రచయిత్రి ఓల్గా తో సంభాషణ -2

‘ప్రతి అస్తిత్వాన్నీ గుర్తించి గౌరవించటమే స్త్రీవాదం ప్రత్యేకత’
(విముక్తి మార్గాన స్వేచ్ఛా ప్రస్థానంలో ప్రముఖ రచయిత్రి ఓల్గా తో సంభాషణ )

ఇంటర్వ్యూ : ఎ.కె.ప్రభాకర్

(ఈ ఇంటర్వ్యూ మొదట పాలపిట్ట పత్రికలో వచ్చింది. పుస్తకం.నెట్ కి పంపినందుకు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. ఇంటర్వ్యూని పుస్తకం.నెట్ లో రెండు భాగాలుగా వేస్తున్నాము. మొదటి భాగం ఇక్కడ.)
******************

‘విముక్త’ లో పురాణ పాత్రల్ని నమూనాలుగా తీసుకొని పురాణాలు ప్రతిపాదించిన విలువల్ని పునర్వ్యాఖ్యానించి యిప్పటి సమాజానికి అన్వయించే పద్ధతితో కథా రచనకి మీకు స్ఫూర్తినిచ్చిన అంశాలేవి?

పురాణ కథలను పాత్రలను ఆధునికావసరాలకు అనుగుణంగా రాయటం అనే పనిని ఎంతో మంది రచయితలు చేశారు. త్రిపురనేని రామస్వామి చౌదరి మొదలుకొని చలం , కొ కు ల మీదుగా ఇప్పటి సౌదా వరకూ ఎందరో రచయితలు పురాణాలలో వెలికిరాని దాగి వున్న సత్యాలను తమదైన దృష్టితో చూసే ప్రయత్నం చేశారు. కాబట్టి నేను చేసిన ఈ ప్రయత్నంలో కొత్తదనమేమీ లేదు. అయితే విషయపరంగా న్యాయాన్యాయాలను మాత్రమే ప్రశ్నించి ఊరుకోకుండా నా కథల్లోని పాత్రలు తాము అధికారాన్ని పొంది అణచివేత చట్రాల నుంచి విముక్తం కావటం అనేది ప్రత్యేకాంశమని నేననుకుంటున్నాను. అధికారం నుంచి విముక్తి అనేదే నా అన్వేషణ. దానికి సమాధానంగా పురాణ పాత్రలు నాకు ఉపకరించాయి. పురాణాలలో ఉండే విశ్వజనీనత, ఆ పాత్రలతో ప్రజలకు ఉండే పరిచయం – వీటివల్ల కథ ముందే తెలిసినదవటం వల్ల చెప్పదల్చుకున్న విషయం మీద దృష్టి కేంద్రీకరించగలుగుతాం. ఆ వెసులుబాటు నన్ను పురాణ పాత్రలు తీసుకునేలా ప్రేరేపించింది. ఆ పాత్రల్లో ఉన్న బలం నన్ను చాలా కాలం నుంచి ఆకర్షిస్తూనే ఉంది. ఆ పాత్రల మీద నాకున్న గౌరవం ఆ పాత్రల ద్వారా నేను చెప్పదల్చుకున్న అత్యంత విలువైన భావనలకు దోహదం చేసింది.

పరాధీనలైన పురాణ పాత్రల్ని – ఆధునిక స్త్రీ విముక్తికి మార్గ దర్శకులుగా మలచడంలో వైరుధ్యం లేదా? లేదా అది కూడా మీ రాజకీయ వ్యూహంలో భాగమేనా?

పురాణ పాత్రలు – ముఖ్యంగా విముక్తలోని సీత, అహల్య, శూర్పణఖ, రేణుక, ఊర్మిళ – మనమనుకున్నంత, మనకు కనిపించేంత పరాధీన పాత్రలు కావు. ఉదాహరణకి సీత చాలా బలవంతురాలు – శారీరకగా కూడా. శివధనుస్సును ఎత్తగలిగిన శక్తి ఆవిడది. కానీ దాన్ని ఉపయోగించనివ్వని సామాజిక పరిస్థితుల్లో ఆమె చిక్కుకుని ఉంది. అవసరమైనప్పుడు ఆ శక్తిని ఉపయోగించిన స్త్రీలు కూడా పురాణాలలో ఉన్నారు. రామాయణంలో కైక దశరథుని యుద్ధరంగంలో రక్షించింది. పురాణ రచయితలు ఏ విలువల కోసం ఈ పురాణాలు రాశారో ఆ విలువల ప్రకారం చూస్తే ఆ స్త్రీలు పరాధీనలుగా మాత్రమే కనిపిస్తారు. ఆ విలువలను దాటి వాటిని ప్రశ్నించుకుంటూ ఆ పాత్రల అంతరంగ శోధన చేస్తూ వెళ్తే వారి బలం, శక్తి మనకు అర్థమవుతాయి. ఇవాళ్టి స్త్రీలు కూడా ఈ సామాజిక పరిస్థితుల్లో తమ బలాలను శక్తులను అవసరమైనపుడు ప్రదర్శిస్తున్నారు. లేనప్పుడు పరాధీనలు అన్నట్లుగానే కనిపిస్తున్నారు. స్థూలంగా చూసినా సూక్ష్మంగా పరిశీలన చేసినా నా ఆ పురాణ పాత్రలు ఎదుర్కొన్న సందర్భాలకూ సంఘర్షణకూ ఇప్పటి ఆధునిక స్త్రీలు ఎదుర్కొంటున్న సందర్భాలకూ సంఘర్షణకూ ఎన్నో పోలికలున్నాయి. రూపాలు మారాయి గానీ సారాంశంలో అణచివేత మారలేదు. ఆధిపత్య స్వభావం మారలేదు. అందువల్ల పురాణ పాత్రల ద్వారా వర్తమాన స్త్రీల సమస్యలను చిత్రించటంలో వైరుధ్యం ఉందని నాకు అనిపించటం లేదు.

