పుస్తకం
All about booksపుస్తకభాష

February 6, 2014

గుల్జార్ కథలు.. తెలుగులో..

More articles by »
Written by: అతిథి
Tags: , ,
వ్యాసకర్త: తృష్ణ
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గుల్జార్ కవిత్వం, దర్శకత్వం, చిత్రాలకు సంభాషణలు, గీతరచనలే కాక పిల్లల కోసం కూడా చక్కని సాహిత్యాన్ని అందించారు. అంతేకాక  Half a rupee stories, Raavipaar, धुवाँ పేర్లతో తనను కథా రచయితగా గుర్తుంచుకోదగ్గ మూడు కథా సంకలనాలు కూడా రాసారు. అనుకోకుండా క్రిందటేడు పుస్తకప్రదర్శనలో ‘గుల్జార్ కథలు’.. సి. మృణాళిని గారి అనువాదం అని చూసి వెంఠనే కొనేసాను. గుల్జార్ కు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందించిన “धुवाँ”(పొగ) అనే ఉర్దూ కథల సంకలనానికి అనువాదం ఇది. అనువాద పుస్తకంలో మొత్తం 28 కథానికలున్నాయి.
 
 
ఏ పుస్తకమైనా అనువాదం చదివే కన్నా అసలు పుస్తకం చదవటమే ఉత్తమమే కానీ మూలం అందుబాటులో లేనప్పుడూ, అసలు పుస్తకం లోని భాష తెలీనప్పుడూ అనువాదాన్ని అశ్రయించడమే మార్గం. అయితే రచయిత యొక్క ఉద్దేశాన్నీ, రచనలోని సారాన్ని పాఠకుడు సరిగ్గా అందుకున్నాడా లేదా అన్నది అనువాదకుడి సృజన మీద ఆధారపడి ఉంటుంది. నాకు అసలు పుస్తకం దొరకక చదవలేదు కానీ సి.మృణాళిని గారు అనువదించిన గుల్జార్ కథల పుస్తకాన్ని చదివితే మాత్రం, తన కథల ద్వారా గుల్జార్ చెప్పదల్చుకున్న విషయాన్ని అందుకోగలిగాననే అనిపించింది. ఎందుకంటే మామూలుగా గుల్జార్ పాటలే క్లిష్టమైన ఉర్దూ పదాలతో బరువుగా ఉంటాయి. కనబడే భావం కన్నా కనబడని అర్థమే ఎక్కువగా ఉంటుంది గుల్జార్ రచనల్లో! అందువల్ల ఆయన రాసిన వచనం అనువదించడమంటే సులువైన సంగతి కాదు. ఉభయభాషల్లోనూ లోతైన అవగాహన ఉన్నవాళ్ళే ఈ పని చెయ్యగలరు.
 
 
పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్యకేంద్రంలో డైరెక్టర్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ మృణాళిని గారు రచయిత్రి కూడా. తెలుగులో ఎం.ఫిల్, పిహెచ్.డి చేసారు. కథలూ, పత్రికా శీర్షికలు, అనువాదాలు చేయడం, పలు టివీ కార్యక్రమాల్లో పాల్గోవడమే కాక మంచి వక్తగా కూడా పేరుపొందారామె. బడుగు వర్గాల జీవిత వాస్తవికత నుంచి అత్యాధునికుల జీవన సరళి వరకూ అనేక అంశాలను కథా వస్తువులుగా గుల్జార్ ఎన్నుకున్నారు. వ్యక్తిగత జీవిత సంఘటనలతో పాటూ, మానవ స్వభావం పట్ల అసాధారణ అవగాహన కలిగిన ఈ కథలను గుల్జార్ అభిమానిగా తనకు అనువదించే అవకాశం రావడం తన అదృష్టమని ముందుమాటలో చెప్తారావిడ. 
 
