స్వీయచరిత్రము – చిలకమర్తి లక్ష్మీనరసింహము

రాసిన వారు: Halley
**********************
స్వీయచరిత్రము – చిలకమర్తి లక్ష్మీనరసింహము
మొదటి ప్రచురణ : 1944
ప్రాచి పబ్లికేషన్స్ : 2007
వెల : 125/-

నాకు మొదటి నుంచి ఆత్మకథలు చదవటం అంటే చాలా ఇష్టము . ఆ ఇష్టము మరింతగా పెరగటానికి ఈ పుస్తకం దోహదపడింది . అందుకనే ఈ వ్యాసం వ్రాస్తున్నాను. చిలకమర్తివారు ఎవరు వారి గొప్పతనం ఏమిటి అని అనుమానం ఉన్నవారు వెంటనే ఈ లంకెను చూడండి . మొదటి పేజీలలో ఆయన గురించి చాలా చక్కగా వ్రాసివుంది.

ఇదేదో నేను “హె హె హె .. హేవిషీ మీకు చిలకమర్తివారు ఎవరో కూడా తెలీదా ! ” అని దెప్పుతూ చూపిస్తున్న లంకె కాదు . వారి గురించి టూకీగా రెండూ మూడు పేజీలలో వ్రాసి ఉంది ఆ లంకె తాలూకా పుస్తకంలో. “A brief biographical sketch” అనుకుంటా ఆ అధ్యాయం పేరు.

ఈ పుస్తకం చదవకముందు నాకు ఆయన గురించి ఏదో చాలా తెలుసు అని కాదు . ఏదో తెలుగు పుస్తకాలలో అక్కడక్కడ చదివిన ఙ్ఞాపకం అంతే. ఈ వ్యాసం కొంచెం అసంపూర్ణమే ఎందుకంటే ఇది కాకుండా నేను ఆయన పుస్తకం ఏదీ చదివినది లేదు . నాకు పద్యాలంటే మక్కువ ఎక్కువ కూడా కాదు కాబట్టి ఆయన పద్యాలని విశ్లేషించేంత తెలివి నాకు లేదు , అందువలన ఆయనలోని కవిని గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. అయితే ఈ పుస్తకం చదివాక నాకు నచ్చిన కొన్ని చిన్న చిన్న అంశాల గురించి మాత్రమే ఈ వ్యాసంలో పేర్కొంటున్నాను.

ఈ పుస్తకం అంతా గ్రాంథికంలోనే ఉంటుంది . అయితే మొదట బాగా ఇబ్బందికి గురి చేసినా తర్వాత్తర్వాత పెద్ద సమస్యగా యేమీ ఉండదు . కాబట్టి నా తరంవారు ( రాజీనామా గ్రాంథికం , రిజైన్ వ్యావహారికం అని అనుకొను తరం 🙂 ) కూడా నిస్సంకోచంగా చదవచ్చు. ఇక్కడ ఒక తమాషా ఉన్నది , ఈ పుస్తక ప్రచురణకర్తలు “పరిచయం”లో ఇలా రాసారు – “ఈ పుస్తకంలో కూడా శ్రీ లక్ష్మీనరసింహముగారు గ్రాంథికవాదమును సమర్ధించుతూ రాసారు . శ్రీ లక్ష్మీనరసింహముగారికి వినమ్రులవుతూ , మేము వ్యావహారికభాషావాదులమనీ వారి గ్రాంథికవాదానితో ఏకీభవించలేమని విన్నవించుకుంటున్నాము” 🙂 .