ఒకరకంగా ఈ పాత్రలు నేను చెప్పదల్చిన విషయానికి అనేక మంది ఆమోదం దొరికేలా చేశాయి. ఆ పధ్ధతి ఒక రాజకీయ వ్యూహంగా విజయం సాధించింది.

రాజకీయ కథలు రాసిన తొలినాళ్ళలో కఠినంగా వినిపించిన మీ గొంతు విముక్త వరకు వచ్చేసరికి స్థిరంగా శాంతంగా మంద్రంగా గంభీరంగా మారిందనిపిస్తుంది. దీన్ని మీరు యెంత వరకు అంగీకరిస్తారు?

ఆ మార్పు రాకపోతే ఒక రచయితగా నేను విఫలమైనట్లు అనుకుంటాను. నా జీవితానుభవాలూ సామాజిక చలనాల పరిశీలనా తాత్విక అన్వేషణా ఇవన్నీ నన్ను నా ఉద్రిక్తత నుంచి విముక్తం చేసి ఒక స్థిరమైన వాదనను బలంగా – అదే సమయంలో శాంతంగా వినిపించే పరిణతిని కల్పించాయని నేననుకుంటాను. ఏ రచయితకైనా ఇలాంటి మార్పు సహజమేనని కూడా అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ మార్పు అటునుంచి ఇటు జరగొచ్చు. ఉదాహరణకు తన తొలి రచనల్లో ఎంతో సంయమనం , ప్రేమ చూపించిన శరచ్చంద్రుడు శేషప్రశ్నలో మాత్రం కమల ముఖత: చాలా కఠినమైన ప్రశ్నలు కఠినంగానే అడిగించాడు. అంటే దీన్నిబట్టీ ఎక్కడ తమ రచనా పధ్ధతి మార్చుకోవాలి అనే వ్యూహం రచయితలకు తప్పకుండా ఉంటుంది. అది చాలా సార్లు పాఠకులూ గమనిస్తారు.

మీ తాత్త్విక అన్వేషణలో – అస్మిత కార్యకలాపాల ప్రసక్తి తెచ్చారు కదా! అసలుకు ‘అస్మిత’తో మీకెలా అనుబంధం యేర్పడింది? మీ రచనా వ్యాసంగాన్నీ అస్మితలో చేపట్టిన ఆచరణనీ యెలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? భావజాల రంగంలో పోరాటాన్ని సామాజిక క్షేత్రంలో విస్తృతపరచుకోడానికి మీకు అస్మిత యే విధంగా తోడ్పడింది?

80వ దశాబ్దంలో ఫెమినిస్టులుగా మేము ఒక్కొకరిగానో , అప్పటికప్పుడు అవసరాల రీత్యా పదిమంది కలిసి ఒక టీం గా ఏర్పడో సమస్యల మీద పనిచేస్తూ ఉండేవాళ్ళం. 87లో ఫెమినిస్టు స్టడీ సర్కిల్ పేరుతో స్త్రీవాద సిద్ధాంత చర్చలు చేసి పుస్తకాలు ప్రచురించి సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళం. మేమందరం మా మా ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడ దొరకిన ఖాళీ సమయాన్నీ డబ్బునూ ఈ పనులకు వినియోగించేవాళ్ళం. అయితే ఇట్లా చేయటం వల్ల ఎక్కువ మంది స్త్రీల దగ్గరకు వెళ్ళలేకపోతున్నామని , మా దగ్గరకు సమస్యల్లో ఉన్న స్త్రీలు రావటం కుదరటం లేదనీ మాకర్థమైంది. ఒక సంస్థ ఉంటే ఏం చేసినా ఏం చేయకపోయినా స్త్రీలు వచ్చి తమ బాధల్ని చెప్పుకుని ఓదార్పు పొందటానికి ఒక చోటంటూ ఉంటుందనిపించింది. సంస్థ అంటే ఒక నెలవు. అక్కడ రోజంతా ఉండి పనిచేసే కొందరు మనుషులు తప్పనిసరి. ఈ సంస్థని నిర్వహించటానికి డబ్బు అవసరం. దాన్ని విరాళాల రూపంలో సేకరించాలి. ఇట్లా పని చేద్దామా వద్ద అని మా మిత్రులం ఎన్నో రోజులు చర్చించాం. చివరకు విమర్శలు వస్తాయని తెలిసినా సంస్థను ప్రారంభించాలనుకున్నాం. ‘అస్మిత’ కు నేను వ్యవస్థాపక అధ్యక్షురాలిని. వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్, రుక్మిణి, విజయ, జమున, వకుళాభరణం లలితా … మరి కొందరం కలిసి ఒక చిన్న గదిలో పాతికేళ్ళ క్రితం అస్మితను ప్రారంభించాం.

ప్రారంభించినపుడు స్త్రీలు తమ బాధను చెప్పుకోటానికి ఇది ఒక చోటు అన్న భావన తప్ప మరొక ఆలోచన లేదు. అయితే మేమందరం పని రాక్షసులం. సంవత్సరం తిరక్కుండా ‘ స్త్రీలపై హింస మానవ హక్కుల ఉల్లంఘనే’ అనే శీర్షికతో రెండువేల మంది గ్రామీణ మహిళలను హైదరాబాదు రప్పించి మూడు రోజుల సదస్సు జరిపాం. కన్నబిరాన్ , కాళోజి వంటి అనేక మంది ఆ సభల్లో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ మూడు రోజుల సదస్సులో గ్రామీణ మహిళలకు ఎలాంటి విషయాలు ఏ భాషలో ఎట్లా చెప్పాలి వాళ్ళ మానసిక – రాజకీయ అవసరాలేంటి అన్నది మాకర్థమైంది. సమాచారం కోసం జ్ఞానం కోసం వారిలో ఎంత దాహం ఉందో మాకు తెలిసింది. నిజానికి ఏ ప్రజా సంఘంలో పనిచేసినప్పుడు కూడా నాకు ప్రజలతో ఇంత దగ్గర సంబంధం లేదు. అప్పటి నుంచి ‘అస్మిత’ గ్రామీణ స్థాయి మహిళల కోసం అనేక కార్యక్రమాలు రూపొందించుకుంది. జాతరలు , శిక్షణ శిబిరాలు , రాజకీయ తరగతులు వంటి వర్క్ షాప్ లు వందల సంఖ్యలో నిర్వహించి ఉంటాం. పితృస్వామ్యం నుంచి ప్రపంచీకరణ వరకు వాళ్ళతో మేం మాట్లాడని విషయం లేదు. అన్నీ వాళ్ళ భాషలోనే వాళ్ళ జీవిత ఉదాహరణలతోనే వారికర్థమయ్యేటట్లే. ఇది ఒక గొప్ప అనుభవం.

