పుస్తకం
All about booksపుస్తకభాష

November 16, 2017

Ramayana stories in South India – An Anthology: Paula Richman

More articles by »
Written by: Purnima
Tags:

కథ ఎవరిది?

రామునిదా? దారి పోయే దానయ్యదా? అని కాదు. అది కథ వింటే, చదివితే తెలిసిపోతుంది.

కథపై హక్కులు ఎవరివి అని కూడా కాదు. అది ఎటూ కథ చెప్పిన / రాసిన వాళ్ళకే ఇస్తుంది లోకం.

కథ ఎవరి సొంతం? ఒకరికే సొంతమా? ఒకరికి మాత్రం ఎక్కువ సొంతమా?

నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ఒకటి – ది ఫాల్ లో, ఒక చిన్న పాపకి డిప్రషన్లో కొట్టుమిట్టాడుతున్న ఒకడు కథ చెప్పటం మొదలెడతాడు, వాడి అవసరం కోసం. వాడి డిప్రెషన్ ఎక్కువయ్యే కొద్దీ కథనంతా సైకోగా మార్చేస్తుంటాడు. అప్పుడా పిల్ల అడ్డు పడి, “ఏం? ఇది నీ కథని ఇష్టమొచ్చినట్లు చెప్పుకుంటూ పొతే చూస్తూ ఊరుకుంటానా? ఇంత సేపూ, ఇంత  శ్రద్ధగా విన్నాక ఇదిప్పుడు నా కథ కూడా తెలుసా? ” అంటూ కథ మధ్యలో దూరి, వాడు నాశనం చేస్తున్నవన్నీ ఇది సరిచేసుకుంటూ పోతుంది.   

రామాయణం వాల్మీకి సృష్టి అని ఒక నమ్మకం. వాల్మీకికి ఒక కథ ఉంది.  అసలు  వాల్మీకే  ఒక  కథ అయ్యుండచ్చన్న వాదన కూడా ఉంది.

“కథ అందరికి తెలిసిందే. అంతరార్థం ఎందరికి తెల్సు?”  అంటూ మొదలయ్యే  పౌలా రిచమన్  పుస్తకంలో  రామాయణంలోని అంతరార్థాన్ని వెతుకుంటూ దక్షిణాదిన ఎందరో కవులు, రచయితలూ, నాటకకర్తలు, జానపద సేకరణకర్తలు చేసిన ప్రయత్నాలున్నాయి .

పౌలా రిచమన్ సుదీర్ఘ పరిచయ వ్యాసంలో పుస్తకంలో ఏయే కథలు ఉన్నాయి, వాటిని ఏ పద్ధతిలో పొందుపరిచారు, ఏయే కారణాల వల్ల  వాటిని ఎంచుకున్నారు, ఏ కథలు ఏ కారాణాల వల్ల  వదిలేశారు వంటివి వీలైనంత వరకూ వివరిస్తూ, భారతేతరులు అర్థం చేసుకోడానికి వీలుగా వాల్మీకి రామాయణంలో ముఖ్య ఘట్టాలను చెప్పుకొచ్చారు. మొత్తంగా మూడు నాలుగు థీమ్స్ తీసుకోని, ఒక్కక్కదానికి  సరిపడే కథలు, కవితలు, నాటకాలు, గేయాలు  ఏర్చికూర్చారు. అవి ఎట్లా ఉంటాయి అంటే…

“ఎందుకు? సీత ఎందుకు అగ్నిప్రవేశం చెయ్యాలి?”

“అగ్ని కన్నా పవిత్రమని నిరూపించుకొని కూడా ఎందుకు అడివికి పోవాలి?”

“సూర్పనఖ కేవలం ఒక plot device  మాత్రమేనా? అంతేనా?”

“అనుమానించినవాడి ప్రేమకన్నా ఆధారించినవాడి ప్రేమ గొప్పది ఎందుకు కాదు?”

“రావణుడికి సీత ఏమవుతుంది? శత్రువుని భార్య? ప్రేమించిన వ్యక్తి? శిష్యురాలు? కూతురు? తల్లా?”

“అహల్యను అర్థం చేసుకొని కొత్త ప్రాణాన్ని పోసిన రాముడు, సీతను ఎందుకు వదిలేయటం?”

“ఇప్పుడు, ఇక్కడ, మన మధ్యన అహల్య-రామ-రావణుల కథ చెప్పరేం?”

“నో.నో.నో. తప్పస్సు చేసుకుంటున్న వాడిని చంపేంత కఠినాత్ముడా రాముడు?”

ఇలా ఎదురుతిరిగి అడిగిన ప్రశ్నల్లోంచి పుట్టుకొచ్చిన భావావేశాలు ఈ రచనలు.

“ఇలాంటి ప్రశ్నలు అడక్కూడదు.”

“అసలు వీళ్ళు రామాయణం క్షుణ్ణంగా చదివినవాళ్లేనా?”

“#రామాయణంలోపిడకలవేట”

“అందులో ప్రతిదానికి ఒక అర్థముంది. అది అర్థం చేసుకోకుండా ఏవో “ఇజాలు” వెనుక నక్కి, కథనంతా భ్రష్టు పట్టిస్తున్నారు!”

