భారతీయ నవల

వ్యాసం రాసినది: తృష్ణ
*******
ఏ దేశ సాహిత్యం ఆ దేశం యొక్క జీవనవిధానానికీ, సామాజిక పరిస్థితులకూ, మార్పులకూ అద్దం పడుతుంది. అయితే సాహిత్యం కేవలం వినోదసాధనం మాత్రమే కాదు మనుషులను చైతన్యవంతం కూడా చెయ్యగలదు. ప్రయోజనకారి కూడా. ఉద్యమాల వల్ల, విప్లవాల వల్ల, చట్టాల వల్ల, ఉపన్యాసల వల్లనే కాదు సాహిత్యం వల్ల కూడా సమాజోధ్ధరణ జరుగుతుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండి, చదివినవారి ఆలోచనల్లో, వ్యక్తిత్వంలోను మార్పుని తేగల శక్తి సాహిత్యానికి ఉంది. అటువంటి గొప్ప శక్తి  సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ ముఖ్యమైన “నవల”కి ఎక్కువగా ఉంది.

టాగోర్, శరత్, ప్రేమ్ చంద్, బాపిరాజు, చలం, అఖిలన్ మొదలైన మహా రచయితలు భారతీయ జీవితాలనీ, సామాజిక పరిస్థితులనూ, సమస్యలనూ వారి వారి రచనల్లో అద్భుతంగా చిత్రీకరించారు. వారి వారి రచనల వల్ల దేశం చైతన్యవంతం అయ్యింది. ఎందరిలోనో మార్పు వచ్చింది. కొందరు ప్రఖ్యాత రచయితలు పలు భారతీయ భాషల్లో రచించిన ప్రభావవంతమైన కొన్ని ప్రసిధ్ధ నవలలను మనకు “భారతీయ నవల” ద్వారా పరిచయం చేసారు రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి గారు. “చినుకు” మాసపత్రికలో “భారతీయ నవలా పరిచయాలు” పేరుతో నెలనెలా వీరలక్ష్మిగారు ఎంపిక చేసి పరిచయం చేసిన 25 భారతీయ భాషా నవలల్ని పుస్తకరుపంలో మనకందించారు “చినుకు పబ్లికేషన్స్” వాళ్ళు. వాడ్రేవు వీరలక్ష్మి గారి గురించీ, “భారతీయ నవల” పుస్తకం గురించిన “ఆంధ్రజ్యోతి” లోని పరిచయం ఈ లింక్లో చదవవచ్చు.

ఈ పుస్తకానికి “డిస్కవరీస్ ఆఫ్ ఇండియా” పేరుతో వీరలక్ష్మి గారి సహోదరుడు వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట భారతీయ నవలల గురించి, ఆయన  బాల్యం గురించి, దశల వారీగా వారికి అందుబాటులోకి వచ్చిన మంచి నవలాసాహిత్యం గురించి ఆయన తెలిపిన కబుర్లు, విశేషాలూ ఆసక్తికరంగా ఉన్నాయి. “భారతీయ నవల”లో పరిచయం చేసిన నవలలన్నీ భారతీయ జీవనానికీ, మన సామాజిక సమస్యలకీ, పలు మానసిక సంఘర్షణలకీ అద్దం పడతాయి. యువతకీ, సాహిత్యవేత్తలకీ, రచయితలకీ, గృహిణులకీ కూడా ఎంతో ఉపయోగపడే ఇటువంటి పుస్తకం రావటం తెలుగులో ఇదే మొదలేమో అంటారు ఆయన. ఇతర భాషా నవలలతో పోలిస్తే తెలుగు నవలా ప్రక్రియ బాగా బలహీనంగా ఉందనీ, “ఒక గొపీనాధ మహంతి, ఒక శివరామ కారంత, ఒక శివశంకర పిళ్ళై, ఒక మహాశ్వేతా దేవి వంటి నవలా రచయితలు తెలుగులో ఇంకా రావలసే ఉంది” అంటారు చినవీరభద్రుడు.

