వ్యాసమాలతి

(మాలతి గారు తన వ్యాసాలను ఒక సంకలనం చేస్తూ, దానికి ముందుపరిచయం నన్ను రాయమన్నారు. ఇది ఆ పరిచయం. ఆ సంకలనం ఈబుక్ ఇక్కడ చూడవచ్చు. తరువాత వచ్చిన రెండవ భాగం లంకె ఇక్కడ.)

తెలిసితెలిసీ నాచేత ముందుమాట రాయించుకుంటున్నందుకు మాలతి గారి ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడీ పుస్తకం ప్రింటులో వచ్చిందంటే, ఎక్స్ కాపీలు అమ్ముడుకావాల్సిన స్థానంలో ఎక్స్ బై టూ నే అమ్ముడౌతే, అందుకు కారణం ఈ ముందుమాటే అయి ఉంటుందని ఇప్పుడే జోస్యం చెప్పేయగలను. అందుకే మాలతి గారిది ధైర్యం అంటున్నది. 🙂 ముందుమాటల్లో స్మైలీలు పెట్టే సంప్రదాయానికి నాంది పలుకుతూ…. నేను ముందుకెళ్తున్నా 😉

మాలతిగారి బ్లాగులో ఈవ్యాసాలు రాసినా, నేనెప్పుడో ఒకరోజు, అవి రాసేసిన కొన్ని నెలలకు చదువుతూ ఉండేదాన్ని. అలా చదివినప్పుడల్లా – ఇవన్నీ పుస్తకం.నెట్ లో రాయొచ్చు కదా – అనుకునేదాన్ని. సరే, కొన్నాళ్ళకి ఇలాక్కాదు అనేసి, ’మీరు ఇవన్నీ కలిపి ఒక పుస్తకంగా వేయొచ్చు కదా, అప్పుడు దాన్ని పుస్తకం.నెట్లో పరిచయం చేస్తాము, అప్పుడు ఉభయతారకంగా ఉంటుంది కదా’ అని అడిగాను. అలా – ఎలాగోలా – కార్యసాధకురాలిని అయ్యాను – ఇప్పుడీ ఈబుక్ తీసుకొచ్చారు కనుక 😉 ఇక – పుస్తకంలోకి వస్తే:

మొదటి భాగం – మన కవులు, రచయితల గురించి. ఆడిదము సూరకవి, వేములవాడ భీమకవి, తరిగొండ వెంగమాంబ, నిడదవోలు వెంకట్రావు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనుపర్తి వరలక్ష్మమ్మ:మొదటి ఆరుగురూ – నాకు మరో మార్గం ద్వారా తెలిసే అవకాశమే లేదు. కనుక, వీళ్ళందరి గురించీ తెలుసుకోవడం – తెలుగు సాహిత్యంలో ఇన్ని కొత్త పాత పేర్లున్నాయన్నమాట – తప్పక చదవాల్సినవి – అన్న స్పృహ కలిగేలా చేసింది. ఆపై ’కవి’ అనగానే -మనకి భాష అర్థంకాదులే అనేసి దూరంగా జరిగే నాకు – ఈ కవులను (సూరకవి, భీమకవి ఎట్సెట్రా..) చదవడానికి ప్రయత్నించాలి అని ఇటీవలి కాలంలో అనిపించిందీ అంటే – అందులో ఈవ్యాసాల భాగం కూడా ఉంది. నిడదవోలు వెంకట్రావు,ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ – వీరిద్దరూ విరివిగా చేసిన పరిశోధనల గురించి చదివి అసలు వాళ్ళేమిటో, వాళ్ళ రచనలేమిటో – చదవాలన్న కుతూహలం కలిగింది : ఆపరంగా, మాలతిగారు ఏమనుకుని ఈ వ్యాసాలు రాసినా కూడా, నవతరంలోని వ్యక్తుల చేత ఇవన్నీ చదవడానికి ప్రయత్నించాలి అనిపించేలా చేశారన్నమాట.

లత, ద్వివేదుల విశాలాక్షి, రావిశాస్త్రి, నాయని కృష్ణకుమారి, మల్లాది రామకృష్ణశాస్త్రి – వీరిపై రాసిన వ్యాసాలు – చాలా సమగ్రంగా ఉన్నాయి. రావిశాస్త్రి గారివి తప్ప వీరిలో మరెవరివీ నేను ఏమీ చదవలేదు. కానీ, ఇవి చదివాక, వీరి రచనల గురించి ఒక ప్రాథమిక అవగాహన కలిగింది. అసలు – ఎవరన్నా రచయిత రచనలను పరిచయం చేస్తూ వ్యాసం రాస్తే – అవి ఇలా ఉండాలి అనిపించింది. (నాన్-అకడమిక్, మామూలు సాహిత్యాభిమానుల సంగతి చెప్తున్నా!) అలాగే, రెండో భాగంలో: ’స్త్రీల సాహిత్యం-పూర్వరంగం’, ’1950,60 దశకాల్లో స్త్రీలు సృష్టించిన సాహిత్యం’, చివరి భాగంలో-’ఆరుద్ర కథలు’ గురించిన వ్యాసం – భవిష్యత్తులో నేనెప్పుడన్నా అలాంటి వ్యాసాలు రాస్తే – ఇవే నా గోల్డ్ స్టాండర్డ్స్ 🙂

