పుస్తకం
All about booksపుస్తకభాష

May 9, 2014

డక్కలి జాంబ పురాణం

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: Halley
*******
ఈ పరిచయం జయధీర్ తిరుమలరావు గారు సంపాదకత్వం వహించి, జానపద సంస్థ వారు ప్రచురించిన “డక్కలి జాంబ పురాణం” అనే పుస్తకం గురించి. ఈ మధ్య కాలంలో భారతీయ సంస్కృతి గురించీ అస్తిత్వ చింతనల గురించీ ఆలోచనలు ఎక్కువయ్యి ఆ తరహా పుస్తకాలు చదవటం బాగా పెరిగింది. ఆ ప్రణాళిక లో భాగంగా ఈ పుస్తకం చదవటం జరిగింది. ఆ మధ్యన హైదరాబాదు లో ఒక ఒగ్గు కథ ప్రదర్శన చూసాను. అప్పటి నుంచి ఏదన్నా జానపద కళ తాలుకా స్క్రిప్టు దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉండగా అనుకోకుండా ఎగ్మోరు కన్నెమార లైబ్రరీలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఈ పుస్తకం కనపడింది. అవకాశం దొరికింది కదా అని చెప్పి ఒక సెలవు రొజున పొద్దున్నే వెళ్ళిపొయి ఏకబిగిన చదివేసాను. ఈ పుస్తకం గురించి తెలుసుకోవాలి అంటే AVKF, ఆంధ్రభూమి వెబ్సైటులలో కొంత సమాచారం ఉంది. ఈ పుస్తకం నాకు ఎందుకు నచ్చిందీ, నన్ను ఏ విధంగా ప్రభావితం చెసిందీ తెలుసుకొవాలి అంటే ఈ పరిచయం చదవండి.

ఈ పుస్తకంలో ముందుగా చెప్పుకోవలసింది దాదాపు నలభై రెండు పేజీల దాకా ఉన్న ఉపొద్ఘాతమూ పరిచయ వ్యాసాలూ వగైరాలు గురించి. ముందుగా వాటి గురించి కొంత రాసి తర్వాత జాంబ పురాణం గురించి చెబుతాను.

ఇది 1995-1996 కాలంలో బండి అయితాపురం నష్కల్ గ్రామాల్లో (వరంగల్ జిల్లా) ప్రదర్శించిన డక్కలి వారి జాంబ పురాణానికి పుస్తక రూపం అట. ఈ పురాణాన్ని చిందు వాళ్ళు యక్ష గానం రూపంలో, మాష్టీడులు కథాగానం రూపంలో, బైండ్ల వాళ్ళు కథా గానం రూపంలో, నులక చంద్రయ్యలు పురాణ రూపంలో చెప్పేవారట. ఇందులో కొన్ని కులాల పేర్లు నేను వినటం ఇదే మొదటి సారి.

‘సమాంతర సాంస్కృతిక దర్పణం’ అన్న వ్యాసంలో తిరుమల రావు గారు, ఈ పురాణాలలో యే కులాలకి చెందిన పాఠ్యాలు వారివే అనీ, అందులో కనిపించే తేడాలు వారి ఉపకులాల మూలలని బట్టి ఉంటాయి అనీ అన్నారు. హింసనీ, మారణకాండనీ, అధిక్యతా భావాన్ని ప్రచారం చేయటం అగ్రకుల పౌరణిక స్వభావమనీ, నేడు ఈ సమాజంలో తొంబై శాతం ప్రజలు ప్రాతినిథ్యం వహించే లోయర్ మైథాలజీ అంచుల్లోనే అదిమిపెట్టి ఉంచబడుతోందనీ అన్నారు. అడుగు వర్గం పౌరాణిక గాథల్లో బహుదైవ విశ్వాసం కనిపిస్తుందనీ పై వర్గం పౌరాణిక సాహిత్యంలో ఏకదైవ విశ్వాసం కనపడుతుందనీ అన్నారు. గిరిజనులు దళితులు రిజర్వేషన్ల గురించి ఆలోచిస్తున్నారు తప్పిస్తే కోల్పోతున్న సాంస్కృతిక సంపదను ఎలా కాపాడుకోవాలో అని ఆలోచించకపోవటం ఆధునిక కాలపు శాపం అని అన్నారు. ఈ చైతన్య రాహిత్యం అడుగు వర్గాలకి సాంస్కృతిక రాజకీయ పరాజయం అనీ, అగ్ర వర్ణాలకి కావలసింది ఇదేననీ అన్నారు.

విశ్వ వ్యాప్తంగా ఏక సంస్కృతి ప్రతిష్టాపన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనీ, దాన్ని ఎదుర్కోటానికి దేశీ సాహిత్య ప్రవక్తలు పూనుకోవాలి అనీ అన్నారు. ఈ కళాకారులు మహత్తర సాంస్కృతిక అణ్వాయుధ రహస్య కాపలాదారులనీ అన్నారు. ఇంతటి విస్పొటన శక్తి వీళ్ళ వద్ద ఉందని తెలిస్తే అగ్ర వర్ణాలు వీరిని ఊచకోత కోసేవి అనీ అన్నారు.

