ప్రతీచి లేఖలు

1995లో నేను చికాగో తానా సమావేశాల జ్ఙాపికకు సంపాదకత్వం వహిస్తున్నప్పుడు శొంఠి శారదాపూర్ణ గారు వ్రాసిన జీవ స్పర్శ కథ చదివాను. జీవన సంధ్య వైపు చూస్తూ వైరాగ్య స్థితిలో ఉన్న వైయాసి అనే ఎనభై యేళ్ళ పండితుడు, తత్వశోధకుడు తనకు ప్రతీచి అనే అమ్మాయి వ్రాసిన లేఖలను, వాటినుండి వినబడ్డ సూటి ప్రశ్నలను గుర్తు తెచ్చుకొని చైతన్య జీవితంలోకి తిరిగివెళ్ళాలని, ప్రతీచిలో తన ప్రతిభను ప్రతిఫలింపచేయాలని నిశ్చయించుకోవటం ఆ కథ వస్తువు. భాషలోనూ, భావంలోనూ కొద్దిగా విలక్షణంగా ఉన్న కథ. పూర్వాపరాలు స్పష్టంగా నిర్వచించని ఆ కథని అర్థం చేసుకోవటమూ, బేరీజు వేయటమూ నాకు అప్పుడు కష్టమయింది.

పదహారున్నర ఏళ్ళ తర్వాత ఈ మధ్యే ఆ ప్రహేళికకు సమాధానం దొరికింది. గత వారం “ప్రతీచి లేఖలు” పుస్తకం చదువుతున్నప్పుడు మొదటి ప్రకరణంగా జీస్పర్శ కథ మళ్ళీ కనిపించింది. ప్రతీచి వైయాసి ద్వారా తన సందేహాలకు సమాధానం వెతుక్కొంటున్నది. తాను చదివిన, విన్న, అనుభవించిన విషయాలను ఆయనతో తర్కిస్తున్నది. తన ఉత్తరాలతో ఆయనలోని తాత్విక ఆలోచనలను ఉత్తేజితం చేస్తున్నది. ఆమె సందేహాలను తీర్చి, ఆమె తార్కిక శక్తికి పదును పెట్టి, ఆమె ప్రజ్ఞను ఉద్దీపింపచేయటం తన కర్తవ్యంగా భావిస్తున్నాడు వైయాసి.

ప్రతీచి అంటే పడమర. వైయాసి అంటే వ్యాస సంబంధీకుడు. వ్యాసుడంటే ధర్మాలను, నియమాలను క్రోడీకరించే వాడు. ప్రతీచి పడమర గాలి ఐతే వైయాసి తూరుపు గాలి. ఈ తూర్పు పడమరలు భౌగోళికం కాదు; భిన్న దృక్పథాలు. ఒకటి ఆధ్యాత్మిక వాదం; ఇంకొకటి భౌతికవాదం. భౌతికవాదం రేపెట్టే ప్రశ్నలకు, విసిరే సవాళ్ళకు సమాధానాలు ఆధ్యాత్మిక వాదంలో ఉన్నాయా? ప్రశ్నించేది ప్రతీచి; పరామర్శించేది వైయాసి. పేరుకి ప్రతీచి శిష్యురాలు, వైయాసి గురువు గానూ కనిపించినా వారు స్నేహితులుగానూ, సహాధ్యాయులుగానూ అనిపిస్తారు. వివిధ విషయాలను వారు వేరువేరు దృక్కోణాలనుంచి పరిశీలిస్తూ, వేద వాఙ్గ్మయంలో ఉన్న సత్యాలను ఈ భౌతిక విషయాలతో అన్వయం చేయడానికి, అర్థం చేసుకోవటానికీ, అర్థం చెప్పటానికీ సమిష్టిగా కృషి చేస్తున్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఈ పుస్తకంలో  ప్రతీచి ఉత్తరాలు పడమటిఖండంనుంచి వ్రాయటం చేత మాత్రమే ప్రతీచి కాని ఈమె దృక్పథంలో భౌతికవాదానికన్నా వైదికవాదానికే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.

