The Spirit of LAGAAN – లగాన్ స్ఫూర్తి

ఈ పుస్తకాన్ని అసలు జూన్ 15న పరిచయం చేద్దాం అనుకొన్నాను. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన లగాన్ చిత్రం విడుదలై ఆ రోజుకి సరిగ్గా పదేళ్ళు.  అప్పటివరకూ ఒక మూసలో వస్తున్న వ్యాపార చిత్రాల ఫార్ములాలని తిరగరాయడమే కాక, చిత్ర నిర్మాణ పద్ధతులలో కొత్త ఒరవడికి దారి తీసిన చిత్రం లగాన్. వ్యాపారాత్మకంగా భారీ విజయం సాధించిన ఈ చిత్రం చలనచిత్ర కళపై ఆసక్తి ఉన్నవారి మనసులని కూడా దోచుకోంది.

ఈ చిత్రాన్ని నేను మొదట 2001 జులై 4న న్యూజెర్సీలో ఒక చెత్త థియేటర్లో చూశాను. అంతకుముందే ముగిసిన ఫిలడెల్ఫియా తానా సమావేశాలలో అలిసిపోయామని (నేను ఉంటున్న స్నేహితుని) ఇంట్లో అందరూ గోలపెడుతున్నా, బలవంతం చేసి అందర్నీ (సమావేశాలకు అతిథిగా వచ్చిన మిత్రుడు పాపినేని శివశంకర్‌తో సహా) లాక్కెళ్ళాను. సినిమా చూస్తున్నంతసేపూ, దర్శక నిర్మాతల సాహసానికి అబ్బురపడిపోతూనే ఉన్నాను. అనేక కారణాలవల్ల ఈ చిత్రం నాకు చాలా నచ్చింది. డివిడి వచ్చాక, ఈ సినిమాని మా ఇంటి థియేటర్లో చాలాసార్లు ప్రదర్శించాం. చాలామంది మిత్రులకు చూపించాను; చాలాసార్లు చూశాను. ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆఖరిదశకు ఈ చిత్రం ఎన్నుకోబడ్డప్పుడు చాలా సంతోషించాను. అప్పట్లో నేను రాసిన ఒక వ్యాసం ఇంటర్నెట్‌లోనూ, అమెరికాలో భారతపత్రికలలోనూ పలుచోట్ల ప్రచురింపబడింది. గత సంవత్సరం (2010) జులై 4 వారాంతంలో మళ్ళీ తీరిగ్గా సినిమా చూసి, ఆనందించి, ఇంటర్నెట్‌లో లగాన్ వివరాలు చదువుతుండగా సత్యజిత్ భత్కల్ రాసిన The Spirit of Lagaan పుస్తకం కనిపించింది. అమెజాన్‌లో దొరుకుతుందని తెలిసి నాకు నేనే పుట్టినరోజు కానుకగా ఈ పుస్తకం కొనేసుకున్నాను. ఈ సినిమా తీయడం గురించిన కథ కూడా రకరకాల ట్విస్టులతో సినిమా అంత ఉత్కంఠభరితంగా ఉంది.