ఇదంతా చెప్పి ఉప స్రవంతులూ, మూలస్రవంతులూ ఉనికి కొల్పోతున్న కాలం ఇదనీ, జాంబ పురాణం గానం చేసే కుటుంబాలలో మతాంతరీకరణ జరుగుతోందనీ, డక్కలి స్త్రీలు బౌండు పుస్తకం పట్టుకొని కరుణాపురం చర్చికి గుంపులుగా బయలుదేరుతున్నారనీ అన్నారు జయధీర్ తిరుమల రావు గారు.

ఈ వ్యాసంలోని చాలా విషయాలలో వారితో యేకీభవించలేక పోయినా, కొన్ని కొన్ని విషయాలలో మాత్రం పూర్తిగా ఏకీభవించాను. ముఖ్యంగా ఉనికి కొల్పోతున్న కాలం గురించీ, ఏక సాంస్కృతిక వాదం గురించీ వారు రాసిన విషయాలతో. శ్రీపాద వారి “అనుభవాలూ జ్ఞాపకాలూనూ”లో రాసిన “గుర్తుంచుకోగలిగితే – సత్యం అంగీకరించగలిగితే – ఉద్రిక్తం కాకుండానూ ఉండగలిగితే – మనం అందరమూ మారాము. చాలా చాలా మారాము. తలొక మొస్తరూను, అంతే భేదం. ఈ మార్పు మాత్రం ఏకత్వానికే, భిన్నత్వానిక్కాదు” అన్న మాట గుర్తుకు వచ్చింది ఈ వ్యాసం చదివినప్పుడు.

ఇక మరొక వ్యాసం ‘అస్పృశ్యత చెరిపే తత్వశాస్త్రం’ కోసం అన్నది. ఇందులో .. ఏక సాంస్కృతిక వాద హోర్డింగులు క్రీములూ, పౌడర్లు, సబ్బులూ వాడమంటుంటే దళిత కవి ఒక్కరు కూడా నలుపే మా అందం అని ఎందుకు అనటం లేదు? అని ప్రశ్నించారు మరో సంపాదకుడు/రచయిత. సమాజంలో పరుచుకున్న ముసుగుల్ని తొలగించే తాత్వికత స్థానే సమజంతో లాలూచీ పడే ఆలోచనలు జన్మించడం బాధాకరం అని అన్నారు. ఈ రచయితలు డక్కలి జాంబ పురాణం గురించి పుస్తకం వేస్తున్నారు అని తెలియగానే ఒక దళిత రచయిత “మా రిజర్వేషన్లకు పోటిగా యెక్కడో తిరుగుతున్న ఉపకులాల వారిని లేపుతున్నారు. ఇదొక కుట్ర.” అని అన్నాడట. ప్రగతి శీల విప్లవ రచయితలేమో “భూస్వామ్య భావజాలన్ని ప్రతిబింబించే జాంబ పురాణాలని ఎందుకు తవ్వి తీయాలి” అని అడిగారట.

ఈ విషయం చెప్పాక జాంబవులు అనగా అరుంధతీయులు చరిత్రలోనే కాదు, గ్రామీణ వ్యవస్థలో ఉత్పత్తి రంగంలో అద్వితీయులు అనీ, గ్రామాల్లో నాడు ప్రతి పంచాయితీలో తీర్పులో సమస్యలో అగ్రజులుగా (పెద్దగా) పిలువబడేవారు అనీ అన్నారు. బొయీలుగా రాజ్యాలు ఏలిన వారనీ, మాదిగలు యెనిమిది ఆశ్రిత కులాలని బతికించారనీ అన్నారు. ఆ వ్యవస్థ గురించి ఈ మాత్రం మంచి విషయాలు కూడా రాస్తారని నెనైతే అనుకోనే లేదు! మన కాలంలో ఇది పెద్ద క్రైము అసలే. నాకు చెప్పిన చరిత్రలో ఆ వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు అది ఒక చీకటి అధ్యాయం అని చెప్పిన వారే కానీ, దానిలోని ఈ complexities గురించి చర్చిన వాళ్ళు పెద్దగా నాకు తెలీదు. పంచాయితి పెద్దగా ఆ కులాల వ్యక్తులు ఉండేవారని పట్టణాలలో పెరిగిన నాకు అసలు చాలా రోజుల వరకూ తెలియదు. విశ్వనాథ “చందవోలు రాణి” లో అలాంటి ఒక పాత్ర గురించి చదివాను మొదట. “ఆ! ఈ పెద్దాయన ఇలానే రాస్తాడులే” అని అనుకున్నాను అప్పట్లో. తర్వత మంద క్రిష్ణ మాదిగ గారి బ్లాగులో ఒక విషయం చదవటం జరిగింది. నేను మొదట జాంబ పురాణం పేరు విన్నది అక్కడే! వారి బ్లాగులో ఒక చోట “Profitability of leather has at times balanced ideas of religious pollution associated most strongly with its basic production process and made leather-related castes one of the major sections of the population” … “The importance of leather and the secure livelihoods to be obtained from it meant that even leather workers based in villages might support satellite castes operating over wider areas” (ఎవరో రిసర్చి స్కాలర్ వ్యాఖ్యలు అవి) అన్న వాక్యాలు చదివినప్పుడు అనుకున్నాను ఆ వ్యవస్థ గురించి నాకు ఇస్కూలు పుస్తకాలలో చెప్పింది అంతా నిజం కానక్కర్లేదు అని. ఈ పుస్తకంలో ఈ వ్యాసంలో ఈ భాగం చదివినప్పుడు కూడా అదే అనిపించింది.