దీంతో పాటు రచయిత్రులతో పని చేయటం , ‘నీలి మేఘాలు’ వంటి సంకలనం ప్రచురించటం , women writing and censorship అనే అంశం పై పదకొండు భారతీయ భాషల రచయిత్రులతో సమావేశాలు నిర్వహించటం , ‘మహిళావరణం’ వంటి స్త్రీల చరిత్ర పరిశోధనా గ్రంథాల రచన – ప్రచురణ , స్త్రీవాద సిద్ధాంత నిర్మాణం … ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ స్త్రీవాద సిద్ధాంతాన్ని నేను రాసిన పాటల ద్వారా వీథి నాటకాల ద్వారా రకరకాల కళా రూపాల ద్వారా గ్రామీణ స్త్రీలకు అందించేవాళ్ళం. ఇది ఒక అద్భతమైన ప్రక్రియ. సిద్ధాంతానికీ జీవితానికీ మధ్య సరిహద్దులు చెరిపేసే ప్రక్రియ. దాన్ని ‘అస్మిత’లో పనిచేసిన మేమందరం ఆస్వాదించాం. అలాగే బీజింగ్ లో ప్రపంచ మహిళా సదస్సులో (నవ్వుతూ … మీరు రాగానే మిమ్మల్ని ఆకర్షించిన మావో బొమ్మ అక్కడ తెచ్చిందే!) పాల్గొనటం , ఆ సదస్సు ఆశయాలను నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో గ్రామీణ మహిళలకు చేర్చటం కోసం ఐక్యరాజ్య సమితితో కల్సి పనిచేయటం మంచి exposure ని కూడా ఇచ్చాయి. దీని వల్ల నా సాహిత్యంలో ఒక గుణాత్మకమైన మార్పు వచ్చిందని నేను భావిస్తాను.
2000 సంవత్సరంలో IAWS ( Indian Association of Women Studies ) జాతీయ సభలు హైదరాబాద్ లో అస్మిత ఆధ్వర్యంలో జరిగాయి. దేశమంతటి నుంచీ ప్రతినిధులు వచ్చారు. ఆ సందర్భంలో వారి కోసం ‘యుద్ధము – శాంతి’ నృత్యరూపకం నేను రాయగా అస్మిత బృందం నిర్మాణ సారధ్యం వహించింది. సంప్రదాయ సంగీతాన్ని , నృత్యాన్నీ ఆధునిక భావాలు చెప్పటానికి వాడుకోవాలన్న ఆలోచనతో దీన్ని రూపొందించాను. తర్వాత ‘లక్ష్మణ రేఖ’ నృత్య రూపకం – కుటుంబ హింస గురించి రాసి ప్రదర్శించాం. నా యీ రచనలు ‘అస్మిత’ లో నా పనిలో భాగంగానే వచ్చాయి. విద్యార్థుల మధ్య , చదువుకున్న మధ్య తరగతి స్త్రీల మధ్య వీటిని కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాం. ఆ తర్వాత వసంత కూడా ఇంగ్లీషులో కొన్ని నృత్య రూపకాలు రాశారు. నేను అనేక చట్టాలను ఐక్య రాజ్య సమితి ఒప్పందాలను తెలుగులోకి అనువాదం చేశాను. న్యాయపరమైన పారిభాషిక పదాలతో నిండిన వాటిని సరళమైన తెలుగులోకి తీసుకురావటం గొప్ప లెర్నింగ్ ప్రాసెస్. ఇలా ‘అస్మిత’లో నాకున్న రచనా శక్తిని ఉపయోగించి కొన్ని పనులు చేశాను – అస్మితకున్న వనరులతో నేనెంతో నేర్చుకున్నాను.

‘అస్మిత’ తరపున ప్రచురించిన ‘నీలి మేఘాలు’ కు మీరు రాసిన ముందుమాట – సమకాలీన స్త్రీవాద రచయితలకే గాక , తర్వాతి తరం రచయితలకి సైతం భావజాలపరంగా – భాషాపరంగా – వ్యక్తీకరణపరంగా స్త్రీల లైంగికతకి సంబంధించి అప్పటివరకూ taboo గా భావించిన యెన్నో అంశాల్ని సాహిత్యంలోకి తీసుకురావడానికి వెసులుబాటునిచ్చిందనీ అది స్త్రీవాద సాహిత్య విస్తృతికి దోహదం చేసిందనీ భావించవచ్చా?

‘ నీలి మేఘాలు’ ఒక మంచి చారిత్రిక సందర్భంలో వచ్చింది. అసలు అదే ఒక చరిత్ర. దాని వలన స్త్రీవాదానికి సాహిత్య ప్రపంచంలోనూ సమాజంలోనూ ఒక లెజిటమసీ , గౌరవం , గుర్తింపు లభించాయి. నిషిద్ధ వస్తువులుగా భావించిన అనేక విషయాలను ఆ తర్వాత రచయిత్రులు తమ రచనా వస్తువులుగా అలవోకగా తీసుకోటానికి నీలి మేఘాలు , దాని ముందుమాట ఒక చక్కని వేదికలా పనిచేశాయి. ఆ వేదిక నుంచి అనేక స్వరాలు బలంగా వినిపించాయి. అది తెలుగు సాహిత్యాన్ని సంపన్నం చేసింది. ఆ రకంగా తెలుగు సాహిత్యానికి ‘నీలి మేఘాలు’ చేసిన కాంట్రిబ్యూషన్ గణనీయమైనదే అని చెప్పవచ్చు. ‘నీలి మేఘాలు’ కవితా సంకలనమే అయినా దాని ముందుమాటలోని పునాది , నేపథ్యం కథ నవల వ్యాసం వంటి ఇతరేతర ప్రక్రియల్లో కూడా స్త్రీవాద భావాలను బలంగా స్పష్టంగా చెప్పేందుకు సహాయపడ్డాయి.