దర్శకుడు అశుతోష్ గొవారికర్ పరాజయాల్లోంచి లగాన్ పుట్టింది. ఆమిర్‌ఖాన్ నాయకుడిగా గొవారికర్ తీసిన రెండు మసాలా చిత్రాలు దారుణంగా దెబ్బ తిన్నాక, తాను అప్పటి వరకునమ్మకం లేకుండానే నడచిన ఫార్ములా బాట వదిలేసి తనకు నచ్చిన విధంగా చిత్రాల్ని తీద్దామనుకున్న ప్రయత్నంలో అతను రాసుకున్న కథ లగాన్  (శిస్తు). ఆ కథను ఎంతో ఉత్సాహంతో, నమ్మకంతో గొవారికర్ ఒక అర్థరాత్రి, ముంబాయి మెరీనా అపార్ట్‌మెంట్స్ పార్కింగ్‌లాట్‌లో, షూటింగ్‌నుంచి అలసిపోయివచ్చి కారును ఆనుకుని నిలబడ్డ తన స్నేహితుడు ఆమిర్‌ఖాన్‌కు సూత్రప్రాయంగా చెప్పాడు. కథ విన్న ఆమిర్‌ఖాన్ ఎగిరి గంతేయలేదు. “ఏమిటీ? బ్రిటిష్ వాళ్ళ కాలంలోనా? పల్లెటూరి వాళ్ళు పన్నులు ఎత్తెయ్యడంకోసం క్రికెట్ ఆడతారా? నాకే విడ్డూరంగా ఉంది. ఇంకా ప్రేక్షకులకేం పడుతుంది? ఐనా, నీకేమన్నా పిచ్చా, వెర్రా? ఇప్పటికి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి; మూడో సినిమా కూడా పోయిందంటే నీ ముఖమెవ్వడూ చూడడు. సేఫ్‌సబ్జెక్టుతో సినిమా తీసుకోక ఇట్లాంటి వింత కథతో సినిమా తీస్తానంటావ్” అంటూ మిత్రుణ్ణి మందలించాడు.

ముందు నిరుత్సాహపడ్డా, గొవారికర్ మొండిగా ముందుకుపోవడానికే నిశ్చయించుకొన్నాడు. ఆమిర్‌ఖాన్ వంటి పెద్ద హీరో ఉండాలనే ఆలోచనను చెరిపేసుకొని,  కథపైనే మనసు లగ్నం చేసి,  కొన్ని వారాలపాటు ముంబాయికి దూరంగా Kollote అనే పల్లెటూర్లో, కుమార్ దావె, సంజయ్ దేమాలతో కలసి కూర్చుని తన కథని పూర్తి స్క్రిప్ట్‌గా మలచుకున్నాడు.

ఐదు నెలల తర్వాత గొవారికర్ ఆమిర్‌ఖాన్‌ని మళ్ళీ అడిగాడు తన కథని ఇంకోసారి – పూర్తి స్క్రిప్ట్‌గా- వినమని. ఇష్టం లేకపోయినా, స్నేహితుడు మరీమరీ అడిగాడనీ, అతని ఐదు నెలల జీవితాన్నిదీని మీద ఖర్చు పెట్టాడన్న జాలివల్లా స్క్రిప్ట్ వినడానికి ఆమిర్‌ఖాన్ ఒప్పుకున్నాడు. తన మనోనేత్రం ముందు కనిపిస్తున్న చిత్రాన్ని, గొవారికర్ ఆమిర్‌ఖాన్‌కు ఆ రోజు పూర్తి స్థాయిలో ఎంతో ఉద్వేగంతో చూపించగలిగాడు. గొవారికర్ కథ, చెప్పిన విధానం ఈసారి ఆమిర్‌ఖాన్‌కి దిమ్మతిరిగిపోయేలా చేశాయి. ఇట్లాగే తీయగలిగితే గొప్ప చిత్రం అవుతుందని అతనికి అనిపించింది. కథ అద్భుతంగా ఉంది కానీ, ఇది చాలా ఖర్చుతో కూడుకొన్న ప్రయోగం. సాధారణ ప్రేక్షకులకు నచ్చకపోతే కోట్లు నష్టపోయే వ్యవహారం. ఇందులో నటించటానికి తాను తయారే కాని, చూస్తూ చూస్తూ తన నిర్మాతలని ఇలాంటి ప్రయోగం చేయమని తాను అడగలేడు. ఈ చిత్రం నిర్మించాలంటే ఈ కథని బలంగా నమ్మి, దాన్ని తగు విధంగా నిర్మించడానికి వెనుదీయకుండా, పరాజయాన్ని భరించటానికి సిద్ధపడే నిర్మాత ఉంటేనే ఇది సాధ్యం. “ఈ కథని నా పేరు చెప్పకుండా వేరే ప్రొడ్యూసర్‌కి  వినిపించు. ఎవరికైనా కథ నచ్చి సినిమా తీస్తానంటే అప్పుడు నటించటానికి నేను రెడీ అని చెప్పు. ఒకవేళ ఆ నిర్మాత ఇంకెవరినైనా హీరోగా పెట్టుకుంటానన్నా నాకు అభ్యంతరం లేదు” అని గొవారికర్‌కి చెప్పేశాడు.