ఈ పుస్తకంలో 1922 నుండీ 2005 దాకా వెలువడిన వివిధ భారతీయ నవలల పరిచయం జరిగింది. వీటిల్లో చాలావరకూ జ్ఞానపీఠ్, సాహిత్య అకాడెమీ పురస్కారాలు పొందిన విశిష్ఠ నవలలే. పేర్లు రాయాలంటే:

అనువాద నామం – భాష – రచయిత
రాలిపోయిన చందమామ (1922) – ఒరియా – ఉపేంద్ర కిషోర్ దాస్
శేష ప్రశ్న (1931) – బెంగాలి – శరత్ చంద్ర చటోపాధ్యాయ
మట్టి మనుషులు (1934) – ఒరియా – కాళిందీ చరణ్ పాణిగ్రాహి
వనవాసి (1939) – బెంగాలి – విభూతిభూషణ బందోపాధ్యాయ
జీవితమే ఒక నాటకం (1947) – గుజరాతీ – పన్నాలాల్ పటేల్
వక్రరేఖ (1947) – ఉర్దూ – ఇస్మత్ చుగ్తాయి
బనగర్ వాడి (1954) – మరాఠి – వ్యంకటేశ్ మాడ్గూళ్కర్
జనవాహిని (1960) – అస్సామీ – వీరేంద్ర కుమార్ భట్టాచార్య
మట్టిదీపం (1961) – తమిళం – వరదరాజన్
సమాజం కోరల్లో (1968) – తమిళం – నా. పార్థసారథి
మరణానంతరం (1970) – కన్నడం – శివరామ కారంత
అవతలిగట్ టు(1972) – తెలుగు – అరవింద
దాటు (1977) – కన్నడం – ఎన్.ఎల్.భైరప్ప
కొండ మీద మంట (1983) – ఆంగ్లం – అనితాదేశాయ్
విషాద కామరూప – అస్సామీ – ఇందిరా గోస్వామి
యజ్ఞసేని (1984) – ఒరియా – ప్రతిభారాయ్
విముక్తి (1985) – గుజరాతీ – కుందనిక కపాడియా
ఉచల్యా (1987) – మరాఠీ – లక్ష్మణ్ గయక్వాడ్
ఆ దీర్ఘమౌనం (1988) – ఆంగ్లం – శశి దేశ్ పాండే
అర్థనారీశ్వరుడు (1992) – హిందీ – విష్ణు ప్రభాకర్
నా జీవితపు వెండి పుటలు (1992) – సింధీ – హీరా నందాణి
ఆ గోడకు ఒక కిటికీ ఉండేది! (1996) – హిందీ – వినోద్ కుమార్ శుక్లా
మహాభారత ‘పర్వ’ (1996) – కన్నడం – ఎస్.ఎల్.భైరప్ప
విచారణ కమీషన్ (1998) – తమిళం – కందస్వామి
నళినీ జమీలా (2005) ఆత్మకథ – మళయాళం – నళినీ జమీలా

ఈ పాతిక నవలా పరిచయాలూ బాగున్నాయి. వీటిల్లో కనీసం ఐదారన్నా నాకు తెలిసినందుకు ఆనందమైంది. రచయిత్రి ఈ కథలన్నింటినీ ఎంతో ఆసక్తికరంగా మనకి చెప్తారు. ఈ కథలన్నీ చదువుతూంటే దేశంలో ఇన్ని సమస్యలూ, ఇన్ని సంఘర్షణలు, ఇంత సంఘర్షణా ఉన్నాయా అని దిగులు వేస్తుంది. వీటిని తమ రచనల ద్వారా ఎత్తి చూపిన ఆ ఇతరభాషా రచయితలకు ప్రణమిల్లాలనిపిస్తుంది. వీటన్నింటిలో నన్నెంతో ప్రభావపరిచినవి:

మహాభారత ‘పర్వ’ – భైరప్ప
మహాభారత యుద్ధగాథ వెనుక ఎంత వేదన ఉందో, ఎంత మానసిక సంఘర్షణ ఉందో, యుద్ధవాతావరణం వల్ల ఏర్పడిన సమస్యలెటువంటివో చదువుతూంటే ఒళ్ళు గగుర్పాటు చెందింది. ఎలాగైనా ఈ నవల కొని చదవాలనిపించింది.

* భైరప్పగారు రాసిన ‘వంశవృక్ష’ కు తెలుగు అనువాదమైన ‘వెండితెర నవల’ గురించి ఇక్కడ చూడవచ్చు. (పర్వ పుస్తకంపై పుస్తకం.నెట్ వ్యాసం ఇక్కడ.)