ఇదే వ్యాసంలో ఒక నష్కల్ డక్కలి కళాకారుడు అన్న ఈ మాటలు ప్రస్తావించారు. “బాపనోడికి ఇప్పటికీ కాళ్ళు మొక్కం. మాకు బావ అవుతాడు (వశిష్టునికి మా ఆడపడుచు అరుంధతిని ఇచ్చాము). బావకి కాళ్ళు మొక్కేది ఏంది. బ్రాహ్మలకీ మాకు ముఖ చూపులు లేవు. మేమే వాళ్ళని చూడం.” అని అన్నాడట ఆ కళాకారుడు. ఇలాంటి వాదం కూడా ఒకటి ఉండేది అనమాట! ఈ బావ – మరిది సంబంధం గురించి నేను వినటం ఇదే ఫస్టు.

ఇక అసలు జాంబ పురాణం లోకి వస్తే ఇందులో అయిదు భాగాలు అనమాట. సృష్టి పురాణం, పార్వతీ కల్యాణం, మాల చెన్నయ్య పురాణం, ఆరంజ్యోతి కల్యాణం (వశిష్ట పురాణం), బలభద్ర విజయం అని. ఒక్కో భాగంలో ఒక్కో తరహా సొగసు ఉంది. నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నా టైము బాగుంటే ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది ఏమో!

“ఆది పురాణం” మొదట్లో యుగాలు పద్దెనిమిది అని అంటూ “అనంత, అద్భుత, తమంజ, తారజ, తండజ, భిన్నజ, అవాయుక్త, అంబాయుక్త”అని ఒక పెద్ద లిస్టు చదివి చివరగా సత్య త్రేతా ద్వాపర కలి యుగాలని అంటారు. చాలా కొత్తగా అనిపించింది నాకు ఈ ప్రస్తావన. వేదములు అయిదు అనీ నాకు తెల్సిన నాలుగు పేర్లు కాకుండా “అమర వేదం” అని ఇంకొక పేరు తెల్సింది. ఇది కుడా కొత్తగా అనిపించింది నాకు.

ఈ ఆదిపురాణంలో సృష్టి కర్త అయిన శ్రీమన్నారాయణుడు జాంబవుడినీ, ఆదిశక్తినీ ఒకరి తర్వాత ఒకరిని సృష్టిస్తే వారు ఇద్దరూ పరస్పర శాప వశాన నెమలి అవతరం ఎత్తి, ఇరువురు సంగమించిన తర్వాత ఆది పరాశక్తి మూడు గుడ్లు పెట్టి, అండ – పిండ – బ్రహ్మండాలనే త్రిమూర్తులను (బ్రహ్మ విష్ణు మహేశ్వరులను) కంటుంది. ఇదే సంక్లిష్టంగా అనిపిస్తే అసలు ఈ శాపం కథ ఇంకా వింతగా అనిపిస్తుంది. నిజానికి జాంబవంతుడికీ, ఆదిశక్తికీ మధ్యన ఉన్నది సోదర సోదరీ బంధం కదా, వారిద్దరికీ త్రిమూర్తులు పుట్టటం ఏంటి? అని అనుకున్నాను నేను. అసలు ఆది శక్తేమో తండ్రి అయిన శ్రీమన్నారాయణుడినే కోరుతుంది నిజానికి! అటు తర్వాత జాంబవంతుడిని కోరగా జాంబవంతుడు శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళి “నా సహొదరిరాలయిన ఆదిశక్తి విరహబాధను తాళలేక రతికేళి గూడుమని నన్ను బాధించుచున్నదీ” అని అంటాడు. వెంటనే ఆది శక్తి “నేను స్త్రీ. ఈయన పురుషుడు. మేమిద్దరం కలిస్తేనే కదా సృష్టి సాగేది” అని అంటుంది. అసలు ఈ పాటికే నా మైండు బ్లాకు ఐపొతే, త్రిమూర్తులు పుట్టాక వాళ్ళకు పెళ్ళిళ్ళు జరగాలంటే ఆడవాళ్ళు అవసరం అని గుర్తించి ఆది పరాశక్తి ఇప్పుడు తన కొడుకులైన త్రిమూర్తులని తనతో సంగమించమని అడుగుతుంది. “నేను కన్నది గుడ్డును. నేను గుడ్డు కి తల్లిని. మీకు కాదు” అని అంటుంది పరాశక్తి . అలా ఈ ఘట్టం ముందుకు సాగి లక్ష్మీ సరస్వతీ పార్వతి జలగంధి (జాంబవంతుని భార్య) జననం తో ముగుస్తుంది.

