసర చర్చ ఆపితే బావుంటుంది.

  6. నిషిగంధ

    ఈ వ్యాసం సరదాగా రాసినట్టు అనిపిస్తే నాకీ పుస్తకం నచ్చినా నేనూ హాయిగా నవ్వేసుకుని వెళ్ళిపోయేదాన్ని.. కానీ ఇందులో హాస్యం కంటే వ్యంగ్యంతో కూడిన అవహేళన లాంటిది కనిపించింది కాబట్టి నాకస్సలు నచ్చలేదు.. అందరికీ అన్ని పుస్తకాలు నచ్చాలని ఏ యూనివర్సల్ రూల్ లేదు.. అసలు ఎక్కువమందికి నచ్చింది కాబట్టి అది ‘ది బెస్ట్ ‘ అనాలని కూడా లేదు.. కానీ కాస్తో కూస్తో ప్రాముఖ్యం ఉన్న పుస్తకం చదివి, అది నచ్చనప్పుడు ఎందుకు నచ్చలేదనేది సహేతుకంగా రాయాలి కానీ అసలు విషయాలను వక్రీకరిస్తే ఎలా?

    పూర్ణిమా, నచ్చలేదు అని రాయడం తప్పని ఎవరూ అనడం లేదు.. ఇక్కడ సమస్య అది కానే కాదు.. మహేష్ చెప్పినట్టు వ్యంగ్యపూరిత శైలిది.. నేను అంపశయ్య 4,5 పేజీల కంటే చదవలేకపోయాను.. not cup of my tea అనుకున్నాను కానీ అంత ప్రాచుర్యం పొందిన పుస్తకం చదవడం దండగని మాత్రం అనుకోలేదు.. I don’t think you will ever write like this though 🙂

  7. రవి

    సుజాత గారు, మీరు మరీనండి. 🙂

    మీ మనోభావాలను మీరే అర్జంటుగా గాయపెట్టుకుని, బాధపడితే ఎట్లాగ? వ్యాస రచయిత నవలారచయితను పల్లెత్తుమాటన్నాడా? పోనీ రచనను విమర్శించాడా? పోనీ నవలను దిగజారుస్తూ పనికిరాదన్నాడా? తన పద్ధతిలో కథ చెప్పాడు, పరిచయం చేశాడు. అదీ తప్పంటే ఎట్లాగ?

    ఈ నవల మా ఇంట్లోనే ఉండేది. నేను చదవకపోడానికి కారణం ఒకటుంది. ఈ నవల చివరి అట్ట మీద కృష్ణమూర్తి తత్వం అని ఒక మాట ఉంది. మొదట ఆ తత్వమే తెలుసుకుందామనుకుని, ఈ నవల పక్కనెట్టాను. చదవలేదు.

  8. రమణ

    @పూర్ణిమ : సినిమాలతో పోల్చి వ్యాసం రాయటం అంత బాగోదని నేనన్నాను. ఆ విధంగా ఎందుకు రాయకూడదని హెలీ అన్నారు. దానితో నాకు ఎటువంటి సమస్యా లేదు. ఈ పుస్తకం గురించే కాదు, ఏ పుస్తకం గురించి రాసినా నేను అలాగే వ్యాఖ్యానించేవాడిని.కాకపోతే ఈ పుస్తకం చదివాను కాబట్టి స్పందించాను. ఒక వెబ్ పత్రికలో వ్యాసం వచ్చినపుడు ఒక్కొక్కళ్లు ఒక్కోలా స్పందిస్తారు. అభ్యంతరం కానంతవరకు అవన్నీ స్వీకరించకపోతే ఎలా? పాఠకులు వ్యాసాన్ని పొగుడుతూనే రాయాలా ? నచ్చనివి రాయకూడదా? ఈ పుస్తకం బాగుందని తర్వాత రాసిన ఆ వ్యంగ్యం ఏమిటి? సూటిగా రాస్తే బాగుండేది.రాసిన దానిని సమర్ధించుకుంటూ గమనిక పెట్టటాన్ని ఏమంటారు? నచ్చని పుస్తకాలను గూర్చి రాసినపుడు సాహిత్యానికి ద్రోహం చేసినట్లని ఎవరన్నారు?

  9. Achilles

    @తెలుగు అభిమాని: Let there be a “like” button!