 
తన కలం పేరును “గుల్జార్” పూర్తిగా సార్థకం చేసుకున్నారనిపించింది ఈ కథానికలు చదివితే నాకు. ఒక తోట ఎలాగైతే వివిధరకాలైన చెట్లు, పూలమొక్కలతో నిండి ఉంటుందో, గుల్జార్ సాహిత్యరచన కూడా అలానే వివిధరకాల శాఖలకు విస్తరించింది. అలానే ఈ పుస్తకంలో కథలు కూడా వైవిధ్యభరితమైన అంశాలతో ఓ తోటను జ్ఞప్తికి తెస్తాయి. కాదేదీ కవితకనర్హం అన్నట్టు కథానేపథ్యాలకు కూడా ఎల్లలు లేవని నిరూపిస్తారు గుల్జార్. తన సంభాషణలు కూడా ఆయన రాసే కవిత్వంలా ఉంటాయి కాబట్టి ఈ ఉర్దూకథల్లోని వచనం కూడా తప్పకుండా ఓ కవిత్వంలానే ఉండిఉంటాయని నా నమ్మకం. 
 
 
అతి తక్కువ మాటల్లో బోలెడు భావాన్ని వ్యక్తపరచడం గుల్జార్ రచనల్లోని ప్రత్యేకత. అదే ప్రత్యేకత ఈ కథల్లో కూడా కనిపిస్తుంది. సమాజంలోని పలురకాల సమస్యలు, మానవ సంబంధాలు, సామాన్య మానవుడి జీవన పోరాటం, దేశ విభజన, మొదలైనవి ఈ కథల నేపథ్యాలు. కథల్లోని మనుషులు చిరపరిచితుల్లాగనిపించి, వాళ్లతో పాటూ మనమూ కథలో ఒక భాగమైపోయి వారి వెంట చివరిదాకా నడిచేస్తాము. పాత్రల భావావేశాలనూ, దు:ఖాన్నీ, వేదనను మనమూ అనుభూతి చెందేలా నేర్పుగా కథలను అల్లారు గుల్జార్. ఇవి కలలలోకంలోనో, ఊహాజగత్తులోనో విహరించచేసే అందమైన కథలు కావు. జీవితంలో సగటుమనిషి అనుభవించే బాధలనూ, వేదనలనూ, కొన్ని జీవితాల్లో నిండిపోయిన చీకటినీ, మిగిలిపోయిన వ్యథలనూ తన కథల్లో చూపిస్తారు ఆయన. ఒక సామాన్యుడి గుండెకోతని ఎక్స్ రే తీసినట్లు ఇంత సులువుగా ఎలా కనబరచగాలిగారా అని ఆశ్చర్యమేస్తుంది.
 
 
మొట్టమొదటి కథ ‘బిమల్దా’ లో ప్రఖ్యాత సినీ దర్శకుడు బిమల్ రాయ్ తో తన అనుబంధాన్నీ, బిమల్ దా అనారోగ్యం, చివరిరోజులనూ గురించి వివరిస్తారు గుల్జార్. ఎంతటి గొప్పవాళ్ళైనా అల్పులవలె చిన్నచిన్న బలహీనతలకు లొంగిపోయి ఇలా జీవితాన్ని బలిచేసుకుంటారా అని విచారం కలుగుతుంది ఆ కథ చదివితే! అంతేకాక సినిమాతీయడం పట్ల బిమల్ దా కు ఉన్న శ్రధ్ధాసక్తులకూ, అంకితభావానికీ వందనమంటుంది మనసు. బిమల్దా కథలో, లోతైన వ్యాఖ్యానం ఉన్న ‘మైకెలాంజెలో’ కథలోనూ చరిత్రను కథారూపంగా చూపే ప్రయత్నం చేసానంటారు రచయిత. 
 
 
‘సగం మనిషి’, ‘జీవితం’ మొదలైన కథల్లో ఓ వేదన, ఓ మనిషిగా గుర్తింపు కోసం ఓ నిరుపేద పడే తపన అంతర్లీనంగా కనబడతాయి. ‘నాన్నమ్మ, పదిపైసలు’ కథ చదువుతుంటే ఓ నిరుపేద పిల్లవాడి మనసులో పరకాయ ప్రవేశం చేసి ఈ కథ రాసారా అనిపిస్తుంది. సాహిత్యం వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో సమాజంలో ఎంత మార్పు వచ్చినా ఒక సామాన్యుడి జీవితం ఇప్పటికీ ఒక్కలాగే ఉందన్న సత్యాన్ని ‘ఇది ఎవరి కథ?’ కథానిక చెప్తుంది. ‘నిప్పుని మచ్చిక చెసుకున్న హబు’, ‘నక్షత్రాలు’ గుల్జార్ సృజనాత్మకతకు నిదర్శనాలు.
 