ఇదిలా ఉంటే వర్ణ విభాగం గురించి చెప్పేటప్పుడు సాధారణంగా నేను నాలుగు వర్ణాలు విరాట్ పురుషుని తల బాహువులు తొడలు పాదాలు నుంచి పుట్టాయి అని చెప్పే కథనే ఎరుగుదును. అయితే ఇక్కడ నాభి నుంచి వైశ్య కోమట్లు, మోకాలు నుంచి బలభద్రులు (కాపులు), పాదము నుంచి 18 కులాలు 24 జాతుల శూద్రులు పుట్టారని ఉంది. బాహువుల నుంచి పుట్టిన రాజ వంశాల గురించి చెబుతూ- 42 సూర్య వంశ రాజులూ 16 చంద్ర వంశ రాజుల గురించి చెబుతుంది పార్వతి దేవి. ఇలా రక రకాల కులాల పుట్టు పూర్వత్తరాలు చెబుతుంది పార్వతి. కమ్మరాయన వడ్లాయన, కంచరాయన, కాశీలాయన, అవుసలయన, వారుశెట్టి, వీరిశెట్టి, వావిళ్ళ శెట్టి, వావిబలిజ, లింగబలిజ, విశ్వబ్రహ్మ అనుకుంటూ అనర్గళంగా ఎన్నో కులాల జననం గురించి చెప్పుకుంటూ పోతుంది పార్వతి.

ఇలా పార్వతి కళ్యాణం ఘట్టం పూర్తయ్యాక నన్ను కట్టి పడేసింది మాల చెన్నయ్య కథ. ఇటువంటి కథ నేను ముందెప్పుడూ వినలేదు. చెన్నంగి వృక్షము – పార్వతి దేవి రోహితంతో తడిసిన వస్త్రము – శివుని నీడ ఇలా రక రకాల కారణాల వల్ల జన్మిస్తాడు మాల చెన్నయ్య. ఈ కథ అక్కడక్కడా వినాయకుడి జననంను గుర్తుకు తెచ్చింది. పార్వతి దేవి స్నానం చేసిన వస్త్రాలని ఉతకటానికని చాకలి సర్వయ్య ప్రస్తావన వస్తుంది. అటు నుంచి వీరభద్రుడు మడేలయ్య జన్మ వృత్తాంతాల దగ్గరకి వెళ్తుంది పార్వతి. ఈ కథల గురించి నేను ముందు ఒకసారి కూడా చదివాను. అయితే ఆ కథలో సర్వయ్య ప్రస్తావన లేదు. ఇలా రక రకాల కులపురాణాలూ వాటి అన్నిటిలోని commanalities నచ్చాయి నాకు. ఇవన్నీ కలిసి భారతీయ సంస్కృతి అన్న ఒక grand narrative లో కలిసిన విధానం కూడా నచ్చింది.

ఇక కామధేనువును వధించి ఆ మాంసమును భక్షించారు అన్న కారణాన మాల చెన్నయ్యను ఊరికి దూరంగా తూర్పు భాగంలో ఉండమని శపిస్తాడు శంకరుడు. ఈ పాపంలో చెన్నయ్య తాత జాంబవుడు కూడా పాలు పంచుకుంటాడు. ఈ జాంబ పురాణంలో ఈ అంకం నాకు చాలా నచ్చింది. అంటు గురించి కొన్ని వాద ప్రతివాదాలు narrate చేసిన తీరు నన్ను ఆకట్టుకుంది. జాంబవంతుడు “అన్నన్నా తెలుగన్నా నరజాతిలో అంటు లేదన్నా” అంటూ పాడిన పాట చాలా బాగుంది.

ఇక వశిష్ఠ పురాణంలో వశిష్టుడు, అరుంధతి పూర్వ జన్మ వృత్తాంతాలు చెప్పాక అసలు కథ మొదలు అవుతుంది. అరుంధతిని మనువాడాలని అనుకున్న వశిష్టునితో ఆమె ఇలా అంటుంది “ఇంతకు మునుపే ఒక బ్రాహ్మడు మా ఊర్వశిని మోసం చేసి పోయాడట. బ్రాహ్మణులని నమ్మరాదు. కాబట్టి మా తాత జాంబవంతుడితో మాట్లాడాలి” అని అంటుంది. అసలు ఈ జాంబ పురాణం చదవకపోయి ఉంటే తాత జాంబవంతుడు ఇంత గొప్ప పౌరాణిక పాత్ర అని తెలిసేదే కాదేమో నాకు. ఈ పురాణంలోని ప్రతీ ఘట్టంలో జాంబవంతుడు వస్తాడు. ఈ పురాణానికి తిరుగలేని నాయకుడు ఆ తాతే. త్రిమూర్తులు, పార్వతి మిగిలిన అందరు కూడా జాంబవంతుని తర్వాతే! ఏదో రామాయణంలో కాసేపు కృష్ణుడి కథలో శమంతకమని దగ్గర కాసేపు వచ్చే జాంబవంతుడి చుట్టుతా ఇంత పెద్ద cosmology ఉంది అన్న విషయం తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే!