    Ask. Ye Shall Be Granted. Matthew 7:7

  10. Achilles

    Halley,

    Now that you are in this clumsy place called telugu blog world, I have quote that might soothe your nerves…

    “Vanity, surely is my favorite sin”

    Sin we must! 😉

  11. తెలుగు అభిమాని

    @ mahesh kumar:
    ++1

    Where is the “like” button when I need it?

  12. Purnima

    ఈ కింది ప్రశ్నలను ఈ వ్యాసం, దానికి కమ్మెంట్లు చదివిన వ్యక్తిగా అడుగుతున్నాను. (పుస్తకం.నెట్ తో నాకు సంబంధం ఉందన్న విషయం కాసేపు పక్కకు పెడదాం.) ఈ ప్రశ్నలు కూడా నాకర్థకాక అడుగుతున్నవే కానీ, ఒకరి తీరుని ప్రశ్నించాలని కాదు.

    తెలుగు చదవగల ఒక వ్యక్తి తాను చదివిన పుస్తకం గురించి, తనకున్న పరిధిలో ఒక వ్యాసం రాసినదానికి ఇక్కడ వచ్చిన వ్యాఖ్యలు నాకర్థం కావటం లేదు. ఒక పుస్తకాన్ని ఒకే తీరులో అంతా ఎలా అర్థం చేసుకుంటారు? ప్రతీ పుస్తక పఠనం, ఒక రచయిత ఒక పాఠకునితో చేసిన సంభాషణ అనుకుంటే, చివరకి మిగిలేది ద్వారా బుచ్చిబాబు గారూ, హాలీ మధ్య సంభాషణ సారం ఇది కదా! ఇద్దరి మధ్య సంభాషణ “ఇలా” ఉండాలని మీరంతా ఎలా చెప్పగలుగుతున్నారు?

    అవును, తెలుగు సాహిత్య జగత్తులో చిరస్థాయిగా నిలిచిపోయే పుస్తకమే ఇది. అంతమాత్రాన అందరిలోనూ ఒకేలా స్పందనను కలిగించాలని ఎందుకు వత్తిడి తెస్తున్నారు? అందరికీ నచ్చాలనీ లేదు కదా! కొన్ని సంవత్సరాల బట్టీ అందరూ, “ఓహో.. ఆహా” అన్నంత మాత్రాన ఎవ్వరైనా సరే, “ఓహో.. ఆహా” అని మాత్రమే అనాలని ఎలా అంటారు?

    మహేష్ గారూ.. మీరు సూచించిన వ్యాసం చదివే నేనీ పుస్తకం కొన్నాను. ఎంతో ఆశించాను. ఒక పాతిక పేజీలు చదివేసరికి.. ఇహ కొనసాగించటం దండగ అనిపించింది. మళ్ళీ పుస్తకం జోలికి పోలేదు! “మీకు చదవటం చేతకాలేదు” అని అనబోతున్నారా? 🙂

    “వెధవ సినిమాలతో పోలిక..” అని రాశారొకరు. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్లేగా! అవీ చాలా మందిని రంజింపచేశాయి కదా! మరిప్పుడు మీరు “వెధవ సినిమాలు” అంటే వాటిని ఇష్టపడే వారి మనోభావాలు మీరు గాయపరచటం లేదా? ఈ వ్యాసం ద్వారా మీరు గాయపడ్డట్టు?

    నేను పుస్తకాలు చదివి, రికమెండ్ చేశాక, నా స్నేహితుల్లో చాలా మంది ప్రయత్నించి నిరుత్సాహపడతారు. నచ్చలేదని ముక్కుసూటిగా చెప్పేస్తారు. వారు రికమెండ్ చేసిన పుస్తకాలతో కూడా నాకప్పుడప్పుడూ అలా జరుగుతుంటుంది. అంత మాత్రాన, ఒకరికి చదవటం రాదు, అని అనేస్తే ఎలా?

    ఇప్పుడు నాదో డౌటు. నాకు చలంవి ఏ రచనా నచ్చవు. చదవాలని అనిపించవు. మ్యూసింగ్స్ ఒక్క పుస్తకం ఒక నాలుగు సార్లు ప్రయత్నం చేసి వదిలేశాను. చలం నాకు నచ్చేది ఒకే విషయంలో – “అనుకున్నది అనుకున్నట్టు రాయడం”. ఇప్పుడు చలం అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి, నాకు నచ్చలేదు అని నేనెప్పు్డూ రాయకూడదా? అలా చేస్తే, తెలుగు సాహిత్యానికి నేనేదో ద్రోహం చేసినట్టా? లేక అలా రాస్తే నాకు ఇలా చివాట్లైనా తప్పవా?

