My Stroke of Insight – Jill Bolte Taylor

కొన్ని రోజుల క్రితం పుస్తకం.నెట్లో “జీవితాన్నిమరింతగా ప్రేమించడం నేర్పిన…” అన్న వ్యాసం వచ్చింది. “My stroke of insight” అన్న పుస్తకం పరిచయం అది. అందులో ప్రస్తావించబడ్డ విషయం పై నాకు వ్యక్తిగతంగా ఆసక్తి ఉండడం మూలాన, వెంటనే కొని చదవడం మొదలుపెట్టాను.

విషయం క్లుప్తంగా ఇది: మెదడుకు సంబంధించిన పరిశోధనలు చేస్తున్న ఒక శాస్త్రవేత్తకు ఉన్నట్లుండి ఒకరోజు (1996లో) మెదడులో రక్తస్రావం (haemorrhage) జరిగి ఎడమవైపు మెదడు బాగా దెబ్బతిన్నది. క్రమంగా అక్షరాలు గుర్తించడం, మామూలు సంభాషణలు అర్థం చేసుకోవడం వంటివి కూడా కష్టమైపోయాయి గంటల వ్యవధిలోనే. ఈ పరిస్థితుల మధ్య చక్కటి వైద్య సహకారం, ఆత్మీయుల సాంగత్యం, దృఢచిత్తం, వ్యాయామం నడుమ క్రమంగా కొన్నేళ్ళలో (8 ఏళ్ళంటారు రచయిత్రి) మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసింది ఆమె మెదడు. ఈ క్రమంలో ఆమె అనుభవాలు, తన మెదడు పనితీరు గురించి తెలుసుకున్న సంగతులు, ఆమె అనుభవించిన spiritual experience, ఇలా మెదడు దెబ్బతిన్న పేషంట్లతో వ్యవహరించడంలో డాక్టర్లు, caregivers పాత్ర, ఒక్కొక్కసారి చేసే పొరపాట్లు, వారి కోసం కొన్ని సూచనలు – ఇవన్నీ కలిపి ఈ పుస్తకంగా రాశారు. రచయిత్రికి ఇదే తొలి పుస్తకం.

ఉన్నట్లుండి మెదడుకు గాయం అవడమో, stroke రావడమో ఇలాంటిదేదో అయ్యాక, కొన్ని మనం ప్రాథమికం అనుకునే పనులు ఆయా రోగులు చేయలేకపోవడం డాక్టర్లు, శాస్త్రవేత్తలకే కాదు, మామూలు మనుషులుగా మనకి కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి కేసుల్ని అధ్యయనం చేస్తూ మెదడు పనితీరుని అర్థం చేయడంకూడా కొందరు శాస్త్రవేత్తలు చేస్తూ ఉంటారు (అలాంటి ఒక శాస్త్రవేత్త జనబాహుళ్యం కోసం ఇచ్చిన లెక్చర్ల సంకలనం గురించి ఒకసారి పుస్తకం.నెట్లో పరిచయం చేశాను). అయితే, ఈ పరిశోధనలు చేసే శాస్త్రవేత్తకే ఒక స్ట్రోక్ వస్తే? stroke వస్తోంది అన్నది వాళ్ళకి అర్థమవుతుందా? క్రమంగా తిరోగమిస్తున్న మెదడు పటుత్వాన్ని వారు గమనించగలరా? ఒక శాస్త్రవేత్తగా వారు తమ స్థితిని చూసే విధానంలో తేడా ఉంటుందా? ఈ అనుభవం ద్వారా ఇతర పేషంట్లను అధ్యయనం చేస్తున్నప్పుడు తెలియని విషయాలేవన్నా తెలుస్తాయా? అసలు మెదడులో ఏదన్నా సమస్య ఉన్న రోగుల మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకే సొంతమైన కొన్ని insights ఏవన్నా ఉంటాయా మెదడు గురించి? – ఇలాంటి ప్రశ్నలు మీకు ఎప్పుడన్నా కలిగి ఉంటే, ఈ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి (మరిన్ని ప్రశ్నలూ దొరుకుతాయి).