గొవారికర్ ఈ కథని చాలామందికి వినిపించాడు. వేరే ప్రొడ్యూసర్లు, హీరోలు ఎవరూ ముందుకు రాలేదు. స్క్రిప్ట్ బాగా నచ్చిన ఆమిర్‌ఖాన్ ద్వైధీభావంలో పడ్డాడు. సరైన నిర్మాత దన్నుగా ఉంటే ఈ స్క్రిప్టుతో ఇంతకు ముందు భారత సినీ చరిత్రలో ఎరగనటువంటి విభిన్నమైన గొప్ప సినిమా తీయొచ్చు. కానీ ఎవరూ ముందుకు రావటం లేదు. ఏం చేయాలి? తనే తీస్తే? ఆమిర్‌ఖాన్ తండ్రి తాహిర్‌ హుసేన్ (కారవాన్, అనామిక వగైరా), పెదనాన్న నాసిర్‌ హుసేన్ (యాదోంకీ బారాత్ వగైరా) ప్రముఖ నిర్మాతలు. వారి విజయాలు, పరాజయాలు, పడిన తిప్పలు దగ్గరగా చూసిన ఆమిర్‌ఖాన్ ఎప్పుడూ నిర్మాతగా మారకూడదని నిశ్చయించుకుని, నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు.  కానీ, ఇలాంటి స్క్రిప్ట్ వృధా కావటం ఇష్టం లేదు. గొవారికర్‌ని మళ్ళీ కథ చెప్పమన్నాడు. వదులుకో బుద్ధి కాలేదు. చిత్రరంగంలో తలపండిన తన నాన్న, పెదనాన్నలకి, ఫైనాన్సియర్ ఝాము సుగంధ్‌కి, భార్య రీనాకీ ఈ కథ చెప్పమన్నాడు. వాళ్ళూ నచ్చిందని అన్నారు. చివరికి తానే నిర్మాతగా మారి, ఈ సినిమాని నిర్మించటానికి తలపెట్టాడు. “Ash!, think big, think David Lean, think cinemascope!”, అంటూ తన దర్శకుణ్ణి ఉత్సాహపరిచాడు. గొవారికర్ ఆనందానికి పట్టపగ్గాలు లేవు.

ఐతే సినిమా నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకునే సమయం ఆమిర్‌ఖాన్‌కు లేదు. ఈ సినిమా పనులు అస్తవ్యస్తంగా జరగటాన్ని గమనించిన భార్య రీనా అతన్ని మందలించింది. “నా ఒక్కడి వల్ల కావటం లేదు, నువ్వు స్వయంగా దగ్గరుండి నిర్మాతగా వ్యవహరిస్తే  పనులు సరిగా జరుగుతాయి”, అని ఆమెను ఒప్పించి ముగ్గులోకి దించాడు. అప్పటివరకూ ఆమె సినిమారంగానికి దూరంగా ఉంటూ వచ్చింది. సినిమా నిర్మాణం గురించిన ఓనమాలు కూడా తెలియవు.  ఒకసారి దిగిన తర్వాత, ఆమె కొద్ది సమయంలోనే చాలా కష్టపడి వీలైనన్ని వివరాలు నేర్చుకోవటానికి కృషి చేసింది. అంతేకాక, ప్రతీదీ కొత్త కళ్ళతో గమనిస్తుండటం వల్ల, కొత్త నిర్ణయాలు ధైర్యంగా తీసుకొవటానికి, కొత్త పద్ధతులతో ప్రయోగం చేయడానికి ఆమె వెనుకాడలేదు.

