కవితాభూషణం-నాలుగోభాగం
(యదుకులభషణ్ గారి బాల్యం కబుర్లతో కూడిన మొదటి భాగం ఇక్కడ. ఆయనలోని చదువరిని పరిచయం చేసే రెండో భాగం ఇక్కడ. కవిత్వం గురించి ఆయన అభిప్రాయాలు, అనుభవాలు తెలియజేసే మూడోభాగం ఇక్కడ.)
ఇతరభాషా సాహిత్యం, అనువాదాలు:
(ఇతర భాషా సాహిత్యం లో మనకి పనికొచ్చేవి, మనం వాటినుంచి సంగ్రహించవలసిన విషయాలు, అనువాదాల అవసరం/చెయ్యవలసి తీరు జపనీస్ తరహా కవిత్వం తెలుగు పై చూపించిన ప్రభావం మొదలైన విషయాలపై..)
౧. మీరు ఇతర భాషలను ఎలా అభ్యసిస్తారు? ఎలా వాటిపై పట్టు సాధిస్తారు?
మొదలు లిపి. చదవడం నేర్చు కొంటాను. తర్వాత నిఘంటువుల వాడకం. ఆ పై ఆ భాష వచ్చిన వారితో సాహచర్యం. ఇతరులు మాట్లాడేది బాగా వినాలి. తప్పో ఒప్పో మాట్లాడాలి. భాష దానంతటదే వస్తుంది.ఎన్నో తప్పులు చేస్తాం. వాటి గురించి విచారం లేదు. మూల విధేయంగా అనువాదాలు చేయడానికి పలు భాషలతో పరిచయం పెంచుకొన్నాను. మూలాన్ని చదివి అర్థం చేసుకోగలిగితే చాలు నా వరకు .
౨. తెలుగుపై పట్టు ఉండడం వల్ల మిగతా భాషలు నేర్చుకునేటప్పుడు సులువైందని అనుకుంటారా?
నిస్సందేహంగా. తెలుగు రాకపోతే ఏమీ రానట్టే. తల్లిని గుర్తు పట్టలేని వాడు వీధిలోని జనాలను గుర్తు పడతాడనుకోను.
తెలుగును చారిత్రిక దృక్పథంతో అధ్యయనం చేయాలి. దానివల్ల గలిగిన దృష్టి ఏకకాలంలో ఇతర భాషలను లోతుగా తెలుసుకోవడంలో ఎంతో సహాయ పడుతుంది.
౩. ఏ భాషకైనా అనువాద సాహిత్యం ఎంత ముఖ్యం?
అనువాదాలు నాగరికతలో భాగం. ఇతర భాషా సాహిత్యాలు అనువాదాల ద్వారానే మనకు చేరువవుతున్నాయి. అనువాదాలు లేకపొతే బౌద్ధం చైనా చేరేది కాదు.మహా కవుల రచనలు మహానదీ ప్రవాహాల్లా ,శరీరాన్ని ,ఆత్మని ప్రక్షాళన గావిస్తాయి.
౪. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా, ఆయనకి తెలుగు, సంస్కృతం తప్పించి మరేం రాకపోవడం వల్లే, ఆయన తెలుగంత స్వచ్ఛంగా, కమ్మ గా ఉందని అభిప్రాయపడే వాళ్ళని విన్నాను. మీరేమంటారు? బహుభాషా కోవిదులు ఏ ఒక్క భాషకూ న్యాయం చెయ్యలేరన్న విమర్శ వస్తే, దాన్ని ఎలా తిప్పి కొడతారు?
ఆయనకు మరో పది భాషలు వచ్చినా ఆయన భాష కమ్మగానే ఉండేది; ఆయనకు తెలుగు భాష ఆయువు పట్లు తెలుసు. స్త్రీలనుంచి భాష నేర్వమని చెబుతాడు. ప్రబంధాలు అర్థం కావాలంటే రాయలసీమ పల్లెల్లో పలుకుబళ్ళు తెలియాలి అంటాడు.సజీవభాష విలువ ఆయనకు తెలిసినంతగా ఆయన తరంలో మరెవరికీ తెలియదు. గురజాడ, గిడుగుల చారిత్రక పాత్రను సాకల్యంగా అర్థం చేసుకొన్న బహుకొద్ది మందిలో ఆయన ఒకరు. అంతే గాక, ప్రతి పలుకుబడిలో అందం ఉందని గుర్తించిన విశాల హృదయుడు. గొప్ప భాషా ప్రేమి. ఈ కారణాల వల్ల గొప్ప తెలుగు రాయగలిగాడు. అంతే గాని, ఆంగ్లం రాకపోవడం వల్ల కాదని నా అభిప్రాయం.
