The Czar’s Madman

Jaan Kross అన్న ఇస్టోనియన్ రచయిత Professor Marten’s Departure అన్న నవల చదివాక ఆయన రచనలు వేరేవి ఏమైనా చదవాలి అనుకుంటూ ఉండగా, ఈ నవల కనబడ్డది. అమెరికా నుండి ఇండియా మీదుగా జర్మనీలో నన్ను చేరింది ఏడాది ప్రారంభంలో. ఇన్నాళ్టికి చదవడం కుదిరింది.

ఇది కూడా ఇందాక ప్రస్తావించిన నవల లాగానే చారిత్రక సత్యాలు, కాల్పనిక అంశాలు ఒకదానితో ఒకటి అల్లుకుపోయి సాగే చారిత్రక నవల. కథలో ప్రధాన భాగం 1800లలో నడుస్తుంది. ప్రధాన పాత్ర: Timotheus von Bock అన్న రాజ వంశీయుడు. గొప్ప పేరు ఉన్న కుటుంబం, అతను కూడా ఒకప్పుడు బాగా పేరు ఉన్న వ్యక్తి. అయితే, మధ్యలో ఏ కారణం వల్లనో జార్ చక్రవర్తి ఆజ్ఞ మేరకు అతనిని పిచ్చివాడు అని తేల్చి, తొమ్మిదేళ్ళు కారాగారంలో ఉంచుతారు. కారాగారవాసంలో కలిగిన అనుభవాల వల్ల అతనికి పిచ్చి పట్టిందని చెబుతూ, ఒకసందర్భంలో అతన్ని విడుదల చేస్తారు (హౌస్ అరెస్టులో ఉంచుతారు ఆ తరువాత లాస్టు దాకా). అతని భార్యకి సోదరుడైన Jakob Mättik అతను తిరిగి వచ్చినప్పటి నుండి రాసిన డైరీ ఎంట్రీలతో నడుస్తుంది కథనం. కథలో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయని నా అభిప్రాయం:

అ) అసలు టిమోతియస్ నిజంగా పిచ్చివాడా? అన్న ప్రశ్నని అనేకమార్లు అనేక పాత్రలు, ముఖ్యంగా జాకబ్ వేసుకుని రకరకాలుగా అనలైజ్ చేస్తూ ఉంటారు. కథ మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే తిరిగిందని నేను అనుకుంటున్నాను.

ఆ) కథలోని పాత్రలు-పరిణామాల పట్ల జాకబ్ అభిప్రాయాలు – ఇవి ప్రతిసారి ఆసక్తికరంగా ఉంటాయని కాదు. కథ చెప్తున్నది అతనూ! అతని అభిప్రాయాలు వినకుండా ఉండలేం కదా!

ఇ) జాకబ్ వ్యక్తిగత జీవితం, ప్రేమలూ, పెళ్ళీ, పిల్లలూ వగైరా

ఇకపోతే, నాకు ఆసక్తికరంగా అనిపించిన అంశాలు:

ఆ కాలంలో ఇప్పుడు ఇస్టోనియా అన్న దేశంగా పిలవబడుతున్న ప్రాంతంలో రాజకుటుంబాలు – మామూలు వాళ్ళ జీవన శైలులు. వాళ్ళ మధ్య పెళ్ళి జరిగితే దాని పరిణామాలు, “చదువు” అంటే ఇస్టోనియన్ కాక – జర్మన్, రష్యన్ వంటి భాషలు నేర్చుకోవడం – ఇలాంటివి అన్నీ మొదటి భాగంలో చాలా ఆసక్తి కలిగించే రీతిలో వర్ణించారు. నేను చదివిన ఈయన మరో నవలలో పాత్రలు అలవోకగా -ఇస్టోనియన్, జర్మన్, రష్యన్, ఫ్రెంచి భాషల మధ్య తిరుగాడుతూ సంభాషించుకుంటూ ఉంటాయి. ఇందులో కూడా ఆ ట్రెండు కొంచెం కనిపిస్తుంది. కమలహాసన్ సినిమాలు గుర్తువచ్చాయి నాకు ఈ సంభాషణలు చదువుతున్నప్పుడు.

జార్ పాలనలోని రష్యా సామ్రాజ్యంలో జీవన విధానం గురించి నేనెప్పుడూ చదవలేదు కనుక, నాకు ఆ భాగం అంతా కొత్తగా కనబడి బాగా చదివించింది. టీమో అసలు ఏం చేస్తే కారాగారవాసం ప్రాప్తించింది? అన్నది తెలిశాక, ఆ తరువాత చక్రవర్తి కానీ, అతని తాలూకా మనుషులు కానీ ప్రవర్తించిన విధానం, తిరిగి వచ్చేశాక టిమో, అతని కుటుంబం జీవన విధానం – ఇవన్నీ కళ్ళకి కట్టినట్లు రాశారు. వీటికి తోడు అక్కడక్కడా కొన్ని వాక్యాలు గొప్పగా అనిపించాయి. అనువాదమే అయినా, అంతగా తెలియలేదు.

అంతగా నచ్చని అంశం ఏదన్నా ఉండంటే పుస్తకం సైజు. జాకబ్ తాలూకా వ్యక్తిగత జీవితం గురించి అంత వివరాలు, అతగాడు టిమో గురించి రకరకాలుగా చేసే అనాలిసిస్ లు – ఒక్కో చోట బోరు కొట్టించాయి నాకు. బహుశా రచయిత ఉద్దేశ్యం అదేనేమో అలా “సహజంగా” ఉండాలని (ఎంతైనా ఇది జాకబ్ డైరీ కదా!) ఇక, Professor Marten’s Departure ముందు చదివాను కనుక దానితో పోల్చుకోడం అనివార్యం అయింది నాకు. ఆ నవలలో కూడా ఇలా చాలా చోట్ల బోలెడంత కథాగమనానికి సంబంధం లేని సమాచారం అదీ ఉంటుంది కానీ – Professor Marten జీవితం, జాకబ్ జీవితం వేరు. మార్టెన్ కి ప్రపంచానుభవాలు ఎక్కువ కనుక, ఆయన గారి విశ్లేషణలూ అవీ కొంచెం information rich గా అనిపించాయి నాకు. అయితే, ఇదే కారణం వల్ల కాబోలు – అక్కడ ఆయన విశ్లేషణలు కొన్ని చోట్ల నాకు చరిత్ర తెలియక క్లిష్టంగా అనిపించాయి. జాకబ్ వ్యాఖ్యానం తేలికగా ఉంది – ఆట్టే క్లిష్టమైన అనాలసిస్ లేదు కనుక. పాత్ర నేఫథ్యానికి తగినట్లు రచయిత ఇలా మార్చడం బానే ఉంది కానీ, అలాగని బోరు కొట్టించేంత చర్చ అవసరమా? అనుకున్నాను.

మొత్తానికి అయితే, నవల అద్భుతం అనలేను కానీ, ఆకాలంలో ఇస్టోనియా-రష్యా-ఆ ప్రాంతాలలో రాజకీయాలు, జీవన విధానలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉంటే తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఇంకా Jaan Kross నవలలు ఏవైనా చదవాలనే అనుకుంటున్నాను,దొరికితే!

You Might Also Like

One Comment

  1. The Czar’s Madman | Bagunnaraa Blogs

    […] సౌమ్య Jaan Kross అన్న ఇస్టోనియన్ రచయిత Professor Marten’s […]

Leave a Reply to The Czar’s Madman | Bagunnaraa Blogs Cancel