లగాన్ చిత్రంలో వివిధ నైపుణ్యాలున్న గ్రామస్థులను తీసుకుని క్రికెట్‌టీం  తయారు చేసుకోటం గుర్తుందా? లగాన్ చిత్ర నిర్మాణపు టీంను అంత జాగ్రత్తగానే కూడగట్టారు ఖాన్ దంపతులు. సంగీతానికి ఏ.ఆర్. రెహ్మాన్, ఛాయాగ్రహణానికి అనిల్ మెహతా (హం దిల్ దే చుకే సనం), దుస్తులకు భాను అత్తయ్య (గాంధి చిత్రానికి ఆస్కార్ విజేత), కళా దర్శకుడిగా నితిన్ దేశాయ్, శబ్దగ్రహణానికి నకుల్ కాంటే, సంభాషణలు రాయటానికి కె.పి.సక్సేనా, పాటలకు జావెద్ అఖ్తర్, నిర్మాణ సారధ్యానికి  బి.శ్రీనివాసరావు.  పెట్టుబడి పెట్టడానికి ఝాము సుగంధ్ ముందుకు వచ్చాడు.

ఆమిర్‌ఖాన్ ఇంతకు ముందు లేని కొన్ని కొత్త విధానాలను ఈ చిత్రనిర్మాణంలో ప్రవేశ పెట్టాడు. వాటివల్ల నిర్మాణవ్యయం పెరుగుతున్నా వెనుకాడకుండా చిత్రం నాణ్యతపైనే దృష్టి పెట్టాడు. సెట్ మీద పని ప్రణాళిక ప్రకారం జరగడానికి హాలీవుడ్ పద్ధతిలో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండటానికి, చాలా హాలీవుడ్ చిత్రాలకు ఆ పనిచేసిన అపూర్వ లఖియాను ఒప్పించాడు. మూవీమ్యాజిక్ అన్న కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను మొదటిసారిగా చిత్రనిర్మాణానికి వాడుకొన్నారు. డబ్బింగ్ లేకుండా షూటింగ్ సమయంలోనే  డైలాగులు సింక్‌సౌండ్ పద్ధతిలో  మొత్తం  రికార్డింగ్ చేయాలి. షూటింగ్ మొత్తం ఒకే షెడ్యూల్‌లో జరుగుతుంది. అన్ని పాత్రలకూ నటుల్ని ఆడిషన్ తర్వాతే ఎన్నుకోవటం. రఘువీర్ యాదవ్, రాజేష్ వివేక్ వంటి కళాకారులు ముఖ్యపాత్రలకు ఎన్నికయ్యారు. హీరోయిన్ పాత్రకు పెద్ద స్టార్‌కన్నా పాత్రకు సరిపడే అమ్మాయి కావాలని కొత్త అమ్మాయి గ్రేసీసింగ్‌ని ఎంచుకొన్నారు. మామూలుగా హిందీ సినిమాల్లో ఆంగ్లేయుల వేషాలు వేయటానికి స్థానికంగా ఉన్న తెల్లవాళ్ళను వాడుకొంటారు; దానికి భిన్నంగా ఇంగ్లండు వెళ్ళి, ఆడిషన్లు నిర్వహించి, పాత్రలకు సరిపడే విధంగా అనుభవం ఉన్న యాక్టర్లను ఎన్నుకొన్నారు.

సినిమా తీయడానికి అనేక స్థలాలని పరిశీలించాక, గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతపు మారుమూలల్లో భుజ్ అనే చిన్న బస్తీ శివార్లని ఎన్నుకొన్నారు. సరైన హోటల్ వసతి కూడా లేని ఆ ఊళ్ళో అక్కడ ఉన్న ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌ని అద్దెకు తీసుకొని, ఆ ఫ్లాట్లని తమ బృందం వాసానికి యోగ్యంగా మార్చుకొని, నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ బృందం అందరూ ఒక చోటే నివసించారు. కళా దర్శకుడు నితిన్ దేశాయ్ అక్కడి బీళ్ళ మధ్య చంపానీర్ గ్రామాన్ని, ఒక గుడితో సహా, నిర్మించాడు. ఆ నిర్మాణంలో పనిచేసిన కూలీలు ఆ తర్వాత సినిమాలో చంపానీర్ ప్రజలుగా (జూనియర్ ఆర్టిస్టులుగా) ఉండిపోయారు. చిన్న చిన్న పాత్రలకు స్థానిక కళాకారుల్ని ఎన్నుకొన్నారు.  ఇంగ్లాండు నుంచి తీసుకొచ్చిన కళాకారులు కూడా మిగతావాళ్ళతో పాటు ఈ పరిస్థితుల్లోనే సహజీవనం చేశారు.  షూటింగ్ ప్రారంభం కావటానికి ముందునుంచే రోజూ ఎవరి కాస్ట్యూముల్లో వారు తమ పాత్రలకి సంబంధించిన వృత్తిపనుల్ని ప్రాక్టీసు చేసేవారు; ఒకర్నొకరు పిల్చుకోవడం కూడా పాత్రల పేర్లతోనే. ఆమిర్‌ఖాన్ కుర్చీల్లో కూచోటం మానేశాడు; నేల మీద ముంగాళ్ళ మీద కూచోవటమే. సినిమాకోసం కట్టిన గుడిసెలే మేకప్‌రూములు; ప్రొడక్షన్ ఆఫీసులు.