లాంటి స్పందనలు కూడా రావచ్చు కొందరినుండి. అలాంటి వాళ్ళు కథ కథకుడిదే! ఇంకెవ్వరూ ఏమీ అనకూడదు అని అంటారు.

కానీ, కథ అంటేనే కదిలేది. కదిలించేది. పదిమందికి చేరనది, పదిమంది తిరిగి ఇంకో పదిమందికి చెప్పనది కథలెలా అవుతుంది?

పుస్తకంలో ఇన్ని కథలు, ఇన్ని రకరకాల interpretations చదివాక మాత్రం ఒకటే అనిపించింది. For every Indian who grew up on this story, Ramayana is deeply personal. At the risk of sounding like a social media meme, Ramayana is not a story, it is an emotion. నచ్చిందా? నచ్చలేదా? పేచీలు ఉన్నాయా? అన్న ప్రశ్నలకు మించినదేదో ఉంది ఈ  రచనల్లో. ప్రతి రచన చదివించింది, ఆలోచింపజేసింది. రామాయణమే కథకున్న బలాన్ని పదేపదే చాటిచెప్పింది ప్రతి రచనా.

ఇందులో నాకు ముఖ్యంగా కన్నడ కవి కువెంపు రాసిన “సూద్ర  తపస్వి” అన్న కావ్యం – మూల కథల్లో రాముడొక సూద్రుణ్ణి చంపాడని కోపంతో రాముని మీద విరుచుకుపడకుండా, రాముడిలా ఎప్పటికి చెయ్యడు అనే సహానుభూతితో రాసిన కావ్యం.  ఈ పుస్తకంలో ముఖ్య ఘట్టాలు మాత్రమే ఇచ్చారు కానీ, మొత్తం కావ్యం చదవాలనిపించేలా ఉంది.

ఎన్ . ఎన్ మాధవన్ రాసిన మలయాళీ కథ “Domestic Abuse and the Neurologist”, రామాయణంలోని అహల్యా, రాముడు ఈ కాలంలో పుడితే ఎలా ఉంటుందన్న ఊహతో రాసిన కథ. ఇందులో అహల్య పాత్ర చిత్రీకరణ భలే ఉంది. “నాకు శరీరం మాత్రమే ఉన్నట్టు, మెదడు లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నాకు దెయ్యం అవ్వాలని భలే కోరిక” అంటుంది.

తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి రాసిన “Gender Reversal” అనే పంచతంత్రం కథలా నడుస్తుంది. భలే హాస్యంగా ఉంటుంది. ఈయన కవనే తెల్సుగాని వ్యంగ్యం ఇంత బా రాస్తారనుకోలేదు. పైగా ఇప్పటిలా నాజూకైన పరిస్థితులు అప్పుడు లేవో, ఉన్నా రాయాలనుకున్నది రాసారో గాని, ఈ  సంకలనంలో చాలా కథలు సూటిగా, మొహం మీద కొట్టినట్టు ఉండేవి కూడా ఉన్నాయి.

మన తెలుగు రచయితల్లో చలం, వోల్గా, కవన శర్మ రచనలు ఉన్నాయి. వెల్చేరు నారాయణ రావు అనువదించిన జానపద గేయాలు కూడా ఉన్నాయి.

చాలా వరకూ కథలూ, కవితలూ నాకు వేరే విధంగా పరిచయమై ఉండేవేమో గాని, ఈ పుస్తకం వల్లే తెల్సుకున్న రెండు ఆణిముత్యాలున్నాయి. ఒకటి,  మలబారు ముస్లిములు పాడుకునే మప్పిలా రామాయణం గురించి. బి.ఆర్ చోప్రా తీసిన మహాభారతానికి రాహి  మాసూమ్ రాజా అనే ముస్లిం ఆయనే కథ, మాటలూ రాస్తున్నందుకు కొందరు గొడవ చేశారు. అప్పుడాయన, “నాయనాల్లారా! ఈ నేలలో పుట్టాను. గంగ ఒడ్డున ఆడుకున్నాను. ఇక్కడి కథలు నావి. నావి కాదనే హక్కు ఎవ్వరికి లేదని.” ఆ మాటనే ఈ  మప్పిలా రామాయణం కూడా గుర్తుచేస్తుంది. ఇది కూడా excerpt మాత్రమే ఇచ్చారు. అయినా దీని విలువ గురించి తెలిసేంత బాగా వివరించారు.

రెండోది,  మలయాళీ సినీ దర్శకుడు తీసిన “కాంచన సీత” అనే సినిమా. ఇందులో సీత పాత్ర మనిషి వెయ్యలేదట. (అట ఎందుకంటే నాకింకా నమ్మబుద్ధి కావటం లేదు.) సీతారాముల్లో సీత ప్రకృతి , రాముడు పురుషుడు అన్న అనుకోలు ముందు నుంచి ఉన్నా, ఈయన ఏకంగా సీతను ప్రకృతిలో చూపించారట.  మన ఆంధ్రా అడువుల్లోనే షూటింగ్ చేశారట.