    నాకు ఖచ్చితంగా ఏం అనిపించిన దాని కన్నా.. నా చుట్టూ మనుషులకి అనుకూలంగా పుస్తకాల గురించి మాట్లాడాలా?

    ఇక్కడ చర్చను చూశాక, బహుశా ఇంకెప్పుడూ తెలుగు పుస్తకాలను సరిగ్గా పరిచయం చేయలేనేమో అనే అనిపిస్తుంది.

  13. సుజాత

    రవి గారు,
    మీరు ఒకసారి ఈ పుస్తకం చదవండి. ఈ ధోరణి హాస్యమో, అపహాస్యమో అప్పుడు సరిగా అంచనా వేయగలుగుతారు.పైన కొత్తగా పెట్టిన గమనికలో ఇది రివ్యూ అనే ఉంది( ఈ రెవ్యూ చదవకండి అన్న చోట)! బొందలపాటి గారికిచ్చిన సమాధానంలో పరిచయం అని ఉంది.ఇంతకీ ఏది కరెక్టో!

    మొత్తానికి “పరిచయం” అని పేరు పెట్టుకుంటే ఏమైనా రాయొచ్చన్నమాట!

  14. ravi.env

    I second Halley. My reasons henceforth are –

    ౧. ఇది స్వయంగా పుస్తక “పరిచయం” అని తనే చెబుతున్నాడు. మూల భావన కూడా అదే. సమీక్షా, విమర్శా పరిధికి ఈ వ్యాసం రాదు. పరిచయానికి కావలసిన ingredients – ఈ పుస్తకం బొమ్మ, ఖరీదు, ఎక్కడ దొరుకుతుంది, క్లుప్తంగా కథ, సబ్జెక్టూ – ఇవీ అనుకుంటే అవన్నీ సరిగ్గా అమరినట్లే అని ఈ పుస్తకం చదవని నా లాంటి వాడి కళ్ళకు కనబడుతోంది.

    ౨. హాస్యధోరణి ఈ నవలాపరిచయానికి నప్పదు – నాకు తెలిసి ఈ పుస్తకం essentialism, లేదా existentialism ఆధారంగా తెలుగులో వచ్చిన ఓ రచన. existentialism అన్నది ఒక anti-philosophy అని కొందరు తత్వవేత్తల ఒకానొక క్రోడీకరణ. అలాంటప్పుడు హాస్య ధోరణిలో ఈ తరహా పుస్తకాన్ని పరిచయం చేయటమన్నది వ్యాసానికి ఒక asset అవుతుందే తప్ప, negative point ఎలా అవుతుంది?

    ౩. వ్యాస రచయిత intentions, మూలభావాలు వెతకడం అనవసరం. ఇది “పరిచయం” కాబట్టి.

    ౪. Comical way of presenting will defeat the purpose of novel, which is of a serious subject. – Seriousness and Comedy are they diametrically opposite entities? No, not necessarily. They are the sides of the same coin. We know how, absurd art evolved with the roots of existentialism. Absurd art is way of conveying serious message in a comical way/unintended way. పుస్తక పరిచయమంటే పుస్తకం చదవాలనే కోరిక పుట్టించే ప్రక్రియ అయితే, అందుకు (హాస్యస్ఫోరకతతో రాసిన) ఈ వ్యాసం ఎలా మోసం చేసిందనేది అంత స్పష్టంగా లేదు.

    పుస్తకం లో ఒకే నవల గురించి ఇద్దరు రాయకూడదన్న నిబంధన లేదు (అనుకుంటున్నాను) కాబట్టి, ఈ నవల గురించి సీరియస్ గా, క్షుణ్ణంగా ఎవరైనా చెప్పగలిగితే మరీ మంచిది.

  15. gr.maharshi

    chivariki migiledi artam chesukodaniki konta maturity avasaram

  16. gr.maharshi

    chivariki migiledi artham chesukodaniki konta maturity avasaram.mitrudi vimarsalo adi lopinchindi–gr.maharshi

  17. neelaanchala

    నవల మగవారికి మరియు మగరాయుళ్ళవంటి ఆడవారికి మాత్రమే నచ్చుతుంది యేమో !….