పది భాషలు నేర్చుకొంటే చెడిపోరు. ఏదో ఒక కారణం వల్ల భాషలు నేర్చు కొంటారు. హైకూ కవిత్వం కోసం జపనీస్, టావో టే చింగ్ చదవడానికి ప్రాచీన చైనీస్; కాళిదాసు కోసం సంస్కృతం, బుద్దుని బోధల కోసం పాళీ. ఇలా ఎన్ని భాషలు నేర్చినా, చివరికి ‘సేద్యం వెలిగించవలసింది’ మాతృభాషలోనే కదా. కాబట్టి న్యాయం చేయలేరు అన్న ప్రశ్నే ఉదయించదు.పలు భాషలు నేర్చుకోనేది మన భాషను సంపన్నం చేయడానికే గాని ఆ భాషల్లో రచనా వ్యాసంగం చేపట్టడానికి కాదు.
౫.ఎన్ని భాషలొచ్చినా వాటి పద సంపదంతా అక్కరకు రాక మీరు మూగబోయిన సందర్భాలున్నాయా?
లెక్క లేనన్ని. ఉదాత్త భావాలు వెలిగి పోయేది మౌనంలోనే. కవి అన్న వాడికి పదాల బలహీనత బాగా తెలియాలి. అప్పుడు దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తాడు.
౬. ఇతర భాషల్లో ఉండి తెలుగులో లేనిదేమిటి? తెలుగుకి మాత్రమే సొంతమైనది ఏమిటి?
ప్రతి భాషకు తనదైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. మన భాషలో no అన్న భావనను చాలా రకాలుగా చెప్పవచ్చు:వద్దు, కాదు, లేదు. ఇతరభాషల వాళ్ళు తెలుగు నేర్చుకొనేటప్పుడు ఇక్కడ బోల్తా పడతారు.
౭. కవిత్వాన్ని అనువదించాలన్న ఆలోచన ఎలా కలిగింది?
అనువాదాల మీద ముందు నుండి ఆసక్తి వుంది. చేయి తిరగడానికి గతంలో ఎన్నో కథలు (తెలుగులోకి), కవిత్వాలు (ఇంగ్లిష్ లోకి) అనువాదం చేశాను. అదంతా ఒకెత్తు. అమెరికాకు వచ్చిన కొత్తలో (౨౦౦౧) ఒకరోజు రాత్రి అట్లాంటిక్ మాసపత్రికలో పోలిష్ కవయిత్రి జింబోస్కా ప్రేమ కవితలు బాగా నచ్చి, ఉన్న ఫళాన అనువాదం చేశాను. తర్వాత ఒక ప్రణాళిక వేసుకొని ,ఎన్నో ఏళ్లుగా చదువుతూ వస్తున్న బ్రాడ్స్కి ,స్టిక్నీలతో పాటు ఐరోపా కవులను, జపనీస్ హైకూ కవులను అనువదించాను. ‘విశ్వకవిత’ అన్న శీర్షికన ‘ఈ మాటలో’ కొంత కాలం పాటు వచ్చాయి.ఏదైనా మాతృభాషలో చదివితేనే నిజంగా తలకెక్కేది. గొప్ప కవిత్వాన్ని మాతృభాషలోకి అనువదించడంలో ఆనందం ఉంది. మూలంలో మనకెంతగానో నచ్చిన మహా కవులకు మనమివ్వగల నిజమైన నివాళి అది. అంతేకాక మన భాష సుసంపన్నం అవుతుంది.
౮. తొలినాళ్ళ మీ అనువాదాలను చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది?
(Over a period of time – what do you think of your progress as a translator?)
గద్యానువాదాలు ఇంకా మెరుగు పరచ వచ్చు.కవిత్వానువాదాలు అలాగే వదిలేయవచ్చు. సాధన చేస్తుంటే లోతులు తెలుస్తుంటాయి. పోగా పోగా మూలం చూడకుండానే అనువాదకులు చేసే తప్పులు గుర్తించగల ప్రజ్ఞాపాటవాలు మన స్వంతమవుతాయి. ప్రస్తుతానికి ప్రాచీన చైనీస్ నుండి ‘ టావో టే చింగ్ ‘ అనువాదం చేస్తున్నాను.
౯. తెలుగులోకి అనువదించడం, తెలుగును అనువదించడం, – వీటి రెండింటిలోని ప్రధాన సమస్యలేమిటి?
మొదటిది సహజం; రెండవది ఎదురీత, కారణం – పరభాషల నుడికారం అంత సులభంగా పట్టుబడదు.దానికి భిన్నంగా మాతృభాషలో నుడికారమే మన బలం.