యజ్ఞసేని – ప్రతిభారాయ్
ఐదుగురు భర్తలను పంచుకున్న ద్రౌపది ఎటువంటి ధీరజ? ఆమె ఆలోచనలూ, వేదనా ఎటువంటివి? ఆమె ఎటువంటి సమస్యలను ఎదుర్కొందీ మొదలైన విషయాలను విశ్లేషణాత్మకంగా తెలియచేసిన నవల ఇది. ప్రతిష్థాత్మకమైన మూర్తిదేవి పురస్కారం, సరళా పురస్కారాలు ఈ నవలకు లభించాయి.

అర్థనారీశ్వరుడు – విష్ణుప్రభాకర్
అత్యాధునిక స్త్రీవాద భావాలు గల ఈ నవల నన్నెంతో ఆకట్టుకుంది. “పరస్పరం ఉన్న ఆకర్షణలు వ్యామోహాల నుండి విముక్తి చెందిన స్త్రీపురుషులు ఒకరికొకరు సహాయకులుగా ఉంటూ సాగించే ప్రయాణమే నిజమైన సహజీవనమనీ” రచయిత దానినే “అర్థనారీశ్వరతత్వమని” అన్నారట. చాలా నచ్చింది నాకీ కాన్సెప్ట్.

లక్ష్మణ్ గయక్వాడ్ ఆత్మకథ – “ఉచల్యా”
దొంగతనమే జీవనవృత్తి గా ఉన్న “ఉచల్యా” అనే తెగ గురించిన కథ ఇది. ఎంతో దుర్భరమైన, దయనీయమైన బ్రతుకు ఈ దేశదిమ్మరులది. రచయిత ఆత్మకథ. తమ తెగ గౌరవనీయమైన బ్రతుకు బ్రతకాలని, తమ పిల్లలు చదువుకోవాలని ఉబలాటపడి కార్యకర్తగా మారి, పోరాటం జరిపి, కొంత విజయం సాధించి, కేంద్రసాహిత్య అకాదెమీలో మరాఠీభాషకు ఎక్సిక్యూటివ్ మెంబర్ అయిన లక్ష్మణ్ గయక్వాడ్ కథ ఇది.

విభూతిభూషణ బందోపాధ్యాయ – వనవాసి
ఈ పరిచయం చివర్లో ఒకటే మాట చెప్తారు వీరలక్ష్మి గారు “ఈ నవల చదవనివారికి ఈశ్వర సృష్టిలో ఒకానొక సౌందర్యానుభూతి నష్టపోయిందన్నమాటే”. ఈ మాట చదివాకా నవల కొని రేండేళ్ళు అవుతున్నా ఇంకా చదవనందుకు సిగ్గుపడ్డాను. (ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ.)

వ్యంకటేశ్ మాడ్గూళ్కర్ – బనగర్ వాడి
‘బనగర్ వాడి’ అనే ఊరికి వచ్చిన యువకుడిగా వచ్చిన ఒక బడిపంతులు ఆ ఊరి బాగు కోసం ఏ ఏ త్యాగాలు చెసాడు.. ప్రజల్లో మార్పు తేవటానికి ఎంత కష్టపడ్డాడు, ఏం సాధించాడో ఉత్తేజపరిచేలా చెప్పే నవల ఇది.

మట్టిమనుషులు – కాళీందిచరణ్ పాణిగ్రాహి
అన్నదమ్ముల మధ్యన ఆస్తి గొడవలు, చివరికి ఎలా కలిసారన్నది కథ. తమ్ముడితో విడిపోవటం ఇష్టం లేని ఆ అన్న చేసిన త్యాగం మనల్ని అబ్బురపెడుతుంది. వదులుకోవటం అన్నది ఎక్కడ మొదలుపెట్టాలి ఎక్కడిదాకా వెళ్ళాలి అన్న అంశం మీద ఎంతో ఔన్నత్యంతో రాసిన కథ ఇది అంటారు వీరలక్మి గారు.

