Everything Happens for a Reason and Other Lies I’ve Loved

మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ మంచి చదువరి. ఆరునెలలకి ఒకసారి ఆయన గేట్స్ నోట్స్ అన్న తన వెబ్సైటులో పుస్తకాల జాబితాలు విడుదల చేస్తూ ఉంటారు. అలా గత వారం సమ్మర్ రీడింగ్స్ అని ఒక ఐదు పుస్తకాల గురించి రాశారు. ఆ పోస్టులో ‘Everything Happens for a Reason and Other Lies I’ve Loved’ అన్న పుస్తకం గురించిన రాసినది నన్ను ఆకర్షించింది (ఆయన వివరంగా రాసిన సమీక్ష ఇక్కడ). ముప్పైలలో ఉన్న క్రిస్టియన్ మతాన్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్ కేట్ బౌలర్ కి స్టేజ్ ౪ క్యాన్సర్ అని తెలిశాక ఆమె అనుభవాలు, ఆలోచనల సంకలనం ఈ పుస్తకం.

ఇలా పరిచయం చేశాక, నా మనసులో మెదిలిన ఆలోచనలు రెండు:
– క్రిస్టియన్ మతాన్ని అధ్యయనం చేసే మనిషి అంటే ఇంక ఆపకుండా దేవుడి గురించి, మతం గురించి వాయిస్తారేమో?
– క్యాన్సర్, అదీ ముప్పైలలో అంటే‌ పాపం ఎలా ఉండి ఉంటుందో? ఏం చదవాల్సి వస్తోందో?‌
ఇదివరలో ఇలా క్యాన్సర్ అని తెలిశాక ఇతరులు రాసిన పుస్తకాలు చదివాను. ఉదా: Randy Pausch “the last lecture”, Paul Kalanithi రాసిన “When Breath Becomes air”, Brian Fies రాసిన గ్రాఫిక్ నవల “Mom’s Cancer” ఇప్పటికి వెంటనే తట్టినవి. మొదటిది నాకు పదేళ్ళ క్రితం చదివినపుడు చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. రెండవది – రచయిత శైలి బాగా నచ్చినా, పుస్తకం పెద్ద గొప్పగా అనిపించలేదు. మూడవది కొంచెం ఎమోషనల్ గా కదిలించింది. ఇలా నేను చదివినంతలో ఈ నేపథ్యంలో వచ్చిన పుస్తకాలు రకరకాల స్పందనలు కలిగించాయని చెప్పాలి. ఇలాంటి ఆలోచనలతో పుస్తకం మొదలుపెట్టాను.

కేట్ బౌలర్ కి గొప్ప హాస్య చతురత ఉంది. అది పుస్తకం ఆద్యంతం కనిపిస్తూనే ఉంటుంది. బాగా బాధ కలిగించే విషయాలు చెబుతున్నప్పుడు కూడా అక్కడో‌ వాక్యం, ఇక్కడో వాక్యం మనల్ని నవ్వించక మానదు. పైపెచ్చు, “దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు”, “నువ్వేదో పాపం చేసి ఉంటావు, ఇది ప్రతిఫలం”, “బీ బ్రేవ్”, “నా కంటే నీ పరిస్థితి నయం”, “don’t give up” – ఇలా అన్ని రకాల శ్రేయోభిలాషుల స్పందనల గురించి ఎక్కడికక్కడ వ్యంగ్యాస్త్రాలు కూడా ఉన్నాయి. ఏ కాస్త మనుషులతో సంబంధాలున్నా ఇలాంటి మాటలు ఒకటీ అరా మనము అనే ఉంటాము ఎవరో ఒకరితో. మనతోనూ ఎవరో ఒకరు అనే ఉంటారు, మనం మనసులో “అబ్బ, చా!” అనుకునే ఉంటాము. అదంతా‌ ఈ రచయిత్రి మాటల్లో రీప్లే అయింది.

కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ సహాయానికి రావడం, పైగా ఈ‌తరహా దేవుడూ-పరీక్షా అనో, జాలి చూపడమో కాక ఆమెని మామూలుగా చూసి, ఏం జరగనట్లే మాట్లాడే వాళ్ళు ఉండడం అదృష్టమే. అయా వ్యక్తులతో సంభాషణలన్నీ నాకు చాలా నచ్చాయి. పుస్తకం నిండా క్రిస్టియన్ మత ప్రస్తావన చాలా ఉంది. నాకు నేను పుట్టి పెరిగిన మతమే పెద్ద పరిచయం, ఆసక్తి లేదు కనుక అది అసలు పరిచయం లేదు. అందువల్ల అసలావిడ ఏం రాస్తోందో, ఆ చర్చి గ్రూపులు ఏమిటో ఏం అర్థం కాలేదు. కానీ, అది పుస్తకాన్ని చదవడానికి అవరోధం అయితే కాదు. నా లైఫ్ గొప్పగా‌ ఉంది, నేను స్వశక్తితో ఇదంతా సాధించాను. మనిషి తల్చుకుంటే సాధించలేనిది లేదు. నీకు ఫలానాది రాలేదంటే నువ్వు దానికోసం ప్రయత్నం చేయలేదనే – ఇలాంటివి వింటూంటే అలా అనుకోవడం జీవితంలోని randomness గురించి అజ్ఞానమే అని ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, ఏదన్నా నా ప్రమేయంలేని setback జరిగినపుడు (అదే, దురదృష్టకర సంఘటనలు ఉంటాయి కదా, అలాంటివి కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డప్పుడు). ఈ పుస్తకం చదువుతూ ఉంటే అలాగే అనిపించింది. ఇలాంటి మాటలు రచయిత్రి మత సంబంధంగా వాడుతుంది (అన్నింటికి దేవుడున్నాడు, దేవుడు నీ వెంటే ఉంటాడు, నీకేం‌ జరిగినా కాపాడతాడు, ఇదొక పరీక్ష, ప్రార్థనల వల్ల అన్నీ పరిష్కారమవుతాయి తరహా వాక్యాలు) కానీ, అది అదృష్టం గురించి అనిపించింది నాకైతే.

ఇదంతా ఎందుకు? చదవాలా వద్దా?: రచయిత్రి హాస్య చతురత, శైలి రెండింటి వల్లా పుస్తకం రీడబిలిటీ బాగా పెరిగిందని నా అభిప్రాయం. ప్రస్తుతం జీవితంలో సమస్యలు అవీ లేకుండా సాఫీగా సాగిపోతూ, వృత్తి/వ్యక్తిగత జీతివాల్లో ఆనందించదగ్గ అంశాలు, విజయాలు తరుచుగా వస్తూ ఉంటే ఈ పుస్తకంలో రచయిత్రి వ్యక్తం చేసిన అభిప్రాయాలు అంతగా రుచించకపోవచ్చు – ‘she did not try hard enough’ తరహాలో అనిపించవచ్చు. జీవితం ఇలా లేని పక్షంలో బహుశా ఈ పుస్తకం నచ్చవచ్చు, కొంచెం నవ్వించవచ్చు.

You Might Also Like

Leave a Reply