౧౦. ఒక్కో ప్రాంతంలోనూ కొన్ని ప్రత్యేక సంప్రదాయాల వంటివి ఉంటాయి కదా. ఆ భాషా సాహిత్యంలో అవి కనిపిస్తాయి. ఇలాంటి వాటిని ఆ సంప్రదాయాలతో పరిచయం లేని వారికి – అనువాదం చేస్తున్నప్పుడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఒక ఉదాహరణ : పాత తరం వారు తెలుగు కాలమానాన్నే ఇంట్లో వ్యవహారం చేస్తుంటారు. కరువులో అధిక మాసం, ఉత్తర చూసి ఎత్తర గంప,వైశాఖం పై శాఖం ఇలాంటి వాడుక వారికి సర్వ సాధారణం; ఇంగ్లిష్ కాలమానంలో వీటికి సమానార్ధాలు వెతకడం కష్టం.సందర్భాన్ని బట్టి పాద పీఠికలు ఇవ్వడం చేయాలి.
౧౧. “Translation is oil painting reproduced in black and white” అన్న కోట్ చదివాను మొన్నే – మీ కామెంట్స్
ఇలాంటి సూక్తులకేమి కొదవ లేదు. అలా అని చెప్పి వాటిలో కొంత నిజం లేక పోలేదు.
౧౨. అనువాదాలు చేయాలని ఆసక్తి ఉన్నవారికి, మీరిచ్చే సలహాలు, సూచనలూ ఏవన్నా….
కవిత్వాలు అర్థం కావు, అనువాదాలు సాధ్యం కావు అన్నది చిరకాలంగా నాకున్న బలమైన అభిప్రాయం. అంత మాత్రం చేత కవిత్వాలు చదవడం లేదా ? అనువాదాలు చేయడం లేదా ?? పరిమితులను ముందే తెలుసుకుంటే మరింత ఓపిక కూడగట్టుకొని ప్రయత్నిస్తాం. ప్రయత్నలోపం ఉండరాదు. అనువాదం ఆషామాషీ వ్యవహారం కాదు. సాహిత్యంలో అభిరుచి లేనిది అనువాదంలోకి తొంగి చూడరాదు. అనువాదంలో ఉన్న కష్టాలు ఎవరికీ అర్థం కావు.మీకు ఒక పర భాష తెలిస్తే, అందులో మీకు నచ్చిన కవిత /కథ /వ్యాసం- ఎంత కాలమైనా పట్టనీ -అనువదిస్తే మన భాష సంపన్నమవుతుంది. వీలయినంత వరకు మూలం నుంచి చేయండి. ముఖ్యంగా భారతీయ భాషలలో కవిత్వాలను ఇంగ్లీష్ నుండి చేయవద్దు. ఒళ్ళు కాస్త వంచి ఆ భాష నేర్చుకొండి. మీరు అనువాదం చేస్తున్నప్పుడు మీ ఆలోచనలను అనుభవాలను పొల్లు పోకుండా నమోదు చేయండి. అవి మును ముందు అనువాదాలు చేసే వారికి చాలా సహాయపడతాయి.
(ఇక్కడితో ఈ ఇంటర్వ్యూ సమాప్తం. ఓపిగ్గా సహకరించిన యదుకుల భూషణ్ గారికి మరోసారి ధన్యవాదాలు)
ఘంటా శ్రీనివాస రావు
” తెలుగు రాకపోతే ఏమీ రానట్టే. తల్లిని గుర్తు పట్టలేని వాడు వీధిలోని జనాలను గుర్తు పడతాడనుకోను.”
కేక పెట్టించావు గా ఇంటర్ వ్యూ ; చాలా బావుంది.
-ఘంటా
సంగీత
యదుకుల భూషణ్ ప్రచురించిన పుస్తకాల జాబితా వికిపెడియాలో ఇక్కడ..
ఈమాట.కాం లో వచ్చిన వ్యాసాల, కవితల చిట్టా ఇక్కడ
సంగీత
రవి
“పలు భాషలు నేర్చుకోనేది మన భాషను సంపన్నం చేయడానికే గాని ఆ భాషల్లో రచనా వ్యాసంగం చేపట్టడానికి కాదు.”
అద్భుతమైన మాట చెప్పారు.
తమ్మినేని వారి ముఖాముఖి చాలా హృద్యంగా, కవితలా ఉంది. ఆయన రచనా పరిచయాలను కూడా జోడిస్తే బావుంటుంది.
chavakiran
ఈ ఇంటర్వ్యూ చక్కని ప్రయత్నం.
అలానే భూషన్ రచనల (ప్రచురించినవి, ప్రచురించబోయేవి, ప్రచురించబోనివి) చిట్టా ఇస్తే బాగుండేది.