stroke క్రమంగా మెదడుని ఆక్రమించుకుంటున్న సమయంలో రచయిత్రి ఆ విషయాన్ని గమనిస్తుంది. సాయం కోసం ఎవరినన్నా పిలవాలి. ఆవిడ వ్యక్తిగత వైద్యులకి సమాచారం అందించాలి – ఈ రెండూ చేసే క్రమంలో పక్షవాతం వల్ల క్రమంగా క్షీణిస్తున్న తన cognitive and physical abilities ను గమనిస్తూనే, ఒక పక్క తనకి తాను “ఇలా చేయి…ఇలా చేస్తే ఇది అవుతుంది”…ఈ తరహాలో చెప్పుకుంటూ, నంబర్లు డయల్ చేసే విధానం చదువుతూంటే ఒళ్ళు గగుర్పొడిచింది. స్వయంగా శాస్త్రవేత్త కనుక ఈ సూక్ష్మమైన అంశాలు కూడా నిశితంగా గమనించడమే కాదు, వాటిని గుర్తుపెట్టుకుని రాయడం వల్ల ఈ స్థితిని గురించి నాబోటి సామాన్యులకి కొంతైనా అవగాహన కలిగిందని నేను నమ్ముతున్నాను. stroke survivors రాసిన ఇతర పుస్తకాల గురించి నాకు తెలియకపోవడం వల్ల కూడా మెదడు పనితీరు క్షీణిస్తూ పోయిన విధానాన్ని document చేయగలగడం నాకు అబ్బురంగా అనిపించింది.

కోలుకుంటున్నప్పుడు ఆమె తల్లికీ, ఆమెకీ జరిగే సంభాషణలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి నాకు. ఉదాహరణకి: వంట చేసేముందు, “ఇది కావాలా/వద్దా?” అన్న తరహా yes/no ప్రశ్నలు కాక “you can have minestrone soup or a grilled cheese sandwich or a Tuna salad” ఈ తరహాలో multiple choice ప్రశ్నల్లా చెప్పేదట వాళ్ళమ్మ. దానితో, ఈమె మెదడుకి తగినంత వ్యాయామం. ఇక్కడ వివరించిన అనుభవంలో కొంత ప్రయత్నంతో రచయిత్రి మొదటి రెంటినీ గుర్తిస్తుంది కానీ, Tuna? అంటే ఏమిటి? అంటుంది వాళ్ళమ్మతో. “Tuna fish from the ocean, a white meat mixed with mayonnaise, onion and celery” అని ఓపిగ్గా, వివరంగా జవాబిస్తుంది వాళ్ళమ్మ. చివరకి, దాన్ని ఈవిడ గుర్తించలేదు కనుక అదే వండాలని తీర్మానిస్తారు. “That was our strategy if I couldn’t find the old file; we made a point to make a new one.” అంటుంది రచయిత్రి తన మెదడుకి పూర్వ వైభవాన్ని తేవడంలో వాళ్ళు అనుసరించిన పద్ధతుల గురించి వివరిస్తూ. ఈ క్రమం అంతా చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. ఆ తల్లి ఓరిమి, సమయస్ఫూర్తి గౌరవభావం కలిగించాయి ఆవిడపై.

అలాగే, డాక్టర్లు ఆమెని పరీక్షించే విధానాల గురించి చెబుతున్నప్పుడు ఆమె పరిశీలనలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకసారి డాక్టర్లు ఆమెని “who is the president of the United States?” అని అడుగుతారు. ఆమె చాలాసేపు ఆలోచించి, who is a president? నుండి what is a United States? దాటుతుంది కానీ, రెంటినీ జోడించి Bill Clinton ను చేరలేకపోతుంది. ఇక్కడ అన్న మాటలు -“My ability to cognate was erroneously assessed by how quickly I could recall information, rather than how my mind strategized to recover the information it held. … .. perhaps if they asked me a question about Bill Clinton specifically, I would have found an image of Bill Clinton… ” – తన కుడిమెదడులో ఈ విధమైన pictorial representation ను retrieve చేయవచ్చును కానీ, ఎడమ మెదడు దెబ్బతిన్నందువల్ల భాషని ప్రాసెస్ చేయడానికి అంత సమయం ఎందుకు అవసరం పడుతుందో చెప్పడానికన్నమాట ఇదంతా. వైద్యులకి కూడా ఇలాంటి పేషంట్లను పరీక్షించేటప్పుడు ఏ అంశాలు అడగాలో కొన్ని సూచనలు ఉంటాయి, ఒక రోగి కోణం నుండి. ఇలాంటి టిప్స్ కోసం తప్పకుండా చదవాలీ పుస్తకాన్ని. ఇలాంటి అంశాలు చర్చించే పుస్తకాలు నాకు తెలియవు. అందువల్ల నేను చాలా ఆసక్తిగా చదివానీ భాగాలని.