అన్నీ సవ్యంగా అందుబాటులో ఉన్నప్పుడే సినిమా తీయడం చాలా కష్టమైన పని. అటువంటిది – ముంబాయికి చాలా దూరంగా, ఒక మారుమూల పల్లెటూళ్ళో, ఏ వనరులూ లేని చోట అన్నిటినీ సమీకరించుకొంటూ, నాలుగు విభిన్నమైన సంస్కృతులకు చెందిన నటీ నటుల్ని, సాంకేతిక నిపుణుల్ని  సంబాళించుకోంటూ, తొమ్మిది నెలలపాటు ఇంటిని స్వంతవారినీ వదలి కొత్త వాళ్ళతో సహజీవనం చేస్తుంటే వచ్చే ఇబ్బందుల్ని సర్దుకొంటూ, సినిమాలంటే తెలియనివారిని జూనియర్ ఆర్టిస్టులుగా వాడుకొంటూ, పదివేల మంది ప్రేక్షకుల మధ్య క్రికెట్ మ్యాచ్ చిత్రీకరిస్తూ, ఎడారి మధ్య సింక్‌సౌండ్‌తో సినిమా తీయడం సాఫీగా ఎలా సాగుతుంది? నానారకాల కష్టాలు పడితేకాని షూటింగ్ పూర్తి కాలేదు. మధ్యలో సీనియర్ ఆర్టిస్ట్ ఏ.కే.హంగల్, దర్శకుడు గొవారికర్ నడుం నెప్పి వాత పడ్డారు. వీటన్నిటికి తోడు పగలు ఎర్రటి ఎడారి ఎండలు; రాత్రి అయితే ఈదురుగాలి చలి. క్రికెట్ టీంలో నటించిన భారతీయులు చాలామందికి క్రికెట్ ఆడటం రాదు సరే, ఇంగ్లీష్ టీం కెప్టెన్, ముఖ్య ఆటగాడుగా నటించిన పాల్ బ్లాక్‌స్టోన్‌కీ, ప్రత్యర్థుల తలల్ని బద్దలు కొడ్తూ భీభత్సమైన బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్ పాత్రధారికీ కూడా క్రికెట్ ఆట రాదు. క్రికెట్ ఆట షాట్ తీద్దామంటే బంతి అనుకొన్న చోట పడాలి, బాట్ అనుకొన్న రీతిన తాకాలి, ఫ్రేంలో అందరు పాత్రధారులు తమ పనుల్ని సరిగ్గా చేయాలి. ఒక ఇబ్బంది కాదు, మహాప్రభో!

నాలుగు నెలలు పడుతుందనుకున్న సినిమా షూటింగ్ పూర్తవటానికి ఆరు  నెలలు పట్టింది. ముందు ఎనిమిది కోట్లనుకున్న బడ్జెట్, షూటింగ్ ప్రారంభానికి ముందే 14 కోట్లకు పెరిగింది; షూటింగ్ జరుగుతుండగానే ఆ అంకెనికూడా దాటేసింది.   తిక్క రేగిన రీనా దత్తా ఒక డెడ్‌లైన్ పెట్టి ఆలోపు షూటింగ్ పూర్తి కాకపోతే సినిమా ప్రొడక్షన్ నిలిపేస్తానని అల్టిమేటం ఇచ్చింది. స్నేహితుడి దర్శక-సృజనాత్మకతకు అడ్డం వెళ్ళలేక, డబ్బు దగ్గర ఇబ్బంది పడ్తున్న ప్రొడ్యూసర్ భార్యకి సర్ది చెప్పలేక ఇద్దరి మధ్యా ఆమిర్‌ఖాన్ అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయాడు.