‘నీలి మేఘాలు’ సంకలనంలోని కవిత్వం మీదా దాని ముందుమాట మీదా సాహిత్యలోకంలో యెన్నో చర్చలు జరిగాయి. దానికి ముందూ వెనకా కూడా స్త్రీవాద సాహిత్యం మీద వాదోపవాదాలు జరిగాయి. అయితే స్త్రీవాద సాహిత్య విమర్శ వాదోపవాదాల దగ్గరే ఆగిపోయిందని ఆరోపణ ఉంది. అందుకు మీ స్పందన యేమిటి?

‘నీలి మేఘాలు’ కు ముందు స్త్రీవాద సాహిత్య విమర్శ చాలా తక్కువగానే ఉంది. ‘అతడు – ఆమె – మనం’ పేరుతో ఉప్పల లక్ష్మణ రావు గారి నవల మీద స్త్రీవాద పరమైన విమర్శ కొంత రాశాను. నా మటుకు నాకు అది తొలి ప్రయత్నం. ‘నీలి మేఘాలు’ లోని కవితలు సంకలనం కాకముందు వాటి మీద జ్వాలాముఖి , యస్వీ , సోమసుందర్ వంటి అభ్యుదయ విప్లవ రచయితలు కూడా దాడి చేశారు. ఒకసారి ‘నీలి మేఘాలు’ వచ్చిన తర్వాత దాడి ఆగి చర్చలు జరిగాయి. అది మంచి పరిణామం. ఆ తర్వాత కూడా స్త్రీవాద సాహిత్య విమర్శ వచ్చింది. అయితే మొత్తం తెలుగు సాహిత్యాన్ని అందులో ముఖ్యమైన రచనలను స్త్రీవాద దృక్పథంతో ఎలా అర్థం చేసుకోవాలి అనే దగ్గర మొదలైంది. ఆ దారిలో చాల మంది రచయిత్రులు సాహిత్య విమర్శ కొనసాగించారు.

నా విషయానికొస్తే నేను చలం , గురజాడ , కొ కు – వంటి రచయితలను స్త్రీవాద దృక్పథంతో అంచనా వేసే ప్రయత్నం చేశా. స్త్రీల రచనలపై జరిగే సెన్సార్ షిప్ గురించి నేను చేసిన విమర్శనాత్మక రచన – ‘పలికించకు మౌనమృదంగాలను’ ఒక కొత్త చూపును అందించింది అనుకుంటున్నాను. వివిధ సామాజిక శాస్త్ర దృక్పథాల ఆధారంగా సాహిత్యాన్ని విమర్శించటం సి వి సుబ్బారావు ‘విభాత సంధ్యలు’ పుస్తకంతో ప్రారంభమైంది. ఆ దారిని విశాలం చేసే ప్రయత్నాలు నా సాహిత్య విమర్శలో కనిపిస్తాయి. ఇటీవల వచ్చిన ‘సంతులిత’ అందులో భాగమే. రాజ్యాంగ నైతికత ఆధారంగా స్వాతంత్ర్యానంతర రచనలను విమర్శించిన పుస్తకం అది.

మీ సొంత రచనల పైనే గాక మీ అనువాదాల పైన కూడా చర్చలూ వాదోపవాదాలూ చెలరేగడానికి ప్రత్యేకమైన కారణాలున్నాయా?

వివాదాలు అనువాదాలతోనే మొదలైనాయి. నేను అనువదించిన నవల – HBT కోసం – ‘భూమి పుత్రిక’ ఎగ్నెస్ స్మెడ్లీ జీవిత కథ. ఆమె తన వ్యక్తిగత – రాజకీయ జీవితాలలో జరిగిన సంఘటనల గురించి దాపరికం లేకుండా రాసింది. ప్రేమ , సెక్సు వంటి విషయాలను గురించి మన సమాజానికే కాదు , విప్లవ సంస్థలకు కూడా మింగుడుపడని వ్యాఖ్యలు , భావాలు అందులో ఉన్నాయి. దానితో ఆ నవల మీద చర్చ జరిగింది. ఆ చర్చ అవసరం. ఎందుకంటే ఆ భావాలను మింగి జీర్ణం చేసుకోవటం తప్పనిసరి. స్త్రీల లైంగికత్వం గురించి సంప్రదాయ భావనలను ఛేదించుకుంటూ రావటం ఆ నాటి స్త్రీ ఉద్యమ కర్తవ్యం కూడా. ఆ తర్వాత స్వేచ్ఛ నవల – ఆ చర్చ. పోనీ అనుకుంటే ‘మూడు తరాలు’ పై విమర్శ. అదొక పెద్ద కథ! రష్యన్ విప్లవంలో పనిచేసి మంత్రిగా , రాయబారిగా సోవియట్ యూనియన్ లో పెద్ద బాధ్యతలు నిర్వర్తించిన అలెగ్జాండ్రా కొల్లంటాయ్ రాసిన కథ. దానిని అనువదించి ఫెమినిస్టు స్టడీ సర్కిల్ తరఫున ప్రచురించాను. సమాజ ఉత్పత్తి విధానాలలో పెను మార్పులు వచ్చినపుడు స్త్రీ పురుష సంబంధాలలో కూడా ఆ మార్పులు ప్రతిఫలిస్తాయి. వివాహం , ప్రేమ , ప్రేమ లేని సెక్సు వీటి గురించి తీవ్రమైన ఆలోచనలు రేకెత్తించే రచన. వివాహం లోపల ప్రేమ లేని సెక్సు సాధ్యమైనపుడు వివాహం వెలుపల స్త్రీ పురుషులకు అభ్యంతరం లేనపుడు ప్రేమ లేని సెక్సు ఒక శారీరక అవసరంగా ఉంటే ఏమవుతుంది అని అడిగే కథ. చాలా సంక్లిష్ట విషయాలున్నాయి అందులో – తేలిక కాదు ఆమోదించటం. దానిని misinterpret చేయటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. దాని గురించి సాహిత్య లోకంలో , విప్లవ సంఘాలలో చాలా దుమారమే రేగింది. వాద వివాదాలు చెలరేగాయి. సాహిత్య విమర్శగా కాక స్త్రీ పురుష సంబంధాలు , నీతి అవినీతుల సరిహద్దు రేఖలు – వీటి పరంగా చర్చ సాగింది.