ప్రతీచి, వైయాసిల మధ్య ఉత్తరాల ద్వారా జరిగిన సంభాషణ ఈ ప్రతీచి లేఖలు. మొదటి అధ్యాయం జీవ స్పర్శ మాత్రమే కథారూపంలో ఉంటుంది. ఆ తర్వాతనుంచి ఒకరికొకరు వ్రాసుకొన్న లేఖలే. లేఖలుగానే కనిపించినా నిజానికి ఇవి వివిధ తాత్విక విషయాలపై వ్యాసాలు. లేఖల ద్వారా పాఠకులకు విషయబోధన చేసే ప్రక్రియ మనకు కొత్తదేం కాదు. ఆ ఒరవడిలో ఇది ఇంకో పుస్తకం. సామాన్య, విశేషాలను సమన్వయం చేయడానికి రచయిత్రి చేస్తున్న ప్రయత్నాలు ఈ లేఖలు/ వ్యాసాలు. ఈ లేఖలు ఒక క్రమంలో ఉన్నట్టు అనిపించదు. వైయాసి వ్రాసిన ఒక లేఖలో (ఆఖరు అధ్యాయం: వెలుగులోకి లో) సగం పైగా ప్రతీచి వ్రాసిన ఉత్తరమే కావటం చిత్రంగా ఉంటుంది.

వివిధ తాత్విక విషయాల మీద సాంద్రమైన చర్చ ఈ లేఖలనిండా ఉంది. కాలం, ఆకాశం, అగ్ని, సంప్రదాయం, బౌద్ధం, అద్వైతం, చరిత్ర వంటి అనేక విషయాలు చర్చకు వస్తాయి. ఈ వ్యాసాల్లో చర్చించిన విషయాలు నాకు చాలావరకు కొత్త. నేను మామూలుగా ఆలోచించే, తర్కించే విధానానికి ఈ లేఖలు, చర్చలు భిన్నం. ఈ వ్యాసాల్లో ఉన్న విషయాలు, వాదాలు నాకు కొంత మేరకైనా అర్థమయ్యాయని నేను చెప్పను. ఐనా, ఈ పుస్తకం చెప్పేదేమిటని అని ఆలోచిస్తే, ఈ వ్యాసాలన్నిటిని కలిపే కొన్ని సూత్రాలు ఉన్నాయి అనిపించింది. వేదాంత దృక్పథం ప్రపంచాన్ని అర్థం చేసుకొనే మూలసూత్రమని రచయిత్రి నమ్మకం. బ్రహ్మ శక్తి ప్రధమంగా వేద తత్వ సారంగా వ్యక్తమయ్యింది. ‘బ్రహ్మ’ని అర్థం చేసుకోవాలంటే వేదాలను గురు పర్యవేక్షణలో శ్రద్ధగా పరిశీలిస్తూ చదవాలి. నైఘాంటికార్థాల ద్వారా వేదాలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం కూడని పని. మామూలు భాషని అర్థం చేసుకొన్నట్టుగా వేదాలను అర్థం చేసుకోవడం సాధ్యపడదు. సంస్కృత భాషా వ్యాకరణం ధాతు సంబంధి. వేద వ్యాకరణం అక్షర సంబంధి. వేదాలని అర్థం చేసుకోవాలంటే, ప్రతి అక్షరాన్ని అర్థం చేసుకోవాలి.

