పుస్తకం
All about booksవార్తలు

July 12, 2009

ఐదేళ్ళ తెలుగు కథ – ప్రకటన

ప్రతి అయిదేళ్ళకీ కథ మారుతుందా? మారవచ్చు. ఇప్పుడు తెలుగు కథ మారుతున్న వేగాన్ని చూస్తూంటే, గత అయిదేళ్ళలో వచ్చిన వస్తు, శిల్ప పరమయిన మార్పుల్ని గమనిస్తే, అయిదేళ్ళ మార్పుని ఒక అంచనా వెయ్యవచ్చని అర్ధం అవుతుంది. ఈ మార్పు మొత్తం తెలుగు సమాజంలో వస్తున్న మార్పు. దీనికి ప్రాంత, లింగ, మత, కుల తేడాలు లేవు. అలాంటి మార్పుని ప్రతిఫలించే కొన్ని ఊత్తమ కథల్ని ఎంపిక చేసి, ఒక సంకలనంగా తీసుకు రావాలని మా సంకల్పం. అందులో భాగంగా మా మొదటి సంకలనం కోసం 2005 నించి 2009 వరకు వచ్చిన కథలని పరిశీలనకి తీసుకుంటాం.

“అయిదేళ్ళ కథ” శీర్షికన 2010 లో ఈ సంకలనం వెలువడుతుంది. ఈ సంకలనం యథతధంగా తరవాత ఇంగ్లిష్ లో కూడా ప్రచురించాలని ప్రస్తుత ఆలోచన.

ఈ సంకలనం కోసం మీరు ఈ 2005 నించి 2009 మధ్యలో చదివిన మంచి కథల్ని సూచించండి. . మీరు సూచించిన ప్రతి కథనీ మేము చదివి, మా సంకలనంలో ప్రచురణకి పరిశీలిస్తాం.

సంకలనాలకు సాధారణంగా వైయక్తిక లెదా సంస్థాగత ఉద్దేశాల పరిమితి వుండడం ఇటీవల మనం గమనిస్తున్నదే. అలాంటి పరిమితులేవీ లేకుండా ఏ రకంగా చూసినా ఇది ఉత్తమ కథ అనుకున్నదల్లా మా సంకలనంలో వుండాలని మా తపన. మీ సూచనలు లేకుండా ఇది సాధ్యం కాదు.

అన్ని ప్రాంతాలకూ , అన్ని మాండలికాలకూ, అన్ని ధోరణులకూ సంబంధించిన అచ్చ తెలుగు కథల సంకలనం మా సంకల్పం.

మీ సూచనలు పంపండి. అచ్చంగా ఒక ఉత్తమ సంకలనం మనం తీసుకు వద్దాం.

మీ సూచనలు Afsar (afsartelugu@gmail.com ) or , Gudipati (gudipati8@gmail.com) కి పంపండి.About the Author(s)

పుస్తకం.నెట్6 Comments


 1. ఇంటర్ నెట్ లో వచ్చిన కధలేనా లేక ప్రచురించబడిన కధలుకూడానా చదివిన కధ తోబాటు రాసిన కధ అని కూడా అంటే బాగుంటుంది కదా. అన్ని కధలూ అంతా చదవరు, చదివినవారిలో వాటిగురించి వివరాలు ఇచ్చే ఓపిక, తీరిక చాలా తక్కువమందికి వుంటాయి.
  psmlakshmi


 2. @గద్దే స్వరూప్: వర్డ్ క్యాన్సర్ కథ ఈ లంకెలో దొరుకుతుంది.
  http://poddu.net/?p=2990

  ఈ క్రింది లంకెలోని మరో అద్భుతమైన కథను కూడా చూడండి. ఇది కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సిన కథ.
  http://jhansipapudesi.blogspot.com/2009/01/blog-post_06.html


 3. gaddeswarup

  ‘వర్డ్ క్యాన్సర్’:ఈకథ ఎక్కడ దొరుకుందో చెప్పగలరా?


 4. ari sitaramayya

  కథ2008 చదువుతున్నాను. ఇంతవరకు నాకు బాగా నచ్చిన కథలు ఎస్.శ్రీదేవి గారి రూపాయి చొక్కా, వివినముర్తి గారి అగ్రహారం.


 5. ఏమిటీ ఐదేళ్ళ కథల సంకలనమా ? బాగుంది…శుభాభినందనలు – బోలెడు రాయాలని ఉంది కానీ, ఇప్పుడు ఆ సోదంతా ఇక్కడెందుకు – ఇప్పుడు టూకీగా చెబుతా, తరువాత నా బ్లాగులో నాలుగు పుటలు రాస్తా, పుఠం పెడతా – 🙂 .. మీ పాలసీలకు అనుగుణం కాకపోతే ప్రచురించకండి, “అల్లాటప్పా” అప్పుడు ఇదే నాబ్లాగులో కూడా పెట్టొచ్చు… 🙂

  నాకయితే ఈ ఐదేళ్ళలో – రచయితత్రులయిపోవాలని పెన్ను పుచ్చుకుని పేపరు మీద వీరంగం చెయ్యటమే కనపడ్డది కానీ, వీరంగం వెయ్యటంలో తప్పేమీ లేదుగా, అవును – మానసిక రోగులూ వేస్తారు – 🙂 – సరే అలా పక్కనెడితే – ఈ ఐదేళ్ళలో నాకు నిజంగా నచ్చిన కథ ఒక్కటీ లేదు…వ్యర్ధ పదాలూ, అక్కరలేని దీర్ఘ సమాసాలు, సంధులు, విశేషణాలు వాడకుండా ఉన్న ఒక్క కథ చూపించండి….ఈ కాలంలో తమ తోటి వారు ఎంతో మంది రాస్తున్నారు అనీ, నేనేనా రాయలేనిది అని — లేని ఆవేదన తెచ్చిపెట్టుకుని రాసిన “త(త్రి)” లు బోలెడు మంది….