మూడో భాగం: కథావిమర్శ పై చర్చ, కథల వెనుక కథలు, రచయితలు పాత్రలనెందుకు చంపుతారు, ఎలాంటి అనువాదాలు కావాలి? – ఈ వ్యాసాలన్నీ బాగా ఎంటర్టైనింగా చదివించాయి 🙂 అవి చదివే క్రమంలో కూడా – కొన్ని కొత్త విషయాలు తెలిశాయి – రచయితల పనితీరు గురించి. అలాగే, కెకె.రంగనాథాచార్యులు గారి పుస్తకంపై రాసిన సమగ్ర సమీక్ష – కూడా తెలుగు కథ తాలూకా కథను కొంత చెప్పింది. అక్కడే – కథ ఎలా ఉండాలి వంటి అంశాలపై ఉన్న భిన్నాభిప్రాయాలను కూడా తెలుసుకోగలిగాను – ఇదంతా నాకెందుకన్నది వేరే విషయం – మామూలు క్యూరియాసిటీ కొద్దీ చదివానంతే. ఈ వ్యాసాలన్నీ – ముఖ్యంగా రెండో,మూడో భాగాలవి – చదువుతూ ఉంటే : ఒక పుస్తకాన్ని పరిచయం చేసేటప్పుడు ఎలా రాయాలి? అన్నది బాగా అర్థమైంది (గత నాలుగేళ్ళుగా బ్లాగులోనూ, సంవత్సరమున్నరగా పుస్తకం.నెట్ లోనూ పుస్తకాలను గురించి రాస్తూనే ఉన్నాననుకోండి – కానీ, ఎలా రాయాలి అన్నది నాకు తెలీదు).

హూమ్ – మొత్తంగా పుస్తకం గురించి చెప్పాలంటే – కొన్ని అచ్చుతప్పులు, ఒకట్రెండు చోట్ల రిపిటీషన్ తప్పిస్తే – నాకు విపరీతంగా నచ్చింది. అలాగని నేనేదో పుస్తకం మొత్తాన్నీ ఔపోశన పట్టేశానని కాదు. సాధారణంగా ఈ లిటరరీ వ్యాసాలు – అకడెమికం అయినా కాకున్నా – రెండుమూడు సార్లు చదవలేము – అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ, చాలామటుకు ఈ వ్యాసాలు రెండుమూడు సార్లు చదివినవే. అయినా, బోరు కొట్టలేదు నాకు 😉 ఒక్కటే లోటేమిటంటే – ఒక్కోసారి బ్లాగులో వ్యాఖ్యల ద్వారా బోలెడు సంగతులు తెలుస్తాయి. ఇక్కడ అది మిస్సైపోతాం 🙁

You Might Also Like

7 Comments

  1. pavan santhosh surampudi

    మీరిచ్చిన రెండు లంకెలు డెడ్ ఎండ్స్ లా ఉన్నాయి. దయచేసి మరో మార్గం చూపండి. నాకు నోరూరిపోతోంది. ప్లీజ్.

    1. సౌమ్య

      ఈ వ్యాసం వచ్చిననాటికీ, ఇప్పటికీ మధ్య లంకెలు మారినట్లు ఉన్నాయి. వ్యాసమాలతి రెండోభాగం కూడా వచ్చింది తరువాత. తాజా లంకెలను ఉంచాను..ఇప్పుడు చూడండి.

    2. pavan santhosh surampudi

      thank you

  2. పుస్తకం » Blog Archive » 2010 – నా పుస్తక పఠనం కథ

    […] చరిత్రపై చిన్న చిన్న వ్యాసాలు వ్యాసమాలతి – నిడదవోలు మాలతి : పాతతరం తెలుగు […]

  3. Vaidehi Sasidhar

    అన్ని వ్యాసాలనూ ఒక చోట చేర్చటం చాలా బావుంది. అందువల్ల వ్యాసాల విస్తృతి,విషయాలలో వైవిధ్యం స్పష్టం గా తెలుస్తుంది.సౌమ్య చెప్పినట్లు వివిధ రచయితల మీద పరిచయవ్యాసాలు ఒక్కచోట చదవగలగటం ఇందులోని చక్కటి సౌలభ్యం.
    మాలతి గారికి అభినందనలు.

  4. malathi

    . Thanks, సౌమ్యా.
    @ పుస్తకం.నెట్‌కి ఇవ్వొచ్చుగా – :). Pustakam.netకి ఇవ్వకపోయినా పెద్ద మనసు చేసి, పరిచయం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
    పోతే, ఈసంకలనంలో నాలుగు వ్యాసాలు పుస్తకం.నెట్‌లో ప్రచురించినవి. మిగతావి ఇవ్వకపోవడానికి లేక, నాకు ఉత్సాహం తగ్గడానికి కారణాలు – మొదటిది హోంపేజి ఫార్మాట్. రెండోది expsoure. రెండేళ్లు దాటకుండా మీసైటుకి రెండు లక్షల హిట్స్ రావడం ఘనమయిన విషయమే. కానీ విడివిడిగా ఒకొక వ్యాసం తీసుకుంటే, దానికి మీరిచ్చే expsoure.చాలా తక్కువనే నాకు అనిపిస్తోంది. మొదటిరోజు ముందుపేజీలో రెండుసార్లు కనిపించినా నాలుగోనాటికి అడుగున పడిపోతుంది. ఆతరవాత నేను రెండువారాలు ఎదురు చూడాలి నాసైటులో పెట్టుకోడానికి అంటే నాకు ఉత్సాహంగా లేదు మరి. :(.
    ఈవిషయంలో ఇతర పాఠకులూ, రచయితలూ ఏమంటారో తెలసుకోవాలని ఇక్కడ చెప్తున్నా ఈవిషయం.
    మరొకసారి, ఓపిగ్గా నావ్యాసాలు చదివి ఈ పరిచయం చేసినందుకు సంతోషం.
    — మాలతి

Leave a Reply