ఏదైనా కథలో మనం ముఖ్యంగా పాత్రల మధ్య సంబంధాలు గుర్తిస్తాం. అంటే రాముడు సీత మధ్య అన్యోన్యత, రాముడు రావణుని మధ్య వైరం, రాముడు లక్ష్మణుడు మధ్య అనుబంధం వగైరా, వగైరా. కానీ కథలో పరిసరాలకు, వస్తువులకు, పాత్రలకి మధ్య కూడా సంబంధాలు ఉంటాయి. పై సినిమా గురించి చదివినప్పుడే కాదు, తక్కిన కథలు, కవితలు చదివినప్పుడు కూడా రామాయణంలో ముఖ్యమైన పాత్ర అడవి-ప్రకృతి అని అనిపించింది. రామాయణమంతా ఒక పెద్ద చెట్టు నీడలో జరుగుతుంది అనే భావన కలిగింది.

నేను పైన చెప్పిన సినిమా కథలానే, ఈ  రచనలు ఎలా ఉన్నాయంటే, రామాయణం నాటకం జరుగుతుంటే, ప్రేక్షకులు నాటాకాన్ని pause చేసి, గబగబా స్టేజి పైకి ఎక్కి, పాత్రలకి (నటులకి కాదు) మేకోవర్ చేసి, డైలాగులు లేనివాళ్ళకి డైలాగులిచ్చి, వెనుకున్న వాళ్లకి ముందుకు తెచ్చి, ముందున్న వాళ్ళని సైడ్ కర్టెన్ పక్కకి పెట్టి, ఒకళ్ళ సమస్యలో ఇంకోళ్ళని నిల్చోబెట్టి – ఇలా ఎన్నెన్నో చేసి పాత కథనే ఎంతో కొత్తగా చెప్పారు.

These are not mere re-tellings. These are re-examinations,retrospects, re-imaginations, resonances and re-assurances.

ఈ  మధ్యకాలంలో రెండు రామాయణ ఆధారిత నాటకాలు చూసాను. ఒకటి “చిత్రపట రామాయణం” అనే యక్షగానం. రెండోది, మాయ కృష్ణ రావు చేసిన “రావణామ”. రెంటిలోనూ రామాయణ కథలు నాకు తెలియనివి. లవకుశ సినిమా కథ తెల్సు గాని, పట్టాభిషేకం తర్వాత సూర్పనఖ అయోధ్యకు వచ్చి, మాయతో సీతను చేరుకొని, ఆమె చేత రావణుని చిత్రపటం గీయించి, దానికి ప్రాణం పోసి, రామునితో అనుమానాలు రేపి, సీతను అడవికి పంపేలా చెయ్యటం మొదటి దానిలో కథ. రెండోది, కథల సంహారం. ఇందులో, రావణుని గురించిన అనేక కథలు ఉంటాయి. యుద్ధానంతరం రావణుడు అడవిలో పక్షిగా మారాడని, సీత రావణుని తండ్రిగా సవీకరించి అతని దగ్గర వీణ నేర్చుకుంటుందని నేను ఎప్పుడూ వినని కథలు ఉన్నాయి. ఈ  రెండు నాటకాలూ జానపద కథల ఆధారంగా రాసినవి అని తెల్సి, అసలు ఆటలాంటి కథలు ఏమేమున్నాయో తెలుసుకోవాలనే కుతూహలంతో గూగుల్ చేస్తుంటే, ఈ  పుస్తకం దొరికింది. చిత్రపట రామాయణం మన తెలుగు జానపద గేయాల్లోని కథని తెల్సింది. రావణుడు పక్షిగా పుట్టటం, సీతకు వీణ నేర్పటం కూడా ఒక తమిళ కథలో ఉన్నాయి.

పౌలా రిచమన్ సుదీర్ఘ పరిచయ వ్యాసం బాగా ఉపయోగపడింది, ఈ  రచనల్ని వాటి నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి.  పుస్తకంలో ఏయే కథలు ఉన్నాయి, వాటిని ఏ సెక్షన్ లో పొందుపరిచారు, ఏయే కారణాల వల్ల  వాటిని ఎంచుకున్నారు, ఏ కథలు ఏ కారాణాల వల్ల  వదిలేశారు వంటివి వీలైనంత వరకూ వివరిస్తూ, భారతేతరులు అర్థం చేసుకోడానికి వీలుగా వాల్మీకి రామాయణంలో ముఖ్య ఘట్టాలను చెప్పుకొచ్చారు. ఫుట్ నోట్స్ కూడా సహాయపడ్డాయి.

“కథ అందరికి తెలిసిందే. అంతరార్థం ఎందరికి తెల్సు?” అనే తమిళ నానుడి తో మొదలయ్యింది  ఈ పుస్తకం. ఆ అంతరార్థం కొంతైనా అవగతవుతుంది ఈ పుస్తకం చదివితే.

 About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..One Comment


  1. nagamurali

    చాలా ఆసక్తికరమైన విషయానికి / పుస్తకానికి చక్కటి రివ్యూ వ్రాసారు. Thank you.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0