తెవికీలోనూ సగం

పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి
********
“ఆకాశంలో సగం నువ్వు.. ఆ నక్షత్రాల్లో సగం నువ్వు” అన్నాడు మావో. “సాహిత్యాకాశంలో సగం” అని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సాక్షిగా సాహిత్య విమర్శకురాలు కాత్యాయని విద్మహే నిరూపించారు. ఇప్పుడు తెలుగు వికీపీడియా కూడా అదే మాట అంటోంది “తెవికీలో సగం” అంటూ.

అంతర్జాలంలో విజ్ఞానం అందరికీ తెలుగులోనే అందుబాటులోకి రావాలంటూ విప్లవాత్మకంగా ప్రారంభమైన తెలుగు వికీపీడియా గత సంవత్సరమే 55వేల వ్యాసాల మైలు రాయిని దాటింది, పదేళ్ల పండుగని ఈ ఏడాదే జరుపుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం క్రియాశీలకంగా, ఫలప్రదంగా జరుపుకోనుంది.
ఇంతకీ ఏమంటారు?: మహిళా దినోత్సవాల సందర్భంగా మార్చి నెల అంతా మహిళలకు సంబంధించిన వ్యాసాలు రాసే ఎడిటథాన్ నిర్వహిస్తున్నారు. తెలుగులో వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళల గురించి, వారు చేసి కృషి గురించి, మహిళలకు అవసరమైన విషయాల గురించి ఇలా ఎన్నో వ్యాసాలూ రాస్తున్నారు, ఇంకా రాయాలి. ఉదాహరణకు సాహిత్యం అనే రంగం గురించి తీసుకున్నాం అనుకోండి. కవయిత్రులు, రచయిత్రుల గురించి, వాళ్ళు రాసిన పుస్తకాలు, అసలు సాహిత్యంలో మహిళలు ఇలా ఎన్నో వ్యాసాలూ రాయవచ్చు. ఇది నేలంతా జరిగే కార్యక్రమం. మరో సంగతండోయ్. ఇవి మహిళలే రాయాలని ఏమీ కాదు ఎంతైనా స్వేచ్చా విజ్ఞాన సర్వస్వం మరి.

మహిళలను వికీపీడియాలో రాసేలా ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమే. తెలుగు వికీపీడియాలో స్త్రీల సభ్యత్వం పెరగాలన్న ఆశయం దీనికి మూలం. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాదు గోల్డెన్ త్రిషోల్డ్ లో మహిళా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.

వేడుకలంటే ఏం చేస్తారేంటి ?
మహిళలకు తెలుగు వికీపీడియాలో మరింత సులభంగా రాసేందుకు శిక్షణ కార్యక్రమం జరుగుతోంది. మధ్యాహ్నం నుంచి సదస్సు కూడా నిర్వహిస్తారు. తెవికీలో ఈ నెలరోజుల్లో సభ్యులుగా నమోదు పొందిన మహిళలు/యువతులు కూడా అక్కడికి వస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి కృషి చేస్తున్న సీనియర్ వికీపీడియనిలు(మహిళా వికీపీడియన్లకు నా కొత్త కాయినింగ్:)) తమ అనుభవాలు పంచుకుంటారు. ఇలా ఎన్నో ఎన్నో జరుగుతాయి. నిర్వహిస్తున్నవారు సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ, థియేటర్ ఔట్రీచ్. సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు, ప్రదేశం ముందే చెప్పుకున్నట్టు గోల్డెన్ థ్రెషోల్డ్ (అన్నట్టు దీనికీ భారత కోకిల సరోజినీ నాయుడి స్మృతికి సంబంధం ఉంది. మంచి ఎంపికే కదా), అబిడ్స్, హైదరాబాద్.