‘పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం’ తర్వాత కొంత సద్దుమణిగింది. ఆ తర్వాత లాటిన్ అమెరికన్ నవల ‘విడోస్’ ను ‘మిస్సింగ్’ పేరుతో , నవల్ అల్ సదావీ రాసిన ఈజిప్టు నవలను ‘ఉరికొయ్య అంచున’ పేరుతో అనువదించాను. ఈ నవల కూడా ఫెమినిస్టు నవలే. కానీ సాహితీ సమాజం 2000 నాటికి ఫెమినిస్టు భావాలకు ఉలిక్కిపడకుండా, గందరగోళపడకుండా ఉండటం నేర్చుకుంది. బహుశా ఫెమినిస్టులం నేర్పామేమో! తర్వాత ‘నేను సావిత్రీ బాయిని’ అన్న అనువాదం రాశాను. ఇంగ్లీషులో దాన్ని సుషమా దేశ్ పాండే రాశారు. దానిపై వివాదానికి ఆస్కారమే లేదు. అందరు దానిని ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఈ అనువాదాలన్నీ కూడా తెలుగు నేల మీద స్త్రీవాదం స్థిరపడటానికీ విస్తృతం కావటానికీ దోహదపడ్డాయని నేను అనుకుంటున్నాను.

కథ, నవల, విమర్శ, అనువాదం, పుస్తక సంపాదకత్వ ప్రచురణలు, అస్మిత నిర్వహణ బహుముఖీనమైన ఇన్ని కార్యకలాపాల్లో తలమునకలై వున్న మీ దృష్టి సినిమా , టీ వీ – దృశ్య మాధ్యమాల – వైపు యెలా పడింది? అక్కడి మీ అనుభవాలు ప్రధాన స్రవంతిలో సాహిత్య రచన పై యెటువంటి ప్రభావం చూపాయి?

సినిమాల మీద నాకు చిన్నతనం నుంచీ చాలా ఆసక్తి. సాహిత్యం సినిమాల మధ్య పెరిగాను. ఫిలిం క్లబ్ ల వల్ల మంచి సినిమాల పట్ల అభిరుచి కలిగింది. 1986 వ సంవత్సరంలో ఏ ఉద్యోగమూ లేక ఖాళీగా ఉన్నపుడు పూనా ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో ఫిలిం అప్రిసియేషన్ కోర్సు చేశాను. ఉషా కిరణ్ మూవీస్ కథా విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా దాదాపు పదేళ్ళు పనిచేసి మంచి అనుభవం సంపాదించాను.

ఇక కుటుంబరావుకి థియేటర్ లో చాలా అనుభవం ఉంది. సినిమాలపై ఆసక్తి ఉంది. ఇద్దరం కలిసి అనేక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి వెళ్ళేవాళ్ళం – నా ఉద్యోగ జీవితంలో భాగంగా. ఇవన్నీ మమ్మల్ని సినిమా తీయమని ప్రేరేపించాయి. మా మిత్ర బృందం ప్రోత్సహించింది. అందరం కలిసి ‘భద్రం కొడుకో’ సినిమా తీశాం. కుటుంబరావు దర్శకుడు. ఆ తర్వాత ‘గాంధి’ సినిమాను తెలుగులోకి అనువదించాం. దానివల్ల చాలా నష్టపోయాం కానీ ఆ స్క్రిప్టుని అనువదించానని నాకెంత గర్వమో! అనువదిస్తూ ఎంత నేర్చుకున్నానో చెప్పలేను.

NFDC కోసం ‘తోడు’ సినిమా , CFSI కోసం ‘అమూల్యం’ , మరో బాలల చిత్రం ‘గులాబీలు’ … ఇట్లా మాకు తృప్తినిచ్చే సినిమాలు తీశాం. కుటుంబరావు టి వి సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తే నేను భుజాలు పడిపోయేలా వేల పేజీల స్క్రిప్టులు రాశాను. అస్మిత కోసం టెలీ ఫిలింస్ తీశాం. అనేక సమస్యలను దృశ్య మాధ్యమం ద్వారా గ్రామీణ పట్టణ స్త్రీల సంఘాలకు అర్థం చేయించే సినిమాలివి. ఓ పది దాకా తీసి ఉంటాం. కథ స్క్రిప్టు నాది. దర్శకత్వం కుటుంబరావు. నిర్మాణ నిర్వహణ అస్మిత కలెక్టివ్. ఇవన్నీ నా పనిలో భాగంగా , రచనలో భాగంగా సాగాయి. అక్కడ కూడా స్త్రీవాద సాహిత్యం రాయటమే నా పని కావటం నా అదృష్టం.

ఇతర భాషల్లోకి మీ రచనలు వెళ్ళినపుడు అక్కడి పాఠకులు , విమర్శకులు వాటిని యెలా స్వీకరించారు?

తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం అవటం చాలా తక్కువ. మనం ప్రపంచ సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు అనువదించుకుంటాం. కానీ మన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి ఎలా పంపాలో మనకి తెలియదు. నాక్కూడా తెలియదు. ఒకరోజు అల్లాడి ఉమ , శ్రీధర్ మీ కథల్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశాం , పబ్లిష్ చేద్దాం అన్నప్పుడు ఆశ్చర్యపోయాను. వాళ్లకి నా కథలు అందులోని భావజాలం నచ్చి ఆ ప్రయత్నం చేశారు. దాని వల్ల ఇతర భారతీయ భాషల వారికి నా కథలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఆరి సీతారామయ్య గారు నాతో మాట మాత్రం చెప్పకుండా ‘స్వేచ్ఛ’ నవల అనువాదం చేసి NBTకి ఇచ్చారు. సంవత్సరాల తరబడి వాళ్లకు గుర్తు చేస్తూ దాన్ని ఇంగ్లీషుతో సహా అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేసి ప్రచురిస్తామనే ఒప్పందం నాతో చేసుకునేలా వెంటబడి మరీ సాధించారు. హిందీలో శాంత సుందరి గారు దాన్ని అనువాదం చేయటంతో అది ఉత్తర భారత దేశం వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది.

కన్నడంలో సీనియర్ రచయిత్రి మిస్ సంపత్ ( రుక్మాయి గారు) నా రచనలను (ముఖ్యంగా – మానవి , ఆకాశంలో సగం నవలలు) ఎంతో ఇష్టంగా అనువాదం చేసి పత్రికలకు పంపేవారు. ఆ తర్వాత వీరభద్ర గౌడ రాజకీయ కథలు , విముక్త , స్వేచ్ఛ రచనలను కన్నడ పాఠకులకు అందించారు. కన్నడ పాఠకులకు నేను బాగా పరిచితురాలిని. అక్కడి విశ్వవిద్యాలయాల్లో నా నవలలు పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. ‘చావుని కాదు బతుకుని’ అన్న కవిత Farmer’s Wife గా ఇంగ్లీషులోకి వసంత కన్నబిరాన్ అనువాదం చేస్తే అది కర్ణాటకలో టెన్త్ క్లాస్ పిల్లలకి పాఠ్యాంశంగా ఉంది. అంటే కన్నడ పాఠకులు స్త్రీవాద భావజాలాన్ని చాలా తొందరగా తమ సొంతం చేసుకున్నారు , నా నవలల్లోని కథల్లోని పాత్రలతో చాలా దగ్గరగా ఐడెంటిఫై అయ్యారని తెలుస్తుంది. తమిళ పాఠకులకు నా కథలను తిలగవతి ముందుగా పరిచయం చేశారు. తర్వాత గౌరీ కృపానందన్ నా నవలలన్నిటినీ , విముక్త కథలను అనువాదం చేశారు. ఆ రకంగా తమిళ ప్రజలకు కూడా నేనూ నా భావజాలం దగ్గరవటం జరిగింది.

వందన మరాఠీ లోకి అనువదించిన నా రచనలు అక్కడ చాలా ప్రాచుర్యం పొందాయి. హిందీలో రాజకీయ కథలు వై. వసంత చేస్తే రాజకమల్ ఇప్పటికీ పునర్ముద్రణలు వేసి నాకు రాయల్టీ పంపుతున్నారు. విముక్త కథలు నేపాలీ లోకి అనువాదమయ్యాయి. విముక్త కథలు కొన్ని ఒరియాలోకి కూడా వెళ్ళాయి. ఇతర భాషల పాఠకుల నుంచీ నాకు వచ్చే ఫోన్ కాల్స్ ద్వారా , అనువాదకులు పాఠకులు పబ్లిషర్లు చెప్పే మాటలు వినటం వల్ల స్త్రీవాద భావజాలం మిగిలిన భాషల్లో కంటే తెలుగులో బలంగా ఉందనీ అటువంటి సాహిత్యం కోసం భారతీయ సమాజం ఎదురు చూస్తుందనీ , ప్రజాస్వామిక విలువలను పెంపొందించటంలో స్త్రీవాదం , స్త్రీవాద సాహిత్యం తోడ్పడతాయనీ నాకు నమ్మకం పెరిగింది.

మత అసహనం మనుషుల మధ్య సంబంధాల్ని పెళుసుబారేట్టు చేస్తుందన్న విషయాన్ని వస్తువుగా చేసుకొని మీరు ‘సారీ జాఫర్’ కథ రాశారు. అయితే యివాళ మత అసహనాన్ని మత రాజకీయాలకి ఉపయోగించుకొనే శక్తులు ముందుకు వచ్చి సాంస్కృతిక జాతీయ వాదం పేరుతో cultural revivalism వైపు నడిపించే పరిస్థితి యేర్పడింది . ఇది స్త్రీలు పోరాడి సాధించుకొన్న హక్కుల్ని బలహీన పరుస్తుందనీ , స్త్రీ విముక్తికి ఆటంకంగా పరిణమిస్తుందనీ మీరు భావిస్తున్నారా?