    దీని భావమేమి?

  18. jeevani

    మహేష్ గారు చెప్పినట్టు సహేతుకంగా ఎంతైనా విమర్శ చేయండి, వెకిలిగా ఎకసెక్కెంగా దిక్కుమాలిన సినిమాలతో పోల్చుతూ రాయడం ఇంతమందినీ నొప్పించింది.
    మీరు గొప్ప శైలిలో కొత్తగా సమీక్షించానని అనుకుంటున్నారు, ఇక్కడే రాఘవ గారి కామెంటు చూడండి చివరకు మిగిలేది మీద ఆయన ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకున్నారో ( మీ సమీక్ష చదివిన తర్వాత) అదీ మీరు చెయగలిగింది!!!

  19. jeevani

    హేలీ గారూ మీ బాధ అర్థం కావడం లేదు.

    ఒక కళ అది సాహిత్యం, చిత్ర కళ ఏదైనా కావచ్చు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళాక దానికి రూపకర్త బాధ్యత వహించాల్సిందే. నేను ఇలా రాస్తాను ఇష్టమైతే చదవండి అనడం భావ్యం కాదు. మీరు చేసింది సరిగాలేదు అది ఒప్పుకోక పోగా ఇలా సైటు మీదకు వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు వేయడం మరీ అన్యాయం. మరి ఈ బ్లాగు అగ్రిగేటర్లు కూడా స్పందించాల్సి ఉంది. మన ఇష్టం వచ్చినట్లు రాయాలనుకుంటే అలా రాసుకుని ఇంట్లో దాచుకోవాలి. నన్ను నేను ఎంతో కంట్రోల్ చేసుకుని రాస్తున్నాను. చివరకు మిగిలేది మీద ఇంత వెకిలిగా ఎవరీనా రాస్తారా మిత్రమా? మీరు రాసింది గుర్తుపెట్టుకోండి, మరి కొన్నేళ్ల తర్వాత మరోసారి చివరకు మిగిలేది చదవండి. మీరెంత సిల్లీగా రాశారో మీమీద మీకే అసహ్యం వేస్తుంది.

  20. కత్తి మహేష్ కుమార్

    @మందాకిని: సమస్య నవల గొప్పతనం,పవిత్రత లాంటి (అపోహలకు) ఈ వ్యాసం భంగం కలిగించిందని కాదు.I care a damn for all holy cows. అభ్యంతరం లేవనెత్తింది శైలి గురించి.

    ఈ వ్యంగ్యపూరితమైన శైలి నవల నచ్చదని చెప్పడానికి ఉపయోగించుంటే మరింత నిగారింపుని తీసుకొచ్చుండేది.కానీ వ్యాసం యొక్క మూల భావనలకూ శైలికీ పొంతన కుదరక అపహాస్యంపాలయ్యింది. పైగా ప్రయత్నపూర్వకంగా ఇది చేసినట్లు చెబుతున్న రచయిత వాదన అత్యంత పేలవంగా ఉండటమేకాకుండా సమర్థనకోసం నేలపాఠకుడు/ప్రేక్షకుడూ, ఎలీటిస్టులు అంటూ ఎకసెక్కాలు పోవడం చికాకుని తెప్పిస్తోంది. అందుకే ఈ వ్యాఖ్యలు.

    ప్రతిపాఠకుడికీ తన ప్రతిస్పందనని తెలియజెప్పేహక్కుంది. మనకూ అభ్యంతరం లేవనెత్తే హక్కుంది. అంతే!

  21. mandaakini

    ఎంతో మంది చేత పూజింపబడే మహాభారతం లాంటి గ్రంథానికి వారికి అర్థమైన స్థాయిలో వ్యాఖ్యానాలు రాసి అవార్డులుపొందే వారు, వాటిని సమర్థిస్తూ రాతలు రాసి మేం నాస్తికులం, విశ్వరూపం ఒక అభూత కల్పన, అసలు విషయం ఇలా ఉండొచ్చు, ఇదో కొత్త ఆలోచనావిధానం అంటారు.
    ఈ నవలకు సమీక్ష మాత్రం ఇలాగ ఉండాలని, ఉండకూడదని చెప్పటమెందుకు?
    ఇది మాత్రం కొత్త ఆలోచనావిధానం అని ఎందుకు ఒప్పుకోరు?