ఈ మానసిక స్థితిలో రచయిత్రి తన మెదడు పనితీరు గురించి, ముఖ్యంగా దెబ్బతిన్న ఎడమ మెదడు వల్ల కుడి మెదడు dominate చేయడం, అందులో అన్నాళ్ళూ తెలియని కొన్ని కోణాలు బయటపడ్డం, కుడి మెదడులోని ప్రత్యేకతలు అవీ వివరించే తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. రచయిత్రే అన్నట్లు nirvana స్థితి లాగా అనిపిస్తుంది. “I experienced people as concentrated packages of energy”, “I love knowing that I am simultaneously as big as the universe and yet, merely a heap of star dust” ఇలాంటి వాక్యాలతో మెదడు పనితీరును రచయిత్రి విశ్లేషిస్తూంటేనే ఒక పక్క శాస్త్రీయంగా, ఒక పక్క ఆధ్యాత్మికంగా అనిపించింది నాకు. Neuroscientist కాస్తా spiritual guru అయిపోయిందా ఏమిటి? అని కూడా అనిపించింది కొన్ని చోట్ల. Tao of Physics అన్న పుస్తకం గుర్తువచ్చింది ఈ భాగంలోని అనుభవాల వర్ణనల వల్ల. ఈ అనుభవం తరువాత, ఇప్పుడు మళ్ళీ మామూలు మనిషిని కావాలా? ఈ ఆనందాన్ని వదులుకోవాలా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది రచయిత్రికి. “Could I rejoin the rat race without becoming a rat again? అన్న Marianne Williamson వాక్యాన్ని తల్చుకుంటుంది. సరిగ్గా ఇదే ధోరణిలో ఉండే అభిప్రాయం నాకు తెలిసిన, మానసిక రోగం నుండి కోలుకుంటున్న ఒకరి నుండి విని ఉండటంతో నాకు కొంచెం ఉలికిపాటు కలిగింది ఆ వాక్యం చదవగానే.

ఇక, ఈ నాలుగు ముక్కలూ చెప్పాక ఈ పుస్తకంలో నాకు నచ్చని అంశం గురించి కూడా చెప్పాలి: ఒక స్టేజి దాటాక, రచయిత్రి తిరిగి క్రియాశీలక శాస్త్రవేత్త జీవితంలోకి వచ్చేశాక పుస్తకం మరీ self help పుస్తకం లాగా (ఒక్కోచోట preachy గా కూడా) అయిపోయిందేమో అనిపించింది నాకు. Self help పుస్తకాల మీద నాకేం చిన్న చూపు లేదు. కానీ, ఈ పుస్తకంలో అది ఊహించలేదంతే. పైగా, ఆ భాగం అన్ని పేజీలు కొనసాగడం అనవసరం అనిపించింది. ఒక్క ఇరవై పేజీలన్నా తగ్గించి ఉండవచ్చు ఈ పుస్తకాన్ని.

ఇదొక్కటి తప్పిస్తే, ఆవిడ అనుభవాలు వివరించిన విధానం, కోలుకుంటున్న రోగుల బాధ్యత తీసుకునే వైద్యులకి, కుటుంబ సభ్యులకి ఒక రోగి కోణంలో నుండి ఇచ్చిన సూచనలు, ఈ ప్రయాణంలో ఆవిడ మెదడు పనితీరు గురించి గమనించిన విషయాలు – వీటన్నింటికోసం ఈ పుస్తకం తప్పకుండా చదవాలి అని నా అభిప్రాయం. చివర్లో appendix ల పేరుతో ఈ సలహాలు, సూచనలు జతచేయడం చాలా బాగుంది. నాకీ విషయమై వచ్చిన పుస్తకాల గురించి ఆట్టే అవగాహన లేదు కాని, మానసిక సమస్యలు ఉన్న వారిని treat చేసే వైద్యులు, వారిని చూసుకునే caregivers – ఇద్దరికీ కూడా రోగి కోణం అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఇక నాబోటి సామాన్య జనాలకి ఈ విషయమై awareness కలిగిస్తుంది.

******
పుస్తకం వివరాలు:
My Stroke of Insight – A Brain Scientist’s Personal Journey
Jill Bolte Taylor
First published in 2008 by Hodder & Stoughton, Great Britain
192 పేజీలు
ISBN – 9781848942929
Ebook ISBN – 9780340980507
అమేజాన్ కొనుగోలు లంకె ఇక్కడ.
Flipkart.com లంకె ఇక్కడ.
(పుస్తకం పేపర్బ్యాక్ గానూ, కిండిల్ ఈబుక్ గానూ లభ్యం)

You Might Also Like

Leave a Reply