 
‘నేరేడు చెట్టు’, ‘భయం’, ‘పంట’, ‘పొగ’, ‘విభజన’, ‘రావి నదికి ఆవల’ మొదలైన కథలు పొట్టకూటికోసం ప్రతిరోజూ జీవనపోరాటం సాగించే మనుషులపై కులమతాల విబేధాలు, దేశ విభజన మొదలైన సమస్యలు మానసికంగా ఎలాంటి ప్రభావాన్ని చూపెట్టాయో తెలుపుతాయి. దేశ విభజనను సమీపం నుండి చూసిన వ్యక్తిగా అందులోని బాధనూ, భయాన్నీ తనలోంచి తొలగించుకోవడం కోసం ఆ నేపథ్యంలో కథలు రాసానంటారు గుల్జార్.
‘వివాహబంధం’, ‘మగవాడు’, ‘అతిథి’, ‘గుడ్డో’, ‘డాలియా’, ‘ఓ అయ్య చేతిలో పెట్టడం’, ‘కాగితం టోపి’, ‘సీమా’, ‘లెక్కలు’, ‘సన్సెట్ బొలేవా’ మొదలైన కథల్లో స్త్రీ పురుషుల మధ్య నాజుకైనబంధాలనూ, స్త్రీ అంరతంగాలనూ, పురుషుడి అహంభావాన్నీ సున్నితంగా చూపెడతారు రచయిత. 
 
 
ఈ కథల్లోని ప్రత్యేకత ఏంటంటే కనబడే వాక్యాల కన్నా వాటి వెనుక దాగిఉండే అర్థాలే ఎక్కువ. ఇలా మామూలు కథానికలకు భిన్నంగా ఉండే వైవిధ్యభరితమైన అంశాలను స్పృశించి, వివిధరకాల మనుషుల అంతరంగాల పరిచయాన్ని అందించి, పుస్తకం మూసేసిన చాలారోజుల వరకూ మనల్ని వెంటాడే కథలతో కథాసాహిత్యనికొక కొత్త దారిని చూపెట్టిన గుల్జార్ సృజనాత్మకతకు జోహారనకుండా ఉండలేము.
గుల్జార్ కథలు

గుల్జార్
About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.3 Comments


  1. మంచి పుస్తకం పరిచయం చేశారు తృష్ణ గారు. ధన్యవాదాలు.


  2. “”పుస్తకం మూసేసిన చాలారోజుల వరకూ మనల్ని వెంటాడే కథలతో కథాసాహిత్యనికొక కొత్త దారిని చూపెట్టిన గుల్జార్ సృజనాత్మకతకు జోహారనకుండా ఉండలేము.””
    చాలా బావుంది తృష్ణ గారూ 🙂  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అతడు – ఆమె

వ్యాసకర్త: తృష్ణ ********* ఓ గొప్ప పుస్తకం చదివానన్న అనుభూతి పాఠకుడికి మిగిలినప్పుడు రచయి...
by అతిథి
16

 
 

Half a Rupee – stories by Gulzar

వ్యాసకర్త: నాగిని ఈ పుస్తకం చదవాలనిపించడానికి కవర్ మీద గుల్జార్ ఫోటో తప్ప మరే కారణం ...
by అతిథి
7

 
 

రావీ పార్ – గుల్జార్ కథలు

(ఈ నెలనుండి ప్రతి నెలకో, రెండు నెలలకో, నెలలోని మొదటి వారంలో ఒకే రచయిత లేక ఒకే అంశానికి ...
by Purnima
2

 

 

భారతీయ నవల

వ్యాసం రాసినది: తృష్ణ ******* ఏ దేశ సాహిత్యం ఆ దేశం యొక్క జీవనవిధానానికీ, సామాజిక పరిస్థి...
by అతిథి
14

 
 
మరపురాని మనీషి  ===  తిరుమల రామచంద్ర.

మరపురాని మనీషి === తిరుమల రామచంద్ర.

వ్యాసం రాసిపంపిన వారు: తృష్ణ _________________________________________________________________ వంటింట్లో కత్తిపీట ముందర కూర్చ...
by అతిథి
9

 
 
మా నాన్నగారు

మా నాన్నగారు

రాసిన వారు: తృష్ణ ********** మొక్కపాటి నరసింహశాస్త్రి గుర్రం జాషువా అడివి బాపిరాజు భమిడిప...
by అతిథి
10