  22. సుజాత

    ఒక వ్యాసం మీద రెండో మూడో వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం కాగానే “నేనిలాగే రాస్తాను. మీకిష్టమైతే చదవండి, లేకపోతే పొండి! ఇటు రానక్కర్లేదు” అని బారికేడ్లు కడుతూ ఒక ఆకస్మిక మధ్యంతర “గమనిక” పెట్టడం ఏ రకంగా న్యాయం?

    నేల పాఠకులంటూ ఎవరూ ఉండరు! ఒకవేళ ఉన్నా వారికి అభిప్రాయం రాసే హక్కులే ఉంటాయి కానీ ఒక రచనను అపహాస్యం చేసే హక్కులు మాత్రం ఉండవు.

  23. కత్తి మహేష్ కుమార్

    ఇప్పుడు వ్యాసం ముందు బోల్డులో పెట్టిన “గమనిక” is more offensive than the పుస్తక పరిచయం itself.

    పాఠకుల్లో నేలపాఠకులూ బాల్కనీ పాఠకులూ ఉండరు. కేవలం పాఠకులుంటారు అంతే.కానీ, నేలబారు రాతలు మాత్రం ఉంటాయి.‘పాఠకవిమర్శకుడు’ తన పఠనానుభవాన్ని పంచుకోవడానికి సరదాశైలిని ఎంచుకోవడం అభినందననీయమేగానీ మీ శైలి పుస్తకాన్ని అపహాస్యంపాలుజేసే విధంగా ఉంది. అదే మీ అనుభవమైతే దానికి శైలిద్వారా సాధికారత దక్కేది. ఇక్కడ అది జరగలేదు. అందుకే నేలబారు రాతలుగా మారిపోయాయి. పైగా దానిని సమర్ధించుకుంటూ defense గా, అభ్యంతరపెట్టేవాళ్ళని elitist అని నాలుగు రాళ్ళు విసిరారు. అది మరో దిగజారుడుతనం.

  24. HalleY

    @KumarN:
    My age is 24 .. not that it helps really . However , on a lot of things i think like a kid and i like to keep it like that :).

    Thank god ! i didnt write on veyi padagalu .. i think i will be burnt alive by some of the folks here 😀 .

  25. సుజాత

    @Raghav,
    కాదు, కాదు! “ఇంతేనా” కాదు! ఈ నవల గురించి ఇక్కడేమీ చెప్పలేదు. మీరు గొప్పగా విన్నది నిజమే! నవల చదవండి! మళ్ళీ ఇక్కడికొచ్చి ఇంకో వ్యాఖ్య రాస్తారు!

    @halleY
    మీ చేత గోడకుర్చీ వేయించే(నొప్పించే) ఉద్దేశం నాకు లేదని నా అభిప్రాయంలోనే చెప్పాను.

    కాకపోతే కామెడీ కళ్ళల్తో చూడాల్సింది ఈ నవల్లో ఎంత వెదికినా ఏమీ ఉండదు!
    “నాకిలా అనిపించింది” అంటారా! మళ్ళీ మొదటికొస్తున్నాం!:-)) ఆపేద్దాం!

    సరే, మీకలాగే అర్థమైంది! కానీండి!

    @kumarN
    తెలుగు సాహిత్యంలో మైలు రాయి వంటి ఒక గొప్ప నవల గురించి రాయడానికి పూనుకున్నపుడు వాటికి కొన్ని మినహాయింపులు (చిన్న వయసూ, ప్లస్ టూ చదువుతుండటం వంటి)ఉండాలంటారా?

    నేను ఈ నవల్లో ఉన్న హ్యూమర్ గురించి ప్రస్తావించలేదు(స్వామీజీ, అతని శిష్యులు,గురించి ప్రస్తావించారు మీరు)! అది నాకూ నచ్చుతుంది. ఈ వ్యాసంలోని హ్యూమర్(?) గురించి…! మాట్లాడాను.

  26. KumarN

    సుజాత గారూ,
    మీరు పైన రాసిన ప్రతి మాట నిజమే కానీ, నాదో గమనిక మరియు అభ్యర్థన.