మన సమాజంలో ఇన్ని అభ్యుదయకర శక్తులూ ఉద్యమాలూ ఉండి కూడా మతవాదుల చేతుల్లోకి ప్రభుత్వం వెళ్ళటం అనేది అందరి ఓటమి అని ఒప్పుకోవాల్సిందే. మతతత్త్వాన్ని రాజకీయాలకు వాడుకోవటం వల్ల అధికారం పొందవచ్చని గ్రహించిన శక్తులు ఇష్టం వచ్చిన పద్ధతులన్నీ ఉపయోగించి 90వ దశాబ్దం నుంచీ ప్రజలను రెచ్చగొడుతున్నారు. మైనారిటీ ప్రజలను హింసిస్తున్నారు – భయపెడుతున్నారు. అసలు మతం గురించి పట్టించుకోకపోవటం వామపక్ష శక్తులు చేసిన పొరపాటా? మతం వ్యక్తిగత విశ్వాసమనీ దానిని ప్రజాజీవితంలోకి , బహిరంగ ఆచరణలోకి తీసుకురాకూదదనీ ఒక పద్ధతిలో ప్రచారం చేయలేకపోయాం. ప్రజలకు ఆధ్యాత్మిక అవసరాలుంటాయి – అనే విషయం మనం గమనంలోకి తీసుకోలేదు. వారి ఆధ్యాత్మిక అవసరాలకు లౌకిక మార్గాలను చూపించలేదు. ప్రపంచంలో అభద్రత పెరిగినప్పుడల్లా ప్రజలు ఆధారం కోసం ఏదో ఒక బలం కోసం మతవిశ్వాసాల వైపు పరుగెడుతుంటారు. ప్రజల ఆ బలహీనతను మతతత్త్వ శక్తులు సొమ్ముచేసుకుంటుంటే మనం చూస్తూ ఊరుకున్నామా? దేవుడు లేడు – అని చెప్పేసి చేతులు దులుపుకున్నామా? ఇలా చాలా రకాలైన ప్రశ్నలకు ఈ రంగంలో మనం సమాధానం వెతకాలి. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితి తీవ్రమైంది. అఖండ భారత్ పేరుతో హిందూ సంస్కృతి పేరుతో మన బహుళత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలనే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.

సంస్కృతి అంటే ముందుగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది స్త్రీలే. సంస్కృతిని పరిరక్షించే భారమంతా స్త్రీల భుజాల మీదే ఉన్నట్లు కట్టడులను , కంట్రోళ్ళను విధిస్తారు. ఇప్పుడు హిందూత్వ సంస్కృతి రక్షణ భారం కూడా చివరకు స్త్రీల నెత్తినే పడుతుంది. వారి మీద మతపరమైన కులపరమైన లింగపరమైన హింస పెరుగుతుంది. అనేక ఆంక్షలు వాళ్ళను వెనక్కి నెడతాయి. దీన్ని వ్యతిరేకిస్తూ పోరాడాల్సిన అవసరం స్త్రీలకే ఎక్కువగా ఉంది. దీన్ని గురించి ఫెమినిస్టులుగా మేము తీవ్రంగానే ఆలోచిస్తున్నాం. తక్షణ కార్యాచరణ నుండి తాత్త్విక పునాదుల వరకూ పలు కోణాలలో ఈ మతతత్త్వాన్ని నిలువరించాలని ప్రయత్నిస్తున్నాం. అగ్రరాజ్య ప్రయోజనాల కోసం వాళ్ళు పెంచి పోషిస్తున్న మత ఉగ్రవాద ధోరణులను సామాన్యులకు అర్థం చేయించి వారిని మతోన్మాదం నుంచి ఆధ్యాత్మికత వైపు మళ్ళించగలిగే వ్యూహాల గురించి లౌకిక ప్రజాస్వామ్య వాదులందరూ ఆలోచించాలి. సమభావననీ ఉన్నతమైన విలువలనూ పెంచే ప్రత్యామ్నాయ ఆధ్యాత్మికత గుర్తించి దానిని ప్రజలకు పరిచయం చేసి , దానిని వారి జీవిత విధానంలో భాగంగా మార్చే మార్గాల గురించి ఆలోచించాలి.

ఆధ్యాత్మికత అనగానే ఉలిక్కిపడకూడదు. ఆధ్యాత్మికత వేరు – మతం వేరు – దేవుడు వేరు. ప్రతి మనిషికీ ఉన్నతమైన విలువలతో సౌందర్య భరిత వాతావరణంలో ఉత్సవ సౌరభంతో సంబరాల మధ్య బతకాలనే ఆకాంక్ష ఉంటుంది. ఆ ఆకాంక్షలను మతోన్మాదం వాడుకుంటోంది. ప్రజల్ని పిచ్చివాళ్ళను చేస్తుంది. లౌకిక శక్తులు దానిని అసలు పట్టించుకోకుండా ఊరుకుంటే మన మాటలను అర్థం చేసుకునేవారు కరువైపోతారు. కాబట్టి మామూలు మనుషుల కోసం కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన ఆచరించాల్సిన అవసరం ఉంది. దీన్ని స్త్రీవాదులుగా మేం గుర్తించాం.

పెరుగుతున్న యీ అసహనం పై నిరసనగా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రముఖులు అవార్డులు తిరిగి యిచ్చేస్తున్న వేళ మీకు అకాడెమీ అవార్డు లభించింది. దాన్ని అంగీకరించడంలో యేమైనా యిబ్బంది ఫీలయ్యారా?

సాహిత్య ఎకాడమి అవార్డుని కొందరు తిరిగి ఇచ్చేసిన నేపథ్యంలో నేను తీసుకున్నానని కొందరు అనుకున్నారు. తిరిగి ఇచ్చేయటం అనేది కొందరు రచయితలు ఎంచుకున్న నిరసన రూపం. నేను ఆ రూపాన్ని ఎంచుకోలేదు. ఈ ఆధిపత్య , కుల లింగ వివక్షల సమాజం పై నా కలం ఎప్పుడూ నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూనే ఉంది. అస్మిత లో మేం ‘మతతత్త్వం’ గురించి ‘ప్రపంచీకరణ’ గురించి వేలాది మంది స్త్రీలకు వివరంగా చెబుతూ ఉంటాం. ‘సారీ నసీమా’ ఫిలింనీ ఇంకా ఆనంద్ పట్వర్ధన్ సినిమాలనూ అనేకమంది మేధావుల లౌకికవాదుల రచనలనూ వేలమందికి అందుబాటులోకి తెచ్చాం. నా ప్రతిఘటనా స్వభావం నా సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. నావి రాజకీయ రచనలని చెప్పుకునే రచయిత్రిని నేను.