దినచర్యాగ్రంథముల (Diary) సహాయం లేకుండా ఒక డెబ్బది అయిదు యేళ్ళ వయసు గల వ్యక్తి కేవలం తన ఙ్ఞాపకశక్తి ఆధారంగా జీవితచరిత్ర రాయాలని అనుకోవటం ఒక ఎత్తయితే ఆద్యంతం చదివించే తీరులో దానిని రూపొందించటం మరొక ఎత్తు . అవతారికలో లక్ష్మీనరసింహము గారు స్యయంగా చెప్పినట్టు – “నేను అంధుడనగుటచే అట్టి గ్రంథములు వ్రాయాలేకపోతిని . కాబట్టి ఈ గ్రంథంము వ్రాయుటకు పూర్తిగా పరమేశ్వరుడు నాకిచ్చిన ఙ్ఞాపకశక్తి ఒక్కటే ఆధారము .. ” (ఇన్ని గొప్ప పనులు చేసిన లక్ష్మీనరసింహముగారికి చూపు లేదు అని తెలుసుకున్న మొదటిసారి నిజంగా ఆశ్చర్యమేసింది నాకు ). నాలుగు మాసాలు ఆయన చెపుతూ ఉంటే ఒక గుమాస్తా వ్రాశారట ఈ పుస్తకాన్ని . అప్పటికి లక్ష్మీనరసింహముగారి చూపు పూర్తిగా సన్నగిల్లిందట.

1860-1940 కాలంనాటి లక్ష్మీనరసింహముగారి అనుభవాలసారం ఈ పుస్తకం . ఆ నాటి సంఘసంస్కరణోద్యమాలు వాటిలో లక్ష్మీనరసింహముగారి పాత్ర, తెలుగు వాఙ్మయం , సామాజిక పరిస్ఠితులు , నాటక సమాజాలు వాటిలో లక్ష్మీనరసింహముగారి పాత్ర , స్వాతంత్రోద్యమం, లక్ష్మీనరసింహముగారి రచనల పుట్టుపూర్వోత్తరాలు వగైరాతో ఒక చక్కని ప్రయాణంలా సాగిపోతుంది ఈ పుస్తకం . ఇవికాక కందుకూరి వీరేశలింగం , టంగుటూరి ప్రకాశం వగైరా మహానుభావులతో లక్ష్మీనరసింహముగారికి ఉన్న అనుబంధం వగైరా గురించి కూడా చక్కగా చెప్పారు.

ఇవియును కాక పుస్తకం చివరి పేజీలో చుపినట్టు అక్కడక్కడా నిస్సింకోచంగా నిక్కచ్చిగా వివిధ అంశాల గురించి ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేసిన తీరు చాలా బాగుంది.
ఉదాహరణకు ఒకసారి Macmillan కంపెనీ వారు నాలుగు అయిదు తరగతులకు తెలుగు పుస్తకములు వ్రాసి తమ కంపెనీకి ఇవ్వమని లక్ష్మీనరసింహముగారిని అడిగారట . తగిన సొమ్ము ఇస్తానని కూడా చెప్పారట. దానికి లక్ష్మీనరసింహముగారు ఇలా సమాధానం చెప్పారట “ఆంగ్లేయులు మన దేశములోని గనులవలనను , టీ కాఫీల వల్లను , రైలుబండ్లవల్లను మరి ఇతరసాధనముల వల్లను ధనమంతయూ పట్టుకొని పోవుచున్నారు . తెనుగుదేశములో పుట్టి తెనుగు ముక్కలు నాలుగు వ్రాయనేర్చిన మనము , తెనుగు పుస్తకముల వలన వచ్చిన లాభముననుభవించకుండ నదిగూడ నాంగ్లేయులకే ఈవలెనా ? నేనెప్పుడు నింగ్లీషు కంపేనీలకు గ్రంథములు వ్రాసి ఇవ్వను . స్వదేశీయులెవరేని జేరి యొక కంపెనీ పెట్టిన పక్షమున వారిని వ్రాసి ఇచ్చెదను . లేదా నాకు నేను వ్రాసుకొనెదను” . మన గ్లోబలైజేషన్ యుగములో ఈ వ్యాఖ్యలు చాలా మందికి వింతగా అనిపిస్తాయో ఏమో !.