ఇక బలభద్రుడి కథ ద్వారా కాపు కుల జన్మ వృత్తాంతం మనకి తెలుస్తుంది. ఈ కథ ఇలా ఉండగా ఈ ఘట్టంలో ఇంకా ఎన్నో కులాల జన్మ వృత్తాంతాలు వస్తాయి. కొన్ని కొన్ని పిట్ట కథలు కూడా వస్తాయి. సముద్ర మథనంలో వచ్చిన కాలకూట విషం గురించి ఈ పుస్తకంలో నేను చదివిన అంశాలు నాకు చాలా నచ్చాయి. శివుడే హాలాహలం మొత్తం మ్రింగాడు అన్న కథ మాత్రమే తెల్సిన నాకు త్రిమూర్తులు ముగ్గురు ఆ విషాన్ని పంచుకున్నారు అని ఈ పురాణంలో చెప్పిన కథ చాలా నచ్చింది. విధి రాత రాసే సిరాబుడ్డికి బ్రహ్మ కొంత విషం తీసుకోగా, విష్ణువు తనకి లభించిన విషాన్ని సకల జీవ కోటికి పంచి పెడతాడు. అంటే వేప చెట్టుకీ, వృశ్చిక జాతికి, పాముకు, శునక జాతికి వగైరా జీవులకి అనమాట. ఆ మిగిలిన విషం శివుడు తీసుకుంటాడు. ఇక పురాణ కథలో గొల్లల జన్మ వృత్తాంతం దగ్గరకి వస్తే యయాతి – శర్మిష్ట – దేవయాని ల గురించి చెప్పి, వారికీ పాకనాటి గొల్ల, పనస గొల్ల, ముష్టి గొల్ల, గబ్బు గొల్ల అను రక రకాల కులాల జన్మ వృత్తాంతాలు తెలుపుతారు మనకు. యెర్ర గొల్లల గురించి చెబుతూ కుష్టు వ్యాధిగ్రస్తుడైన యయాతి చీము నెత్తురు తుడిసిన వారు యెర్ర గొల్లలైనారని అంటారు. (ముదిరాజులు కూడా యయాతికి traceback చేసుకునేటట్టుగా ఉన్నారు వారి కుల జననాన్ని). అలాగే కల్లు తీసే గౌడ వారు తమ గురించి చెబుతూ “తల్లి పార్వతి, తండ్రి శంకరుడు” అని అంటారు.

ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే భిక్ష కులాల గురించిన అంశాలు మాత్రం వేరే ఒక స్థాయిలో ఉన్నాయి. నాకు ఎప్పటి నుంచో ఈ “భిక్ష” మీద అదొక రకం fascination. ఈ భిక్ష వ్యవస్థ నాకు తెల్సి ఈ నేల పైన పుట్టిన మతాలలో సంస్కృతులలో ఉన్నట్టుగా వేరే ఏ ప్రాంతంలోనూ లేవనుకుంట. అయితే ఇప్పుడు ఈ భిక్ష వ్యవస్థ లేదు. beggars ఉన్నారు అంతే. విశ్వనాథ “దమయంతి స్వయంవరం”లో “దేశమంతా సుభిక్షం అయింది అని అనేవాళ్ళం పూర్వం.. ఇపుడు సుఉద్యోగమైంది అని అనాలే” అని అంటారు. ఈ భిక్ష వ్యవస్థ మూలల గురించీ దాని ప్రాశస్త్యం గురించీ తెలుసుకోవాలంటే ఈ జాంబ పురాణంలో బలభద్ర విజయం అన్న భాగం చదవాల్సిందే. శివుని జోలెలో నుంచి నలుగురు భిక్షగాళ్ళు పుట్టారంట వారు హరి దాసరోళ్ళు, గొనె దాసరోళ్ళు, గంగిరెద్దు వాండ్లు, పిచ్చుకుంట్ల వాళ్ళు. ఈ భిక్ష కులాల వాళ్ళకి ఇచ్చే భిక్ష చుట్టూ ఉండే economics గురించి కొన్ని మాటలు ఉంటాయి పురాణంలో ఈ భాగంలో. అయితే ఈ భిక్ష కులాల వారు జోలె నుంచి పుట్టగానే “అమ్మా! ఆకలి” అని ఆకలి కేకలు ప్రారంభిస్తారు. ఏమి చేయాలో పాలు బోక శివుడినే ఒక్కొక్కరి వేషంలో ఒక్కోసారి వెళ్లి భిక్ష తీసుకురమ్మని చెప్పి పార్వతి పంపిస్తుంది. ఆది భిక్షువు కదా మరి! ఈ సన్నివేశాలు చాలా రమ్యంగా ఉన్నాయి. చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో!