ఉదాహరణకు అగ్ని అనే ప్రకరణం చూద్దాం. ఆగ్నికి అనేక నామాలు: అగ్ని, గృహపతి, భిషక్కు, పావకుడు, వైశ్వానరం, విగ్రహం, ఉర్ధ్వముఖం, దేవతాగ్రణి,అగ్రగామి. ఒక వర్గీకరణలో రెండు రకాల అగ్నులు: దర్శమాసాగ్ని, పూర్ణమాసాగ్ని. పతిపత్న్యాగ్ని అని కూడా జంట అగ్నులు ఉన్నాయి. మరో వర్గీకరణలో అగ్నులు మూడు రకాలు: గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని, దక్షిణాగ్ని. ఇతర వర్గీకరణల ప్రకారం చూస్తే మరిన్ని రకాల అగ్నులు: హోతృ అగ్ని, అధ్వర్యు అగ్ని, ఉద్గీతృ అగ్ని, బ్రహ్మాగ్ని, సభాగ్ని, అవసధ్యాగ్ని, ప్రాజహితాగ్ని. ఇవికాక అంతర్గేహంలో పదహారు అగ్నులు ప్రజ్వలిస్తూంటాయి. ఇన్ని పేర్లు, ఇన్ని వర్గీకరణలు ఎందుకో అర్థం కావాలంటే ఈ పదాల్లో ఉన్న అక్షరాలని పరిశీలించాలంటాడు వైయాసి. ఆ పరిశీలన తానే చేస్తూ మనకి ఎన్నో విషయాలు విడమరచి చెప్పటానికి ప్రయత్నం చేస్తాడు. మనం ఒకో అవసరానికి నిప్పును ఒకో రకంగా ఉపయోగిస్తాము. ఐతే అగ్ని బాహ్యమైనదే కాదు. మన శరీరంలోనూ, మనసులోనూ అగ్ని ఉంటుంది. ఈ అగ్నుల రూపాలు, ప్రయోజనాలూ వేరు. మనం సృష్టించే అగ్ని మనలోపలి ప్రపంచాన్ని వెలిగించలేదు. మనలోని అగ్ని మాత్రమే మనల్ని వెలిగించగలదు.

శారదాపూర్ణ గారి శైలి, భాష సాధారణ పాఠకులకు కొద్దిగా క్లిష్టంగా ఉంటాయి. ఈ పుస్తకంలో ఆవిడ వాడిన మాటలు కొన్ని నాకు కొత్త. కొన్ని మాటలు వాడిన విధానం కొత్త. విషయం జటిలమూ, భాష విలక్షణమూ కావటంచేత ఇది హడావుడిగా చదువుకొని తేలిగ్గా అర్థం చేసుకొనే పుస్తకం కాదు. నెమ్మదిగా చదువుతూ, తరచు ఆగుతూ, చదివిన విషయాన్నిఅర్థం చేసుకొంటూ, తర్కించుకొంటూ ముందుకు సాగవలసిన పుస్తకం. ఈ పుస్తకం చదివి పూర్తిగా అర్థం చేసుకోవడానికి అనందించడానికి ప్రత్యేకమైన ఆసక్తి, అభిరుచి, అభినివేశమూ అవసరం. ఇంతటి సాంద్రచర్చలోనూ, అప్పుడప్పుడూ భావుకత తళుక్కుమని మెరుస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

రచయిత్రి శొంఠి శారదాపూర్ణ గారు బహుముఖ ప్రజ్ఙాశాలి. తెలుగు, సంస్కృతాలలో పి.హెచ్.డి. పట్టాలు అందుకున్నారు. ప్రస్తుతం ఒడియాలో డి.లిట్. పట్టాకోసం కృషి చేస్తున్నారు. మాంటిసోరి ఉపాధ్యాయినిగా చాలా కాలం పని చేశారు. కొన్నాళ్ళు హైదరాబాదులో వేగేశ్న ఫౌండేషన్ వారి వికలాంగుల సేవా సంస్థలో స్వచ్ఛంద కార్యకర్తగా కూడా పని చేశారు. లలిత సంగీతంలో, చిత్రలేఖనంలో ప్రవేశం ఉంది. శ్రీ విశ్వనాథ అచ్యుతరాయలు గారితో వేదాధ్యయనం చేశారు. బ్రాహ్మి అనే త్రైమాసిక, త్రిభాషా పత్రికను నిర్వహిస్తుంటారు. స్వయంగానూ, ఇతరులతో కలసీ తెలుగులో చాలా పుస్తకాలు రచించి ప్రచురించారు. ప్రతీచి లేఖలుతో పాటే శరద్ద్యుతి (Sheen of Spring) పేరుతో ఇంగ్లీషు, తెలుగు కవితల సంకలనాన్ని కూడా వెలువరించారు. శారదాపూర్ణ గారు, వారి భర్త – నేత్రవైద్యులు శ్రీరాం గారు చికాగో పరిసరాల్లో నివసిస్తుంటారు. తాము స్థాపించిన ఉత్తర అమెరికా అన్నమాచార్య పథకం (Sri Annamacharya Project of North America – SAPNA) పేర ఈ దంపతులు నిర్వహించే సంగీత, నాట్య, సాహిత్య, సాంస్కృతిక కార్యకలాపాలకు చికాగోలోనూ, ఉత్తర అమెరికా తెలుగు సమాజంలోనూ చాలా గుర్తింపు ఉంది.