పుస్తకం అంతా సీరియస్ అని భ్రమ పడేరు ! మచ్చుక్కి లక్ష్మీనరసింహముగారి పద్యాలు కొన్ని వదులుతా చూడండి మరి ! ….
1890 కాలంలో ఎవరో ఒకమారు లక్ష్మీనరసింహముగారిని “పకోడీల” మీద పద్యం వ్రాయమని అడిగారట . పద్యానికి ఒక పకోడీ బహుమానంగా ఇస్తాము అని కూడా చెప్పారట . “కవుల కక్షర లక్షలిచ్చెడి కాలము గతించినది !. పద్యమునకు పకోడిలు ఇచ్చెడి దుర్దినములు వచినవని” ప్రత్యుత్తరమిచ్చి ఆయన ఆశువుగా చెప్పిన పద్యములలో నేను మెచ్చినవి .. ఏ కష్టం లేకుండా ఠక్కున నాకు అర్థం అయినవి కొన్ని (పుస్తకంలో ఈ పకోడి పద్యాలు యేడు ఉన్నాయి) .

క|| ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ యా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందులేవు నిజము పకోడీ !

ఇక రామాయణానికి పకోడీకి లంకె పెట్టిన చందము చూడండి

క|| ఆ రామానుజు డా గతి
పోరున మూర్ఛిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి యెరుగడు గాక య
య్యారె నిను గొనిన బ్రతుకడటవె పకోడీ !

ఇది కాక మరి ఒక పద్యములో కోడికి పకోడికీ లంకె పెట్టిన తీరు చూడండి .

క|| కోడిని దినుటకు సెలవున్
వేడిరి మున్ను బ్రాహ్మణులు వేధ నతండున్
కోడి వలదా బదులు ప
కోడిం దిను మనుచు జెప్పె కూర్మి పకోడీ !

ఇక లక్ష్మీనరసింహముగారి గురించి చెబుతూ వారికి జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిన రెండు పద్యాలని మీకందరికీ గుర్తు చేయకుండా ఈ వ్యాసం ముగిస్తే బాగోదు !
ఇది చాల మంది తెలుగు పాఠ్యపుస్తకాలలో చదువుకొనే ఉంటారు !. బిపన్ చంద్ర పాల్ గారు 1906 ప్రాంతములో మన దెగ్గరకు వచ్చినప్పటిది ఇది .

తే.గీ భరతఖంఢంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి .

ఇది కాకుండా 1907లో లాలా లజపతి రాయ్ గారిని బర్మాలో ఖైదు చేసినపుడు వ్రాసిన మరొక పద్యం :

తే.గీ భరతఖండంబె యొక గొప్ప బందెఖాన
అందులోనున్న ఖయిదీలు హిందుజనులు
ఒక్క గదినుండి మార్చి వేరొక్కగదిని
బెట్టుటెగాక చెరయంచు వేరెగలదె

ఇన్ని విశేషాలుగల పుస్తకం చదవండి మరి ! . నేను కొన్నది హైదరాబాదు విశాలాంధ్రలో 2007 లోఅనుకుంటా .

You Might Also Like

5 Comments

  1. డా. మూర్తి రేమిళ్ళ

    nenu ee madhyane koni kontha chadivi, vere lokam lo padipoyenu. mallee bayataku tiyyaali.

  2. సౌమ్య

    Hmm – Will check out sometime soon then 🙂

  3. bollojubaba

    interesting

    i wonder and appreciate mr. hally for his appreciation of an old literary giant.

    why i wonder because i became sick and cynical about the present generation in this aspect in a discussion about Sri.chilakamarthi.

    http://jeedipappu.blogspot.com/2009/05/blog-post_14.html

    bollojubaba

    sorry for english

  4. mandaakini

    @halley,
    తప్పక చదవాలి.
    @ravi,
    మీ దగ్గర ఖజానానే ఉన్నట్టుందే!

  5. రవి

    నా దగ్గర ఉన్న పుస్తకం అట్ట ఈ రకంగా లేదు. ముదురు ఎరుపు రంగులో ఉంది.:-).

    ఎంచేతనో మొదలెట్టి, పక్కన బెట్టాను. ఇప్పుడు మళ్ళీ బయటకు తీయాలి.

Leave a Reply