సాహిత్య ఎకాడమి ఒక అటానమస్ సంస్థ. రచయితల భాగస్వామ్యంతో , వారే బాధ్యతలు నిర్వహిస్తూ నడిపించే సంస్థ. నేను అకాడమీ తెలుగు సలహా మండలిలో కూడా ఉన్నాను. ఆ సంస్థ ఇంతవరకూ రచయితలుగా మేం సూచించిన పనులే చేస్తోంది. అలాంటి సంస్థను , అందులో మన చోటును మనం ఒదులుకోకూడదు. ఆ చోటుని ఇతరులు ఆక్రమించే వీలు మనంతట మనం కల్పించకూడదు. సమాజంలో స్త్రీవాద రాజకీయాలకు చోటు పెంచుకుంటూ పోవాలనుకుంటాను. ఎకాడమీ పని పద్ధతుల పట్ల నాకు గౌరవం ఉంది. అందువల్ల అవార్డుని తిరస్కరించాలని నేను అనుకోలేదు. ఈ అవార్డు వల్ల ‘విముక్త’ కథలు అన్ని భారతీయ భాషలలోకీ అనువాదమవుతాయి. ఆ భావాలు మరింత ప్రచారమవుతాయి అనే గానీ వ్యక్తిగతంగా నాకు వచ్చే కీర్తి , డబ్బు గురించి కాదు. అవార్డుల రూపంలో నాకొచ్చే డబ్బుని నేను నా స్వంతానికెన్నడూ వాడుకోను. ఏదో ఒక మంచి పనికే వినియోగిస్తాను. లోకంలో అనేకులు అనేకం అనుకుంటారు. మన పని మనం చేసుకుంటూ పోతాం.

మీరు చేయదల్చుకొని చేయని పన్లు యింకేమైనా ఉన్నాయా?

నేను రాయాల్సిన రచనలే చాలా ఉన్నాయి. స్త్రీల రాజకీయ భాగస్వామ్యం గురించి, దానిని అందుకోటానికి వాళ్ళకెదురయ్యే ఆటంకాల గురించి నవలలు , కథలు, కొన్ని సిద్ధాంత ప్రతిపాదన వ్యాసాలు రాయాలని ఉంది. దానిలో మొదటి అడుగుగా ‘గమనమే గమ్యం’ నవల రాస్తున్నాను( మీరు చూసే ఉంటారు – సారంగ వెబ్ మాగజైన్ లో సీరియల్ గా వస్తోంది). దీని తర్వాత కూడా ఈ విషయ కేంద్రంగా మరొక నవల నా ఆలోచనల్లో రూపం దాల్చింది.

మీ యీ ప్రయాణంలో కలిసి నడిచే స్నేహాల గురించి , యీ లెగసీ ని కొనసాగిస్తూ – భావజాలాన్ని బలపరుస్తోన్న మీ తరం, మీ తర్వాతి తరం రచయిత్రుల గురించి ఒకటి రెండు మాటలు …

నా ఈ స్త్రీవాద ప్రయాణంలో నిత్యం కలిసి నడిచే స్నేహితులు వసంత కన్నబిరాన్, కల్పన కన్నబిరాన్. ఇంకా ఎంతో మంది మిత్రులం కలిసి ఏర్పరచుకున్న బాటే ఇది. స్త్రీ శక్తి సంఘటన, ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ నాటి మిత్రుల నుంచి భూమిక, ప్రజాస్వామ్య రచయిత్రులు, మట్టి పూలు వరకూ వీళ్ళందరూ నా స్నేహితులే. నా ప్రయాణంలో అంతో ఇంతో చేయూతనిచ్చేవారే. నా తరంలో, నా తర్వాతి తరంలో నాకిష్టమైన రచయితలు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కొక ప్రత్యేక స్వరం. పి సత్యవతి, ఇంద్రగంటి జానకీ బాల, విమల, కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, కుప్పిలి పద్మ, రెంటాల కల్పన మందరపు హైమవతి, శిలాలోలిత, షాజహానా, జూపాక సుభద్ర, గోగు శ్యామల, జాజుల గౌరీ, ప్రతిమ, మల్లీశ్వరీ, వినోదినీ, పింగళి చైతన్య … ఇలా నేను పేర్లు చెప్పుకుంటూ పొతే మీ పత్రిక పేజీలన్నీ నిండిపోతాయి. ఇన్ని బలమైన స్త్రీల గొంతులు సాహిత్యంలో ప్రతిధ్వనిస్తున్నాయి అంటే అది ఎంతో గర్వించాల్సిన విషయం. అయినా సాధించాల్సింది ఎంతో ఉంది. సాహిత్యంలో సగభాగం, సమాన స్థానం ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలుగానే ఉన్నాయి.

థాంక్యూ – నమస్తే!
కొసరు : మూడు రోజుల యీ యింటర్వ్యూ సందర్భంగా ఓల్గా కుటుంబరావు వారి మిత్రులతో కలిసి చేసిన ఒక మధ్యాహ్న భోజనంలో కుటుంబరావుగారు తనకోసం దాచిపెట్టుకున్న చేపల పులుసు నాతో పంచుకున్న రుచి మరువలేనిది – యెంతైనా ‘కొల్లేటి జాడల’ మనిషి కదా!

పాలపిట్ట (జనవరి – 2016) సౌజన్యంతో

You Might Also Like

2 Comments

  1. రచయిత్రి ఓల్గా తో సంభాషణ -2 | Bagunnaraa Blogs

    […] సౌమ్య ‘ప్రతి అస్తిత్వాన్నీ గుర్తించి […]

  2. bhasker

    మంచి విపులమైన ఇంటర్వ్యూ ప్రభాకరన్న! హాట్స్ ఆఫ్!!
    చాలా లోతుగానూ, ఆలోచింప చేసేదిగానూ ఉంది. ఎంతైనా మీరు ఏది చేసినా బాగా స్టడీ చేసిగాని తలకేత్తుకోరు. అది ఉపన్యాసామైనా, ఇంటర్వ్యూ అయినా, ముందుమాట అయినా..!
    -భాస్కర్ కూరపాటి.

    1

Leave a Reply