చిత్రం పూర్తవకుండానే కొంటామని ఆఫర్లిచ్చిన బయ్యర్లతో ఆమిర్‌ఖాన్ ససేమిరా అన్నాడు – సినిమా పూర్తయ్యాక చూసి బాగుందంటేనే కొనుక్కోండి అని చెప్తూ. తీరా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా ఎడిటింగ్, షూటింగ్ పూర్తయ్యాక పదిపదకొండు నెలలకు కానీ పూర్తవలేదు. సినిమా నిర్మాణం  మొదలు పెట్టినప్పుడు బ్రహ్మాండంగా ఉన్న హిందీ సినిమా మార్కెట్ చిత్రం పూర్తయ్యేపాటికి చతికిలపడింది. ఏరియా ధరలు మూడో వంతు తగ్గాయి. ఫిల్మంతా ఎడిట్‌చేసి ఒక్క కొలిక్కి తెస్తే అది రెండు సినిమాల (ఐదున్నర గంటల) పొడుగు ఉంది. అప్పుడు ఆమిర్‌ఖాన్ స్వయంగా ఎడిటింగ్ రూంలో కూర్చున్నాడు. చివరికి మూడు గంటల 44 నిమిషాల సినిమా తయారయ్యింది. అందులో చాలా భాగం క్లైమాక్స్ క్రికెట్ మాచే!

సినిమా విడుదల అయ్యేలోపల ఆకస్మిక భయంకర విషాదం. 2001 జనవరి 26న గుజారాత్‌లో వచ్చిన పెద్ద భూకంపం భుజ్ ప్రాంతాల్ని విధ్వంసం చేసింది. లగాన్ బృందం అంతకు ముందు నివసించిన సహజానంద్ టవర్స్ కూలిపోయి నలుగురు మరణించారు. సినిమాలో పనిచేసిన కొంతమంది స్థానికులు కూడా మరణించారు. అందరూ ఇబ్బంది పడ్డారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బృందం మళ్ళీ భుజ్ వెళ్ళి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. చిత్రంలో నటించిన బ్రిటిష్ కళాకారులు కూడా విరాళాలు సేకరించడంలో పాలు పంచుకొన్నారు.

చిత్రనిర్మాణసమయంలో ఆమిర్‌ఖాన్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకొన్న భుజ్‌వాసులకోసమే ప్రత్యేకంగా మొదటి ప్రదర్శన ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకొని జూన్ 10, 2001న భుజ్‌లో ప్రీమియర్ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. తరలివచ్చిన భుజ్ కళాకారులు, భూకంపం బాధల్ని కొంతసేపు మర్చిపోయారు. ప్రీవ్యూ జరుగుతుండగానే, సినిమాలో వర్షం పాట (ఘనన ఘనన్…) తెర మీద నడుస్తుండగానే,  వర్షాలు తక్కువగా పడే ఆ ఎడారిప్రాంతంలో చాలాకాలం తర్వాత భారీవర్షం కురవడం ప్రారంభమైంది.