ఈ పుస్తకాన్ని ఆకర్షణీయంగా ప్రచురించారు. శారదగారు స్వయంగా వేసిన చిత్రాలు పుస్తకానికి మరింత అందాన్ని కూర్చాయి. అచ్చుతప్పులను సరిచేయటంలో ఇంకొంత శ్రద్ధ తీసుకొని ఉండవలసింది.

(Disclosure: I have been acquainted with the Sontis for several years and collaborated with them on some projects. I was an invited ‘Guest of Honor’, and spoke about this book, at a function organized on November 20, 2011 to felicitate Dr. Saradaapurna and release the books, Prateeci Lekhalu and Saraddyuti)

*******************

ప్రతీచి లేఖలు
డా. శారదాపూర్ణ శొంఠి
2011
SONTY Publications
3042 Carmel Dr
Flossmoor, IL
Phone: 708 957 4302
180 పేజీలు; 100 రూ./8 డా.

You Might Also Like

2 Comments

  1. నచకి

    ఇటీవల జఱిగిన ఒక సాహిత్యసభలో శారదాపూర్ణ గారు ఒకానొక లేఖ చదువుతోండగా మధ్యలో వచ్చాను సభలోకి. విన్నంత మేఱలో అర్థమయినది యేమీ లేదేమో కానీ యెందుకో ఉత్సుకత కలిగింది ప్రతీచి, వైయాసి అన్న పేర్లు చదివి. ఆవిడని తఱువాతయినా దాని గుఱించి అడుగుదామనుకున్నాను కానీ బుఱ్ఱలోంచి ఆ ప్రశ్న మాయమయింది. మొత్తానికి అవి యీ పుస్తకంలోనివి అన్నమాట! ఈ పుస్తకాన్ని భారతదేశానికి వెళ్ళగానే కొనుక్కుని చదవాలి అయితే. (భారతదేశానికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ప్రస్తుతం బరువు తగ్గించుకునే పనిలో ఉన్నాను.) శారదాపూర్ణ గారి మేథస్సుకి, ఓపికకి నమోన్నమః! మంచి పుస్తకాన్ని చక్కగా పరిచయం చేసినందుకు జంపాల చౌదరి గారికి నెనర్లు.

  2. కొత్త పాళీ

    చాలా బావుందండి.
    పల్లెల్లో రైతు కష్టాలు, లేదా సెజ్జులూ గ్లోబలైజేషనూ ఇవే సాహిత్య వస్తువులనే భ్రమలో కొట్టుకు పోతున్న ప్రస్తుత తెలుగు సాహిత్య రంగంలో ఇటువంటి తాత్త్విక చింతనని స్పృశించే ఇటువంటి పుస్తకాల అవసరం ఎంతైనా ఉంది. విశ్వనాథ వారినవలల్లో ఇటువంటి ధార్మిక చర్చలు అలవోకగా జరిగిపోతుంటాయి.

Leave a Reply