    మొన్నెప్పుడో హేలీ గార్రాసిన ఫాంటసీ సాహిత్యము, అది ఇప్పటి తరం మిస్ అయిపోతోందేమోనన్న ఆవేదన గురించి తను రాయడం, అది ట్రిగ్గర్ లాగా పని చేసి మాలతి గారు ఇంకో వ్యాసం రాయటం, మళ్ళీ దాని మీద ప్రశ్నలూ, జవాబులూ అన్నీ తెలిసినవే అనుకుంటాను.

    అయితే అప్పుడే నాకు బాగా నచ్చి ఎవరీ హేలీ అని డిగ్ చేస్తే సౌమ్య గారి తమ్ముడు, వయసు ఏ 19 కి లోపలే ఉంటుందేమోనని క్లూస్ దొరికినట్లుగా గుర్తు. I could be wrong.

    తను చిన్నబ్బాయి, ప్లస్ చివరకు మిగిలేది గురించి అందరూ రాయాల్సింది చాలా రాసేసారు కాబట్టి, తను కొంచెం లైటర్ వీన్ లో రాయడానికి ప్రయత్నించాడు అన్న సంగతి నాకు మొట్ట మొదటి లైన్ లోంచే అర్ధం అయ్యింది కాబట్టి నాకేమీ ఎబ్బెట్టుగా అనిపించలేదు.

    మీరన్నట్లు సీరియస్ ఆర్టికల్ అనుకుంటే, నేను మీలాగే కోపగించుకునే వాణ్ణి అనుకుంటా.

    Having said that, I wish Mr Halley had spent a bit more energy on philosophical bent of the book as well. If Halley wanted to dwell, there was ample sarcasm and subtle humor in discourse between swamijee and his disciples.

    Halley, just a few words of disclaimer on the top saying this is just an attempt to look at chivaraku migiledi from a lighter angle would have served the purpose better.

  27. కత్తి మహేష్ కుమార్

    Contemporary reading of the novel need not be in a way of ridiculing the novel.ఈ పరిచయంలోని సరదా వెనుక సహేతుకమైన ఉద్దేశం కనిపించలేదు.

  28. Raghav

    ఇంతేనా మరి ఈ పుస్తకం గురించి చాలా గొప్పగా విన్నానే??

  29. HalleY

    @sujata :

    “ఒక రచనను అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోనక్కర్లేదు గానీ తెలుగు సాహిత్యం లో అజరామరంగా నిలిచిపోయే నవలలు నాలుగుంటే అందులో ఒకటిగా పేర్కొనదగిన నవలను కేవలం కామెడీ కళ్ళతో చూసి పరిచయం చేయడం అంత సమజసంగా అనిపించడం లేదు!”

    నేను ఈ “Elitist perspective of looking at literature” కి వ్యతిరేకిని . ఇది గొప్ప నవల కళాఖంఢం అయ్యి ఉండచ్చును అంత మాత్రాన ఈ నవల చదివి నాకు అనిపించింది నేను చెపితే “ఏయ్ ఎంత ధైర్యం ఆ మాట అనటానికి .. పో గోడ కుర్చీ వెయ్యి ” అనట్టుగా మాట్లాడటం కూడా సమంజసం కాదు :)..

    “నిజానికి దయానిధికి ఎవరితోనూ చెప్పుకోదగ్గ చనువుండదు” …
    దీని గురించి నేను ఇంక ఏమీ మాట్లాడలేను! 🙂 . “No comments” 🙂 .

  30. HalleY

    @bondalapati :
    నేను చదివిన పుస్తకంలో అలానే ఉంది మరి !
    @ramana :
    నేను ఈ పుస్తక పరిచయం రాసినప్పుడే ఈ వెబ్సైటు తాలూకా ఎడిటరులకి చెప్పుకున్నాను .. నేను ఏదో చుట్ట కాల్చుతూ మొదటి వరుసలో కూర్చొని సినిమా చూసే ప్రేక్షకుడిలా రాస్తాను అంతే అని 🙂 అపుడు వారన్నారు “మాకు ఇలాంటి రెవ్యూస్ కూడా కావాలి . Afterall reading is for fun. ఆని” .
    సినిమాలతో పొలిక లేకుండా పూట గడవదు మరి .. ఏం చేసేది ! . Just another perspective of looking at things . ఆంతే 🙂 .