ఎట్టకేలకు జూన్ 15న లగాన్ చిత్రం భారతదేశమంతా విడుదలయింది. లగాన్ బృందమంతా ఆ సాయంత్రం జరగబోయే వరల్డ్ ప్రీమియర్ షో కోసం సౌత్ఆఫ్రికాలో సన్‌సిటీలో ఉన్నారు. కానీ వారి ధ్యాసంతా ఇండియాలో ప్రేక్షకులు ఇవ్వబోయే తీర్పు పైనే. ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వారికి,  బొంబాయిలో ఒక థియేటర్‌నుంచి గొవారికర్ సోదరి ఆశ్లేష ఫోన్ చేసింది, “అశూ, ఇక్కడ నువ్వెంత మిస్సయిపోతున్నావో తెలుసా!” అంటూ. ఫోన్ స్పీకర్ చుట్టూ గుమికూడిన బృందానికి, అక్కడ ప్రేక్షకులు భారత క్రికెట్‌టీం వరల్డ్ కప్ ఫైనల్లో ఆడుతున్నంత ఉత్కంఠతో సినిమా చూస్తూ భువన్ బృందానికి ప్రోత్సాహమిస్తూ కేకలు వెయ్యడం స్పష్టంగా వినిపించింది. “రె భయ్యా ఛూటె లగాన్!” అన్న నినాదం దేశమంతటా థియేటర్లలో ప్రతిధ్వనిస్తుంది. ఆనందభాష్పాలు, హర్షధ్వానాల మధ్య ఒకర్నొకరు కౌగలించుకొని అభినందనలు తెలియచేసుకొన్నారు.

బాలీవుడ్ విజయసూత్రాలను పట్టించుకోకుండా తీసిన లగాన్ చిత్రం బాక్సాఫీసువద్ద అపూర్వ విజయాన్నందుకుంది. దేశవిదేశాల్లో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో గౌరవాల నందుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తీసిన చిత్రంగా ప్రశంసలు పొందింది.  లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో మూడొందల సినిమాల మధ్య పబ్లిక్ ఛాయిస్ అవార్డుని గెలుచుకొంది. చివరికి ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రాల ఫైనలిస్టుల వరుసలో నిలచింది. గత యాభై యేళ్ళలో ఆ గౌరవం అందుకున్న ఒకే ఒక్క భారతీయ ప్రధాన స్రవంతి చిత్రం లగాన్.

తాము గాఢంగా విశ్వసించిన ఒక కథని మంచి చలనచిత్రంగా మార్చటానికి తపించిన ఒక నటుడు, నిర్మాత, దర్శకుడు, వారి కలల్ని పంచుకోవటానికి శ్రమించిన నిర్మాణ బృందం, సాంకేతిక నిపుణులు, నటులు ఏకాగ్రతతో కలసికట్టుగా పనిచేస్తే ఎలాంటి కళాఖండాలు తీయవచ్చో చెప్పడానికి లగాన్ ఒక ఉదాహరణ. లగాన్ చిత్ర నిర్మాణంలో ప్రవేశపెట్టిన విధానాలు ఇప్పుడు బాలీవుడ్ ప్రధాన స్రవంతిలో భాగమయ్యాయి. మూస కథల్నుంచి దూరంగా వెళ్ళి ప్రయోగాత్మకమయిన కథలతో, దేశవిదేశ తారాగణాలతో విభిన్నంగా చిత్రాలు తీయడానికి లగాన్ స్ఫూర్తినిచ్చింది. ఈ చిత్ర విజయం తర్వాత దర్శకుడిగా అశుతోష్ గొవారికర్, నిర్మాతగా, నటుడుగా ఆమిర్‌ఖాన్ ధైర్యంగా మరిన్ని ప్రయోగాలు చేస్తూ మనకు చాలా మంచిచిత్రాలని అందించారు.

ఈ పుస్తకం రాసిన సత్యజిత్ భత్కల్ వృత్తిరీత్యా న్యాయవాది; జాగృతివాలా అనే మరాఠీ పత్రికను నడుపుతూ, వివిధ రాజకీయ సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆమిర్‌ఖాన్‌కి బాల్యస్నేహితుడు. ఒకరోజు అర్థరాత్రి ఆమిర్‌ఖాన్ ఇతన్ని నిద్రలేపి తాను తీద్దామనుకుంటున్న సినిమా కథనం వినడానికి సత్యజిత్ దంపతులను ఆహ్వానించటంతో ఈ పుస్తకం మొదలవుతుంది. అలా వెళ్ళిన సత్యజిత్, “Do something different!” అని ఆమిర్‌ఖాన్ ఇచ్చిన సందేశం వంట పట్టించుకొని ఈ సినిమా నిర్మాణబృందంలో ఒకడయ్యాడు. ఏడాదిపాటు సినిమా నిర్మాణంలో ప్రొడక్షన్ ఎక్జిక్యూటివ్‌గా భాగం పంచుకుంటూనే, “చలే చలో, ద లూనసీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్”  (also known as: Madness in the Desert, The Making of Lagaan) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించి జాతీయ అవార్డు గెల్చుకొన్నాడు. ఈ పుస్తకం రాశాడు. తానుగా దర్శకుడై చిత్రాలు (జోకొమాన్ వగైరా) తీస్తున్నాడు.