ఇదిలా ఉండగా మాదిగ రామయ్యకీ కాపు బలభద్రునికి జరిగే సంభాషణ కూడా చాలా గొప్పగా అనిపించింది. జీతం డబ్బు విషయంలో వారిద్దరూ గొడవ పడతారు. “నేను జాంబవంతుడి మనవడిని. ఈ భూమి పుట్టింది తాత గురించి, ఈ ప్రజలని పోషించేవాడు మా తాత” అని అంటాడు మాదిగ రామయ్య. నిజంగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి ఈ సంభాషణలో రామయ్య ఆవేశం చూస్తే. ఈ రోజు దళితుల్ని ఉద్ధరించేస్తున్నాం అని లేని పోనీ వాత్సల్యం చూపే activistలు తాత జాంబవంతుడి గురించి ఏమంటారో మరి. ఇక అంతటితో ఆగని రామయ్య “హరిశ్చంద్రుడి సత్యాన్ని కాపాడింది నేను. కొన్నది నేను. మీ గొప్ప ఏంటి? మీకు కొనటానికి చేతనయ్యిందా?” అని అంటాడు. కాపు బలభద్రుడు అప్పుడు “వాడు లేందే మనం బతకలేమా? చస్తామా?” అని అంటాడు. దానికి రామయ్య “నిజం చెప్పినవు పటేలా? సస్తే నిన్ను కాట్ల పెట్టేది మేమే” అని అంటాడు. దానికి కాపు “అవన్నీ సూస్తానికి మాకు బాపనోళ్ళు ఉన్నారు. దినాలు చేసినా పెద్దలకు పెట్టినా మాకన్నీ బాపనోల్లే చేస్తారు. వాళ్ళంతా వసిష్టుని గోత్రం” అని అంటాడు. దానికి మాదిగ రామయ్య “వశిష్టుడా? వశిష్టుడెవరు? వానికి కులమేడుంది?” అంటాడు. అంతటితో ఆగక “నేను ఉంచుకున్న భోగం దానికి పుట్టినోని కాళ్ళు పట్టుకొని మొక్కుతారు మీరు” అని ఎదురు దెప్పుతాడు వశిష్టుని తల్లి ఊర్వశిని ఉద్దేశించి. ఈ పురాణంలోనే మొదట్లో భోగం ప్రస్తావన వస్తుంది. అందులో రంభ రాజులకి భోగం, ఊర్వశి జాంబవంతుడి భోగం, మేనక దొమ్మరి భోగం, చిత్రిణి ఎరుకల భోగం, తిలోత్తమ లంబాడి భోగం అని అంటారు. అరుంధతి వశిష్ట కథలో కూడా ఊర్వశి పైన జాంబవంతుడి అధికారం గురించి ప్రస్తావన వస్తుంది. అసలు తాత జాంబవంతుడి గురించి తలుచుకోకుండా ఏ ఘట్టము క్లైమాక్స్ కి వచ్చే అవకాశం లేదు ఈ పురాణంలో! ఇక “కొలువులోన నా డప్పే. పెండ్లి కాడ నా డప్పే. సావు కాడ నా డప్పే. శివుని కాడ నా డప్పే” అన్న పాట కూడా నన్ను ఆకట్టుకుంది. ఇదంతా అయ్యాక “నా చెప్పుతోని మీరు కొట్టుకుంటే తక్కువ మీరా? నేనా ?” అని అంటాడు మాదిగ రామయ్య బలభద్రునితో. “దండం పెడతా. ఇజ్జత్ తీయకు” అని అంటాడు కాపు. అలా ముగుస్తుంది ఈ సంభాషణ.