  31. రమణ

    పుస్తకం లో ప్రచురించేవి సమీక్షలు అనుకుంటే ఇది నాసిరకం సమీక్ష అంటాను. కేవలం అభిప్రాయాలను తెలియజెప్పటం అయితే, ఈ వ్యాసాన్ని గౌరవిస్తాను.

  32. సుజాత

    మీరు ఏమీ అనుకోనంటే ఒక విషయం! ఇది చాలా సీరియస్ నవల. జగన్నాధం కామెడీ మినహాయిస్తే! దయానిధి జీవితాన్ని అన్వేషించే క్రమంలో అనేక వేదనలకు లోనవుతాడు.అనుకోకుండా, అతని ప్రమేయం లేకుండా వచ్చి పడే అపవాదులతో ఉక్కిరిబిక్కిరవుతాడు.

    మనిషిగా ప్రవర్తిస్తాడు.ప్రేమంటే ఏమిటో చివరి వరకూ తెలుకోలేకపోతాడు.చివరికి ప్రేమే జీవితంలో చివరికి మిగిలేదని తెలుసుకుంటాడు.

    ఈ నవల గురించి చాలా సీరియస్ చర్చ ఒకటి ఇక్కడ చూడండి.

    http://parnashaala.blogspot.com/2009/07/blog-post_30.html
    అలాగే నిడదవోలు మాలతి గారు రాసిన విమర్శ కి కూడా ఈ టపాలోనే లింక్ ఉంది.

    ఒక రచనను అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోనక్కర్లేదు గానీ తెలుగు సాహిత్యం లో అజరామరంగా నిలిచిపోయే నవలలు నాలుగుంటే అందులో ఒకటిగా పేర్కొనదగిన నవలను కేవలం కామెడీ కళ్ళతో చూసి పరిచయం చేయడం అంత సమజసంగా అనిపించడం లేదు!

    అమృతం ప్రేమను సినిమా పాటతో ముడిపెట్టడం,అన్నీ కలిపి మహరాజా మిక్సీలో వెయ్యాలనడం,మరీ నీచంగా ఈ నవలను రాజమౌళి సినిమాతో పోల్చడం..మధ్యలో తె రా స ని తీసుకురావడం…ఇవన్నీ ఈ నవల స్థాయికి మీరు చెయ్యదగ్గ పనులు కావు.ఒకసారి ఇది పుస్తకం డాట్ నెట్టా కాదా అని పైకి చూడాల్సి వచ్చింది.

    దయానిధికి ఇంతమందితో చనువుంటే సంఘం వూరుకుంటుందా….!
    నిజానికి దయానిధికి ఎవరితోనూ చెప్పుకోదగ్గ చనువుండదు.అతనో ఇంట్రావర్టు! అయినా చనువుందని మీరూ అంటున్నారు.(నవల చదవని వారికి ఇక్కడ అదే అర్థమవుతోంది)
    మొత్తానికి మీకు తెలుగు సినిమాలంటే ఇష్టమనుకుంటాను! :-))

    ఈ పుస్తకం మీద రావలసిన వ్యాసం కాదిది! ఈ నవల లొని పాత్రల మీద ఎవరైనా రీసెర్చ్ చేశారో లేదో తెలీదు కానీ అందుకు అన్ని అర్హతలూ ఉన్న నవల ఇది.

    ఈ అభిప్రాయం ఈ నవల మీద నా అభిప్రాయమే కానీ మిమ్మల్ని నొప్పించాలని కాదు!

  33. bondalapati

    చాలా సరదాగానూ విమర్శనాత్మకం గానూ రాశారు. నేను ఈ నవల నా కాలేజీ రోజుల్లో (తొంభై ల లో) చదివాను. నవల చివరి లో దయానిధి ఓ గడ్డి పరక ని పీకి దాని విలువ ఏమిటి అనుకుంటున్నట్లు గుర్తు. జీవితం లోని ద్వంద్వాలని అధిగమించటం కూడా చేయాలి అన్నట్లు చెప్పినట్లు గుర్తు.

  34. రమణ

    మంచి పుస్తకం పరిచయం చేశారు. సంతోషం. కొన్నిచోట్ల సినిమాలలో పోల్చుతూ చేసిన వ్యాఖ్యానం ఎబ్బెట్టుగా ఉంది. తరువాతి పరిచయాలలోనైనా దృష్టి పెడతారనుకుంటాను.

Leave a Reply