పుస్తకం విపులంగా ఉంది. సరళంగా, చకచకా చదివించేలా ఉంది. ముద్రణ బాగుంది. ఒక మంచి చిత్ర నిర్మాణాన్ని  ఆ చిత్రం దర్శకుడి మెదడులో ఊహగా పుట్టినదగ్గరనుంచి థియేటర్లో ప్రదర్శించబడేవరకూ, ప్రతి ఘట్టాన్నీ నాటకీయంగా వివరిస్తూ వ్రాసిన ఈ పుస్తకం సినిమాలంటే ఉత్సాహం ఉన్నవాళ్ళకు మంచి సరదాగా ఉంటుంది.  నాబోటి లగాన్ అభిమానులకైతే మరీనూ.


The Spirit of LAGAAN : The extraordinary story of the creators of a classic
Satyajit Bhatkal
March 2002, Popular Prakashan, Mumbai
244 pages
Available at Amazon

Buy from Flipkart.com here.

 

********************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors) అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

********************

 

You Might Also Like

4 Comments

  1. సౌమ్య

    బాగుంది.
    మీలాగే నేనూ, మా అమ్మనీ, అమ్మమ్మనీ లాక్కెళ్ళా అప్పట్లో ఈ సినిమాకి.
    వాళ్ళేమో ఏమిటీ‌ ఎంతసేపటికి అవ్వదూ అనుకుంటూ‌ విసుక్కున్నారు కానీ, పదహారు-పదిహేడేళ్ళ వయసులో ఆ సినిమా నన్ను విపరీతంగా ఆకట్టుకుందనే చెప్పాలి. తర్వాతెప్పుడూ మళ్ళీ చూడలేదు. కానీ, ఇప్పుడంత నచ్చదేమో అనిపిస్తోంది. 🙂

  2. ప్రసాద్‌

    వివరాలు బాగున్నాయి. తెలియని విషయాలు కూడా తెలిశాయి. ఇండియా సినిమా సాధారణంగా ఇష్టపడని మా అబ్బాయి కూడా ఈ సినిమాని బాగా ఇష్టపడ్డాడు.
    ఈ సమీక్షలో, ” ప్రీవ్యూ జరుగుతుండగానే, సినిమాలో వర్షం పాట (ఘనన ఘనన్…) తెర మీద నడుస్తుండగానే, వర్షాలు తక్కువగా పడే ఆ ఎడారిప్రాంతంలో చాలాకాలం తర్వాత భారీవర్షం కురవడం ప్రారంభమైంది.” అని రాశారు. ఇది ఒక జరిగిన విషయాన్ని చెబుతున్నట్టుగా లేదు. ఒక మూఢనమ్మకాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్టుగా వుంది. ఒక వేళ నిజంగా ఇలా జరిగి వుంటే, అది తప్పకుండా, కాకతాళీయమై వుంటుంది. ఆ ముక్కలు అనక పోవడం వల్ల, వాటితో అంగీకరిస్తున్నట్టు అర్థం వస్తుంది.

    ప్రసాద్‌

    1. Jampala Chowdary

      ప్రసాద్ గారూ:

      అలా వర్షం పడిందని భత్కల్ వ్రాశాడు. పుస్తకంలో ఉన్న అనేక నాటకీయ విషయాలలో అది కూడా ఒకటి.

      దీంట్ల్లో మీకు కాని మరెవారికైనా కానీ మూఢమో మరోటో నమ్మకం కనిపిస్తే అది మీరు చూచు విధాన ఫలమే.

Leave a Reply