ఇక ఆశ్రిత కులాల గురించి చెబుతూ పార్వతి “రెడ్లకు దొమ్మరి, రాజులకు భట్రాజు, గొల్ల వారికి కొమ్ము వారు, గౌండ్ల వారికి ఎనుగెట్లు వారు, సాలె వారికి కూనెపులి వాడు, మంగలి వారికి అద్దెపు సింగడు, కోమట్లకు వీర ముష్టి, బ్రాహ్మణులకు విపర వినోదులు, తురకలకు ఫకీరు, మిత్రాసి వాళ్ళకు కాటి పాపాల వాడు, ఆరె వాడికి గోసాయి” అని ఒక పెద్ద లిస్టే చదువుతుంది. ఈ ఆశ్రిత కులాల వ్యవస్థ గురించి ఇంకా తెలుసుకోవలసినది చాలా ఉంది. అయితే ఒకరు లేనిదే మరొకరు లేరు ఇందులో. తాత జాంబవుడి గురించి మాదిగలకి తెలియాలి అంటే డక్కలి వారు ఉండాల్సిందే. డక్కలి వారికి భిక్ష వేయాలంటే మాదిగలకి ఆర్థిక స్వాతంత్ర్యం స్వావలంబన ఇచ్చే వ్యవస్థా ఉండాల్సిందే. అసలు మన దగ్గర ఇప్పుడు కులమే వద్దు అని కదా అంటున్నారు! ఇంక ఆశ్రిత కులాలు, భిక్ష వ్యవస్థ వీటి మాట దేవుడెరుగు. అసలు దేవుడే లేడు అని కూడా అంటున్నారు అది వేరే విషయం. అస్తిత్వం అంటే ఏంటి? బోడి ఫ్యూడల్ భావాలూ మీరూనూ అని కూడా అంటున్నారు. అంతా మన మంచికే అనే కదా అనుకోవాలి. అనుకుందాం. అనుకోకుంటే బతకలేం. లేదంటే మతాంతరీకరణ బెష్టు! బౌండు పుస్తకాలు పట్టుకున్న డక్కలి స్త్రీలకు మల్లే! ఈ హిందూ అస్తిత్వ గోల అంతా ఉండనే ఉండదు అప్పుడు. ఉండదు అని అనుకోవాలి. లేదంటే కుదరదు! అన్నిటికంటే ముఖ్యం నేనెవరు అనే ప్రశ్న అడగకూడదు. అడిగినా కూడా మనమందరూ మనుషులం వంటి తలా తోక లేని చౌకబారు generalisationsతో మనలని మనం తృప్తి పరుచుకోవాలి. దానికి humanism అని ఇంకొక తలా తోక లేని పేరు పెట్టుకోవాలి. అన్ని identitiesని రూపు మాపే ఈ ఏక సంస్కృతి వాదం ఆ humanism అయినా బాగుండును. గుడ్డిలో మెల్ల! ఆ ఏక సంస్కృతి అది కూడా కాదు. దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలిదు.

ఇక ఈ పురాణం చివరన ఈ narration మొత్తానికి కారణమైన డక్కలి వారి జన్మ వృత్తాంతం గురించి కొంత ఉంటుంది. ఈ కథ గురించి నేను ఈ పరిచయంలో పెద్దగా రాయలేదు. అగస్త్యుడు విశ్వబ్రహ్మ వగైరాలు వస్తారు పార్వతి కళ్యాణం భాగంలో. విశ్వకర్మకి కావాల్సిన పరికరాల కోసం జాంబవంతుడు తన కొడుకుని చంపి ఆ శరీరావయవాలతో పరికరాలను తయారు చేసుకొమ్మంటాడు విశ్వకర్మను. శివ పార్వతుల తాళిబొట్టు వీటితోనే తయారు అవుతుంది. ఆ జాంబవంతుడి కొడుకు డొక్క నుంచి ఒక డక్కలి వాడూ మాల చెన్నయ్య వధించిన కామధేనువు డెక్క నుంచి ఒక డెక్కలిదీ పుడుతారు. గాడిద ఈ డక్కలి వారి వాహనం. పార్వతిదేవి మాటల్లో “డక్కలిని అడిగేవాడు ఈనె వాడు. ఈనెలని శంకు మూకల వాడు. వారిని బుర్ర కాయల వాడు. వారిని నేహా సుక్కన్న. వారిని చపల చోరు. చివరగా మొండోడు” ఇలా ఒకరి మీద ఒకరు ఆధార పడి ఉంటారు. ఇలానే చిందు బైండ్ల వారి గురించి కూడా చెబుతూ, పార్వతి “అందరం ఆయన కొడుకులమే. అందరం ఆయన పాదం పట్టుకొని బతుకుతున్నాం” అని అంటుంది. ఇప్పుడు మనమంతా ఎంచక్కా మార్కెట్టు కాళ్ళు పట్టుకొని బతుకుతున్నట్టు. మన కాలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ మార్కెట్టు వాడే కదా మరి.