  అయితే చప్పట్ల బృందం సహాయంతో, భూమి భారం సంగతేమో కానీ మన సాహితీ ప్రపంచం అతిభారమయిన, ఎవరూ మోయలేని అనవసర పాపంతో మస్తకాభిషేకం చేయించుకొంటోంది…..కథల్లో కథ ఉట్టిపడాల్సింది పోయి – చైతన్యమంతా హరించుకుపోయిన చెక్కబొమ్మలైపోయాయి….పోనీ మేలిముసుగేసుకున్న సుందరి అందంలాగా ఉన్నాయా అంటే అదీ లేదు…పోనీ ఒకవేళ ముసుగు లాగా ఉందనుకున్నా – ముసుగే కానీ, ముఖం అందంగా ఉన్నదా లేదా కూడా తెలియని అయోమయస్థితిలో నేటి పాఠకలోకం ఉండటం కూడా అందుకు ఒక కారణం….

  ఆపైన రచయితల “ఆత్మవిశ్వాసం” ఎక్కువపాళ్ళలో కనపడుతూన్నదీ అని ఈ మధ్య ఒక మాట విన్నాను…- నా మటుకు అది “అహంభావం” ముసుగేసుకున్న “ఆత్మ న్యూనత”…. ఇంతకు ముందు అక్కడెక్కడో రాసాను “అహం బ్రహ్మస్మి – కథాం కాకమ్మస్మి” అని – అర్థం చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత మహదేవా…

  మాటల అలంకారాల పైపూత మెరుగులు, అభూతకాల్పనిక పదాల సృష్టి ఎక్కువైపోయిన ఈ రోజుల్లో “చిక్కని మీగడ తరకలాంటి కథనం”తో రచనని పరిపుష్ఠం చేసిన రచయిత ఏడీ ? ఆలాటి రచన ఏదీ? కథ రాస్తే కొర్రెక్కి నిగిడిన నిచ్చెనలాగా ఉండాలి, అంతే కానీ ఏదో పేర్చామమ్మా, ఆ నిచ్చెన మెట్లలో ఒకటి తీసేయ్యొచ్చమ్మా అనేది పనికిరాదు…అలాటివి కోకొల్లలు ఈ ఐదేళ్ళలో..కోకొల్లలు ఏమిటిలే, అన్నీ అవే అన్నా ఆశ్చర్యం లేదు…..

  కథలో హృదయానికొచ్చే నింపాది పలకరింపులకంటే సంతలో జాతరలా కోలాహలం ఎక్కువైపోయింది… చదవటం మొదలెట్టాక, ఆపేక్షగా పలకరిస్తూ తన ఆపేక్ష ఉత్తుత్తిది కాదు, నిజమయినదే అని పాఠకుడికి అర్థమయ్యే స్థితికి తీసుకెళ్ళి అవినాభావ సంబంధం నెలకొల్పి వదిలిపెట్టాలి ఏ కథైనా….ఆ ఇది ఎక్కడుంది ?

  ఏతావాతా చెప్పొచ్చేదేమిటయ్యా అంటే, అంతా చెప్పాక రాముడికి హనుమంతుడు ఏమవుతాడు ? – మీ సంకలనానికి సహాయము చెయ్యలేనివాడను….ఒకవేళ నిజంగా పైన చెప్పిన తరగతుల్లో పడ్డ పాఠ్యాంశాలు (కథలు) , నా దృష్టికి రాక తప్పిపోయినవి, ఏవన్నా మీ సంకలనంలో చేరిస్తే అందుకు “అర్బుదం” ధన్యవాదాలు తెలియచేస్తాను…

  అబ్బా సరేలేవయ్యా, సోదంతా చెప్పావుకానీ , అసలు ఈ ఐదేళ్ళ సంగతి అక్కనబెట్టి నీకు నచ్చిన కథలేమిటో చెప్పు – దాన్ని బట్టి నీ పై సోదంతా సోమిదేవమ్మ పాడిన సువ్వి పాట చెయ్యటానికి మేము కాచుకుని కూర్చుంటాం…

  నువ్వు అక్కడికొస్తావని నాకు తెలుసు నాయనా….దానికో టపా రాస్తాను త్వరలో….వేచి చూచువాడికి వెయ్యి వాతలు, చూడనివాడికి చాప మీద చద్దన్నం….


 6. ఈ మధ్యకాలంలో “నిజంగా తెలుగు కథలో మార్పు వచ్చింది” అనిపించిన కథ అరుణపప్పు రాసిన ‘వర్డ్ క్యాన్సర్’. అది లేకుంటే మాత్రం ఈ సంకలనం అసంపూర్ణం అని నా భావన.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0