ఇలా చెప్పుకుపోతే అన్నింటి గురించీ రాయాలనిపిస్తుంది. రచయిత్రి పరిచయం చేసిన నవలన్నీ అత్యంత గొప్ప నవలలు కాకపోవచ్చు. ఆవిడ దృష్టిలో ఉన్నతంగా ఉన్న నవలా పరిచయాలు మాత్రం చక్కగా ఉన్నాయి. తమిళంలో అఖిలన్ గారి నవల చేర్చాల్సింది. ఇంకా, నాదొక్కటే కంప్లైంట్.. ఇన్ని భారతీయ భాషా నవలల్లో కేవలం ఒక్క తెలుగు నవలకే చోటు దక్కిందని 🙁 మరొకటో రెండో తెలుగు నవలలు కూడా జత చేసి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది కదా… అని మాత్రం అనిపించింది.

—————————-
వాడ్రేవు వీరలక్ష్మి గారి ఇతర రచనల గురించి నేను రాసిన టపాలు
ఆకులో ఆకునై
కొండఫలం
మా ఊళ్ళో కురిసిన వాన
————————————–

You Might Also Like

14 Comments

  1. pavan santhosh

    రాలిపోయిన చందమామ, వనవాసి, జీవితమే ఒక నాటకం, సమాజం కోరల్లో, విషాద కామరూప, యజ్ఞసేని, పర్వ నవలలు ఇప్పటికే కొనిపెట్టుకున్నాను. సమాజం కోరల్లో తప్ప మిగిలినవి చదివేశా. విషాద కామారూప చదివే లిస్టులో ఉంది. మిగిలినవాటిలో కొన్ని ప్రతి బుక్ ఫెస్టివల్లోనూ తీసి మళ్లీ పక్కన పెడుతున్న నవలలు. ఎలాగైనా ఈమాటు కొని చదువుతాను. చక్కని లిస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    1. pavan santhosh

      మానవీనీ భవాయీ పేరిట గుజరాతీలో పన్నాలాల్ పటేల్ వ్రాసిన నవల తెలుగు అనువాదం “జీవితమే ఒక నాటకం” కాదనుకుంటా.. అది బహుశా “జీవితమే ఒక నాటక రంగం” అయ్యుండాలి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురణ.

    2. తృష్ణ

      @pavan santhosh: వావ్.. మంచి పుస్తకాలు కొన్నారు.
      “జీవితమే ఒక నాటకం” అదే పేరుతో ఉందండి.
      thank you for the comment.

  2. అయినవోలు ప్రణవ్

    మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙂

  3. SRINIVAS DENCHANALA

    okaa telugu navala jaatheeya sthaayilo ledanadam…anyaayam..daaarunam…listlo lekapovadam….Telugu navalanu avamaaninchadam…manalni manam avamaninchukovadam.

    1. తృష్ణ

      @SRINIVAS DENCHANALA: పుస్తకంలో ఒక తెలుగు నవల ఉందండి. అది కాక ఇంకా మరొకటో రెండో తెలుగు నవలలను కూడా చేర్చవలసినది కదా అని నాకూ దిగులేసింది 🙁

    2. veeralakshmidevi

      denchanaala srinivaas garuu
      తెలుగు నవలలు గొప్పవి లేక కాదు.అవి ఎలాగు అందరు చదివే వుంటారని ప్రత్యేకం గా పరిచయం చెయ్యలేదు
      వీరలక్ష్మీదేవి

    1. తృష్ణ

      ధన్యవాదాలు కొత్తపాళీ గారూ.

  4. suresh peddaraju

    వాడ్రేవు వీరలక్ష్మి గారి “భారతీయ నవల” పరిచయం బాగుంది. ఇందులోని చాలా కథలు నాకు తెలియనివే. తెలియజేసినందుకు థాంక్స్ తృష్ణ గారు!

    1. తృష్ణ

      @suresh gaaru, నాకూ ఓ ఐదారు తప్ప మిగిలినవి తెలీవండి. బిగ్ థాంక్స్ టూ వీరలక్ష్మి గారు !

  5. Nagini

    మీరు చెప్పిన వాటిల్లో రెండో,మూడో మినహా అన్నీ తెలియనివే..ఇన్ని మంచి పుస్తకాలను పరిచయం చేశారు..నా రీడింగ్ లిస్టు లో ఆడ్ చేసుకుంటున్నాను…ధన్యవాదాలు తృష్ణ గారు..:-)

    1. తృష్ణ

      Thank you too nagini gaaru 🙂

Leave a Reply