ఐతే మేమేం చెయ్యాలి?
అనుకుంటున్నారా? ముందుగా మీరు స్త్రీలైతే,తెలుగు వికీపీడియాలో ఇంతవరకూ సభ్యత్వం లేనట్టైతే అక్కౌంట్ తెరవండి. దానికి దారి ఇది. ఆపైన వీలుచేసుకుని హైదరాబాదులో మార్చి 8న జరిగే కార్యక్రమానికి హాజరు కండి. మీతో పాటుగా మీ తోటి స్త్రీలను కూడా ఇవే పనులు చేసేందుకు ప్రోత్సహించి చూడండి. వాళ్లకు తెలుగు వికీపీడియా గురించి చెప్పాలంటే ఈ పేజీ చూసి కాస్త తెలుసుకోండి.
పురుషులైతే మీ అమ్మకీ, భార్యకూ, కూతుళ్లకు, చెల్లెళ్ళకు, స్నేహితురాళ్ళకీ, సహోద్యోగినులకు.. తెలిసిన మహిళలు అందరికీ తెవికీని పరిచయం చెయ్యండి. ఖాతా తెరిచేందుకు వ్యాసాలూ రాసేందుకు ప్రోత్సహించండి. మీరూ ఖాతా తెరవండి.

అందరికీ: ఈ ప్రాజెక్టు పేజీ చూడండి. ఈ నెల రోజుల్లోపు వీలైనన్ని వ్యాసాలూ స్త్రీల గురించి, స్త్రీల సమస్యల గురించీ, స్త్రీలు సాధించిన ఘనతల గురించీ ఇలా ఎన్నైనా వ్యాసాలూ వికీ శైలిలో సృష్టించి అభివృద్ధి చేయండి. ఆఖరుగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుగు వారిగా తెలుగు వికీపీడియా మన అందరిదీ. దీన్ని అభివృద్ధి చేసి తర్వాత తరాలకు వారసత్వ సంపదగా ఏంటో విజ్ఞానాన్ని అందజేసే బాధ్యత మనపై ఉంది.

You Might Also Like

4 Comments

  1. మాలతి నిడదవోలు

    పవన్ సంతోష్, అవునండి. 12 ఏళ్ళక్రితం తూలిక.నెట్ ప్రారంభించిన రోజుల్లో మొదలయింది ఆ తూలికన్. నా నిజనామధేయం నిడదవోలు మాలతి. తెవికిలో మీరు నా సందేహం తీర్చినందుకు మీకు కృతజ్ఞతలు.

  2. Nidadavolu Malathi

    ముఖ్యంగా బహుళ ప్రాచుర్యం పొందిన, పొందుతున్న రచయిత్రులు కాక, మరుగున పడిపోతున్న రచయిత్రులకృషిని గ్రంథస్తం చేయడం నాధ్యేయం. మల్లాది వసుంధరగారిలాగే, బుర్రా కమలాదేవిగారు కూడా.

  3. నిడదవోలు మాలతి

    ఇప్పుడే మీరిచ్చిన లింకు చూసేను. అక్కడ ఇండియన్ వుమన్ స్మైలింగ్ బొమ్మ ఉచితంగా లేదు. దానికి సంబంధించిన కథ ఏదైనా ఉంటే తప్ప.
    ఏమైనా నేను చెప్పదలుచుకున్నది – అనేకమంది రచయిత్రుల సమాచారం అక్కడ లేదు. కొందరు రచయిత్రులు ఇప్పుడు ఫోనుకాల్ దూరంలో ఉన్నారు కూడాను. ఆ రచయిత్రులని తెలిసినవారు సమాచారం కనుక్కుని, నాకు అందిస్తే, నేను వికిపిడియాలో పెట్టడానికి సిద్దంగా ఉన్నాను. ప్రస్తుతానికి మరొక చోట అడిగిన ప్రశ్న ఇక్కడ పెడతాను. స్త్రీలలో చారిత్రక నవలలు రాసిన తొలి రచయిత్రి మల్లాది వసుంధర. ఆమె రచించిన నవలల పేర్లు తెలిసేయి కానీ మరే వివరాలు దొరకడం లేదు. ఆమె సుమారు నావయసే కనక ఎక్కడో ఉండే ఉంటారు. ఇటువంటి వారే ఇంకా ఎందరో. దయ చేసి, వివరాలు వికిపిడియాలో చేర్చడానికి సహాయం చెయ్యమని నా మనవి.

    1. pavan santhosh surampudi

      Thulikan అని వ్రాస్తున్న వాడుకరి మీరేనా అండీ. ఒక వేళ మీరే అయి వుంటే కృతఙ్ఞతలు.

Leave a Reply