అది స్థూలంగా ఈ జాంబ పురాణం కథ. భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్న వారంతా తప్పక చదవాల్సిన పుస్తకం. కనీసం తాత జాంబవుడు ఎవరు అని తెల్సుకోవటం కోసమైనా చదవాలి. మాదిగలు హిందువులు కారు, మీ దేవుళ్ళు వేరే వాళ్ళ దేవుళ్ళు వేరే -వగైరా పనికి మాలిన రచనలు చేసే వారు కూడా చదవాలి. పురాణాలు అంటే శిష్ట పురాణాలు మాత్రమే, మిగిలినవి అంతా lesser పురాణాలు పుక్కిటి పురాణాలు అని అనుకునే వారు కూడా చదవాలి. “ఆ ఎక్కువేమిటో ఈ తక్కువేమిటో” అని ఆలోచింపజేస్తుంది. వీరు కాకుండా డీ. ఆర్. నాగరాజ్ గారు తన “Flaming feet” పుస్తకం లో అన్నట్టు ఈ కులానికే చెంది “I want to forget their gods, their folk epics, their violence” అని అనుకొనే వారు కూడా చదవాల్సిన పుస్తకం. నాగరాజ్ గారి వాక్యాల్లోనే చెప్పాలి అంటే ““Old culture means humiliation and therefore self-respect essentially means repudiating one’s cultural past“ అని అనుకొనే వాళ్ళు కూడా చదవాల్సిన పుస్తకం. ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే “Rebels too require cultural memory”. కాబట్టి సదరు రెబెల్స్ అంతా కూడానూ ఇట్టి పురాణాలు చదవవలెను కదన రంగంలోకి వెళ్ళే ముందు అని నా అభిప్రాయం. కనీసం మనం దేన్ని నాశనం చేస్తున్నానో తెల్సుకుంటే మంచిది కదా. ఎలాగూ నాశనం చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయినప్పుడు! సంపాదకులు జయధీర్ తిరుమల రావు గారు ఇతర రచయితలు కూడా పుస్తక పరిచయ వ్యాసాలలో ఇటువంటి మాటలే అన్నారు. జానపద ప్రచురణ సంస్థ వారికి ఋణ పడి ఉంటాను ఈ పుస్తకం ప్రచురించినందుకు.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.8 Comments


 1. అన్నెమూ పున్నెమూ. ఎ

  తెలుగులో ‘ధన్యవాదాలు’ అని చెప్పాలని ఉంది. కానీ, నాకు అంత తెలుగు రాదు. బాగు బాగు!!


 2. VIJAPURAPU.HARI

  అనేక సం:రాలుగా జాంబవంతుని భార్య (అమ్మవారి)పేరు కొసం వెతుకుతున్నను నా కృతజ్ఞతలు


 3. Halley

  On similar lines
  చరి్త్ర పుటల్లో చేరుతున్న రుంజ కళారూపాలు http://www.suryaa.com/sahithyam/article-1-171901


 4. పుక్కిటి పురాణాలని వూరికే అన్నారా?


 5. ప్రసాద్

  చాలా ఆసక్తికరంగా వుంది జాంబ పురాణం. మీ వ్యాసం తప్పక చదవాలన్న ఉత్సుకతనీ, కుతూహలాన్ని కలిగించింది.

  “…అసలు మన దగ్గర ఇప్పుడు కులమే వద్దు అని కదా అంటున్నారు! ఇంక ఆశ్రిత కులాలు, భిక్ష వ్యవస్థ వీటి మాట దేవుడెరుగు. అసలు దేవుడే లేడు అని కూడా అంటున్నారు అది వేరే విషయం. అస్తిత్వం అంటే ఏంటి? బోడి ఫ్యూడల్ భావాలూ మీరూనూ అని కూడా అంటున్నారు. ..” ఇలా మీ పైత్యాన్ని మధ్యలో చొప్పించడం ఈ వ్యాసానికి, జాంబ పురాణానికి ఏ విధంగా మేలు చేస్తుందో తెలియదు.

  నాకయితే మీ వుద్దేశ్యము అందులో వివరించిన బిక్ష వ్యవస్థ పట్ల విపరీతమైన మమకారం పెంచుకున్నట్లుగా వుంది.


  • Halley

   మీ కామెంటుకి థాంక్సు .
   ఆ పైత్యం లేకపోతే అసలు ఈ పుస్తకం చదివే వాడినే కాదు లెండి . కొన్ని పైత్యాలు మంచివే . ఆ భిక్ష వ్యవస్థ లేకుండా ఈ customised narratives ఎలా నిలబడతాయో నాకు తెలీదు . మీకు తెలిస్తే చెప్పండి .


  • pavan santhosh surampudi

   వ్యాఖ్యానాన్ని పైత్యం అనడమేమిటండీ. మీకు అంతగా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఆ వ్యాఖ్యానం చెప్పాలి కానీ.


 6. very fascinating. I’ve read some of these puranas as part of the Mallemoggala godugu and Antarani vasantam.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngugi Wa Thingio’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Nguigi Wa Thiongio) రాసిన Education for a national culture అన్న వ్యాసం గు...
by అతిథి
0

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. ...
by అతిథి
4

 

 

Douglas M Knight Jr’s “Balasaraswathi: Her art and life”

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం ‘డగ్లస్ ఎం నైట్ Jr’ రాసిన “బాలసరస్వతి: హర్ ఆర్ట్ అండ్ ల...
by అతిథి
0

 
 

Rearming Hinduism – Vamsee Juluri

వ్యాసకర్త: Halley ********** ఈ పరిచయం వంశీ జూలూరి గారు రాసిన Rearming Hinduism: Nature, History and the Return of Indian Intelligence అనే పుస్...
by అతిథి
2

 
 

భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం హరి సోదరులు రచించిన “భారతీ నిరుక్తి (వేద స్వరూప దర్శనం)...
by అతిథి
5